29, జులై 2010, గురువారం

రామునికీ రావణునికీ తేడా ఏంటి ?

రామాయణంలో ప్రధానపాత్రలు శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు. మిగతావారంతా అవాంతరపాత్రలే. కనుక వారి గుఱించి అవసరమైనంత మేఱకే కవి వర్ణించాడు. ఆ పాత్రల్ని హీరోలు అనడానికి ఆ సమాచారం చాలదు. పోనీ లభిస్తున్న సమాచారం ప్రకారం చూసినా వారు హీరోలు కారు. శ్రీరామచంద్రమూర్తితో పోల్చదగ్గవారు అంతకంటే కారు.

వాలినే తీసుకోండి. ఆ వానరుడి దగ్గఱ శరీరబలాధిక్యం తప్ప ఇంక ఏ గొప్పతనమూ లేదు. దశాబ్దాల తరబడి విశ్వాస పాత్రుడుగా సేవ చేసిన తమ్ముణ్ణి అకారణంగా అనుమానించి వెళ్ళగొట్టాడు. అతని భార్యని బలాత్కారంగా అనుభవించాడు. అతను అన్నివిధాలా పశుప్రాయుడు. తానా పశువుని వధిస్తే తనకే దోషమూ లేదని శ్రీరామచంద్రమూర్తి చెప్పినది అక్షరాలా నిజం. కానీ శ్రీరామచంద్రమూర్తి తమ్ముణ్ణి ఎలా చూసుకున్నారు ? ఏ పరస్త్రీ జోలికి వెళ్ళారు ?

మైక్రోస్కోపులో పట్టిపట్టిచూస్తే మలంలో కూడా వైటమిన్లు, ప్రొటీన్‌లు కనిపిస్తాయి. అలాగని అందఱమూ మలాన్ని మన daily staple food గా మార్చుకొని తినలేం. అలాగే వాలి, కర్ణుడు లాంటి పక్కా విలన్లలో కూడా మినుకుమినుకుమంటూ ఒకటో రెండో సుగుణాలు కనిపిస్తాయి. అంతమాత్రాన వాళ్ళు సాత్త్వికగుణనిధులైన శ్రీరామచంద్రమూర్తి కన్నా, ధర్మరాజు కన్నా గొప్పవాళ్ళయిపోరు. ఇహ శ్రీరామచంద్రమూర్తిలో దోషాలు వెతకడమంటే సూర్యకాంతి చుఱుక్కుమంటోందనీ కనుక అది పనికిరాదనీ అనడం వంటిది. శూద్రక మహారాజు వ్రాసిన మృచ్ఛకటికంలో ఒక శ్లోకం ఉంది. దాని భావం ఏమంటే "తెల్లని వస్త్రం మీద ఒక చిన్న మఱక కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. నల్లని వస్త్రం మీద ఎన్ని మఱకలున్నా ఏమీ తెలియదు" అని అలాగే సకలసద్గుణాభిరాములైనవారిలోనే ప్రపంచం లోపాల్ని వెతకగలదు గానీ దుష్టులేం చేసినా అది దుష్టత్వంగా అనిపించదు. ఎందుకంటే ఆ దుష్టత్వానికి అలవాటు పడిపోతాం కనుక.

దీన్ని ఒక్కముక్కలో తేల్చవచ్చు. శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఎటువంటిదయ్యా అంటే - ఆయన్ని ఆరాధించడం కోసం గుళ్ళూ గోపురాలూ కట్టడానికి లక్షలాది మందిలో అది ప్రేరణనీ, స్ఫూర్తినీ ఇస్తుంది. కాని వాలి, రావణుడులాంటి వాళ్ళ గొప్పతనం "ఓహో ప్రతి దుర్మార్గుడిలోను కొంత సదంశ కూడా ఉంటుందన్నమాట" అనేటంత వఱకు మాత్రమే తేగలదు. వారికి గుడి కట్టి పూజించాలనే కోరిక మాత్రం ఎవఱికీ కలగదు.

11, జులై 2010, ఆదివారం

దాతలు సంతానమౌతారు, గ్రహీతలు తల్లిదండ్రులవుతారు

కీ.శే. మధిర సుబ్బన్నదీక్షితులు రచించిన కాశీమజిలీకథల్లో ఒక కథ ఉంది. కాశీలో ఒక మాదిగకి సంతానం లేకపోతే అందునిమిత్తం తాను చెప్పినట్లు చేయమని ఒక బ్రాహ్మణుడు అతనికి చెప్పాడట. ఆ ప్రకారంగా అక్కడ ఒక యోగి వేసవికాలపు మండుటెండలో స్నానఘట్టానికి వెళ్ళే దారిలో ఆ మాదిగ కొత్తచెప్పులు వదిలాడట. ఆ యోగి ఎండచుఱుక్కి కాళ్ళు కాలిపోతూంటే తట్టుకోలేక ఆ చెప్పులు తొడుక్కొని వెళ్ళాడట. ఆ ఋణం తీర్చుకోవడానికి అతను చనిపోయి ఆ మాదిగ ఇంట్లో అతని కొడుకుగా జన్మించాడట. పునర్జన్మలో కూడా అతనికి యోగవాసనలు పోలేదట. అందుకని, తనకు రాత్రివేళల్లో దొంగల గుఱించి టముకు వేసే బాధ్యతని కులాచారంగా అప్పగించినప్పుడు, "అరిషడ్వర్గాలే నిజమైన దొంగలు కనుక వాటి పట్ల అప్రమత్తంగా ఉండండొహో" అని టముకు వేశాడని దీక్షితులవారు వ్రాశారు.

జీవితసత్యాలకు షుగర్ కోటింగ్ వేసి జనసామాన్యం చేత మింగించడానికి ఉద్దేశించినవి కథలు. కానీ అసత్యాలకూ, అపార్థాలకూ కూడా షుగర్ కోటింగు వేయొచ్చునని ఈ పైన పేర్కొన్న కథ మూలాన అవగతమవుతుంది. హిందూధర్మప్రోక్తమైన కర్మసిద్ధాంతానికి జనంలో ఏ విధమైన అపార్థాలు బయల్దేఱాయో ఈ ఒక్క కథా విని తెలుసుకోవచ్చు. ఇలాంటిదే "ఈ ఉపకారం చేసిపెట్టవయ్యా, చచ్చి నీ కడుపున పుడతా" ననడం కూడా ! ఎవఱు ఎవఱికి ఋణపడడం వల్ల పితాపుత్ర సంబంధం ఏర్పడుతుంది ? పితాపుత్ర సంబంధం ఏర్పడినప్పుడు ఎవఱు ఎవఱి మీద ఖర్చుపెట్టాల్సి వస్తుంది ? ఈ రెండు చిన్న సరళమైన ప్రశ్నల్ని మనవాళ్ళు వేసుకోకపోవడం వల్ల ఈ అయోమయం ఏర్పడింది. అంతేకాక, మన సంప్రదాయంలో తల్లిదండ్రులు దైవసమానులు కనుక తల్లిదండ్రులకు పిల్లలే ఋణపడతారనే పొఱపాటు అభిప్రాయం ఉంది. ఇది కేవలం అభిప్రాయమే తప్ప వాస్తవం కాదు. ఈ అభిప్రాయం ప్రచారంలోకి రావడానికి బహుశా ఒక కారణం - తమని తమ పిల్లలు దైవసమానులుగా చూసి వారంతట వారు తమకు సేవ చేసేదాకా వేచిచూడకుండా తల్లిదండ్రులు ముందే తమకి తాము దైవత్వాన్ని ఆపాదించుకోవడం. తలిదండ్రులకు పిల్లలు సేవ చేయాలని చెప్పబడింది కనుక పిల్లలే తల్లిదండ్రులకు ఋణపడ్డారని జనసామాన్యం అపోహపడడం. కానీ తల్లిదండ్రులే పూర్వజన్మలో పిల్లలకు ఋణపడి ఉన్నారనేదే అసలువాస్తవం. అందువల్ల వారు తమ రక్తమాంసాలు ధారపోసి మఱీ ఆ పిల్లలకి జన్మనిచ్చి పెంచాల్సివస్తుంది. ఆ కారణం చేత ఈ పైన ఉదాహరించిన కథలో ఋణపడింది యోగి. ఆ చెప్పుల్ని అతనికి ఋణమిచ్చినది మాదిగ. కాబట్టి కర్మసిద్ధాంతం ప్రకారం ఋణదాత అయిన మాదిగే మఱుజన్మలో ఋణగ్రహీత అయిన యోగికి కొడుకై పుట్టి తన ఋణాన్ని వసూలు చేసుకోవాల్సి ఉంది. కానీ తద్విరుద్ధంగా వ్రాశారు.

