ఆర్యులారా !
హిందువులమైన మనం మన ధర్మాన్ని మన వఱకూ ఆచరించడంతో సంతృప్తి చెందుతూంటాం.అందువల్ల ఇతరులకి (కనీసం మన ధర్మంలోనే కొనసాగుతూ ఉన్న నిమ్నజాతులవారికి) ఈ ధర్మనిగూఢాల్ని బోధపఱిచే ప్రయత్నం మనమెప్పుడూ చేయలేదు. నిజానికి ఈధర్మం పురోహితుల చేతుల్లో బందీగా మారింది. ఇలాంటి సామాజిక, మానసిక కారణాల్ని పురస్కరించుకొని ఈ ధర్మం గతకొన్ని దశాబ్దాలుగా దెబ్బదినిపోతోంది. మన ఇంట్లో సాక్షాత్తూ అమృతమే ఉన్నప్పటికీ దాన్తో మనం నిమ్నజాతీయుల హృదయ, ఆత్మిక ఆకలిని మనం తీర్చలేకపోవడంతో వారు బయటికెళ్ళి పరధర్మపు చలివేంద్రాల్లో మంచినీళ్ళు తాగుతున్నారు. తాగి అది అమృతంలా ఉందని చెబుతున్నారు.
మనం పరధర్మీయుల చేతుల్లో ఎక్కడ వ్యూహాత్మక ఓటమిని పొందుతున్నాం ? హైందవం ఇవ్వజూపని ఏ వెసులుబాట్లని, feel good factors ని పరధర్మం ఇవ్వజూపగలుగుతోంది ? ధన/ ద్రవ్య ప్రలోభాలు కూడా ఉన్నాయని మనకి ఇదివఱకే తెలుసు. అవి కాకుండా ఇంకా ఏయే అంశాలున్నాయి ? వారి నుంచి మనం ఏమేం నేర్చుకొని వారిలాగే మన మతాన్ని కూడా అంతర్జాతీయ మతంగా మార్చగలుగుతాం ? ఎప్పటిలా పరమతాల్ని ద్వేషభావనతో చూడకుండా, కాస్త తెఱుపుడు మనస్సు (open mind) తో మన మతస్వార్థం కోసమే, వారిలోని మంచిని కాసేపు పరిశీలించి వెలికి తీద్దాం. కాసేపు పక్కా వాస్తవవాదులం అవుదాం. ఆత్మకరుణ (self-pity) లేని కఠిన కర్కశ తార్కికులమవుదాం. ఆత్మవిమర్శకులమవుదాం. ఈ మార్గంలో మీ మీ చింతనాధారని ఇక్కడ పంచుకోగలరని ప్రార్థన.
అందుకు ఇతర సభ్యుల సమాధానాలు :
ఒక సభ్యుడు : 1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.కిరస్తానీలు, ముస్లింలు ప్రతీ వారం చర్చిలకు మసీదులకు గుంపులుగా వెళతారు.. మనలోఎంతమంది గుడికి వెళ్ళేటప్పుడు కనీసం మన ఇంట్లో వాళ్ళను తీసుకుని వెళతాం ?? అలా గుంపుగా వెళ్ళడం వల్ల వాళ్ళ మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది.. ప్రతీ ఒక్కరికీ తమకంటూ ఎవరో ఉన్నారు అనే భావన, ఆ ఉన్న వాళ్ళు కేవలం తమ మతం వల్ల మాత్రమే ఉన్నారు అనిపిస్తుంది.. సంఘజీవి అయిన మనిషికి ఇది సహజంగానే మానసికధైర్యాన్ని ఇస్తుంది.
2. వాళ్ళనుంచీ నేర్చుకోవాల్సింది వాళ్ళ మతం పట్ల వాళ్ళకున్న అంకిత భావం.. ఒక ముస్లిం కు ఎన్ని పనులున్నా వాడు నమాజ్ చేయకుండా బయటికి కదలడు.. మనం మాత్రం ఏదైనా పని తగిలితే మొదట మానేసేది మన పూజా కార్యక్రమాలనే.. వాళ్ళు ఎప్పుడూ నమాజ్ చేయడం గురించి లేదా చర్చికి వెళ్ళడం గురించి సిగ్గు పడరు.. మనకేమో గుడికివెల్తున్నామంటే, ధ్యానం చేస్తున్నామంటే అదొక నామోషీగా భావిస్తాం.
