బతకాలి మన ధర్మం.. అందుకుఏ మహా సమ్మేళనం
July 29, 2013
స్వామీజీ అనే పదానికి కొత్త అర్థం.. పరమార్థం.. స్వామి పరిపూర్ణానంద
సరస్వతి. హిందూ ధర్మం మంటగలిసి పోతుందంటూ పెదవి విరిచి, పక్కవారి వంక
చూస్తే సరిపోదు.. ధర్మపరిరక్షణ కోసం, తద్వారా ఆత్మోన్నతి సాధన కోసం ప్రతి
ఒక్కరూ నడుం కట్టాలంటారాయన. ప్రవచనాలు చెప్పి ఊరుకుంటే ధర్మం బతకదని
గ్రహించి 'టీమ్ స్క్వేర్' పేరిట నాలుగంచెల ధర్మపరిరక్షణ ప్రణాళికను సిద్ధం
చేశారు. దాంతో పాటు భాగ్యనగరంలో వచ్చే డిసెంబర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక
గురువులు, పండితులతో అంతర్జాతీయ హిందూ మహాసభలు నిర్వహించాలని సంకల్పించారు.
మనం ధర్మాన్ని రక్షించుకోలేకపోతే మనల్ని మనం కాపాడుకోలేం అంటున్న స్వామి
పరిపూర్ణానంద మరేం చెబుతున్నారో విందాం.అమెరికాలో ఉంటున్న తెలుగు వారు కొన్నేళ్లుగా నన్ను అక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. అమెరికా ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నించుకున్నాను. రాష్ట్రంలో నేను చేయాల్సింది చాలా వుంది. ఎన్నో దళిత వాడల్లో పర్యటించాను. వారి వెనకబాటుతనాన్ని గమనించాను. వాళ్లు మతం మారడానికి కారణం డబ్బు మాత్రమే కాదు.. నిరాదరణ అని అర్థం అయింది. నేను హిందూధర్మంలో భాగస్వామిని అనే ఆత్మాభిమానం వారిలో కల్పించాలి. అప్పుడే దళితులు ఉన్నతి సాధిస్తారు. అలాగే యువతలో హిందూ ధర్మం పట్ల అవగాహన పెంపొందించాలి. మన ధర్మాన్ని అనుసరించేలా వారికి ఆధ్యాత్మిక తేజాన్ని అందించాలి. రాష్ట్రంలో నేను చేయాల్సింది ఇంత వుండగా అమెరికా వెళ్లి ఏం చేయాలని రెండు సార్లు వాళ్ల ఆహ్వానాన్ని కాదన్నాను. తప్పనిసరై ఈ ఏడాది 46 రోజుల పాటు అమెరికాలో పర్యటించాను. 9 రాష్ట్రాలలోని అనేక పట్టణాల్లో పర్యటించాను. ఆ దేశాన్ని చూశాక అంతవరకు అమెరికా పట్ల నాకున్న అభిప్రాయం మారిపోయింది.
నా రాష్ట్రం ఇలా వుంటే...?
అమెరికాలో వున్న భారతీయుల ఇళ్లలో సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ప్రతి ఇంట్లోని దేవుడి గదిని ఆలయంలా తీర్చిదిద్దుకున్నారు. కొన్ని సంస్థలు కులాల ప్రాతిపదికగా వున్నా దేవాలయం దగ్గరకు వచ్చే సరికి హిందూ కమ్యూనిటీ సెంటర్స్ పేరిట అంతా ఏకం అవుతున్నారు. వారంలో ఒకసారి అందరూ కలుస్తున్నారు. «మనం ఇక్కడ ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా కునారిల్లుతుంటే అమెరికాలో వుంటున్న మన వాళ్లు సమష్టిగా ధర్మ పరిరక్షణ కోసం ఆలోచించడం నన్ను అబ్బురపరిచింది. అమెరికాలో అద్భుతమైన వ్యవస్థ వుంది. అక్కడ ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందిస్తున్నారు. విలువలతో కూడిన విద్య గతంలో మన గురుకుల వ్యవస్థల్లో వుండేది. ఈ రోజున ఆ విధానాన్ని అమెరికాలో విద్యార్థులకు అందిస్తున్నారు. న్యాయం, పోలీస్, వైద్య వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి. అమెరికాలో ఆ దేశం వారి కంటే వేరు వేరు దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఎక్కువ. వారిలో కూడా నా అమెరికా, నా దేశం అనే భక్తి భావం కనిపించింది. ఈ అంశాలే అమెరికాను అభివృద్ధిలో అంత ఎత్తున నిలిపాయి. నా రాష్ట్రం కూడా ఇలా వుంటే ఎంత బావుండు అనే తపన నాలో మొదలైంది. గ్లోబల్ హిందూ హెరిటే జ్ ఫౌండేషన్ వారు నా అమెరికా పర్యటన వ్యవహారాలన్నీ చూసుకున్నారు. 46 రోజుల పర్యటనలో సుమారు 50 లక్షల రూపాయల వరకు భక్తుల నుంచి కానుకలుగా అందాయి. ఆ డబ్బు మొత్తాన్ని నేను నా టూర్ ఆర్గనైజ్ చేసిన ఫౌండేషన్ వారికే ఇచ్చేశాను.
స్వాములు ఇస్తారు.. పుచ్చుకోరు!
మన దేశంలో సాధువులు, సన్యాసులకు అమెరికా వంటి దేశాలకు వెళ్లి లక్షలు పోగేసుకొచ్చుకుంటారనే విమర్శ వుంది. నిజానికి సన్యాసులకు డబ్బెందుకు? స్వాములు జ్ఞానాన్ని ఇస్తారు.. మరేవీ పుచ్చుకోరు. ఆ డబ్బును ఏం చేద్దాం అని అడిగారు ఫౌండేషన్ సభ్యులు. మాతృదేశంలో ధర్మపరిరక్షణకు ఈ డబ్బును ఖర్చు చేయండి అని చెప్పాను. అందుకోసం నాలుగంచెల పథకాన్ని రూపొందించాం. అందులో భాగంగా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అలాంటి ఒక హాస్టల్‌ను అనంతపురంలో ఇప్పటికే నేను ప్రారంభించాను. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లల్ని అందులో చేర్చుకుని వారికి విలువలతో కూడిన ఉచిత విద్యను అందిస్తున్నాం. వారికి సంస్కృతి, సంప్రదాయాలు బోధిస్తున్నాం. అక్కడ చదువుకున్న పిల్లలు మంచి మార్కులతో ఇతర స్కూళ్లలోని పిల్లలతో పోటీ పడుతున్నారు. ఇలాంటి హాస్టళ్లు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పించాం. వచ్చే ఏడాది కల్లా కనీసం 6 జిల్లాల్లో ఇలాంటి హాస్టళ్లు ప్రారంభం అవుతున్నాయి. అలా ఏడాదికి రెండు వేల మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నతి సాధిస్తే, ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా సమాజం అభివృద్ధి సాధిస్తుందని నా విశ్వాసం. అమెరికాతో పాటు వివిధ దేశాలలో వుంటున్న మన వారు నలుగురు ఒక జిల్లాను చొప్పున దత్తత తీసుకుని ఈ బాధ్యతను చేపట్టాలని నిర్ణయించాం. భారతదేశాన్ని, యువతను, వ్యవసాయాన్ని, పశుసంపదను ఉద్ధరించే లక్ష్యంతో పుణ్య కల్చరల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో గో సంపదను, రైతును, ఆలయాల్ని పరిరక్షించే చర్యలు చేపట్టాలని సంకల్పించాం.
గోవు..ఆలయాలు, ధర్మం బతకాలి
గోవధ పెరుగుతోందని ఆందోళన పడుతున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎవరూ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు. మనం మట్టికి దూరమై పోయి పుట్టెడు కష్టాలు కొనితెచ్చుకుంటున్నాం. ఒక ఆవును పెంచితే వచే ్చ వ్యర్థాలతో ఎకరాల కొద్దీ పంటను ఎరువులు లేకుండా పండించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. అందుకే రైతు అప్పుల పాలు కాకుండా చూడడంతో పాటు గోవధను తగ్గించేందుకు గోకులాల్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాం. కాకినాడ శ్రీపీఠంలో ఇప్పటికే దయానంద సరస్వతి గోకులం ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు పని మొదలుపెట్టాం. ఈ గోకులాలను ఆదర్శవంతంగా, గోవుల పట్ల భక్తి పెరిగేలా తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడి దేశీ ఆవులను రైతులకు దత్తత ఇస్తాం. అవి ముసలివి అయిపోయాక వాటిని మాకు అప్పగిస్తే, అవసాన దశలో అవి స్వేచ్ఛగా జీవించేందుకు వీలుగా ప్రతి జిల్లా కేంద్రంలో గో స్వేచ్ఛా సంచార కేంద్రాలను ఏర్పాటే చేసే ప్రయత్నం చేస్తున్నాం. గోకులాల వల్ల గోసంపద పెరగడంతో పాటు, ఉత్పత్తి వ్యయం తగ్గి రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి. ఇక ప్రతి జిల్లాలో నాలుగు ప్రాచీన ఆలయాల్ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయాలని సంకల్పించాం. కొత్త ఆలయాలు కట్టుకుంటూ పోయేకంటే వున్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం ప్రధానం. అందుకే ప్రతి జిల్లాలో నాలుగు ఆలయాల్ని తీసుకుని వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఆ ఆలయాల్లో అన్ని పూజలు ఉచితంగా చేసేలా ఏర్పాటు చేస్తాం. ఈ బాధ్యతలు నిర్వర్తించి, ధర్మపరిరక్షణ చేసేందుకు జిల్లాకు నలుగురు సుశిక్షితులైన ధర్మపరిరక్షకులను ఏర్పాటు చేస్తాం. దేవాలయం కేంద్రంగా, సమాజాన్ని చైతన్యపరచి ధర్మపరిరక్షణ చేసేందుకు వీరు కృషి చేస్తారు. ఇలా ధర్మపరిరక్షణ జరిగి, బడుగులు అభివృద్ధి చెంది, గోవులు, రైతులు సుభిక్షంగా వుంటే మన దేశంలో అభివృద్ధికి కొదువ ఏముంటుంది? మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. అందుకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలి.
హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు పండితులు, ప్రముఖుల సూచనలు తీసుకుని, కార్యాచరణ రూపొందించేందుకు గాను వచ్చే డిసెంబర్‌లో అంతర్జాతీయ హిందూ సభలు ఏర్పాటు చేస్తున్నాం. స్వామి దయానంద సరస్వతి ఈ సదస్సుకు సార«థ్యం వహిస్తారు. యువతలో హిందూ ధర్మాన్ని పాదుకొల్పేందుకు ఏం చేయాలనే అంశంతో పాటు ప్రామాణికమైన పురాణాలు ఏవి అనే అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తాం. డిసెంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు లక్ష మంది పాల్గొంటారు. మొత్తం ఏడు దేశాల ప్రతినిధులతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి 50 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఆశారామ్ బాపూజీ, శ్రీశ్రీరవిశంకర్, బాబా రామ్‌దేవ్ వంటి ప్రముఖులతో పాటు మన రాష్ట్రానికి చెందిన పలువురు పండితులు, పెద్దలు సదస్సులో పాల్గొంటారు. హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశంపై అమెరికాలో వుంటున్న తెలుగు యువతీయువకులు ప్రసంగిస్తారు. వారే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా మన సమాజంలోని పెద్దలందరితో ఈ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ సభల్లో పాలుపంచుకోవాలన్నా, హిందూ పరిరక్షణ ఉద్యమంతో చేయి కలపాలన్నా www.sreepeetham.in? వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
- టి. కుమార్