'కొత్త సంవత్సర వేడుకలు - చర్చాగోష్టి .. కాలనీ వాసులందరికీ ఆహ్వానం' - కరపత్రంలోని అంశాన్ని చదివిన మిత్రుడు సర్వేశ్వర్రావ్, "చర్చా గోష్టి ఏమిటో! అగ్గి-నిప్పులాగా పేపర్-కాగితం లాగా, హహ్హహ్హా!" అని నవ్వాడు. 'చర్చ అని గానీ, గోష్టి అని గానీ అంటే సరిపోతుంది కదా అన్నది అతడి భావం'. అసలు సంగతి వదలి కొసరు సంగతులను పట్టుకోవడం సర్వేశ్వర్రావ్ కి ఇష్టం.
'వెళ్దాం పద! ఏం చర్చిస్తారో విందాం' అన్నాను.
'పనిలేని వాళ్ళు ఏవో చేస్తుంటారు. మనకెందుకులే, టైం వేస్ట్' అన్నాడు మిత్రుడు.
'చూడు మిత్రమా! ఎదో మంచి ఆశయమని అనుకోక పొతే వాళ్ళు ఆ పని చేయరు. కాబట్టి, పనిలేని వాళ్ళని అనద్దు. మోసం చేసే ప్రయత్నమో, ఏదైనా వ్యాపారమో దాగి ఉన్నట్లు అనిపించడం లేదు. కాబట్టి, ఎవరో అమాయకులని అంటే అను. మనకీ గౌరవంగా ఉంటుంది. అంతే తప్ప .....' - మిత్రుడి మాటను సరిచేశాను.
'సర్లే, ఆ మాత్రం లోతుగా వెళ్ళడం నాకూ చేతనవును. వెళితే అర్థమవుతుంది, అదేదో పనిలేని వ్యవహారమని' సర్వేశ్వరరావు రెట్టించాడు. 'పద! చూద్దాం!' నేనూ కవ్వించాను.
అది కమ్యూనిటీ పార్క్. క్రికెట్, బ్యాడ్మింటన్ ఆటలతో సందడిగా ఉంది. ఓ చివర సిమెంటు కుర్చీలు. వాటిలో అయిదుగురు సీనియర్ సిటిజన్లు కూచుని ఉన్నారు. వారంతా రెగ్యులర్ గా వచ్చే వారేనట. వారి ఎదుట కొత్తగా వేసిన పది వరుసల ప్లాస్టిక్ కుర్చీల్లో నలుగురు స్కూలు కుర్రవాళ్ళు, ఇద్దరు స్కూలు అమ్మాయిలూ మాత్రమె కూచుని ఉన్నారు. వారైనా అక్కడి సీనియర్ సిటిజన్ల ప్రోద్బలంతో వచ్చిన వారేనట. తోడూ మేమిద్దరం. ఇదీ అక్కడి సభ. కరపత్రాన్ని చూసి వచ్చిన వాళ్ళం మేమిద్దరమే.
నేనడిగాను, కరపత్రాలకు ఏమాత్రం ఖర్చు చేశారని. వెయ్యి రూపాయలు ఖర్చు చేశారట.
మిత్రుడు నా వంక చూశాడు. 'చూశావా, వీళ్ళెంత వృధా రాయుళ్లో, టైంని కూడా అలాగే వృథా చేస్తార'న్నది అతడి భావం. వారిలో పెద్దాయన వయస్సు 84ట. ఈ ప్రయత్నమూ, ఖర్చూ అంతా ఆయనదేనట.
మిత్రుడు నా వంక చూశాడు 'ఈ వయసులో కూడా ఆయనకు ఈ తాపత్రయాలేమితో' అన్నది ఈ సారి అతడి భావం.
..... కానీ, ఆయన మాటలు ఆయన హృదయం లోతుల నుంచి వస్తున్నాయి. వాటిని పిల్లలు శ్రద్ధగా వింటున్నారు.
