26, జులై 2012, గురువారం

వంటింటి మీద యుద్ధం

శ్రీ గురుభ్యోనమః 
నమస్తే 


ఏ సంస్కృతి-సంప్రదాయాల్ని కాలరాయాలన్నా చేసే మొదటి యుద్ధంలో భాగం వంటింటి మీద యుద్ధం. మన సనాతనధర్మంలో వంటింటిని పాకశాల, పాకగృహం, వంటి పేర్లతో అగ్నిహోత్రుడు కొలువై ఉండే ప్రదేశంగా భావించేవారు. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఊర్లకెళ్ళినప్పుడు స్నానం చేయకుండా, మడి బట్ట కట్టుకోకుండా వంటింటిలోకి ఎవరూ వెళ్ళేవారు కారు, కనీసంలో కనీసం స్నానానంతరం ఉతికి ఆరేసిన చక్కని బట్ట కట్టి మాత్రమే వంటింట్లోకి వెళ్ళేవారు. ఏ వంట వండినా మొదట కొంత తీసి అగ్నిహోత్రంలో వేసేవారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఇంట్లో సాయంత్రాలు జంతికలు, చెగోడీల వంటివి చేసినా మా అమ్మ మొదటి వాయిలోని ఒక ముక్క తీసి స్టవ్వులోని అగ్నిహోత్రంలో వేసి నమస్కరించినతరవాతే మాకు పెట్టేవారు. (ఇప్పటికీ ఆవిడ అలానే చేస్తున్నారు మేమూ అదే పాటిస్తున్నాము). ఇప్పుడు ఆ అలవాట్లన్నీ చాలా కనుమరుగైయ్యాయి మన ఇళ్ళలో, నిద్ర లేవగానే కనీసం ముఖ ప్రక్షాళన కూడా లేకుండా పొయ్యి వెలిగించి పాలు కాఫీ/టీ డికాక్షను వగైరాలు కాస్తున్నారు. ఇంటి యజమాని పనిమీద బయటికెళ్ళాక, పిల్లలు స్కూలుకెళ్ళాక అప్పుడు స్నానాదులు. ఐశ్వర్యాన్ని, సుఖాన్ని ఇచ్చే అగ్నిహోత్రుణ్ణి అంత అవమానిస్తే... ఏమి సుఖ శాంతులు లోకంలో ప్రవర్ధిల్లుతాయి? 


మన వంటింట్లోని పోపులడబ్బా కూడా మన సంస్కృతిని, మన కుటుంబ జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకే చిన్న డబ్బాలో ఇంకొన్ని చిన్న డబ్బాలు కలిసి వివిధ రకాలైన పోపు దినుసులు, చప్పవి, కారానివి, ఘాటువి, చేదువి, నల్లవి తెల్లవి ఇలా రకరకాలైనవన్నీ కలిసి ఒకే డబ్బాలో ఉంటాయి. ఏ మోతాదులో ఏది వాడితే ఏ రుచి వస్తుందో ఆ ప్రకారం వాటిని వాడి రుచికరమైన వంట చేస్తాం. మన కుటుంబ వ్యవస్థా అంతే అందరు సభ్యులు కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. ఒక్కో పని ఒక్కోరు చేస్తాం అందరం అందరికోసం బ్రతకడం మనకు మన వంటింటి పోపులడబ్బా నేర్పుతుంది. మనం భోజనం చేసే పద్ధతైనా అంతే. విస్తరాకులు, అరటి ఆకులు వాడడం ద్వారా వాడిన తరవాత ఆ ఎంగిలి విస్తర్లని పారేసినా అవి పునః మట్టిలో కలిసిపోయే స్థితిలో ఉంటాయి ఇతర జీవాలకూ ఆహారంగా పనికొస్తాయి. సహజ సిద్ధ recycling జరుగుతుంది వాటి వాడకం వల్ల. అన్ని సమయాల్లోనూ అవి వాడలేని వారు లోహాలతో తయారు చేసిన కంచం/ పళ్ళెంలో తింటారు, ఇవి కడిగి వాటిని మళ్ళీ వాడుకోవచ్చు. లోకానికి ఇవి వాడడం వల్ల ఏ ఇబ్బందీ లేదు. ఒకటి recycle ఇంకొకటి reuse. అంతే కానీ కాగితపు, ప్లాస్టిక్ కంచాలు, లోటాలు మనకలవాటులేవు వాటి వాడకం ఎక్కువై పడేసిన చెత్త తూములకి నాలాలకి అడ్డుపడి మురికి నీరు పొంగి లేనిపోని అనర్థాలకి దారితీస్తున్నాయి. పైగా అందులో వాడిన రసాయనాలు మనం తినే తిండి ద్వారా మనలోకి చేరుతున్నాయి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. (తమిళులు, కేరళ ప్రాంత వాసుల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉండడానికి కారణం, వారు ఎక్కువగా లేత అరటి ఆకులలో భోజనం చేయడమని కంచిలో ఒకరు చెప్పగా విన్నాను)


విస్తరిలో తీపి పదార్థం తో సహా అన్ని వంటకాలూ వడ్డించుకుని తినే అలవాటు మనది. అన్ని రుచులూ వడ్డించుకుని ఒకదానిలో ఒకటి కలుపుకుని , నంజుకుని ఒక పద్ధతిగా తినే అలవాట్లు మనవి. అన్నం పప్పు, అందులోకి రసం/ పులుసు/ సాంబారు వంటివి కలుపుకోవడం పచ్చళ్ళు నంజుకోవడం, వడియాలు, అప్పడాలు నంజుకోవడం, ఒకదానితో ఒకటి కలిపి తింటాం, అన్నిటినీ కలుపుకుపోగలిగిన మన మనస్తత్వాన్నీ, మన సాంప్రదాయాన్నీ ఆ విషయం సూచిస్తే.. సూపు విడిగా, స్నాక్స్ విడిగా, మెయిన్ కోర్స్ విడిగా మళ్ళీ అందులో పదార్థాలు విడివిడిగా చివరకి డెసర్ట్ అని అదీ విడి విడిగా విడిపోయి ఉండే సంస్కారం అన్యులది. సంస్కృతి సాంప్రదాయాల మీద యుద్ధంలో భాగంగా, గ్లోబలైజేషన్ పేర మనకీ ఆ విడి విడి తిళ్ళేఅలవాటౌతున్నాయి. 


వంటింట్లోకి ఎవరుపడితే వారొచ్చేవారు కాదు, కానీ నేడు ఓపెన్ కల్చర్, ఐ లైక్ ఓపెన్ కిచెన్ యు నో... సో కమ్ఫర్టబ్‍ల్ ఏది కావస్తే అప్పుడు అది తీసుకోవచ్చు అని చెప్పుకునే స్థితికి వచ్చాం. తినే తిళ్ళు భగవత్ప్రసాదంగా తినే మన సంస్కృతికి ఎంగిలి తిళ్ళు అలవాటయ్యి అన్నీ బాగుండాలి సుఖ శాంతులు కావాలంటే ఆ దిశగా బుద్ధి ప్రచోదనం చేసి మన మనసుని మార్చగలిగే తిండే కరవౌతోంది కదా............. 


ఆలోచించండి... ఇదీ మన వంటింటి మీద యుద్ధం మనకే తెలియకుండా జరుగుతున్న తీరు...

 - శ్రీఅయ్యగారి సూర్యనాగేంద్రకుమార్ శర్మ

తెలుగులో టైప్ చేయండి

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి