14, అక్టోబర్ 2011, శుక్రవారం

థాయ్ ల్యాండ్ : ఇది బౌద్ధదేశమా ? హిందూదేశమా ?

థాయ్ ల్యాండ్ - మనకు పొఱుగున బర్మా (మయన్మార్) పక్కన ఉన్న దేశం. మలేషియాతో కూడా దీనికిసరిహద్దుంది. అయితే మలేషియా ముస్లిమ్ దేశం కావడం చేత దీనికీ, దానికీ మధ్య చాలా గొడవలున్నాయి. మలేషియా తమ దేశపు దక్షిణప్రాంతంలోని ముస్లిమ్ లని మచ్చిక చేసుకొని వాళ్ళని టెఱ్ఱరిస్టులుగా మార్చి తమ మీదికి పంపుతున్నదని థాయ్ ల్యాండ్ చాలా రోజులనుంచి ఆరోపిస్తున్నది. ఇది ఆసియాఖండంలో విదేశీ పరిపాలనని ఎప్పుడూ చవిచూసి ఎఱుగని అరుదైన దేశాల్లో ఒకటి. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెట్టింపు ఉండే ఈ దేశంలో జనాభా ఆఱున్నఱకోట్లు మాత్రమే. ప్రస్తుతం ఆ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి శ్రీ భూమిబల్ అతుల్యతేజ(జ్) భారతీయ క్షత్త్రియవంశానికి చెందినవాడు. నేపాల్ రాజవంశం రాజా బీరేంద్ర బిక్రమ్ షహా తో అంతరించి పోయాక బహుశా ఈయనొక్కడే ఇప్పుడీ కలియుగంలో భూమండలం మీద మిగిలిన ఏకైక క్షత్త్రియరాజు. ఆయన బహుచిన్నతనం నుంచి అంటే 1945 నుంచి రాజుగానే ఉన్నాడు.



ఇక్కడ విచిత్రమేంటంటే రాజు హిందువు. ప్రజలేమో బౌద్ధులు. కానీ థాయ్ రాజబిరుదాల్లో ఆయన్ని థేరవాద బుద్ధధర్మ పరిరక్షకుడని చదువుతారు. (చిఱు వివరణ :- థేరవాదం అంటే బుద్ధుణ్ణి దేవుడుగా కాక గురువుగా మాత్రమే భావించే బౌద్ధశాఖ. మన ఆంధ్రదేశంలో ఒకప్పుడు నాగార్జునుడు బోధించిన మహాయాన బౌద్ధానికి ఇది కొంచెం విరుద్ధంఅన్నమాట. మహాయానంలో బుద్ధుణ్ణి దేవుడుగా కొలుస్తారు)


అయితే రాజు చాలా విషయాల్లో బౌద్ధాన్ని అనుసరించడు. అందుచేత తనకోసం ప్రత్యేకంగా ఒక హిందూబ్రాహ్మణ్ణి రాజగురువుగా పెట్టుకున్నాడు. ప్రస్తుత రాజగురువు పేరు ఫారా రాజగురు వామదేవముని. అలాగే సలహాలివ్వడానికి ఆయనకొక రాయల్ కౌన్సిల్ ఉంది. అందులో ఏడుగురు భారతీయ బ్రాహ్మలున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా రాజుగారి పూర్వీకుల మాదిరే ఏ కాలంలోనో భారతదేశం నుంచి వలసపోయినవాళ్ళు. స్థానిక థాయ్ ఆడవాళ్ళని చేసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ ముఖకవళికలు భారతీయుల్లా అనిపించవు. ఇప్పుడు వాళ్ళందఱికీ థాయ్ భాషే మాతృభాష. ఈ థాయ్ భాష అక్షరాలు ప్రాచీన దాక్షిణాత్యబ్రాహ్మి (అంటే ఇప్పటి తమిళలిపికి దగ్గఱ) నుంచి ఉద్భవించాయట.



థాయ్ ల్యాండ్ లో తొంభై అయిదుశాతం మంది బౌద్ధులుగా నమోదయ్యారు. అయిదుశాతం మంది మాత్రమేబౌద్ధేతరులు. అందులో కేవలం ఒక లక్ష జనాభా గల హిందువులు కూడా ఉన్నారు. ఈ హిందువుల్లో ఎక్కువమంది ఇటీవలి శతాబ్దాల్లో భారతదేశం నుంచి అక్కడికి వలసపోయినవాళ్ళే. వీళ్ళు వలసపోవడానికి ముందే ఆ దేశంలో శివాలయాలూ, బ్రహ్మాలయాలూ, విష్ణ్వాలయాలూ, విఘ్నేశ్వరుడి ఆలయాలూ వేలాదిగా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాటిల్లో పెక్కు ఆలయాలు ఈమధ్య కట్టినవి కావు. చాలా ప్రాచీనమైనవి. కట్టించినది భారతీయులు కారు. థాయ్ వాసులే. కొన్నైతే రాజుగారే ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేసి మఱీ కట్టించాడు. ఎటొచ్చీ, ఇక్కడొక తమాషా ఉంది. బౌద్ధంలోంచే హిందూమతం ప్రభవించిందని ఎక్కువమంది థాయ్ వాసులు నమ్ముతారు. ఇదొక అమాయక నమ్మకమే తప్ప ఇందులో మనల్ని (భారతీయుల్ని) అవమానించేదేమీ లేదు. ఎందుకంటే తాము అవలంబిస్తున్న హిందూమతాన్ని ఇండియా అనే ఒక పొఱుగుదేశంలో కూడా అవలంబిస్తారని బాగా చదువుకున్నవాళ్ళకి తప్ప సామాన్య థాయ్ పౌరులకి తెలీదు.



థాయ్ బౌద్ధ భక్తుల ద్వారా ఈ దేవాలయాలకి భారీగా ఆదాయలొచ్చిపడుతున్నాయి. కారణం ఏంటంటే - థాయ్ ప్రజలు వేదాంతంలో బౌద్ధాన్ని, లౌకిక జీవితంలో హిందూమతాన్ని అవలంబిస్తారు. ఉదాహరణకి - బౌద్ధంలో సన్న్యాసం తప్ప వేఱే ఆశ్రమం లేదు. కనుక పెళ్ళిళ్ళూ పేరంటాలూ, గృహప్రవేశాలూ గట్రా కర్మతంత్రాలకి హిందూ ఆచరణలు చేస్తారు. అలాగే కోరికల కోసం మొక్కుకోవడానికి హిందూ దేవాలయాలకి వెళతారు. బుద్ధుడు కోరికలు తీర్చడని వారి అభిప్రాయమట. అలా అక్కడ అడుగడుగునా బుద్ధుడికీ, హిందూ దేవతలకీ సమాన ప్రతిపత్తి చాలకాలంనుంచి కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలోని మతపరిస్థితుల మీద ఒక విపులమైన వ్యాసాన్ని ఈ క్రింది లంకెమీద నొక్కి చదవొచ్చు.

http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=3760


మఱికొన్ని ఛాయాచిత్రాలు ఈ క్రింద:






భగవంతుడు మన మీద ఆగ్రహిస్తే ఏంచేయాలి ?

సాధారణంగా భగవంతుడికి ఎవరి మీదా ఆగ్రహం కలగదు. ఆయన ఒక తెలివైన కర్మయంత్రాన్ని నిర్మించి ఉన్నాడు. ఆ కర్మయంత్రమే తానై ఉన్నాడు. కనుక మనుషుల దోషాలకి వారిని వాటినుంచి పరిశుద్ధుల్ని చేసే పనిని ఆ యంత్రమే తెలివిగా చేసుకుంటూ పోతుంది. దాని పనిలో ఆయన జోక్యం చేసుకోవడం అరుదు. అయితే తత్కారణం చేత ఆయనకి కామక్రోధాలు లేవని తలచడం సరికాదు. కోపించక పోవడం వేఱు. కోపమే లేకపోవడం వేఱు. సృష్టిఉన్నంతకాలం ఆయన సగుణ పరబ్రహ్మగానే ఉంటాడు. కనుక ఆ స్థితిలో ఆయనకి మాయామయమైన మనస్సు ఉంటుంది. అది ఉంటుంది కనుక కామక్రోధాలూ ఉంటాయి. కల్పాంతంలో సృష్టి అంతమయ్యాక ఆయన నిర్గుణ పరబ్రహ్మగా ఉంటాడు. అప్పుడాయనకి కామక్రోధాలు ఉండవు. మఱి సృష్టి ఉన్నప్పుడు ఆయన ఎందుకలా ? అనడిగితే, సృష్టి నడవాలంటే కామక్రోధాలుండాలి. నీ తండ్రిలో లేనిదేదీ నీలో లేదు. నీ తండ్రికి కామక్రోధాలుంటేనే నీకూ కామక్రోధాలుంటాయి. ఈ సత్యానికి హిందూమతమే కాక అన్ని మతాలూ సాక్ష్యం పలుకుతున్నాయి. "యెహోవా అను పేరుగల నేను మిక్కిలి రోషము గల దేవుడను" అని ఆయన అన్నట్లు యూదుల మతగ్రంథం పేర్కొంటోంది. ఇస్లామ్ కూడా దైవాగ్రహం (wrath of God) గుఱించి ప్రస్తావిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో భగవంతుడిలా చెప్పారు : "అవధూతది సంకల్పరహితమైన జ్ఞానం. నాది సంకల్పసహితమైన జ్ఞానం. నేను తల్చుకుంటే మోక్షం పొంది నాలో లీనమైనవాణ్ణైనా సరే, భూలోకంలో జన్మించమని ఆదేశించగలను."

దేవుడు మనలాంటివాడు కాదు గనుక ఆయనకి కామం లేదనీ, క్రోధం లేదనీ ఆయనెప్పుడూ చిఱునవ్వులు చిందిస్తూనే ఉంటాడనీ, మనమెన్ని వెధవపనులు చేసినా, ఎన్నిసార్లు చేసినా క్షమిస్తూ పోవడమే తప్ప ఆయనకి వేఱే పని లేదనీ - ఈ రకమైన అడ్డదిడ్డమైన, అవాస్తవిక పచ్చి అబద్ధాలు, దగాకోరు సిద్ధాంతాలు - కేవలం తమ మతప్రచారం, మతమార్పిళ్ళ కోసం కొందఱు కనిపెట్టినవి. ప్రపంచంలో పాపాత్ములెక్కువ కనుక వాళ్ళకి ఈ సిద్ధాంతాలు బాగా నచ్చుతాయని వాళ్ళకి తెలుసు. ఇవి తమ పాపాల్ని తామే క్షమించేసుకునే హక్కుని మానవులకి కట్టబెట్టాయి. వీటి ప్రచార ప్రభావానికి హిందువులు కూడా లోనై తమ మతగ్రంథాలు భగవంతుడి సంపూర్ణ మూర్తిమత్త్వాన్ని గుఱించి చేసిన వర్ణనల్ని మర్చిపోతున్నారు. మర్చిపోయారు. శివుడు సంభోగించడమేమిటంటున్నారు. కృష్ణుడు దేవుడైతే ఆయనకి గోపికలతో రాసలీలలేంటంటున్నారు. ఇదంతా విదేశీ మతసిద్ధాంతాల ప్రభావం.

భగవంతుడిలో దివ్యాంశలూ ఉన్నాయి. రాక్షసాంశలూ ఉన్నాయి. మంచీ ఆయనదే, చెడూ ఆయనదే. అయితే పామువిషం పాముకి బాధాకరం కానట్లే భగవంతుడి మాయాశక్తికి సంబంధించిన ఈ అంశల వల్ల ఆయనకి మాత్రం ఏ నష్టమూ లేదు. కానీ ఇవి మనలాంటి జీవుల అదుపాజ్ఞల్లో ఉన్న అంశలు కావు కనుక, ప్రస్తుతం మనమే వాటి అదుపాజ్ఞల్లో ఉన్నాం కనుక వీటి నాశ్రయించడం వల్ల మనకి నష్టం ఉంది - ఇదే హిందూమత సారాంశం. ఇందాక అనుకున్నట్లు భగవంతుడికి నిజంగా నిజమైన కోపం వచ్చేసందర్భాలు మహా అరుదు, అపురూపం. కారణం - సాధారణంగా మనం మనలాంటివాళ్ళ మీదా మన స్థాయిలో ఉన్నవాళ్ళ మీదా మాత్రమే కోపిస్తాం (కోపించగలం) తప్ప తద్భిన్నులైనవారియందు కోపించడం జఱగదు. పెళ్ళాం మీద కోపమొస్తుంది గానీ బాస్ మీద రాదు. మనమేంటో మన స్థాయి ఏంటో, మన పూర్వజన్మకర్మ ఏంటో, భవిష్యద్‍గతి ఏంటో అంతా ఆయనకి కూలంకషంగా తెలుసు కనుక ఆయనకి కోపం రాదు. ఒకవేళ వచ్చినా అది వాచా వ్యక్తీకరించబడక సంఘటనల రూపంలో వెల్లడవుతుందంతే ! దేవుడు కనిపించి కోపంగా మాట్లాడాడంటే మాత్రం ఆ వ్యక్తిమీద ఆయనకి విశేషమైన అనుగ్రహం ఉందనీ, అతన్ని మరమ్మత్తు చేసి అతని ద్వారా ఏదో లోకకల్యాణాన్ని సాధించదల్చుకున్నాడనీ అర్థం.

భగవంతుడికి తనమీద కోపం వచ్చిందని భావించిన భక్తుడు భగవంతుని అప్రమాద్యత (infallibility) పట్లా, న్యాయబుద్ధి (sense of justice) పట్లా అచంచల విశ్వాసాన్ని ఉంచాలి. కోపంలో సైతం ఆయన న్యాయంగానే వ్యవహరిస్తాడనీ, జీవుల్ని దయగానే చూస్తాడనీ నమ్మాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, "హే భగవాన్ ! నేను అల్పుణ్ణి. నీవు మహోన్నతుడివి. నువ్వు జ్ఞానసముద్రానివి. నేను మూఢుణ్ణి. నేను జీవుణ్ణి,. నువ్వు పరమాత్ముడివి. తప్పులు చేయడమే నాకు సహజం. నా తప్పుల పట్ల కోపించడం నీకు సహజం. నీ మందలింపులకీ, దండనకీ నేనెల్లప్పుడూ పాత్రుణ్ణే. నా బుద్ధిహీనత వల్లా, పూర్వ దుస్సంస్కారాల ప్రాబల్యం వల్లా నేను పొఱపాటు చేశాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. నీ ఆదేశానుసారమే చరించి నీకు ప్రియతముణ్ణి కావడానికే ప్రయత్నిస్తాను. నన్ను క్షమించు. నేను నీ బిడ్డని. నీ దాసానుదాసుణ్ణి" అని సర్వస్యశరణాగతి చేసి స్తోత్రం చేయాలి. అప్పుడాయన సంతోషించి ప్రసన్నుడై సరైన దారి చూపుతాడు.

4, అక్టోబర్ 2011, మంగళవారం

తపోవనాల పునరుద్ధరణ

ప్రాచీనకాలంలో ఆధ్యాత్మిక జీవనానికి అంకితం కాదల్చుకున్నవారు గ్రామాల్నీ, నగరాల్నీ, పట్టణాల్నీ వదిలిపెట్టి తపోవనాలనబడే ప్రత్యేక ప్రదేశాలకి వెళ్ళేవారు. వాటి ప్రస్తావనని ఈ కాలంవారు సాధారణ అడవులుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అవి సాధారణ అడవులు కావు. వాటికి రాజుల (ప్రభుత్వం) నుంచి ప్రత్యేక రక్షణ ఉండేది. వాటిల్లో క్రూరమృగాలూ అవీ తిరక్కుండా రాజులు ఏర్పాట్లు చేసేవారు. విదేశీ దండయాత్రలూ, పాలనా ఆరంభమయ్యాక తపోవనాల పరిభావన అంతరించిపోయింది. ఈ సంప్రదాయాన్ని ఆధునికకాలంలో పునరుద్ధరించడం అవసరం. తమలాంటివారి సత్సంగంలో ఆధ్యాత్మిక జీవనం మఱింత ఆనందదాయకంగా, ఏకాగ్రంగా ఉంటుంది.


ఈ రోజుల్లో కూడా కొంతమందికి నగరాల రణగొణధ్వనికీ, నాగరికుల కుళ్ళుకూ, డబ్బుకుత్సితాలకూ దూరంగా, ప్రశాంతంగా, ఒంటరిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఉంటుంది. కానీ ఆ కోరిక తామొక్కఱే ఎలా తీర్చుకోగలరో తెలీక యథాపూర్వంగా మిగుల్తూంటారు. అందుచేత వ్యక్తిగతంగా కాకుండా అందఱమూ కలిసి ఒక సామూహిక కార్యక్రమంగా పూనుకొని ఇలాంటివారి కోసం కనీస సౌకర్యాలతో తపోవనాల్ని ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఇవి వృద్ధాశ్రమాలుగా కూడా ఉపయోగపడతాయి. వీటికి వ్యాసారణ్యం, వసిష్ఠాశ్రమం, వైశంపాయనం లాంటి సాంప్రదాయిక నామాలు పెట్టుకోవాలి.


నా ఆలోచనలు వ్రాస్తున్నాను. తేలిగ్గా తీసుకోకుండా, కొట్టిపారేయకుండా పరిశీలించగలరు.


౧. ఎక్కడైనా ఒక గ్రామీణ/ గిరిజన ప్రాంతంలో ఒక చిన్న పట్టణానికి గరిష్ఠంగా 40 కి.మీ.ల దూరంలో ఒక వందెకరాల స్థలాన్ని సేకరించాలి.


౨. ఆ స్థలం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టాలి.


౩. లోపల దేన్నీ చదును చేయనక్కఱలేదు. అలాగే వదిలేసి మంచి నీడనిచ్చే చెట్లూ, ఫలపుష్పవృక్షాలూ పెంచాలి.


౪. చిన్నాపెద్దా మట్టిరోడ్లు వేయాలి.


౫. మూడే మూడు గదులు గల కాటేజీ కట్టడాలు, కేవలం రెండు అంతస్తులవి సుమారు 100 - 200 దాకా నిర్మించాలి.


౬. ప్రతి కాటేజికి నీరు, విద్యుత్తు, ల్యాండ్‌లైన్ టెలిఫోను సౌకర్యాలు మాత్రం కల్పించాలి.


౭. తపోవనంలో శాశ్వత సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి హిందువూ/ ప్రతి హిందూ జంటా రు. ఇంత అని రుసుము పెట్టాలి. అది 4 వాయిదాల్లో 6 సంవత్సరాల లోపల చెల్లించమని కోరాలి. ఇహ నెలవారీ కట్టేది ఏమీ ఉండ(కూడ)దు. ఇది మొదటి 20 ఏళ్ళలోపల 50% మాత్రమే ప్రతిదాతవ్యం (refundable). 20 ఏళ్ళు గడిచాక 25% శాతం మాత్రమే ప్రతిదాతవ్యం.


౮. రుసుము కట్టినంత మాత్రాన కాటేజీలు సభ్యుల ఆస్తులు కావు. అవి తపోవనం ఆస్తులే. వారి మరణానంతరం అవి ఇతరులకి కేటాయించబడతాయి.


౯. 45 ఏళ్ళలోపువారికి తపోవనంలో సభ్యత్వం లేదా వాస్తవ్యహోదా ఇవ్వకూడదు. వారు సభ్యుల కుటుంబసభ్యులైనా సరే ! ఒక్కొక్క కాటేజికి గరిష్ఠంగా నలుగుఱు వాస్తవ్యుల్ని అనుమతించవచ్చు. ఎవఱి తిండి, బట్ట, వైద్యం లాంటి నిర్వహణ ఖర్చులు వారివే. తపోవనం బాధ్యత తీసుకోదు.


౧౦. తపోవనానికి ఒక కార్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక దుకాణ సముదాయం, ఒక కమ్యూనిటీ సెంటర్, ఒక వైద్యశాల, ఒక ఆడిటోరియమ్ ఉండాలి.


౧౧. తపోవనం కేంపస్ లో హోటళ్ళనీ, లాడ్జింగుల్నీ, విందు-వినోదాల కేంద్రాల్నీ, వ్యాపార కేంద్రాల్నీ, స్కూళ్ళనీ, కాలేజీలనీ, గోడౌన్లనీ అనుమతించకూడదు.


౧౨. తపోవనంలో 5 - 10 హిందూ దేవాలయాలు ఉండాలి. ఇతర మతాల ప్రార్థనామందిరాల్ని అనుమతించకూడదు.


౧౩. ఇదంతా ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం కనుక కాటేజిలకి బాహ్యప్రపంచంతో సంబంధం కల్పించే టివి., రేడియో, సెల్‌ఫోను, అంతర్జాలం, దినపత్రిక లాంటి సౌకర్యాల్ని నిషేధించాలి. కావాల్సినవారు తపోవనం కమ్యూనిటీ సెంటర్ కి వెళ్ళి వాటిని ఉపయోగించుకోవచ్చు,


౧౪. కాటేజివాసులు సొంత కంప్యూటరు, ప్రింటరు, గ్యాస్ బండ, గీజరు, ఐరన్, సి.డి.ప్లేయరు, డి.వి.డి. ప్లేయరు, క్యామరా, రిఫ్రిజిరేటరు, మిక్సీ లాంటివి పెట్టుకుని వాడుకోవచ్చు.


౧౫. సొంత సైకిళ్ళకి తప్ప ఏ విధమైన పెట్రోలు/ డీసెలు వాహనాలకీ కేంపస్ లో అనుమతి ఇవ్వకూడదు. కావాల్సినవారు తపోవనం బస్సులో సమీప పట్టణానికి వెళ్ళి పనులు చూసుకొని రావచ్చు.


౧౬. సభ్యులు అన్నిరకాల లౌకిక మఱియు ధనసంపాదన కార్యకలాపాల నుంచి formal గా విరమించుకున్నవారై ఉండాలి. కేంపస్ లో ఉంటూ పుస్తకాలు వ్రాయడం, ముద్రించడం, అమ్మడం, ఉపన్యాసాలివ్వడం తప్ప ఇంక ఏ విధమైన లాభసాటి ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్నీ సాగించకూడదు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి