పాశ్చాత్య విద్యా వ్యామోహం ఒక తీయని విషం. అది ఆధునికీకరణ పేరుతో అమలవుతున్న భస్మాసుర హస్తం. అది మనల్ని కరకరా నమిలి మింగడానికి సిద్ధంగా ఉన్న కలిపురుషుడి కరాళదంష్ట్ర. ప్రతివారినీ బాగు చేసేస్తామని ప్రచారం ద్వారా మభ్యపెట్టి, వాళ్ళ చేతికి ఒక లాటరీ టిక్కెట్టిచ్చి, వారందఱినీ తమ పూర్వస్థానాల నుంచి భ్రష్టుల్ని చేసి, ఆఖరికి వారిలో కొద్దిమందిని మాత్రం బాగుచేసి మిగతా కోట్లాదిమందిని పేదలుగా, అనాథలుగా మిగిల్చే ఒక మోసపూరిత ప్రక్రియ. ఉదాహరణకి, మన రాష్ట్రంలో యావత్తు విద్యావిధానమూ జనాన్ని అమెరికా, ఆస్ట్రేలియా పంపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అందఱమూ ఇంగ్లీషు నేర్చుకొని రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోదామనే పిఱికి ఎస్కేపిస్టు ఫిలాసఫీని ఇది ప్రచారం చేస్తోంది. పాఠశాలలకి పేర్లు కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగానే పెడుతున్నారు, తల్లిదండ్రుల్ని ఆకర్షించే ఉద్దేశంతో ! కెనడీ హై అట, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ అట. చైతన్య టెక్నో అట.... వీటిల్లో చదివే పిల్లలంతా భావి అమెరికన్లు గా భావించుకోబడుతున్నారు గనుక వీటిల్లో తెలుగనే సబ్జెక్ట్ ఉండదు. తెలుగు రావడం ఈ కాబోయే బ్రౌన్ అమెరికన్లకి అవమానం గదా !
ఈ హైప్ వెనక ఉన్న వాస్తవమేంటంటే, నిజానికి అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, యూరప్ లోనూ ప్రస్తుతం పెద్దగా ఉద్యోగాలేమీ లేవు. వాళ్ళకే లేవు. ఇంక మనకేమిస్తారు ? గత కొద్ది సంవత్సరాలుగా ఆ దేశాలు గొప్ప ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. అందులోంచి అవి ఎప్పుడు బయటపడతాయో ఎవఱికీ తెలీదు. వాళ్ళు ఏటా మనకు జారీ చేస్తున్న వీసాలు కేవలం కొద్దివేలల్లోనే ! అయినా ఆ లక్ష్యంతోనే మిలియన్లాదిమంది చదువుకుంటున్నారు దేశీ బ్రౌన్ అమెరికన్ స్కూళ్ళల్లో ! కానీ అక్కడికి పోవడాన్ని ఘనపఱుస్తూ ఆ వలసవాద, వలసదారీ భావజాలాన్ని మనకు అమ్మజూపుతున్నాయి ఈ విద్యాసంస్థలు. "చచ్చినోడి కళ్ళు చేరెడేసి బాబూ, రండి, రండి ! భలే మంచి బేరము" అని కేకేస్తూ ! మన తెలివితేటలు మన దేశాభివృద్ధికీ, మన సాంస్కృతిక వారసత్వానికీ పనికొచ్చే విధంగా మన విద్యావిధానం ఉండాలి. చైనాకి పనికిరావాలని జపాన్ వాళ్లు చదువు నేర్చుకోరు. ఫ్రాన్సుకి పనికొచ్చే ఉద్దేశంతో స్పెయిన్ వాళ్ళు చదువు నేర్చుకోరు. కానీ ఇండియాలో - ముఖ్యంగా ఆంధ్రాలో అంతా తారుమారుగా చిత్రవిచిత్రంగా నడుస్తోంది.
గతంలో మన రాష్ట్రంలో ఒక సనాతన సామాజిక వర్గం ఇలాంటి వ్యామోహాల్లో పడి ఎలా అధః పతనం చెందిందో మనకు కనువిప్పు కావాలి.
స్వాతంత్ర్యానికి ముందు బ్రాహ్మణులకు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల వ్యావసాయిక ఎస్టేట్లు ఉండేవి.బ్రాహ్మణులు ఒక బలీయమైన వ్యవసాయకులంగా ఉండేవారు. వనపర్తి, ఉర్లామ్, పోలవరం లాంటి చోట్ల వారు రాజాలుగా, జమీందార్లుగా కూడా ఉండేవారు. ఇంత స్థాయిలో కాకపోయినా ప్రతి బ్రాహ్మణుడికీ ఎంతో కొంత పొలం ఉండేది. ఆ రోజుల్లో బ్రాహ్మణుల రాజకీయ నాయకత్వానికి వారి దేశభక్తితో పాటు ఈ భూస్వామ్యం కూడా ఒక కారణం. దేశం ఎంతగా బ్రాహ్మణుల్ని అనుసరించేది అంటే - మొట్టమొదటి లోక్‌సభ (1952) కు ఎన్నికైన MP లలో 340 మంది బ్రాహ్మణులేనంటే ఈనాటివారికి దిగ్భ్రాంతి కలగొచ్చు. పత్రికలూ, పుస్తక ప్రచురణ, రేడియోల్లాంటి మీడియా కూడా బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేది. స్వాతంత్ర్యానంతరం కేవలం ఒకటి=రెండు దశాబ్దాల్లోనే ఈ స్థితిమత్త్వం నెమ్మదినెమ్మదిగా అదృశ్యమౌతూ వచ్చింది. ఇందులో బ్రిటీషువారు రాజకీయ కక్షలతో చేసినదాని కంటే, లేదా భూసంస్కరణల పేరుతో దేశీ ప్రభుత్వాలు లాక్కున్నదానికంటే బ్రాహ్మణులు అనాలోచితంగా దూరదృష్టిలేమితో స్వయంగా చేసుకున్నదాని పాత్రే చాలాఎక్కువ.

బ్రాహ్మణులు చేసిన పొఱపాటు ఏంటి ? అంటే, వారు ఒక దశలో బ్రిటీషువారిచ్చే ఉద్యోగాల కోసం, లేదా లా చదవడం కోసం ఉన్న భూములమ్మేసి పట్టణాలకు చేఱుకోవడం. లేదా ఆ పొలాల్ని ఎవఱో ఇతర కులస్థులకు కౌలుకిచ్చేసి పట్టణాలకు చేఱుకోవడం. ఆ తరువాత ఆ భూములతో, ఆ ఊళ్ళతో సంబంధాలు తెగిపోవడం. ఆ తరువాత వారి వారసులు ఆ పొలాల్ని ఐనకాడికి అమ్మేసుకుని శాశ్వతంగా పట్టణాలలో స్థిరపడ్డం. ఈ క్రమంలో - క్రమం తప్పని ఆదాయంగా భావించి ఏ నెలజీతపు ఉద్యోగాల కోసమైతే తాము ఎగబడ్డారో అవి, తమకొచ్చినంత సులభంగా తమ సంతానానికి రాని పరిస్థితి తలెత్తడం. ఏతావతా రెంటికీ చెడ్డ రేవడిలా, ఇటు పొలమూ లేక, అటు అనుకున్నంత స్థాయిలో జీవితానికి కుదిరికా లేక బ్రాహ్మణులు దెబ్బదిన్నారు. వారు సలామ్ చేయదగ్గ భూస్వాముల స్థాయి నుంచి అందఱికీ సలాములు కొట్టే నెలజీతగాళ్ళ స్థాయికి పడిపోయారని గమనించాలి. అయితే కులపరంగా తరతరాలుగా ఉన్న సాంస్కృతికస్థాయి, సంప్రదాయాల మూలంగా వారు పూర్తిగా నాశనం కావడం జఱగలేదు. ఆ అడ్వాంటేజిలు లేని ఇతరులు ఆంగ్లవిద్య అనే ఈ లాటరీ టిక్కెట్టు కొనుక్కుని ఏమవుతారో తల్చుకుంటే భయమేస్తుంది.
ఒకప్పుడు బ్రాహ్మణులు త్రొక్కిన ఆ తప్పుదారినే, తెలిసో, తెలియకో ఇప్పుడు అందఱూ త్రొక్కుతున్నారు. వ్యవసాయ కులాలన్నీ పాశ్చాత్యవిద్యావ్యామోహంతో, MNC ఉద్యోగాల వ్యామోహంతో పొలాల్ని వదిలేసి నగరాల బాట పట్టుతున్నాయి. పొలాల్ని ఒకసారి వదిలిపెడితే ఇహ మళ్లీ వాటిల్లో అడుగుపెట్టడం అసాధ్యం. పొలాన్ని అమ్మగలం గానీ, కొనాలనుకున్నప్పుడు మళ్లీ కొనలేం. ఎన్ని చెప్పినా ఈ దేశంలో Land is power. అది పోగొట్టుకున్నవారికి రాజకీయాధికారం కూడా దూరమైపోతుంది. కనుక ఇప్పుడు మనం అగ్రకులాలూ, రాజకీయంగా బలవత్తరులైన కులాలూ అనుకుంటున్నవన్నీ ఒక యాభయ్యేళ్లల్లో పేదలుగా, మధ్యతరగతిగా మారే సంభావ్యత ఉంది. ఇది హిందూధర్మం మీద కూడా ప్రభావం చూపవచ్చు.
బ్రాహ్మణులు చేసిన పొఱపాట్లను ఇతరులు పునరావృత్తం చేయకూడదు. తల్లిని నమ్మినవాడూ, భూమిని నమ్మినవాడూ చెడడనే నానుడిని మనసా వాచా కర్మణా విశ్వసించి ఎన్ని ఇబ్బందులున్నా మనం మన జీవనవిధానాన్ని కాపాడుకోవాలి.