4, జులై 2011, సోమవారం

సృష్టి ఎందుకు జరుగుతున్నది ?

అందరికి నా నమస్కారములు......

నా మనసులో ఎన్నో రోజుల నుండీ ఒక చిత్రమైన ప్రశ్న ఉంది... దానికి సమాధానము దొరకటం లేదు నాకు. బహుసః ఇదీ ఈశ్వరుని లీలే కాబోలు.

ప్రశ్న: అసలు ఈ జీవుడ్ని పరమాత్మ ఎందుకు బయటకు విడుస్తున్నాడు? బయటకు విడుదలైన ఈ జీవుడు తనలో కలుస్తాడో లేడో అని ఈ పరీక్ష ఎందుకు? వెలువడిన జీవుడు మళ్ళీ పుట్టుట, గిట్టుట, అనే ఈ చక్రములో తన పాప పుణ్యముల జాబితా చక్కబడు వరకు తిరుగుతూ ఉండుట - ఈ లీల రహస్యం ఎమిటి?

జీవుడు మళ్ళీ పుట్టుట అనేది తన పాప పుణ్యములను బట్టి ఆధారపడి ఉంటుంది.

కాని, యుగారంభము గావించి నాలుగు యుగముల తరువాత లేక కల్పముల తరువాత ప్రళయమును గావించి మొత్తము బ్రహ్మండములను తనలోకి తీసుకొనుట - ఎందుకు ఇంత పెద్ద నాటకమును నడుపుట? ఇంత పెద్ద నాటకమును ఎందుకు సృజిస్తున్నాడు?

పరమేశ్వరుడు ఇంతటి సృష్టిని ఎందుకు రచిస్తున్నాడు? అసలు ఈ సృష్టినే రచించిఉండకపొతే ఈ సంకల్పములు, జీవరాసులూ, త్రిగుణాలూ, పంచభూతాలూ, ఇలా ఇవన్నీ ఉండి ఉండేవి కాదు కదా.

పరమేశ్వరుని లీలను పరిశీలించు వాడను కాను, కానీ ఈ ప్రశ్న నా మదిలొ ఎప్పటినుండో నిలిచిపొయింది.

అజ్ఞానముతొ అడిగి ఉంటే మన్నించగలరు.

సర్వమ్ శ్రీ సాయినాధ చరణారవిందార్పనమస్తు.
ఆదిత్య


సమాధానం - పురుష సూక్తం లో చెప్పిన ప్రకారం సృష్టి జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఒకసారి సృష్టి జరిగాక జీవుల కర్మలను బట్టి ఫలితాలు వస్తూనే ఉండాలి. ప్రళయకాలంలో జీవులన్నీ పరమాత్మలో కలిసినా మరల సృష్టి ఆదిలో వారి వారి కర్మఫలానుసారం జన్మలు వస్తాయి. ఈ క్రింద వివరణ మా గురువు గారు (రఘోత్తమ రావు గారు , బెంగళూరు) నేను అడగగా సెలవిచ్చారు:

"జీవులు స్వతహాగా సుఖస్వరూపులు. కానీ సృష్టిలోకి వస్తేనే ఆ సుఖ స్వరూపం వ్యక్తమయ్యేది. భగవంతుడు కూడా సంపూర్ణ సుఖస్వరూపియే. కానీ అతనికి సృష్టి,స్థితి, లయాలతో నిమిత్తం లేదు. అలానే జీవులకు సుఖ స్వరూపం వ్యక్తం కావాలంటే కొన్ని విశేష పరికరాలు, పరిస్ఠితులు కావాలి. కానీ భగవంతునికి మరో వస్తువుతోనో, జీవితోనో సుఖం లభించదు. అతను స్వరమణుడు. దేవుడూ, జీవీ ఇద్దరూ అనాది, నిత్యులు. ఎప్పటి నుంచీ వీరిద్దరున్నారన్న ప్రశ్న వేసుకోనవసరం లేదు. ఎలాగైతే మనం "ఈ ఆకాశం ఏందుకుంది? ఎప్పటినుంచి ఉంది?" అన్న ప్రశ్నను పుట్టినప్పటి నుంచి, గిట్టే వరకూ వేసుకోమో అలానే "జీవి ఎప్పటి నుంచి వున్నాడన్న" ప్రశ్న కూడా వేసుకోనక్కర్లేదు. వేసుకోవలసిన ప్రశ్నల్లా "స్వయం సుఖపూర్ణమైన నా స్వరూపం ఎప్పుడు వ్యక్తమౌతుంది?" అనే.

మునుపు చెప్పుకున్నట్టు జీవి యొక్క స్వరూపం వ్యక్తం కావాలంటే మొదట కావల్సింది ఆస్తికత. నా కన్నా ఇతరమూ, బలీయమూ, సర్వ గుణ, శక్తి సంపన్నమూ ఐన ఒకడున్నాడన్న నమ్మకమే ఆస్తికత. ఇది కూడా దైవదత్తంగానే రావాలి. "యది సుప్రసన్నోసి సర్వార్థాని సంప్రదాస్యసి" అంటుంది పురాణం. అంటే "నువ్వు ప్రసన్నుడవైనప్పుడే సర్వార్థాలు (అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు) లభిస్తాయి" అని.

ఇక్కడ నువ్వు అంటే భగవంతుడని మనం పుణ్యకర్మలు చేయాలన్నా వాడి అనుగ్రహం ఉండి తీరాలి (మత్పుణ్యం త్వద్దయా బలాత్). దీన్ని బట్టి తెలిసేదేమిటంటే జీవి తన స్వరూప సుఖాన్ని పొందాలంటే భగవంతుని పట్ల అనన్యమైన దాసభావాన్ని కలిగివుండాలనే. "వయం తు దాసభావః" అని ఆ దాసభావాన్ని నిరూపించేందుకే హనుమంతుడు, భీముడు, ప్రహ్లాదుడు, ధృవుడు మొదలైన ప్రసిద్ధ పురాణ పాత్రల్లో దేవతలు ఈ భూమిపైకి దిగివచ్చారు.

సాధనా మార్గాలను చూపారు. భౌతిక, లౌకిక ప్రపంచంలో దాసత్వాన్ని లోపంగా పరిగణిస్తారు. కానీ ఆధ్యాత్మికంలో దాసభావం లేకపోవడం లోపం. ఆధ్యాత్మిక సాధనలో దాసభావమే ముక్తికి ఏకైక సోపానం. అది లోపం కాదు.. గుణం హనుమ దీనికి ప్రతిరూపం ప్రామనికమూ బహిరంతరాలను ఏకం చెయ్యడమే సాధన. అంటే బయట గుడి వుంది. అందులో దేవుడున్నాడు. ఈ దేహమే ఒక గుడియని, హృదంతరాళంలో దేవుడున్నాడని బాహ్య వస్తువుని అంతర్ముఖంలో చూడడమే సాధన. భౌతిక ప్రపంచంలో ఏ వస్తువును చూసినా అందులో భగవంతుణ్ణి చూడగలగాలి. ఓ వీణ, ఓ గిటార్, ఓ వాయులీనం...ఇలా ఏ తంత్రీ వాద్యాన్ని చూసినా మనకు ఆధ్యాత్మిక అనుసంధాన పూర్వకమైన అనుభవం కలగాలి. ఈ దేహంలోని నర, నాడులు తంత్రులుగ, చెవులు ముసుకుంటే "హుమ్" అని వినబడే ప్రాణనాదమే స్వరంగా, వేదోక్త మంత్రోచ్ఛారణలే శృతిగా ఈ దేహవీణ/వాయులీన మ్రోగుతోందని భావించే స్థితికి రావాలి.

మృదంగం, తబలా, డోలు వంటి చర్మవాద్యాలను చూసినా "ప్రభో! మల మూత్ర భాండారమైన ఈ చర్మ దేహంలో నీ గుణగానాన్ని ఇంత లయబద్ధంగా ఎప్పుడు పలికిస్తావు?" అని అనుకోవాలి. సరిగమపదనిస - ఇది సంగీతమే కాదు సందేశం కూడా. మమ మద దమ (నా మదాన్ని నశింపజేయి), నీ పద మమ మద దమ సదా (ఎల్లప్పుడూ నీ పాదం నా మదాన్ని అణిచివుంచనీ) - ఇలా మనకు తోచినట్టుగా దేవుణ్ణి ప్రార్థించవచ్చు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి