8, జులై 2013, సోమవారం
తిథి నిర్ణయంలో సందేహం--సమాధానం
30, సెప్టెంబర్ 2011, శుక్రవారం
ఇతరమతాల నుంచి, మతస్థుల నుంచి హిందువులం ఏమేం నేర్చుకోవచ్చు ?
ఆర్యులారా !
హిందువులమైన మనం మన ధర్మాన్ని మన వఱకూ ఆచరించడంతో సంతృప్తి చెందుతూంటాం.అందువల్ల ఇతరులకి (కనీసం మన ధర్మంలోనే కొనసాగుతూ ఉన్న నిమ్నజాతులవారికి) ఈ ధర్మనిగూఢాల్ని బోధపఱిచే ప్రయత్నం మనమెప్పుడూ చేయలేదు. నిజానికి ఈధర్మం పురోహితుల చేతుల్లో బందీగా మారింది. ఇలాంటి సామాజిక, మానసిక కారణాల్ని పురస్కరించుకొని ఈ ధర్మం గతకొన్ని దశాబ్దాలుగా దెబ్బదినిపోతోంది. మన ఇంట్లో సాక్షాత్తూ అమృతమే ఉన్నప్పటికీ దాన్తో మనం నిమ్నజాతీయుల హృదయ, ఆత్మిక ఆకలిని మనం తీర్చలేకపోవడంతో వారు బయటికెళ్ళి పరధర్మపు చలివేంద్రాల్లో మంచినీళ్ళు తాగుతున్నారు. తాగి అది అమృతంలా ఉందని చెబుతున్నారు.
మనం పరధర్మీయుల చేతుల్లో ఎక్కడ వ్యూహాత్మక ఓటమిని పొందుతున్నాం ? హైందవం ఇవ్వజూపని ఏ వెసులుబాట్లని, feel good factors ని పరధర్మం ఇవ్వజూపగలుగుతోంది ? ధన/ ద్రవ్య ప్రలోభాలు కూడా ఉన్నాయని మనకి ఇదివఱకే తెలుసు. అవి కాకుండా ఇంకా ఏయే అంశాలున్నాయి ? వారి నుంచి మనం ఏమేం నేర్చుకొని వారిలాగే మన మతాన్ని కూడా అంతర్జాతీయ మతంగా మార్చగలుగుతాం ? ఎప్పటిలా పరమతాల్ని ద్వేషభావనతో చూడకుండా, కాస్త తెఱుపుడు మనస్సు (open mind) తో మన మతస్వార్థం కోసమే, వారిలోని మంచిని కాసేపు పరిశీలించి వెలికి తీద్దాం. కాసేపు పక్కా వాస్తవవాదులం అవుదాం. ఆత్మకరుణ (self-pity) లేని కఠిన కర్కశ తార్కికులమవుదాం. ఆత్మవిమర్శకులమవుదాం. ఈ మార్గంలో మీ మీ చింతనాధారని ఇక్కడ పంచుకోగలరని ప్రార్థన.
అందుకు ఇతర సభ్యుల సమాధానాలు :
ఒక సభ్యుడు : 1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.కిరస్తానీలు, ముస్లింలు ప్రతీ వారం చర్చిలకు మసీదులకు గుంపులుగా వెళతారు.. మనలోఎంతమంది గుడికి వెళ్ళేటప్పుడు కనీసం మన ఇంట్లో వాళ్ళను తీసుకుని వెళతాం ?? అలా గుంపుగా వెళ్ళడం వల్ల వాళ్ళ మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది.. ప్రతీ ఒక్కరికీ తమకంటూ ఎవరో ఉన్నారు అనే భావన, ఆ ఉన్న వాళ్ళు కేవలం తమ మతం వల్ల మాత్రమే ఉన్నారు అనిపిస్తుంది.. సంఘజీవి అయిన మనిషికి ఇది సహజంగానే మానసికధైర్యాన్ని ఇస్తుంది.
2. వాళ్ళనుంచీ నేర్చుకోవాల్సింది వాళ్ళ మతం పట్ల వాళ్ళకున్న అంకిత భావం.. ఒక ముస్లిం కు ఎన్ని పనులున్నా వాడు నమాజ్ చేయకుండా బయటికి కదలడు.. మనం మాత్రం ఏదైనా పని తగిలితే మొదట మానేసేది మన పూజా కార్యక్రమాలనే.. వాళ్ళు ఎప్పుడూ నమాజ్ చేయడం గురించి లేదా చర్చికి వెళ్ళడం గురించి సిగ్గు పడరు.. మనకేమో గుడికివెల్తున్నామంటే, ధ్యానం చేస్తున్నామంటే అదొక నామోషీగా భావిస్తాం.
