"నాకేమొస్తుంది? విద్య, ఉద్యోగం,భార్య,పిల్లలు చివరకు దేముడి వద్ద కూడా నాకేమొస్తుంది? ఇదే ప్రశ్న. మిగతా చోట ఏమో కానీ భగవంతుని విషయంలో మాత్రం నాకేమొస్తుంది? ఇది వస్తుందా? అయితే చేస్తాను" అని చేసేవారికి ఫలితం శూన్యం. కానీ గురువులు " పరమేశ్వరుడు మహా బోళా మనిషి. తెలిసి తలచినా, తెలియక తలచినా, ఏదైనా ఆశించి తలచినా, ఏమీ ఆశించక తలచినా పరుగున వచ్చేస్తాడు. అతని కరుణ అపారమైనది " అని చెబుతారు. ఇదే నేటి కాలంలో పెద్ద ప్రశ్న అయి కూర్చుంది. "ఏమిటీ!? నువ్విలా పిలిస్తే అలా వచ్చేస్తాడా? నీ పాపాలన్నీ కరిగించేస్తాడా? అడిగిన వన్నీ ఇచ్చేస్తాడా? ఏదీ ఓసారి పిలిచి చూపించు. నేనూ చూస్తాను నీ కష్టాలు ఎలా తీరతాయో... నా కెప్పటి నుండో ఓ అనుమానం. అసలు ఎవరైనా ఈ పని చేస్తే నాకేమిటి అని ఒకటికి పది సార్లు ఆలోచించి చేసే ఈ రోజులలో ముందూ వెనుకా ఆలోచించకుండా వచ్చేస్తాడా ఆ వెర్రి వెంకన్నా!? పోనీ దేముడు కదా వస్తే వస్తాడనుకుందాం. కానీ నీలో స్వార్థంతో ప్రార్థించినా వచ్చేస్తాడా? ఏదీ ఒక్క సారి చూపించు. నేనూ చూస్తాను అతను ఎలా ఉంటాడో.?"
సత్యాన్వేషణ అనే పేరుతో పలు వ్యక్తులు వేసే ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి? ఎటు నుండి చెప్పాలి? నేను ఒకటి చెప్పనా ? సత్యాన్వేషణ వేరు,రంధ్రాన్వేషణ వేరు. పై విధానం రంధ్రాన్వేషణ అవుతుంది కానీ సత్యాన్వేషణ కాదు. మేము చెప్పేది గొప్ప. మీరు పాటించేది శుద్ధ దండగ. మీరు వెర్రివాళ్లు కాబట్టి మా మాటలు విని ఆ భక్తి మార్గం వీడండి. అంటూ చెప్పేది రంధ్రాన్వేషణే అవుతుంది. అలా కాక జీవించడానికి పలు మార్గ్గాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఈ భక్తి అనేది ఒకటిగా కనిపిస్తోంది. కానీ నాకు అందులో నమ్మదగిన సత్యం గోచరించడం లేదు. అయినా అన్వేషిద్దాము. ఇందులో ఎంత సత్యం ఉందో. గురువులు ఏమి చెప్తున్నారు? శిష్యులు ఏమి పాటిస్తున్నారు. మనకు కనిపించే తేడా గురువుల వద్ద ఉన్నదా? శిష్యుల వద్ద ఉన్నదా? అసలు పూర్తిగా ఆ విధానం లోనే ఉన్నదా? లేదా నా దగ్గరే లోపం ఉన్నదా? ఇలా అన్ని వైపులా అన్వేషణ సాగిస్తే అది సత్యాన్వేషణ అవుతుంది.
మనిషి దేనికోసం జీవిస్తాడు? అతని అంతిమ ఆశయం ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? చిన్న పిల్లవాడికి చదవాలని, ఆటలాడాలని కోరిక. చదువు, తరువాత మంచి ఉద్యోగం సంపాదించాలని కోరిక. తరువాత భార్య, పిల్లలు ఇలా ఒకదాని తరువాత ఒకటి. ఇవన్నీ ఎందుకు? దేని కొసం ఈ కోరికలన్నీ కలుగుతున్నాయి ? దీనికి సమాధానం దొరకాలంటే ప్రశ్న మరోలా వేసుకోవాలి. ఈ కోరికలు తీరితే మనకు ఏమి కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. కానీ అది క్షణ కాలమే ఉంటుంది. మళ్లీ ఏదో కావాలంటుంది మనసు. మళ్లీ దానికోసం అన్వేషణ. అది లభిస్తే కొంత కాలం ఆనందం. ఇలా మళ్లీ మళ్లీ అడిగే మనసుకు అసలు ఏమికావాలి? నేను చెప్పనా? ఎప్పటికీ ఉండే ఆనందం కావాలి. మళ్లీ చెప్పాలంటే తృప్తి కలిగేంత ఆనందం కావాలి. దానికోసమే మనిషి పరుగు. అదే అతని అంతిమ మజిలీ. ఈ పరుగులో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అందరూ చివరికి చేరేది పరిపూర్ణ ఆనంద తీరానికే. కాకపోతే ఒకళ్లు ముందు, ఒకళ్లు వెనుక అంతే.
ఏదీ తెగేదాకా లాగకూడదు. కొత్త విషయం తెలుసుకోవాలనుకోవడం మంచిదే. కాని అన్ని విషయాలు నాకే తెలియాలనుకోవడం మొదటికే మోసం తెస్తుంది.
ఒకామె వంట బాగా చేసేది. కానీ కొంత కాలానికి ఆమెకి ఏ వంటచేసినా ఉప్పెక్కువో, కారమెక్కువో ఇలా ఏదో ఒక లోపంతో వంట చెడి పొతోంది. దానితోపదిమందీ వచ్చినప్పుడు ఆమె పరువు పోతోంది. పైగా పూర్వం బాగా వంట చేయగలదన్న పేరు. తీరా ఇప్పుడు గడ్డిలా ఉన్న వంట తిని ఏమంటారో. అన్న బెంగ ఎక్కువై పోయి చేతులు కాళ్లు వణికి పోతున్నాయి. తెలియని భయం ఆవరించి కళ్లు తిరిగి క్రింద పడిపోతోంది. దానితో ఆమె ఒక సైక్రియాటిస్ట్ ని కలిసింది. అతను అంతావిని ఓస్ ఇంతేనా మరేం ఫర్వాలేదు. మీరు వంట చేసే టప్పుడు మీకు ఇష్టమైన సంగీతంవింటూ వంట చేయండి. క్రమ క్రమంగా మీరు పూర్వం వలే వంట చేయగలుగుతారు. మీ వణుకు తగ్గుతుంది. అని ధైర్యం చెప్పి పంపించాడు. ఆమె ఇంటికి వెళ్లిఅలా వంట చేయడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న వాళ్ల్లు ఇది చూసి "ఇదేమి చోద్యమే!? అసలే పరధ్యానంతో వంటలు తగల బెడుతున్నావు. ఇప్పుడు పాటలు పెట్టుకుని వంటలు చేస్తే ఇక మేం తిన్నట్టే" అని ఒకళ్లు. "అయినా ఇలా ఎన్నాళ్ళు పాటలు వింటూ వంట చేస్తావు?" అని ఒకళ్లు, "ఎన్నాళ్లైనా ఇలా గడపాల్సిందేనా?" అని మరొకళ్లు. ప్రశ్నల మీద ప్రశ్నలు. అసలే ఆమె మనస్థితి బాగోలేదు. పైగా ఈ ప్రశ్నలతో ఆమెను రోజూ బుర్రతింటూ ఉండడంతో వంటలు బాగు కాలేదు సరికదా, ఆమెకు మరింత భయం పెరిగి పోయింది. ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వంట చేయాలంటే వచ్చే వణుకు ఇప్పుడు మామూలుగా రోజూ వంట చేయాలంటేనే వస్తోంది.
మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లిన ఆమె ద్వారా అంతా విన్న డాక్టరు "ఈసారి మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్లందర్నీ తీసుకురండి" అని చెప్పాడు. అలాగే తీసుకు వెళ్లింది. ఆమెను బయటకు పంపి వాళ్లందర్నీ కూర్చోబెట్టి " మీకు బుద్దుందా లేదా? అసలే మనస్థితి బాగోలేని ఆమెకు మీరు మరింత భయాన్ని కలిగిస్తారా? నేనా డాక్టరు మీరా? మీకంతా తెలిసినప్పుడు మరి నా దగ్గరకు రావడం దేనికి మీరే నయం చేయలేక పోయారా?" అని చివాట్లు పెట్టాడు. బిక్క మొహాలు వేసిన వారితో అనునయంగా అసలు విషయం చెప్పాడు. " ఆమెకు భర్త చనిపోవడంతో, బంధువులైన మీ మీద పిల్లలతో సహా ఆధారపడ వలసి రావడంతో ఆలోచనలు పెరిగిపోయాయి. "ఎలా బ్రతకడం? పిల్లలకు దిక్కేది?" అనే బెంగ మొదలైంది. ఆ బెంగలో నిద్ర కరువైంది. నిద్ర సరిగా లేకపోవడం వలన అనేక శారీరక మార్పులు సంభవించాయి. అలాగే పరధ్యానమూ అలవడింది. ఏ పనీ సవ్యంగా చేయలేకపోవడం, చిన్నసమస్యకే పెద్దగా క్రుంగి పోవడం, నిరాశ నిస్పృహలకు లోనవడం మొదలైంది. మనసులో గూడు కట్టుకున్న భయం వలన ఆమె మానసికంగా కృశించి పోయింది. అన్ని పనుల్లోను అంతో ఇంతో తేడాగా ప్రవర్తిస్తున్నా ఆమెకు ప్రధానంగా మీరు అప్పచెప్పిన వంట బాధ్యత వల్ల దానిలో తాను చేసే లోపాలే ఆమెకు పెనుభూతంలా కనిపించ సాగాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి ఆమెను ఇంతవరకూ తీసుకు వచ్చాయి. దీని కంతటికీ కారణం విపరీతమైన ఆలోచనలు . ముందు వాటిని మళ్లించ గలిగితే మనసు కాస్తకుదుట పడితే మళ్లీ మామూలు స్థితి వస్తుంది. అందుకే రాత్రి నిద్ర పట్టడానికి మందులు ఇస్తూనే ఆమెకు సంగీతమంటే ప్రాణమని తెలుసుకున్న నేను ఇష్టమైన పాటలు వింటూ వంట చేయమన్నాను. అలా కొంత వరకు ఆలోచనలు తగ్గుతాయి కనుక. కానీ మీరేం చేశారు. ఆమె మనసును మరింత కల్లోల పెట్టారు. దానితో మొదటికే మోసం వచ్చింది. ఇక్కడ ఒక విషయంలో మిమ్మల్ని అభినందించాలి. సొంత తల్లిని కూడా సరిగా చూసుకోవడం కరువైపోతున్న నేటి రోజులలో ఆమెకు చెల్లెళ్లైన మీరు ఇంత ప్రేమగా చూసుకోవడం, దానికి మీ భర్తలు కూడా అభ్యంతర పెట్టక పోవడం చాలా గొప్పవిషయం. ఇకనైనా పరిస్థితి అర్థం చేసుకుని ఆమెకు అనుగుణంగా నడుచుకోండి, చేతనైతే ఆమెలో ధైర్యాన్ని పెంచే మాటలు మాట్లాడండి. త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది అని చెప్పి పంపించాడు. ఇక ఆతరువాత
ఎప్పుడూ ఆమె అటువంటి భయంతో డాక్టరు వద్దకు రాలేదు.
అలాగే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే పెను మానసిక రోగాలను క్రమ క్రమంగా తొలగించి, మన జీవితాలను పరిపూర్ణ ఆనందం వైపు పయనింపచేయడానికి భారతీయ గురువులు శ్రమించి ఓ జీవన విధానమును ఏర్పరచారు. మనకు ప్రసాదించారు. కానీ మానవుడు స్వార్థమునకు లొంగి దానిని కూడా పూర్తిగా పాటించక తనకు అనుకూలముగ ఉన్నంత వరకు పాటించి, కష్ట తరముగ ఉన్నదానినిపాటింపక, తనను పరులు తప్పు పట్టు లోపల తానే ఇతరుల నడవడికను ప్రశ్నించి, మభ్యపెట్టి వారిచేత కూడ తన మార్గమును శహభాష్ అనిపించుకొని, తానేదో క్రొత్త మార్గమును కనుగొన్నా ననుకొని తాను భ్రమిస్తూ, ఇతరులను భ్రమింపచేస్తూ బ్రతుకుతున్నాడు. అదే భారతీయత అనుకొంటున్నాడు. మరోవైపు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రపంచీకరణ పుణ్యమా అని దేశాల మధ్య దూరం తరిగి అనేక అలవాట్లకు లోనై కన్నతల్లినే విమర్శించే వారు కొందరు తయారవుతున్నారు. ఈ విమర్శలు కొంత వరకూ మంచివే. మొదటి రకం వాడు తన తప్పులను సరిదిద్దుకోవడానికి పనికి వస్తాయి. అలా దిద్దుకున్న వాళ్లు అనేకులు ఉన్నారు. అలాగే కాలానుగుణంగా కూడా కొన్నిమార్పులు అవసరం. ఆ కోవలోనే సతీసహగమన నిషేధం, బహుభార్యాత్వ నిషేధం మొదలైన సంఘసంస్కరణలు జరిగాయి. మంచీ చెడూ సమానంగా ఉన్న నేటి సమాజంలో పుట్టిన మనం మనలనుసరిదిద్దుకోవడానికి చాలా దోహద పడుతున్నాయి. మన భారతీయ విలువల గొప్పతనాన్ని మరింత తెలుసుకునేలా చేస్తున్నాయి. కానీ ఈ మార్పును చూసి "నేనేదో గొప్ప ఘన కార్యం చేశాను, నేనలా ప్రశ్నించడం వల్లే ఈ సమాజంలొ పెనుమార్పులు సంభవించాయి" అని అత్యుత్సాహంతో మరింత లోతుకు వెళ్లి భారతీయమూలాలనే తూలనాడే స్వభావం హర్షించదగినది కాదు.
మితిమీరిన కామంలో పడి గిలగిల లాడుతున్న మనకు సత్యం ఎక్కడ కనిపిస్తుంది? అందుకే ఆ పై కథలోని ఆ బంధువుల వలే ప్రశ్నిస్తాం. "ఏమిటీ మనిషి మనో రోగాలను పోగొట్టి మంచి మార్గంలో పయనింప చేయడానికి ఈ జీవన విధానం రూపొందించ బడినదా? అంటే పుట్టుకతోనే మనకి అనేక మనోవైకల్యాలున్నాయా? వాటి కోసం మనం బ్రతికినంత కాలం ఈ తలా తోకా తెలియని దారిలో నడవాలా? "
ఇవే కదా మీ మనసులో ఇంకా మిగిలి ఉన్న ప్రశ్నలు. ప్రతీ రోజూ అన్నం తింటాం. ఎన్ని సార్లు తిన్న అన్నం మళ్లీ తింటాం ? ఎందుకని ? మనకు శక్తి లేదనా? కాదు కదా? శక్తి నశించకూడదని తింటాం. అలాగే మన జీవన విధానమూ ఓ క్రమ పద్ధతిలో మనలోని ఆనందాన్ని ఇనుమడింపచేసి శాశ్వత ఆనందం వైపు పరుగు పెట్టిస్తుంది. దీనిని పాటించే వారిలో తప్పులున్నాయేమో గానీ. పూర్తిగా ఈ విధానంలోనే తప్పులున్నాయనడం అసమంజసం.
ఏమిటి మరి ఈ జీవన విధానం?
నీలోకి చూడడం అంటే నిన్ను చూడడమే. నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు లోకాన్ని తెలుసుకుంటావు. లోకాన్ని ప్రశ్నించే ముందు నిన్ను నువ్వుప్రశ్నించుకో! నేనెవరు? నాకు కావలసినదేమిటి? నా పుట్టుకకు మూలం ఏమిటి? దాని పరమార్థం ఏమిటి? అని ఎప్పుడైనా ప్రశ్నించావా? సంతృప్తికర సమాధానం రాబట్టావా? అన్వేషణ సాగించావా? సమాజాన్ని చదవడం నీకు తెలుసేమో ? నిన్ను చదవడం తెలుసా? అదే పరా విద్య. అది తెలిసిన నాడు మృత్యువును జయిస్తావు. చావుకు తెగిస్తావు. తోటి ప్రాణిలో నీ రూపు చూస్తావు. తన కష్టం నీ కష్టంగా తపిస్తావు. నీ మాటలో చూపులో చర్యలో ప్రతి చర్యలో అణువణువులో అమృతం ఒలికిస్తావు. ఆ రహస్యం తెలియాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు నువ్వు వరుసగా స్వీకరించ వలసినదే! కాదని కోరికలతో రగిలి ప్రక్కదారి పట్టారా..? అన్నీ ఉన్నా ఆనందం మీకు కరువే! పోనీ ఇవేమీ వద్దని సరాసరి సన్యాసానికే వచ్చేశారా..? నిత్యానందుని గతి ఏమయిందో మీకు తెలుసుగా? ఏదైనా ఓ క్రమ పద్ధతిలో సాగాలి.
కాళిదాసు రఘువంశ రాజుల జీవనం గురించి ఈ విధంగా చెప్తాడు.
త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం|
యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం||
యోగ్యత కలవారికి దాన మిచ్చుటకే ధనమార్జించు వారును, నిజము పలుకుటకై మితముగా మాట్లాడు వారును, కీర్తి కొరకే విజయము పొంద గోరువారును, సంతానము కొరకే వివాహమాడు వారును...
శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం|
వార్థకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం||
బాల్యము నందు విద్యలు నేర్చు వారును, యవ్వనమున విషయా సక్తులును, వార్థక్యమున మౌనమును పాఠించుచూ సంపదలను అన్నిటినీ త్యజించి వానప్రస్థ జీవనము సాగించు వారును, అవసాన కాలమున సంకల్ప మాత్రము చేత యోగ మార్గమున శరీరమును త్యజించు వారును.... ( అయిన రఘువంశ కథను చెప్పబోవు చున్నాను )
ఈ గుణములు మనకు ఆదర్శములు.
ప్రశ్నించే వారు అనేకులు ఉన్నారు - జవాబు ఇచ్చేవారేరి? జనులు పరిపరివిధ వాదములతో నిస్తేజు లవుతున్నారు. ప్రేమ స్వరూపులైన సద్గురువులు తమ అమృతవాక్కులతో శాంత పరిచెదరు గాక ! సులభప్రసన్ను లగుదురు గాక!
[ రాజశేఖరుని విజయ శర్మ}
10, మే 2010, సోమవారం
ప్రశ్నించే వారు అనేకులు ఉన్నారు - జవాబు ఇచ్చేవారేరి?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)