జీవితంలో ఢక్కామొక్కీలు తినే కొద్దీ సుఖదుఃఖాలకు అతీతులం కావచ్చు. అసంభవమేమీ కాదు. శీతోష్ణాల్ని కూడా అభ్యాసబలంతో అధిగమించవచ్చు. అసాధ్యమేమీ కాదు. కాయకష్టం చేసి బతికే చాలామంది పేదవాళ్ళు సుఖదుఃఖాలకూ అతీతులే, శీతోష్ణాలకూ అతీతులే. కానీ వారంతా మోక్షానికి వెళతారని చెప్పలేం. ఎందుకంటే ఒక కష్టాన్ని ఇష్టం లేకపోయినా పళ్ళ బిగువున బలవంతాన ఓర్చుకోవడం వేఱు. అసలది కష్టమే కాదని, భగవత్ ప్రసాదమనీ భావించడం వేఱు. పేదవాళ్ళు చేస్తున్నది మొదటి తరహా పని. ఆధ్యాత్మిక సాధకులు చేసేది రెండో శ్రేణిలోకొస్తుంది. మఱి ఆ కష్టం ఇష్టం కాకుండా అడ్డుపడుతున్నది ఏది ? ప్రతి కష్టాన్నీ భగవత్ ప్రసాదంగా భావించగల మనఃస్థితి మనకెప్పుడు కలుగుతుంది ? అది కలగడానికి మన వంతుగా మనం చేయాల్సినది ఏమిటి ?
మనుషులు తమకు తాము బ్రాండింగ్ వేసుకోవడం మానేసినప్పుడు కష్టాలన్నీ ఇష్టంగా మారతాయి. "మనకు సంబంధం లేదు, మనది కాదు, మనం చేయనక్కఱలేదు, మనకా గతి పట్టలేదు" గట్రా గట్రా భావనలే మానసిక అవరోధాలు. కానీ మనం చిన్నప్పట్నుంచి ఒళ్ళంతా అనేక పచ్చబొట్లు పొడిపించుకుంటూ పెఱిగాం. గుర్వనుగ్రహం లేకుండా మనోమయమైన మన సూక్ష్మశరీరాన్ని మనం దర్శించలేం గానీ ఒక వేళ దైవికంగా దర్శించగలిగితేనా, దాని శరీరం మీద ఈ క్రింద పేర్కొన్న తరహా పచ్చబొట్లు వీపూ, భుజాలూ, పొట్ట అనే తేడా లేకుండా అంతటా వికారంగా పొడిచి కనిపిస్తాయేమో !
"నా పేరు సుబ్బారాయుడు, నా పేరు వెంకటలక్ష్మి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను కమ్మ, నేను రెడ్డి, నేను మధ్యతరగతి, నేను చదువుకున్నవాణ్ణి, నేను నగర నాగరికుణ్ణి, నేను గ్రామీణుణ్ణి, నేను మగవాణ్ణి, నేను ఆడదాన్ని, నేను యువకుణ్ణి, నేను ముసలివాణ్ణి, నాకు అదంటే ఇష్టం, నాకు ఇదంటే అసహ్యం. నేను అది, నేనిది...." ఇంకా ఏదేదో, వేఱేదో, మఱేదో !!
తల్లిదండ్రులే అలవాటు చేశారో, సమాజమే అలవాటు చేసిందో గానీ, మొత్తమ్మీద ఒళ్ళంతా వికారంగా, దట్టంగా అలుముకున్న ఈ పచ్చబొట్ల మూలాన మనకు అహంకారం ప్రకోపించడం, తన్మూలంగా మనోవాక్కాయకర్మలతో ఇతరుల్ని బాధపెట్టి వైవిధ్యభరితమైన పాపాలు చేయడం తప్ప ఉపయోగాంతరమేమీ లేదు. ఇతరులు మనల్ని అవమానపఱిచారని మనం అప్పుడప్పుడు భావించి తీవ్రమైన మనోవేదనని అనుభూతిల్లడానికి సైతం ఈ పచ్చబొట్లే కారణం. మన గుఱించి మనం ఊహించుకునే మూర్తిమత్త్వం (self-image) మహోన్నతమైనది. ఏ దేవుడూ దానికి సాటిరాడు. ఏ మహాత్ముడూ దానితో సరిపోలడు. మన గొప్పతనాన్ని బట్టే మనం ఆయా దేవుళ్ళని పూజించడం, ఆయా మహాత్ముల్ని గౌరవించడం. ఇదీ మన కథ. అసలు మన గుఱించి మనం ఎందుకు ఒక విధంగా అనుకోవాలి ? మన గుఱించి మనం అనుకుంటున్నట్లుగా ఇతరులు అనుకోవడం లేదనీ తత్కారణం చేత వారు మనల్ని బాధపెట్టారని ఎందుకు తలపోయాలి ? ఆ ప్రాతిపదికన వారిని ఎందుకు ద్వేషించాలి ? ద్వేషించడమే కాదు, ఆ బాధలో మనం అనేక తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఇదంతా మనకు మనం పొడుచుకున్న పచ్చబొట్ల ప్రభావం.
మనం ఏదీ కాదు. "మనం ఫలానా" అని సమాజం అనుకున్నంతమాత్రాన మనం అది కాదు. లేదా మనం "ఫలానా కాదు" అని సమాజం అనుకున్నంత మాత్రాన మనం అది కాకుండా పోము. నువ్వు నన్ను ఎలాగైనా చూడు, నేనది కాదు. అసలు నేను ఏదీ కాదు. నా గుఱించి నేను అనుకునేది కూడా నేను కాదు. మఱి నేనేమిటి ? అనడిగితే నేను నేనే. నన్ను అనవసరంగా ఒక పేరుకో, విశేషణానికో, గుర్తింపుకో కట్టిపడేయొద్దు. ఇదీ మనం రోజూ మననం చేసుకోవలసినది. అప్పుడు కష్టాలన్నీ ఇష్టాలుగా మారిపోతాయి.