హిందూమతంలో ప్రార్థనలుండవు. స్తోత్రాలూ, పూజలూ, ఉపాసనలూ మాత్రమే ఉంటాయి. అయితే అలాగని ప్రార్థనల మీద హిందూమతంలో నిషేధమేమీ లేదు. కానీ మన పూర్వులు వాటిని అంతగా ఇష్టపడకపోవడానికి, కొన్ని కారణాలుండి ఉండొచ్చు. మొదటిది - మానవ ప్రార్థనలన్నీ కోరికల మయం. కానీ మోక్ష పురుషార్థం కొఱకు ఆ కోరికల్ని జయించమనే హిందూమతం చెబుతున్నది. రెండోది - ప్రార్థనలన్నీ వాక్కుల మయం. కానీ ఆత్మ/ పరమాత్మ వాక్కుల కతీతం, అవాఙ్మానస గోచరం. నిజంగా మనసు నిండినప్పుడు వాక్కులు మూగబోతాయి. కనుక వాగ్ భూయిష్ఠమైన ఉపాసన, వాగ్ భూయిష్ఠ ప్రేమలాగే సాధారణంగా ఉపరితలీయం (superficial) గా ఉంటుంది. ప్రార్థనలు చేసేవారు భగవంతుడికి చెప్పినదే చెబుతూ, మాట్లాడినదే మాట్లాడుతూ తమ మనస్సుల్ని తాత్కాలికంగా ప్రశాంతపఱచుకుంటారు తప్ప భగవత్ తత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆయన మహిమను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించరు. అంటే వారి సావధానానికి భగవంతుడు కేంద్రం కావడం మానేసి తమకు తామే కేంద్రమవుతారు. మఱికొన్నిసార్లు ఈ వాక్కర్మ మన మనస్సుల్ని మఱింత కల్లోలితం కావిస్తుందే తప్ప ప్రశాంతపఱచదు కూడా. అన్నింటి కంటే ముఖ్యమైన కారణం కూడా ఒకటి ఉండొచ్చు ననుకుంటున్నాను. అది, సంస్కృతంలో తప్ప ఇంకే భాషలో దేవుణ్ణి ప్రార్థించినా ఆ ప్రార్థనలకి మంత్రబలం ఉండదు కనుక ఆ విధమైన సాధన వృథా అవుతుందేమోననే అంతర్గత సంకోచం.
అందుచేత మనవారు మనసా, వాచా, కర్మణా భగవంతుడికి జీవాత్మను అంకితం చేసే నిమిత్తం పూజావిధానాల్ని నిర్దేశించారు. మనసులో భగవంతుడు, మాటలో మంత్రము, చేతిలో భగవత్ పూజాద్రవ్యాలు - వెరశి సర్వతోముఖ భగవత్ సాన్నిధ్య సాధనే పూజ. ఈ పూజావిధానాలు ఎప్పుడు ఎవరి ప్రోక్తంగా మొదలయ్యాయో తెలియదు. ఇవి బహుశా అనాది. యజ్ఞ-యాగాదులూ, హోమాలూ చేసేటప్పుడు కూడా హోమగుండానికి బొట్లు పెట్టి, చుట్టూ ముగ్గులేసి దీపం వెలిగించి పసుపు- కుంకుమలతోను, పూలతోను అర్చించాలనీ, నైవేద్యం సమర్పించాలనీ నియమం ఉంది కనుక ఈ పద్ధతి వేదకాలం నుంచే అనూచానంగా వస్తున్నదని తెలుస్తోంది.
అలాగే దేవుణ్ణి మానవరూపంలో ఉపాసించడం (anthropomorphic worship) కూడా వైదిక సంప్రదాయమే. వేదసూక్తాలలో ప్రతిదేవుణ్ణి, దేవతనీ విపులంగా వారి శరీర లక్షణాలతో, అలవాట్లతో సహా వర్ణించారు. కనుక కొంతమంది ధర్మద్వేషులు ప్రచారం చేసినట్లు మన వేదఋషులు క్రైస్తవుల్లా, మహ్మదీయుల్లా పూర్తి నిర్గుణోపాసకులు కారు. వారు కూడా మనలాగానే విగ్రహారాధకులే. వేదిక్ హిందూయిజమ్ (వేదిక్ రెల్జన్), పురాణిక్ హిందూయిజమ్, మాడర్న్ హిందూయిజమ్, బ్రాహ్మణిజమ్ అంటూ ధర్మద్వేషులు చేస్తున్న విభజన పూర్తిగా అశాస్త్రీయం, చరిత్రవిరుద్ధం, వాస్తవదూరం కూడా. పరిశోధకులు ఎవరి వ్యక్తిగత తిక్కల కనుగుణంగా వారు వివిధ నామాలు తగిలించినా స్వభావతః అవన్నీ ఒకటే. క్షుద్రోపాసనతో సహా ఇప్పుడున్నవన్నీ అప్పుడూ ఉన్నాయి, అప్పుడున్నవి ఇప్పుడు పూర్తిగా లేకపోయినా !
వేదాలు ఎంత ప్రాచీనమైనా, ఆ కాలం నుంచి మనం ఇప్పుడు ఎంత దూరంగా వచ్చేసినా, ఆ సూక్తాల్లో మనకు దర్శనమిచ్చే దేవతల్లో అనేకమందిని మనం ఇప్పుడు కూడా రోజూ పూజిస్తున్నాం. కనుక మన ఈనాటి పూజలన్నీ వైదికమే. ఆ గ్రహాలే ఈ గ్రహాలు. ఆ సూర్యుడే ఈ సూర్యుడు. ఆ చంద్రుడే ఈ చంద్రుడు. ఆ భూదేవే ఈ భూదేవి. ఆ గణపతే ఈ గణపతి. ఆ రుద్రుడే ఈ రుద్రుడు. ఆ ఉమాదేవే ఈ ఉమాదేవి. ఆ విష్ణువే ఈ విష్ణువు. ఆ లక్ష్మే ఈ లక్ష్మి. ఆ సరస్వతే ఈ సరస్వతి. ఆ బ్రహ్మే ఈ బ్రహ్మ. ఇహ పంచభూతాల సంగతి, దిక్పాలకుల సంగతి చెప్పనక్కఱలేదు. వేదాలు నేర్చుకునే అవకాశం పూర్వకాలంలో అధిక సంఖ్యాకులకి లేకపోయినా ఈ దేవీదేవుళ్ళని అందఱూ నమ్మేవారు కనుక, ఈ పూజలు అందఱూ చేసుకునేవారు కనుక వారు వైదికులైనట్లే లెక్క. జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు లాంటి వేదాంగాలు కూడా లక్షణంగా రక్తమాంసాలతో, జవసత్త్వాలతో బతికే ఉన్నాయి, ఇప్పటికీ వేలాది ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలల్లోను, కళాశాలల్లోను అందఱికీ శుభ్రంగా నేర్పిస్తున్నారు. కనుక వేదమతమూ, హిందూమతమూ ఒకటి కాదని వాదించే ఆధునిక ధర్మద్వేషులకి ఈ వాస్తవాల్ని వివరించి తగినట్లుగా బుద్ధి గఱపాల్సి ఉంది.
ప్రపంచంలో మానవత్వం పూర్తిగా చనిపోయినప్పుడే హిందూధర్మం కూడా చనిపోతుంది. అలా కానప్పుడు దానికి చావు లేదు. ఎందుకంటే ఈ మార్గం ప్రకృతి-ప్రసాదితమైన, మానవ సహజ ప్రేరణల మీద, మానవీయ సహజాతాల (instincts) మీదా ఆధారపడినట్టిది. ఇది మనుషుల మీద వారి స్వభావాలకి విరుద్ధంగా రుద్ధబడిన ప్రవర్తనా నియమావళి (Code) కాదు. ప్రేమాస్పదుల ప్రతిరూపాలు మనకి అత్యంత ప్రియతమాలు. వారి ఛాయాచిత్రాల్ని చట్రం కట్టించి ఇంట్లో గోడకి తగిలిస్తాం. బల్లసొఱుగుల (desks) లో దాచుకుంటాం. చేజోళ్ళ (wallets) లో భద్రపఱచుకుంటాం. మనకే అధికారం ఉంటే వారి విగ్రహాన్ని వీథి మొగసాలలో ప్రతిష్ఠిస్తాం కూడా ! ఒకవేళ ఆ ప్రియతముడు భగవంతుడే అయితే ? ఆయన ప్రతిరూపాన్ని మన దగ్గఱ పెట్టుకొని అనునిత్యం చూసుకుందామనుకోమా ? హైందవేతర ప్రపంచంలో ఆ ప్రేరణ లేనివారెవరైనా మిలియన్లాదిగా ఉంటే అప్పుడు హిందువులు నిజంగానే మూర్ఖులు.
హిందూమతం కంటే మానవత్వం గల మతమేదీ లేదు. దేవుడిలో మానవుణ్ణి చూసి పూజించమనే మతం ఇదొక్కటే. అలాగే మానవుడిలో దేవుణ్ణి చూడమని చెప్పే మతమూ ఇదొక్కటే. మనిషిలో దేవుడున్నాడన్నవాణ్ణి దైవద్రోహిగా భావించి ఇతరమతాల్లో చంపినా చంపుతారు. పూజ అంటే అసలర్థం గౌరవించడం ! మనం పూజ పేరుతో చేసే అర్ఘ్యం, పాద్యం, ఆరతి, నైవేద్యం మొదలైన విధివిధానం యావత్తు భగవంతుణ్ణి మానవుడుగా భావించి గౌరవించి చేసే సేవ. మన యింటికొచ్చిన మానవుణ్ణి ఎలా గౌరవిస్తామో అలాగే భగవంతుణ్ణి కూడా భయభక్తులతో గౌరవిస్తే ఆయన సంతోషిస్తాడని చెప్పడమే ఈ విధివిధానంలోని ప్రధానోద్దేశ్యం. ఈ పూజ అనే అలవాటు మనకి తోటి మానవుల పట్ల కూడా ఎలా నడచుకోవాలనేదానికి ఒక మార్గదర్శనం.
మఱికొంత తరువాత...