మొదటి సభ్యుడు :
అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం శ్రీలంకలో ఉన్న విషయం అందఱికీ తెలిసినదే. నా సందేహమేమంటే రావణుడి లంకా వర్ణనలో ఎక్కడైనా ఈ శక్తిపీఠ వర్ణన ఉందా? ఒకవేళ లేకపోతే అసలు లంక భూమి మీదే ఉండి ఉండవచ్చా ? లేక సముద్రం లో మునిగిపోయిందా ?
రెండో సభ్యుడు :
ఈ లంక ఆ లంక కాదు. వీటి ప్రాచీన నామాలు కూడా కలవవు. ఇది సింహళం. అది లంక. ఆ లంక భూమధ్యరేఖ (Equator) మీద హిందూ మహాసముద్రంలో ఉండేది. అది మునిగిపోయింది. కనుక మీరు చెబుతున్న శక్తిపీఠం కూడా దాన్తోపాటే మునిగిపోయి ఉండాలి.
మూడో సభ్యుడు :
ఈ లంక ఆ లంక కానప్పుడు ఇప్పుడున్న రామ సేతువు వానరులు నిర్మించింది కాదా అండి ?
నాలుగో సభ్యుడు :
మీ ఒక్క ప్రశ్న కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. అదే సమస్య.
రెండో సభ్యుడు :
అది ఆడమ్స్ బ్రిడ్జే, రామసేతువు కాదు. రామసేతువు ఒక తాత్కాలిక నిర్మాణం. పని పూర్తి కాగానే అది సముద్రంలో కలిసిపోయింది. ఎందుకంటే అది పునాదులతో సహా కట్టిన నిర్మాణం కాదు. తనమీద వేసిన ఱాళ్ళని కలిపి ఉంచి తేల్చుతానని సముద్రుడు రాములవారికిచ్చిన మాట ప్రకారం దాన్ని తాత్కాలికంగా కట్టారు.
లంక భారత ప్రధానభూభాగం (mainland) నుంచి వంద యోజనాలని వర్ణించబడింది. యోజనమంటే 16 కిలోమీటర్లు. వంద యోజనాలంటే 1600 కిలోమీటర్లు. కానీ ప్రస్తుత శ్రీలంక భారతదేశపు ప్రధాన భూభాగం నుంచి కేవలం 80 కిలోమీటర్లే. (ధనుష్కోటి నుంచి అయితే 31 కిలోమీటర్లే) అదీ గాక ఈ శ్రీలంకలో త్రికూటపర్వతం లాంటిదేదీ లేదు. ఆ పర్వతం లంక ఒడ్డునే ఉండేదని రామాయణం చెబుతోంది.లంకానగరాన్ని కట్టింది ఆ పర్వతం మీదే, ఇప్పటి తిరుమల లాగా ! ఇప్పటి శ్రీలంకలో చిన్నచిన్న కొండలూ, గుట్టలూ తప్పితే లంక లాంటి మహానగరాన్ని కట్టడానికి అనువైన పర్వతమే లేదు.
మొదటి సభ్యుడు :
ఇప్పుడు సందేహం జటిలమవుతోంది.
1. రావణుడి లంకలో శక్తిపీఠం లేదు, కనుక నేటి శ్రీలంకలో ఉన్నది అష్టాదశ పీఠాలలో ఒకటే.
2. ఆడమ్స్ బ్రిడ్జ్ రామసేతు కానప్పుడు ఎందుకు దాని పగలగొట్టడానికి ఇంత రాద్దాంతం జరుగుతోంది?
3. శ్రీలంక ఒకప్పుడు భారతదేశంలో కలిసి పోయి ఉండవచ్చు.
4. కనుక శ్రీలంక చివరి నుండి 1600 కిలోమీటర్ల లెక్క వేసుకుంటే భూభాగం అంతా సముద్రం లోపలే ఉండవచ్చు. అయితే ఇది ఏ దిక్కుగా తీసుకోవాలి?
మీరు చెప్పినట్టు భూమధ్య రేఖ వైపు అనుకుంటే పశ్చిమ దిక్కుగా ఆంజనేయస్వామి పయనించి ఉండాలి. కానీ రామాయణం ప్రకారం ఆయన దక్షిణ దిక్కుగా పయనించారు.
5. 1600 కిలోమీటర్ల దూరం అంటే బహుశా ధృవప్రాంతానికి దగ్గరగా వాతావరణ పరిస్థితులు మారిపోయి ఉండాలి. కానీ అలాంటి వర్ణన ఏమీ కానరాదు.
భూమధ్యరేఖ పశ్చిమంలో లేదుగా ?
