25, డిసెంబర్ 2010, శనివారం

ఏమిటీ అప్రస్తుత విమర్శ ? దీనివెనుకున్న కుట్రలేమిటి ?

పొద్దుట ఆరున్నర/ఆరూ ముప్పావుకి తొమ్మిదో టీవీ పెట్టాను. పూజలు, దీక్షల పేరిట భక్తులను దోచేస్తున్నారంటూ ఒక వార్తను ప్రసారం చేసాడు. బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో భవానీ దీక్షల పేరిట ఏటా నూటయాభై కోట్ల దాకా భక్తుల దగ్గర్నుండి నొల్లుకుంటున్నారంటూ ఒక వార్తా విశేషాన్ని ప్రసారం చేసాడు. అదేదో నిన్న జరిగిన సంఘటనా అంటే.., కాదు. మామూలు వార్తల్లో భాగం కాదది.. ఒక ప్రత్యేక వార్తా విశేషం! పది పదిహేను నిమిషాలు వచ్చినట్టుంది.
ఓ పక్క క్రిస్మస్ జరుపుకుంటూంటే మనమీద ఏమిటీ వ్యతిరేక వార్తలు అని నాకు అనిపించింది. నేనేమైనా నెగటివుగా ఆలోచిస్తున్నానా?
[ ఓమితృని ఆవేదన]
--------------------------------------------------------------


క్రిమస్ పేరిట ఇక్కడ కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం నడుస్తుంది -
క్రిస్మస్ షాపింగ్. మన వెన్నెముక లేని జీవాలకు అవేకనిపిస్తాయ్. ఏంచేస్తాం
మన కర్మం.

[అమెరికా లో ఉన్న ఓ హిందువు ఆవేదన ]
------------------------------------------------------------


లేదండీ, మీరు సరిగానే ఆలోచిస్తున్నారు. ఇది ఒక పెద్ద దోపిడీ విధానం. ఆ కుట్రలో భాగమే ఈ వ్యతిరేక ప్రచారం

[విషయాలను గమనిస్తున్న ఓ సామాన్య హిందువు విశ్లేషణ]

------------------------------------------------------------

ఈమధ్య దసరా ఉత్సవాలలో కూడా మహిషుని పై మాయదారి ప్రేమకురిపిస్తూ భక్తులమనసులను చికాకు పరచేందుకు టీవీ 9 అనే దిక్కుమాలిన చానల్ లో ఒక చర్చ. అక్కడ స్వయం ప్రకటిత మేధావుల పీత మెదళ్లలోంచి వచ్చిన అద్భుత పాండిత్యం . ఇవన్నీ గమనిస్తుంటే మనమీద మనధర్మం మీద స్లోపాయిజన్ ప్రయోగం జరుగుతుందనిపించటం లేదూ !???
[మన మనసులో మాట]

13, డిసెంబర్ 2010, సోమవారం

ఆలయ రక్షణ భారం దేవుడిదే

ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
--హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

దేవాలయాల్లో విధ్వంసం రేపుతామని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ మన రాష్ట్రంలో మందిరాలకు కనీస రక్షణ కల్పించే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్న సిబ్బందిని ఇతరత్రా తప్పనిసరి విధులకు వినియోగించాల్సి వస్తుండటంతో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా దేవాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గ దేవాలయం వంటి పెద్దపెద్ద ప్రార్థనా మందిరాలు తమ ఖర్చుతో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌.పి.ఎఫ్‌.)ను నియమించుకొని తంటాలు పడుతున్నాయి. కాని మధ్య, చిన్నతరహా దేవాలయాలకు కనీస భద్రత కరవైంది. ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు వీటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్‌ముజాహిద్దీన్‌ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్‌ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌, సాంకేతిక నిపుణుడు పీర్‌భాయ్‌ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.

-----------------------------------------------------------------

చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకూ, డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థనీ నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.

8, డిసెంబర్ 2010, బుధవారం

కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు [పరమేశ్వరా !ఇక నీవే దిక్కు]

కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు

లక్నో: కాశీలో ఈరోజు సాయంత్రం గంగాహారతి సమయంలో పేలుడు సంభవించింది. ఇక్కడి దశ అశ్వమేథ ఘాట్‌లో మంగళవారం గంగానదికి సాంప్రదాయకంగా మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. శివుడు, మహాకాళేశ్వరుని ఆలయాలకు సమీపంలో ఈ ఘాట్‌ ఉంది. హారతిని వీక్షించేందుకు వందలమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. హారతి కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ విదేశీయుడు మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. నదిలో పడవలో ఉండి చూస్తున్న భక్తులకూ శకలాలు తగిలాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకు పేలుళ్లు వినిపించాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం వారణాశి జిల్లా ఆసుపత్రికి తరలించారు.గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంత గోల దేనికి, కాశీ విశ్వనాథ ఆలయం తాళాంచేతులు వీళ్ళకే ఇచ్చి, అబ్బాయిలూ కూలగొట్టండీ అంటే సరిపోతుందిగా. గోల వదిలిపోతుంది.

ప్రశ్న :- ఇలా ఎంతకాలం?

పేలుడు మా పనే: ఇండియన్‌ ముజాహిదీన్

లక్నో: కాశీలో పేలుడుకు పాల్పడింది తమ సంస్థేనని ఇండియన్‌ ముజాహిద్‌ ప్రకటించింది. దీంతో విదేశీయుల లక్ష్యంగానే వారు ఈ పనికి పాల్పడి ఉంటారని కేంద్ర హోం శాఖ నిర్ధారణకు వచ్చింది. పేలుడు శబ్ధాలు రెండు కిలో మీటర్ల దూరం వరకు వినిపించడంతో చాలా శక్తివంతమైనవే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వరుసపేలుళ్లకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా కేంద్ర హోం శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

హోం శాఖ ఏం నిర్థారణకు వస్తే మనకేంటి? అవ్వాల్సిన పని అయ్యాక, రెడ్ ఎలర్టులు ప్రకటించి ప్రయోజనం ఏంటీ? వీళ్ళు అంతలోపలిదాకా వెళ్ళి బాంబులు పెట్టగల్గుతున్నారంటే, ఏంటో, నోటమాట రావట్లా.

ఇంకెన్ని ఘోరాలు జరగబోటున్నాయో ఏంటో.

నేనూ వెళ్ళాను రెండు సార్లు ఈ హారతిని చూట్టానికి. అత్భుతంగా ఉంటుంది మహా హారతి. పరమేశ్వరా ! నీ ఇంటిని ఇక నువ్వే కాపాడుకోవాలయ్యా !

7, డిసెంబర్ 2010, మంగళవారం

మాస శివరాత్రి అంటే ఏమిటి ? : ఒక చర్చ

ప్రశ్న :

సభాయై నమః

మున్ముందుగా మాస శివరాత్రి సాధారణంగా ఏరోజు జరుపుకుంటారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చతుర్దసి తరువాత వచ్చే అమావాస్య అని అనుకుంటున్నాను. తెలిసిన వారు సరిదిద్ద గలరు.

తరువాత విషయంగా శివరాత్రిని మాసానికి ఒకసారి చేసుకోవడం వెనకాల విశేషమేమిటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే అని. ఇలా మాసమునకు ఒకసారి శివరాత్రి చేసుకోవడం వెనకాల ఉన్న ప్రాశస్త్యం తెలిసిన వారు వివరించ మనవి.

--భవదీయుడు
_______________________________________

సమాధానము



నమస్తే!

ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.

ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.

అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).

శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||

మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)

ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]

ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.

మీ ప్రశ్నకు పూర్తిగా సమాధానము చెప్పకపోయి ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే చెప్పాను కాని అంతా చెప్పినట్లు కాదు. ఇంకా విజ్ఙులైన పెద్దలు మరికొన్ని విశేష విషయములేమన్నా ఉన్నవేమో తెల్పండి, తప్పులేమైనాఉంటే సరిదిద్ధండి.

సూర్యనాగేంద్రకుమార్ అయ్యగారి

5, డిసెంబర్ 2010, ఆదివారం

ఉపాసనామార్గాలన్నీ భగవత్‌ ప్రసాదితాలే సుమా !

ఒక పిల్లవాడికి "అమ్మా ! నాన్నా !" అనే పిలుపులు ఎవఱు నేర్పుతారు ? తల్లిదండ్రులే కదా. ఆ బిడ్డడికీ, తమకూ మధ్య ఉన్న వావి (సంబంధం) తెలిసినవారు వారు. ఆ పిలుపుల ద్వారా ఆ సంబంధాన్ని వారు ఆ పిల్లవాడికి తెలియజెబుతారు. అదే విధంగా "భగవాన్, దేవుడు, దైవం" అనే ఈ మాటలు కూడా మనకు నేర్పినది బహుశా భగవంతుడే సాక్షాత్తు ! లేకపోతే భగవద్ భావనని కల్పించుకునే పాటి తెలివి ఎక్కడిది మనిషికి ? ఊరికే అవిశ్వాసులు ఊదరగొట్టడం తప్ప ! ఊహించుకోవడానికీ, కల గనడానికీ సహితం ఒక ఆధారం కావాలి. ఉదాహరణకు - తాను చనిపోయినట్లు కల గనజాలినవాళ్ళెవఱున్నారు ? ఆ అనుభవాన్ని ఊహించుకోవడానికి మానవ మనస్సుకు ఏ జాడా దొఱకదు గదా !

ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ కథామృతంలోని ఒక సంభాషణ నా స్మృతిపథంలో మెదుల్తున్నది. ఆ పుస్తక రచయిత శ్రీ గుప్తా శ్రీరామకృష్ణులకు సమకాలికులూ, శిష్యులున్ను. శ్రీ పరమహంసగారితో తన ప్రథమ సమావేశాన్ని "మణి" అనే మారుపేరు పెట్టుకొని అక్షరబద్ధం కావించారు. అప్పటిదాకా ఆయన బ్రహ్మసమాజ మతస్థుడుగా ఉన్నారు. అందుకని ఆ సమయానికి క్షవరం చేయించుకుంటున్న శ్రీ పరమహంసగారి దగ్గఱ కూర్చుని "మట్టి, చెక్క, ఱాయి ఇలాంటి పదార్థాలతో చేసిన విగ్రహాల్ని పూజించడం పొఱపాటు కదండీ ! అవి దేవుడు కాదు గదా ! అది తప్పు అని సామాన్యప్రజలకు తెలియకపోతే మనం వెళ్ళి చెప్పాలి కదండీ !" అన్నారు. అందుకు శ్రీ పరమహంస నవ్వి "విగ్రహం అని ఎవఱు చెప్పారోయ్ ! చిన్మయప్రతిమ !" అన్నారు. మణికి చిన్మయప్రతిమ కాన్సెప్టు అర్థం కాలేదు. అప్పుడు పరమహంస "ఒకటి తప్పు, అని, ఇంకొకటి ఒప్పు అని నీకెలా తెలుసు ? నువ్వేమైనా దేవుణ్ణి చూశావా ?" అని అడిగారు. తాను గొప్ప ఇంగ్లీషు విద్యావంతుణ్ణి అనే అహంకారం ఉండేది మణికి.శ్రీ పరమహంస వేసిన ఈ ఒక్క ప్రశ్నతో అతని అహంకారం అధః పాతాళానికి క్రుంగిపోయింది. బడికే వెళ్ళని శ్రీ పరమహంసకు పాదాక్రాంతుడయ్యాడా కలకత్తా బాబు. అప్పుడు శ్రీ పరమహంస అతనికిలా వివరించారు "ఒక మార్గం తప్పు అనీ, ఇంకొక మార్గం ఒప్పు అనీ మనం ఎలా చెబుతాం ? భగవంతుడే ఆయా మానవుల పరిపక్వతను బట్టి వివిధ ఆరాధనా పద్ధతుల్ని సృష్టించి (ఉపదేశించి) ఉన్నాడు"

ఆయనే మఱో సందర్భంలో మాట్లాడుతూ "ఒక తల్లి తన సంతానంలో ఒక్కొక్కఱి వయస్సు, ఆరోగ్యాన్నీ బట్టి ఒక్కొక్క రకంగా అన్నం పెట్టినట్లే భగవంతుడు కూడా ఆయా మానవజాతుల స్థాయిని బట్టి వివిధ మతాల్ని కల్పించి ఉన్నాడు." అని అనుగ్రహభాషణ చేశారు.

మనం చదివే విష్ణుసహస్రనామాలూ, రుద్రం, దేవీసప్తశతి ఇవన్నీ ఋషుల ద్వారా భగవంతుడు మనపై ప్రేమతో అనుగ్రహించినటువంటివి. మఱో రకంగా చేస్తే ఫలితం తక్కువ. పైగా అలాంటి అనధికృత స్వతంత్రత (unauthorized liberty) నిషిద్ధ పాషండ మతం అనిపించుకుంటుంది. ఉపాసనా పద్ధతుల్ని బ్రాహ్మణులు గానీ, లేదా వారిలాంటి మఱో మానవ ఏజన్సీ గానీ సృష్టించలేదనేది, అవి నేరు (direct) గా భగవదాదేశమనీ నాక్కూడా అనుభవమే. చాలా కాలం క్రితం నేనొకసారి శివుడిమీద వేఱే విధంగా నామాలు కల్పించి వ్రాయగా ఆయన స్వప్నదర్శనమిచ్చి నాపై కోపించి వాటిని ధ్వంసం చేయమని సూచించారు.

23, అక్టోబర్ 2010, శనివారం

సౌందర్యచిట్కాలు (Beauty Tips)

లుక్కు మారితే లక్కు మారుతుంది. అందుకే అందంగా పుట్టాలనీ, అందంగా తయారవ్వాలనీ చాలామంది కోరుకుంటారు. ఈ అందం అనేది ఒక సాపేక్షభావన (Relative concept) అని ఈస్థటిస్టుల అభిప్రాయం. ఆఫ్రికన్ల అందం కాన్సెప్టూ, భారతీయుల అందం కాన్సెప్టూ ఒకటి కావు. అలాగే వీరివీ తక్కిన జంబూద్వీపవాసులవీ ఒకటి కావు. అందం అనేది దాన్ని చూసే కళ్ళల్లో ఉంటుందని అందుకే పెద్దలు చెబుతూ వచ్చారు. ఇతరులకు అందంగా కనిపించకపోయినా ప్రతితల్లికీ తన బిడ్డ ముద్దులు మూటగట్టేస్తూ ఉంటాడు. అయితే అందంగా ఉండడంలో చాలా మతలబులున్నాయని చాలామందికి తెలియదు. అందం ఒక బాధ్యత. ఎందుకంటే అందం ఒక సంపద, ఒక వారసత్వం. అందం ఒక మత్తుమందు.

అయితే - చూడగానే ఆకట్టుకునే సూదంటుఱాయిలాంటి వ్యక్తిత్వం, చూపు తిప్పుకోలేనంత సుందరరూపం మొదలైన వాటితో ఎన్ని ఇబ్బందులున్నా ఫర్వాలేదనుకొని అవే కావాలని ప్రగాఢంగా అభిలషించేవారు వాటిని సాధించే ప్రక్రియలో కూడా చాలా ఇబ్బందులున్నాయని గ్రహించాలి. అందం యొక్క భౌతికస్వరూపమే ఎక్కువమందికి ఎఱుక. దాని ఆధ్యాత్మిక స్వరూపం గుఱించి చింతన చేసేవారు అఱుదు. అందం అంతిమ ఫలస్వరూపమే తప్ప దానికది ఒక స్వతంత్ర స్వమూర్తి (independent entity) కాదు. ఈ అంతిమ ఫలాన్ని కాచిన ఆ అందమైన వృక్షం పేరేంటి ? అందాన్ని మించిన ఆకర్షణపరిమళాన్ని వెదజల్లే ఆ పూలతీగ ఎక్కడిది ?

మానవుడి గొప్పతనాలన్నీ ఆతనియందు భగవంతుడు ప్రసన్నుడై ప్రసాదించగా వ్యక్తమౌతున్న భగవద్ విభూతులేననీ, అవి ఆయన ఆస్తి అనీ, ఒక తండ్రి తన ఆస్తిని కుమారులకు పంచి యిచ్చినట్లుగా ఆయన మనకు వాటిని పంచి యిస్తాడనీ గతంలో ఒకసారి ఒక ప్రసంగంలో అన్నాను. అదే అందానిక్కూడా వర్తిస్తుంది. మన అందం ద్వారా వ్యక్తమయ్యేది నిజానికి మనం కాము, ఆ భగవంతుడే. ఈ ముఖాలు భగవంతుడివి. ఈ శరీరాలు భగవంతుడివి. ఈ ఆకర్షణశక్తి భగవంతుడిది. మనం వాస్తవంగా భూతకాలిక పిండాలం, భవిష్యత్ శవాలం మాత్రమే. భౌతికమైన అందం మానసికమైన అందానికి ప్రతిబింబం మాత్రమే. అవ్యక్తుడైన పరమాత్మకు వ్యక్తరూపమే ఈ ప్రపంచం. అదే విధంగా సూక్ష్మమైన మనస్సు ధరించిన స్థూలరూపమే ఈ శరీరం. ఏదో ఒక జన్మలో ఒకనాడు మనం చేసిన మంచి ఆలోచనలు ఈ జన్మలో మన అందంగా వ్యక్తమౌతున్నాయి.

అందానికి ఏ ఆధ్యాత్మిక సత్యం వర్తిస్తుందో అందవిహీనత్వానికీ అదే సత్యం వర్తిస్తుంది. అంటే పూర్వజన్మలో మనం చేసిన అందవికారపు ఆలోచనల ప్రతిఫలమే ఇప్పటి అందవిహీనత్వం. పూర్వజన్మల దాకా పోనక్కఱలేదు. ఒక వ్యక్తి ఈ జన్మలోనే హత్య గానీ మఱో దుష్టుపని గానీ చేసేటప్పుడు అతను స్వతహాగా ఎంత అందగాడైనా సరే, అతని ముఖకవళికలు అతనికి తెలియకుండానే ఎంత అందవిహీనంగా మారిపోతాయో గమనించండి. ఆనాటి ఆ ముఖకవళికలే కర్మఫలం అనే రిఫ్రిజిరేటర్ లో దాచబడి భద్రంగా అతనికి మఱుజన్మలో అందించబడతాయి. ఆ తరువాత అతను తన ముఖాన్ని అద్దంలో చూసుకొని తననెందుకిలా భగవంతుడు అందవికారంగా పుట్టించాడో అర్థం కాక కుమిలిపోతూంటాడు. అది భగవంతుడు ఇవ్వాలనుకొని ఇచ్చిన అందవికారం కాదు. ఇతను ఒకప్పుడు కోరి యెంచుకున్నదే.

"అందమైన ప్రతివారూ మానసికంగా అందంగా ఉంటారనే హామీ ఏముంది ? ఈ అందగాళ్ళు/ అందగత్తెలు అంత మంచి పూర్వజన్మసంస్కారం గలవారైతే మఱి ఇప్పుడు ఈ జన్మలో ఆ సంస్కారం కొనసాగలేదెందుకని ? వీరిలో పిసినిగొట్లూ, కుట్రదారులూ, ద్రోహులూ, రౌడీలూ, కేడీలూ, వ్యభిచారిణులూ కూడా ఉన్నారెందువల్ల ?" అనే విచికిత్స తలెత్తుతుంది. సత్సంస్కారాలు మఱుజన్మలో కొనసాగాలన్నా దానికి మానవుడు ప్రయత్నపూర్వకంగా సంకల్పించుకోవాలి. అలా కొనసాగకుండా మధ్యలోనే చెడిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడేం చేస్తాడు ? అందుకే సాయిబాబా ఒక భక్తుడితో అన్నారు : "నా దగ్గఱికి వచ్చేవారంతా మోక్షం పొందుతారా అనుకుంటున్నావు కదూ నీ మనసులో ? ఆ మామిడిచెట్టు వైపు చూడు. అక్కడున్న పూత అంతా కాపైతే ఎంత మంచి పంట అవుతుంది ? కానీ అలా జఱగదు. పూతగానే చాలా మట్టుకు రాలిపోతుంది. కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని మాత్రమే పండ్లవుతాయి." అలాగే ఒకప్పుడు మనిషి చేసిన మంచి ఆలోచనల ఫలితంగా అతనికి మంచి రూపం లభిస్తుంది. కానీ తదనంతరం అలవాటు చేసుకొన్న, అతనికి అత్యంత ప్రియమైన దుష్టసంస్కారాలు సమాంతరంగా కొనసాగుతాయి.

మనం చేసే ప్రతి వక్రాలోచనా, పలికే ప్రతి వంకరమాటా, చేసే ప్రతివంకర చేష్టా ఆత్మతేజస్సుపై దుమ్ములా కప్పేసి దాని సౌందర్యాన్ని మఱుగుపఱుస్తుంది. ఇందుకు విపర్యస్తంగా సదుద్దేశంతో మనం చేసే ప్రతి సత్కర్మ మన ఆత్మని పరిశుభ్రం చేసే చీపురుగా ఉపయోగపడి దాని సత్యస్వరూపాన్ని వెలికి తీస్తుంది. ఆత్మే అసలైన దీపం. దేహాలు పైపై చిమ్నీలు మాత్రమే. ఆత్మ అంటే మఱింకేమీ కాదు. మనలోని సూక్ష్మ భగవంతుడే. శ్రీ రామకృష్ణపరమహంస కఠోర తపస్సాధనల్ని ఆచరించే రోజులలో ఆయన శరీరం బంగారంలా ధగధగ మెఱిసిపోతూండేదనీ దిష్టి తగుల్తుందేమోనన్న భయంతో శిష్యులు ఆయన మీద పట్టుపీతాంబరాలు కప్పేవారనీ చదివాం. కనుక సదాలోచనల ద్వారా ఆత్మతేజస్సును వృద్ధి పొందించుకుంటే శరీరతేజస్సు దానంతట అదే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది.

20, అక్టోబర్ 2010, బుధవారం

కొందఱు భార్యలు కూడా తమ భర్తలకు గురువులు కావచ్చు

శ్రీమన్ మహాభాగవతం ఏకాదశమ స్కంధంలో విశ్వగురుమూర్తి శ్రీ దత్తాత్రేయస్వాములవారు తనకు 24 మంది గురువులున్నారని వెల్లడిస్తూ వారిలో ఒక వేశ్య కూడా ఉన్నదంటారు. బహుజన పరిచితమైన మాతాపితృతత్త్వం వలెనె సకలలోక నమస్కృతమూ, మహనీయమూ అయిన గురుతత్త్వం సహితం విశ్వవ్యాప్తమైనది. సమిధలో, తదితర పారితోషికమో చేతబట్టుకొని మనం వెళ్ళి వరించిన వ్యక్తే మన గురువనీ, తదన్యులు గురువులు కారనీ పట్టుబట్టనక్కఱలేదు. గమనించి గుర్తుపడితే సమస్తసృష్టీ విశ్వగురుమూర్తియై మనకు దారిచూపుతుంది. అన్నీ, అందఱూ భగవంతుని ప్రతినిధులే. అందఱూ దారిచూపే నిమిత్తం ఆయన చేత నియమించబడినవారే. కానీ దురదృష్టవశాత్తు మనలోని బహుజన్మపరంపరాగతమైన స్వార్థం, అహంకారం, అసూయ, చిన్నచూపు, సంకుచితదృష్టి, అమార్దవం మొదలుగా గల సూక్ష్మమైన మానసిక దౌర్బల్యాల మూలాన మనం ఎల్లెడలా అంతర్నిహితంగా నిబిడీకృతమై నిత్యప్రత్యక్షభూతమైన గురూపదేశం పట్ల ప్రాలుమాలుతూ ఉంటాం.

"భార్యకు భర్త గురుమూర్తి" అని శ్రీగురుచరిత్రలో సూచించబడింది. అందుచేత ఒక శిష్యుడు తన గురువుగారికి ఏ విధంగానైతే సేవ చేస్తాడో అదే విధంగా భార్య భర్తకు సేవ చేయడం ద్వారా పరమార్థాన్ని సాధించుకుంటుందని సూచించారు. అంటే భర్తృద్రోహం గురుద్రోహంతో సమానం. గురుద్రోహం దైవద్రోహంతో సమానం. విపర్యస్తంగా ఇదే ఉదాహరణ గురు-శిష్య సంబంధానిక్కూడా చెప్పారు, ఒక మహాపతివ్రత తన భర్తను ఎలా సేవిస్తుందో ఒక శిష్యుడు కూడా తన గురువుని అలాగే సేవించాలని !

హిందూ సంప్రదాయాన్ననుసరించి భార్యాభర్తలకు అభేదం. హిందూధర్మంలో భార్యాభర్తల సంబంధం ఒప్పందమూ కాదు, కాంట్రాక్టూ కాదు, తాత్కాలికమూ కాదు. స్వసంకల్పానుసారంగా రద్దుచేసుకోదగినది అంతకంటే కాదు. తల్లివలె, తండ్రి వలె, సోదరుడి వలె అది రక్తసంబంధంతో సమానం. గురువు వలె అది ఒక ఆధ్యాత్మిక సంబంధం. అంటే భార్య అనేది భర్త యొక్క స్త్రీస్వరూపమే. అతని యొక్క మనశ్శక్తులే అతనికి సహాయపడే నిమిత్తం ఆమెగా అవతారం ధరించాయని భావించబడుతున్నది. అందుచేత ఆమె పురుషుడి శక్తిస్వరూపిణి అన్నారు. అయితే అనుభవంలో చూసినప్పుడు కోట్లాదిమంది స్త్రీలలో కొన్నివందలమందికి మాత్రమే ఈ ఆధ్యాత్మిక సత్యం అనువర్తనీయం. మిగతా స్త్రీలంతా ఏదో పూర్వఋణానుబంధశేషం వల్ల తమ ప్రస్తుత భర్తల దగ్గఱికి వచ్చిచేఱినవాళ్ళై ఉంటారు. అటువంటివారు ఎలా వచ్చిచేఱారో అలాగే తమ ఋణం తీఱిపోగానే వెళతారు కూడా ! అదే విధంగా భర్త అనేవాడు సైద్ధాంతికంగా భార్య యొక్క పురుషస్వరూపమే. వారిద్దఱూ ఏకశరీరులు. వారిద్దఱూ ఒకఱికొకఱు ప్రతినిధులు. అందువల్లనే హిందూ ధార్మిక సంప్రదాయంలో మటుకు విడాకుల సంగతి ఎక్కడా ప్రస్తావించబడలేదు. హిందూమతం, ఒక మతంగా విడాకుల్ని అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆమోదించలేదు. అంటే హిందువులలో అవి లౌకికంగా, సామాజికంగా ఉనికిలో లేవని కాదు. చాలా ప్రాచీనకాలంలోనే విడాకులున్నాయని కౌటిల్యుడి అర్థశాస్త్రం వంటి గ్రంథాల ద్వారా తెలియవస్తున్నది. అయితే ఆ ప్రస్తావన ఇప్పుడిక్కడ సంగతం కాదు.

గురు-శిష్య సంబంధంలో శృంగారానికి తావు లేనప్పుడు భార్యతో శృంగారసంబంధం కలిగి ఉన్న భర్త ఆమెకు గురువు కావడమేంటని కొందఱి సందేహం. మనందఱికీ శృంగారం చాలా పెద్ద విషయం. కానీ దేవుడికి చాలా చిన్న విషయం. అందువల్లనే మనకీ సందేహం. మన దృష్టిలో శృంగారానికీ, ఆధ్యాత్మికతకీ చుక్కెదురు. సన్న్యాసుల ఆధ్యాత్మిక ఆదర్శాల్ని గృహస్థులు కూడా తలకెక్కించుకోవడం వల్ల ఏర్పడ్డ అయోమయమిది. కానీ గృహస్థాదర్శాలూ, సన్న్యాసాదర్శాలూ ఒకటి కావు. రెంటికీ పొత్తు కుదఱదు. ఇవి ఆధ్యాత్మిక సాధనలో రెండు వేఱు వేఱు పంథాలు, రెంటినీ కలగాపులగం చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి శృంగారమనేది నిండా ఆమోదయోగ్యమైన ఆశ్రమవిహితమైన జీవనశైలియే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోను తప్పుపట్టకూడదు. అందులో పాల్గొనకుండా బలవంతాన మానకూడదు. గృహస్థాశ్రమానికి సంబంధించినంతవఱకూ గురువులంటే శిష్యులతో/ శిష్యురాళ్ళతో శృంగారసంబంధం లేనివారు మాత్రమే కాదు, ఆ సంబంధం ఉన్నవారు కూడా గురువులే. అన్నిరకాల శృంగారాలకూ ఆశ్రమవిహితంగా స్వచ్ఛందంగా దూరమైపోయిన సన్న్యాస గురువులతో గృహస్థ గురువుల్ని పోల్చి వారిని నిందించడం సరికాదు. ఎందుకంటే ఆ సంబంధం వల్ల వారివారి గురుహోదాకు ఏ విధమైన భంగమూ వాటిల్లదు. వారి పట్ల శిష్యులు/ శిష్యురాళ్ళు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలలోను, చూపించాల్సిన పూజ్యభావనలోను సహితం ఏ విధమైన మార్పూ ఉండదు. అంటే ఆ సంబంధం ఏర్పడ్డ తరువాత కూడా ఆ గురువులు తమ తమ శిష్యులకు/ శిష్యురాళ్ళకు యథావిధిగా పూజనీయులే ఔతారు, పరిచరణీయులే అవుతారు. అయితే ఒకపక్క ఆ సంబంధాన్ని కలిగి ఉంటూ మఱోపక్క ఆ సంబంధం తమ మధ్య లేదన్నట్లు బహిరంగ ప్రదర్శన ఇవ్వడం మాత్రం భగవంతుని దృష్టిలో కుటిలత్వమూ, మహాపాపమూ అవుతుంది.

భార్యకు భర్త గురువైనట్లే, భార్య కూడా భర్తకు గురువు కావచ్చు. అంతమాత్రాన ఆమెతో కాపరం చేసే అర్హతని భర్త కోల్పోడు. అగస్త్యమహర్షి లోపముద్రాదేవి నుంచి ముందు శ్రీవిద్యోపదేశాన్ని పొంది కొంతకాలం తపస్సు చేసి సిద్ధుడైతేనే గానీ ఆమెని వివాహం చేసుకోవడానికి అర్హత లభించలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే ఆయన భార్య పూర్వాశ్రమంలో ఆయనకు గురువే. అయితే అది వారి దాంపత్యజీవితానికి ఏ విధంగానూ ఆటంకం కాలేదు.

అయితే ఈ వివరాల్ని ఈ కాలపు పురుషద్వేషులైన స్త్రీల వాదానికి ఉపబలకంగా తలవడం సరి కాదు. ప్రాథమికంగా వారి వాదాన్ని హిందూధర్మం ఆమోదించదు. ఈ పైన పేర్కొన్న సారాంశం మన సనాతన ధర్మానికి సమ్మతమైనదే. ఇది సత్యం కనుకనే ఇక్కడ చెప్పబడింది.

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

యోగాలు ఎలా పుట్టాయి ?

మానవుడు దేవుని చేరే మార్గమే యోగం. ఆ విధానాన్ని కూడా యోగమనే అంటారు. యోగాలు ఎలా పుట్టాయి అని ఆలోచిస్తే ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి. మనిషి తానున్న చోటినుంచే ఎక్కడకైనా వెళ్లగలడు. అలాగే, తనకున్న దానినుంచే ఇంకొక ఉన్నతమైనదానిని అందుకోగలడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ విలక్షణుడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత ఉంటుంది. వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తిని బట్టి వారి వ్యక్తిత్వంలోని విలక్షణతను బట్టి ఆయాయోగాలు వారికి సరిఫోతాయి. అందరికీ అన్ని యోగాలు సరిపోవు అనడానికి ఇదే కారణం.

మనిషి అనేవాడు దేహం-ప్రాణం-హృదయం-కర్మేంద్రియ-జ్జానేంద్రియ-మనో-బుద్ది-ఆత్మల కలయిక.

మనిషికి కర్మేంద్రియాలున్నాయి. వీటిద్వారా భగవంతుని అందుకునేది కర్మయోగం. కొందరు పని చెయ్యకుండా క్షణం ఊరుకోలేరు. వారి జీవితం అంతా కర్మ మయంగా ఉంటుంది. అటువంటివారికి కర్మయోగం సరిపోతుంది. అంటే వీరు Action-oriented people.

మనిషికి జ్ఞానేంద్రియాలున్నాయి. వీటి ద్వారా దేవుని చేరుకునేది జ్ఞానయోగం. కొందరిలో బుద్ది చాలా తీక్షణంగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిపైన ఆధారపడకుండా, ఏ బంధాలలోనూ ఇమడకుండా, పూర్తిస్వతంత్రంగా ఉండాలనే గట్టి వ్యక్తిత్వం కలవాళ్ళకు సరిపోయేది జ్ఞానయోగం. ఇది ఎక్కువగా పురుషులకు సరిపోతుంది. వీరు ultimate freedom-lovers.


మనిషికి స్పందించే హృదయం ఉంది. దానిద్వారా కలిగే ప్రేమతత్వంతో భగవంతునిచేర్చేది భక్తియోగం. సున్నిత మనస్కులకు, దయాస్వభావులకు, ఒకరిపైన ఆధారపడే స్వభావం ఉన్నవారికి సరిపోయేది భక్తి యోగం. ఇది ఎక్కువగా స్త్రీలకు సరిపోతుంది. వీరు sentimental and loving people.

మనిషికి శరీరం ఉంది. కొందరికి దేహస్పృహ ఎక్కువగా ఉంటుంది. దేహాన్ని దాటి వాళ్ళ ఆలోచనలు ముందుకు పోలేవు. వీరికి ముందుగా కావలసింది హఠయోగం. శరీరంలో కఫ శ్లేష్మాది కల్మషాలు ఎక్కువగా ఉన్నవారికి వాటి ప్రక్షాళణ కోసం ఇది బాగా పనిచేస్తుంది. వీరు body-oriented people.

మనిషికి మనస్సు ఉంది. దానిద్వారా పరమాత్ముని చేరుకోవటం రాజయోగం. మనో మయ జీవులకు ఆలోచనాపరులకు రాజయోగం చక్కగా సరిపోతుంది. వీరు mind-oriented, thoughtful people.

మనిషికి ప్రాణశక్తి ఉన్నది. దానిద్వారా ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుని చేరుకోవటం కుండలినీ యోగం. ప్రాణ సాధకులకు, ప్రాణ శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఈ యోగం బాగా సరిపోతుంది. వీరు energy-oriented people.

ఇతర మతాలవలె అందరినీ ఒకే గాటన కట్టకుండా, ఎవరి వీలును బట్టి వారికి దారిచూపడమే మన సనాతన మతం యొక్క విశిష్టత. నువ్వున్న చోటినుంచి ముందుకు నడువు, నువ్వున్న చోటినుంచి పైకి ఎదుగు అని మన మతం చెబుతుంది.

ఆ క్రమంలో పుట్టినవే వివిధ యోగ ప్రక్రియలు.

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

రష్యన్ల భారతీయ మూలాలు

ఈనాడు రష్యన్లు సుమారు 14 కోట్లమంది ఉంటారు. వారు భాషాపరంగా భారతదేశానికి మిహతా అందఱు ఐరోపేయుల కంటే నేదిష్ఠులు (nearest) అనే సత్యం చాలా మందికి తెలియదు. ఎక్కువమంది జర్మన్ భాషే సంస్కృతానికి అన్నిటి కంటే దగ్గఱ అనుకుంటారు. అలాంటివారు ఇహ రష్యన్ తెలిస్తే ఏమంటారో ? రష్యన్ తెలిసిన భారతీయులకు సంస్కృతం రాకపోవడం, అసలు ఇతర ఐరోపేయ భాషలతో పోలిస్తే రష్యన్ భాష నేర్చుకునేవారి సంఖ్య భారతదేశంలో అల్పాత్యల్పం కావడం - బహుశా ఈ వాస్తవం ఇంతవఱకు బయటపడక పోవ డానికి కారణాలనుకుంటా.


రష్యన్ భాష ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందినదనే సత్యం గత 140 సంవత్సరాలుగా భాషాశాస్త్రవేత్తలకు తెలుసు. ఇది బృహత్తరమైన Indo-European Family of Languages లో శ్లావిక్ అనే ఉపకుటుంబానికి చెందినదిగా వారు పరిగణిస్తూ వచ్చారు. కానీ ఇండో-యూరోపియన్ కుటుంబం అనే కాన్సెప్టు బ్రిటీషువారి కల్పన అనీ, సంస్కృతం ఒక్కటే ఆ కుటుంబంలోని 130 భాషల్నీ సమన్వయం చేసి, వాటన్నింటికీ మూలాల్ని చూప గల ఏకైక భాష కనుక ఆ భాషలన్నింటినీ Sanskrit Family అనే అనాలని మన భారతీయ పండితుల అభిప్రాయం. రష్యన్ కీ సంస్కృతానికీ ఉన్న పోలికల్ని ఒకసారి గమనించండి.


ఇంగ్లీషులో ఉన్నట్లు రష్యన్ లో is, are లూ ఆర్టికిల్సూ లేవు. కానీ సంస్కృతంలో మాదిరి ద్వివచనం ఉన్నది. కానీ ఆధునిక రష్యన్ లో దీన్నెవఱూ వాడరు.


ఉదా :- ఏతొ మొయి సుయిన్ - He is my son - వీడు నా కొడుకు
సంస్కృతం = ఏష మమ సూనుః


తుయ్ స్తొయీష్ - You are standing = నువ్వు నిలబడుతున్నావు.
సంస్కృతం = త్వం స్థాస్యసి


తత్ - అది (సంస్కృతంలో కూడా తత్ అంటే అది)


ఏతా - ఇది (సంస్కృతంలో ఏతత్ -ఇది)


యా = నేను
అన్ - అతడు (అనేన మొ|| అసౌ రూపాల నుంచి కావచ్చు)
వామ్ - మీకు (సంస్కృతంలో కూడా వామ్ అంటే మీకు)
నష్ - మా యొక్క (సంస్కృతంలో నస్- మా యొక్క)
త్వయీ - నీది (సంస్కృతంలో త్వయి అంటే నీయందు)
వుయ్ - మీరు (సంస్కృతంలో యూయమ్)
దోమ్ - ఇల్లు (సం. ధామ)
వొదా - నీరు (సం.ఉదన్)
యా జ్నాయే - I know (సం. అహమ్ జానే)
తుయ్ జ్నాయేష్ - నీకు తెలుసు
అన్ జ్నాయేత్ - అతనికి తెలుసు
ముయ్ జ్నాయేమ్ - మాకు తెలుసు
కూదా - ఎక్కడ (సం. కుతః)
జన్యా - తల్లి (సంస్కృతంలో కూడా జన్యా - తల్లి)
యాత్రోవ్ - తోడికోడలు ( సంస్కృతంలో యాతృ/ యాతా - తోడికోడలు)


కానీ కొన్ని అత్యంత ప్రాథమిక పదాలకు సంస్కృతంతో సంబంధం ఉన్నట్లు
అనిపించదు. ఉదాహరణకు -


జొవ్యూత్ - పేరు
యాయిత్సో - గుడ్డు
కోష్కా - పిల్లి


మిహతా ఐరోపేయుల మాదిరే రష్యన్లు కూడా గోడసున్నం తెలుపైనప్పటికీ వారి ముఖకవళికలు యూరోపియన్ల లాగా లేకపోవడాన్ని గమనించండి. వారు ఎక్కువగా ఉత్తర భారతీయుల్ని పోలి ఉంటారు. నా అభిప్రాయంలో - మహాభారత యుద్ధం తరువాత - అంటే నాలుగైదు వేల సంవత్సరాల క్రితం రష్యాకు వలసపోయిన భారతీయులే రష్యన్లు అయ్యుండొచ్చు. మనకది ఐతిహాసిక కాలమే గానీ ఇతర దేశాలకు మాత్రం చరిత్రపూర్వయుగం కిందనే జమ. కనుక ఇందులోని సత్యాసత్యాలకు సంబంధించి ఆ దేశాల్లో రికార్డులు లభించవు. లేకపోతే అన్ని సంస్కృతపదాలు రూపు చెడకుండా ఆ భాషలో ఇప్పటికీ వ్యవహారంలో ఉండడం సాధ్యం కాదు. రష్యాని మహాభారతంలో ఉత్తరకురుభూములని వ్యవహరించారు. సంస్కృతంలోని విసర్గ ఐరోపేయ భాషల్లో సకార పొల్లు (స్) గా మారుతుంది గనుక-


(ఉత్తర) కురుః - కురుస్ - రూస్ - రూస్సియా - రష్యా అయిందా ?

24, ఆగస్టు 2010, మంగళవారం

పచ్చబొట్టూ చెఱిగీ పోదూలే....

సుఖదుఃఖాలకూ, దూషణ-భూషణలకూ, శీతోష్ణాలకూ మఱియు అటువంటి పరస్పర విరుద్ధ అనుభవాలకు అతీతంగా ఉండడమే ద్వంద్వాతీత స్థితి అని వేదాంతశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ద్వంద్వం అంటే రెండిటి సమాహారం. రెండిటికీ అతీతమైన స్థితే ద్వంద్వాతీతస్థితి. మోక్షానికి ఆవశ్యకమైన సాధనాసంపత్తిలో ద్వంద్వాతీత స్థితి కూడా ఒకటని మనం బాల్యమాదిగా వింటున్నాం. ఈ ద్వంద్వాతీత భావన (concept) అత్యంత ప్రాచీనకాలంలో పాశ్చాత్య ఆధ్యాత్మిక లోకంలో కూడా ప్రాచుర్యంలో ఉండేది. గ్రీకులు దీన్ని stoicism అనే పేరుతో వ్యవహరించేవారు. Stoicism గలిగినవాడు Stoicist లేదా stoic అన్నమాట.

జీవితంలో ఢక్కామొక్కీలు తినే కొద్దీ సుఖదుఃఖాలకు అతీతులం కావచ్చు. అసంభవమేమీ కాదు. శీతోష్ణాల్ని కూడా అభ్యాసబలంతో అధిగమించవచ్చు. అసాధ్యమేమీ కాదు. కాయకష్టం చేసి బతికే చాలామంది పేదవాళ్ళు సుఖదుఃఖాలకూ అతీతులే, శీతోష్ణాలకూ అతీతులే. కానీ వారంతా మోక్షానికి వెళతారని చెప్పలేం. ఎందుకంటే ఒక కష్టాన్ని ఇష్టం లేకపోయినా పళ్ళ బిగువున బలవంతాన ఓర్చుకోవడం వేఱు. అసలది కష్టమే కాదని, భగవత్ ప్రసాదమనీ భావించడం వేఱు. పేదవాళ్ళు చేస్తున్నది మొదటి తరహా పని. ఆధ్యాత్మిక సాధకులు చేసేది రెండో శ్రేణిలోకొస్తుంది. మఱి ఆ కష్టం ఇష్టం కాకుండా అడ్డుపడుతున్నది ఏది ? ప్రతి కష్టాన్నీ భగవత్ ప్రసాదంగా భావించగల మనఃస్థితి మనకెప్పుడు కలుగుతుంది ? అది కలగడానికి మన వంతుగా మనం చేయాల్సినది ఏమిటి ?

మనుషులు తమకు తాము బ్రాండింగ్ వేసుకోవడం మానేసినప్పుడు కష్టాలన్నీ ఇష్టంగా మారతాయి. "మనకు సంబంధం లేదు, మనది కాదు, మనం చేయనక్కఱలేదు, మనకా గతి పట్టలేదు" గట్రా గట్రా భావనలే మానసిక అవరోధాలు. కానీ మనం చిన్నప్పట్నుంచి ఒళ్ళంతా అనేక పచ్చబొట్లు పొడిపించుకుంటూ పెఱిగాం. గుర్వనుగ్రహం లేకుండా మనోమయమైన మన సూక్ష్మశరీరాన్ని మనం దర్శించలేం గానీ ఒక వేళ దైవికంగా దర్శించగలిగితేనా, దాని శరీరం మీద ఈ క్రింద పేర్కొన్న తరహా పచ్చబొట్లు వీపూ, భుజాలూ, పొట్ట అనే తేడా లేకుండా అంతటా వికారంగా పొడిచి కనిపిస్తాయేమో !

"నా పేరు సుబ్బారాయుడు, నా పేరు వెంకటలక్ష్మి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను కమ్మ, నేను రెడ్డి, నేను మధ్యతరగతి, నేను చదువుకున్నవాణ్ణి, నేను నగర నాగరికుణ్ణి, నేను గ్రామీణుణ్ణి, నేను మగవాణ్ణి, నేను ఆడదాన్ని, నేను యువకుణ్ణి, నేను ముసలివాణ్ణి, నాకు అదంటే ఇష్టం, నాకు ఇదంటే అసహ్యం. నేను అది, నేనిది...." ఇంకా ఏదేదో, వేఱేదో, మఱేదో !!

తల్లిదండ్రులే అలవాటు చేశారో, సమాజమే అలవాటు చేసిందో గానీ, మొత్తమ్మీద ఒళ్ళంతా వికారంగా, దట్టంగా అలుముకున్న ఈ పచ్చబొట్ల మూలాన మనకు అహంకారం ప్రకోపించడం, తన్మూలంగా మనోవాక్కాయకర్మలతో ఇతరుల్ని బాధపెట్టి వైవిధ్యభరితమైన పాపాలు చేయడం తప్ప ఉపయోగాంతరమేమీ లేదు. ఇతరులు మనల్ని అవమానపఱిచారని మనం అప్పుడప్పుడు భావించి తీవ్రమైన మనోవేదనని అనుభూతిల్లడానికి సైతం ఈ పచ్చబొట్లే కారణం. మన గుఱించి మనం ఊహించుకునే మూర్తిమత్త్వం (self-image) మహోన్నతమైనది. ఏ దేవుడూ దానికి సాటిరాడు. ఏ మహాత్ముడూ దానితో సరిపోలడు. మన గొప్పతనాన్ని బట్టే మనం ఆయా దేవుళ్ళని పూజించడం, ఆయా మహాత్ముల్ని గౌరవించడం. ఇదీ మన కథ. అసలు మన గుఱించి మనం ఎందుకు ఒక విధంగా అనుకోవాలి ? మన గుఱించి మనం అనుకుంటున్నట్లుగా ఇతరులు అనుకోవడం లేదనీ తత్కారణం చేత వారు మనల్ని బాధపెట్టారని ఎందుకు తలపోయాలి ? ఆ ప్రాతిపదికన వారిని ఎందుకు ద్వేషించాలి ? ద్వేషించడమే కాదు, ఆ బాధలో మనం అనేక తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఇదంతా మనకు మనం పొడుచుకున్న పచ్చబొట్ల ప్రభావం.

మనం ఏదీ కాదు. "మనం ఫలానా" అని సమాజం అనుకున్నంతమాత్రాన మనం అది కాదు. లేదా మనం "ఫలానా కాదు" అని సమాజం అనుకున్నంత మాత్రాన మనం అది కాకుండా పోము. నువ్వు నన్ను ఎలాగైనా చూడు, నేనది కాదు. అసలు నేను ఏదీ కాదు. నా గుఱించి నేను అనుకునేది కూడా నేను కాదు. మఱి నేనేమిటి ? అనడిగితే నేను నేనే. నన్ను అనవసరంగా ఒక పేరుకో, విశేషణానికో, గుర్తింపుకో కట్టిపడేయొద్దు. ఇదీ మనం రోజూ మననం చేసుకోవలసినది. అప్పుడు కష్టాలన్నీ ఇష్టాలుగా మారిపోతాయి.

"అహమాత్మా" అంటూ శ్రీ ఆదిశంకరాచార్యులు బోధించినది కూడా ’ఈ సెల్ఫ్- బ్రాండింగ్ బాధ నుంచి, పచ్చబొట్ల పద్మవ్యూహం నుంచి బయటపడ’మనే !

18, ఆగస్టు 2010, బుధవారం

దేవుడు మెచ్చే సంబంధం


నాలుగింటికి అనుగుణంగా మనిషి తన శృంగార జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. మొదటిది, తన స్వభావమూ, ఇష్టానిష్టాలు. రెండోది ప్రకృతి. మూడోది దేవుడు. నాలుగోది సమాజం. ఈ నాలుగూ పూర్తిగా సమకూడనప్పుడు కనీసం ఏవో రెండు విషయాలకైనా అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కేవలం ఒక అంశంలోనే "సై" అనుకుంటే ఆ నిర్ణయం శుద్ధ తప్పుడు నిర్ణయమని వేఱే చెప్పనక్కఱలేదు.ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాల విషయంలో ఈ విధమైన ఆత్మసరిచూడ్కి (self-check) చాలా అవసరం.

తన యిష్టానిష్టాలేవో తనకు తెలిసే ఉంటాయి. కనుక అందులో పెద్దగా మానసిక ఘర్షణ ఉండదు. రెండోది, ఆ ఇష్టానిష్టాలు ప్రకృతిసిద్ధమేనా ? అని ప్రశ్నించుకోవాలి. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి పరస్పర ప్రేమతో తమ కుటుంబాన్ని విస్తరించుకుని ముందు ఏడాది పొడవునా, తరువాత జీవితాంతమూ కలిసే ఉండాలని వారి శరీర నిర్మాణం ద్వారా ప్రకృతి నిర్దేశిస్తోంది. ప్రపంచంలో మంచినీటి సముద్రాలే ఉండవచ్చు గాక. నీ శరీరానికి మాత్రం ఒక లోటా నీళ్ళు సరిపోతాయి. ఎంత దాహమున్నా సరే, నువ్వు ఆ సముద్రాలన్నింటినీ ఆపోఽశన పట్టజాలవు. అలాగే ప్రపంచంలో వెఱ్ఱి వ్యామోహాన్ని కలిగించేటంత సౌందర్యం గలవారు ఎంతమందైనా ఉండనీ, నీ జీవితానికి పనికొచ్చేది మాత్రం ఒక్కఱే.

దేవుడికి అనుగుణంగా దాంపత్యజీవితాన్ని గడపడం మరో ముఖ్యమైన విషయం. కాని "ఇలా ప్రేమించుకోండి, ఇలా పెళ్ళిచేసుకోండి, ఇలా పిల్లల్ని కనండి" అని ఆయన స్వయంగా దిగొచ్చి మనతో ఎప్పుడూ చెప్పడు. కాని పరస్పర నిబద్ధత (mutual commitment) లేని స్త్రీపురుష సంబంధాల్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించడు. అవి పచ్చి వ్యభిచారధోరణి గల అపవిత్రసంబంధాలు గనుక వాటిల్లో పాల్గొనే జంటలు అసలు జంటలే కావు గనుక, వారికి భోగలాలసత్వం మినహా ఎటువంటి బాధ్యతా లేదు గనుక, స్త్రీపురుష జంటల ద్వారా దేవుని భార్య అయిన ప్రకృతిమాత సాధించదల్చుకున్న మూడు ప్రయోజనాల్లో కేవలం ఒక్కటే (అదీ అఱకొఱగా) వారు నెఱవేఱుస్తారు గనుక వారికి ఆయన నుంచి ఆశీర్వాదాలు ఉండవు సరికదా, శాపాలు తగిలినా ఆశ్చర్యపోనక్కఱలేదు.

రతిపుత్త్రఫలాః దారాః అని ఆర్యోక్తి. అంటే, భార్య ఉన్నందుకు ఫలం - ఆమెతో సమాగమమూ, ఆమె ద్వారా సంతానమూ అని ! ఈ సూక్తిలో పేర్కొననివి, స్థలాంతరంలో తారసపడేవీ అయిన ప్రయోజనాలు ఇంకా మూడున్నాయి. ఒకటి - ఒకఱికొకఱు సుఖదుఃఖాలలో సమభాగులై జీవితాంతం కలిసి ఉండడం (సుఖదుఃఖ సమభాగిత్వం). రెండోది సహధర్మచర్యము. అంటే భగవంతునికి ప్రీతికరమైన, లోకకల్యాణకారకమైన మతానుష్ఠాన క్రియల్ని భార్యాభర్తలిద్దఱూ కలిసి నిర్వర్తించడం. భర్త లేని స్త్రీ సౌభాగ్యవతి కాజాలనట్లే, భార్య లేని పురుషుడు ఏ అగ్నిహోత్ర కార్యాలకూ అర్హుడు కాడు. మూడోది నిగ్రహం. ఈ కాలంలో కొందఱు భావిస్తున్నట్లు వివాహం అనేది ఒక లౌకిక, సామాజిక, ఆధికారిక లాంఛనం కాదు. వివాహనికీ ప్రభుత్వానికీ సంబంధమే లేదు. ప్రభుత్వం వివాహాన్ని గుర్తించగలదు, అంతవఱకే. కానీ అసలు మనుషులెందుకు వివాహం చేసుకోవాలో అది చెప్పజాలదు. ఆ ప్రయోజనాన్ని మతదృష్టితో మాత్రమే అర్థం చేసుకోగలం. వివాహం అనేది జీవితభాగస్వామిని తెప్పగా చేసుకొని సంసారసముద్రాన్ని దాటి మనోనిగ్రహతీరాన్ని చేఱుకోవడం కోసం మతధర్మాలు ప్రతిపాదించిన వ్యవస్థ. ఈ అయిదు ప్రయోజనాల్లో ఒకటైన సంతానం కొన్నిసార్లు అన్ని జంటలకూ కలక్కపోవచ్చు. అటువంటప్పుడు వారు కనీసం మిగతా నాలుగు ప్రయోజనాలనైనా నెఱవేర్చాలి. వీటిల్లో జీవితాంతం కలిసే ఉండడం చాలా ముఖ్యమైన ప్రయోజనం. వాళ్ళు సంస్కారపరంగా మనుషులో, పశువులో తేల్చేది అదే. ఎందుకంటే పశువులు తమ సంబంధాల్ని ఇట్టే మర్చిపోతాయి. కాని మనుషులు మఱవలేరు. మనిషి స్మృతిజీవి అయినప్పుడే నీతిజీవి కూడా అయ్యాడు. అందుచేత అతడు తన మానవ మనస్తత్వానికి అనుగుణంగా శాశ్వతసంబంధాల్ని మాత్రమే ఏర్పఱచుకోవాలి.

వివాహమనే సంస్కారం ఇద్దఱు స్త్రీపురుషుల్ని ఆ విధమైన పవిత్రబంధంలో శాశ్వతంగా ముడివేస్తుంది. ఆ పరస్పర ప్రమాణం వారి ప్రేమసామ్రాజ్యానికి రాసుకున్న రాజ్యాంగం. ప్రతికొన్ని రోజులకీ చెఱిపేసి మళ్ళీ మళ్ళీ రాసుకునేవి రాజ్యాంగాలు కావు. చిత్తుకాయితాలు మాత్రమే ! అలా ఏర్పడేవి సామ్రాజ్యాలు కావు. గుడిసెలు మాత్రమే ! ఆ ప్రేమే నిజమైతే, ఆ ప్రమాణంలో నిజాయితీ ఉంటే శుభలేఖలూ, పురోహితుడూ బాజాభజంత్రీలూ, రిజిస్ట్రేషన్లూ ఏమీ అవసరం లేదు. అందుచేత వధూవరులు పరస్పరప్రేమచోదితులై, పెద్దల ప్రమేయం లేకుండా రహస్యంగా, అమంత్రకంగా చేసుకునే గాంధర్వవివాహాల్ని సైతం హిందూధర్మం ఆమోదించి ధర్మశాస్త్రాల్లో వాటికొక స్థానాన్ని కల్పించింది. ఎందుకంటే, అవి ఇతరులకు గుప్తమైనవి. కానీ దేవుడికి గోచరించనంత, ఆయనకు వినబడనంత గుప్తమైనవి కావు. అందుచేత అవి ఆయనకు అభ్యంతరకరాలు కావు. ఇందుకు మన పురాణాల్లోనే ఎన్నో దృష్టాంతాలున్నాయి.

ఏకాంతంలో ఏకమైన మత్తులో హృదయాంతరాళంలోంచి దూసుకొచ్చే "నువ్వే నా సర్వస్వం, నువ్వు నా భార్యవి, నువ్వు నావాడివి, మనల్నెవ్వరూ విడదియ్యలేరు" మొదలైన మాటలు అత్యంత శక్తిమంతమైన పెళ్ళిప్రమాణాలు - వాటిని మూడో మనిషెవఱూ వినకపోయినా. అలాంటి మాటలు నోటి వెంట వచ్చాయో, నూటికి నూఱుశాతం పెళ్ళి జఱిగిపోయినట్లే. దీనికి తిరుగులేదు. ఎందుకంటే దేవుడు మనల్ని తన సూత్రాల ఆధారంగా కాక మన మాటల ఆధారంగా మన చేతల ఆధారంగా మనల్ని జడ్జి చేస్తాడు. మన మాటలు మనకు గుర్తులేకపోయినా విశ్వాంతరాళంలోని ఒక మహామేధస్సులో శాశ్వతంగా నమోదవుతాయని మఱువరాదు. ఆ మాటలన్న తరువాత ఇతరులతో తిరుగుళ్ళు తిరిగే అధికారాన్ని మనుషులు కోల్పోతారు. ఆ మాటలకు అడ్డుచెప్పని స్త్రీ కూడా ఇతరులతో ప్రేమ/ పెళ్ళిసంబంధాన్ని పెట్టుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది. వాగ్దానం అప్పుతో సమానం. ఇస్తానన్నాక ఏదో ఒకరోజు ఇచ్చితీఱాలి. అది ఈ జన్మలో కావచ్చు, మఱుజన్మలో కావచ్చు. పదివేలేళ్ళ తరువాతా కావచ్చు. అలాగే "నువ్వే నా భార్యవి" అన్న పురుషుడూ, ఆ మాటకు "సరే" అని అంగీకరించిన స్త్రీ ఎప్పటికీ తప్పించుకోలేరు. వాళ్ళు భార్యాభర్తలై తీఱాల్సిందే. రహస్యంగా ఒకఱితో ఒకఱు అనుకున్న ఈ మాటలు వారి భవిష్యత్ తలరాతను నిర్మొహమాటంగా లిఖించివేస్తాయి. ఇదే కర్మఫలమంటే. ఇదే ఋణానుబంధమంటే. అంతకుముందు వారిద్దఱూ ఎవఱైనప్పటికీ, అసలు ఏమీ కాకపోయినప్పటికీ వివాహం చేసుకున్న మఱుక్షణంనుంచి వారు భార్యాభర్తలవుతారు. వారిద్దఱూ ఒకే వ్యక్తిలాగా ప్రవర్తించాలి, ఆలోచించాలి.

సమాజానికి అనుగుణంగా మెలగడంలో తెలివితేటలున్నాయి గాని అందులో పవిత్రతా, అపవిత్రతా, పాపం, పుణ్యం ఏమీ లేవు. సమాజమేమీ దేవుడు కాదు. ఆధ్యాత్మికంగా దాని స్థానం బహుపరిమితం. కనుక మనుషులు విశ్వగురుమూర్తులైన ఆదిఋషుల వాక్యాలను, తమ అంతరాత్మను, పరమాత్మను, ప్రకృతినీ పరిగణనలోకి తీసుకొని ప్రవర్తించడం ఆధ్యాత్మిక జీవితానికి తొలిమెట్టు.


29, జులై 2010, గురువారం

రామునికీ రావణునికీ తేడా ఏంటి ?

రామాయణంలో ప్రధానపాత్రలు శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు. మిగతావారంతా అవాంతరపాత్రలే. కనుక వారి గుఱించి అవసరమైనంత మేఱకే కవి వర్ణించాడు. ఆ పాత్రల్ని హీరోలు అనడానికి ఆ సమాచారం చాలదు. పోనీ లభిస్తున్న సమాచారం ప్రకారం చూసినా వారు హీరోలు కారు. శ్రీరామచంద్రమూర్తితో పోల్చదగ్గవారు అంతకంటే కారు.

వాలినే తీసుకోండి. ఆ వానరుడి దగ్గఱ శరీరబలాధిక్యం తప్ప ఇంక ఏ గొప్పతనమూ లేదు. దశాబ్దాల తరబడి విశ్వాస పాత్రుడుగా సేవ చేసిన తమ్ముణ్ణి అకారణంగా అనుమానించి వెళ్ళగొట్టాడు. అతని భార్యని బలాత్కారంగా అనుభవించాడు. అతను అన్నివిధాలా పశుప్రాయుడు. తానా పశువుని వధిస్తే తనకే దోషమూ లేదని శ్రీరామచంద్రమూర్తి చెప్పినది అక్షరాలా నిజం. కానీ శ్రీరామచంద్రమూర్తి తమ్ముణ్ణి ఎలా చూసుకున్నారు ? ఏ పరస్త్రీ జోలికి వెళ్ళారు ?

మైక్రోస్కోపులో పట్టిపట్టిచూస్తే మలంలో కూడా వైటమిన్లు, ప్రొటీన్‌లు కనిపిస్తాయి. అలాగని అందఱమూ మలాన్ని మన daily staple food గా మార్చుకొని తినలేం. అలాగే వాలి, కర్ణుడు లాంటి పక్కా విలన్లలో కూడా మినుకుమినుకుమంటూ ఒకటో రెండో సుగుణాలు కనిపిస్తాయి. అంతమాత్రాన వాళ్ళు సాత్త్వికగుణనిధులైన శ్రీరామచంద్రమూర్తి కన్నా, ధర్మరాజు కన్నా గొప్పవాళ్ళయిపోరు. ఇహ శ్రీరామచంద్రమూర్తిలో దోషాలు వెతకడమంటే సూర్యకాంతి చుఱుక్కుమంటోందనీ కనుక అది పనికిరాదనీ అనడం వంటిది. శూద్రక మహారాజు వ్రాసిన మృచ్ఛకటికంలో ఒక శ్లోకం ఉంది. దాని భావం ఏమంటే "తెల్లని వస్త్రం మీద ఒక చిన్న మఱక కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. నల్లని వస్త్రం మీద ఎన్ని మఱకలున్నా ఏమీ తెలియదు" అని అలాగే సకలసద్గుణాభిరాములైనవారిలోనే ప్రపంచం లోపాల్ని వెతకగలదు గానీ దుష్టులేం చేసినా అది దుష్టత్వంగా అనిపించదు. ఎందుకంటే ఆ దుష్టత్వానికి అలవాటు పడిపోతాం కనుక.

దీన్ని ఒక్కముక్కలో తేల్చవచ్చు. శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఎటువంటిదయ్యా అంటే - ఆయన్ని ఆరాధించడం కోసం గుళ్ళూ గోపురాలూ కట్టడానికి లక్షలాది మందిలో అది ప్రేరణనీ, స్ఫూర్తినీ ఇస్తుంది. కాని వాలి, రావణుడులాంటి వాళ్ళ గొప్పతనం "ఓహో ప్రతి దుర్మార్గుడిలోను కొంత సదంశ కూడా ఉంటుందన్నమాట" అనేటంత వఱకు మాత్రమే తేగలదు. వారికి గుడి కట్టి పూజించాలనే కోరిక మాత్రం ఎవఱికీ కలగదు.

11, జులై 2010, ఆదివారం

దాతలు సంతానమౌతారు, గ్రహీతలు తల్లిదండ్రులవుతారు

కీ.శే. మధిర సుబ్బన్నదీక్షితులు రచించిన కాశీమజిలీకథల్లో ఒక కథ ఉంది. కాశీలో ఒక మాదిగకి సంతానం లేకపోతే అందునిమిత్తం తాను చెప్పినట్లు చేయమని ఒక బ్రాహ్మణుడు అతనికి చెప్పాడట. ఆ ప్రకారంగా అక్కడ ఒక యోగి వేసవికాలపు మండుటెండలో స్నానఘట్టానికి వెళ్ళే దారిలో ఆ మాదిగ కొత్తచెప్పులు వదిలాడట. ఆ యోగి ఎండచుఱుక్కి కాళ్ళు కాలిపోతూంటే తట్టుకోలేక ఆ చెప్పులు తొడుక్కొని వెళ్ళాడట. ఆ ఋణం తీర్చుకోవడానికి అతను చనిపోయి ఆ మాదిగ ఇంట్లో అతని కొడుకుగా జన్మించాడట. పునర్జన్మలో కూడా అతనికి యోగవాసనలు పోలేదట. అందుకని, తనకు రాత్రివేళల్లో దొంగల గుఱించి టముకు వేసే బాధ్యతని కులాచారంగా అప్పగించినప్పుడు, "అరిషడ్వర్గాలే నిజమైన దొంగలు కనుక వాటి పట్ల అప్రమత్తంగా ఉండండొహో" అని టముకు వేశాడని దీక్షితులవారు వ్రాశారు.

జీవితసత్యాలకు షుగర్ కోటింగ్ వేసి జనసామాన్యం చేత మింగించడానికి ఉద్దేశించినవి కథలు. కానీ అసత్యాలకూ, అపార్థాలకూ కూడా షుగర్ కోటింగు వేయొచ్చునని ఈ పైన పేర్కొన్న కథ మూలాన అవగతమవుతుంది. హిందూధర్మప్రోక్తమైన కర్మసిద్ధాంతానికి జనంలో ఏ విధమైన అపార్థాలు బయల్దేఱాయో ఈ ఒక్క కథా విని తెలుసుకోవచ్చు. ఇలాంటిదే "ఈ ఉపకారం చేసిపెట్టవయ్యా, చచ్చి నీ కడుపున పుడతా" ననడం కూడా ! ఎవఱు ఎవఱికి ఋణపడడం వల్ల పితాపుత్ర సంబంధం ఏర్పడుతుంది ? పితాపుత్ర సంబంధం ఏర్పడినప్పుడు ఎవఱు ఎవఱి మీద ఖర్చుపెట్టాల్సి వస్తుంది ? ఈ రెండు చిన్న సరళమైన ప్రశ్నల్ని మనవాళ్ళు వేసుకోకపోవడం వల్ల ఈ అయోమయం ఏర్పడింది. అంతేకాక, మన సంప్రదాయంలో తల్లిదండ్రులు దైవసమానులు కనుక తల్లిదండ్రులకు పిల్లలే ఋణపడతారనే పొఱపాటు అభిప్రాయం ఉంది. ఇది కేవలం అభిప్రాయమే తప్ప వాస్తవం కాదు. ఈ అభిప్రాయం ప్రచారంలోకి రావడానికి బహుశా ఒక కారణం - తమని తమ పిల్లలు దైవసమానులుగా చూసి వారంతట వారు తమకు సేవ చేసేదాకా వేచిచూడకుండా తల్లిదండ్రులు ముందే తమకి తాము దైవత్వాన్ని ఆపాదించుకోవడం. తలిదండ్రులకు పిల్లలు సేవ చేయాలని చెప్పబడింది కనుక పిల్లలే తల్లిదండ్రులకు ఋణపడ్డారని జనసామాన్యం అపోహపడడం. కానీ తల్లిదండ్రులే పూర్వజన్మలో పిల్లలకు ఋణపడి ఉన్నారనేదే అసలువాస్తవం. అందువల్ల వారు తమ రక్తమాంసాలు ధారపోసి మఱీ ఆ పిల్లలకి జన్మనిచ్చి పెంచాల్సివస్తుంది. ఆ కారణం చేత ఈ పైన ఉదాహరించిన కథలో ఋణపడింది యోగి. ఆ చెప్పుల్ని అతనికి ఋణమిచ్చినది మాదిగ. కాబట్టి కర్మసిద్ధాంతం ప్రకారం ఋణదాత అయిన మాదిగే మఱుజన్మలో ఋణగ్రహీత అయిన యోగికి కొడుకై పుట్టి తన ఋణాన్ని వసూలు చేసుకోవాల్సి ఉంది. కానీ తద్విరుద్ధంగా వ్రాశారు.

అయితే ఈ పై కథ బోధించే తప్పుడు అభిప్రాయాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. యోగులు కర్తృత్వ, భోక్తృత్వ భావనలతో ఏ పనీ చేయరు కనుక, ఎల్లవేళలా భగవంతునియందు సర్వశరణాగతి భావనతో ఉంటారు కనుక వారు ఎవఱినుంచి ఏ సేవ స్వీకరించినా వారికి ఋణపడే ప్రసక్తీ లేదు. ఆ ఋణసమాప్తి కోసం పునర్జన్మెత్తే ప్రసక్తి అంతకంటే లేదు. అదీగాక "శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే" అన్న గీతావచనం చొప్పున, ఒకవేళ యోగి పునర్జన్మ ఎత్తాల్సివచ్చినా తనలాంటి యోగుల యింట్లో గానీ లేదా పవిత్రహృదయులైన ధనికుల ఇంట్లో గానీ జన్మిస్తాడే తప్ప పై కథలో చెప్పినట్లు జఱగదు.

3, జులై 2010, శనివారం

ఆధ్యాత్మిక అంటువ్యాధులు-1

భగవాన్ శ్రీ రమణమహర్షులవారికి కేన్సరు సోకగా వైద్యం చేయిస్తామన్న భక్తులతో ఆయన అన్న మాటలు : " ఈ దేహమే ఆత్మకు సోకిన వ్యాధి. మళ్లీ ఈ వ్యాధి మీద ఇది ఇంకో వ్యాధి. దీనికి వైద్యమెందుకు ?" అయితే వారి తృప్తి కోసం ఆయన వైద్యం చేయించుకున్నారను కోండి.

అసలు ఈ దేహమనే వ్యాధి పొడసూపడానికి కారణం కోరికలు. కోరికలంటే మనస్సుతో చేసే కర్మమే. మనం ప్రస్తుతం చేసిన/ చేస్తూ ఉన్న కర్మల ఫలాలే మనకి ఒక భావి- దేహాన్ని సిద్ధం చేసిపెడతాయి. (ఒకటి కాకపోతే వందలాది దేహాల్ని) ఆత్మకి ఈ దేహమనే వ్యాధి సోకినప్పట్నుంచి దానికి ఏ మాత్రమూ కులాసా ఉండదు. నిరంతరం ఆకలి, కామం, అకారణ రాగం, అకారణ ద్వేషం, ఏదో తెలియని భయం, బ్రతుకుబెంగ. ఈ వ్యాధినే శాశ్వత సహజస్థితిగా బ్రమయించే ఉన్మాదం కూడా దాన్తో పాటు సిద్ధం.

సరే, మన వ్యాధికి మన యొక్క మనఃకర్మలే కారణమైతే ఫర్వాలేదు. కానీ ఇతరుల కర్మలు కూడా మనకంటుకుంటే ఏం చేయాలి ? మనం అనవసరంగా ఇతరుల కర్మలక్కూడా మన దేహంతోనే మూల్యం చెల్లించాల్సివస్తే ఏంటి గతి ?

ఈ ప్రశ్నవేస్తే చాలామంది నైష్ఠిక హిందువులు కూడా అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో నిర్ఘాంతపోతారు. ఈ ప్రశ్నేదో కొత్తగా ఉందే ? అనుకుంటారు. "ఎవడి కర్మకి వాడే అనుభవించాలని కదా, హిందూ వేదాంతశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ? తద్విపర్యాసంగా ఈ గొడవేంటి, ఎవఱి కర్మఫలాలో మనకంటుకోవడమేంటి ?" అని విస్తుపోతారు. హిందూ కర్మసూత్రం అంత సులువైనదీ, సరళమైనదీ అయితే అది అందఱికీ అర్థమైపోయి ఈ పాటికి ప్రపంచమంతా హిందూమతంలోకి కన్వర్టయ్యేవాళ్లే. కానీ దురదృష్టవశాత్తు అది అత్యంత సంక్లిష్టమైనది. అందుకే మన పూర్వీకులు "గహనా కర్మణో గతిః" (కర్మఫలం ఏ దారిలో వచ్చి మనల్ని పట్టుకుంటుందో అర్థం చేసుకోవడం కష్టం) అని వాక్రుచ్చారు.

ఇతరుల కర్మఫలాలు ఏ దారిలో వచ్చి మనకంటుకొని మనల్ని పీడించడం మొదలు పెడతాయో ఒకటి-రెండు దృష్టాంతాల ద్వారా గ్రహించవచ్చు. వీటిని ఎక్కణ్ణుంచి సేకరించారని మాత్రం నన్నడగొద్దు. ఒకాయనకి ఇద్దఱు భార్యలు. వారిలో పెద్దామె ఆయనకి దగ్గఱి బంధువు. నిజానికి ఆమెని అతను పెళ్ళి చేసుకోలేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఆమెతో ఉన్నాడంతే ! ఆ తరువాత రెండో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ముగ్గుఱూ ఒకే యింట్లో ఉండేవారు. ఆ పెద్దామెతో భర్తకి సంబంధం ఉందని చిన్నామెకి తెలియదు. వీళ్ళూ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మసులుకున్నారు. అయితే పెళ్ళయ్యాక అతని వైఖరిలో మార్పొచ్చింది. అతను పూర్తిగా భార్యకే అంకితమయ్యాడు. ఆ పెద్దామెని తాకడమే మానేశాడు. పైకి అతని ప్రవర్తన సక్రమమైనదిగా, బహు నీతిమంతమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆ పెద్దామె అలా అనుకోలేదు. ఆమెకి అతని మీద మనసు తీఱలేదు. ఆమెకి ఇంకా చాలా కోరికలున్నాయి. పైకి వ్యక్తీకరించలేకపోయినా ఆమె అతని కోసం యథాపూర్వంగా తపిస్తూనే ఉంది. అతను పట్టించుకోలేదు. అతని నిరాదరణకు ఆమె మనసులోనే ఆక్రోశించింది, దుఃఖించింది. అతను ఎప్పటికీ మళ్ళీ దరిజేఱకపోవడంతో ఆమె స్వయంతృప్తికి అలవాటుపడింది. ఆ సమయంలో కూడా ఆమె మనసులో అతనే ఉండేవాడు. ఒక పనిమనిషి దగ్గఱ తన మనసులోని వేదనని తఱచుగా వెళ్ళగ్రక్కేది. అతనిలా తనను కౌగలించుకొమ్మని, తనని అతనిలా పిలవమని, తాకమని ఆ పనిమనిషిని ఒత్తిడి చేసేది. ఇలా ఎన్నో మానసిక బాధలతో సతమతమవుతూ కొన్ని సంవత్సరాలకి ఆ పెద్దామె ఆ అశాంతితోనే కన్నుమూసింది. తదుపరి మఱికొన్ని సంవత్సరాలకి ఆమె పెనిమిటి కూడా చనిపోయాడు.

మళ్ళీ మఱొకచోట జన్మించినాక ఆఱు-ఏడేళ్ళ వయసులోనే అతనికి తీవ్రమైన స్త్రీవాంఛ ఉండేది. కొద్ది దశాబ్దాల పాటు అలా అహోరాత్రాలూ బాధపడ్డాక అతనికి పెళ్ళయింది. అతని భార్య చాలా ఉత్తమురాలు. భర్తంటే చాలా ప్రేమ. కానీ శృంగారానికి మాత్రం విముఖురాలు. ఎంతగా అంటే, ఆమెతో అతను సగటున ఏడాదికి ముణ్ణాలుగుసార్లు కూడా ఆనందించినది లేదు. ఫలితంగా అతను నిరంతర స్వయంతృప్తికి అలవాటుపడ్డాడు. హోమోసెక్సులాంటి ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ అతను అలా కాలేదనుకోండి.

ఇక్కడ వర్ణించిన జన్మజన్మల ఉదంతాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే - ఈ జన్మలో చిన్నతనం నుండి అతను పడ్డ బాధలకి, పూర్వజన్మలో తెలిసో, తెలియకో తన పెద్దభార్యని పెట్టిన కామవాంఛాపరమైన మానసిక చిత్రహింసకీ సంబంధం ఉందని అవగతమౌతుంది. ఆమె ఎలాగైతే అతనితో సంబంధం వల్ల తనలో రెచ్చగొట్టబడ్డ కామవాంఛ అతని ద్వారా తీఱక బాధపడిందో, సరిగ్గా అలాగే అతనూ ఇప్పుడు బాధపడాల్సి వచ్చింది. ఆమెలాగే స్వయంతృప్తి అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఏ హోమోసెక్స్ (లెస్బియన్) భావనలకి లోనైందో అవే భావనల్ని ఇప్పుడు అతను కూడా అకారణంగా అనుభూతి చెందాల్సి వచ్చింది. ఆనాటి ఆమె బాధలన్నీ ఇప్పుడు అతనికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కానీ పూర్వజన్మలో తాళిగట్టిన భార్యకి అంకితమైన పుణ్యఫలం చేతను, ఆమె మనసులోనే భర్తకిచ్చిన శుభాభినందనల ఫలితంగాను ఇప్పుడుపతివ్రత అయిన స్త్రీ కళత్రంగా లభించింది. కానీ ఆమె ద్వారా అతనికి ఇప్పుడు కామోపశాంతి మాత్రం లేదు. పెద్దభార్య ఉసుఱు కూడా తగిలింది.

ఆ జన్మలో ఆ పెద్దభార్య పొందిన మానసిక బాధలకి పూర్తిగా అతనే కారణమా ? అని ప్రశ్నించుకుంటే, బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే, అది ఆమె తలరాత. "రాతలో లేనిది చేతలో జఱగదు" అంటాడు యోగివేమన. ఆ తలరాత అలా ఎందుకు ఉంది ? అంటే బహుశా ఆమె కూడా అంతకు పూర్వజన్మలో తన భర్తకి సంసారసుఖం లేకుండా చేసి ఉండొచ్చు. ఆ కర్మఫలాన్ని ఆ రూపంలో మఱుజన్మలో అనుభవించి ఉండవచ్చు. అలాగే ఆమె యొక్క పూర్వజన్మ భర్తకి అలా చేయాలనే సంకల్పం ఆమెలో ఎందుక్కలిగింది ? అనడిగితే "అది అతని పూర్వకర్మఫలం" అనాల్సి వస్తుంది. ఇలా ఒక కర్మఫలం ఎంతమందికి జన్మలవారీగా అంటుకుందో గమనించండి. ఆ కర్మఫలం పెద్దామె యొక్క పూర్వజన్మభర్త నుంచి పెద్దామెకి, ఆమెనుంచి ఇతనికి, ఇప్పుడు ఇతన్నుంచి ఇతని భార్యకి అంటుకో బోతున్నది. ఈమె నుంచి రాబోయే జన్మలో వేఱెవఱికో ?

"ఈ విధమైన అంటువ్యాధిలాంటి కర్మఫల సంక్రమణం నుంచి జీవులకు విముక్తి ఎలా ? దీనికి ఎక్కడ ముగింపు పలకాలి ?" అని ప్రశ్నించినప్పుడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు ఒక అమూల్యమైన మాట సెలవిచ్చారు. అది కర్మఫలమని గ్రహించి, మనసులో వ్యథ చెందకుండా, ఎవఱి మీదా తిరగబడకుండా దానితో రాజీపడి, ఎవఱినీ ద్వేషించకుండా, అందఱినీ క్షమించి, భగవంతునికి సర్వస్యశరణాగతి చేస్తే దాని ఫలం మనతోనే అంతరించిపోతుంది. భవిష్యత్తులో మన ద్వారా ఇంకెవఱికీ అంటుకోదు.

17, జూన్ 2010, గురువారం

తనయందు దైవత్వాన్ని ఆరోపించుకోవడం - పర్యవసానాలు

మనిషిలో భగవంతుణ్ణి దర్శించడం హిందూసంస్కృతిలో మాత్రమే లభ్యమయ్యే వైశిష్ట్యం. హిందువులలో అనేక సామాజిక మానవ సంబంధాలు సైతం ఈ విధమైన దైవభావనని ఆలంబనగా చేసుకొని ప్రవర్తిల్లుతున్నటువంటివే. ఆయా పెద్దల్ని లేదా ఇష్టుల్ని దేవుడితో సమానం చేయకపోతే హిందువుల మనస్సు శాంతించదు. అదే విధంగా తమకు సహాయపడ్డవారందఱినీ "దేవుడిలా వచ్చా"రనడం కద్దు. అలాగే "ఒకఱు చాలా మంచివారు" అని సాక్ష్యం చెప్పడానికి "ఆయన దేవుడిలాంటోడు. ఏమన్నా అంటే కళ్ళు పోతాయ్" అనడం కద్దు. ఆ రకంగా కాలక్రమంలో మనకి చాలామంది భగవత్సమానులు ఏర్పడ్డారు. హిందువులలో తల్లి దేవత. తండ్రి దేవుడు. (కొంతమందికి అన్నయ్య కూడా దేవుడే) గురువు దేవుడు. భర్త దేవుడు. అతిథి దేవుడు. మఱికొంతమందికేమో రాజు/ నాయకుడు కూడా దేవుడే.

సరే, అంతా అనుకూలంగా సాగినంత కాలం, ఈ దైవత్వాపాదితులు తమకు ఆపాదించబడ్డ దైవత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నంత కాలం ఈ దైవభావన వల్ల నష్టమేమీ లేదు. అలా కాక ఏ కారణం చేతనైనా ఆ భగవత్సమానులు అడ్డం తిరిగితే వారి భగవత్తత్వం లోకకంటకంగా పరిణమిస్తుంది. "నా విష్ణుః పృథివీపతిః" (రాజు మానవరూపంలో ఉన్న విష్ణుమూర్తి) అని కీర్తించిన దశ నుంచి "రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు" అని మహాకవులు ఆక్రోశించే దశ దాకా వ్యవహారం ముదిఱిందంటేనే అలనాటి మానవ సంబంధాలు చారిత్రిక పరిణామ క్రమంలో ఎలా విషమించాయో తేటతెల్లమవుతోంది. ఇది కేవలం పాలకులకూ, పాలితులకూ మధ్యనే కాదు, తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్య, గురువులకూ శిష్యులకూ మధ్య,భార్యలకూ భర్తలకూ మధ్య కూడా ఇలాగే విషమించడాన్ని మనం ఆధునిక కాలంలో గమనించవచ్చు. ఈ విషమించడంలో కేవలం తల్లిదండ్రుల పాత్రో, లేక పిల్లల పాత్రో లేదు. అలాగే కేవలం గురువుల పాత్రో, శిష్యుల పాత్రో లేదు. అదే విధంగా కేవలం భర్త పాత్రో భార్య పాత్రో లేదు. కొన్ని కేసులలో వీరిదీ,మఱికొన్ని కేసులలో వారిదీ ఉంది.

మాతృత్వం, పితృత్వం, భర్తృత్వం, గురుత్వం ఇలాంటివి అదృశ్య పీఠాలు. ఇవి ఆధ్యాత్మికంగా శక్తిమంతమైనవి. అందువల్ల ఈ స్థానాలను అధిష్ఠించినది ఎవఱైనప్పటికీ, ఎలాంటివారైనప్పటికీ వారిచ్చే ఆశీర్వాదాలకీ, శాపాలకీ మఱుజన్మలో తప్పకుండా ఏదో ఒక స్థాయిలో ఫలితం కనబడుతుంది. అయితే కలియుగం ముదుఱుతున్నకొద్దీ అల్పబుద్ధులవారు ఎక్కువగా ఈ పీఠాల్లో తిష్ఠ వేస్తూండడమే మన అసలు సమస్య. అహంకారం, క్రోధప్రదర్శన మొదలైనవి ఆయా పీఠాల్ని బట్టి సంక్రమిస్తాయి. "ఆ పీఠాలు తమవి" అని భావించుకోవడం వల్ల వాటి దుష్ప్రభావాలు తీవరిస్తాయి. ఈ సందర్భంగా నాకొక కథ గుర్తుకొస్తోంది.

ఒకానొక రాజుగారు చాలా కోపిష్ఠి. ప్రతీ చిన్న విషయానికీ కోపం తెచ్చుకొని భయంకరమైన శిక్షలు విధించేవాడు. ఒకసారి ఒక ఋషి ఆయన్ని చూడ్డానికొచ్చి "మహారాజా ! దానమైనా, దండమైనా పాత్రమెఱిగి ఆచరించాలి. చిన్నతప్పులకు పెద్ద శిక్షలూ, పెద్ద తప్పులకు చిన్న శిక్షలూ విధించడం పాపహేతువు. అందుకు ఫలితాన్ని రాజే స్వయంగా అనుభవించాల్సి ఉంటుంది" అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు. ప్రతిదానికీ పెద్దపెద్ద శిక్షలు విధించడానికి కారణమవుతున్న తన ఆవేశాన్ని, కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో రాజుకు అర్థం కాక భార్యని పిలిచి సలహా అడిగాడు. "మహారాజా ! ఒక్క నెలరోజులు నాకు రాజ్యాధికారం ఇప్పించండి. ఎలా అదుపులో పెట్టుకోవాలో నేను చెబుతాను. అయితే నేనిప్పుడు పరిపాలకురాలుగా తీసుకునే నిర్ణయాలకు ఆ తరువాత నన్ను శిక్షించనని మాట ఇవ్వండి." అన్నదామె. రాజు "సరే"నని ఒప్పుకొని "ఒక నెలరోజులపాటు తన బదులు తన భార్యే రాజ్యపాలన చేస్తుందనీ, తనతో సహా అందఱూ ఆమె మాటనే శిరసావహించాల్సి ఉంటుం"దనీ దేశమంతా చాటింపు వేయించాడు. ఆమె సింహాసనం మీద కూర్చున్న మొదటిరోజే "ఏలినవారు" అని మర్యాదగా తనని సంబోధించనందుకు భర్తకు పది కొరడాదెబ్బలు విధించింది. ఇహ ఆ నెలంతా ఎలా ప్రవర్తించాలో అర్థం కాక రాజుకు ప్రత్యక్ష నరకమే కనిపించింది. నెలరోజుల తరువాత మళ్ళీ రాజ్యాధికారాన్ని చేపట్టినాక రాజు భార్యతో "నీ వల్ల కొరడాదెబ్బలు తింటే తిన్నాను గానీ ఈ నెలరోజుల్లో నా కోపం చాలామటుకు తగ్గిపోయింది. ఎప్పుడూ శిక్షలు విధించడమే తప్ప నేనెప్పుడూ శిక్షకి పాత్రుణ్ణి కాలేదు. బహుశా అందుకే ఇంతకుముందు నాకు కోపం తగ్గలేదేమో" అన్నాడు. రాణి నవ్వి "అసలు కారణం కొరడాదెబ్బలు కాదు మహారాజా ! కోపాన్ని సహించి అణిగిమణిగి పడుండేవారు ఉన్నంతకాలం కోపం తగ్గదు. సాధారణంగా అలా పడుండేవారి మీదనే మనకి కోపం వస్తుంది. అలా పడుండనివారి మీద చస్తే కోపం రాదు. మనకి ఎవఱిమీదైనా అధికారం ఉంది అని మనం అనుకుంటే మనకి వారి మీద ఎల్లప్పుడూ కోపం వస్తూనే ఉంటుంది." అని వివరించింది.

పిల్లల మీద తల్లిదండ్రులకీ, శిష్యుల మీద గురువులకీ అధికారం లేకపోలేదు. అంతకంటే వారిని తమకి భగవంతుడు అప్పగించిన sacred trust గా మన్నించడం ఎక్కువ సరైనది. పెంచమని, తీర్చిదిద్దమనీ దేవుడు మనకప్పగించినవారికి శాపాలిచ్చి వారి బతుకుల్ని పాడుచెయ్యాలనే దుష్టచింతన నుంచి పెద్దలు విముక్తులు కావాలి. అప్పుడే వారు నిజమైన పెద్దలనిపించుకుంటారు. మనం తల్లిదండ్రులమో, భర్తలమో, గురువులమో అయినంత మాత్రాన మనం దేవుడి స్థానాన్ని ఆయన అనుమతి లేకుండా దురాక్రమించాలనే దుష్టసంకల్పాన్ని విసర్జించాలి. మన పిల్లలూ, మన భార్యలూ, శిష్యులూ మనల్ని దైవసమానంగా మన్నిస్తే మన్నించనివ్వండి ! వారి పవిత్రభావనకి తగ్గ ఫలితాన్ని వారు పొందుతారు. కానీ మనం మాత్రం దేవుళ్ళం కాదనే స్పృహతోను, తద్భిన్నంగా సాధారణ మానవులమేననే తెలివిడితోను మన తోటి మానవులందఱినీ ఆత్మవత్తుగా దర్శిస్తూ నిరాడంబర, అదాంభిక జీవితాన్ని గడుపుదాం.

10, మే 2010, సోమవారం

ప్రశ్నించే వారు అనేకులు ఉన్నారు - జవాబు ఇచ్చేవారేరి?

"నాకేమొస్తుంది? విద్య, ఉద్యోగం,భార్య,పిల్లలు చివరకు దేముడి వద్ద కూడా నాకేమొస్తుంది? ఇదే ప్రశ్న. మిగతా చోట ఏమో కానీ భగవంతుని విషయంలో మాత్రం నాకేమొస్తుంది? ఇది వస్తుందా? అయితే చేస్తాను" అని చేసేవారికి ఫలితం శూన్యం. కానీ గురువులు " పరమేశ్వరుడు మహా బోళా మనిషి. తెలిసి తలచినా, తెలియక తలచినా, ఏదైనా ఆశించి తలచినా, ఏమీ ఆశించక తలచినా పరుగున వచ్చేస్తాడు. అతని కరుణ అపారమైనది " అని చెబుతారు. ఇదే నేటి కాలంలో పెద్ద ప్రశ్న అయి కూర్చుంది. "ఏమిటీ!? నువ్విలా పిలిస్తే అలా వచ్చేస్తాడా? నీ పాపాలన్నీ కరిగించేస్తాడా? అడిగిన వన్నీ ఇచ్చేస్తాడా? ఏదీ ఓసారి పిలిచి చూపించు. నేనూ చూస్తాను నీ కష్టాలు ఎలా తీరతాయో... నా కెప్పటి నుండో ఓ అనుమానం. అసలు ఎవరైనా ఈ పని చేస్తే నాకేమిటి అని ఒకటికి పది సార్లు ఆలోచించి చేసే ఈ రోజులలో ముందూ వెనుకా ఆలోచించకుండా వచ్చేస్తాడా ఆ వెర్రి వెంకన్నా!? పోనీ దేముడు కదా వస్తే వస్తాడనుకుందాం. కానీ నీలో స్వార్థంతో ప్రార్థించినా వచ్చేస్తాడా? ఏదీ ఒక్క సారి చూపించు. నేనూ చూస్తాను అతను ఎలా ఉంటాడో.?"

సత్యాన్వేషణ అనే పేరుతో పలు వ్యక్తులు వేసే ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి? ఎటు నుండి చెప్పాలి? నేను ఒకటి చెప్పనా ? సత్యాన్వేషణ వేరు,రంధ్రాన్వేషణ వేరు. పై విధానం రంధ్రాన్వేషణ అవుతుంది కానీ సత్యాన్వేషణ కాదు. మేము చెప్పేది గొప్ప. మీరు పాటించేది శుద్ధ దండగ. మీరు వెర్రివాళ్లు కాబట్టి మా మాటలు విని ఆ భక్తి మార్గం వీడండి. అంటూ చెప్పేది రంధ్రాన్వేషణే అవుతుంది. అలా కాక జీవించడానికి పలు మార్గ్గాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఈ భక్తి అనేది ఒకటిగా కనిపిస్తోంది. కానీ నాకు అందులో నమ్మదగిన సత్యం గోచరించడం లేదు. అయినా అన్వేషిద్దాము. ఇందులో ఎంత సత్యం ఉందో. గురువులు ఏమి చెప్తున్నారు? శిష్యులు ఏమి పాటిస్తున్నారు. మనకు కనిపించే తేడా గురువుల వద్ద ఉన్నదా? శిష్యుల వద్ద ఉన్నదా? అసలు పూర్తిగా ఆ విధానం లోనే ఉన్నదా? లేదా నా దగ్గరే లోపం ఉన్నదా? ఇలా అన్ని వైపులా అన్వేషణ సాగిస్తే అది సత్యాన్వేషణ అవుతుంది.

మనిషి దేనికోసం జీవిస్తాడు? అతని అంతిమ ఆశయం ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? చిన్న పిల్లవాడికి చదవాలని, ఆటలాడాలని కోరిక. చదువు, తరువాత మంచి ఉద్యోగం సంపాదించాలని కోరిక. తరువాత భార్య, పిల్లలు ఇలా ఒకదాని తరువాత ఒకటి. ఇవన్నీ ఎందుకు? దేని కొసం ఈ కోరికలన్నీ కలుగుతున్నాయి ? దీనికి సమాధానం దొరకాలంటే ప్రశ్న మరోలా వేసుకోవాలి. ఈ కోరికలు తీరితే మనకు ఏమి కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. కానీ అది క్షణ కాలమే ఉంటుంది. మళ్లీ ఏదో కావాలంటుంది మనసు. మళ్లీ దానికోసం అన్వేషణ. అది లభిస్తే కొంత కాలం ఆనందం. ఇలా మళ్లీ మళ్లీ అడిగే మనసుకు అసలు ఏమికావాలి? నేను చెప్పనా? ఎప్పటికీ ఉండే ఆనందం కావాలి. మళ్లీ చెప్పాలంటే తృప్తి కలిగేంత ఆనందం కావాలి. దానికోసమే మనిషి పరుగు. అదే అతని అంతిమ మజిలీ. ఈ పరుగులో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అందరూ చివరికి చేరేది పరిపూర్ణ ఆనంద తీరానికే. కాకపోతే ఒకళ్లు ముందు, ఒకళ్లు వెనుక అంతే.

ఏదీ తెగేదాకా లాగకూడదు. కొత్త విషయం తెలుసుకోవాలనుకోవడం మంచిదే. కాని అన్ని విషయాలు నాకే తెలియాలనుకోవడం మొదటికే మోసం తెస్తుంది.

ఒకామె వంట బాగా చేసేది. కానీ కొంత కాలానికి ఆమెకి ఏ వంటచేసినా ఉప్పెక్కువో, కారమెక్కువో ఇలా ఏదో ఒక లోపంతో వంట చెడి పొతోంది. దానితోపదిమందీ వచ్చినప్పుడు ఆమె పరువు పోతోంది. పైగా పూర్వం బాగా వంట చేయగలదన్న పేరు. తీరా ఇప్పుడు గడ్డిలా ఉన్న వంట తిని ఏమంటారో. అన్న బెంగ ఎక్కువై పోయి చేతులు కాళ్లు వణికి పోతున్నాయి. తెలియని భయం ఆవరించి కళ్లు తిరిగి క్రింద పడిపోతోంది. దానితో ఆమె ఒక సైక్రియాటిస్ట్ ని కలిసింది. అతను అంతావిని ఓస్ ఇంతేనా మరేం ఫర్వాలేదు. మీరు వంట చేసే టప్పుడు మీకు ఇష్టమైన సంగీతంవింటూ వంట చేయండి. క్రమ క్రమంగా మీరు పూర్వం వలే వంట చేయగలుగుతారు. మీ వణుకు తగ్గుతుంది. అని ధైర్యం చెప్పి పంపించాడు. ఆమె ఇంటికి వెళ్లిఅలా వంట చేయడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న వాళ్ల్లు ఇది చూసి "ఇదేమి చోద్యమే!? అసలే పరధ్యానంతో వంటలు తగల బెడుతున్నావు. ఇప్పుడు పాటలు పెట్టుకుని వంటలు చేస్తే ఇక మేం తిన్నట్టే" అని ఒకళ్లు. "అయినా ఇలా ఎన్నాళ్ళు పాటలు వింటూ వంట చేస్తావు?" అని ఒకళ్లు, "ఎన్నాళ్లైనా ఇలా గడపాల్సిందేనా?" అని మరొకళ్లు. ప్రశ్నల మీద ప్రశ్నలు. అసలే ఆమె మనస్థితి బాగోలేదు. పైగా ఈ ప్రశ్నలతో ఆమెను రోజూ బుర్రతింటూ ఉండడంతో వంటలు బాగు కాలేదు సరికదా, ఆమెకు మరింత భయం పెరిగి పోయింది. ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వంట చేయాలంటే వచ్చే వణుకు ఇప్పుడు మామూలుగా రోజూ వంట చేయాలంటేనే వస్తోంది.

మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లిన ఆమె ద్వారా అంతా విన్న డాక్టరు "ఈసారి మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్లందర్నీ తీసుకురండి" అని చెప్పాడు. అలాగే తీసుకు వెళ్లింది. ఆమెను బయటకు పంపి వాళ్లందర్నీ కూర్చోబెట్టి " మీకు బుద్దుందా లేదా? అసలే మనస్థితి బాగోలేని ఆమెకు మీరు మరింత భయాన్ని కలిగిస్తారా? నేనా డాక్టరు మీరా? మీకంతా తెలిసినప్పుడు మరి నా దగ్గరకు రావడం దేనికి మీరే నయం చేయలేక పోయారా?" అని చివాట్లు పెట్టాడు. బిక్క మొహాలు వేసిన వారితో అనునయంగా అసలు విషయం చెప్పాడు. " ఆమెకు భర్త చనిపోవడంతో, బంధువులైన మీ మీద పిల్లలతో సహా ఆధారపడ వలసి రావడంతో ఆలోచనలు పెరిగిపోయాయి. "ఎలా బ్రతకడం? పిల్లలకు దిక్కేది?" అనే బెంగ మొదలైంది. ఆ బెంగలో నిద్ర కరువైంది. నిద్ర సరిగా లేకపోవడం వలన అనేక శారీరక మార్పులు సంభవించాయి. అలాగే పరధ్యానమూ అలవడింది. ఏ పనీ సవ్యంగా చేయలేకపోవడం, చిన్నసమస్యకే పెద్దగా క్రుంగి పోవడం, నిరాశ నిస్పృహలకు లోనవడం మొదలైంది. మనసులో గూడు కట్టుకున్న భయం వలన ఆమె మానసికంగా కృశించి పోయింది. అన్ని పనుల్లోను అంతో ఇంతో తేడాగా ప్రవర్తిస్తున్నా ఆమెకు ప్రధానంగా మీరు అప్పచెప్పిన వంట బాధ్యత వల్ల దానిలో తాను చేసే లోపాలే ఆమెకు పెనుభూతంలా కనిపించ సాగాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి ఆమెను ఇంతవరకూ తీసుకు వచ్చాయి. దీని కంతటికీ కారణం విపరీతమైన ఆలోచనలు . ముందు వాటిని మళ్లించ గలిగితే మనసు కాస్తకుదుట పడితే మళ్లీ మామూలు స్థితి వస్తుంది. అందుకే రాత్రి నిద్ర పట్టడానికి మందులు ఇస్తూనే ఆమెకు సంగీతమంటే ప్రాణమని తెలుసుకున్న నేను ఇష్టమైన పాటలు వింటూ వంట చేయమన్నాను. అలా కొంత వరకు ఆలోచనలు తగ్గుతాయి కనుక. కానీ మీరేం చేశారు. ఆమె మనసును మరింత కల్లోల పెట్టారు. దానితో మొదటికే మోసం వచ్చింది. ఇక్కడ ఒక విషయంలో మిమ్మల్ని అభినందించాలి. సొంత తల్లిని కూడా సరిగా చూసుకోవడం కరువైపోతున్న నేటి రోజులలో ఆమెకు చెల్లెళ్లైన మీరు ఇంత ప్రేమగా చూసుకోవడం, దానికి మీ భర్తలు కూడా అభ్యంతర పెట్టక పోవడం చాలా గొప్పవిషయం. ఇకనైనా పరిస్థితి అర్థం చేసుకుని ఆమెకు అనుగుణంగా నడుచుకోండి, చేతనైతే ఆమెలో ధైర్యాన్ని పెంచే మాటలు మాట్లాడండి. త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది అని చెప్పి పంపించాడు. ఇక ఆతరువాత
ఎప్పుడూ ఆమె అటువంటి భయంతో డాక్టరు వద్దకు రాలేదు.

అలాగే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే పెను మానసిక రోగాలను క్రమ క్రమంగా తొలగించి, మన జీవితాలను పరిపూర్ణ ఆనందం వైపు పయనింపచేయడానికి భారతీయ గురువులు శ్రమించి ఓ జీవన విధానమును ఏర్పరచారు. మనకు ప్రసాదించారు. కానీ మానవుడు స్వార్థమునకు లొంగి దానిని కూడా పూర్తిగా పాటించక తనకు అనుకూలముగ ఉన్నంత వరకు పాటించి, కష్ట తరముగ ఉన్నదానినిపాటింపక, తనను పరులు తప్పు పట్టు లోపల తానే ఇతరుల నడవడికను ప్రశ్నించి, మభ్యపెట్టి వారిచేత కూడ తన మార్గమును శహభాష్ అనిపించుకొని, తానేదో క్రొత్త మార్గమును కనుగొన్నా ననుకొని తాను భ్రమిస్తూ, ఇతరులను భ్రమింపచేస్తూ బ్రతుకుతున్నాడు. అదే భారతీయత అనుకొంటున్నాడు. మరోవైపు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రపంచీకరణ పుణ్యమా అని దేశాల మధ్య దూరం తరిగి అనేక అలవాట్లకు లోనై కన్నతల్లినే విమర్శించే వారు కొందరు తయారవుతున్నారు. ఈ విమర్శలు కొంత వరకూ మంచివే. మొదటి రకం వాడు తన తప్పులను సరిదిద్దుకోవడానికి పనికి వస్తాయి. అలా దిద్దుకున్న వాళ్లు అనేకులు ఉన్నారు. అలాగే కాలానుగుణంగా కూడా కొన్నిమార్పులు అవసరం. ఆ కోవలోనే సతీసహగమన నిషేధం, బహుభార్యాత్వ నిషేధం మొదలైన సంఘసంస్కరణలు జరిగాయి. మంచీ చెడూ సమానంగా ఉన్న నేటి సమాజంలో పుట్టిన మనం మనలనుసరిదిద్దుకోవడానికి చాలా దోహద పడుతున్నాయి. మన భారతీయ విలువల గొప్పతనాన్ని మరింత తెలుసుకునేలా చేస్తున్నాయి. కానీ ఈ మార్పును చూసి "నేనేదో గొప్ప ఘన కార్యం చేశాను, నేనలా ప్రశ్నించడం వల్లే ఈ సమాజంలొ పెనుమార్పులు సంభవించాయి" అని అత్యుత్సాహంతో మరింత లోతుకు వెళ్లి భారతీయమూలాలనే తూలనాడే స్వభావం హర్షించదగినది కాదు.

మితిమీరిన కామంలో పడి గిలగిల లాడుతున్న మనకు సత్యం ఎక్కడ కనిపిస్తుంది? అందుకే ఆ పై కథలోని ఆ బంధువుల వలే ప్రశ్నిస్తాం. "ఏమిటీ మనిషి మనో రోగాలను పోగొట్టి మంచి మార్గంలో పయనింప చేయడానికి ఈ జీవన విధానం రూపొందించ బడినదా? అంటే పుట్టుకతోనే మనకి అనేక మనోవైకల్యాలున్నాయా? వాటి కోసం మనం బ్రతికినంత కాలం ఈ తలా తోకా తెలియని దారిలో నడవాలా? "

ఇవే కదా మీ మనసులో ఇంకా మిగిలి ఉన్న ప్రశ్నలు. ప్రతీ రోజూ అన్నం తింటాం. ఎన్ని సార్లు తిన్న అన్నం మళ్లీ తింటాం ? ఎందుకని ? మనకు శక్తి లేదనా? కాదు కదా? శక్తి నశించకూడదని తింటాం. అలాగే మన జీవన విధానమూ ఓ క్రమ పద్ధతిలో మనలోని ఆనందాన్ని ఇనుమడింపచేసి శాశ్వత ఆనందం వైపు పరుగు పెట్టిస్తుంది. దీనిని పాటించే వారిలో తప్పులున్నాయేమో గానీ. పూర్తిగా ఈ విధానంలోనే తప్పులున్నాయనడం అసమంజసం.

ఏమిటి మరి ఈ జీవన విధానం?

నీలోకి చూడడం అంటే నిన్ను చూడడమే. నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు లోకాన్ని తెలుసుకుంటావు. లోకాన్ని ప్రశ్నించే ముందు నిన్ను నువ్వుప్రశ్నించుకో! నేనెవరు? నాకు కావలసినదేమిటి? నా పుట్టుకకు మూలం ఏమిటి? దాని పరమార్థం ఏమిటి? అని ఎప్పుడైనా ప్రశ్నించావా? సంతృప్తికర సమాధానం రాబట్టావా? అన్వేషణ సాగించావా? సమాజాన్ని చదవడం నీకు తెలుసేమో ? నిన్ను చదవడం తెలుసా? అదే పరా విద్య. అది తెలిసిన నాడు మృత్యువును జయిస్తావు. చావుకు తెగిస్తావు. తోటి ప్రాణిలో నీ రూపు చూస్తావు. తన కష్టం నీ కష్టంగా తపిస్తావు. నీ మాటలో చూపులో చర్యలో ప్రతి చర్యలో అణువణువులో అమృతం ఒలికిస్తావు. ఆ రహస్యం తెలియాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు నువ్వు వరుసగా స్వీకరించ వలసినదే! కాదని కోరికలతో రగిలి ప్రక్కదారి పట్టారా..? అన్నీ ఉన్నా ఆనందం మీకు కరువే! పోనీ ఇవేమీ వద్దని సరాసరి సన్యాసానికే వచ్చేశారా..? నిత్యానందుని గతి ఏమయిందో మీకు తెలుసుగా? ఏదైనా ఓ క్రమ పద్ధతిలో సాగాలి.

కాళిదాసు రఘువంశ రాజుల జీవనం గురించి ఈ విధంగా చెప్తాడు.

త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం|
యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం||

యోగ్యత కలవారికి దాన మిచ్చుటకే ధనమార్జించు వారును, నిజము పలుకుటకై మితముగా మాట్లాడు వారును, కీర్తి కొరకే విజయము పొంద గోరువారును, సంతానము కొరకే వివాహమాడు వారును...

శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం|
వార్థకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం||

బాల్యము నందు విద్యలు నేర్చు వారును, యవ్వనమున విషయా సక్తులును, వార్థక్యమున మౌనమును పాఠించుచూ సంపదలను అన్నిటినీ త్యజించి వానప్రస్థ జీవనము సాగించు వారును, అవసాన కాలమున సంకల్ప మాత్రము చేత యోగ మార్గమున శరీరమును త్యజించు వారును.... ( అయిన రఘువంశ కథను చెప్పబోవు చున్నాను )

ఈ గుణములు మనకు ఆదర్శములు.

ప్రశ్నించే వారు అనేకులు ఉన్నారు - జవాబు ఇచ్చేవారేరి? జనులు పరిపరివిధ వాదములతో నిస్తేజు లవుతున్నారు. ప్రేమ స్వరూపులైన సద్గురువులు తమ అమృతవాక్కులతో శాంత పరిచెదరు గాక ! సులభప్రసన్ను లగుదురు గాక!

[ రాజశేఖరుని విజయ శర్మ}

25, ఏప్రిల్ 2010, ఆదివారం

ఎట్టకేలకు అసలు విషయానికొస్తున్న పాశ్చాత్యులు

మనకు ఇంగ్లీషువారు (ఇంగ్లీషు క్రైస్తవులు) చేసిపోయిన అతిఘోర అన్యాయాల్లో ఒకటి - మన చరిత్ర యొక్క ప్రాచీనతని బాగా తగ్గించి చూపి దాన్ని ఇటీవలిదిగా ప్రచారం చేయడమేనని అందఱికీ తెలుసు. ఆ క్రమంలో వేదాలు క్రీ.పూ. 1500 నాటివిగా ప్రచారమయ్యాయి. రామాయణమేమో క్రీ.పూ. 1000 కి కాస్త అటూ ఇటూగా జఱిగుంటుంది అనేశారు. అలాగే భారతీయ రాజవంశాల అనుక్రమమంతా మార్చేశారు. తేదీలన్నీ తలకిందులు చేశారు. మొత్తమ్మీద మన చరిత్ర మనకే కొఱుకుడు పడకుండా అస్తవ్యస్తం, అకటావికటం చేసి పోయారు.

నలభయ్యేళ్ళ క్రితం బ్రహ్మశ్రీ కోట వెంకటాచలం గారనే మహానుభావుడు విజయవాడలో నివసించేవాడు. ఆయన ఆ రోజుల్లో "కలిశక విజ్ఞానము" అనే పేరుతో అనేక చరిత్రసంపుటాలని వెలువఱించారు. వాటిల్లో కొన్ని నేను చిన్నప్పుడు చదివాను. బ్రిటీషువారు ఏయే కారణాల చేత, ఏయే పద్ధతులలో భారతీయుల చరిత్రని వక్రీకరించారో అందులో ఆయన సప్రమాణంగా నిరూపించారు. "ఈ వక్రీకరణ చాలావఱకు ఉద్దేశపూర్వకం కాగా కొంతవఱకు దుర్‌భ్రమల వల్ల కూడా జఱిగింది" అని ఆయన వ్రాసినదాన్ని బట్టి తెలుస్తోంది. ఉదాహరణకి - ఇంగ్లీషువాళ్ళు మన చరిత్రతేదీలన్నీ మార్చిపారేయడానికి గల ఒక ప్రధాన కారణం - ఇండియాని పరిపాలించిన ప్రాచీన పారశీక రాజులలో ఇద్దఱు సైరస్‌లు ఉన్నారు. ఆ యిద్దఱినీ ఒక్కఱే అనుకొని భ్రమించి మొదటి సైరస్ యొక్క సమకాలీన సంఘటనల తేదీలన్నీ రెండో సైరస్ యొక్క తేదీకి అనుగుణంగా మార్చేశారట. ఇలాంటి వందలాది చారిత్రిక సూక్ష్మాల్ని గాలించి పట్టుకొన్న మహామేధావి కోట వెంకటాచలం గారు చివఱి రోజుల్లో సన్న్యాసాశ్రమ స్వీకారం చేసి పరమపదించారు. ఆయన పుస్తకాలు ఇప్పుడు ఎక్కడున్నాయో నాకు తెలియదు. వాటిని ఎవఱైనా పునర్ముద్రించి, ఇంకా ఇంగ్లీషు, హిందీ, శ్పానిష్, పోర్చుగీస్, చైనీస్, జపనీస్, అరబిక్ భాషలలోకి కూడా తర్జుమా చేసి వ్యాపింపజేస్తే బావుణ్ణు. "కోట వెంకటాచలం గారి పుస్తకాలే నిజమైన భారతదేశ చరిత్ర" అని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు స్వయంగా వాక్రుచ్చిన సంగతిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సి ఉంది.

కానీ ఇవేవీ తెలియక పోయినా పాశ్చాత్య చరిత్రకార ప్రపంచంలో కూడా ఇంగ్లీషువారి చరిత్రకల్పనలపై ఇటీవల పునరాలోచన బయలుదేఱింది. ఈ పునరాలోచనకు కొన్ని కారణాలున్నాయి.

౧. ఇటీవల కనుగొన్న సరస్వతీనది యొక్క అంతర్ధానకాలం - వేదకాలంగా బ్రిటీషు చరిత్రకారులు చెప్పిన క్రీ,.పూ. 1500 కంటే చాలాముందు (సుమారు క్రీ.పూ.2000 - అంటే 4 వేల సంవత్సరాల క్రితం) జఱిగినట్లు భూగర్భశాస్త్ర పరిశోధనల ద్వారా తేలడం. వేదాల్లో సరస్వతీనదిని వర్ణించినట్లుగా గంగానదిని వర్ణించడం జఱగలేదు. అదీగాక తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన బలరాముడు "సరస్వతీనది ఇదివఱకటిమల్లే నిరంతరాయంగా ప్రవహించడంలేదనీ, ఈమధ్యఅప్పుడప్పుడు ఎండిపోతోం"దనీ శ్రీకృష్ణుడితో చెప్పిన మహాభారతఘట్టం. అంటే సరస్వతీనది ఎండిపోవడం మహాభారత కాలం (క్రీ.పూ.3000) లో మొదలై అటుపిమ్మట వెయ్యేళ్ళకి పూర్తిగా ఎండిపోయిందని తెలుస్తోంది. సరస్వతీనది ఎండిపోవడమూ, దాని పరీవాహక ప్రాంతాల్లో వెలసిన సింధునాగరికత కుప్పకూలడమూ ఒకేసారి జఱిగినట్లు కనిపిస్తున్నందువల్ల సింధునాగరికత కూడా అప్పటి (మహాభారతకాలంనాటి) వైదిక నాగరికత కంటే భిన్నమైనదని బ్రిటీషు చరిత్రకారులు ఊహించినది వాస్తవం కాదేమోననే అనుమానాలు పాశ్చాత్య ప్రపంచంలో రేకెత్తుతున్నాయి.

౨. యూదుల ప్రాచీనత : ఓల్డు టెస్టమెంట్ ఆధారంగా యూదులు నాలుగువేల సంవత్సరాల నాటి జాతి. వారు మొదట్లో బ్రాహ్మణులని కొందఱు పాశ్చాత్యులు అభిప్రాయపడుతూండగా, బ్రాహ్మణులే యూదుల సంతానమని ఇంకొంతమంది పాశ్చాత్యులు వాదిస్తున్నారు. యూదుల ఆత్మగౌరవ భావన పెచ్చుమీఱిన ఈ రోజుల్లో వారు తమ జాతి ఔన్నత్యం కోసం తమకంటే ఎక్కువ ప్రాచీనత కలిగిన బ్రాహ్మణులతో తమకు ఎక్కడో, ఏ కాలంలోనో బాదరాయణ సంబంధం ఉన్నదని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారనేది స్పష్టం. ఈ తాపత్రయం వల్ల వారు భారతీయ గ్రంథాల అధ్యయనాన్ని ముమ్మరం చేసి బ్రిటీషు చరిత్రకారుల లొసుగులన్నీ బయటపెడుతూండడం మనకు కలిసొస్తున్న అంశం.

౩. గ్రీసులో బయటపడ్డ బుద్ధవిగ్రహం : బ్రిటీషు చరిత్రకారుల ననుసరించి బుద్ధుడు క్రీ.పూ.500 నాటివాడు. మనకు భారతదేశ పాఠశాలల్లో కూడా అలా అనే నేర్పుతున్నారు. కానీ పదేళ్ళ క్రితం గ్రీసులో బయటపడ్డ బుద్ధవిగ్రహాన్ని కార్బన్-14 టెస్ట్ చేయగా అది క్రీ.పూ.1,800 నాటిదని తేలింది. 2,500 ఏళ్ళనాటి బౌద్ధం అనే మాట దూదిపింజలా తేలిపోవడంతో ఇప్పుడు పాశ్చాత్యులు కిం కర్తవ్యం ? అని తలలు పట్టుకుంటున్నారు.

అందుచేత ఇప్పుడు అనేక మంది పాశ్చాత్య రచయితలూ, వెబ్‌సైట్లవారూ కూడా మనసు మార్చుకొని హిందూమతాన్ని కనీసం 5000 సంవత్సరాల నాటి ప్రపంచపు అత్యంత ప్రాచీనతమ ధర్మం (The oldest religion of the world) అని పేర్కొనడానికి సంశయించడం లేదు. ఉదాహరణకి - ఈ క్రింది లంకెలోకి వెళ్ళి అక్కడి యానిమేషన్ పిక్చర్ చూడండి.

http://mapsofwar.com/images/Religion.swf

ఏదేమైనా నిజం నిప్పులాంటిది. కదూ ?

8, జనవరి 2010, శుక్రవారం

నువ్వసలు మనిషివేనా ?-1

ఆనందస్వరూపులకు నమస్కారములు.

"హే తథాగతా ! పునర్జన్మ ఎత్తేది మనస్సా ? ఆత్మా ?" అని అడిగాడొకసారి ఆనందుడనే శిష్యుడు బుద్ధభగవానుల్ని.

అప్పుడు బుద్ధభగవానులు చిఱునవ్వుతో "నాయనా ! ఆత్మ జన్మలెత్తదు" అని మౌనం వహించారు.

ఆనందుడి సంశయం తీఱలేదు. మళ్ళీ అడిగాడు "అయితే మఱి జన్మలెత్తేది ఎవరు స్వామీ ? మనస్సా ?"

"మనస్సు జన్మలెత్తదు."

"మఱి మనస్సూ కాక, ఆత్మా కాక ఇహ జన్మలెత్తేది ఎవరు స్వామీ ?" ఆనందుడి అయోమయం ముమ్మరమైంది.

"కర్మ. అదే జన్మలెత్తుతుంది." తథాగతులు ఒక్క వాక్యంలో తెలియజేశారు.

శ్రీ బుద్ధ భగవానులు హిందువుగా జన్మించారు. హిందువుగానే నిర్వాణం పొందారు. తానొక కొత్తమతం స్థాపిస్తున్నట్లు ఆయన చెప్పుకోలేదు. ఆయన నిర్వాణం చెందిన వందేళ్ళకి బౌద్ధ ’మతం’ అనేదొకటి పుట్టింది. కనుక ఆయన వాక్యాలు బౌద్ధులకెంత ప్రమాణమో హిందువులకూ అంతే ప్రమాణం. అందుచేత ఆయన వచనాల్లో మనకి కావాల్సిన సందేశం కూడా ఇమిడి ఉంది.

మనుషులు తమని తాము మేదో-మజ్జా‍స్థి సంయుక్తమైన రక్తమాంస దేహాలుగాను, ఒకఱి సంతానంగాను, మఱొకటిగాను, మఱొకటిగాను భావించుకోవడం కేవలం అజ్ఞానపూర్వకమని శ్రీ తథాగతులవారి వచనాలు సూచిస్తున్నాయి. మానవుడి పూర్వకర్మ తనకనుగుణమైన జన్మని, దేహాన్ని తానే రూపొందించుకుంటుంది. ఆ జన్మనీ దేహాన్ని తనకివ్వగల తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ అది ప్రయాణిస్తుంది. పూర్వకర్మఫలాన్ని అనుభవించడానికి అనువైన దేశకాలాల్ని అది నిర్ణయించుకుంటుంది. కనుక జీవులుగా, మానవులుగా, దేహాలుగా మనకి ఈ ఇహలోకంలో గోచరిస్తున్నటువంటివన్నీ వాస్తవానికి వివిధ పూర్వీకుల యొక్క కర్మలే.

"కర్మలకి అంత శక్తి ఉందా ? కర్మలకి మేధ ఉందా ?" అని ఎవఱైనా ఆశ్చర్యానికి లోను కావచ్చు. మన హిందూ సంప్రదాయంలో చైతన్యరహితమైనదంటూ ఏదీ లేదు. అంతా చైతన్యమే. అంత చిన్మయమే. భగవంతుడి కాలు కడిగిన జలం గంగ అయింది. భగవంతుడి మనస్సే జగదంబ అని చెప్పబడుతున్నది. ఆయన ఆయుధాలే అన్నమాచార్యుడివంటి భక్తులుగా భూలోకంలో అవతరించాయి. ఆయన జటాజూటమే వీరభద్రుడయింది. అందుచేత చరిత్రలో ఎప్పుడో ఎక్కడో పుట్టి పెఱిగి చనిపోయిన ఏ అజ్ఞాత/ అనామక మానవుడి మనోమయ సంకల్పాలో ఇప్పుడు ఇక్కడ మనముందు ఇంకో మానవుడి రూపాన్ని ధరించి పునర్జీవించి కనిపిస్తున్నాయంటే అందులో ఆశ్చర్యమూ, అతిశయోక్తీ లేవు. పూర్వగ్రంథాల్లో కృత్య అనేదాని గుఱించి ప్రస్తావించబడింది. కృత్య అంటే ఒక శక్తిమంతమైన కృత్రిమ వ్యక్తి. ఎవఱినైనా చంపాలనుకున్నప్పుడు యాజకులు మంత్రపూర్వకంగా హోమకుండంలో నుంచి దాన్ని ఉత్పాదన చేస్తారు. అది రాక్షసుల వలె చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. తనని పుట్టించిన యాజకులు నియమించిన పని (కృత్యం) చెయ్యడమే దాని పని కనుక దానికి కృత్య అని పేరు. సంకల్పసహితమైన మన కర్మలు కూడా అలాంటి కృత్యలే. ఎటొచ్చీ అవి అమంత్రకంగా మన మనస్సులనే హోమకుండాల్లోంచి జనించిన సంకల్ప రాక్షసులు. తెలిసో తెలియకో వాటికి మనం అప్పగించిన పనికి అవి నెఱవేర్చకుండా మానవు. ఈ రోజు కాకపోతే వచ్చే జన్మలో !

మనం మనుషులం కాము. మనం మన పూర్వజన్మల్లోని సంకల్పాలం. ఆ సంకల్పాలు కర్మానుభవం కోసం ధరించిన రక్తమాంసాలం. ఆ సంకల్పాలు నెఱవేఱాక ఈ రక్తమాంసాలు అంతరించిపోతాయి. పుడుతూనే ప్రతి మనిషికీ దేవుడు ఒక అవతారకార్యాన్ని (life mission) ని అప్పగిస్తాడు. ఆ అవతారకార్యం చిన్నదీ కావచ్చు, పెద్దదీ కావచ్చు. మునిసిపల్ ఆఫీసులో అటెండరుగా ఉండడం ఒకడి అవతారకార్యమైతే, ముఖ్యమంత్రిగా ఉండడం ఇంకొకడి అవతారకార్యం కావచ్చు. కానీ అవన్నీ సమానంగా దైవాదేశాలే. అందుచేత అవన్నీ సమానంగా గౌరవాస్పదాలే. అలాగే ఒక జాతి యావత్తు ఒక నాయకుడి కోసం తపించిప్పుడు వారందఱి సంకల్పాల ఫలితంగా కృత్యలా జన్మిస్తాడతడు.

మిత్రమా ! నీవు మనిషివి కావు. నీవొక పూర్వకర్మవి. నీవొక సంకల్పానివి. నీవొక అవతారకార్యానివి. నీవు దైవాదేశాల్ని పాటించవు. నీవే స్వయంగా ఒక దైవాదేశమై ఉన్నావు. అదే నీ వ్యక్తిత్వం.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి