శ్రీరామదూతం శిరసా నమామి!
పోయిన
ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే నాడు నా స్నేహితుడొకడు అందరికి విషెస్
చెప్తూ, నాగురించి ఒక మాటన్నాడు. మనోహరైతే రామాయణానికి ప్రేమకి ఉన్న సంబంధం
గురించి పేజీలు పేజీలు రాస్తాడేమో అని. "అసలు నిజంగా ప్రేమగురించి
మాట్లాడాలంటే రామాయణమే చెప్పుకోవాలి, ప్రేమ గురించి రామాయణంలో చెప్పింది
రాయడం మొదలుపెడితే ఎన్ని రోజులైనా పడుతుంది. ప్రస్తుతానికి వద్దులే" అని
సంభాషణని దారి మళ్ళించాను. కానీ అప్పటినుండి ఆ ఆలోచన మాత్రం అలాగే
ఉండిపోయింది. అదే ఈ టపాకి పూర్వరంగం.
----
ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ శోకం కూడా ఉంటుంది.
సర్వభూతములను తనయందు, తనను అన్ని భూతములయందును చూడగలిగిన స్థితిలో ఉన్న
మునిపుంగవుడైన వాల్మీకి మనసుని తపస్వాధ్యాయ నిరతుడు, తపస్వి,
వాగ్విదాంవరుడు అయిన నారదుడి వల్ల విన్న రామాయణం తన్మయత్వంలో ముంచేస్తే
ప్రకృతిలో కలిగిన చిన్న అలజడి ఆయన మనసును వికలం చేసింది. ఆయన శోకం వేదం
తర్వాత చందస్సులో వచ్చిన మొట్టమొదటి శ్లోకం అయ్యింది. ఏదో పక్షి, ఎవరో
కొట్టారు, ఆయనకెందుకు బాధ? రామాయణం నేర్పేది ఇదే. నిన్ను నువ్వు
సర్వసత్వమనోహరుడిగా, సాక్షాత్ రాముడిగా మార్చుకోవడం ఎలానో చెప్తుంది.
పక్షిశోకం ఆయన శోకం అయ్యింది. ఆ పక్షులం మనమేనేమో? సంసారశరాఘాతం తగిలి
విలవిలలాడుతున్న మనని చూసి మనమీద ప్రేమవల్ల కలిగిన శోకంలోనుండి ఆయన మనకి
తగిలిన సంసారం అనే బాణం సందించిన ప్రారబ్ధమనే వేటగాడు ఎక్కువకాలం ఉండకూడదు
అని కోరారు. అదే రామాయణానికి నాందీవాక్యం, మంగళాశాసనం. రామాయణం
చదివినవాడికి జరిగేది,ఒరిగేది అదే. మనమీ సంసారం అనే బంధంలో పడటానికి
కారణమైన ప్రారబ్ధం క్షయం అవుతుంది.
ఇంకా ధృతి,దృష్టి,మతి,దాక్ష్యం మనకు కూడా కలుగుతాయి.
సాధించాలనే పట్టుదల,సంకల్పం ధృతి. మనమీద ప్రేమతో రామచంద్రస్వామి బాలకాండలో నేను దిగివచ్చి రావణవధచేస్తాను అని సంకల్పించారు.
సాధించవలసిన దానికోసం దేన్నైనా తోసిరాజనగల మనోబలం
దృష్టి- మనకోసం అయోధ్యకాండలో స్వామి రాజ్యాన్ని వదిలి పదునాలుగేళ్ళు
అరణ్యవాసానికి సిద్దపడ్డారు.
సాధించవలసినదానికి
కావల్సిన తెలివితేటలు, అందుకోవాల్సిన దీవెనలు తెలియడం మతి, అందుకే స్వామి
అరణ్యకాండలో పాదచారియై నడుస్తూ మునులు,ఋషుల దీవెనలు తీసుకుని,
శాపగ్రస్తులైన వారిని వారిశాపం తీరేలా యుక్తితో అనుగ్రహించారు.
సాధిచవలసిన దానికి అడ్డుపడేదాన్ని నిర్దాక్షిణ్యంగా
వదలగలగడం దాక్ష్యం- అందుకే స్వామి కిష్కింధాకాండలో మనస్సమానమైన చంచలత్వం
కలిగిన వానరజాతికి రాజుగా ఉన్ననివృత్తిమార్గానికి గుర్తైన వాలిని
సంహరించి,ప్రవృత్తి మార్గానికి గుర్తైన సుగ్రీవుని రాజుని చేసాడు. అంటే
రామచంద్రస్వామి ఉన్నచోట ఇంద్రియపటాటోపం ఉండదు. అందుకే రామదాసులవారుకూడా
"చేరి పంచేంద్రియములన్నీ చేరక పోద్రోలు నామం శ్రీరామనామం" అన్నారు.
రామాయణానికి సుందరకాండకి అభేదం అని అనిపిస్తుంది
ఒక్కొక్కసారి నాకు. పెద్దలు కొంతమంది ఏమన్నారంటే "సుందరకాండలో స్వామి
సీతమ్మకి జరిగిన కధ అంతా చెప్తారు, అలాగే జరుగబోయే కధకూడా చెప్తారు
అందువల్ల రామాయణం మొత్తం చదువలేనివారు సుందరకాండ ఒకటి చదివినా చాలు" అని.
అలాగే సుందరకాండని సరిగా గమనిస్తే ఎక్కడైనా నాలుగు ఉపమానాలు ఒకచోట చెప్తే
అది ముందు నాలుగుకాండల్లో సరిగ్గా సరిపోతుంది. పైన నేను చెప్పినది అలాంటి
ఒక ఉపమానం. ఇంకొకటి ఉంది. అది "చతుర్నామైవహి గతి" అని లంకలోకి దిగగానే
స్వామి అన్నమాట ఇది.
"యజ్ఞస్వరూపమైన నీలుడు, నామజప స్వరూపమైన అంగదుడు, వేదస్వరూపమైన
సుగ్రీవుడు, మంత్రస్వరూపమైన నేను తప్ప ఇంకెవరూ రాలేరే ఈ లంకలోనికి" అని
కానీ చూస్తే బాలకాండ యజ్ఞకాండ
అయోధ్యకాండ అంతా రామునిపేరు తలచుకునేవారే. చెట్టూ పుట్టా,మానూ మాకూ అన్నీ.
అరణ్యకాండ అంతా మంత్రస్వరూపమైన ఆయుధసంపత్తిని, తపస్సంపత్తిని రాముడికి ధారపోయడమే
కిష్కింధకాండ అంతా వేదమార్గాన్ని తిరిగి నిలబెట్టడమే. ఈరకంగా స్వామి సుందరకాండలో రామాయణాన్ని చూపిస్తున్నట్టనిపిస్తుంది.
రామాయణంలో ప్రేమ అనే విషయం పై రాద్దామనుకుని ఎక్కడికో వచ్చేను.అసలు విషయానికి వస్తే,
వాల్మీకిలాంటి
సర్వభూతహితాభిలాషుల ప్రేమలోనుండి పుట్టినది రామాయణం. ప్రేమకి ఇప్పుడున్న
వక్రభాష్యాలు మాత్రమే నేర్చుకునే వారికి రామాయణంలోని ప్రేమ ఆచరణసాధ్యం
కాదు. కానీ ప్రేమ అనేదాన్ని ఎలా అర్ధంచేసుకోవాలో తెలియాలంటే రాముడిపాదాలనే
ఆశ్రయించాలి. కొన్ని సంఘటనలు పరిశీలిద్దాం.
రాముడికి తండ్రి అంటే అమితమైన ప్రేమ,గౌరవం.
దశరధుడికికూడా అంతే ప్రేమ వాత్సల్యం. అందువల్లనే సత్యాన్ని పక్కనబెట్టి,
ప్రజాభిప్రాయం అనే ధర్మాన్ని చూపి రాముని రాజుని చెయ్యాలనుకున్నాడు. కానీ
తండ్రిని సత్యమునందు నిలపడానికి రాముడు రాజ్యాన్ని
వదిలిపెట్టాడు.తల్లిదండ్రులను వదిలిపెట్టాడు. ధశరధుడు ఉండలేడని తెలిసినా,
భవిష్యత్తరాలు తన తండ్రిని అసత్యవాదిగా చూడకూడదని అడవులకు సైతం
వెళ్ళిపోయాడు. ప్రేమ అంటే అది. అంతేకానీ తనవారైనంతమాత్రాన వారికోసం
సత్యాన్ని, ధర్మాన్ని వదలడు నారాముడు. మనప్రేమ మనలని ప్రేమించేవారిని
మంచిమార్గం వైపు నడిపించేలా ఉండాలి. అంతేకాని ప్రేమపేరుతో వారిని మరింత
పాడైపోయేలా చెయ్యకూడదు. ఈతరం తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఇదే. నాకు
మావాడంటే చాలాప్రేమ,వాడు ఏదడిగినా కాదనలేను అంటూ ఉంటారు. కానీ అది వారిని
మరింత పాడైపోయేలా చేస్తుంది. అది గమనించుకోవాలి. మనప్రేమ, లాలన వారిని
ఎటువైపు తీసుకెల్తుందో కూడా గమనించుకోవాలి. ఒక్కనాడు పెద్దలను గౌరవించాలని
చెప్పకపోతే రేపు పొద్దున్న వారినుండి గౌరవం మనకు కూడా దొరకదు. ఆశించలేము
కూడా. అందుకే మానవజాతి అంతా మళ్ళీ రామాయణం చదువుకోవాలి. ప్రేమ అంటే ఏమిటో
అది అభ్యున్నతికి దారితీసేలా ఎలా ఉండాలో తెలుసుకోవాలి.
ఇదే రాముడు లక్ష్మణుడి విషయంలో కూడా చేసి చూపాడు.
దశరధుడు చనిపోతే లక్ష్మణుడికి తండ్రి పోయాడు,నాకు లక్ష్మణుడి రూపంలో తండ్రి
ఇంకా ఉన్నాడు అన్న వ్యక్తి, కైకేయినికానీ, భరతుడిని కానీ నిందిస్తే
అప్పటికప్పుడే ఖండించాడు, మందలించాడు, సరిదిద్దాడు. లక్ష్మణుడికి ప్రాణం
మీదకి వస్తే గుండెలవిసేలా విలపించాడు. మరి మనం, చెప్తే ఏమనుకుంటారో అన్న
భయంతో తప్పుని తప్పు అనికూడా చెప్పలేని స్థితిలో ఉన్నాం. మనకెందుకులెద్దూ
అనే ధోరణి పెరుగుతుంది. అందుకే జాతికి మళ్ళీ రామాయణాన్ని చేతికిచ్చి
చదివించాలి.
సీతమ్మ పట్ల రాముని ప్రేమ గురించి రాయాలంటే మాటలు
చాలవు. అలాంటి వ్యక్తి ఒకచోట సీతమ్మ "మీకేమీ రాక్షసులతో పగలేదు అలాంటిది
మీరెందుకు వారిమీదకి యుధ్ధానికి వెల్తారు" అని అడిగితే స్పష్టంగా "వెళ్ళడం
తన ధర్మం" అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. జింకకోసం పట్టుబడితే సరే అని
వెళ్ళాడు. మీ జీవితభాగస్వామితో ఎలా ప్రవర్తించాలో, పట్టువిడుపులంటే ఎలా
ఉండాలో చూపించారు స్వామి. ప్రేమ అంటే కొంగుపట్టుకుని తిరగడం కాదు, అడుగులకు
మడుగులొత్తడం కాదు, ఒకరినొకరు సరిదిద్దుకుంటూ, ఒకరిబాధలొకరు పంచుకుంటూ,
అభ్యున్నతి వైపు కి అడుగులేయడం దాంపత్యం. ముప్ఫై యేళ్ళు హనుమ సేవలో తరించిన
మహానుభావుడొకరు నాతో ఒక మాటన్నారు" నీ అనుష్టానం వరకూ వస్తే నీ
భార్యాపిల్లలూ కూడా పరాయివారే" అని.
దేనికి తలఊపాలో , దేనికి కాదనాలో తెలియాలి. ఎలా కాదనాలో తెలియాలి.
కట్టెవిరిచినట్టుగా కాకుండా గాయానికి వెన్నపూసినట్టుగా అవతలివారి
అభిప్రాయాన్ని ఖండించడం తెలియాలి. అది ప్రేమంటే. అలా మాట్లాడాలంటే రామాయణం
చదవాలి. అందుకే గురువుగారు "పెళ్ళి చేసుకోబోయే ప్రతీ ఒక్కరు రామాయణం చదివి
తీరాలి" అని అంటూ ఉంటారు ఎప్పుడూ. అహల్యని సరిదిద్దుకున్న గౌతమ మహర్షి
కావాలి జాతికి మళ్ళీ. రాక్షసజాతికి తల్లి అయినా దితిని ప్రేమించిన
కశ్యపప్రజాపతులు కావాలి లోకానికి. తను స్వయంగా ఇచ్చిన రక్షణని కాదనుకుని
బంధం లో పడ్డ సీతని నానాయాతన పడి కాపాడుకున్న రామచంద్రులు కావాలి జాతికి.
భార్య లోపాలు కడుపులో పెట్టుకుని ఆమె గౌరవాన్ని కాపాడే భర్తలు కావాలి. భర్త
లోపాలు పెదవి దాటకుండా కుటుంబాన్ని నడుపుకునే సతీమతల్లులు కావాలి
ఇప్పుడు.
ఇంకా రాయాలంటే చాలాఉంది. ఎంత రాసినా రామాయణం
నిత్యనూతనం, నవనవోన్మేషం. ఆ రామతత్వాన్ని రాయాలన్నా, చెప్పాలన్నా ఎవరికి
సాద్యం? పోతన గారన్నట్టు భాషాపతికి, బృహస్పతికి, ఆదిశేషుడికే సాధ్యం
కాదే.అలాంటిది నేనెంత? కూతవేటు దూరంలో రామపట్టాభిషేకం జరుగుతుంటే
వెళ్ళలేకపోయిన ధౌర్భాగ్యుడిని. అసలా రాముడిగురించి రాసే అర్హత అయినా
లేనివాడిని.
రామాయణం విన్నా,కన్నా,అన్నా పుణ్యమే. ఆ పుణ్యం సంపాదించుకోవాలని,
స్వామికార్యంలో పాల్గొనలేకపోవడానికి కారణమయిన పాపసంచయాన్ని క్షయం
చేసుకోవాలని రాస్తున్నాను తప్ప నాకు తెలుసనో, మరోటో కాదు. ఏమైనా
తప్పులున్నయెడ పెద్దలు క్షమించి సరిదిద్దగలరు.
విధేయుడు,
2 కామెంట్లు:
అథ్బుతం
అథ్బుతం
కామెంట్‌ను పోస్ట్ చేయండి