29, ఫిబ్రవరి 2012, బుధవారం

మహాత్ముడికే మత మార్పిడి ; మరణానంతరం బాపూజీకి బాప్టిజం ; లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?

మహాత్ముడికే మత మార్పిడి ;
మరణానంతరం బాపూజీకి బాప్టిజం ;
లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?


బయటపెట్టిన పరిశోధకురాలు రాడ్ కీ
రికార్డులు మాయమయ్యాయని వెల్లడి
మహాత్ముడి మనవడి విస్మయం
మండిపడ్డ హిందూ అమెరికా ఫౌండేషన్
చర్చి అధ్యక్షుడి క్షమాపణకు డిమాండ్

"ప్రపంచంలో అన్ని మతాలూ నిజమే, అన్నిట్లోనూ ఏవో కొన్ని లోపాలున్నాయి. అయినప్పటికీ నా మతం నాకు గొప్పది. ఒక మతం వ్యక్తి మరొక మతంలోకి మారాల్సిన అవసరం లేదు. అయితే, ఒక హిందువు మరింత ఉత్తమమైన హిందువుగా మారాలి. ఒక క్రైస్తవుడు మరింత ఉత్తమమైన క్రైస్తవుడుగా, ఒక ముసల్మాన్ మరింత ఉత్తమమైన ముసల్మాన్‌గా మారాలి.'' - మహాత్మా గాంధీ (యంగ్ ఇండియా 28.01.1928)

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత సంస్థలు... మరణానంతరం మహాత్ములకూ మతాన్ని అంటగడుతున్నాయా? హిందూమత సిద్ధాంతాల్నీ.. గీతాసారాన్నీ బలంగా విశ్వసించిన మహాత్ముడికి ఒక అమెరికన్ చర్చ్ బలవంతంగా క్రైస్తవం ఇచ్చిందా? మరణానంతరం ఆయన పేరు మీద బాప్టిజం 'ప్రసాదించిందా'? ..ఈ ప్రశ్నలన్నిటికీ హెలెన్ రాడ్ కీ అనే పరిశోధకురాలు అవుననే సమాధానమిస్తున్నారు.

1996 మార్చి 27న అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ నగరంలో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్డీఎస్) గాంధీజీ పేరిట బాప్టిజం ఇచ్చిందని, సావోపాలో బ్రెజిల్ టెంపుల్‌లో 2007 నవంబరు 17న ఈ ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఎల్డీఎస్ చర్చ్ మోర్మన్ చర్చ్‌గా బహుళప్రాచుర్యం పొందింది. గతంలో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్‌కెర్రీ, 2012 అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిట్ రోమ్నీ వంటివారు ప్రముఖ మోర్మన్లు. గాంధీజీ పేరు మీదబాప్టిజం ఇచ్చినట్టు వెల్లడించిన హెలెన్ రాడ్‌కీ సైతం ఒకప్పుడు మోర్మనే. అనంతరకాలంలో ఆమె చర్చ్ నుంచి వెలికి గురయ్యారు.

'ది డైరీ ఆఫ్ ఏన్ ప్రాంక్' రాసిన యూదు చిన్నారి ఏన్‌ఫ్రాంక్ కు కూడా ఎల్డీఎస్ ఇలాగే మరణానంతరం బాప్టిజం ఇచ్చినట్టు గతంలో వెల్లడించి సంచలనం సృష్టించిన చరిత్ర రాడ్‌కీకి ఉంది. ఇదే కోవలో.. గాంధీజీకి కూడా లేటర్‌డే సెయింట్స్ చర్చ్ బాప్టిజం ఇచ్చినట్టు నెవడాలోని హిందూ కార్యకర్త రాజన్ జెడ్‌కు ఆమె ఒక ఈమెయిల్ పంపారు. గాంధీజీ పేరు మీద బాప్టిజం ఇచ్చినట్టుగా ఉన్న రికార్డును తాను ఫిబ్రవరి 16న చూసినట్టు అందులో పేర్కొన్నారు. అయితే... తాను చూసిన కొద్దిరోజులకే ఆ రికార్డును మాయం చేశారని, అదిప్పుడు దొరికే అవకాశం లేదని వెల్లడించారు. ఇలా ఒక రికార్డు మాయమవడం అసాధారణమైన విషయమని తన మెయిల్‌లో పేర్కొన్నారు.

ఈ విషయం ఇతరులకు తెలియకూడదన్నది మోర్మన్ల ఉద్దేశంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఈ విషయం తెలిసి మహాత్ముడి మనుమడు అరుణ్‌గాంధీ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఒక వ్యక్తి మరణించాక, అతని పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. హిందువులుగానీ, ఇతర మతస్థులెవరైనాగానీ... మతమార్పిడికి పాల్పడటాన్ని తన తాతయ్య పూర్తిగా వ్యతిరేకించేవారని అరుణ్ అన్నారు. గాంధీజీ అన్ని మతాలనూ గౌరవించేవారని, ఏ మతాన్ని అనుసరించాలన్నది వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవాలని, ఇతరులు వారిని బలవంతం చేయకూడదని భావించేవారని అరుణ్‌గాంధీ వివరించారు.

ఇక... హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం గల గాంధీజీ పేరు మీద ఆయన మరణానంతరం బాప్టిజం ఇవ్వడమంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని వాషింగ్టన్‌లోని హిందూ అమెరికా ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)కు చెందిన సుహాగ్ శుక్లా మండిపడ్డారు. ఈ విషయమై రాడ్‌కీ నుంచి లేఖ అందుకున్న రాజన్ జెడ్... దీనిపై తాను ఎల్‌డీఎస్ చర్చ్ అధ్యక్షుడు థామస్ ఎస్ మాన్సన్‌కు ఫిబ్రవరి 24న లేఖ రాశానని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆయన వద్ద నుంచి జవాబు రాలేదన్నారు. "మాన్సన్ దీనికి క్షమాపణ చెప్పాలి. ఇదెలా జరిగిందో ఆయన చెప్పాల్సిందే'' అన్నారు. 

andhrajyothy  news 

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

తమవేమో పవిత్రనమ్మకాలు, ఇతరులవేమో మూఢవిశ్వాసాలు !

౧) ఒక  తెల్ల  మిషనరి, ఇతర సమాజాలను (Societies) స్టడి చేస్తే దానిని "Anthropology" అంటాడు. తన సమాజాన్ని స్టడి చేస్తే దానిని "Sociology" అంటాడు.

౨) తెల్ల మిషనరి, ఇతర మత నమ్మకాలను Myth (Mythology) అంటాడు. తన మత నమ్మకాలను "Sacred Beliefs" అంటాడు 

౩) తెల్ల మిషనరి, ఇతరుల చరిత్రను "కల్పితము, మతవిశ్వాసము" అంటాడు. తన మతగ్రంథం మాత్రం "నిజమైన, నిఖార్సైన చరిత్ర" అని బుకాయిస్తాడు.

౪) తెల్ల మిషనరి, "ఇతరులు సైతానును కొలుస్తారు" అంటాడు "తాను ఒక్కడే నిజమైన దేవుడిని కొలుస్తున్నాను" అంటాడు 

౫) తాను 1st World అంటాడు. ఇతరులు 3rd World అంటాడు 

౬) "తాను ప్రపంచవ్యాప్తంగా ఇతర సమాజాలలోకి చొచ్చుకుపోయి మత మార్పిడి చేసి ఆ సమాజాన్ని నాశనం చేయవచ్చు" అంటాడు అక్కడి స్థానిక ప్రజలు దానికి అభ్యంతరం చెబితే (ప్రతిఘటిస్తే) , వారిని "తీవ్రవాదులు" అంటాడు 

 ౭) "తన పుస్తకమే నిజమైనది" అంటాడు. "ఇతరుల పవిత్ర గ్రంధాలు సైతాను ప్రేరేపించినవి" అంటాడు. అవి మూడు వేల సంవత్సరాలకు ముందునుంచి ఉన్నా, తమ మతం వయసు కేవలం 2 వేల సంవత్సరాలే అయినా !

23, ఫిబ్రవరి 2012, గురువారం

ఎక్కడైనా మహాసముద్రం ఇంకిపోతుందా?!!!

మహాసముద్రం ఇంకిపోతుందా?
గీతాంజలి మూర్తి


'ఎక్కడ ఆత్మ గౌరవం నిర్భయంగా తలెత్తుకుని తిరుగుతుందో 
ఎక్కడ లోకం సంకుచిత అడ్డుగోడలతో విచ్ఛిన్నం కాదో
అట్టి సర్వస్వతంత్ర స్వర్గంలోకి, 
తండ్రీ, నా దేశాన్ని నడిపించు'

- రవీంద్రనాథ్ టాగూర్ 'గీతాంజలి'

'ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉండాలి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేనందువల్లే భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడ్డాయని' కంచ ఐలయ్య తన 'హిందూ మతానంతర భారతదేశం'లో అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు అవగాహనతో చేసిన ఆరోపణ. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయ సామాజిక రంగాలలో వలే ప్రజాస్వామ్యం ఉండటమేమిటి? మనమేదో కొత్త భావాలు, 'పదజాలం' నేర్చుకున్నాం కాబట్టి, వాటిని అలౌకికమైన ఆధ్యాత్మిక రంగానికి పులమటమే తప్పు. అయినా హిందూ వ్యవస్థలో, మానవులందరూ సమానమేననీ, అందరికీ ఆ భగవంతుని దృష్టిలో సమానావకాశాలు ఇవ్వబడినాయనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

దార్శనికులైన భారతీయ ఋషులు సమస్త మానవ జాతి సుఖ సంతోషాలతో ఏ భేద భావం లేకుండా జీవించాలనీ, పశుపక్ష్యాదులను సైతం కరుణతో చూడాలనీ బోధించారు. వారి స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ 'సత్యాహింసలను' ఉద్యమ సాధనలుగా చేసుకొని దేశ స్వాతంత్య్రం సాధించారు. అయితే పూర్వకాలంలో అజ్ఞానంతో, అహంభావంతో కొందరు మూర్ఖులు, కొన్ని మూఢాచారాలతో సమాజంలో ఎక్కువ తక్కువలను పాటించిన మాట వాస్తవం. అయినా కాలక్రమంలో ఇప్పుడు చాలా మంది అవన్నీ వదిలివేసి, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఇష్టంగా ఆచరణలో పెడుతున్నారు.

ఆధునిక జీవన విధానంలో, విప్లవాత్మక మార్పులు వచ్చి, సమాజంలో, కులాంతర, మతాంతర వివాహాలు కూడా చాలా అసాధారణంగా జరిగిపోతున్నాయి. పెద్దలు కూడా విశాల హృదయంతో వాటిని ఆమోదించి, పరిణతి చెందిన మనసులతో అందరూ కలిసి మెలసి ఉండటం చూస్తున్నాం. హిందువులలో ఇలా విప్లవాత్మక మార్పులు నిశ్శబ్దంగా చోటుచేసుకోవటం గమనార్హం. ఇదొక గొప్ప మార్పు. ఇలా మార్పు జరిగింది. ఇంకా జరుగుతోంది. దీనిని ఐలయ్య గుర్తించి హర్షించరా? అంతేకాక అన్ని దేవాలయాలలోనూ, పరిపాలనా మండలులు చాలావరకు బ్రాహ్మణేతరుల చేతిలోనే ఉన్నవి కదా.

చాలాచోట్ల అన్ని కులాల, వర్గాల ప్రజలకు దేవాలయ ప్రవేశం నిరాటంకంగా హాయిగా జరుగుతోంది కదా. ఈ మధ్య మా తెనాలిలో శ్రీశ్రీ దండి స్వాముల వారి ఆధ్వర్యంలో సహస్ర హోమయాగం జరిగింది. అందులో అన్ని కులాల వారికీ వర్గాల వారికీ ఏ భేద భావం లేకుండా, ఆ యజ్ఞం స్వయంగా జరుపుకునే అవకాశం ఇవ్వబడింది. ఎందరో, ఎవరెవరో చుట్టు పక్కల ఊళ్ళ నుంచీ స్వేచ్ఛగా వచ్చి మహదానందంగా ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. తరువాత, అందరికీ సమానంగా ప్రసాదం (భోజనాలు) అందజేయ బడినాయి. నేను ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందించాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు కుల భేదం లేకుండా అనేక చోట్ల జరుగుతున్నది వాస్తవం.

మరొక అద్భుత మార్పు. డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయుని, దార్శనికుని నేతృత్వంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి కలిగించిన రిజర్వేషన్ల వలన అన్ని రకాల క్రింది వర్గాల వారికి విద్య/ఉపాధి ఇతర రంగాలలో అవకాశాలు మెండుగా ఇవ్వబడుతున్నాయి కదా. అన్ని రకాల, రాజకీయ పరిణతి వలన వివిధ అత్యున్నత రాజ్యాంగ పదవులను సైతం ఆ వర్గాల వారు అలంకరించటం కూడా వాస్తవమే కదా. నాకైతే ఈ ప్రగతిశీల పరిణామాలు ఎంతో సంతోషదాయకంగా ఉన్నవి.

ఇలా అన్ని భేద భావాలూ పోగొట్టుకుని అందరూ సమానావకాశాలతో ముందుకు సాగుతున్న ఈ రోజులలో ఐలయ్య లాంటివారు పనిగట్టుకొని కులద్వేషాన్ని రెచ్చగొట్టే రాతలు రాయటం ఎంత మాత్రం సబబు కాదు. అంతే కాదు ఎంతమందో మఠాధిపతులు, పీఠాధిపతులుగా కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు. నేను శిష్యుడిగా ఉన్న యోగదా సత్సంగ సొసైటీ (రాంచి)లో నిర్వాహకులు (అధిపతులు) దాదాపు అందరూ బ్రాహ్మణేతరులే. చక్కగా సన్యాసం పుచ్చుకొని, అందరికీ యోగ సాధనలను శాస్త్రీయంగా నేర్పుతున్నారు.

ఆశ్రమంలో, నాకు దీక్షనిచ్చిన సాధువు, హిందూ మతాన్ని ఇష్టంతో స్వీకరించిన ఒక విదేశీ సాధువు అంటే నమ్ముతారా? ఇది నా అనుభవంలో జరిగిన వాస్తవం. ఈ వాస్తవ నేపథ్యంలో కంచ ఐలయ్య లాంటివారు కళ్ళు బాగా తెరిచి, వారి భాషలోనే 'ప్రజాస్వామ్యం' హిందూయిజంలో సజావుగా అమలవుతోందనీ, వారేమీ ఆందోళన పడనవసరం లేదని, ఉచిత సలహాల పేరుతో, తప్పుడుభాష్యాలు చెప్పొద్దనీ నా సలహా.

ఇక భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడటానికీ హిందూయిజం మాత్రమే కారణం కాదు. కొన్ని ఆచార వ్యవహారాలు పాటించలేకపోవటం వలన, పూర్వం క్రింది వర్గాలను దేవాలయాలలోకి రానివ్వక పోవటం, దూరంగా ఉంచటం జరిగిన మాట వాస్తవమే. ఇది చాలా తప్పే కాని శ్రామిక వర్గాలను అణచివేసింది ఆనాటి/నేటి వ్యాపార వర్గాలు, రాజకీయులు, పాలకవర్గాలనేదే వాస్తవం. పాలనలో ఎవరుంటే వారు శ్రామికులకు న్యాయమైన ప్రతిఫలం ఇవ్వక దోపిడీ చేసి పైకిరానివ్వలేదు. హిందుయిజానికీ శ్రామికులకు ప్రత్యక్ష విరోధమెప్పుడూ లేదే.

అయితే పారిశ్రామికీకరణ జరిగిన/జరుగుతున్న క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగా మాత్రమే శ్రామికులు అభివృద్ధిలోకి వచ్చారనేది కాదనలేని వాస్తవం. ఈరోజు రైతులనూ, కూలీలనూ గిరిజనులనూ/క్రింది తరగతుల వారినందరినీ, వారి మనుగడనూ కాలరాసే వారు ఎవరు? కేవలం ఒక మతపరమైన హిందువులా లేక వ్యాపార రాజకీయ వర్గాలా? శ్రామికుల తరఫున పోరాడితే వామపక్షాలతో కలిసి పోరాడండి. ఫలితం రావచ్చు. అసలు వామపక్షాల వారు మీ పిడివాదమైన హిందూయిజం వ్యతిరేకత జోలికిరారే. వారికి ఉన్న ఇంగిత జ్ఞానం ఆచార్య పదవిని అలంకరించిన ఐలయ్యకు ఎందుకు లేదో ఆశ్చర్యం కలుగుతుంది. మోటుగా వాదిస్తే అది హేతుత్వానికి నిలవదు సుమా!

"క్రైస్తవ సమాజం ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని ఆచరించినందువల్లే, క్రిస్టియానిటీ 'వ్యాపించే గమనాన్ని' (స్ప్రెడింగ్ క్యారెక్టర్) సంతరించుకుని వేగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉందని'' డాక్టర్ గోపీనాథ్ ('ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య మేదీ?' జనవరి19, ఆంధ్రజ్యోతి) అన్నారు. ఆయనే మరో మాట శెలవిచ్చారు: 'హిందూ మతం కనీసం భారతదేశంలోనైనా బ్రతకాలంటే, అది తనను తాను సంస్కరించుకోవడం ఒకటే మార్గం'. ఎంత గొప్ప అవగాహన!