3. ముస్లింలు, కిరస్తానీలు సొంతంగా వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్నారు. మనవాళ్ళు ఉద్యోగాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఎంత చిన్నదైనా సరే సొంతంగా చేసే వ్యాపారం సమాజం లో ఎంతో కొంత పరపతిని పెంచుతుంది.. ఎందుకంటేవ్యాపారం చేస్తున్న వాడి దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వచ్చి పార్టీ చందా అడుగుతాడు, లేబర్ యూనియన్ల వాళ్ళు వచ్చి చందాలడుగుతారు.. మనం కూడా entrepreneurs గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉదా:- కర్నూల్ పుల్లా రెడ్డి గారు పక్కా హిందుత్వవాది కానీ ఆయన్ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేకపోయింది.. ఎందుకంటే సమాజం లో ఆయన విలువ అలాంటిది.. అదే ఇంకెవరైనా అయ్యుంటే మన కమ్యూనిష్టులు, సెక్యులరిస్టులు, మట్టిస్టులు, మశానిస్టులు ఎప్పుడు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు.
మఱో సభ్యుడు : నాకున్న కొద్దిపాటి అనుభవంతో నా అభిప్రాయాలు కొన్ని పంచుకుంటాను.
1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.
నాకు ఇది సెకండరీ అని అనిపిస్తుంది. వాళ్ళు మతం మారడానికి ముఖ్యకారణం డబ్బే. వాళ్ళు ఒక సారి మారిన తర్వాత ప్రతి ఆదివారం ప్రార్థనామందిరానికి రావాలనీ, వాళ్ళ సామూహిక ప్రార్ధనలలో పాల్గోవాలనీ వారిని బలవంత పెడుతుంటారు. పేదరికం కారణంగా ముందు మతం మారినా, తర్వాత ఇష్టం లేకున్నా వారు తప్పనిసరిగా ఆ మత నియమాలను పాటించాల్సిందే. అలాగే ఎవరైనా కొత్తవారిని వారి మతంలోకి తీసుకువస్తే అలా తీసుకు వచ్చిన వారికి కొంత డబ్బు ఇస్తారు.
వినాయక చవితి నాడు మాత్రం మన వాళ్ళు పూజ అయ్యాక సినిమా పాటలు పెడతారు. అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న పిల్లలు కేరమ్స్ ఆడుకుంటూ కనిపించారు. పెద్దవాళ్ళంతా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు వాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు పెట్టుకున్నారు. ఈ పరిస్థితి మారాలి. మనమంతా తప్పని సరిగా దేవతా స్త్రొత్రాలనో, ఆధ్యాత్మిక ప్రసంగాలనో, పూజ్యుల ప్రవచనాలనో ఇలాంటి సంధర్భాలలో పెట్టేటట్లుగా చూడాలి. వీలైతే మనమే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మన ఇరుగుపొరుగులో ఉన్న చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, మన మత గొప్పతనాన్ని వివరించాలి మన ఆచార వ్యవహారాల ప్రాముఖ్యత అందరికీ తెలియజెప్పాలి. వారితో కలిసి కనీసం వారానికి ఒక సారైనా ఇంట్లో కూర్చొని పూజ చేయడం గానీ, దేవాలయానికి వెళ్ళడం కానీ చేయాలి చేయాలి.
వినతి చేసిన సభ్యుడు : నా దృష్టికొచ్చిన ఒకటి-రెండు అంశాలు వ్రాస్తాను.
౧. వారి మతబోధ క్లిష్టమైన వేదాంత సమస్యల చుట్టూ, లోతైన అంతరార్థాల చుట్టూ కాకుండా నిత్యజీవితానికి పనికొచ్చే బైబిలుబోధల చుట్టూ పరిభ్రమిస్తుంది. మనదేమో పక్కా intellectual religion అయికూర్చుంది. ఆ వ్యాఖ్యానాలూ, వివరణలూ కొద్దిమంది వయసుమళ్ళిన ఛాందస మేధావులకి ఆత్మానంద దాయకం. కానీ వినలేకా, అర్థం చేసుకోలేకా మిహతా సామాన్యజనం విసిగున్నారు.
౨. వారి మతబోధలో పరమత దూషణ, పరధర్మీయుల్ని పరాభవించడం, అపహాస్యం చేయడం, హీనంగా మాట్లాడడం కూడా ఉంటాయి. ఈ పనులు మన మతబోధకులు కలలో కూడా చేయరు.
౩. వారి మతగ్రంథాలూ, పాటలూ, స్తోత్రాలూ, మంత్రాలూ (అవి మంత్రాలని మనం అనుకుంటే) జనసామాన్య భాషలోనే ఉంటాయి. అందఱికీ అర్థమయ్యేలా ఉంటుంది యావత్తు మతనిర్వహణ. మనదంతా నిగూఢం. అయోమయం, రహస్యం. ఎంత అర్థం కాకపోతే అంత గొప్ప. చివఱికి ఈ అర్థం కానితనమే మనలో ఒక సంస్కృతిగా పరిణమించింది.
౪. వారిలో - ప్రార్థనామందిరాలకొచ్చే భక్తుల ఆర్థిక సమస్యల్ని కూడా మతగురువులు పట్టించుకుంటారు. ఉదాహరణకి - పేద భక్తుల కోసం హోల్‌సేల్ వ్యాపారులతో ఒక ఒప్పందానికొచ్చి తక్కువధరలకి కిరాణా సరుకుల వేలాన్ని ప్రార్థనామందిరంలోనే నెలకోసారి నిర్వహిస్తారు. మన విషయానికొస్తే, భక్తుల దగ్గఱ ఎంత గుంజుకుందామా ? అనేదే మన కాన్సంట్రేషను.ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. గుర్తుకొచ్చినప్పుడు వ్రాస్తాను.
మొత్తమ్మీద మన మతాన్ని ఒక అంతర్జాతీయ మతంగా, దేశదేశాల ఫెయిత్‌గా ఎలా రూపుదిద్దాలా ? అనేదే నా అంతర్మథనం. అలా చేయాలంటే మనం కొన్ని ఛాందసాల్ని వదిలిపెట్టాలనుకుంటాను. ఈ మతాన్ని ఈ దేశంలో పాటిస్తున్నట్లే యథాతథంగా అన్ని ఇతరదేశాల్లోనూ పాటించడం కుదరకపోవచ్చు. కనుక దీన్ని సాధ్యమైనంత అసంస్కృతీకరించి, సరళీకరించి ప్రచారం చేయాల్సి ఉంది. వాళ్ళ అవగాహన కోసం మన వివరణా, వ్యాఖ్యాన పద్ధతుల్ని కాస్త మార్చాలి. పురాణమతాన్ని చాలావఱకు గోప్యం చేయాలి.
వేఱొక సభ్యుడు :-
౧. మత ప్రచారానికి కావాల్సిన మానవ వనరులు సంపాదించుట.ఇది వారు చేసే మొదటి పని. అందుకే పేదలు, అనాథలు అంటూ కొన్ని తరాల పాటు మతానికి కావాల్సిన మానవ వనరులను సంపాదిస్తారు. తరువాత ముసుగులన్నీ తొలగించి పూర్తి మతాంతరీకరణ వైపు జరుపుతారు. ఇలా చేయటం కోసం అప్పటికే ఉన్న మానవీయ కేంద్రాలను నాశనం చేయటం, నేరుగానో, తిరగగానో. అందుచేత ఆర్థికంగా బలంగా ఉండటం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.
౨. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం వాడకపోవటం. ఉదాహరణకు జర్మనులు ఒక రకంగా మతాంతరీకరించబడ్డారు, రోమన్లు ఒక రకంగా, ఆఫ్రికన్లు ఒక రకంగా, రెడ్ ఇండియన్లు ఒక రకంగా, దక్షిణ అమెరికన్లు ఒక రకంగా, గోవా వారు ఒక రకంగా, కేరళ వారు ఒక రకంగా.
౩. ప్రణాళికాబద్దంగా పోవటం.
౪. ఓపిగ్గా దశాబ్దాలు, శతాబ్దాలు ప్రయత్నించటం.
౫. కేంద్రీకరించబడ్డ వ్యవస్థ ఉండటం.
ఇంకో సందర్భంలో ఇంకో సభ్యుడు చెప్పినది :
హైందవేతర ప్రార్థనాస్థలాల్లో రాజకీయాలూ, సామాజికాలూ మాట్లాడ్డం నిషిద్ధం కాదు. అసలుదేవుణ్ణొదిలేసి అవే ఎక్కువగా చర్చిస్తూంటారక్కడ. కానీ హిందూ దేవాలయాల్లో అవి మాట్లాడ్డం నిషిద్ధంగా భావిస్తారు. మనం అవి మాట్లాడబోతే అవన్నీ ఇక్కడొద్దని తోటిహిందువులే మనల్ని వారిస్తారు. నిరుత్సాహపఱుస్తారు. క్రైస్తవంలా, ఇస్లాములా హిందూమతం మతస్థుల సమైక్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న political, strategic creed కాదు. ఇది వ్యక్తియొక్క వైయక్తిక ఆధ్యాత్మిక సాధన, మోక్షం గుఱించి ఎక్కువ emphasis (వక్కాణింపు) చేసే మతం. అందువల్ల హిందువులు గుమిగూడే చోట్ల కూడా తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల గుఱించి వారిని చైతన్యపఱచడం ఇసుమంతైనా సాధ్యం కావట్లేదు. కనీసం Endowments శాఖ కింద లేనటువంటి ప్రైవేటుగుళ్ళల్లోనైనా మన వాళ్ళకి సమావేశాలూ అవీ ఏర్పాటూ చేసి చైతన్యపఱచడం అవసరం. దీన్తోపాటు హిందూనాయకులు చేసిన ప్రసంగాల సీడీలు అక్కడ అందుబాటులో ఉంచి వాటిని తఱచుగా అందఱికీ వినపడేలా మోగిస్తూ ఉండాలి.
10, సెప్టెంబర్ 2011, శనివారం
ప్రశ్నించడము ఎలా ?
ప్రశ్నల్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు
1) స్వతహాగా జీవన విధానంలోనూ, అనుష్ఠానంలోనూ కలిగిన సందేహాలు:- ఇవి అడిగి తెలుసుకుని అనుమాన నివృత్తి చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది.
2) స్వజీవితంలోనివే కాక, ధర్మ సూక్ష్మాలు ఇత్యాదులు:- స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ అనుమానం వచ్చినచోట సందర్భానుసారం, సమయానుసారం తెలిసినవారినడిగి తెలుసుకోవడం లేదా ఇతర ప్రామాణిక వ్యాఖ్యానాలు పుస్తకాలు చదివి విని తెలుసుకోవడం. తద్వారా పురాణేతిహాసాలు మనలో జీర్ణమై తదనుగుణంగా
మన జీవన మార్పు ఆధ్యాత్మికోన్నతికి సోపానమవుతుంది
ముఖ్యంగా గురువుల వద్ద, 'ఆయన దొరికారు కాబట్టి ఏదో అడగాలి' అని అడిగేయడం కాక మన ఆధ్యాత్మికోన్నతికి పనికి వచ్చే ప్రశ్నలు, అదీ ఆయన అనుకూల సమయం చూసి అడగాలి. అంతేకాని అప్పున్న వాణ్ణి ఎక్కడ కనపడితే అక్కడ అప్పడిగినట్టు కాదు.
అసలు ప్రశ్న అడిగేముందు ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం మన పరిశ్రమ ముందు చేయాలి. అసలు ఏ పరిశ్రమా లేక ఏదో అడిగేసి వారు తిరిగివేసిన ప్రశ్నకి మన దగ్గర బదులు లేక తత్తర పడకుండా జాగ్రత్త పడాలి.
గతంలో ఎంతోమందిని మన పూజ్యగురువుగారిని ఎక్కడపడితే అక్కడ ఏవో ప్రశ్నలు వేయడం చూసాను అలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారో అని నాకో గొప్ప అనుమానం. అవి వారి ఆధ్యాత్మిక జీవనానికి ఎలా ఉపయోగపడతాయో అర్థంకాని ప్రశ్నలు. చాలా ప్రశ్నలు పుస్తక పరిశీలనం పురాణ పరిశీలనం ద్వారా తేలిపోతాయి. అసలు ఆ ప్రశ్నవెనుక వారి పరిశీలనం కాని పరిశ్రమ కానీ ఏమీ ఉండవు.
"భారతంలో ఇలాట కదండీ ! అలా ఎలా అండీ ! రాముడు ఇలా చేసాడు కదండీ ! సినిమాలో
చేప్పారు కదండీ ! నిజమాండీ ! ఎలా అండీ !" వంటి ప్రశ్నలు కొన్ని, ఆ అడిగిన ప్రశ్న ఏ సినిమా చూసో నాటకం చూసో అడిగుతున్నామని అడిగే వాళ్ళకీ తెలుసు. భారత రామాయణాలు చదివితే అందులో ప్రశ్నలకి సమాధానం కూడా దొరుకుతుంది కానీ చదివి చెప్పేవారు తేరగా దొరికారని ఇచ్చవచ్చిన ప్రశ్నలు అడుగుతుంటారు. ఇంకొన్నిప్రశ్నలు కూడా వారిని అడగడం చూసాను. "రామాయణం తెలుగు పుస్తకాలు, భాగవతం తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి టీకా తాత్పర్యాలు ఉన్నవి కావాలి" అని. వారిని చూసి ఎన్నో పుస్తకాల దుకాణాలున్నాయి ఏ పెద్ద దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండే పుస్తకాల దుకాణదారులని అడిగినా చెబుతారు, అంతర్జాలంలో ఎన్నో పుస్తకాలు విక్రయించే వెబ్ సైట్లున్నాయి, ఉచితంగా చదువుకునే వెబ్ సైట్లున్నాయి. "అరెరె వీరికి అంత పెద్దాయన సమయం కేటాయిస్తే ఎలా సమయం వృధా చేసుకుంటున్నారురా" అనిపిస్తుంది.
రామాయణం బాలకాండ జాగ్రత్తగా చదివితే అసలు ప్రశ్న ఎలావేయాలో తెలుస్తుంది. వాల్మీకి విరచిత శ్రీరామాయణమే ప్రశ్నతో మొదలు. అందులో చక్కగా చెప్తారు వాల్మీకి నారదులవారిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి "పరిప్రశ్న" చేసారు అని. పరిప్రశ్న అంటే బాగుగా ప్రశ్న అడుగుట. పరి పరి విధముల ఆలోచించి సరియైన ప్రశ్నను కూర్చి అడగవలసిన వారిని అడిగే విధంగా ప్రశ్న అడగడం. అలానే విశ్వామిత్రమహర్షిని శ్రీరాముడు అలానే సందర్భోచితంగా ప్రశ్నలువేసి విషయాలు తెలుసుకుంటారు.
మనకి ఇప్పుడు ఎన్నోరకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయి, ఎక్కడ ప్రవచనాలు, వ్యాఖ్యానాలు దొరుకుతాయి ఇలా అన్నివిషయాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఐనా కొందరు పరిశీలన చేయరు, పరిశ్రమ చేయరు, ఏ ప్రశ్న అడగాలో ఎలాఅడగాలో, ఎక్కడ అడగాలో అన్న స్మృతికూడా ఉండదు.
ఐతే ప్రశ్న అడగడంతప్పని నేను ఎంత మాత్రమూ చెప్పట్లేదు. ముందు మనని మనం ప్రశ్నించుకోవాలి, పుస్తకాలను ప్రశ్నించి సమాధానం రాబట్టుకోవాలి, పరిశీలనాత్మక దృష్టినేర్పరచుకోవాలి. ఐనా దొరకకపోతే ఆ సమాధానం దొరకకపోవడంవల్ల మన ఆధ్యాత్మిక జీవనానికి ఏమైనా లోటు ఉందా అని తర్కించుకోవాలి. లోటనిపిస్తే ప్రశ్నని చక్కగా కూర్చి పెద్దలనడగాలి.
ముఖ్యంగా గమనించవలసినదేమంటే ఈ టపా చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంత మందిని చూసి చూసి ఈవిషయం చెప్పాలని, అటువంటి వారు మనగుంపులో ఉండకూడదని (లేరనే నేను నమ్ముతున్నా) ప్రస్తావించాను.
తెలియకపోవడం తప్పుకాదు. తెలుసుకోవడానికి పరిశ్రమించకపోవడం నేరం.
4, జులై 2011, సోమవారం
సృష్టి ఎందుకు జరుగుతున్నది ?