3. ముస్లింలు, కిరస్తానీలు సొంతంగా వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్నారు. మనవాళ్ళు ఉద్యోగాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఎంత చిన్నదైనా సరే సొంతంగా చేసే వ్యాపారం సమాజం లో ఎంతో కొంత పరపతిని పెంచుతుంది.. ఎందుకంటేవ్యాపారం చేస్తున్న వాడి దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వచ్చి పార్టీ చందా అడుగుతాడు, లేబర్ యూనియన్ల వాళ్ళు వచ్చి చందాలడుగుతారు.. మనం కూడా entrepreneurs గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉదా:- కర్నూల్ పుల్లా రెడ్డి గారు పక్కా హిందుత్వవాది కానీ ఆయన్ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేకపోయింది.. ఎందుకంటే సమాజం లో ఆయన విలువ అలాంటిది.. అదే ఇంకెవరైనా అయ్యుంటే మన కమ్యూనిష్టులు, సెక్యులరిస్టులు, మట్టిస్టులు, మశానిస్టులు ఎప్పుడు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు.
మఱో సభ్యుడు : నాకున్న కొద్దిపాటి అనుభవంతో నా అభిప్రాయాలు కొన్ని పంచుకుంటాను.
1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.
నాకు ఇది సెకండరీ అని అనిపిస్తుంది. వాళ్ళు మతం మారడానికి ముఖ్యకారణం డబ్బే. వాళ్ళు ఒక సారి మారిన తర్వాత ప్రతి ఆదివారం ప్రార్థనామందిరానికి రావాలనీ, వాళ్ళ సామూహిక ప్రార్ధనలలో పాల్గోవాలనీ వారిని బలవంత పెడుతుంటారు. పేదరికం కారణంగా ముందు మతం మారినా, తర్వాత ఇష్టం లేకున్నా వారు తప్పనిసరిగా ఆ మత నియమాలను పాటించాల్సిందే. అలాగే ఎవరైనా కొత్తవారిని వారి మతంలోకి తీసుకువస్తే అలా తీసుకు వచ్చిన వారికి కొంత డబ్బు ఇస్తారు.
వినాయక చవితి నాడు మాత్రం మన వాళ్ళు పూజ అయ్యాక సినిమా పాటలు పెడతారు. అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న పిల్లలు కేరమ్స్ ఆడుకుంటూ కనిపించారు. పెద్దవాళ్ళంతా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు వాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు పెట్టుకున్నారు. ఈ పరిస్థితి మారాలి. మనమంతా తప్పని సరిగా దేవతా స్త్రొత్రాలనో, ఆధ్యాత్మిక ప్రసంగాలనో, పూజ్యుల ప్రవచనాలనో ఇలాంటి సంధర్భాలలో పెట్టేటట్లుగా చూడాలి. వీలైతే మనమే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మన ఇరుగుపొరుగులో ఉన్న చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, మన మత గొప్పతనాన్ని వివరించాలి మన ఆచార వ్యవహారాల ప్రాముఖ్యత అందరికీ తెలియజెప్పాలి. వారితో కలిసి కనీసం వారానికి ఒక సారైనా ఇంట్లో కూర్చొని పూజ చేయడం గానీ, దేవాలయానికి వెళ్ళడం కానీ చేయాలి చేయాలి.
వినతి చేసిన సభ్యుడు : నా దృష్టికొచ్చిన ఒకటి-రెండు అంశాలు వ్రాస్తాను.
౧. వారి మతబోధ క్లిష్టమైన వేదాంత సమస్యల చుట్టూ, లోతైన అంతరార్థాల చుట్టూ కాకుండా నిత్యజీవితానికి పనికొచ్చే బైబిలుబోధల చుట్టూ పరిభ్రమిస్తుంది. మనదేమో పక్కా intellectual religion అయికూర్చుంది. ఆ వ్యాఖ్యానాలూ, వివరణలూ కొద్దిమంది వయసుమళ్ళిన ఛాందస మేధావులకి ఆత్మానంద దాయకం. కానీ వినలేకా, అర్థం చేసుకోలేకా మిహతా సామాన్యజనం విసిగున్నారు.
౨. వారి మతబోధలో పరమత దూషణ, పరధర్మీయుల్ని పరాభవించడం, అపహాస్యం చేయడం, హీనంగా మాట్లాడడం కూడా ఉంటాయి. ఈ పనులు మన మతబోధకులు కలలో కూడా చేయరు.
౩. వారి మతగ్రంథాలూ, పాటలూ, స్తోత్రాలూ, మంత్రాలూ (అవి మంత్రాలని మనం అనుకుంటే) జనసామాన్య భాషలోనే ఉంటాయి. అందఱికీ అర్థమయ్యేలా ఉంటుంది యావత్తు మతనిర్వహణ. మనదంతా నిగూఢం. అయోమయం, రహస్యం. ఎంత అర్థం కాకపోతే అంత గొప్ప. చివఱికి ఈ అర్థం కానితనమే మనలో ఒక సంస్కృతిగా పరిణమించింది.
౪. వారిలో - ప్రార్థనామందిరాలకొచ్చే భక్తుల ఆర్థిక సమస్యల్ని కూడా మతగురువులు పట్టించుకుంటారు. ఉదాహరణకి - పేద భక్తుల కోసం హోల్‌సేల్ వ్యాపారులతో ఒక ఒప్పందానికొచ్చి తక్కువధరలకి కిరాణా సరుకుల వేలాన్ని ప్రార్థనామందిరంలోనే నెలకోసారి నిర్వహిస్తారు. మన విషయానికొస్తే, భక్తుల దగ్గఱ ఎంత గుంజుకుందామా ? అనేదే మన కాన్సంట్రేషను.ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. గుర్తుకొచ్చినప్పుడు వ్రాస్తాను.
మొత్తమ్మీద మన మతాన్ని ఒక అంతర్జాతీయ మతంగా, దేశదేశాల ఫెయిత్‌గా ఎలా రూపుదిద్దాలా ? అనేదే నా అంతర్మథనం. అలా చేయాలంటే మనం కొన్ని ఛాందసాల్ని వదిలిపెట్టాలనుకుంటాను. ఈ మతాన్ని ఈ దేశంలో పాటిస్తున్నట్లే యథాతథంగా అన్ని ఇతరదేశాల్లోనూ పాటించడం కుదరకపోవచ్చు. కనుక దీన్ని సాధ్యమైనంత అసంస్కృతీకరించి, సరళీకరించి ప్రచారం చేయాల్సి ఉంది. వాళ్ళ అవగాహన కోసం మన వివరణా, వ్యాఖ్యాన పద్ధతుల్ని కాస్త మార్చాలి. పురాణమతాన్ని చాలావఱకు గోప్యం చేయాలి.
వేఱొక సభ్యుడు :-
౧. మత ప్రచారానికి కావాల్సిన మానవ వనరులు సంపాదించుట.ఇది వారు చేసే మొదటి పని. అందుకే పేదలు, అనాథలు అంటూ కొన్ని తరాల పాటు మతానికి కావాల్సిన మానవ వనరులను సంపాదిస్తారు. తరువాత ముసుగులన్నీ తొలగించి పూర్తి మతాంతరీకరణ వైపు జరుపుతారు. ఇలా చేయటం కోసం అప్పటికే ఉన్న మానవీయ కేంద్రాలను నాశనం చేయటం, నేరుగానో, తిరగగానో. అందుచేత ఆర్థికంగా బలంగా ఉండటం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.
౨. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం వాడకపోవటం. ఉదాహరణకు జర్మనులు ఒక రకంగా మతాంతరీకరించబడ్డారు, రోమన్లు ఒక రకంగా, ఆఫ్రికన్లు ఒక రకంగా, రెడ్ ఇండియన్లు ఒక రకంగా, దక్షిణ అమెరికన్లు ఒక రకంగా, గోవా వారు ఒక రకంగా, కేరళ వారు ఒక రకంగా.
౩. ప్రణాళికాబద్దంగా పోవటం.
౪. ఓపిగ్గా దశాబ్దాలు, శతాబ్దాలు ప్రయత్నించటం.
౫. కేంద్రీకరించబడ్డ వ్యవస్థ ఉండటం.
ఇంకో సందర్భంలో ఇంకో సభ్యుడు చెప్పినది :
హైందవేతర ప్రార్థనాస్థలాల్లో రాజకీయాలూ, సామాజికాలూ మాట్లాడ్డం నిషిద్ధం కాదు. అసలుదేవుణ్ణొదిలేసి అవే ఎక్కువగా చర్చిస్తూంటారక్కడ. కానీ హిందూ దేవాలయాల్లో అవి మాట్లాడ్డం నిషిద్ధంగా భావిస్తారు. మనం అవి మాట్లాడబోతే అవన్నీ ఇక్కడొద్దని తోటిహిందువులే మనల్ని వారిస్తారు. నిరుత్సాహపఱుస్తారు. క్రైస్తవంలా, ఇస్లాములా హిందూమతం మతస్థుల సమైక్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న political, strategic creed కాదు. ఇది వ్యక్తియొక్క వైయక్తిక ఆధ్యాత్మిక సాధన, మోక్షం గుఱించి ఎక్కువ emphasis (వక్కాణింపు) చేసే మతం. అందువల్ల హిందువులు గుమిగూడే చోట్ల కూడా తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల గుఱించి వారిని చైతన్యపఱచడం ఇసుమంతైనా సాధ్యం కావట్లేదు. కనీసం Endowments శాఖ కింద లేనటువంటి ప్రైవేటుగుళ్ళల్లోనైనా మన వాళ్ళకి సమావేశాలూ అవీ ఏర్పాటూ చేసి చైతన్యపఱచడం అవసరం. దీన్తోపాటు హిందూనాయకులు చేసిన ప్రసంగాల సీడీలు అక్కడ అందుబాటులో ఉంచి వాటిని తఱచుగా అందఱికీ వినపడేలా మోగిస్తూ ఉండాలి.