ఇందుకే కాబోలు, ఆ మధ్య గౌరవనీయులు పోప్ పాల్ అన్నారు:"there is a lot of untapped potential in india, for christianity to expand...' (సరిగ్గా ఈ మాటలే కాకపోయినా, ఈ భావవ వచ్చే మాటల్లో). నేను ఒప్పుకుంటున్నాను. క్రైస్తవ మతం తన సామ దాన భేద దండోపాయాలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తన కపట నాటకంతో, మాయ మాటలతో అమాయక పేదలు, గిరిజనులనే కాకుండా మితిమీరిన ధనాశ చూపించి, పెద్ద రాజకీయ నాయకులను కూడా బుట్టలో వేసుకోవటం జరుగుతోంది. మరి హిందువులు అస లు దురాశాపరులు కాదు కదా! వారిలాగా హిందూయిజం ఎలా వ్యాప్తి చెందుతుంది? చెందదు.

ప్రొఫెసర్ భూక్యా ఇలా రాశారు ('హిందూ ఫాసిజమే భారత్‌కు హాని' జనవరి 25, ఆంధ్రజ్యోతి): 'భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడైన వ్యక్తిని (ఇటలీ దేశస్థుడైన ఖత్రోచీ) చట్ట విరుద్ధంగా స్వదేశానికి వెళ్ళిపోవడానికి మన పాలకులే సహకరించలేదా?' హిందూయిజానికీ, ఖత్రోచీ పారిపోవటానికీ సంబంధమేమిటో పాఠకులకు తెలియజేస్తారా? ఖత్రోచీని, మీ నాయకురాలైన ఇటలీ దేశస్తురాలి ఆదేశాల పైనే కదా, ఆమె చేతినీళ్ళు తాగి బ్రతికే పాలకులు కుట్ర పూరితంగా, సురక్షితంగా దేశ హద్దులు దాటించారు? మీ నాయకురాలిని సూటిగా అడగలేకనా? దురదృష్టం. సరే, ఏది ఏమైనా కుయుక్తులతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం లాగా విస్తరించాలనుకున్న క్రిస్టియానిటీ పంథా హిందూ మతానికి అవసరం లేదు. హిందూ మతం అలా అధర్మ విధానానికి పాల్పడదు.

తెలిసో తెలియకో భూక్యా ఇలా రాశారు: 'ముస్లింల రాకతోనే హిందూ మతం పుట్టింది. అంతకు ముందు హిందూ అనే పదమే వాడుకలో లేదు'. రచయిత వాదనను బట్టి, ఇప్పుడు వ్యవహరిస్తున్న 'హిందూ' అనే పేరుతో పిలువబడుతున్న మతం ఈ భారతదేశంలో 'ముస్లిం' దోపిడీదారులు మన దేశంపైకి దండెత్తి వచ్చేవరకు లేదు. మరి ఈ జాతికి, అప్పుడు వ్యవహరిస్తున్న మతం ఏమిటి? ఏమీ లేదా? ఆలోచించడం. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు అనుసరించిన అప్పటి ప్రజలు దేనిని అనుసరించారు? వారి గురువులు వాటిలోని బోధనలను ఏమని చెప్పారు? ముస్లింలు రాక పూర్వం ఈ జాతి అనుసరించినది 'సనాతన ధర్మం'. ఇతర మతాలు వచ్చిన తరువాతే ఈ 'మతం' (అంటే అభిప్రాయం) అనే పదం వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తున్నది. కాబట్టి, ఈ దేశానికి ఉన్న పేరు ప్రకారం- 'భారత'దేశం. అనగా భా అంటే జ్ఞానం/ప్రకాశం; రత అంటే కలిసి ఉండటం. కాబట్టి భారతదేశం అంటే జ్ఞానంతో వెలిగిపోవటం, కాంతినివ్వటం. ఈ భావమే ఈ జాతిలో/హిందువులలో, అణువణువునా నిండి నిబిడీకృతమైన, సనాతన ధర్మాచరణ.

ఐలయ్య చెప్పినట్లు హిందూయిజం అంతరించకపోవటం అటుంచి, అనూహ్యంగా, నిశ్శబ్దంగా, ప్రపంచ దేశాలలో తనదైన శైలిలో ఆధ్యాత్మికంగా (వ్యాపారాత్మకంగా కాదు) విస్తరిస్తోంది. ఇస్కాన్‌లోని అనుయాయులందరూ దాదాపు విదేశీయులే కదా. భగవద్గీత, రామాయణాలు అనేక దేశాలలో అనువదితమయ్యాయి. రష్యా/ ఇండోనేషియాలలో రామాయణం నృత్యరూపకంగా ప్రదర్శించుకుంటారట. ఈ మధ్యన, రష్యాలో భగవద్గీతను అక్కడి వారు రష్యన్ భాషలోకి అనువదించారని, అయితే ఆ అనువాదంలోని కొన్ని అంశాలు వివాదాస్పదమై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నదనీ తెలుస్తోంది కదా. సత్యసాయిబాబా కేంద్రాలు, రామకృష్ణా మిషన్, యోగదా సత్సంగ సొసైటీ వంటి అనేక సంస్థలు, ఆశ్రమాల కేంద్రాలు ఎన్నో దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇది వ్యాప్తి కాదా? అది కూడా ఎవరినీ, ఏ ప్రలోభం పెట్టకుండా సుమా! ఇది మీరు కూడా ప్రశంసించ వలసిన విషయం, సహృదయత ఉంటే.

హిందూ మతం ఒక నిరంతర గంభీర ప్రవాహం. సనాతన ధర్మ పీఠం. అదొక మహాసముద్రం. దానిలోని నీరును ఎంత తోడి ఖాళీ చేద్దామనుకున్నా ఖాళీ అవుతుందా? ఇంకిపోతుందా? కాదు. కానేకాదు. గంభీరమైన ఆ హిందూ మహా సముద్రంలో ఎన్నో నదులు/ (మతాలు) చేరినా దాని స్వస్వరూపం, పరిమాణం ఏమీ తగ్గదు. గుణం చెడదు. ఇంకా బలోపేతమవుతుంది. దీనికి కారణం ఇదొక మతం కాదు, జీవన విధానం. సనాతన (వేద విదితమైన) శాస్త్రీయమైనది దీని ఆధ్యాత్మికత. అందుకే, ఎన్ని దుర్మార్గపు దాడులు జరిగినా, విధ్వంసాలు జరిగినా, ఘోరమైన ద్వేషపూరితమైన మత మార్పిడిలు జరిగినా, మతద్వేషం కక్కినా ఈ పుణ్యభూమిలో, ఈ కర్మ భూమిలో, అణువణువూ నిండి నిబిడీకృతమైన సహిష్ణుత, సర్వ మానవ సౌభ్రాతృత్వం, లోక కల్యాణం కోసం, ఈ జాతి పడే తపన దీనిని చెక్కు చెదరనీయదు.

గంభీరమైన ఐరావతం వలే, హుందాగా ముందుకు నిరంతరంగా కదులుతూనే ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. మహాసముద్రం వంటి హిందూ మతానికి అంతం లేదు. ఉండదు. ఉంటుందని ఐలయ్య, గోపీనాథ్, భూక్యా వంటివారు అనుకుంటే వారు తీవ్రంగా పాత దురాక్రమణదారుల వలె భంగపడక తప్పదు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఈ మేధా బ్రువులకు తెలియదనుకోను. కాని వారికి చివరిగా నాదొక సూచన. ఇప్పటికైనా ఈ ద్వేష పూరిత విషప్రచారం మాని ఆచార్య పదవి అలంకరించారు కాబట్టి పెద్ద మనుషులుగా, పెద్దమనసుతో సంస్కారయుతమైన భాషతో, తమ అభిప్రాయాలను ఇతరుల మనోభావాలను కించపరచకుండా వ్యక్తం చేయమని. వారి భాష/భాషణం హుందాగా ఉంచుకోమనీ.


- గీతాంజలి మూర్తి
వ్యాసకర్త రవీంద్రుని 'గీతాంజలి' అనువాదకులు

22, ఫిబ్రవరి 2012, బుధవారం

ధర్మంపై బురదజల్లడానికి ముందు దీనికిసమాధానం చెప్పండి

ధర్మరక్షణ
- జి.నాగేశ్వరరావు

'ఆత్మవిమర్శా, అంతర్యుద్ధమా?' (జనవరి17, ఆంధ్రజ్యోతి) అనే వ్యాసంలో అరవిందరావు (మాజీ డిజిపి) హిందూ మత విమర్శకులకు కొన్ని సహేతుకమైన ప్రశ్నలు సంధించారు. కంచ ఐలయ్య ఎప్పుడో తాను హిందువును కానని ప్రకటించుకుంటూ ఒక పుస్తకం కూడా రాశారు. ఫరవాలేదు. హిందూ మతానికొచ్చిన నష్టమేమీ లేదు. అయితే హిందువుకాని ఐలయ్య హిం దూ మతాన్ని విమర్శిస్తారేమిటి? ఆయన ముస్లిం కూడా కాదు గదా. మరి ఇస్లాంను విమర్శించరేం? ఏ మతంలోని విషయాలైనా అవి ఆ మతస్తుల వ్యక్తిగతం. ఇతరులకు అవి అప్రస్తుతం. హైందవేతరుడైన ఐలయ్య హిందూ మతాన్ని విమర్శించడానికి కారణం హిందువుల్లో ప్రతిఘటన వుండదని తెలుసు గనుకనే.

లోపరహితమైన మతంగాని, సమాజంగాని యీ ప్రపంచంలో వున్నదా? వర్ణ వివక్షను, అంటరానితనాన్ని చూపి హిందూ మతాన్ని నిందించేటట్లైతే జాతి వివక్షను చూపి క్రైస్తవాన్ని కూడా నిందించాలి కదా? నాలుగున్నర శతాబ్దాల చరిత్ర గల అమెరికాలో నేడు గదా ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు కాగలిగింది? 1853లో బానిసత్వాన్ని రద్దు చేసినందుకు ఆగ్రహించిన దక్షిణాది అమెరికన్ రాష్ట్రాలు సౌత్ కరోలినా నాయకత్వంలో అమెరికన్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకున్నా యి. అబ్రహాం లింకన్ నాయకత్వంలో ఆ పది దక్షిణాది రాష్ట్రాలపై యుద్ధం ప్రకటించి తిరిగి యూనియన్‌లో విలీనం చేసుకోవడం జరిగింది.

కె.కె.కె. అనే తీవ్రవాద సంస్థ ద్వారా నల్లవారిపై దాడు లు చేసిన అమెరికన్ ప్రజల్లోనా వివక్ష లేక వారనుసరించే క్రైస్తవమతంలోనా వివక్ష? కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటనలను పదే పదే మననం చేసుకుంటూ మతాన్ని నిందించటం న్యాయ మా? లక్షల హిందువుల్ని వధించి వేలాది దేవాలయాల్ని నేల మట్టం చేసిన గజనీ, ఘోరీ, ఔరంగజేబులను ఉటంకిస్తూ మనం ముస్లింలను ద్వేషిస్తున్నామా?

ఇంకా వారికి రిజర్వేషన్లు కల్పించి సత్కరిస్తున్నాం! నేడు తిరుపతి, కాశీ, ప్రయాగ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో ఎవరిది ఏ కులమని అడుగుతున్నామా? గ్రామాల్లో కొంత వివక్ష వుండవచ్చు కానీ ప్రభుత్వం దానికి కఠినమైన చట్టాలను చేసింది. మహిళలపై రోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, దాడులు జరుగుతూనే వున్నవి. అందుకు ప్రతిగా మహిళలంతా హిందూ మతం విడిచి అన్యమత ప్రవేశం చేయాలా?

హిందూ మతంపై బురద జల్లే వారికి కులవ్యవస్థ ఓ తురుఫు ముక్క. దళిత హిందువులను (దళిత క్రైస్తవులను వేరుగా గుర్తించాలి) దేవాలయాల్లో పూజారులుగా నియమించరు. దళిత హిందువులతో అగ్రవర్ణాల వారు వియ్యమందరు. కలిసి భోజనం చేయరు. దేవాలయాలలోకి రానివ్వరు. అంటరానితనాన్ని పాటిస్తారు. ఇంక హిందూ మతంలో ఎందుకుండాలి అని వాదిస్తారు? సరే, మతం మారగానే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయా? క్రైస్తవులంతా సుఖంగా ఉన్నారా? అమెరికాలోని క్రైస్తవులు శ్రీమంతులు. ఆసియా, ఆఫ్రికాలలోని క్రైస్తవులు దరిద్రులుగానున్నారేమి? ఒకే దేముడిని ఆరాధించే వారంతా ఒకే తీరుగా లేరే?

అంటరానితనం, కులవివక్ష అనేదానికి మతంలో ఎటువంటి ప్రామాణికమూ లేదు. ఉంటే గనుక వాల్మీకి పూజనీయుడెలా అవుతాడు? నారాయణ గురు, నయనార్‌లు, తిన్నడు, స్వామి వివేకానంద, సాయిబాబా, ఇంకా వందలాది స్వామీజీలు వీరే కులానికి చెందినవారు? అంబేద్కర్‌కు ఆర్థిక సహాయం చేసింది బరోడా మహారాజు కాదా? ఒక మతంలో పుట్టే మహనీయుల్ని బట్టి ఆ మతాన్ని విశ్లేషించాలి తప్ప దానిలో పుట్టే అధములని బట్టికాదు. అంటరానితనాన్ని, కుల వివక్షను పాటించే వారెవరైనా సరే మూర్ఖులే. దేవాలయ పూజారులుగా బ్రాహ్మణ స్త్రీలు గూడా అర్హులు కాదు. అశౌచం వున్న కొంతమందిని ఉపేక్షించటం జరిగింది. హిందువుల్లోనే గాదు, క్రైస్తవుల్లో గూడా మహిళా పాస్టర్లు, ముస్లింలలో మహిళా ఇమాంలు లేరు. వారిదిగూడా వివక్షేనా?

మొదట్లో చాతుర్వర్ణ వ్యవస్థగావుండి తరువాత శాఖలు, ఉపశాఖలుగా విడిపోయిన హిందూ సమాజంలో ఎన్నడూ కులపరమైన ఘర్షణలు జరగలేదు. నేడు కొన్ని స్వార్థపరశక్తులు కుల వ్యవస్థను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. దేశంలో ఒకప్పుడు సంస్కృత భాష ఒక్కటే వుండేది. క్రమేపీ అందులోనుంచి అనేక భారతీయ భాషలు పుట్టుకొచ్చాయి. కానీ వారెవరూ భాషా పరంగా కలహించుకోవటం లేదే? వివిధ కులాల వారు మాత్రం ఎందుకు కలహించుకోవాలి? ఏ కులమూ మరొక దానికంటే తక్కువదని ఎక్కడా చెప్పబడలేదు. బ్రాహ్మణులు ప్రజాపతి ముఖం నుంచి, శూద్రులు పాదాల నుంచి జన్మించారన్నదానికి విపరీతార్థాలు తీసి శూద్రులను హిందూ మతం కించపరిచిందని వాదిస్తారు. కాని ఎవరికైనా పాదాభివందనం చేసినప్పుడు ఆ పాదాలే శిరోధార్యాలు కదా?

కులాంతర వివాహాలు వ్యక్తిగతం. బ్రాహ్మణులు కూడా తమ శాఖల్లోనే చేసుకోవటానికి ఇష్టపడతారు. ఇది ప్రత్యేకంగా దళితు ల పట్ల వివక్ష ఎట్లా అవుతుంది? డబ్బు, హోదా కలిగిన ఒక ఉన్నతోద్యోగి తన కార్యాలయంలోనే పనిచేస్తున్న అటెండరుతో వియ్యమందుతాడా? ఇక్కడ డబ్బు, హోదాగల వివక్ష. దీన్నికూడా ఖండించరేం? అమెరికాలో తెల్లవారు, నల్లవారి మధ్య వివాహాలు జరుగుతాయా? క్రైస్తవుల్లో గూడా జాతి వివక్ష ఉన్నట్లేగా?

భారతదేశంలో కుల వివక్షే గనుక రాజ్యమేలుతున్నట్లైతే రాష్ట్రపతిగా ఒక దళితుడిని ఎలా ఎన్నుకున్నారు? దళితులు మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులయ్యారు. కేంద్రంలోను, రాష్ట్రాలలోను పలువురు దళితులు మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. అగ్రవర్ణాల హిందువులు కుల వివక్షను పాటించి ఉండివుంటే దళితులకు రిజర్వేషన్లు ఎలా సమకూరినవి? ఊరూరా అంబేద్కర్ విగ్రహాలు ఎలా వెలిసినవి? మతం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే గాదు; అది ఒక సాంఘిక, సాంస్కృతిక ప్రక్రియ కూడా. హిందూ మతంతో సహా ఏ మతమూ మనలను స్వర్గానికి తీసుకెడుతుందన్న ధీమా ఏమీలేదు.

కానీ ప్రతి మతానికీ ఒక సంస్కృతి, సమాజం వుంటుంది. మతం మారితే ఇవి గూడా మారిపోతాయి. ఒక దేశంలో మతాలు ఎన్ని ఎక్కువైతే అస్థిరత అంత ఎక్కువగా వుంటుంది. ప్రజలు మతపరంగా చీలిపోయి వేర్పాటు వాదం తలెత్తుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పాకిస్థాన్. 1946లో జిన్నా ఒక ప్రకటన చేస్తూ హిందువులు, ముస్లింలు రెండూ వేర్వేరు జాతుల వారు; వారెన్నడూ కలిసి సఖ్యతగా జీవించలేరు గనుక పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయవలసిందేనన్నాడు. నిన్నటిదాకా హిందువుగా ఉన్నవాడు నేడు ముస్లింగా మారగానే వేరే జాతి వాడుగా, వేర్పాటు వాదిగా మారుతున్నాడు. అలాగే క్రైస్తవులైన ఈశాన్య రాష్ట్ర ప్రజలు గూడా వేర్పాటు వాదాన్ని వినిపిస్తున్నారు. అంతేగాక మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సంగీ తం, నాట్యం, శిల్పం ఇవన్నీ హిందూ మతం నుంచే పుట్టాయి.

మతం నశిస్తే ఇవి గూడా నశిస్తాయి. ఏదైనా ఒక మతాన్ని గాని, సంస్కృతిని గాని, వ్యవస్థను గాని నిర్మించడం కష్టం గాని దానిని నాశనం చేయటం చాలా తేలిక. హిందూ మతాన్ని సంస్కరించి దానిని పరిపుష్టం చేయడానికి సలహాలివ్వాలిగాని మతాన్ని బలహీనపరిచే చర్యలు న్యాయం కాదు. మనం కాశ్మీర్‌పై ఎన్ని చర్చలైనా జరపవచ్చు కాని ప్రధానాంశం మాత్రం కాశ్మీరు భారత్‌లో అంతర్భాగం అనేది. అలాగే హిందూ మత పునరుజ్జీవనం అనేది మౌలిక సూత్రంగా సలహాలు, సంస్కృతులకు స్వాగతం. బయటకు వెళ్లేవారు వెడుతుంటే కొత్త వారు పుడుతుంటారు తప్ప హిందూ మతానికి నాశనం లేదు. దేశ సమగ్రత కోసం, సంస్కృతీ పరిరక్షణ కోసం, జాతి వారసత్వం కోసం హిందూ మతం బ్రతికే వుండాలి. హిందువులందరూ దానిని బ్రతికించుకోవాలి.

ధర్మోరక్షతి రక్షితః
- జి.నాగేశ్వరరావు
(ధర్మప్రసార సమితి)

18, ఫిబ్రవరి 2012, శనివారం

భావి హిందూ మతవ్యవస్థ : ఒక ప్రతిపాదన

హిందువులు సమైక్యంగా లేకపోవడానికి, మన మతం నానాటికీ బలహీనపడుతూండడానికి గల కారణాల్లో కులోన్మాదం ఒకటైతే, హిందువులందఱికీ కలిపి ఒక అత్యున్నత మతపీఠం లేకపోవడం రెండో ప్రధానకారణమని నా అభిప్రాయం. ఈ కారణం చేత మన ధర్మశాస్త్ర సూత్రాల స్థానాన్ని సెక్యులర్ ప్రభుత్వ చట్టాలు ఆక్రమించుకుంటున్నాయి. మన పీఠాధిపతుల స్థానాన్ని సెక్యులర్ న్యాయమూర్తులూ, కోర్టులూ దురాక్రమించేశారు. వారిప్పుడు మన దేవాలయాల మీదా, ఆచారాల మీదా తీర్పులు చెప్పే స్థాయికొచ్చేశారు.  వీటన్నింటి ద్వారా మనం మన ఆచార వ్యవహారాలకీ, ధర్మశాస్త్ర నిర్దేశాలకీ వ్యతిరేకంగా ప్రవర్తించేలా, మాట్లాడేలా తర్ఫీదివ్వబడుతున్నాం. మఱోపక్క హిందువులుగా మన ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా మనమెవఱికి వోటెయ్యాలో మార్గదర్శనం చేసే ధార్మికనాయకులూ, సాంస్కృతిక నాయకులూ కఱువయ్యారు. లేదా తమకంటూ ఒక వ్యవస్థ లేకపోవడం చేత వారి గొంతు ఈ కలకలంలో వినపడ్డం మానేసింది. 

కనుక భవిష్యత్తులో నైనా మనం ఒక కేంద్రీకృత  అత్యున్నత మతపీఠాన్ని (Centralized Supreme Pontificate) ఏర్పఱచుకోవాలి. దేవాలయాలలో నియామకాలూ, ఆచారాలూ, జీతాలూ, హిందువుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పాలసీలూ అన్నీ ఆ పరమపీఠాధిపతులే నిర్ణయించాలి. ఆ నిర్ణయాలు అన్ని స్థాయిల్లోనూ వెనువెంటనే అమల్లోకి రావాలి. ప్రతి హిందువూ తన కుటుంబ సంప్రదాయాని కనుగుణంగా ఏదో ఒక ప్రపీఠంలోనూ, ఉపపీఠంలోనూ, అనుపీఠంలోనూ తన పేరు నమోదు చేసుకోవాలి. దాని స్వరూపాన్ని నేను ఈ క్రింది విధంగా ఊహించుకుంటున్నాను. ఈ క్రింద పరిశీలించండి.

16, ఫిబ్రవరి 2012, గురువారం

విదేశంలో స్వదేశీ !

విదేశంలో స్వదేశీ !


వింతగా ఉందా? ఇది అచ్చు తప్పు కాదులెండి. మనం స్వదేశీ గురించి మాట్లాడితే చాలామంది హేళన చేస్తారు. స్వదేశీ అన్నమాట చాలా విస్తృతమైంది. భారతీయ ఉత్పత్తులు వాడడమే కాదు, మన ఆలోచనలు ప్రణాలికలూ కూడా స్వదేశీ అనే సిద్ధాంతం మీద ఆధారపడినప్పుడే మనం నిజమైన అభివృద్ధి వైపు పయనించగలం. ఒక్కమాట! జ్ఞాపకం ఉందా? నిన్నగాక మొన్న మన లోక్ సభలో 'వాల్ మార్ట్' (విదేశీ పెట్టుబడులు) మీద రగడ జరిగిన సందర్భంగా కపిల్ సిబాల్ గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. వాల్ మార్ట్ కి మన వాణిజ్యాన్ని తాకట్టు పెట్టాలని యూపియే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకి సర్వత్రా వ్యతిరేకత వచ్చేసరికి, తట్టుకోలేక కపిల్ సిబాల్ గారు ఇలా అన్నారు -

"సరే! ఇక మనం కార్లలో తిరగడం మానేసి రిక్షాల్లో తిరుగుదాం!".
ఇదండీ ! మేధావి అయిన సిబాల్ గారి మనసులో మాట. ఇందులో తప్పేముంది అంటారా? ఇక్కడ సమస్య కార్లు, రిక్షాలు కాదు. మన నాయకులలోని బానిస స్వభావం, భావదాస్యం, బౌతిక దారిద్ర్యం. వీరి అభిప్రాయంలో భారతదేశం ఒక పాత చింతకాయ పచ్చడి. భారతీయులు వెనుకపడినవారు, ముందుకు వెళ్లలేనివారు. మన ఆలోచనలు వెయ్యి సంవత్సరాలు వెనుకకు ఉంటాయి. కాబట్టి విజ్ఞులు, ప్రాజ్ఞులు ఐన పాశ్చాత్యుల విధానాలు మనకి కావాలి. అంధ అనుకరణ మాత్రమే మనను "ఉద్ధరిస్తుంది". సరే! ఒప్పుకుందాం. స్వదేశీ కావాలంటున్న భారతీయులు అజ్ఞానులే. ఐతే మనకి స్ఫూర్తినిస్తున్న, మార్గదర్శనం చేస్తున్నారనుకొంటున్న పాశ్చాత్యుల పరిస్థితి చూద్దాం.

ప్రపంచ దేశాల నెత్తిమీద "ఆర్ధిక సరళీకరణ" విధానాలు రుద్దిన అమెరికా సంగతి చూడండి. ఇదే విధానాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది.


ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సమయానికి పది లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. అది ఇప్పుడు పదిహేను కోట్ల డాలర్లకి పెరిగింది. పేదరికంలో జీవించేవారి సంఖ్య 48 శాతానికి పెరిగింది. అమెరికా ఉద్యోగాలు అన్నీ భారతీయులూ, చైనీయులూ ఎగరేసుకుపోతున్నారనీ, ఆ ఉద్యోగాలు అమెరికా వారికే ఇవ్వాలని ఒబామా అంటున్నాడు. అమెరికా వారు అమెరికా వస్తువులనే ఉపయోగించాలని అయన పిలుపునిచ్చాడు. అమెరికా కూడా స్వదేశీ జపం మొదలుపెట్టింది. దీనికి మన నాయకులేమంటారో? ఒబామా కూడా సంఘ పరివార్ వాడేనంటారేమో ! అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏతావాతా తేలేదేమంటే భారతీయ సిద్ధాంతమే సరైనదని మరోమారు నిరూపితమైంది. ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా..!  

- ధర్మపాలుడు

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

శ్రీరామరాజ్యం చలనచిత్రం యొక్క ఆర్థిక పరాజయం

ఇటీవల ఒక గూగుల్ గుంపులో జఱిగిన చర్చ

ఒక సభ్యుడు

మిత్రులారా ! నేను సర్వదా ఆధ్యాత్మిక/ పౌరాణిక చలనచిత్రాల విజయాన్ని కోరుకుంటాను. కానీ నేను శ్రీరామరాజ్యం చూడలేదు. కొన్నిరోజులు పోయినాక ఎలాగూ CDs వస్తాయి గదా ! ఇంట్లోనే చూసుకుందామని ! అయితే ఆ సినిమా ఎక్కువ ప్రదర్శనాకేంద్రాల్లో బాగా ఆడలేదని వార్తలొచ్చాయి. దాని నిర్మాత నష్టాల్లో ఉన్నాడని కూడా చెబుతున్నారు. ఇది విన్నాక ఒక రామభక్తుడుగా నాకు బాధ కలిగింది, "ఇలా ఎందుకు జఱిగిందా ?" అని ! 

౧. బాపులాంటి దర్శకేంద్రుడు, నందమూరి బాలకృష్ణలాంటి జనరంజక కథానాయకుడూ పనిచేసిన ఈ చలనచిత్రం ఎందుకిలా అంచనాలు తప్పింది ? వయోవృద్ధత్వం వల్ల బాపుగారిలో దర్శకత్వపటిమ మందగించిందా ? లేదా అదే కారణం చేత బాలకృష్ణ ఆ పాత్రకి సరిపోలేదా ? లేక బాలకృష్ణ మూర్తిమత్త్వానికి (image) ఆ పాత్ర సరిపడలేదా ? లేక ప్రజలు "లవకుశ" రామారావుగారితో బాలకృష్ణని పోల్చుకొని తిరస్కరించారా ? 

౨. అంతకంటే ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక, హిందూవాసనలు తగ్గిపోతున్నాయా ? ఆద్యంతమూ కుసంస్కారభూయిష్ఠమై, ఒక సాధారణ మగవాణ్ణి భగవంతుడిలాంటి సర్వశక్తిమంతుడిలా చూపిస్తూ తప్పుడు సందేశాలిచ్చే దూకుడు, బిజినెస్‌మాన్‌లాంటి చెత్తాగ్రేసరాలకి రోజుకు రు.50 లక్షలూ, కోటి, రెండుకోట్ల చొప్పున వసూళ్ళు కావడమేంటి ? మన నిజమైన సాంస్కృతిక మహాపురుషుల జీవితచరిత్రలు ఇలా బోల్తాపడడమేంటి ? జనాల్లో ఆదర్శవాదం తగ్గిపోతోందా ? తప్పుడు నమూనాపాత్రల (false role models) వెంటపడుతూ సిసలైన ఆదర్శపురుషుల్ని బుట్టదాఖలా చేసే స్థాయికి వీళ్ళు దిగజాఱిపోయారా ? అంటే 'లవకుశ' కి అఖండవిజయాన్ని చేకూర్చిన అలనాటి ప్రేక్షకుల తరం దాటిపోయి ఇలాంటి అప్రయోజక తరం మనకి సంప్రాప్తమయిందా ? 

౩. ఏ సినిమాకైనా ప్రేక్షకురాళ్ళ ఆదరణ కీలకం. ఈ పరాజయం వెనుక భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి పాపులారిటీని దెబ్బకొట్టిన రంగనాయకమ్మ లాంటి మార్క్సిస్టు, ఫెమినిస్టు శక్తుల పాత్ర ఎంత ? వీళ్ళు మన అంచనాలకి మించి జనంలోకెళ్ళి విజయం సాధించారా ? వీళ్ళ విజయం ఈ సినిమా పరాజయం రూపంలో వ్యక్తమవుతోందా ? 

ఆలోచించండి.

రెండో సభ్యుడు 

ఒకటి - ఆధ్యాత్మిక భావాలు జనంలో సన్నగిల్లుతున్నాయి అనడానికి సందేహించనక్కరలేదు. గుంపులుగుంపులుగా కనపడుతున్న భక్తసందోహాలలో ఎక్కువగా భయమే తప్ప భక్తి కనిపించడం లేదు. మనసున భక్తి నిండివున్న నాటితరంలో లవకుశకున్న ఆదరణ నేడు లేకపోవడానికి ఇదొకకారణం. గతంలో మాస్ హీరోలుగా గుర్తింపున్న జూనియర్ ఎన్ టి ఆర్ , అల్లు అర్జున్ శక్తి, బద్రి  చిత్రాల పరాజయంలో  ఏదో హైందవవ్యతిరేకుల పాత్రకూడా ఉండవచ్చనిపించింది . ఎందుకంటే అవి హైందవభావాల ప్రచారంతో కూడుకుని ఉన్నాయి కనుక . ఇక రామాయణం లాంటి మహాకావ్యాన్ని తెఱకెక్కించేటప్పుడు నాడు ఉన్న నటులలో దైవభక్తి పరాయణులు మమేకమై నటించారు. నేడు కేవలం డబ్బుకు నటించే వారి వల్ల పవిత్రభావాలు పలికించటం దర్శకులకు వీలుకాలేదేమో ననే అనుమానం ఉంది.

మూడోసభ్యుడు

 జనం ఆధ్యాత్మిక భావాల్ని కేవలం గృహస్థానికే పరిమితం చేసుకున్నట్లుగా గోచరిస్తుందండి. చలనచిత్రాల విషయంలో ఐతే కుటుంబసమేతంగా వెళితే రూ500/ అంతకంటే ఎక్కువ అవుతుంది. చిత్రనిర్మాణవ్యయం కూడా ఆధ్యాత్మిక మఱియు చెత్తాగ్రేసరాలకి  చాల వ్యత్యాసం ఉండటం , టికెట్ ఖరీదు మఱియు నమూనానటుల పారితోషికాలు  తగ్గితేనే కానీ పౌరాణిక చిత్రాలకూ , కుటుంబకథాచిత్రాలకూ మళ్ళీ ఆదరణ రాదు. 

నాలుగో సభ్యుడు

బద్రి, శక్తి సినిమాల పరాజయానికి కారణం, బలహీనమైన కధ, అతి బలహీనమైన కధనం. ఇక శ్రీరామరాజ్యం సినిమాకి వచ్చేసరికి, చిత్ర నిర్మాణ వ్యయం బాగా ఎక్కువ అవడం వల్ల ఆర్ధికంగా పరాజయం పాలయ్యి ఉండవచ్చు. కానీ చాలా చోట్ల ౫౦ రోజులు దాటి ఆడింది. ప్రస్తుత మల్టీప్లెక్స్ థియేటర్ల కాలంలో ఒక తెలుగు సినిమా ౫౦ రోజులు ఆడిందంటే అది చాలా బాగున్నట్లే. మన తెలుగు సినిమాలలో భారీ చిత్రాలు విజయం సాధించాలంటే అందుకు తగ్గ స్టార్‌డమ్ ఉన్న కధానాయకులు కూడా ఆ సినిమాలకు అవసరం. "32 కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాకు సరిపడా స్టార్‌డ‍మ్ బాలకృష్ణకు ఉందా ?" అంటే అనుమానమే!!!

ఐదో సభ్యుడు


ఇవన్నీ కాక, నాకు మఱొక కారణం కూడా కనబడుతోందండీ. అది, మనలాంటివారిలోనే (నాతో కలుపుకుని) తరువాత తీఱిగ్గా ఇంట్లో చూద్దాంలే అని సినిమాతెఱపై చూడకపోవటం.

ఆఱోసభ్యుడు

౧) మెటీరియలిజమ్ 
౨) విలువలు మారడము 
౩) సెక్యులరైజేషన్ ఆఫ్ హిందువులు 
౪) సెక్యులర్ ఎడ్యుకేషన్ 
౫) కొత్త జెనరేషన్స్ 
౬) Saturation of Entertainment Industry (Cinema, TV, Internet, YouTube,Smart Cell Phones, Texting, etc) 
౭) ఇతరములు 



ఏడో సభ్యుడు

"ఈ పరాజయం వెనుక భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి పాపులారిటీని దెబ్బకొట్టిన రంగనాయకమ్మలాంటి మార్క్సిస్టు, ఫెమినిస్టు శక్తుల పాత్ర ఎంత ?" అని ప్రశ్నిస్తున్నారు మీరు.

భగవంతునికి పాపులారిటీయా? దాన్ని మానవమాత్రులు దెబ్బకొట్టడమా?

మొదటి సభ్యుడు 

ఆర్యా !  ఫెమినిస్టులూ, కమ్యూనిస్టులూ గత దశాబ్దాల్లో భగవదవతారాల్లో ఒకదాని మీద విస్తారంగా దుష్ప్రచారం చేసిన మాట వాస్తవమే కదా ? ఆ ప్రచారానికి తలొగ్గి చాలామంది నాస్తికులై రాములవారిని పూజించడం మానేసిన మాట కూడా వాస్తవమే కదా ? ఒకప్పుడు రాష్ట్రమంతటా అత్యంత భక్తిశ్రద్ధలతో జఱపబడ్డ శ్రీరామనవమి, దాని కోసం వేసిన పందిళ్ళూ, ఆ 9  రోజుల కార్యక్ర్తమాలూ ఈనాడు సంపూర్ణంగా అదృశ్యమైపోవడానికి కారణం ఈ ప్రచారం కాదా ? ఈ ప్రచారంతో తెలుగుస్త్రీల మనసుల్ని కలుషితం చేయడం విజయవంతంగా జఱిగింది కదా ? ఎంత భగవంతుడైనా ఈ దుష్ప్రచారానికి రాములవారు గుఱయ్యారనేది స్పష్టంగా కనిపిస్తోంది కదా ?

ఎనిమిదో సభ్యుడు

నాకు మటుక్కు చిత్రం నచ్చిందండీ. చాల కాలం తరువాత ఆంగ్లాధ్రమిశ్రమ సంభాషణలు లేకుండా తీసిన చిత్రం కావడం ఒక పెద్దకారణం. నచ్చని చిన్నచిన్న విషయాలు కొన్ని ఉన్నాయి కానీ మొత్తం మీద మంచి చిత్రమే. అయితే ఆర్థికంగా విజయవంతం కాలేదంటే ఆశ్చర్యంగానే ఉంది.  బాగానే డబ్బు కూడబెట్టిందని ఎక్కడో చదివిన గుర్తు.

మొదటి సభ్యుడు

తొలిరోజు వసూళ్ళు బావున్నాయని నేనూ చదివాను. తొలిరోజున రూ.5 కోట్లు వసూలు చేసిందట. కానీ తరువాతి వారాల్లో అంత ఊపు కనిపించలేదని విన్నాను. కొన్ని ప్రదర్శనకేంద్రాల్లో బాగా ఆడినా ఎక్కువ చోట్ల సగటు-సరాసరిగా ఆడడం చేత లాభం మాత్రం రాలేదంటున్నారు. నష్టం వచ్చిందా ? లేదా ? వస్తే ఎంత ఎంత ? ఇలాంటి వివరాలు మనకి తెలీదు.

నాలుగోసభ్యుడు

శ్రీరామరాజ్యం పుస్తకంగా రాబోతుంది...

తొమ్మిదో సభ్యుడు

"మంచి ప్రారంభవసూళ్లు వచ్చాక కూడా నిలదొక్కుకోలేదు" అని అందఱూ చెపుతున్నదే. నా దృష్టిలో ప్రస్తుత స్థితికి కారణాలు-

 ౧. బాపు దర్శకత్వలోపమైతే కాదు. అది నిస్సందేహంగా ఒప్పుకోవల్సినదే. ప్రతీ ఫ్రేమూ ఎంతో అందంగా ఒక చిత్రకారుని కుంచె నుంచి వెలువడినట్లు ఉంది. చాలా సన్నివేశాల చిత్రీకరణ అత్యున్నత స్థాయిలో ఉంది. అద్భుతమైన గ్రాఫిక్సు వాడుకున్నారు.

౨. సినిమా చూసిన వారెవఱైనా వెంటనే చెప్పే విషయం ఈ సినిమా శ్రీరాముని రాజ్యం గుఱించి కాదు, సీతా దేవి వనవాసం గుఱించి అని. ఈ విషయంలో ప్రేక్షకులు నిరుత్సాహపడి ఉంటారని చెప్పగలను.

౩. బాలకృష్ణ గత చిత్రాలైన "పాండురంగడు" వంటి చిత్రాల ప్రభావం పడి ఉండవచ్చు.

౪. ఆఖరుకు దేవుని చిత్రంలో కూడా నందమూరి భజనను పక్కకు పెట్టకపోవటం ( ఒక సన్నివేశంలో రఘువంశ మహారాజులను చూపించే క్రమంలో రామారావును కూడా చూపించడం జఱిగింది. ఈ సన్నివేశానికి అనుకోని స్పందన కూడా లభించింది)

౫. అక్కినేని వారు వాల్మీకి పాత్రను అత్యద్భుతంగా పోషించారని అనేక వెబ్ సైట్ ఘనులు సెలవిచ్చినప్పటికి ప్రేక్షకులను రంజింప చెయ్యలేకపోయారు.

౬. ఎప్పుడైతే ప్రేక్షకులు సినిమా "ఇది శ్రీ రాముని రాజ్యం కాదు, సీతా వనవాసం" అని గ్రహించారో వెంటనే వద్దన్నా ఆనాటి లవకుశ గుర్తుకు వస్తుంది. వెనువెంటనే బాలకృష్ణను రామారావుతో, నయనతారను అంజలీ దేవితో మఱియు నాగయ్య గారితో నాగేశ్వరరావును పోల్చడం మొదలు పెట్టారు. అందువల్ల ప్రేక్షకులు నిండుభోజనం కాదు సగం భోజనమే తిన్నామన్న భావన వచ్చి ఉండవచ్చు.

౭. ఇక సంగీతం, ఇళయరాజా మంచి సంగీతాన్నే అందించినా, లవకుశ తో పోల్చినప్పుడు ఆ స్థాయిలో రంజింపచేయదు 
 
౮. ఇక, అన్నిటికన్నా ప్రధానం యువ ప్రేక్షకులకు హిందూ సినిమాల మీద ఆసక్తి సన్నగిల్లడం.

౯. ఎప్పుడైతే  ప్రేక్షకులు లవకుశ తో పోల్చారో వృద్ద మఱియు కుటుంబ ప్రేక్షకుల సంఖ్య హటాత్తుగా పడిపోతుంది. అదే  సమయంలో యువ ప్రేక్షకుల అనాసక్తి కూడా ఇతోఽధికంగా సాయం చేసింది.

౧౦. అలాగే గత దశాబ్దంలో  హిందూ భక్తి సినిమాల పేరుతో తీసిన సినిమాల (పాండురంగడు, రామదాసు వగైరా) వల్ల ఇకపై రాబోయే భక్తీ సినిమాల మీద అనాసక్తి పెరుగుతోంది. 

....గారు అనుకున్నట్టు "శక్తి, బద్రీ నాద' లాంటి సినిమాల పరాజయానికి బీజం సినిమా విడుదల అయ్యాక కాదు, ప్రారంభ దశలోనే పడిపోయింది. పిచ్చి పిచ్చి కధలు, దానికి తోడూ హీరో గాలిలోనే ఉండేలా పోరాటాలు చెయ్యడం.

ఈ సందర్భంగా నాదొక చిన్న సందేహం, ఉత్తర రామాయణం నిజంగా వాల్మీకి రాసినదేనా ? లేక చరిత్రలో పుట్టుకొచ్చినదా?

మొదటి సభ్యుడు

ఉత్తర రామాయణం (ఉత్తరకాండ) వాల్మీకిది కాదని కొందఱు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నాదీ అదే అభిప్రాయం. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

౧. పూర్వరామాయణ శైలీ, ఉత్తరరామాయణశైలీ ఒకే విధంగా లేవు. వేఱువేఱు వ్యక్తులు వ్రాసినట్లు స్పష్టంగా తెలుస్తుంది, సంస్కృతభాషా జ్ఞానం ఉన్నవాళ్ళకి !

౨. ఉత్తరరామాయణం వాస్తవానికి రావణాయణం. ఎందుకంటే అందులో చాలా భాగాన్ని రావణాసురుడి గొప్పతనాన్ని వర్ణించడానికి వినియోగించాడు రెండో వాల్మీకి.

౩. ఏడో కాండని ప్రవేశపెట్టడానికి గల అసలు కారణం (motive) ఏమిటై ఉండొచ్చునంటే - శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధయాగం చేసిన సమయానికి సీతమ్మవారు ఆయన దగ్గఱ లేదనే కథని కల్పించగోరడం. ఇలా కథని ట్విస్టు చేయబూనడానికి కారణం - అశ్వమేధయాగంలో పట్టపు రాణీ యాగాశ్వంతో సంభోగిస్తుందనే అపోహ. అంటే శ్రీరాములవారు అశ్వమేధయాగం చేశారంటే, అశ్వమేధయాగ నియమాల ప్రకారం సీతమ్మవారు కూడా ఇలాంటి పనేదో చేసి ఉండాలి కదా అని జనం ఊహించి ఆ తరువాత "హవ్వహవ్వ ఎట్టెట్టా" అని బుగ్గలు నొక్కుకుంటారనే భయం. సీతమ్మవారికి ప్రజల్లో ఉన్న ఇమేజిని చెడగొట్టి అసలు యావత్తు రామాయణాన్నే అసందర్భంగా, హాస్యాస్పదంగా మార్చిపారేయగలది ఈ అశ్వమేధయాగ ఘట్టం. "దీని గుఱించి ప్రజలకి ఏమని సంజాయిషీ ఇచ్చుకోవాలా ?" అని ఆలోచించి ఉత్తర రామాయణం పేరుతో ఈ "ఉత్తుత్తి" రామాయణాన్ని కల్పించాడు ఎవడో రామభక్తుడైన రెండో వాల్మీకి. కానీ ఈ ప్రయత్నంలో ఇతను (తన వ్యక్తిగత అపోహల కోణం నుంచి)  సీతమ్మవారి పరువు కాపాడాడు. కానీ తెలిసో తెలీకో శ్రీరాములవారి మీద మాత్రం చిక్కగా బుఱద చల్లేశాడు. ఫలితంగా అసలు రామాయణంలో వర్ణించబడ్డ రాములవారి గొప్పతనమంతా కొసఱు రామాయణంతో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

అసళ్ళ కంటే కొసర్లు డామినేట్ చేసేస్తూండడం కూడా కలియుగ లక్షణాల్లో ఒకటనుకోండి.


ఏడో సభ్యుడు

ఇక్కడ పట్టపు రాణీ అంటే *రాజు భార్య కాదు*, వేరే ఆడ గుఱ్ఱము. వైదిక సంస్కృతి చాలా advanced, ఇలాంటి పిచ్చి పని వాళ్ళు అనిమతించరు. అదీ ఒక రాజు మఱియు రాజు భార్య విషయములొ. అదీ ఒక public event లొ. ఇలా చూసించినవాళ్ళని రాజు ఖండఖండాలుగా నరుకుతాడేమో. మామూలు వ్యక్తే తన భార్యను ఇలాంటి పని చేయమనడు, అలాంటిది all powerful చక్రవర్తి ఎలా అంగీకరిస్తాడు!?. ఇది చీకటిలో చేసే ఏదో తాంత్రిక పద్ధతి కాదు కదా. 

ఈ అపోహ ఎలా వచ్చిందో, దీని వెనుక హిందువుల యొక్క శత్రువుల కుట్ర ఉండి ఉండవచ్చు. భారతములో ద్రౌపది ఈ పద్దతిలో పాల్గొన్నట్లు ఎక్కడా చెప్పబడలేదు. Some one twisted or mis-interpreted this. Probably during the colonial time by some crooked మిషనరి, with malicious intentions or lack of Sanskrit knowledge. 

హిందువులు  దీని (అశ్వమేధయాగం) మూలాలు గుర్తించవలసిన అవసరము ఉంది.

మొదటిసభ్యుడు

మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఈ అశ్వమేధ ఘట్టాన్ని వర్ణించే శుక్ల యజుర్వేదం నా దగ్గఱుంది. రాజుగారి గుఱ్ఱాన్ని గుఱ్ఱాల రాజు అంటారు. రాజుగారి ఆడగుఱ్ఱాల్లో మేలుజాతి ఆడగుఱ్ఱాన్ని గుఱ్ఱాల రాణీ లేదా ఆశ్వమహిషి అంటారు. యజ్ఞంలో చనిపోయే ముందు ఆ అశ్వమహిషితో సంభోగించి తన వంశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ఆ గుఱ్ఱాల రాజుకు (మగగుఱ్ఱానికి) మంత్రపూర్వకంగా ఇస్తారు యాజకులు. ఇది ఒక చెట్టుని పడగొట్టినందుకు పరిహారంగా ఇంకో మొక్క నాటడంలాంటిది. కానీ చాలామంది స్వదేశీ సంస్కృత పండితులు కూడా ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోలేక పట్టమహిషి గుఱించి చెబుతున్నారనుకుని బోల్తాపడ్డారు. ఇలా బోల్తాపడ్డవాళ్ళలో ఎవఱో ఒకఱు ఈ ఉత్తర రామాయణాన్ని సృష్టించి శ్రీరామచంద్రులవారికీ, ఆయన భార్యాప్రేమకీ, కీర్తికీ తీఱని ద్రోహం చేశారు. నిజానికి అశ్వంతో మానవస్త్రీలకి సంభోగం సాధ్యం కాదు. అలాంటిదానిగ్గనక సాహసిస్తే వాళ్ళు fatal గా గాయపడే అవకాశా లున్నాయి. ఏ మతమూ ఇలాంటిది ప్రిస్క్రైబ్ చేయదు.

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఈ జనాభా లెక్కల్ని ఎంతవఱకూ నమ్మొచ్చు ?

http://www.indiaonlinepages.com/population/hindu-population-in-india.... 


ఎందుకడుగుతున్నానంటే - చాలామంది దళితులూ, గిరిజనులూ క్రైస్తవమతంలోకి  మారినా కూడా కేవలం రిజర్వేషను కోసం హిందువులుగా జనాభా లెక్కల్లో నమోదయ్యారు. అందుచేత హిందువులుగా ప్రొజెక్టు చేయబడుతున్నవాళ్ళంతా వాస్తవంగా హిందువులు కారు. ఉదాహరణకి - ఆంధ్రప్రదేశ్ లో 90 శాతం కంటే ఎక్కువమంది దళితులు క్రైస్తవంలోకి వెళ్ళి చాలా సంవత్సరాలవుతున్నది. దళితుల సంఖ్య మొత్తం జనాభాలో 15 శాతం. అంటే ఏ.పి.లో ఉన్న 8 కోట్ల 46 లక్షల జనాభాలో కోటీ 27 లక్షలమంది దళితులు. కనుక వీళ్ళల్లో ఇప్పటికీ హిందువులుగానే మిగిలిపోయిన జనం అంతా కలిపి పదమూడు - పదిహేను లక్షలకి మించరు. 

ఇహపోతే రాష్ట్రజనాభాలో 8 - 9 శాతం ఉన్న గిరిజనులలో ఎంతమంది కిరస్తానం పుచ్చుకున్నారో, ఎంతమంది హిందువులుగా ఉన్నారో అస్సలు అంతు చిక్కట్లేదు. ఇహపోతే ముస్లిములు. తమ సంఖ్య రాష్ట్ర జనాభాలో సుమారు 9 శాతం అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని తనిఖీ (verify) చేయడానికి పనికొచ్చే విశ్వసనీయ ఆకరం (reliable source) ఏంటో, ఎక్కడుందో నాకు తెలీదు. ఈ క్రింది లంకె చూడండి : 


ఇలా ఓ పక్క  క్రైస్తవులేమో 15 శాతం (అన్నికులాలవాళ్ళనీ కలుపుకుని), మఱో పక్క ముస్లిములేమో (కనీసం) 9 శాతం ఉన్నారనుకుంటే ఇహ హిందువుల Brute majority ఎక్కడుంది ఈ రాష్ట్రంలో ? కాబట్టి ఇప్పుడు మనం వాస్తవంగా 70 - 75 శాతం మధ్య మాత్రమే ఉన్నట్లు నాకు అనుమానం కలుగుతోంది. మనం గనక భవిష్యత్తులో 60 శాతానికి లోపల పడిపోయామా, ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.

ఈ సందర్భంగా గత శతాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాశ్మీర్, బాంగ్లాదేశ్ లలో ఏం జఱిగిందో గుర్తు తెచ్చుకోవడం అవసరం. అక్కడ హిందువుల జనాభా పడిపోయాక వాళ్ళ మీద భౌతికదాడులూ, రక్తపాతాలూ, Ghettoisations, దోపిళ్లూ, అత్యాచారాలూ, అన్ని రంగాల్లోనూ దుర్విచక్షణ, apartheid మొదలయ్యాయి. వారి సాంస్కృతిక చిహ్నాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. ఆ బాధలు పడలేక వాళ్ళల్లో చాలామంది మతం మారారు. (అవతలివాళ్ళకి కావాల్సిందీ అదే). ఇంకొంతమంది తమ మాతృభూమి నుంచి తామే "బతుకు జీవుడా" అని పారిపోయారు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి