28, జూన్ 2013, శుక్రవారం

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు

  • - డాక్టర్ కందుకూరి శివానందమూర్తి
  • 27/06/2013
................... కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యాత్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపోవడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. .................... గడచిన వారం రోజులలో హిమాలయాలలోని కేదార యాత్రీకుల ఆపదలు చాలా తెలుసుకున్నాం. ఈనాటికి ఐదువేల మంది చనిపోయారని తెలుస్తున్నది. సుమారు ఎనభైరెండువేల మంది ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో క్షే మంగా రక్షింపబడ్డారు. చాలామంది ఇళ్ళకి చేరుకున్నారు. దాదాపు అక్కడ ఇరుక్కున్న వారందరూ రక్షింపబడినట్టే. నేడో రేపో ఆ మిగతా పని కూడా పూర్తి అవుతుంది. భారతీయ వాయుసేన యంత్రాంగం ఆరు రోజులలో చాలా గొప్ప సేవ చేసింది. ఈ సంఘటనపైన ఎన్నో రకాల వ్యాఖ్యలు సహజంగా వినబడుతున్నాయ. అసలు ఈ మతం నమ్మకంతో ఇంతమంది అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళాలి? ఇదంతా కేవలం మూఢనమ్మకం వల్ల వచ్చి న ఆపద కాదా..? ఇదొకరకం విమర్శ! ఇలాంటి నమ్మకాలు లేకపోతే ఇంతమంది పోయుండేవారు కాదుకదా..అని మరో వ్యాఖ్యానం. మనం గొప్ప నాగరికతతో తయారుచేసుకున్న రోడ్లపైన దేశం మొత్తం మీద పది రోజులకొకసారి ఐదువేల మంది పోతూ ఉండవచ్చు. దానికి ఏ విశ్వాసము కారణము కాదు. కేవలం మన నాగరికతలోని అనాగరికతే కారణం! మన సాంకేతిక విద్యకి పరాకాష్టగా నిర్మించిన ‘టైటానిక్’ అనే ప్రయాణికుల నౌకకి పట్టిన గతికి ఎవరు బాధ్యులు? మరొక్క రోజు ప్రయా ణం క్షేమంగా సాగితే ఆ పధ్నాలుగు వం దల మంది మహా వైభవంగా ఉత్సవం చేసుకుని ఉండేవారు. ఇలాంటివి ఎన్నో! మన భారతదేశంలో ఏ క్షణంలో లెక్క చూసినా సుమారు 15 కోట్ల మంది భక్తులు దేవాలయాలలో, క్షేత్రాలలో, మఠాలలో ఉంటూ ఉంటారు. వీరందరిలో 99 శాతం క్షేమంగా తిరిగి వస్తున్నారు. ప్రమాదాలెన్ని జరిగినా ప్రజల విశ్వాసం మాత్రం ఏమీ తగ్గదు. మానవ జీవితంలో వ్యక్తికి, సంఘానికి కూడా శుభాశుభాలు, అనుకోని ఆపదలు అక్కడక్కడ కలుగుతూనే ఉంటాయి. దానివల్ల జీవన స్రవంతి ఆగకుండా సాగుతూనే ఉంటుంది. కేదారయాత్ర విషయంలో ఆలోచిస్తే అక్కడ జరిగిన ప్రకృతి బీభత్సంలో ఎనభై రెండు వేల మంది క్షే మంగా తిరిగి రావడం చాలా గొప్ప విష యం. ప్రకృతియొక్క ఆగ్రహం కంటే భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఎక్కు వే ఉంది. ఇటువంటి సంఘటనలకు ఏదో కారణం వెతకనే కూడదు. ఆవిధంగా ఎంత తిప్పలు పడ్డా సరియైన కారణం దొరకదు. కానీ ఓ దుర్మార్గుడు బాంబు పేల్చి ఒక వందమందిని చంపడంలో కారణం ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ విధంగా కారణం తెలిసిన చోట ఒక కర్తవ్యం ఉంటుంది. మృ తులు పదిమందైనా, వందమందైనా కానీ చాలా విచారకరమే. కానీ ఆపదయొక్క పరిమాణాన్నిబట్టి నష్టాన్ని అవగాహన చేసుకోవలసి ఉంటుంది. కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యా త్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపో వడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళిమొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. ఆవిధంగా మొక్కులు చెల్లించుకునే క్షేత్రాలు దేశం లోపలే అనేక సంఖ్యలో ఉన్నాయి. కేదారయాత్ర చరిత్రలో - పంచపాండవులు ద్రౌపదీదేవితో కలిసి పాదచారులై కేదారానికి మహాప్రస్థానం వెళ్ళారని మహాభారతం వర్ణిస్తోంది. ఆ ఆలయంలో పంచపాండవుల మూర్తులు కూడా ఉన్నాయి. ఆ యా త్రలో ఎటువంటి సౌకర్యాలు అమర్చుకోకుండా ఈశ్వరధ్యానంలో నడచి, నడచి శరీరాలు విసర్జించారు వాళ్ళు. ధర్మరాజు మాత్రమే చివరి పర్వతాగ్రందాకా వెళ్ళి దేవతల దర్శనం చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ పడిపోయినా ఒక కుక్క మాత్రం ఆయనతో చివరివరకు నడిచి వచ్చింది. ధర్మదేవత ఆయన్ని స్వర్గానికి ఆహ్వానించినా కుక్కను కూడా తనతో అనుమతించాలని పట్టుపట్టాడు. ఆయన న్యాయ దృష్టికి దేవతలు మెచ్చారు. ఆ కుక్క ఎవరో కాదు ఆయనని పరీక్షించిన ధర్మదేవతే అని ఋజువైంది. మహాప్రస్థానమంటే ఈ లో కాన్ని శాశ్వతంగా వదిలి తిరిగివచ్చే సం కల్పం లేక పైలోకాలకి ప్రస్థానం సంకల్పించి దేహత్యాగం చేయడమన్నమాట. ఈ యాత్ర చేయడంలో అటువంటి మనఃప్రవృత్తి కొందరికి ఉంటూనే ఉండింది. సంసారాన్ని వదలిపెట్టిన విరాగులు, అటువంటి భావన కలిగిన కొద్దిపాటి గృహస్థులు, ఇక బైరాగులు, సన్యాసులు, జీవనయాత్ర పూర్తికాబోతున్నదని నిశ్చయం చేసుకున్న వారు అనేకమంది ఏవిధమైన జాగ్రత్తలు, అన్న వస్త్రాల ఏర్పాట్లు కూడా చేసుకోక అటువెళ్ళి తిరిగి రాలేదు. ఒకవేళ అక్కడ చేరిన తరువాత కూడా స్వాధీనం కాని శరీరంలో వారుకాలం గడిపేవారుకాదు. ఈశ్వర ధ్యానంతో ప్రాణాయామం దీక్షగా చేసి ఊపిరి చాలా వరకు నిగ్రహించి, నెమ్మదిగా ఆ ప్రక్కన కొండ చివరికి చేరి, మనస్సు, బుద్ధి, చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసి మైలు లోతైన అలకనందలోయలో శరీరాన్ని విసర్జించేవారు. ఆ నిగ్రహం చేత కేవలం శరీరమే లోయలో పడి ఆ జీవాత్మ దారిలోనే శరీరాన్ని వదిలి ఊర్థ్వలోకాలని చేరుకునేది. ఇది ‘‘్భృగుపాత’’మనే పేరుగల దేహాన్ని విసర్జించే ఒకానొక ప్రక్రియ. అది దుఃఖంతో చేసుకునే ఆత్మహత్యకాదు. ఇదంతా సుదీర్ఘమైన సాధనతో పూర్తి విరాగంతో ఊర్థ్వ గతిపైన దీక్షతో మోక్షప్రదాత అయిన పరమశివుడు కేదారనాధుని దయపైన నమ్మకంతో చేసిన పని. అలాంటి వారు వేలమంది ఉండరుకదా? హిమవంతం తపోభూమి.గృహస్థులకు సంబంధించిన కర్మభూమి కాదు. వేదవ్యాస మునీంద్రుడు తన దివ్యశరీరంతో అక్కడ శాశ్వతంగా నిలిచిపోయాడు. శ్రీకృష్ణుని అంశ తేజోరూపంతో హిమాలయాలలోనే ఉండిపోయింది. అంతేకాక బ్రాహ్మణుడై మహాపాపం చేసిన అశ్వత్థామ శాపగ్రస్థుడై, రోగగ్రస్థుడై అక్కడే తిరుగుతున్నాడు. అక్కడ పవిత్ర వాతావరణంలో తన పాపం కొంత క్షయిస్తుందని సంకల్పం కావచ్చు. ఇంకా వేలాది మంది అక్కడక్కడ నందాదేవి వంటి పర్వతగుహలలో తపస్సు చేసుకుంటున్నారు. బదరీ, కేదార క్షేత్రాలున్న అన్నపూర్ణ హిమాలయ పర్వత పంక్తికి వెనుకనే ఉన్న మహోన్నత కైలాస పర్వత ప్రాంతంలో రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మజ్ఞాని అయిన హనుమంతుడు చిరంజీవిగా సంచరిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ గృహస్థుల యాత్రాస్థలాలు కావు. సౌకర్యాలతో యాత్ర, వినోదయాత్ర, వ్యాపార సరళితో కలిసి నేటి పరిస్థితి ఇలాగ మారింది. లౌకిక క్షేమాన్ని ప్రక్కన పెట్టి, కేవలం తాత్విక దృష్టితో చూడగలిగితే అక్కడే దేహాన్ని వదలిన యాత్రికులకి చివరి క్షణంలో దుఃఖమే కలిగిందో లేక శాంతి లభించిందో మనకి తెలియదు. వాళ్ళే ఒక వేళ ఇంటికి తిరిగి వచ్చినా ఏదో ఒకనాడు మృత్యువు తప్పదు. ఇక్కడి మృత్యువు పరిస్థితులు ఎవరి స్వాధీనంలోనూ ఉండవు. ఎట్టి మృత్యువు ఏ జీవునికి మంచిదో, ఉత్తమమో తెలియదు. శరీరం ప్రకృతి వశం, జీవుని గతి కర్మవశం అయి ఉండగా జీవుడు ఈశ్వరునితో ఎంత సంబంధం పెట్టుకున్నాడో అంతమాత్రమే వారిగతి ఈశ్వరేచ్ఛ అయి ఉంటుంది. మనమందరం ఈ దేహయాత్ర చాలించిన యాత్రికులందరి జీవులకు శివానుగ్రహం కలిగి పూర్ణశాతం లభించాలని ఈశ్వరుని వేడుకుందాం. వారికి, వారి కుటుంబాలకి మనఃస్ఫూర్తిగా సానుభూతి చెప్పుకుందాం. భవిష్యత్తులో యాత్రికులందరికి అక్కడి ప్రకృతి ప్రసన్నమై ఉండుగాక! ఈ సందర్భంలో ఒక కథని జ్ఞాపం చేసుకుందాం... ఒకనాడొక బ్రాహ్మణుడు మండుటెండలో నడచి, ఆకలితో నీరసించి ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఉన్న గృహస్థుని చూచి ప్రాణం పోతున్నదని సౌంఙ్ఞతో ఆహారం వేడుకున్నాడు. ఆ గృహస్థు ఇంటి ముందరే ఉన్న చెరువును చూపించి వెంటనే స్నానం చేసి రమ్మని, భోజనం సిద్ధంగా ఉన్నదని అన్నాడు. అంతవరకూ కూడా ప్రాణం నిలువదని వెంటనే ఏదో ఇవ్వమని అడిగితే ఒక గినె్నలో పాయసం ఇచ్చాడు. తీరా పాయసం పాత్ర చేతికి రాగానే కొద్ది ధైర్యం వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఒక క్షణంలో స్నానం ముగిద్దామనుకుని ఆ పాయసపాత్రను గట్టుమీద పెట్టాడు. పాపమాతడు త్వరగానే స్నానం ముగించాడు. కాని సమీపంలో చెట్టుపైన ఉన్న ఒక గద్ద ఒక విషసర్పాన్ని గోళ్ళతో చీల్చింది. ఆ మరణవేదనలో ఆ సర్పం విషం కక్కింది. ఆ విషం తిన్నగా పాయసంలో పడింది. ఎంతో ఆత్రంతో ఆకలితో ఉన్న ఆ బ్రహ్మణుడు వేగంగా పాయసం త్రాగేశాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే అక్కడే మరణించాడు. గ్రామస్థులు ఆయన మరణానికి కారకులెవ్వరని చర్చించారు. అడిగిన వెంటనే చేతికి పాయసాన్ని అందించక స్నానం చేయమని సూచించిన గృహస్థునిది తప్పా? విషం కక్కిన సర్పానిది తప్పా? అదే క్షణంలో సర్పాన్ని చీల్చి చంపిన ఆ గద్ద కారణమా? పాయసం వెంటనే తాగకుండా స్నానం కోసం ఆలస్యం చేసిన బ్రాహ్మణునిది తప్పా? చర్చలో గ్రామస్థులు తేల్చలేకపోయారు. వెంటనే ఆ ప్రక్కనే నడచిపోతున్న సాధువు కనిపిస్తే అతనిని సందేహం తీర్చమని అడిగారు. ఆ సాధువు నవ్వి - ఆ బ్రాహ్మణుని మృత్యువుకి ఆ గృహస్థుకాని, ఆ సర్పంకాని, ఆ గద్ధకాని, చివరగా ఆ బ్రాహ్మణుడే కాని ఇందులో ఎవరైనా ఒక్కరు బాధ్యులని నిర్ణయిస్తే దానివల్ల అట్టివారికా పాపం సంక్రమిస్తుందని తెలిపాడు. ఎందుకంటే ఆ మృత్యువులో అసలు పాపమే లేదు. ఎవరి పాప మూ లేదు. ఇటువంటి సహజ సంఘటనలకు ఎవరినీ బాధ్యులని నిర్ణయించడం సరికాదు. ఒక కారు ప్రమాదం జరిగితే దానికి ఎవరినో బాధ్యులుగా నిర్ణయించి చర్య తీసుకోవడం సమాజ జీవనంలోని ఒక శాసన వ్యవస్థగా కొనసాగడం నాగరిక జీవనంలో ఒక భాగం మాత్రమే. అన్నింటికీ మనం చూపించే కారణాలు పూర్తిగా నిజం కావు. ఇది విశేష సత్యం.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి