25, మే 2011, బుధవారం

భగవంతుని లక్షణమేమిటి ?

జీవునకు ఏ లక్షణములైతే ఉన్నవో అవి లేనివాడు భగవంతుడు. ఆకలి-దప్పిక, శోకము-మోహము, జర-మరణము అను షడూర్ములు లేని వాడు భగవంతుడు.

భగవద్గీతలో భగవంతుని ఎన్నో లక్షణాలు గౌణములు చెప్పబడ్డాయి. అలాగే ఇతర పురాణాలలో కూడా-

శ్లో|| అజోపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోఽపినన్ |
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామాత్మ మాయయా || (భగవద్గీత)

తా|| "నేను పుట్టుకలేనివాణ్ణి, నాశనమూ లేని వాణ్ణి, సమస్తప్రాణులకు ఈశ్వరుడను. నా ప్రకృతిని వశపరచుకొను మాయచేత నేను పుడుతున్నాను" అని కృష్ణుడన్నాడు.

చిన్మయస్య అద్వితీయస్య నిర్గుణస్య అశరీరిణః!
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా || అని ఉపనిషత్ వాక్కు

తా|| చిన్మయుడు, తాను తప్ప రెండవది లేనివాడు, నిర్గుణుడు, శరీరము లేనివాడు అగు పరబ్రహ్మము యొక్క ఉపాసనకొరకు ఉపాసకుని భావనకొరకు ఒక రూపము రూపకల్పనచేయబడినది. పరబ్రహ్మము ఇంద్రియములచే తెలియబడడు. మనస్సుకి తెలియబడడు.

వేదము సగుణ భగవంతుని, నిర్గుణ భగవంతుని కీర్తిస్తోంది. అంటే భగవంతుడు భక్తులకొరకై సగుణుడయ్యెను. సనాతన ధర్మమునందు భగవంతుడు స్వయంగా భక్తులకొరకు అవతరిస్తాడు. అవతరించుట అంటే కిందకి దిగి వచ్చుట.

సాయిచరిత్రలో అనుకుంటా భగవంతుని ఆరు లక్షణములు శ్రీ, విభూతి, మోహము లేకపోవుట, జ్ఙానము, మహత్తు, కారుణ్యములు గా చెప్పారు...

ఇంకోటి, సనాతన ధర్మములో భగవంతుడు భక్తులనుద్దరించటానికి భక్తుల చేత చంపబడడు.

ఇలా ఒకటి అని ఏమి చెప్పగలం ? ఎన్నో ఎన్నో విశేషణాలు, సహస్రనామాలు, స్తోత్రాలనిండా ఉన్నవి. భగవంతుని లక్షణాలు, గౌణములే కదా!

నావరకు నాకు భగవంతుని లక్షణమేమంటే, అది రాశీభూతమైన కారుణ్యం / దయ / ప్రేమ...

23, మే 2011, సోమవారం

హిందువులు మేల్కోవాలి

ఏడాది పొడవునా అన్ని దేవాలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు. హుండీలు పొంగిపొర్లుతున్నాయి, భక్తులు చెల్లించుకున్న ముడుపులతోనూ, మ్రొక్కులతోనూ, తదితర కానుకలతోనూ ! దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఆ దేవాలయాలలో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవితాలు గడిపేస్తున్నారు. దేవాలయాల యాజమాన్యం క్రింద ఉన్న నానా విద్యా, వైద్యసంస్థల్లో వేలాదిమంది చేఱుతున్నారు.

అంతా బానే ఉన్నట్లు కనిపిస్తోంది కదూ ? నిజానికి వాస్తవ పరిస్థితి అంత ఆశావహంగా లేదు. హిందూమతం ఒక అత్యవసర పరిస్థితి (Emergency) వైపు, ఒక మానవ వనరుల సంక్షోభం (Human resources' crisis) వైపు అతివేగంగా పయనిస్తోంది. ఎక్కడో అమెరికాలో కాదు, ఇక్కడే ఈ సనాతన భూమిలోనే ! ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయ దృశ్యం కనీసం పదేళ్ళ తరువాత, లేదా గరిష్ఠంగా పాతికేళ్ళ తరువాత పూర్తిగా అదృశ్యం కాబోతున్నది. అటుపిమ్మట ఆ దేవాలయాల పరిస్థితేంటో, వాటిల్లోని దేవుళ్ళ పరిస్థితేంటో, ఆ దేవాలయాల క్రింద నడుస్తున్న సంస్థల పరిస్థితేంటో, అసలు టోకుగా హిందూమతం పరిస్థితేంటో అంతా అగమ్యగోచరం. ఎందుకంటే హిందూమతానికి తీవ్రమైన పూజారి-పురోహితుల కొఱత ముంచుకు రాబోతోంది. ఇది చాప కింద నీరులా ఇప్పటికే మొదలయింది, గత కొద్ది సంవత్సరాలుగా ! మొదట్లో ఒక పదీ-పదిహేనేళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ అర్చక బ్రాహ్మణుల కొఱత ఇప్పుడు నగరాలక్కూడా ప్రాకింది. రాష్ట్రంలో సుమారు ఇఱవై-పాతిక లక్షలమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వారిలో పౌరోహిత్యం చేసేవారి జనాభా దారుణంగా పడిపోవడంతో చిన్నచిన్న వేడుకలూ, కర్మలూ చేయడానికి సైతం ఎవఱూ దొఱక్క, ఆ దొఱికిన బ్రాహ్మణుడికే అనేక రెట్లు డబ్బు కుమ్మరించి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులో ఎంత చిన్న అర్చామూర్తిని ప్రతిష్ఠించాలన్నా యాభైవేలు డిమాండు చేస్తున్నారు. కాస్త పెద్ద విగ్రహాలకైతే లక్ష తప్పనిసరి. జనం "సరే"నని విధిలేక ఇస్తున్నారు, చందాలేసుకుని మఱీ !

అసలు విషయమేంటంటే - బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. పరిత్యజించడానికి కారణం - ఆ వృత్తికి ఒకప్పుడు హిందూసమాజం ఇచ్చిన ఉద్యోగ భద్రత (Job security) ని ఆ తదుపరి ఉపసంహరించుకోవడం. అలా ఉపసంహరించుకోవడాని క్కారణం అంతకుముందటి బ్రాహ్మణ ద్వేష ప్రచారాలూ, తద్ద్వారా హిందూ మతగురువుల పట్ల ఆదరాభిమానాల్నీ, సానుభూతినీ నశింపజేయడం. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు. రాష్ట్రం నలుమూలలా వేదపాఠశాలలూ, అవీ నామమాత్రంగా ఉండడానికైతే ఉన్నాయి. కానీ అక్కడ శిక్షణ పొంది బయటికొస్తున్నవాళ్ళ సంఖ్య బొత్తిగా సరిపోదు ఈ ఏనుగుని ఎత్తడానికి !

ఉన్న పురోహితుల పిల్లలే అర్చక-పౌరోహిత్యంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. అథవా కొంతమంది ఇష్టపడినా ఇంట్లో ఆడవాళ్ళు "ఠాఠ్ ! వల్లకాదు. అర్చక-పౌరోహిత్యంలో ఏముంది ? నా కొడుకు ఇంజనీరో, డాక్టరో అవ్వాల్సిందే" నని ముక్కు చీదితే కాదనలేక అటు మళ్ళిస్తున్నారు. మిహతా బ్రాహ్మణ జనాభా అలవాటు చేసుకుంటున్న డబ్బువిలువలు ఈనాడు సాంప్రదాయిక అర్చక బ్రాహ్మణ కుటుంబాల్ని కూడా ఇతోఽధికంగా ప్రభావితం చేస్తున్నాయి. తమను తాము ఉద్యోగ వర్గపు బ్రాహ్మణులతో పోల్చుకుని "మనకేం తక్కువ ? ఇంగ్లీషు చదువుకుంటే ఆ మాత్రం ఉద్యోగాలు మనం చెయ్యలేమా ? సంపాదించలేమా ?" అని బయలుదేఱుతున్నారు, ధనసంపాదనా ప్రస్థానానికి ! ఆ విధంగా ఒకసారి మా దగ్గఱ పనిచేస్తున్న యువ పురోహితుడు కూడా HDFC బ్యాంకులో చేఱాడు. కానీ ఆ బ్యాంకువాళ్ళు పొద్దున్నే పూజ చేసుకోవడానిక్కూడా వీల్లేనంత బిజీ చేసేస్తున్నారని గమనించి ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ పౌరోహిత్యంలోకి వచ్చాడు. సరే, ఇది పురోహితుల సంగతి. ఇహ పూజారుల విషయానికొస్తే వాళ్ళని తప్పు పట్టలేం, వాళ్ళకి ఇస్తున్న జీతం ఒక మనిషిని పోషించడానిక్కూడా చాలని పరిస్థితుల్లో ! పూజారి, పురోహితుడంటే బ్రాహ్మణ అమ్మాయిలు ముందుకు రావడం లేదు పెళ్ళి చేసుకోవడానికి ! అందువల్ల కూడా చాలామంది బ్రాహ్మణులు ఈ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏ ఇతర మతంలోనూ లేదు. హిందూ పూజారులే దీనికి గుఱిచేయబడుతున్నారు.

గతంలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డ బ్రాహ్మణ ద్వేషమే ఈ కొఱతకు మూలకారణం

ఈ పరిస్థితి హఠాత్తుగా తలెత్తినటువంటిది కాదని గమనించాలి. దీని అసలు చరిత్రని అందఱూ కాస్త తెలుసుకోవాలి.

౧. ఏ విధంగా మెజారిటీ బ్రాహ్మణులు దేవాలయాల్నీ, పురోహితవృత్తినీ వదిలిపెట్టి లౌకిక ఉద్యోగాల్లో చేఱాల్సి వచ్చింది ?

౨. తదుపరి కాలంలో ఆ లౌకిక ఉద్యోగాల నుంచి కూడా వారిని ఏ విధంగా బహిష్కరించడం జఱిగింది ?


౩. అది ఏ విధంగా వారిని విదేశాల పాలు చేసింది ?


౪. ఆ విదేశీ/ నవ నాగరిక బ్రాహ్మణులు ఏ విధంగా అర్చక-పురోహిత కుటుంబాలక్కూడా ఆదర్శమై కూర్చున్నారు ?


౫. తద్ద్వారా అర్చక-పురోహిత వృత్తి తన గ్లామర్‌ని పూర్తిగా కోల్పోయిన వైనం


౬. మతం గుఱించి బోధించేవాళ్ళు లేకుండా చేయడం ద్వారా ఈ పరిస్థితి ఏ విధంగా ముందు మతాన్నీ, తదుపరి సంఘాన్నీ దెబ్బకొట్టబోతున్నది ?


వీటి మధ్య ఉన్న గొలుసుకట్టు సంబంధమూ, పరస్పర ప్రభావమూ, సామాజిక వాతావరణమూ ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది.

గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్ద ప్రక్రియ (silent process) లో ఉన్నదే ఈనాడు బహిరంగంగా విశ్వరూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఈ సామాజిక సంక్షోభం తలెత్తకుండా హిందువులూ, వారి నాయకులూ కొన్ని దశాబ్దాల క్రితమే కాస్త ముందుచూపుతో, ఈషణ్మానవత్వంతో వ్యవహరించి ఉంటే బావుండేది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ బ్రాహ్మణుల్ని అణచివేయడమూ, వారు తమకెన్నడూ చేయని అపకారాలకు వారిమీద కులకక్ష సాధించడమూ - ఇవే లక్ష్యంగా పెట్టుకున్నాయి అబ్రాహ్మణ హిందువుల నాయకత్వంలోని ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా చాలా హీనమైన పేదఱికానికి గుఱిచేశారు బ్రాహ్మణ కులాన్ని ! రిజర్వేషన్ల పేరుతో ఎంత చదువుకున్నా ఉద్యోగాలివ్వకుండా హింసించారు. ప్రమోషన్లు ఇవ్వకుండా హింసించారు. ఏ పాపమూ ఎఱుగని బ్రాహ్మణ ఉద్యోగులమీద తప్పుడు అవినీతి కేసులు బనాయించి మఱీ హింసించారు. భూపరిమితి చట్టాల పేరుతో, కమిటీల పేరుతో వ్యక్తిగత భూములూ, దేవాలయ భూములూ లాగేసుకుని హింసించారు. పూజారులకు జీతాలివ్వకుండా ఎగ్గొట్టి హింసించారు. ఓరియంటల్ కళాశాలల్లో చాలీచాలని జీతాలకు తెలుగూ, సంస్కృతమూ చెప్పుకుని బతుకుతూంటే "బ్రాహ్మణుడు ఆ మాత్రం కూడా ఎందుకు బతకా"లని ఏకంగా ఆ కళాశాలల్నే ఎత్తేశారు. అలా ఎక్కడెక్కడ బ్రాహ్మణుడు ఆశ్రయం పొంది ఒక ముద్ద అన్నం తింటున్నాడో కనిపెట్టి ఆయా వ్యవస్థల్నీ, సంస్థల్నీ క్రూరంగా కూలద్రోసుకుంటూ పోతూ అతన్ని దయాదాక్షిణ్య రహితంగా లేవగొట్టారు. ఏతావతా హిందువులకు తరతరాల గురువైన బ్రాహ్మణుడికి చివఱికి ఆ హిందూసమాజంలో మనుగడనే దుర్భరం చేశారు. బ్రాహ్మణుడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందనే పూర్వ నమ్మకాన్ని కాలరాచి బ్రాహ్మణుడి పొట్టగొడితే అభ్యుదయం అవుతుందనే ఒక నవీన కలికాలపు ధర్మశాస్త్రాన్ని రచించారు. బ్రాహ్మణుడి యొక్క తరతరాల సాంప్రదాయిక జీవన వనర్లన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు. ఇన్ని చేశాక, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా జీవించడానికి కావాల్సిన ప్రాపులూ, వాతావరణమూ సంపూర్ణంగా అదృశ్యమైనాక ఈ రోజు మీకు పూర్వపు బ్రాహ్మణుడే కావాలంటే ఎక్కడ దొఱుకుతాడు ?

అలా అబ్రాహ్మణులు ప్రభుత్వాల రూపంలో బ్రాహ్మణుల్ని బాధించడానికి పూనుకోవడం ఊరికే తమాషాగా జఱిగింది కాదు. సర్వే జనా స్సుఖినో భవన్తు అని ఆశీర్వదించే బ్రాహ్మణుడు లోకకంటకుడుగా, సంఘద్రోహిగా చిత్రించబడడం చిత్రమే అయినా ఆ విచిత్ర విద్వేష మనస్తత్త్వానికి నింపాదిగా పునాదులు వేసిన కుట్ర ఒకటుంది. దాని వెనుక ఒక కుహనా సైద్ధాంతిక ప్రాతిపదిక (false ideological basis) ఉంది. గతశతాబ్దంలో సర్వేసర్వత్రా బ్రాహ్మణుల మీద విస్తృతంగా జఱిగిన విశృంఖలమైన దుష్ప్రచారమే ఆ ప్రాతిపదిక. ఈ దుష్ప్రచారంలో నాస్తికులూ, కమ్యూనిస్టులూ అయిన బ్రాహ్మణులు కూడా అమాయకంగా పాలుపంచుకున్నారు, దాని మూలమూ పర్యవసానాలూ ఊహించలేక ! ఈ కుట్రకు నాందీప్రస్తావన చేసినది క్రైస్తవ మిషనరీలు కాగా అమలు జఱిపింది బ్రిటీషు ప్రభుత్వం. బ్రాహ్మణులకు తరతరాలుగా సమాజంలో ఉన్న ప్రాచుర్యాన్నీ, జనాదరణనీ నాశనం చేస్తే తప్ప హిందూమతాన్ని నాశనం చేయలేమనే కీలకాన్ని వారు కనిపెట్టారు. ఈ కుట్రలో భాగంలో ప్రతిరాష్ట్రంలోనూ ఎక్కడెక్కడి బ్రహ్మద్వేషుల్నీ దగ్గఱికి తీసి, దువ్వి, తెఱ వెనుక ఆర్థికాది సహకారాలు అందించి రెచ్చగొట్టారు. నిజంగా బ్రాహ్మణులు వీళ్ళు ప్రచారం చేసినంత బలవంతులూ, విలన్లే అయితే వాళ్ళ శాల్తీల్ని లేపేసి మొగ్గలోనే తుంచి అవతల పారేసి ఉండేవాళ్ళు. బలహీనులూ, నిస్సహాయులు గనుకనే తమ మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఏమీ అనలేకా, ఏమీ చెయ్యలేకా దీనంగా చూస్తూ నిలబడ్డారు.

ఒక రకంగా చెప్పాలంటే - ఈనాడు తెలంగాణవాదులు ఆంధ్రా ఏరియావారి మీద చేస్తున్న దుష్ప్రచారం లాంటిదే చేశారు గత శతాబ్దంలో బ్రహ్మద్వేషులు. ఆ దుష్ప్రచారం చాలా ప్రతిభావంతంగా, సమర్థంగా జఱిగింది. బ్రాహ్మణులు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా దానికి కులగజ్జిపరమైన వక్రభాష్యాలు చెప్పారు. జాతికి బ్రాహ్మణులు చేసిన సేవలన్నీ వారి ఆధిపత్యానికి చిహ్నమని ప్రచారం చేశారు. బ్రాహ్మణులు తమ కులాచారం పాటిస్తే అది బ్రాహ్మణుల కులగజ్జి. దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఏ కులానికి ఆ కులాచారం ఉంది. ఆయా కులాలు ఆయా ఆచారాల్ని పాటిస్తే అది కులగజ్జి కాదు. బ్రాహ్మణులు తమ కులాచారాన్ని పాటించడం మాత్రమే కులగజ్జి. బ్రాహ్మణులు ధనికులైతే అది రాజుల దగ్గఱ వాళ్ళు చేసిన పైరవీల ఫలితం. వాళ్ళు పేదలైతే అది వాళ్ళ సోమరిపోతుతనం. ఈ దుష్ప్రచారంలో జాతికి వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు చేసిన ఉపకారాలూ, ఉపచర్యలూ, దేశం కోసం వివిధ చారిత్రిక ఘట్టాల్లో వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలూ, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన ఇక్కట్లూ, వాళ్ళతో పాటు వాళ్ళ ఆడవాళ్ళు పడ్డ బాధలూ అన్నీ మఱుగున పడవేయబడ్డాయి.

ఒక పేద, నిస్సహాయ, బడుగువర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వారిని దేశానికి విలన్‌లుగా చిత్రిస్తూ భారీ బడ్జెట్టుతో ప్రభుత్వస్థాయిలో అత్యంత వ్యవస్థీకృతంగా జఱిగిన ఈ తరహా బుఱదజల్లుడు ప్రచారం బహుశా ప్రపంచంలోనే న భూతో న భవిష్యతి. బహుశా ఇది కలియుగ లక్షణం. కలిపురుషుడి లీల. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలకూ మతగురువులున్నారు. కానీ తమ మతగురువుల్ని హిందువులు అణచివేసినట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఎక్కడా ఎవఱూ చేయడం లేదు. పైపెచ్చు నెత్తిన బెట్టుకుని పూజించుకుంటున్నారు. కానీ భారతదేశంలో బ్రాహ్మణుల స్థానమూ, చారిత్రిక భూమికా ఇతరమతాలలోని మతగురువుల కంటే ఎన్నో రెట్లు గొప్పవీ, వైవిధ్య భరితమైనవీను. బ్రాహ్మణులు ఈ జాతికి ఎప్పుడు అపకారం చేశారు ? వారు ఎల్లప్పుడూ చేతనైనంత మంచే చేశారు. మనసా వాచా కర్మణా తెలుగుజాతిలో కలిసిపోయి తమ సంస్కృత నామాల్ని సైతం వర్జించి అచ్చతెలుగులో నన్నయ్య, తిక్కన్న, పోతన్న మొదలైన పేర్లు పెట్టుకుని ఇక్కడి జనసామాన్యంతో తాదాత్మ్యం చెందారు. వారు లిపిలేని తెలుగుభాషకు లిపి (బ్రాహ్మీలిపి) నిచ్చారు. వ్యాకరణం లేని తెలుగుభాషకు వ్యాకరణాన్నిచ్చారు. పదాలు లేని భాషకు సంస్కృత పదాలు జోడించి శక్తిమంతం చేశారు. సాహిత్యం లేని భాషలో సాహిత్యాన్ని సృష్టించి ప్రపంచ భాషల సరసన దీని చరిత్రని సగర్వంగా, సుస్థిరంగా నిలబెట్టారు. రాష్ట్రం సంగతి పక్కన బెడితే బ్రాహ్మణులు లేకుండా భారతదేశం అనే పరిభావన (concept) అసలెక్కడుంది ? బ్రాహ్మణ వారసత్వం కాకుండా ఈ దేశానికి ఉన్న ఉమ్మడి వారసత్వం ఏంటి ?

దేసీ ప్రభుత్వాల చేతుల్లో తమ తల్లిదండ్రులు పడ్డ బాధలు గమనించి చాలామంది తెలుగు బ్రాహ్మణుల సంతానం ఇంగ్లీషు అభ్యసించి దశాబ్దాల క్రితమే ఉత్తర అమెరికాకి పారిపోవడం ప్రారంభించారు. ఇతరులకు విదేశీ ప్రయాణం ఒక హోదాచిహ్నం (Status symbol) కాగా బ్రాహ్మణులకు మాత్రం అదొక చావుబతుకుల సమస్యగా మారింది. ఏం చేసైనా సరే, పారిపోక తప్పని పరిస్థితిని అనుభూతి చెందారు. నిరంతర కృషీ, శ్రమా ఫలితంగా బ్రాహ్మణుల ఆర్థిక హోదా (Economic status) గత పాతికేళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పుకు లోనైంది. వారిలో కొంతమంది కోటీశ్వరులు కావడంతో అలాగే తానూ కోట్లకు పడగలెత్తాలనే దుగ్ధ ప్రతి బ్రాహ్మణుడిలోనూ పురివిప్పింది. ఏదేమైనా బ్రాహ్మణజాతి యావత్తూ ఉత్తర అమెరికాకు శాశ్వతంగా ఋణపడిపోయింది. స్వదేశంలో నిష్కారణమైన కులద్వేషానికి బలై కూడు లేక ఆకలితో అలమటిస్తూ వచ్చిన బ్రాహ్మణ బిడ్డల్ని అమెరికామాత ప్రేమగా దగ్గఱికి తీసుకుని అన్నం పెట్టింది. కోట్లు ప్రసాదించింది. MNC లకు అధిపతుల్ని చేసింది. అధికారాన్ని సైతం అనుగ్రహించింది.