సమాధానం - పురుష సూక్తం లో చెప్పిన ప్రకారం సృష్టి జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఒకసారి సృష్టి జరిగాక జీవుల కర్మలను బట్టి ఫలితాలు వస్తూనే ఉండాలి. ప్రళయకాలంలో జీవులన్నీ పరమాత్మలో కలిసినా మరల సృష్టి ఆదిలో వారి వారి కర్మఫలానుసారం జన్మలు వస్తాయి. ఈ క్రింద వివరణ మా గురువు గారు (రఘోత్తమ రావు గారు , బెంగళూరు) నేను అడగగా సెలవిచ్చారు:
"జీవులు స్వతహాగా సుఖస్వరూపులు. కానీ సృష్టిలోకి వస్తేనే ఆ సుఖ స్వరూపం వ్యక్తమయ్యేది. భగవంతుడు కూడా సంపూర్ణ సుఖస్వరూపియే. కానీ అతనికి సృష్టి,స్థితి, లయాలతో నిమిత్తం లేదు. అలానే జీవులకు సుఖ స్వరూపం వ్యక్తం కావాలంటే కొన్ని విశేష పరికరాలు, పరిస్ఠితులు కావాలి. కానీ భగవంతునికి మరో వస్తువుతోనో, జీవితోనో సుఖం లభించదు. అతను స్వరమణుడు. దేవుడూ, జీవీ ఇద్దరూ అనాది, నిత్యులు. ఎప్పటి నుంచీ వీరిద్దరున్నారన్న ప్రశ్న వేసుకోనవసరం లేదు. ఎలాగైతే మనం "ఈ ఆకాశం ఏందుకుంది? ఎప్పటినుంచి ఉంది?" అన్న ప్రశ్నను పుట్టినప్పటి నుంచి, గిట్టే వరకూ వేసుకోమో అలానే "జీవి ఎప్పటి నుంచి వున్నాడన్న" ప్రశ్న కూడా వేసుకోనక్కర్లేదు. వేసుకోవలసిన ప్రశ్నల్లా "స్వయం సుఖపూర్ణమైన నా స్వరూపం ఎప్పుడు వ్యక్తమౌతుంది?" అనే.
మృదంగం, తబలా, డోలు వంటి చర్మవాద్యాలను చూసినా "ప్రభో! మల మూత్ర భాండారమైన ఈ చర్మ దేహంలో నీ గుణగానాన్ని ఇంత లయబద్ధంగా ఎప్పుడు పలికిస్తావు?" అని అనుకోవాలి. సరిగమపదనిస - ఇది సంగీతమే కాదు సందేశం కూడా. మమ మద దమ (నా మదాన్ని నశింపజేయి), నీ పద మమ మద దమ సదా (ఎల్లప్పుడూ నీ పాదం నా మదాన్ని అణిచివుంచనీ) - ఇలా మనకు తోచినట్టుగా దేవుణ్ణి ప్రార్థించవచ్చు.
7, డిసెంబర్ 2010, మంగళవారం
మాస శివరాత్రి అంటే ఏమిటి ? : ఒక చర్చ
సభాయై నమః
మున్ముందుగా మాస శివరాత్రి సాధారణంగా ఏరోజు జరుపుకుంటారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చతుర్దసి తరువాత వచ్చే అమావాస్య అని అనుకుంటున్నాను. తెలిసిన వారు సరిదిద్ద గలరు.
తరువాత విషయంగా శివరాత్రిని మాసానికి ఒకసారి చేసుకోవడం వెనకాల విశేషమేమిటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే అని. ఇలా మాసమునకు ఒకసారి శివరాత్రి చేసుకోవడం వెనకాల ఉన్న ప్రాశస్త్యం తెలిసిన వారు వివరించ మనవి.
--భవదీయుడు
_______________________________________
సమాధానము
నమస్తే!
ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.
ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.
అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).
శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||
మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)
ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]
ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.
మీ ప్రశ్నకు పూర్తిగా సమాధానము చెప్పకపోయి ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే చెప్పాను కాని అంతా చెప్పినట్లు కాదు. ఇంకా విజ్ఙులైన పెద్దలు మరికొన్ని విశేష విషయములేమన్నా ఉన్నవేమో తెల్పండి, తప్పులేమైనాఉంటే సరిదిద్ధండి.
సూర్యనాగేంద్రకుమార్ అయ్యగారి