ఇండియా నుంచి కిందికి సరళ రేఖ గీసుకోవాలి. అది భూమధ్యరేఖ దగ్గఱ ఖండన అయ్యేచోట లంక ఉండి ఉండాలి. ఈ రేఖని ఉజ్జయినీ నగరం నుంచి సూటిగా గీయాలని జ్యోతిశ్శాస్త్రాల్లో ఉంది.
మనం శ్రీలంక అంటున్నది వాస్తవానికి ప్రాచీనకాలంలో తామ్రలిప్తి అనే పేరుతో ప్రసిద్ధమైన ద్వీపం. రావణుడి లంకకి తామ్రలిప్తి అనే మాఱుపేరు ఉన్నట్లు ఎక్కడా లేదు. శ్రీలంకతో పాటు ఇలాంటి పెద్ద ద్వీపాలు భారత ఉపఖండం చుట్టూ 8 ఉన్నాయని మహాభాగవతం వర్ణిస్తోంది. వాటిల్లో ఒకటి (శ్రీపాదద్వీపం) బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తూర్పుతీరానికి పక్కనే ఉంది. అదిప్పుడు సముద్రగర్భంలో మునిగిపోయి ఉంది.
మొదటి సభ్యుడు :
భూమధ్య రేఖ విషయంలో కొంచెం తికమక పడ్డాను లెండి. సరే, ఈ శ్రీలంకే నాటి రావణుడి నివాసమని ఎందువల్ల పూర్వీకులు/ చరిత్రకారులు భ్రమ చెంది ఉండవచ్చు? కాస్త పరిశోధన చేస్తే రెండూ ఒకటి కావన్న విషయం తెలుస్తున్నప్పుడు ఎలా ఈ విషయాన్ని విస్మరించారు? శ్రీలంకలో ఉన్నట్టుగా చెప్తున్న రావణుడి విగ్రహాల పూజలు ఏనాడు మొదలుపెట్టి ఉండవచ్చు? కొంపదీసి ఇది కూడా చరిత్రకారుల కుట్రల్లో భాగమా?
అయిదో సభ్యుడు :
ఆహా ఆరోగ్యకరమైన చర్చల వల్ల ఎంతటి మంచి ఫలితాలు కల్గుతున్నాయో కదా !
రెండో సభ్యుడు :
అందఱూ విస్మరించలేదు. కొద్దిమందికి స్పష్టంగా తెలుసు. విషువత్తుల (Equinoxes) లెక్క లంకారాజ్యంలోనే కరెక్టుగా తెలుస్తుందని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతూ ఈ విషయాన్ని ఉటంకించారు. కానీ మనకి తెలిసిన శ్రీలంకలో విషువత్తుల లెక్క సరిగ్గా తెలీదు. ఎందుకంటే ఇది భూమధ్యరేఖ మీద లేదు. ఈ లెక్కలు తెలీక, గ్రంథాల్ని లోతుగా చదవక కలిగిన భ్రమలివి. శ్రీలంక ప్రభుత్వం పర్యాటకం కోసమని వీటిని మఱింత ఎగసన దోసింది. లంకారాజ్యం భూమధ్యరేఖ మీద ఉండడం చేత సూర్యకాంతి తీక్ష్ణత పెచ్చుమీఱి అక్కడి వాస్తవ్యులు కాఱునల్లగా ఉండేవారు. వాళ్ళని రాక్షసులని వర్ణించింది రామాయణం. రావణాసురుణ్ణి కూడా "మాషరాశిప్రతీకాశం...." అన్నారు. మినుముల కుప్పలా నల్లనివాడు అని !
నాలుగో సభ్యుడు :
మీరు చెప్పినదానిలో అతిముఖ్యమైన పాయింట్ ఉంది. రెండవది, కన్వెన్షనల్ పరిశోధనని కొట్టి పారేసారు. అన్ని వాలిడ్ పాయింట్సే. ఇకపోతే విషువత్తుల లెక్కింపు సూర్య సిద్ధాంతం ప్రకారం లంకారాజ్యం నుంచి ఉజ్జయినికి మారింది. కలియుగారంభానికి ముందు బహుశా లంకారాజ్యాన్ని Zero longitude focal point గా గ్రహించేవారేమో.
రెండో సభ్యుడు :
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లంకకి 1948 కి ముందు లంక అనే పేరు లేనేలేదు. దీన్ని రామాయణ లంక అని మొదట భ్రమించినది తమిళులు. స్థానిక సింహళీ సాహిత్యంలో కూడా దానికా పేరు లేదని విన్నాను. కనుక ఇది రామాయణ గ్రంథం నుంచి ఆధునిక సింహళీయులు కాపీకొట్టిన పేరు. నా ఉద్దేశంలో ఈ సింహళం ఒకప్పుడు - అంటే రామాయణ కాలం నాటికి ఇండియాతో భూసంధి కలిగి దాదాపుగా కలిసిపోయి ఉండేది. కనుక దానికో ప్రత్యేకమైన పేరు కూడా లేదు.ఎప్పుడో ఏదో పెద్ద ఉప్పెన వచ్చి ఈ రెండు భూఖండాల్నీ విడదీసింది.
నాలుగో సభ్యుడు :
సరిగ్గా చెప్పారు. రామాయణం నుంచే సింహళీలు ’లంక’ గా మార్చి ’శ్రీ’ తగిలించుకున్నారు. లంకని పిన్ పాయింట్ చేయడం కష్టమే. మీరు చూపిన నక్ష కూడా ఇప్పుడున్న కొలతల ప్రకారం కొంతవఱకు సరైనదే. లంకా స్థానాన్ని మీరు చూపిన ప్రాంతంలో అప్పటికే పాండ్యులు ఉన్నారు. కాబట్టి ఇంకొంచెం లోతు పరిశోధన అవసరం. నేను ఇదివఱలో రావణుడు స్థాపించిన అమ్మవారి దేవస్థాన కథ విన్నాను. దీని గుఱించి మన సాహిత్యాల్లో ఎక్కడైనా ఉందా?
మొదటి సభ్యుడు :
పాండ్యులు హిందూమహాసముద్రంలో ఉన్నారా ? అక్కడేమీ లేదు కదా గత కొద్ది వేల సంవత్సరాలుగా ?
కొన్ని దశాబ్దాల క్రితం ఒక రష్యన్ జలాంతర్గామి హిందూమహాసముద్రంలో ప్రయాణిస్తూ అక్కడ సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల పొడవున పెద్ద పెద్ద
కోటగోడలూ, ఎత్తైన భవనాలూ, దేవాలయాల్లాంటి నిర్మాణాలూ చూశామని చెప్పినట్లు కీ.శే.ఎక్కిరాల వేదవ్యాస్ గారు వ్రాశారు. ప్రభుత్వం పరిశోధన చేయిస్తే లంకారాజ్య స్థానాన్ని తెలుసుకోవడం కష్టం కాదు. ముఖ్యంగా - లంకానగరం త్రికూట పర్వతం మీద నిర్మించబడిందనే క్లూ ఆధారంగా చేసుకొని హిందూ మహాసముద్రం కింద అలాంటి పర్వతం ఏమైనా ఉందేమోనని వెతకడానికి అవకాశం ఉంది.
కోటగోడలూ, ఎత్తైన భవనాలూ, దేవాలయాల్లాంటి నిర్మాణాలూ చూశామని చెప్పినట్లు కీ.శే.ఎక్కిరాల వేదవ్యాస్ గారు వ్రాశారు. ప్రభుత్వం పరిశోధన చేయిస్తే లంకారాజ్య స్థానాన్ని తెలుసుకోవడం కష్టం కాదు. ముఖ్యంగా - లంకానగరం త్రికూట పర్వతం మీద నిర్మించబడిందనే క్లూ ఆధారంగా చేసుకొని హిందూ మహాసముద్రం కింద అలాంటి పర్వతం ఏమైనా ఉందేమోనని వెతకడానికి అవకాశం ఉంది.
అయిదో సభ్యుడు :
మఱి రామేశ్వరం సంగతి?
రెండో సభ్యుడు :
శ్రీరామచంద్రులవారు రావణసంహారం తరువాత రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశారు. అదొక్కటే దాని ప్రాశస్త్యం.
అయిదో సభ్యుడు :
లంక నుండి శ్రీరాముడు తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు మీరు చూపిన పటం ప్రకారం దగ్గఱి దారిలో కన్యాకుమారికో లేక తిరువనంతపురానికో రావాలి. అలా కాక ఇప్పటి శ్రీలంకకు దగ్గఱగా ఉన్న రామేశ్వరానికి వచ్చుంటాడా ? అన్నదే నా సందేహం
రెండో సభ్యుడు :
వచ్చినది కాలినడకన కాదు గదా ! విమానంలో వచ్చారు. కనుక ఎక్కడికైనా వెళ్ళే అవకాశముంది. శివలింగప్రతిష్ఠ ఒక దైవకార్యం. వాటికి ఫలానా చోటనే జఱగాలన్న దైవాదేశాలు ఉంటాయి. ఆ ప్రకారం అక్కడ ఆ కార్యాన్ని నిర్వర్తించడం జఱిగింది. నా అభిప్రాయంలో - రామేశ్వర మహిమ శ్రీరాములవారితో మొదలై ఉండదు. అంతకుముందే అది ప్రఖ్యాత పుణ్యక్షేత్రమై ఉంటుంది. అందుకే రాములవారు అక్కడే లింగప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకొని ఉండొచ్చు. ఆ తరువాత అది ఆయన పేరుతోనే విఖ్యాతమైఉండొచ్చు.