అబ్రాహ్మణ హిందూ ప్రభుత్వాల చేతుల్లో నిష్కారణంగా అణచివేతకు గుఱైన వర్గంగా బ్రాహ్మణుల హృదయాంతరాళాల్లో ఒక కసి గూడు కట్టుకుని ఉంది. ఆ కసిలో అది తనకు పూర్వం ఉన్న అనేక అభిమానాల్నీ, సెంటిమెంట్లనీ వదులుకుంది. ఇది మిక్కిలి శోచనీయమే. వ్యక్తిగతంగా నేను హర్షించను. కానీ ఏం చేద్దాం ? చర్య (Action) కు ప్రతిచర్య (Reaction) తప్పకుండా ఉంటుంది. మానవజాతి అంతా గుఱ్ఱుపెట్టి ఆదమఱచి గాఢనిద్ర పోతున్న యుగాల్లో కళ్ళు తెఱుచుకుని మేలుకుని అన్నీ ఆలోచించిన ప్రకాశమాన చరిత్ర గల బ్రాహ్మణులు తమ అణచివేతకు రియాక్ట్ అవ్వరని అనుకోవడం ప్రభుత్వాల అమాయకత్వం, మూర్ఖత్వం. ఆ రోజున ఆ అణచివేతల్ని నిరంకుశంగా పాశవిక రాజకీయ అధికార సహాయంతో అమలు జఱుపుతున్న కాలంలో బ్రాహ్మణులు నిస్సహాయులు. పేదవారు. అప్పటికే బ్రిటీషు ప్రభుత్వం చేతిలో దెబ్బదిని చప్పున కోలుకోలేక అప్పటి దాకా తాము పాల్గొంటూ వస్తున్న అన్ని రాజకీయ, సాంఘిక కార్యకలాపాల నుంచీ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వాలకు ఆనాడు ఒక మంచి అవకాశం లభించింది. తాత్కాలిక విజయం సిద్ధించింది.

అలా దేశం నుంచి పారిపోవడం వెనక బ్రాహ్మణుల్లో కూడా చారిత్రికంగా చోటు చేసుకున్న మనస్తత్త్వపరమైన లోపాలున్నాయి. బ్రాహ్మణులు మొదట్నుంచీ ప్రభుత్వ పోషణ మీదే ఇనుమిక్కిలిగా ఆధారపడి బతికారు. ప్రభుత్వాదరణ మీదే తమ సాంఘిక గౌరవ పునాదుల్ని కూడా నిర్మించుకున్నారు. వారిని ఆదరించిన ప్రభుత్వాలు పోయాయి. వాటి స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వాలు హఠాత్తుగా తమ మీద కక్ష సాధించడం మొదలుపెట్టడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ పరిస్థితి వస్తుందనుకోలేదు. అందుకు మానసికంగా సన్నద్ధులై లేరు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. పర్యవసానమే ఈ కాందిశీకత్వం.

బ్రహ్మద్వేషపు గతం నుంచి హిందువులు ఇహనైనా పాఠాలు నేర్చుకోవాలి

బ్రాహ్మణులు ప్రాథమికంగా ఈ మత నిర్వహణకై నియోగించబడ్డవారు. కానీ ఈ కర్తవ్యాన్ని యథాపూర్వంగా నిర్వహించడానికి సమకాలీన పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకని వారు ఇందులోంచి అంతిమంగా విరమించుకోక తప్పకపోవడం అవగాహనీయం. కూడు కోసం, గుడ్డ కోసం, గౌరవం కోసం వారు ఈ హిందూసమాజంతో పోరాడి, పోరాడి పూర్తిగా అలిసిపోయినట్లు కనిపిస్తోంది. అయినా బ్రాహ్మణుల స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయలేం పూర్తిగా ! ఎందుకంటే ఒక పూజారి కొడుకు తన తండ్రి చేస్తున్నవన్నీ శ్రద్ధగా గమనిస్తూ తానూ పెద్దవాడై అలా చేయాలనుకుంటాడు. ఏ శిక్షణ ఇచ్చినా ఆ నిష్కపట అమాయక భావాన్ని కలిగించలేం. అదొక అమూల్యమైన వారసత్వపు సెంటిమెంటు. ఒకసారి ఆ వారసత్వం లోంచి బయటపడ్డ కుటుంబాలు తిరిగి అందులోకి వెళ్ళడం చాలా చాలా కష్టం, మా కుటుంబం లాగే ! అయినా దేవాలయాల్ని అనాథలుగా వదిలేయలేం. అక్కడ నిరాటంకంగా నిత్యనైమిత్తికాలు నడవాల్సి ఉంది. అందుకు హిందువులే ఏదో ఒక ఏర్పాటు చూసుకోవాలి. ఏ ఏర్పాటైనప్పటికీ ఇప్పుడు బ్రాహ్మణుల్ని హింసిస్తున్నట్లుగా కొత్తవారిని కూడా హింసించకుండా కనీసం వారినైనా ప్రేమతో, గౌరవంతో, ఆదరంతో, అభిమానంతో చూసుకోవడం అవసరం. చరిత్ర అబ్రాహ్మణ కులాల మీద మోపుతున్న ఐతిహాసిక ఉత్తరవాదిత్వం ఇది.


(కలగూరగంప బ్లాగు నుంచి ఉద్ధృతం)

18, మే 2011, బుధవారం

నమస్కరించడం అంటే శరణాగతి చేయడానికి సూచన

శ్రీ గురుభ్యోన్నమః

అందరికీ నమస్కారం.

నఇతి భావనను పెంచుకొని అసలుదేదో దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎక్కే మొట్టమొదటి మెట్టు నమస్కరించడం. భగవంతుణ్ణే ఐనా సరే, గురువులనే ఐనా సరే, లేక బుధ జనులనైనా సరే వారిముందు మన ఈ శరీరాహంకార భావనలను వదిలి మనం మనయొక్క విధేయతను చాటి వారినుంచి ఆశీఃపూర్వక అనుగ్రహాన్ని కోరే ప్రక్రియే నమస్కరం. మన మనస్సులోని వినయాన్ని,భక్తిని, ప్రేమను బుద్ధితోకలిపి రెండుచేతులు జోడించి తలవంచి ఎదుటనున్నవారి వద్ద నుంచోవడమే నమస్కారం. వినయంతో మీకు నమస్కరించుచున్నాని చెప్పడమే "నమః+తే =నమస్తే" ఇది నాది కాదు మీది అన్న మనలోపలి ప్రసాద బుద్ధిని బయట పెట్టటమే నమస్తే, న= నాది,మః= కాదు, తే= మీది. ఇది నాది కాదు మీది మీ ప్రసాదంగా నేను వాడుకుంటున్నాను లేదా మీ ప్రసాదంగా నేనున్నాను అని చెప్పడమే నమస్కరించటం.

ఐదు జ్ఙానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలకి సూచనగా పదెవేళ్ళు దగ్గర చేసి, బుద్ధికి సూచనగా తలవంచి బొటనవేళ్ళు లలాటం వైపు (బుద్ధి వైపు)చూపిస్తున్నట్టుగా చేయడం. అంటే తన లోని పంచ జ్ఙానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నిశ్చయాత్మకమైన బుద్ధి ఈ మూడు కలుస్తే నేను అనే అహంకారం. వీటిని మీ ఎదుట వదిలి వినమ్రుడనై ఏమీ లేనివాడనై మీ కృపకొరకు ఎదురుచూస్తున్నాను అని చెప్పడం నమస్కారంచేయడం.

తల్లి తండ్రులకు ఒక్క నమస్కారం, భగవంతునికి మూడుమార్లు, గురువులకు, సన్యాసాశ్రమంలో ఉన్నవారికి నాలుగు నమస్కారాలు ఐతే వీరిలో ఒక్క భగవంతుని తప్ప మిగిలిన ఎవ్వరినీ నమస్కారం చేసి కోరికలు కోరకూడదు.ఒంటిచేతితో నమస్కారం నిషిద్ధం. కొంతమంది నమస్కారంచేస్తూ ఉంగరాలు వేళ్ళు ముద్దు పెట్టుకుంటుంటారు, అలా నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పబడలేదు, పైగా అందరి ముందూ అలా చేయడం అసహ్యకరంగా ఉంటుంది కూడా.

నమస్కరించడం అంటే శరణాగతి చేయడానికి సూచన, సద్యః ఫలితాన్నీ ఇస్తుంది. అందుకే నమస్కారం నవవిధ భక్తుల్లో ఒక్కటైంది.అక్రూరుడు చిన్ని కృష్ణుని పాదముద్రలు అందులోని పర చిహ్నాలు నేలపై చూసి, నా దేవుడు నడచిన తోవ నేను రథమెక్కి వెళ్ళడమా అని రథంలోంచి అప్పటికప్పుడు స్వర్ణదండం పడినట్టు నేలమీద పడి శ్రీకృష్ణుని పాదాల గుర్తులు ఉన్న చోట ఆ మట్టి అంతా తనకి అంటుకునేలా మట్టిలో పొర్లి కృష్ణదర్శనానికి వెళ్ళాడు. అక్రూరుడు స్వతహాగా ఎటువంటివాడైనా, ఎవరిని ఆశ్రయించి ఉన్నా ఆయనకి కృష్ణునిమీద ఉన్న భక్తికి పైఘట్టం పరాకాష్ట, అందుకే ఇప్పటికీ వందనానికి అక్రూరుడే ఉదాహరణ.

అన్నిటికన్నా ఉత్కృష్టమైనది సాష్టాంగ నమస్కారం. తాను శరీరంతో సహా ఎదుటివారి వద్ద సాష్టాంగ పడితే అర్థం ఏంటంటే, మీ ఎదుట నేను అన్నిటికన్నా తక్కువవాణ్ణి అందుకుగానూ నేలమీద పడి నమస్కరిస్తున్నాను అని చెప్పడం.ఉదాహరణకు భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశామనుక్కోండి. దానర్థం భగవంతుడా నేను అన్నిటికన్నా కిందున్న నేల మీదపడి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను అని శరణాగతి చేయటం. అప్పుడు భగవంతుడు ఏంచేయాలి తన రెండు చేతులతో మన భుజాలు పట్టుకుని పైకి లేపాలి. అంటే మనని నేలమీదినుంచి లేపి వృద్ధినివ్వాలి మళ్ళీ మళ్ళీ నేలమీదపడకుండా ఉన్నతుణ్ణి చేయాలి (తిరిగి జన్మలేనిస్థితిని ఇవ్వాలి) . ఈ ప్రక్రియలో భక్తుడికోసం తానే సగం వంగాలి. (ఇదే గురువు ఇతర బుధ జనుల విషయంలో కూడా) అందుకే అంతగొప్పది సాష్టాంగ నమస్కారం. ఇది భౌతికంగా జరగకపోయినా మానసికంగా అదే భావనతో భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి. అక్రూరుడు చేసినదదేకదా కృష్ణుడు లేకపోయినా కృష్ణపాదాల గుర్తులు చూస్తే ఆయన భక్తిభావం ఆగలేదు. అందుకేయద్భావం తద్భవతి. కృష్ణుణ్ణి చేరాడు, ఇప్పటికీ నమస్కారభక్తికి గుర్తుగా మిగిలిపోయాడు, ఎప్పటికీ అలానే నిలిచి ఉంటాడు.

ముఖ్యం: మగవారు సాష్టాంగ నమస్కారం, ఆడవారు పంచాంగ నమస్కారం చేయాలి.

ఇందులో ఒక్కొక్క అంగానికీ శ్లోకంచెప్పి ఒక్కొక్కమారు ఆ అంగంతో సాష్టాంగ నమస్కారం చేసే పద్ధతి ఉన్నది. అలానే అన్ని అంగాల పేర్లు చెప్పి ఒకేసారి నమస్కారం చేసే పద్దతీ ఉన్నది.

శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||

ఇందులో అన్ని అంగాలనూ నేలకానించి నమస్కారం చేయవచ్చు చేతుల్ని నేలకానించి నమస్కారం చేయవచ్చు,కాళ్ళను ఆనించవచ్చు, చెవులను ఆనించవచ్చు కళ్ళని కూడా, సాష్టాంగ నమస్కారంలో ఉన్న గమ్మత్తేమంటే మనస్సుని కూడా నేలకానించాలి,అదెలా సాధ్యం? కాళ్ళు చేతులు ఇతరాలంటే నేలమీద పడేస్తాం మరి మనస్సునెక్కడనుంచి తెస్తాం? అంటే మన మనస్సుకి వినయంతో కూడిన తర్ఫీదునిస్తే, నమస్కారం చేసేటప్పుడు మనస్సుకూడా మనం ఎవరికి నమస్కారం చేస్తున్నామో వారి పాదాల పరం కావడానికి అలవాటు పడుతుంది. మనస్సుని కూడా శరీరంతోపాటు కృష్ణుని పాదగుర్తులమీద పడేశాడు కాబట్టే అక్రూరిని నమస్కారం అంతగొప్పదైంది.

ఇంకా మిగిలిన విషయాలు పెద్దలు చెప్పారు, ఈ చర్చ ఇంకా కొనసాగవలసి ఉంది, అందరూ మీ మీ అభిప్రాయాలను, తెలిసిన విషయాలను (ఈ చర్చకు సంబంధించి) ఇక్కడ పొందుపరిస్తే అందరికీ ఉపయుక్తం.

మీ

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి