[ఆంధ్రభూమి దినపత్రికలో జరిగిన చర్చ ఇది]
భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తే పరిష్కరించడానికి పంచాయితీలు,
పెద్దమనుషులు ఉండేవారు. సమస్యను పరిష్కరించి కుటుంబాలను బతికించేవారు, అలా
వందేళ్లు బతికిన కుటుంబాలు ఉండేవి. దీనిని పరిష్కరించాల్సిన కోర్టు
వ్యక్తులనే దూరం చేసేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అవగాహన లోపం వల్ల
సమస్యలు తలెత్తుతాయి. ఆ లోపాన్ని తొలగించగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది.
ఆ సమస్యలను పరిష్కరించే బదులు వ్యక్తుల్నే దూరం కమ్మంటే సమస్య మరింత
జఠిలమవుతుంది. దంపతులు విడాకుల కోసం కోర్టుకెళితే వారిద్దరి మధ్య ఉన్న
అవగాహనా లోపాన్ని సరిదిద్దాల్సింది పోయి, వారిద్దరినీ విడిపోమంటే, వారు
విడిపోతారు. అక్కడితో సమస్య పరిష్కారం అవుతుందా? వారు మళ్లీ పెళ్లి
చేసుకుంటే మళ్లీ ఇవే సమస్యలు వస్తే మళ్లీ విడిపోమని చెబుతారా? అలా ఎంత దూరం
వెళ్తారు? ఒక జబ్బు వస్తే ఒక డాక్టర్‌కు చూపించాం, ఆయనతో తగ్గలేదని చెప్పి
మరో డాక్టర్ దగ్గరకు పోతాం, ఆయనతోనూ తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరకు పోతే
సమస్య పరిష్కారం అవుతుందా? జబ్బు తగ్గుతుందా? డాక్టర్లను మారిస్తే జబ్బు
తగ్గదు, రోగానికి మందువేయాలి అంతేకదా. కోర్టు విధానం ఏమిటి? సమస్యను
పరిష్కరించే విధానం ఉండాలి కదా... కాని మనుషులను మార్చే విధానమే కోర్టులో
కనిపిస్తోంది. మనుషులను చివరివరకూ వదులుకుంటూ పోతే ఏమవుతుంది? అంతిమంగా
మరణమే. సమాజంలో ఇలాంటి చర్యలు వల్ల దారుణమైన పోకడలు వస్తాయి. విదేశీ
విధానాలను చొప్పిస్తున్నారు. విడాకులు అడిగితే వెంటనే ఇచ్చేస్తామంటున్నారు.
మహమ్మదీయుల్లో అసహనానికి గురైనవారు లేరా? క్రైస్తవుల్లో లేరా వారూ ఇలాగే
తీసుకుంటున్నారా? జబ్బు ఏ మతస్థుడికి వచ్చినా, మందు ఒకటే కదా... శరీరానికి
వచ్చే రుగ్మతలకు ఒకే మందు ఇస్తున్నాం కదా... ఇది జీవితానికి వచ్చే రుగ్మత,
మనసుకు వచ్చే రుగ్మత, అది పోగొట్టగలగడమే చట్టం చేయాల్సిన పని. ఇలాంటి
సమస్యలు వచ్చినపుడు ఏ మతం వారికైనా మనసుకు ఒకే మందు ఇవ్వాల్సి ఉంటుంది.
అలాకాకుండా జలుబు చేసిందని ముక్కును, చేతికి దెబ్బతగిలిందని చేతిని
తొలగిస్తూ పోతే అసలు శరీరమే మిగలదు, అలాగే సమాజంలోని ఇలాంటి పరిస్థితులకు
మనుషులను కలపాలే తప్ప విడదీసుకుంటూపోతే సమాజానికే ఇది గొడ్డలిపెట్టు
అవుతుంది. రోజురోజుకూ స్ర్తిల సంతతి తగ్గిపోతోంది. స్ర్తి చెప్పుచేతల్లో
పురుషుడు బతుకుతున్న సమయంలో మరింతగా స్ర్తిలను రెచ్చగొట్టి ఇంకా ఒప్పుకోకు
అన్న రీతిలో వారిని ప్రేరేపించడం సరికాదు. నిజానికి స్ర్తిలు ఎదుర్కొనే
అనేక సమస్యలు అత్యాచారాలు, గృహ హింసను పరిష్కరించాల్సిందే, వాటికి
ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, స్ర్తి బాగుంటేనే కుటుంబ వ్యవస్థ, సామాజిక
వ్యవస్థ బాగుంటుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ స్ర్తిని పరిరక్షించుకునే
దిశగా మనం ముందుకు వెళ్లాలి. న్యాయస్థానాలు స్ర్తిలను గౌరవించే విధానం ఇదా?
చిన్న అసహనానికి విడిపోవచ్చు అనడం సరికాదు, ఇద్దరు కలిసి విడిపోవాలనే
నిర్ణయం తీసుకుంటే అపుడు విడిపోవచ్చు. మానసిక రుగ్మతలను పెంచుకుని
ఘర్షణలకుగురికావడం సరికాదు.
- శ్రీ పరిపూర్ణానంద సరస్వతి
శ్రీపీఠం
----------------------------------------------------------------------------------
ఆర్థిక పరాధీనత - తత్ఫలితంగా సమాజపరంగా తలెత్తే అనేకానేక ఇతర సమస్యల
కారణంగా వైవాహిక బంధంలో జీవితాంతం నిస్సహాయంగా మగ్గిపోయే మహిళలకు ఊరట,
వారికి అండగా నిలిచేలా, వీలైనంత ఆర్థిక భరోసా కల్పించేలా విడాకుల ప్రక్రియ
ఇకపై మరింత సులభతరం అవుతుందని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వాస్తవానికి
న్యాయస్థానాలు ఆలోచిస్తున్నట్టు సమాజంలో పరిణామాలు ఉండవు, తీవ్ర పరిణామాలు
ఏర్పడతాయి. ఏదైనా అంశం మీద అవగాహన లేకుంటే ఫర్వాలేదు, కాని దురవగాహన వల్ల
సమస్యలు జఠిలం అవుతాయి. సమాజం విచ్ఛిన్నమవుతున్న తరుణంలో ఈ వ్యవస్థను
ఏకోన్ముఖం చేసేందుకు రుషులు కొన్ని మార్గాలను అందించారు. చిన్న అలకలకు కూడా
రోడ్డున పడి విడిపోయేందుకు మార్గాన్ని చూపించడం సరికాదు. స్ర్తిని
మహాశక్తి స్వరూపిణిగా చూస్తాం. దానికి బదులు ఆమెను అబలగా మార్చేస్తే భయంకర
పరిస్థితులు ఏర్పడతాయి. అనర్థం వేరు, అపార్థం వేరు, వాటికి పరిష్కారాలను
చూపించాలి. జీవన విధానంలోని విలక్షణతను ఇరువురూ అర్థం చేసుకుని చిన్న చిన్న
సవాళ్లను అధిగమిస్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలే తప్ప పాశ్చాత్య
ధోరణులను స్వాగతించడం సరికాదు. సంబంధాలు సరిదిద్దలేనంతగా పాడయ్యాయనే
కారణంతో ఇకపై భార్య విడాకులు కోరవచ్చని న్యాయస్థానం చెబుతోంది. ఆ మేరకు ఆమె
కోర్టు ఎక్కితే వ్యతిరేకించేందుకు కూడా భర్తకు అవకాశం ఉండదు. ఇదే కారణంపై
ఒకవేళ భర్త విడాకుల పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం దానిని భార్య
వ్యతిరేకించవచ్చు. అంతేగాక, వేచి ఉండే కాలం పేరుతో విడాకులు కోసం ఏళ్ల
తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అనివార్యత కూడా ఇకపై ఉండదు. పైగా
విడిపోయిన భర్త నుండి చాలీచాలని నామమాత్రపు భరణంతోనే సరిపుచ్చుకుంటున్న
మహిళలకు వివాహానంతరం అతను సంపాదించిన ఆస్తిలో ఇకపై వాటా కూడా లభించనుంది.
అయితే వేచి ఉండే కాలం ఆస్తిలో భార్యకు లభించాల్సిన వాటా ఎంతనేది
న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. దంపతులు విడిపోతే ఇక నుండి వారి దత్త
సంతానానికి కూడా కన్నబిడ్డలతో సమానంగా అన్ని హక్కులూ లభిస్తాయి. వివాహ
చట్టానికి చేసిన ఇలాంటి కీలక సవరణలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ
మేరకు పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా రూపొందించిన వివాహ
చట్టాల సవరణ బిల్లు 2010కు ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ అధ్యక్షతన ఉన్న
కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. కొత్త బిల్లు ప్రకారం ఇకపై
విడిపోయే మహిళకు భర్త ఆస్తిలో వాటా లభించనున్నా ఈ మొత్తాన్ని కేసు ఆధారంగా
కోర్టు నిర్ణయిస్తుంది. ఆ విషయంలో స్పష్టమైన నిబంధనలను బిల్లులో
పొందుపరచలేదు. అలాగే ఆరు నుండి 18 నెలల పాటు వేచి ఉండే కాలాన్ని కూడా
పరిస్థితుల ఆధారంగా కోర్టు తన విచక్షణ మేరకు నిర్ణయించే వీలుంది. వివాహ
చట్టాల సవరణ బిల్లు 2010ను రెండేళ్ల క్రితమే రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
అనంతరం దానిని న్యాయసిబ్బంది విభాగాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి
పరిశీలనకు పంపించారు.
-ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి
-----------------------------------------------------------------------------------------------------
అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేసే విధానం మన సమాజానికి ఏ మాత్రం మంచిది
కాదు. దీనివల్ల కాపురాలు కూలిపోతాయి. ఇప్పటికే దేశంలో విడాకుల సంఖ్య బాగా
పెరిగిపోతోంది. ఇప్పుడు ఆడవారు అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేసే విధానం
ఉండడం వల్ల విడాకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. కేంద్రం ఒక మంచి
ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఆడవారు ఇబ్బందిపడుతున్నారని,
కాపురం చేయలేని పరిస్థితిలో విడాకులు కోరితే తక్షణం మంజూరు చేయాలనే
ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ ఆచరణలో అలా జరగదు. క్షణికమైన
ఆవేశంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్లే
అవకాశం ఉండదు. ఇది మహిళలకు ఏ మాత్రం మేలు చేయదు. పైగా నష్టం చేస్తుంది.
కాలం ఇప్పుడు చాలా మారిపోయింది. ఆడవారిని వేధించే మగవాళ్లే కాదు, మగవాళ్లను
వేధించే భార్యల సంఖ్య కూడా ఇప్పుడు తక్కువేమీ కాదు. గతంలో విడాకులు
తీసుకోవాలని అనుకుంటే కోర్టును ఆశ్రయిస్తే ఆరు నుంచి 18 నెలల పాటు వేచి
చూడాల్సి వచ్చేది. ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నా, ఈ గడువులో వారి ఆలోచనలో
మార్పు రావచ్చు, సర్దుకు పోవచ్చును అనే ఉద్దేశంతో ఈ గడువు ఏర్పాటు చేశారు.
కానీ ఇప్పుడు ఆడవారు కోరితే వెంటనే విడాకులు మంజూరు చేసే వెసులుబాటు వల్ల
నష్టపోయేది ఆడవారే. వరకట్నం వల్ల ఆడవారు ఎంతో నష్టపోయారు. వరకట్నాన్ని
నిషేధించి, చట్టం తీసుకు వచ్చినప్పుడు మహిళలకు కొంతవరకు ప్రయోజనం కలిగింది.
అదే సమయంలో ఈ చట్టం దుర్వినియోగం కూడా జరిగింది. చిన్నచిన్న కలహాలతో
కుటుంబ సభ్యులందరిపైన వరకట్న వేధింపు కేసులు పెట్టారు. దాంతో మొత్తం
కుటుంబం జైలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా అంటరానితనాన్ని
నిషేధిస్తూ మంచి ఉద్దేశంతో చట్టం తీసుకువస్తే కొంతమంది రాజకీయ ప్రయోజనాల
కోసం తమ ప్రత్యర్థులపై ఈ కేసులు పెట్టారు. నిజమైన బాధితులకు ప్రయోజనం కలిగే
విధంగా చట్టం ఉంటే మంచిదే కానీ ఆ చట్టాన్ని కక్షసాధింపు కోసం
ఉపయోగించుకుంటేనే చిక్కు వస్తుంది. ఇప్పుడు విడాకుల చట్టంలో తీసుకువచ్చిన
మార్పులు ఆడవారికి ఉపయోగపడితే మంచిదే కానీ నష్టం కలిగించే పరిస్థితులే
ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్న చిన్న
సమస్యలు తలెత్తితే కుటుంబ పెద్దలు సర్దిచెప్పేవారు. దాంతో దంపతులు కలకాలం
కలిసి ఉండేవారు.
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవారికి కోపం
వచ్చిందంటే విడాకుల కోసం ప్రయత్నిస్తే అంతేనా? పెళ్లి చేసుకునేప్పుడే అన్ని
కోణాల్లో ఆలోచించాలి. దంపతులు విడాకులు తీసుకుని ఎవరికి వారు సుఖంగా
ఉండొచ్చు, కానీ వీరి పిల్లలు మాత్రం బాధితులుగా మిగిలిపోతున్నారు. విడాకులు
తీసుకున్న మగవాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుంటే పిల్లలపై శ్రద్ధ చూపకపోవచ్చు,
ఒకవేళ పిల్లలు తల్లి వద్ద ఉంటే ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల బాధ్యత
ఎవరిది? తాత్కాలికమైన ఆవేశం వల్ల అటు దంపతులు, పిల్లలు నష్టపోతున్నారు.
దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విడాకుల సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని
నివారించేందుకు ఏం చేయాలో ఆలోచించాలి కానీ అడగ్గానే విడాకులు ఇచ్చేసే
నిర్ణయం సమస్యకు పరిష్కారం కాదు.
- నన్నపనేని రాజకుమారి
శాసన మండలి సభ్యురాలు, టిడిపి అధికార ప్రతినిధి
-------------------------------------------------------------------------------------------------
హిందూ వివాహ చట్టంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు తాజాగా సవరణలు చేయడం
వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఈ అంశంపై కేంద్రం తొందరపాటుగా
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చినా
ఇబ్బందులే ఎదురవుతాయి తప్ప, సమస్యల పరిష్కారానికి మార్గాలు సుగమం కావు.
ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి, ఇద్దరూ
పరస్పర ఆమోదంతోనే విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లినప్పటికీ, సదరు కోర్టు
వెంటనే విడాకులు మంజూరు చేయదు. ఆరు నెలల నుండి ఏడాది వరకు ఆగుతుంది. ఈలోగా
విడాకులకోసం కోర్టుకు వచ్చిన దంపతుల ఆలోచనల్లో మార్పులు వచ్చి, మళ్లీ కలిసి
ఉండాలన్న నిర్ణయానికి వస్తారన్నదే జాప్యంలో పరమార్థం. సాధారణంగా
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలవల్ల సత్ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా
ఉంటాయి. విడాకుల కోసం కోర్టుకు వచ్చే దంపతులను విడివిడిగానూ, కలిపి
కూచోబెట్టి, వారి సమస్యలను విని, వాటికి పరిష్కార మార్గాలు చూపగలిగితే
పరిస్థితి చక్కబడే అవకాశాలు లేకపోలేదు. అందుకే విడాకుల కోసం వచ్చే దంపతులకు
కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇందుకోసం ఫ్యామిలీ
కోర్టులు 1984లో ఏర్పాటయ్యాయి. ఈ కోర్టుల్లో న్యాయమూర్తులకు చేదోడుగా
ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాల్సి
ఉంటుంది. ఫ్యామిలీ కౌన్సిలర్లు న్యాయశాస్త్రం అభ్యసించినవారే కానక్కర్లేదు.
సమాజం పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉండి, కుటుంబ తగాదాలను పరిష్కరించగలిగే
ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేసి 27
సంవత్సరాలు పూర్తయినా, ఫ్యామిలీ కౌన్సిలర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం
గమనార్హం. నేను ‘రక్ష’ అనే సామాజిక న్యాయసేవా సంస్థ ద్వారా హైకోర్టులో
ప్రజాహిత వాజ్యాన్ని (పిల్) వేయగా, 2002లోనే కోర్టు తీర్పు చెప్పింది.
వెంటనే ఫ్యామిలీ కౌన్సిలర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఆదేశించి, స్వయంగా హైకోర్టు ప్రభుత్వానికి అనేక పర్యాయాలు లేఖలు రాసింది.
అయినా ఫలితం లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్లు లేకపోవడం వల్ల కోర్టుల్లో విడాకుల
కేసుల పరిష్కారానికి తీవ్రమైన జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని
న్యాయవిభాగం ఈ అంశంపై సరైన నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి ఉపయోగకరంగా
ఉంటుంది. మనది లౌకిక దేశం. ఈ దేశంలో ఫ్యామిలీ కోర్టుల్లో ఏ మతానికి
చెందినవారైనా కేసులు నమోదుచేయవచ్చు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం
ప్రతిపాదించిన సవరణలు కేవలం హిందూ వివాహ చట్టానికి మాత్రమే పరిమితం
అవుతున్నాయి. అంటే ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జోరాష్ట్రియన్ తదితర
మతాల వారికి వర్తించదు. ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేస్తే, ప్రభుత్వం తాజాగా
ప్రతిపాదించిన సవరణల వల్ల హిందూ మతానికి చెందినవారికి ఎక్కువ నష్టం
జరుగుతుంది. దంపతులు వేర్వేరు కారణాల వల్ల విడాకుల కోసం కోర్టుకు వెళితే
కొత్త సవరణ ప్రకారం వెంటనే కోర్టు విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అంటే
దంపతులు తమ నిర్ణయంపై పునరాలోచించుకునేందుకు కూడా అవకాశం లభించదంటే
అతిశయోక్తి కాదు.
- సి.వి.ఎల్. నరసింహారావు
అధ్యక్షుడు, ‘రక్ష’, న్యాయ సలహా స్వచ్ఛంద సేవా సంస్థ
------------------------------------------------------------------------------------------------------------
మన దేశంలో అనేక మతాలకు చెందినవారు ఉండటం వల్ల అందరికీ వర్తించేలా సమగ్రంగా
ఉండే కామన్ సివిల్ కోడ్ తీసుకురావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్ర
ప్రభుత్వం తలపెట్టిన హిందూ వివాహ చట్టం-1955తో పాటు ప్రత్యేక వివాహాల
చట్టం-1954లలో సవరణ వల్ల పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ప్రభుత్వం
తీసుకువచ్చే ఎలాంటి చట్టాలయినా ప్రజలందరికీ వర్తించేలా ఉండాలే తప్ప, ఏ ఒక
మతానికో పరిమితం కారాదు. హిందూ వివాహ చట్టంలో తలపెట్టిన సవరణల వల్ల
భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదు. యువతీ-యువకుల్లో
సామాజిక అంశాలు, కుటుంబపరమైన అంశాల్లో పూర్తిగా అవగాహన ఉండదు. సాధారణంగా మన
దేశంలో 18-25 సంవత్సరాల వయస్సులో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం
పెద్దలు కుదిర్చిన వివాహాలే ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలైనా, ప్రేమ
వివాహాలైనా సజావుగా ఉంటే బాగానే ఉంటుంది. యుక్త వయస్సులో, క్షణికావేశంలో
చిన్న చిన్న విషయాల్లో కూడా కొత్త దంపతుల మధ్య అవగాహన ఉండకపోవడం వల్ల వారి
నిర్ణయాలు సుదీర్ఘ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండవు. దాంతో చిన్న అంశాలకు కూడా
వచ్చే మనస్పర్థలు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వరకు వెళతాయి. విడాకుల
మూలంగా తలెత్తే పరిణామాల గురించి యువతీ యువకులు ఆలోచించలేరు. అందువల్ల
విడాకుల కోసం దరఖాస్తు చేసే ఇలాంటి వారికి విడాకులు ఇచ్చే గడువు ఇప్పటివరకు
ఆరు నెలల నుండి 18 నెలల వరకు ఉండేది. ఈలోగా విడాకుల కోసం దరఖాస్తు
చేసేవారి ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావచ్చు. పునరాలోచించుకునేందుకు కొంత
వ్యవధి లభించేది. కేంద్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల
ప్రతిపాదిత హిందూ వివాహ చట్టం-1955లో మార్పులు చేయాల్సి వస్తోంది.
ప్రభుత్వం రెండేళ్ల క్రితం రాజ్యసభలో ప్రతిపాదించిన వివాహ చట్టం (సవరణ)
బిల్లు-2010ని రాజ్యసభ నేరుగా ఆమోదించకుండా, న్యాయవిభాగానికి సంబంధించిన
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీనలకు పంపించింది. జయంతీ నటరాజన్
నేతృత్వంలోని ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకే కొత్తప్రతిపాదనలతో రూపొందించిన
బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమలులోకి వస్తే
విడాకుల కోసం కోర్టుకు వచ్చే దంపతులు మరోపర్యాయం పునరాలోచించుకునే
అవకాశాన్ని కోల్పోతారనడంలో సందేహం లేదు. విడాకులు మంజూరైన తర్వాత మహిళలు
ఎక్కువ బాధలకు, ఇక్కట్లకు గురికావలసి వస్తుంది. ఉద్యోగినిలు అయిన మహిళలు
అయితే ఈ బాధలు మరిన్ని ఎక్కువగానే ఉంటాయి. వారికి పిల్లలు కూడా ఉంటే
సామాజికంగా అనేక ఇక్కట్లను గురికావలసి వస్తుంది. పిల్లల ఆలనాపాలనా చూసేవారు
లేక ఇబ్బందులకు గురికాలసి ఉంటుంది. మగవారు మరో పెళ్లి చేసుకుని సంసార
జీవితాన్ని తిరిగి గడుపుతారు. మహిళలు అనేక కారణాల వల్ల పునర్వివాహం
చేసుకోలేక మానసికంగా సమస్యలకు లోనయ్యే అవకాశాలున్నాయి. చిన్న చిన్న
కుటుంబాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మన సమాజం మహిళలనే
విమర్శిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విడాకుల కోసం గడువు
ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. విడాకులకోసం వచ్చేవారిని కలిపి ఉంచేందుకు
న్యాయమూర్తులు కూడా ప్రయత్నిసుంటారు. విడాకుల కోసం వచ్చే దంపతులను
కౌన్సిలింగ్ సెంటర్‌కు న్యాయమూర్తి పంపిస్తారు. కొత్త చట్టం వల్ల ఈ
అవకాశాలన్నీ పోతాయి.
- జస్టిస్ కె. రామస్వామి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.
-------------------------------------------------------------------------------------------------------------
విడాకుల చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర మంత్రివర్గం రూపొందించిన
ముసాయిదాలోని ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో మాత్రం కష్టసాధ్యంగానే
ఉన్నాయి. అసలు వివాహ చట్టాలు, విడాకుల చట్టాలపై 95 శాతం మహిళలకు అవగాహనే
లేదు. అలాంటప్పుడు ఎన్ని మంచి చట్టాలున్నా, ఏమిటి ప్రయోజనం అనిపిస్తోంది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వివాహ చట్టాల సవరణ బిల్లు-2010లో ప్రధానంగా
మూడు అంశాలపై స్పష్టత లేదు. ఇలాంటి అస్పష్ట చట్టాలను ప్రతివాదులు తమకు
అనుకూలంగా మలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు
ఇద్దరు తమ వివాహం రద్దు కోసం దరఖాస్తు చేసుకుంటే, గతంలో స్థాయి సంఘం చేసిన
సూచన మేరకు వేచిచూసే సమయాన్ని 18 నెలల నుంచి ఆరు నెలలకు కుదించాలని
ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఆ
వ్యవధిని నిర్ణయించే అధికారాన్ని న్యాయస్థానానికి వదిలేసింది. భార్యభర్తలు
ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు ముందుకు వచ్చాక కూడా గడువు ఇచ్చే విచక్షణను
కోర్టులకు అప్పగించడం వల్ల బాధిత మహిళకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
భర్తకానీ, వారి తరఫు కుటుంబ సభ్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక
విడాకులకు సిద్ధమైన బాధితురాలికి సత్వరం న్యాయం జరగకుండా చట్టంలోని
లొసుగులను ఆసరా చేసుకునే అవకాశం ప్రతివాదులకు ఈ చట్టం కల్పించినట్టు
అవుతుంది. కొన్ని సందర్భాల్లో విడాకుల కోసం ముందుకు వచ్చిన భార్యకు అవి
లభించకుండా చట్టంలోని లొసుగులతో భర్త కోర్టును ప్రభావితం చేసే అవకాశం కూడా
లేకపోలేదు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే బాధితురాలికి సత్వర న్యాయం
లభించకుండా నిబంధనలు పెట్టడం సరికాదని మా అభిప్రాయం. అలాగే ఈ చట్టంలో మరో
లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విడాకులు తీసుకునే భార్యకు భర్త
ఆస్తిలో వాటా ఉంటుందని ఒకవైపు పేర్కొంటూనే, మరోవైపు పెళ్లి తర్వాత వచ్చిన
సంపదపైన మాత్రమే వాటా ఉంటుందని మెలిక పెట్టడం వల్ల బాధితురాలికి న్యాయం
జరగదు. పెళ్లి చేసేటప్పుడే తమ కూతురు సుఖంగా ఉండగలదా? ఆ మేరకు వారికి ఆస్తి
పాస్తులు ఉన్నాయా? లేదా అని చూస్తారు. కానీ పెళ్లి తర్వాత వారి ఆస్తి
పాస్తులపై ఎలాంటి హక్కులు ఉండవని పరోక్షంగా ఈ చట్టం ద్వారా అమలులోకి
రానుంది. పెళ్లి తర్వాత కేవలం భార్య జీతంపైనా, ఆమె తెచ్చే కట్నంపై ఆధారపడి
వేధింపులకు గురి చేసేవారి బారినపడే భార్యకు ఈ కొత్త చట్టం ద్వారా న్యాయం
లభించే అవకాశాలు లేకుండా పోతాయి. అలాగే పెళ్లి తర్వాత తనకు ఎలాంటి ఆదాయం
లేనట్టుగా చూపించి విడాకులు తీసుకున్న భార్యకు మనోవర్తిని ఎగ్గొట్టే
ప్రమాదం కూడా ఉంటుంది. దత్తత పిల్లలకు విడాకులు పొందాక కూడా ఆస్తిపై హక్కు
ఉండటం గతంలో ఉన్నదే. అసలు స్థూలంగా చూస్తే విడాకుల చట్టంపై ఎంత మందికి
అవగాహన ఉందనేది ముఖ్యం. గ్రామీణ ప్రాంత మహిళలకు అయితే ఈ చట్టంపై ప్రాథమిక
అవగాహన ఏమాత్రం ఉండదు. గ్రామ న్యాయస్థానాల వ్యవస్థ అమలోకి వస్తే, వారికి
దీనిపై అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిపై అవగాహన కల్పించేందుకు
డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి
ప్రయత్నాన్ని గుజరాత్, హర్యానా రాష్ట్రాలు చేసి సత్ఫలితాన్ని పొందాయి.
- డాక్టర్ అచంట మమతా రఘువీర్
తరుణి స్వచ్ఛంద సేవా సంస్థ