"ఈ జనవరి ఒకటి మనకు పండుగ కాదు. అసలు ఎవరికైనా పండుగ ఎలా అయిందో ఎవరైనా చెప్పగలరా? మన సంప్రదాయంలో కొత్త సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది. ఖగోళ శాస్త్రరీత్యా, అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఆయనాలు, సూర్య చంద్రుల గమనాగమనాలు, ఋతువుల రీత్యా, అన్నింటినీ మించి ఆరోగ్య రీత్యా, ఉగాదికి ఎంతో శాస్త్రీయత, విలువ, పవిత్రత, ప్రయోజనం ఉన్నాయి. మనం కొత్త బట్టలు, దైవదర్శనాలు, పెద్దల ఆశీర్వచనాలు లాంటి వాటితో దివ్యంగా నూతన సంవత్సర ప్రారంభాన్ని జరుపుకుంటాం. మరి ఈ జనవరి ఒకటి ఎలా నిర్ణయమయింది? అంతా గాలివాటమే. పోనీ పవిత్రత ఏమైనా ఉందా? తాగి, మోటార్ సైకిళ్ళ మీద ర్యాష్ గా తిరగడం, అర్థరాత్రి వేళ మత్తులో వెర్రిగా ఊగి పోవడం, మాదక ద్రవ్యాలు, వయసులో ఉన్న ఆడా మగా క్లబ్బుల్లో రాసుకోవడం, పూసుకోవడం. అన్నింటికీ పోలీసు హెచ్చరికలు, జరిమానాలు, అవమానాలు. ఇదా పండుగ అంటే? ఇదా మన సంస్కృతీ? మన పండుగలలో ఎక్కడైనా ఇలాంటి అప్రాచ్యం ఉందా?........"
వార్థక్యం ఉట్టి పడుతున్నా పెద్దాయనలో వాగ్ధాటి బాగా ఉంది.
"అవి మీ జీవితాలకు గానీ, భవిష్యత్తుకు గానీ ఏమైనా ఉపయోగపడతాయా? గుర్తు పెట్టుకోండి! అవేవీ మన సంస్కృతీ కాదు. స్వంత చరిత్రని, సంస్కృతిని మర్చిపోయిన జాతులు మాడి పోయిన బొగ్గుల్లాంటివి. జయ ఉగాది వస్తుంది. దానిని మన పద్ధతిలో దివ్యంగా జరుపుకుందాం. ఈ జనవరి 1 వ్యామోహ ప్రకంపనలు సోకకుండా, మనం ధృడ సంకల్పులం కావాలి. దీనికి మార్గాలు మీరే చెప్పాలి" .... జనవరి 1కి పది రోజుల ముందు ఆదివారం సాయంత్రం జరిగిన ఆ గోష్టిలో, స్థూలంగా ఆ సీనియర్ సిటిజన్ సందేశమిది.
మిత్రుడు నా వంక చూశాడు. 'చూశావా! ఇదేదో చిన్న పిల్లల కోసం, మనకు కాదు' అన్నది అతడి భావం.
నేను ఆ పెద్దాయనను అభినందించాను. "చిన్న పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పే చిన్న ప్రయత్నం కోసం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే ఉదార హృదయం ఎందరి కుంటుంది? మీ సేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ బాలల అసెంబ్లీలతో పరమాద్భుతమైన మార్పు సాధ్యం. అయితే, ఆ వెయ్యిలో అయిదారు వందలను బాలలకు బహుమతుల రూపంలో ఖర్చు పెడితే ఫలితం ఇంకా బాగుంటుందేమో' - అన్నాను.
"జాతీయ దినోత్సవాలకు అలాగే చేస్తున్నాం. సాధారణ సమావేశాలు కూడా అందరికీ తెలియాలని కరపత్రాల మీద ఖర్చు చేశా" అని ఆయన చెప్పారు.
"కరపత్రాలు వేయిస్తే మాత్రం వచ్చేదెవరు? మేం కూడా వేరే పనుంటే వచ్చే వాళ్ళం కాదు" - నా మిత్రుడు వ్యాఖ్యానించాడు.
"నా ప్రయత్నం నాదే. నాకు అసంతృప్తి లేదు. ఈ ఆరుగురు పిల్లల్లో కనీసం ఒక్కరు జీవిత కాలంలో, దురలవాట్లకు ఖర్చు చేయకుండా ప్రతి జనవరి 1కీ సగటున వెయ్యి రూపాయలు ఆదా చేశారనుకోండి! నా ఆత్మ పైలోకాల్లో ఎక్కడున్నా సంతోషిస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు. చేతులు కాలకుండా చూసుకోవడమే అనాదిగా మన భారతీయ సమాజం వివేకం. అందుకోసం ఇలాంటి చిరు సమావేశాల మీద ఏమైనా ఖర్చు పెట్టినా, దానిని మించిన మంచి పెట్టుబడి లేదని భారతీయ కుటుంబాలు తెలుసుకోవాలి. ఈ జనవరి 1 కి అమెరికాలో ప్రభుత్వమే చేతులు ఎత్తేసి, గంజాయి విక్రయాలకు పర్మిషన్ ఇచ్చేసిందట. మనమూ అదే దారిలో నడవాలా? అలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే ప్రతి కుటుంబమూ పిల్లలను ఇలాంటి గోష్టులకు పంపాలి. అప్పుడే అందరమూ అదృష్టవంతులమవుతాం. లేకపోతె, ఈ జాతినీ, దేశాన్నీ ఎవరూ కాపాడలేరు ......." అన్నారు ఆ సీనియర్ సిటిజన్. జాతికి శ్రీరామ రక్ష ఏమిటో నా హృదయానికి మరోసారి కళ్ళకు కట్టిన విలువైన క్షణమది.
".... ఈ ఆరుగురు పిల్లలలో కనీసం ఏ ఒక్కరి వల్లనైనా ప్రభావితమై, భవిష్యత్తులో ఎన్ని వేల మంది డిసెంబర్ 31, జనవరి 1 తేదీలను వివేకవంతంగా గడుపుతారో ఎవరు చెప్పగలరు! వీరిలో ఒక వివేకానందుడు లేడని మీరు రాసివ్వగలరా? ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్, ఒక చాగంటి కోటేశ్వరరావు, ఒక పరిపూర్ణానంద స్వామీ వీరి నుంచి తయారు కారని మీరు పందెం కాయగాలరా? పిల్లల చేత మాట్లాడించాలే కానీ, ఎంత బాగా మాట్లాడతారో విని చూడండి! మీకే తెలుస్తుంది" - ఆ పెద్దాయన నోటి నుంచి వస్తున్నవి చొల్లు మాటలు కావు. జాతి మొత్తానికీ విసురుతున్న సవాలు.
ఓ అమ్మాయి చెప్పింది - "ప్రతి డిసెంబరు 31 వ తేదీనా వివేకానందుడి స్పూర్తిని జ్ఞాపకం చేసుకునే సభలను మనం పెట్టుకోవాలి. ప్రతి జనవరి 1 వ తేదీనా దగ్గరలోని దేవాలయాలకు వెళ్లి, దుష్ట సంప్రదాయాల దాడుల నుంచి మననీ, మన సంస్కృతినీ కాపాడాలంటూ దేవుడికి దణ్ణం పెట్టుకునే విధానాన్ని నెలకొల్పుకోవాలి" - అందరం చప్పట్లు కొట్టాము. నేను ఆ అమ్మాయికి నా వద్ద ఉన్న కొత్త కలాన్ని బహుమానంగా ఇచ్చాను.
ఎదో ముసలాయన అనుకున్నాం కానీ, ఉక్కు పిండమే.
"నా జీవిత కాలంలో అనేక మంది విద్యార్థినీ విద్యార్థులు నావల్ల ప్రభావితమై, ఇప్పటికే అనేక చోట్ల, దేశం కోసం, జాతి కోసం, ధర్మం కోసం అవసరమైన నాలుగు మంచి మాటలను చెబుతూ ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తున్నారు. సత్సంగాలను నడుపుతూ, నీరాజనాలను అందుకుంటున్నారు. ధర్మపన్నాలు వల్లించడం కాదు. సశాస్త్రీయమైన రీతిలో వ్యక్తిత్వం, వికాసం, వక్తృత్వం, విజయం, కర్తవ్యమ్, కర్తృత్వం, సంస్కృతీ, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలు, ఒత్తిడులను ఎదుర్కోవడం, నిరాశా నిస్పృహలను పారద్రోలడం మొదలైన దైనందిన అంశాలలో ముఖాముఖి జరుపుతూ, తమ పరిధిలో తోటి వాళ్ళ జీవితాలకు మంచి పునాది వేస్తున్నారు. వ్యక్తులతోనే మంచి వ్యవస్థ సాధ్యం. చూడండి! ప్రభుత్వమే మద్యాన్ని అమ్మిస్తోంది. అంతమాత్రాన మన పిల్లలు దానిని కొని తాగేయాలా? మనం వంగితేనే మనమీద ఎవరైనా సవారీ చేస్తారు. జీవితకాలమంతా నా విద్యార్థులకు నేను నూరి పోసింది ఒక్కటే. వియ్ మస్ట్ లెర్న్ టు కాల్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. నా విద్యార్థులు అనేక మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా అమెరికాకు వెళ్లి కూడా మద్యం ముట్టకుండా జీవిస్తున్నారు. సగర్వ భారతీయులుగా జీవిస్తున్నారు" - పెద్దాయన గర్వంగా చెప్పారు.
"మీ సంస్థ పేరేమిటి?" - నా మిత్రుడు ప్రశ్నించాడు.
"సంస్థలను పెట్టడం నా పని కాదు. అధ్యాపకుడుగా వ్యక్తులను తయారు చేయడమే నా పని. నా వృత్తికి రిటైర్మెంట్ ఉంది కానీ, ఈ నా ప్రవృత్తికి లేదు. చిన్న చిన్న సమావేశాలలో హృదయానికి హత్తుకునేలా సత్యనిష్టను, కర్తవ్య పరాయణతను బోధించడమే నా విధానం. నా విద్యార్థులలో సంస్థలను పెట్టుకున్న వారూ ఉన్నారు. వ్యక్తులుగానే తమ వంతు చేస్తున్న వారూ ఉన్నారు. వీరు కోరుకునేది ప్రచారం కాదు. ప్రభావం" - ఆయన జవాబిచ్చారు.
....... నిశ్శబ్ద విప్లవం అంటే అదేనా?
మిత్రుడు సర్వేశ్వర్రావ్ ఆయనకు దగ్గరగా జరిగి చెప్పాడు "మా బంధువు ఒకమ్మాయి, బొట్టు చేరిపేసుకుంది. ఈ ధర్మమంతా చాదస్తమని వాదిస్తోంది. మొదట్లో మా వాళ్ళు ఎదో కుర్ర వాదన అనుకున్నారు. ఈ మధ్యన ఆమె వేరే మతానికి మారితే తప్పేమిటని అనడం మొదలు పెట్టింది. ఇంట్లో ఏడుపులు, పెడ బొబ్బలు. నేనూ చెప్పి చూశాను. కానీ, వాదనలో ఆ అమ్మాయిని ఎవరూ ఓడించలేరు. పెంకి ఘటం. మీరు గానీ, మీ శిష్యులు గానీ ఏమైనా నచ్చ జెప్పగలరా? తనకు సరైన సమాధానం చెప్పగలిగితే మతం మారబోనని ఆమె సవాలు విసరుతోంది"
"మాట్లాడడానికి ఆమె సిద్ధంగా ఉంటే, ఆమె కుటుంబమంతా సగౌరవంగా ఆహ్వానిస్తే, భారతీయ ధర్మం గొప్పదనాన్ని నా శిష్యులు సశాస్త్రీయంగా చెప్పగలరు. ఆమె ఎక్కడుంటారు?" ప్రశ్నించారు ఆ సీనియర్ సిటిజన్. మిత్రుడు చెప్పాడు.
"వారు ఆహ్వానిస్తే నా శిష్యుడు ఒకరిని వారి వద్దకే పంపిస్తాను".
సర్వేశ్వరరావు దీనంగా అడిగాడు "ఏమైనా ఆశ ఉందంటారా?"
"ఆమె నిజమైన సత్యాన్వేషి అయిన పక్షంలో, భారతీయ ధర్మానికి ఆమెనే మరొక రాయబారిగా తీర్చి దిద్ద గలిగిన ఉద్దండులు నా శిష్యులు. ప్రయత్నమే మనవంతు. తర్వాత ఆమె అదృష్టం, మీ అదృష్టం" - మాస్టారు వినయంగా జవాబిచ్చారు.
"మిమ్మల్ని సిసలైన భారతీయుడు అంటాను" - సర్వేశ్వరరావు చేతులు జోడించాడు. నేనూ ఏకీభవిస్తాను. మరి మీరు?--
ఓం నమో భగవతే వాసుదేవాయ
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.