అయితే ఈ పై కథ బోధించే తప్పుడు అభిప్రాయాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. యోగులు కర్తృత్వ, భోక్తృత్వ భావనలతో ఏ పనీ చేయరు కనుక, ఎల్లవేళలా భగవంతునియందు సర్వశరణాగతి భావనతో ఉంటారు కనుక వారు ఎవఱినుంచి ఏ సేవ స్వీకరించినా వారికి ఋణపడే ప్రసక్తీ లేదు. ఆ ఋణసమాప్తి కోసం పునర్జన్మెత్తే ప్రసక్తి అంతకంటే లేదు. అదీగాక "శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే" అన్న గీతావచనం చొప్పున, ఒకవేళ యోగి పునర్జన్మ ఎత్తాల్సివచ్చినా తనలాంటి యోగుల యింట్లో గానీ లేదా పవిత్రహృదయులైన ధనికుల ఇంట్లో గానీ జన్మిస్తాడే తప్ప పై కథలో చెప్పినట్లు జఱగదు.

3, జులై 2010, శనివారం

ఆధ్యాత్మిక అంటువ్యాధులు-1

భగవాన్ శ్రీ రమణమహర్షులవారికి కేన్సరు సోకగా వైద్యం చేయిస్తామన్న భక్తులతో ఆయన అన్న మాటలు : " ఈ దేహమే ఆత్మకు సోకిన వ్యాధి. మళ్లీ ఈ వ్యాధి మీద ఇది ఇంకో వ్యాధి. దీనికి వైద్యమెందుకు ?" అయితే వారి తృప్తి కోసం ఆయన వైద్యం చేయించుకున్నారను కోండి.

అసలు ఈ దేహమనే వ్యాధి పొడసూపడానికి కారణం కోరికలు. కోరికలంటే మనస్సుతో చేసే కర్మమే. మనం ప్రస్తుతం చేసిన/ చేస్తూ ఉన్న కర్మల ఫలాలే మనకి ఒక భావి- దేహాన్ని సిద్ధం చేసిపెడతాయి. (ఒకటి కాకపోతే వందలాది దేహాల్ని) ఆత్మకి ఈ దేహమనే వ్యాధి సోకినప్పట్నుంచి దానికి ఏ మాత్రమూ కులాసా ఉండదు. నిరంతరం ఆకలి, కామం, అకారణ రాగం, అకారణ ద్వేషం, ఏదో తెలియని భయం, బ్రతుకుబెంగ. ఈ వ్యాధినే శాశ్వత సహజస్థితిగా బ్రమయించే ఉన్మాదం కూడా దాన్తో పాటు సిద్ధం.

సరే, మన వ్యాధికి మన యొక్క మనఃకర్మలే కారణమైతే ఫర్వాలేదు. కానీ ఇతరుల కర్మలు కూడా మనకంటుకుంటే ఏం చేయాలి ? మనం అనవసరంగా ఇతరుల కర్మలక్కూడా మన దేహంతోనే మూల్యం చెల్లించాల్సివస్తే ఏంటి గతి ?

ఈ ప్రశ్నవేస్తే చాలామంది నైష్ఠిక హిందువులు కూడా అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో నిర్ఘాంతపోతారు. ఈ ప్రశ్నేదో కొత్తగా ఉందే ? అనుకుంటారు. "ఎవడి కర్మకి వాడే అనుభవించాలని కదా, హిందూ వేదాంతశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ? తద్విపర్యాసంగా ఈ గొడవేంటి, ఎవఱి కర్మఫలాలో మనకంటుకోవడమేంటి ?" అని విస్తుపోతారు. హిందూ కర్మసూత్రం అంత సులువైనదీ, సరళమైనదీ అయితే అది అందఱికీ అర్థమైపోయి ఈ పాటికి ప్రపంచమంతా హిందూమతంలోకి కన్వర్టయ్యేవాళ్లే. కానీ దురదృష్టవశాత్తు అది అత్యంత సంక్లిష్టమైనది. అందుకే మన పూర్వీకులు "గహనా కర్మణో గతిః" (కర్మఫలం ఏ దారిలో వచ్చి మనల్ని పట్టుకుంటుందో అర్థం చేసుకోవడం కష్టం) అని వాక్రుచ్చారు.

ఇతరుల కర్మఫలాలు ఏ దారిలో వచ్చి మనకంటుకొని మనల్ని పీడించడం మొదలు పెడతాయో ఒకటి-రెండు దృష్టాంతాల ద్వారా గ్రహించవచ్చు. వీటిని ఎక్కణ్ణుంచి సేకరించారని మాత్రం నన్నడగొద్దు. ఒకాయనకి ఇద్దఱు భార్యలు. వారిలో పెద్దామె ఆయనకి దగ్గఱి బంధువు. నిజానికి ఆమెని అతను పెళ్ళి చేసుకోలేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఆమెతో ఉన్నాడంతే ! ఆ తరువాత రెండో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ముగ్గుఱూ ఒకే యింట్లో ఉండేవారు. ఆ పెద్దామెతో భర్తకి సంబంధం ఉందని చిన్నామెకి తెలియదు. వీళ్ళూ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మసులుకున్నారు. అయితే పెళ్ళయ్యాక అతని వైఖరిలో మార్పొచ్చింది. అతను పూర్తిగా భార్యకే అంకితమయ్యాడు. ఆ పెద్దామెని తాకడమే మానేశాడు. పైకి అతని ప్రవర్తన సక్రమమైనదిగా, బహు నీతిమంతమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆ పెద్దామె అలా అనుకోలేదు. ఆమెకి అతని మీద మనసు తీఱలేదు. ఆమెకి ఇంకా చాలా కోరికలున్నాయి. పైకి వ్యక్తీకరించలేకపోయినా ఆమె అతని కోసం యథాపూర్వంగా తపిస్తూనే ఉంది. అతను పట్టించుకోలేదు. అతని నిరాదరణకు ఆమె మనసులోనే ఆక్రోశించింది, దుఃఖించింది. అతను ఎప్పటికీ మళ్ళీ దరిజేఱకపోవడంతో ఆమె స్వయంతృప్తికి అలవాటుపడింది. ఆ సమయంలో కూడా ఆమె మనసులో అతనే ఉండేవాడు. ఒక పనిమనిషి దగ్గఱ తన మనసులోని వేదనని తఱచుగా వెళ్ళగ్రక్కేది. అతనిలా తనను కౌగలించుకొమ్మని, తనని అతనిలా పిలవమని, తాకమని ఆ పనిమనిషిని ఒత్తిడి చేసేది. ఇలా ఎన్నో మానసిక బాధలతో సతమతమవుతూ కొన్ని సంవత్సరాలకి ఆ పెద్దామె ఆ అశాంతితోనే కన్నుమూసింది. తదుపరి మఱికొన్ని సంవత్సరాలకి ఆమె పెనిమిటి కూడా చనిపోయాడు.

మళ్ళీ మఱొకచోట జన్మించినాక ఆఱు-ఏడేళ్ళ వయసులోనే అతనికి తీవ్రమైన స్త్రీవాంఛ ఉండేది. కొద్ది దశాబ్దాల పాటు అలా అహోరాత్రాలూ బాధపడ్డాక అతనికి పెళ్ళయింది. అతని భార్య చాలా ఉత్తమురాలు. భర్తంటే చాలా ప్రేమ. కానీ శృంగారానికి మాత్రం విముఖురాలు. ఎంతగా అంటే, ఆమెతో అతను సగటున ఏడాదికి ముణ్ణాలుగుసార్లు కూడా ఆనందించినది లేదు. ఫలితంగా అతను నిరంతర స్వయంతృప్తికి అలవాటుపడ్డాడు. హోమోసెక్సులాంటి ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ అతను అలా కాలేదనుకోండి.

ఇక్కడ వర్ణించిన జన్మజన్మల ఉదంతాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే - ఈ జన్మలో చిన్నతనం నుండి అతను పడ్డ బాధలకి, పూర్వజన్మలో తెలిసో, తెలియకో తన పెద్దభార్యని పెట్టిన కామవాంఛాపరమైన మానసిక చిత్రహింసకీ సంబంధం ఉందని అవగతమౌతుంది. ఆమె ఎలాగైతే అతనితో సంబంధం వల్ల తనలో రెచ్చగొట్టబడ్డ కామవాంఛ అతని ద్వారా తీఱక బాధపడిందో, సరిగ్గా అలాగే అతనూ ఇప్పుడు బాధపడాల్సి వచ్చింది. ఆమెలాగే స్వయంతృప్తి అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఏ హోమోసెక్స్ (లెస్బియన్) భావనలకి లోనైందో అవే భావనల్ని ఇప్పుడు అతను కూడా అకారణంగా అనుభూతి చెందాల్సి వచ్చింది. ఆనాటి ఆమె బాధలన్నీ ఇప్పుడు అతనికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కానీ పూర్వజన్మలో తాళిగట్టిన భార్యకి అంకితమైన పుణ్యఫలం చేతను, ఆమె మనసులోనే భర్తకిచ్చిన శుభాభినందనల ఫలితంగాను ఇప్పుడుపతివ్రత అయిన స్త్రీ కళత్రంగా లభించింది. కానీ ఆమె ద్వారా అతనికి ఇప్పుడు కామోపశాంతి మాత్రం లేదు. పెద్దభార్య ఉసుఱు కూడా తగిలింది.

ఆ జన్మలో ఆ పెద్దభార్య పొందిన మానసిక బాధలకి పూర్తిగా అతనే కారణమా ? అని ప్రశ్నించుకుంటే, బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే, అది ఆమె తలరాత. "రాతలో లేనిది చేతలో జఱగదు" అంటాడు యోగివేమన. ఆ తలరాత అలా ఎందుకు ఉంది ? అంటే బహుశా ఆమె కూడా అంతకు పూర్వజన్మలో తన భర్తకి సంసారసుఖం లేకుండా చేసి ఉండొచ్చు. ఆ కర్మఫలాన్ని ఆ రూపంలో మఱుజన్మలో అనుభవించి ఉండవచ్చు. అలాగే ఆమె యొక్క పూర్వజన్మ భర్తకి అలా చేయాలనే సంకల్పం ఆమెలో ఎందుక్కలిగింది ? అనడిగితే "అది అతని పూర్వకర్మఫలం" అనాల్సి వస్తుంది. ఇలా ఒక కర్మఫలం ఎంతమందికి జన్మలవారీగా అంటుకుందో గమనించండి. ఆ కర్మఫలం పెద్దామె యొక్క పూర్వజన్మభర్త నుంచి పెద్దామెకి, ఆమెనుంచి ఇతనికి, ఇప్పుడు ఇతన్నుంచి ఇతని భార్యకి అంటుకో బోతున్నది. ఈమె నుంచి రాబోయే జన్మలో వేఱెవఱికో ?

"ఈ విధమైన అంటువ్యాధిలాంటి కర్మఫల సంక్రమణం నుంచి జీవులకు విముక్తి ఎలా ? దీనికి ఎక్కడ ముగింపు పలకాలి ?" అని ప్రశ్నించినప్పుడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు ఒక అమూల్యమైన మాట సెలవిచ్చారు. అది కర్మఫలమని గ్రహించి, మనసులో వ్యథ చెందకుండా, ఎవఱి మీదా తిరగబడకుండా దానితో రాజీపడి, ఎవఱినీ ద్వేషించకుండా, అందఱినీ క్షమించి, భగవంతునికి సర్వస్యశరణాగతి చేస్తే దాని ఫలం మనతోనే అంతరించిపోతుంది. భవిష్యత్తులో మన ద్వారా ఇంకెవఱికీ అంటుకోదు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి