17, జూన్ 2010, గురువారం

తనయందు దైవత్వాన్ని ఆరోపించుకోవడం - పర్యవసానాలు

మనిషిలో భగవంతుణ్ణి దర్శించడం హిందూసంస్కృతిలో మాత్రమే లభ్యమయ్యే వైశిష్ట్యం. హిందువులలో అనేక సామాజిక మానవ సంబంధాలు సైతం ఈ విధమైన దైవభావనని ఆలంబనగా చేసుకొని ప్రవర్తిల్లుతున్నటువంటివే. ఆయా పెద్దల్ని లేదా ఇష్టుల్ని దేవుడితో సమానం చేయకపోతే హిందువుల మనస్సు శాంతించదు. అదే విధంగా తమకు సహాయపడ్డవారందఱినీ "దేవుడిలా వచ్చా"రనడం కద్దు. అలాగే "ఒకఱు చాలా మంచివారు" అని సాక్ష్యం చెప్పడానికి "ఆయన దేవుడిలాంటోడు. ఏమన్నా అంటే కళ్ళు పోతాయ్" అనడం కద్దు. ఆ రకంగా కాలక్రమంలో మనకి చాలామంది భగవత్సమానులు ఏర్పడ్డారు. హిందువులలో తల్లి దేవత. తండ్రి దేవుడు. (కొంతమందికి అన్నయ్య కూడా దేవుడే) గురువు దేవుడు. భర్త దేవుడు. అతిథి దేవుడు. మఱికొంతమందికేమో రాజు/ నాయకుడు కూడా దేవుడే.

సరే, అంతా అనుకూలంగా సాగినంత కాలం, ఈ దైవత్వాపాదితులు తమకు ఆపాదించబడ్డ దైవత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నంత కాలం ఈ దైవభావన వల్ల నష్టమేమీ లేదు. అలా కాక ఏ కారణం చేతనైనా ఆ భగవత్సమానులు అడ్డం తిరిగితే వారి భగవత్తత్వం లోకకంటకంగా పరిణమిస్తుంది. "నా విష్ణుః పృథివీపతిః" (రాజు మానవరూపంలో ఉన్న విష్ణుమూర్తి) అని కీర్తించిన దశ నుంచి "రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు" అని మహాకవులు ఆక్రోశించే దశ దాకా వ్యవహారం ముదిఱిందంటేనే అలనాటి మానవ సంబంధాలు చారిత్రిక పరిణామ క్రమంలో ఎలా విషమించాయో తేటతెల్లమవుతోంది. ఇది కేవలం పాలకులకూ, పాలితులకూ మధ్యనే కాదు, తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్య, గురువులకూ శిష్యులకూ మధ్య,భార్యలకూ భర్తలకూ మధ్య కూడా ఇలాగే విషమించడాన్ని మనం ఆధునిక కాలంలో గమనించవచ్చు. ఈ విషమించడంలో కేవలం తల్లిదండ్రుల పాత్రో, లేక పిల్లల పాత్రో లేదు. అలాగే కేవలం గురువుల పాత్రో, శిష్యుల పాత్రో లేదు. అదే విధంగా కేవలం భర్త పాత్రో భార్య పాత్రో లేదు. కొన్ని కేసులలో వీరిదీ,మఱికొన్ని కేసులలో వారిదీ ఉంది.

మాతృత్వం, పితృత్వం, భర్తృత్వం, గురుత్వం ఇలాంటివి అదృశ్య పీఠాలు. ఇవి ఆధ్యాత్మికంగా శక్తిమంతమైనవి. అందువల్ల ఈ స్థానాలను అధిష్ఠించినది ఎవఱైనప్పటికీ, ఎలాంటివారైనప్పటికీ వారిచ్చే ఆశీర్వాదాలకీ, శాపాలకీ మఱుజన్మలో తప్పకుండా ఏదో ఒక స్థాయిలో ఫలితం కనబడుతుంది. అయితే కలియుగం ముదుఱుతున్నకొద్దీ అల్పబుద్ధులవారు ఎక్కువగా ఈ పీఠాల్లో తిష్ఠ వేస్తూండడమే మన అసలు సమస్య. అహంకారం, క్రోధప్రదర్శన మొదలైనవి ఆయా పీఠాల్ని బట్టి సంక్రమిస్తాయి. "ఆ పీఠాలు తమవి" అని భావించుకోవడం వల్ల వాటి దుష్ప్రభావాలు తీవరిస్తాయి. ఈ సందర్భంగా నాకొక కథ గుర్తుకొస్తోంది.

ఒకానొక రాజుగారు చాలా కోపిష్ఠి. ప్రతీ చిన్న విషయానికీ కోపం తెచ్చుకొని భయంకరమైన శిక్షలు విధించేవాడు. ఒకసారి ఒక ఋషి ఆయన్ని చూడ్డానికొచ్చి "మహారాజా ! దానమైనా, దండమైనా పాత్రమెఱిగి ఆచరించాలి. చిన్నతప్పులకు పెద్ద శిక్షలూ, పెద్ద తప్పులకు చిన్న శిక్షలూ విధించడం పాపహేతువు. అందుకు ఫలితాన్ని రాజే స్వయంగా అనుభవించాల్సి ఉంటుంది" అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు. ప్రతిదానికీ పెద్దపెద్ద శిక్షలు విధించడానికి కారణమవుతున్న తన ఆవేశాన్ని, కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో రాజుకు అర్థం కాక భార్యని పిలిచి సలహా అడిగాడు. "మహారాజా ! ఒక్క నెలరోజులు నాకు రాజ్యాధికారం ఇప్పించండి. ఎలా అదుపులో పెట్టుకోవాలో నేను చెబుతాను. అయితే నేనిప్పుడు పరిపాలకురాలుగా తీసుకునే నిర్ణయాలకు ఆ తరువాత నన్ను శిక్షించనని మాట ఇవ్వండి." అన్నదామె. రాజు "సరే"నని ఒప్పుకొని "ఒక నెలరోజులపాటు తన బదులు తన భార్యే రాజ్యపాలన చేస్తుందనీ, తనతో సహా అందఱూ ఆమె మాటనే శిరసావహించాల్సి ఉంటుం"దనీ దేశమంతా చాటింపు వేయించాడు. ఆమె సింహాసనం మీద కూర్చున్న మొదటిరోజే "ఏలినవారు" అని మర్యాదగా తనని సంబోధించనందుకు భర్తకు పది కొరడాదెబ్బలు విధించింది. ఇహ ఆ నెలంతా ఎలా ప్రవర్తించాలో అర్థం కాక రాజుకు ప్రత్యక్ష నరకమే కనిపించింది. నెలరోజుల తరువాత మళ్ళీ రాజ్యాధికారాన్ని చేపట్టినాక రాజు భార్యతో "నీ వల్ల కొరడాదెబ్బలు తింటే తిన్నాను గానీ ఈ నెలరోజుల్లో నా కోపం చాలామటుకు తగ్గిపోయింది. ఎప్పుడూ శిక్షలు విధించడమే తప్ప నేనెప్పుడూ శిక్షకి పాత్రుణ్ణి కాలేదు. బహుశా అందుకే ఇంతకుముందు నాకు కోపం తగ్గలేదేమో" అన్నాడు. రాణి నవ్వి "అసలు కారణం కొరడాదెబ్బలు కాదు మహారాజా ! కోపాన్ని సహించి అణిగిమణిగి పడుండేవారు ఉన్నంతకాలం కోపం తగ్గదు. సాధారణంగా అలా పడుండేవారి మీదనే మనకి కోపం వస్తుంది. అలా పడుండనివారి మీద చస్తే కోపం రాదు. మనకి ఎవఱిమీదైనా అధికారం ఉంది అని మనం అనుకుంటే మనకి వారి మీద ఎల్లప్పుడూ కోపం వస్తూనే ఉంటుంది." అని వివరించింది.

పిల్లల మీద తల్లిదండ్రులకీ, శిష్యుల మీద గురువులకీ అధికారం లేకపోలేదు. అంతకంటే వారిని తమకి భగవంతుడు అప్పగించిన sacred trust గా మన్నించడం ఎక్కువ సరైనది. పెంచమని, తీర్చిదిద్దమనీ దేవుడు మనకప్పగించినవారికి శాపాలిచ్చి వారి బతుకుల్ని పాడుచెయ్యాలనే దుష్టచింతన నుంచి పెద్దలు విముక్తులు కావాలి. అప్పుడే వారు నిజమైన పెద్దలనిపించుకుంటారు. మనం తల్లిదండ్రులమో, భర్తలమో, గురువులమో అయినంత మాత్రాన మనం దేవుడి స్థానాన్ని ఆయన అనుమతి లేకుండా దురాక్రమించాలనే దుష్టసంకల్పాన్ని విసర్జించాలి. మన పిల్లలూ, మన భార్యలూ, శిష్యులూ మనల్ని దైవసమానంగా మన్నిస్తే మన్నించనివ్వండి ! వారి పవిత్రభావనకి తగ్గ ఫలితాన్ని వారు పొందుతారు. కానీ మనం మాత్రం దేవుళ్ళం కాదనే స్పృహతోను, తద్భిన్నంగా సాధారణ మానవులమేననే తెలివిడితోను మన తోటి మానవులందఱినీ ఆత్మవత్తుగా దర్శిస్తూ నిరాడంబర, అదాంభిక జీవితాన్ని గడుపుదాం.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి