23, ఫిబ్రవరి 2011, బుధవారం
ధర్మమంటే ఏమిటి ?
ఏది అభ్యుదయ కారకమో ఏది మోక్ష సాధనమోలేదా మోక్షాన్ని సిద్ధింపజేయటంలో తోడ్పడుతుందో అదే ధర్మం.
అభ్యుదయం అంటే కేవల లౌకికం కాదు, నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి కాబట్టి అది నాకు అభ్యుదయం అన్న వాదన అసంబద్ధం, అది మోక్ష కారకమైనదా అన్నది అవసరం. ధర్మం అంటే తెలుసుకొని ఆచరించేది.
మానవుడు లౌకిక పార లౌకిక వ్యాపారాలను నిర్వర్తించడానికి వేదం చెప్పిన త్రోవలే ధర్మాలు. ఆ ధర్మాచరణమే మోక్షానికి దైవ సాక్షాత్కారానికి మార్గం. ఒకే వ్యక్తికి ఒకే ధర్మం ఒకేలా అన్నివేళలా అన్ని దేశాలలో ఉంటుందన్నది సత్య దూరం.
.
నేను నా గురువుల దగ్గర ఉన్నప్పుడు నేను పాటించాల్సింది శిష్య ధర్మం. అలాగే నా తల్లిదండ్రుల దగ్గర పుత్రధర్మం, అదే సమయంలో నాపిల్లల దగ్గర నాది పితృధర్మం. ఏకాదశినాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ( త్వరగా భుజించడం) ధర్మం. అదే ఏకాదశినాడు ఇక్కడ ఉంటే ఉపవాసం ధర్మం, కాశీలో ఉంటే అన్నపూర్ణ అనుగ్రహంగా ఉపవాసం ఉండకపోవడం ధర్మం. కొన్ని మాసాల్లో సముద్ర స్నానం నదీ స్నానం ధర్మం కొన్నిమాసాల్లో నిషిద్ధం. ఇలాగే చాలా మారుతూ ఉంటుంది.
అలాగే వర్ణాశ్రమాలలో కూడా, బ్రహ్మచారికి ఉన్న ధర్మం వేరు. అదేబ్రహ్మచారి వివాహం చేసుకుంటే పాటించాల్సిన గృహస్థ ధర్మాలు వేరు అలాగే సన్యాసికీ వానప్రస్తుకీ... ధర్మం మారడం అంటే ఒకే వ్యక్తికి దేశ కాల అవస్థ వర్ణ ఆశ్రమాదులని బట్టి మార్పుచెందుతుంది. అదే ఇద్దరు వ్యక్తులు ఒకే దేశ, కాల, ఆశ్రమ, వర్ణ, అవస్థాదులలో ఉంటేఇద్దరికీ ఒకే ధర్మం ఏ ఒక్కటి మారినా ధర్మం మారుతుంది.... స్థూలంగానో, సూక్ష్మంగానో....
ధర్మ శాస్త్రాల వాఖ్యానాలు చదివి గురువుల వద్ద నేర్చుకొని అనుష్టించడమే ఉత్తమం. అంతా కాకపోయినా కొంత మన ప్రస్తుత జీవన సరళికి కావల్సిన ధర్మ సూక్ష్మాలు తెలుసుకొని ఆచరించడం శ్రేయస్కరం, మోక్ష ప్రదం.
నాకు ధర్మం తెలుసు ఏది చేయాలో ఎలా చేయాలో తెలుసు కాని చేయను అంటే అది నా ధర్మమును నిర్వర్తించడము కాదు నేను ధర్మాత్ముడను కాను. లేదా ధర్మ సూత్రములను నాకు ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం కూడా ధర్మాచరణము కాదు.
ధర్మం గురించి రాస్తూ ధర్మ పరాయణుడైన రాముని తలచుకోకుండా ఎలా ఉంటాం. రామాయణం అంతా ధర్మాచరణమే దానిని ధర్మాయణం అనచ్చేమో. ఇక అంత స్థాయిలోనివారు హరిశ్చంద్రుడు, భీష్ముడు, ధర్మ రాజు, ఆది శంకరులు మొదలైనవారు. ధర్మం అనేమాట సనాతన ధర్మం లోనిదే దానికి ఇతర ఏ భాషలోనైనా పర్యాయ పదంలేదు. ఆంగ్లేయులేతత్సమాన పదం వారి భాషలోలేక వారు మాట్లాడేటప్పుడు వారి వాఙ్మయంలోనూ "Dharma" అనే వాడారు.
ఇక ధర్మాన్ని పట్టుకుంటే ఒరిగేది ఉత్తరదిశా ప్రయాణమే.. ధర్మాన్ని పట్టుకున్న రాముడు ఉత్తర దిశగా పుష్పకం ఎక్కి ధర్మాన్ని పట్టుకున్న వారినందరినీ పుష్పకం ఎక్కించుకున్నాడు, ఎంత మంది ఎక్కినా అందులో మరొకరికి స్థానం ఉంటుంది.ధర్మాన్ని పట్టుకుంటే రాముని పుష్పకంలో ఎక్కగలం ఉత్తర దిశా ప్రయాణం చేయగలం ఎవరూ భేదించలేని మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలం (అయోధ్య / కైలాసం). వదిలేస్తే రావణునితో కూడి దక్షిణాపథంలో ప్రయాణించి, పుట్టుక చావులమధ్య ఎంకా ఎన్నో దురవస్థలమధ్య తిరుగుతూనే ఉంటాం.
ధర్మో రక్షతి రక్షితః అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటమే ధర్మ రక్షణం. గీతాచార్యుడు కూడా ఇదే అంటాడు. స్వధర్మమే శ్రేయస్కరం పరధర్మం భయంకరమైనది. బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి కాని గృహస్థు ధర్మాన్ని కాదు అలానేగృహస్థు గృహస్థధర్మాన్ని అలా......... రాజ ధర్మాన్ని రాజు, సేవక ధర్మాన్ని సేవకుడు అలా.... కాకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు విస్మరించి ఇంకొకరి ధర్మాన్ని అనుసరిస్తే కలిగే పరిస్థితి అతి గందరగోళం ( ప్రస్తుతం ఉన్న స్థితి అదేనేమో)
--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
25, డిసెంబర్ 2010, శనివారం
ఏమిటీ అప్రస్తుత విమర్శ ? దీనివెనుకున్న కుట్రలేమిటి ?
ఓ పక్క క్రిస్మస్ జరుపుకుంటూంటే మనమీద ఏమిటీ వ్యతిరేక వార్తలు అని నాకు అనిపించింది. నేనేమైనా నెగటివుగా ఆలోచిస్తున్నానా?
[ ఓమితృని ఆవేదన]
--------------------------------------------------------------
క్రిమస్ పేరిట ఇక్కడ కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం నడుస్తుంది -
క్రిస్మస్ షాపింగ్. మన వెన్నెముక లేని జీవాలకు అవేకనిపిస్తాయ్. ఏంచేస్తాం
మన కర్మం.
[అమెరికా లో ఉన్న ఓ హిందువు ఆవేదన ]
------------------------------------------------------------
లేదండీ, మీరు సరిగానే ఆలోచిస్తున్నారు. ఇది ఒక పెద్ద దోపిడీ విధానం. ఆ కుట్రలో భాగమే ఈ వ్యతిరేక ప్రచారం
[విషయాలను గమనిస్తున్న ఓ సామాన్య హిందువు విశ్లేషణ]
------------------------------------------------------------
ఈమధ్య దసరా ఉత్సవాలలో కూడా మహిషుని పై మాయదారి ప్రేమకురిపిస్తూ భక్తులమనసులను చికాకు పరచేందుకు టీవీ 9 అనే దిక్కుమాలిన చానల్ లో ఒక చర్చ. అక్కడ స్వయం ప్రకటిత మేధావుల పీత మెదళ్లలోంచి వచ్చిన అద్భుత పాండిత్యం . ఇవన్నీ గమనిస్తుంటే మనమీద మనధర్మం మీద స్లోపాయిజన్ ప్రయోగం జరుగుతుందనిపించటం లేదూ !???
[మన మనసులో మాట]
13, డిసెంబర్ 2010, సోమవారం
ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
--హైదరాబాద్ - న్యూస్‌టుడే
దేవాలయాల్లో విధ్వంసం రేపుతామని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ మన రాష్ట్రంలో మందిరాలకు కనీస రక్షణ కల్పించే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్న సిబ్బందిని ఇతరత్రా తప్పనిసరి విధులకు వినియోగించాల్సి వస్తుండటంతో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా దేవాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గ దేవాలయం వంటి పెద్దపెద్ద ప్రార్థనా మందిరాలు తమ ఖర్చుతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్.పి.ఎఫ్.)ను నియమించుకొని తంటాలు పడుతున్నాయి. కాని మధ్య, చిన్నతరహా దేవాలయాలకు కనీస భద్రత కరవైంది. ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు వీటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్‌ముజాహిద్దీన్ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, సాంకేతిక నిపుణుడు పీర్‌భాయ్ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.
-----------------------------------------------------------------
చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకూ, డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థనీ నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.
8, డిసెంబర్ 2010, బుధవారం
కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు [పరమేశ్వరా !ఇక నీవే దిక్కు]
లక్నో: కాశీలో ఈరోజు సాయంత్రం గంగాహారతి సమయంలో పేలుడు సంభవించింది. ఇక్కడి దశ అశ్వమేథ ఘాట్‌లో మంగళవారం గంగానదికి సాంప్రదాయకంగా మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. శివుడు, మహాకాళేశ్వరుని ఆలయాలకు సమీపంలో ఈ ఘాట్ ఉంది. హారతిని వీక్షించేందుకు వందలమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. హారతి కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ విదేశీయుడు మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. నదిలో పడవలో ఉండి చూస్తున్న భక్తులకూ శకలాలు తగిలాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకు పేలుళ్లు వినిపించాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం వారణాశి జిల్లా ఆసుపత్రికి తరలించారు.గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇంత గోల దేనికి, కాశీ విశ్వనాథ ఆలయం తాళాంచేతులు వీళ్ళకే ఇచ్చి, అబ్బాయిలూ కూలగొట్టండీ అంటే సరిపోతుందిగా. గోల వదిలిపోతుంది.
ప్రశ్న :- ఇలా ఎంతకాలం?
పేలుడు మా పనే: ఇండియన్ ముజాహిదీన్
లక్నో: కాశీలో పేలుడుకు పాల్పడింది తమ సంస్థేనని ఇండియన్ ముజాహిద్ ప్రకటించింది. దీంతో విదేశీయుల లక్ష్యంగానే వారు ఈ పనికి పాల్పడి ఉంటారని కేంద్ర హోం శాఖ నిర్ధారణకు వచ్చింది. పేలుడు శబ్ధాలు రెండు కిలో మీటర్ల దూరం వరకు వినిపించడంతో చాలా శక్తివంతమైనవే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వరుసపేలుళ్లకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా కేంద్ర హోం శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హోం శాఖ ఏం నిర్థారణకు వస్తే మనకేంటి? అవ్వాల్సిన పని అయ్యాక, రెడ్ ఎలర్టులు ప్రకటించి ప్రయోజనం ఏంటీ? వీళ్ళు అంతలోపలిదాకా వెళ్ళి బాంబులు పెట్టగల్గుతున్నారంటే, ఏంటో, నోటమాట రావట్లా.
ఇంకెన్ని ఘోరాలు జరగబోటున్నాయో ఏంటో.
నేనూ వెళ్ళాను రెండు సార్లు ఈ హారతిని చూట్టానికి. అత్భుతంగా ఉంటుంది మహా హారతి. పరమేశ్వరా ! నీ ఇంటిని ఇక నువ్వే కాపాడుకోవాలయ్యా !
7, డిసెంబర్ 2010, మంగళవారం
మాస శివరాత్రి అంటే ఏమిటి ? : ఒక చర్చ
సభాయై నమః
మున్ముందుగా మాస శివరాత్రి సాధారణంగా ఏరోజు జరుపుకుంటారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చతుర్దసి తరువాత వచ్చే అమావాస్య అని అనుకుంటున్నాను. తెలిసిన వారు సరిదిద్ద గలరు.
తరువాత విషయంగా శివరాత్రిని మాసానికి ఒకసారి చేసుకోవడం వెనకాల విశేషమేమిటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే అని. ఇలా మాసమునకు ఒకసారి శివరాత్రి చేసుకోవడం వెనకాల ఉన్న ప్రాశస్త్యం తెలిసిన వారు వివరించ మనవి.
--భవదీయుడు
_______________________________________
సమాధానము
నమస్తే!
ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.
ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.
అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).
శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||
మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)
ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]
ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.
మీ ప్రశ్నకు పూర్తిగా సమాధానము చెప్పకపోయి ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే చెప్పాను కాని అంతా చెప్పినట్లు కాదు. ఇంకా విజ్ఙులైన పెద్దలు మరికొన్ని విశేష విషయములేమన్నా ఉన్నవేమో తెల్పండి, తప్పులేమైనాఉంటే సరిదిద్ధండి.
సూర్యనాగేంద్రకుమార్ అయ్యగారి
5, డిసెంబర్ 2010, ఆదివారం
ఉపాసనామార్గాలన్నీ భగవత్ ప్రసాదితాలే సుమా !
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ కథామృతంలోని ఒక సంభాషణ నా స్మృతిపథంలో మెదుల్తున్నది. ఆ పుస్తక రచయిత శ్రీ గుప్తా శ్రీరామకృష్ణులకు సమకాలికులూ, శిష్యులున్ను. శ్రీ పరమహంసగారితో తన ప్రథమ సమావేశాన్ని "మణి" అనే మారుపేరు పెట్టుకొని అక్షరబద్ధం కావించారు. అప్పటిదాకా ఆయన బ్రహ్మసమాజ మతస్థుడుగా ఉన్నారు. అందుకని ఆ సమయానికి క్షవరం చేయించుకుంటున్న శ్రీ పరమహంసగారి దగ్గఱ కూర్చుని "మట్టి, చెక్క, ఱాయి ఇలాంటి పదార్థాలతో చేసిన విగ్రహాల్ని పూజించడం పొఱపాటు కదండీ ! అవి దేవుడు కాదు గదా ! అది తప్పు అని సామాన్యప్రజలకు తెలియకపోతే మనం వెళ్ళి చెప్పాలి కదండీ !" అన్నారు. అందుకు శ్రీ పరమహంస నవ్వి "విగ్రహం అని ఎవఱు చెప్పారోయ్ ! చిన్మయప్రతిమ !" అన్నారు. మణికి చిన్మయప్రతిమ కాన్సెప్టు అర్థం కాలేదు. అప్పుడు పరమహంస "ఒకటి తప్పు, అని, ఇంకొకటి ఒప్పు అని నీకెలా తెలుసు ? నువ్వేమైనా దేవుణ్ణి చూశావా ?" అని అడిగారు. తాను గొప్ప ఇంగ్లీషు విద్యావంతుణ్ణి అనే అహంకారం ఉండేది మణికి.శ్రీ పరమహంస వేసిన ఈ ఒక్క ప్రశ్నతో అతని అహంకారం అధః పాతాళానికి క్రుంగిపోయింది. బడికే వెళ్ళని శ్రీ పరమహంసకు పాదాక్రాంతుడయ్యాడా కలకత్తా బాబు. అప్పుడు శ్రీ పరమహంస అతనికిలా వివరించారు "ఒక మార్గం తప్పు అనీ, ఇంకొక మార్గం ఒప్పు అనీ మనం ఎలా చెబుతాం ? భగవంతుడే ఆయా మానవుల పరిపక్వతను బట్టి వివిధ ఆరాధనా పద్ధతుల్ని సృష్టించి (ఉపదేశించి) ఉన్నాడు"
ఆయనే మఱో సందర్భంలో మాట్లాడుతూ "ఒక తల్లి తన సంతానంలో ఒక్కొక్కఱి వయస్సు, ఆరోగ్యాన్నీ బట్టి ఒక్కొక్క రకంగా అన్నం పెట్టినట్లే భగవంతుడు కూడా ఆయా మానవజాతుల స్థాయిని బట్టి వివిధ మతాల్ని కల్పించి ఉన్నాడు." అని అనుగ్రహభాషణ చేశారు.
మనం చదివే విష్ణుసహస్రనామాలూ, రుద్రం, దేవీసప్తశతి ఇవన్నీ ఋషుల ద్వారా భగవంతుడు మనపై ప్రేమతో అనుగ్రహించినటువంటివి. మఱో రకంగా చేస్తే ఫలితం తక్కువ. పైగా అలాంటి అనధికృత స్వతంత్రత (unauthorized liberty) నిషిద్ధ పాషండ మతం అనిపించుకుంటుంది. ఉపాసనా పద్ధతుల్ని బ్రాహ్మణులు గానీ, లేదా వారిలాంటి మఱో మానవ ఏజన్సీ గానీ సృష్టించలేదనేది, అవి నేరు (direct) గా భగవదాదేశమనీ నాక్కూడా అనుభవమే. చాలా కాలం క్రితం నేనొకసారి శివుడిమీద వేఱే విధంగా నామాలు కల్పించి వ్రాయగా ఆయన స్వప్నదర్శనమిచ్చి నాపై కోపించి వాటిని ధ్వంసం చేయమని సూచించారు.
23, అక్టోబర్ 2010, శనివారం
సౌందర్యచిట్కాలు (Beauty Tips)
అయితే - చూడగానే ఆకట్టుకునే సూదంటుఱాయిలాంటి వ్యక్తిత్వం, చూపు తిప్పుకోలేనంత సుందరరూపం మొదలైన వాటితో ఎన్ని ఇబ్బందులున్నా ఫర్వాలేదనుకొని అవే కావాలని ప్రగాఢంగా అభిలషించేవారు వాటిని సాధించే ప్రక్రియలో కూడా చాలా ఇబ్బందులున్నాయని గ్రహించాలి. అందం యొక్క భౌతికస్వరూపమే ఎక్కువమందికి ఎఱుక. దాని ఆధ్యాత్మిక స్వరూపం గుఱించి చింతన చేసేవారు అఱుదు. అందం అంతిమ ఫలస్వరూపమే తప్ప దానికది ఒక స్వతంత్ర స్వమూర్తి (independent entity) కాదు. ఈ అంతిమ ఫలాన్ని కాచిన ఆ అందమైన వృక్షం పేరేంటి ? అందాన్ని మించిన ఆకర్షణపరిమళాన్ని వెదజల్లే ఆ పూలతీగ ఎక్కడిది ?
మానవుడి గొప్పతనాలన్నీ ఆతనియందు భగవంతుడు ప్రసన్నుడై ప్రసాదించగా వ్యక్తమౌతున్న భగవద్ విభూతులేననీ, అవి ఆయన ఆస్తి అనీ, ఒక తండ్రి తన ఆస్తిని కుమారులకు పంచి యిచ్చినట్లుగా ఆయన మనకు వాటిని పంచి యిస్తాడనీ గతంలో ఒకసారి ఒక ప్రసంగంలో అన్నాను. అదే అందానిక్కూడా వర్తిస్తుంది. మన అందం ద్వారా వ్యక్తమయ్యేది నిజానికి మనం కాము, ఆ భగవంతుడే. ఈ ముఖాలు భగవంతుడివి. ఈ శరీరాలు భగవంతుడివి. ఈ ఆకర్షణశక్తి భగవంతుడిది. మనం వాస్తవంగా భూతకాలిక పిండాలం, భవిష్యత్ శవాలం మాత్రమే. భౌతికమైన అందం మానసికమైన అందానికి ప్రతిబింబం మాత్రమే. అవ్యక్తుడైన పరమాత్మకు వ్యక్తరూపమే ఈ ప్రపంచం. అదే విధంగా సూక్ష్మమైన మనస్సు ధరించిన స్థూలరూపమే ఈ శరీరం. ఏదో ఒక జన్మలో ఒకనాడు మనం చేసిన మంచి ఆలోచనలు ఈ జన్మలో మన అందంగా వ్యక్తమౌతున్నాయి.
అందానికి ఏ ఆధ్యాత్మిక సత్యం వర్తిస్తుందో అందవిహీనత్వానికీ అదే సత్యం వర్తిస్తుంది. అంటే పూర్వజన్మలో మనం చేసిన అందవికారపు ఆలోచనల ప్రతిఫలమే ఇప్పటి అందవిహీనత్వం. పూర్వజన్మల దాకా పోనక్కఱలేదు. ఒక వ్యక్తి ఈ జన్మలోనే హత్య గానీ మఱో దుష్టుపని గానీ చేసేటప్పుడు అతను స్వతహాగా ఎంత అందగాడైనా సరే, అతని ముఖకవళికలు అతనికి తెలియకుండానే ఎంత అందవిహీనంగా మారిపోతాయో గమనించండి. ఆనాటి ఆ ముఖకవళికలే కర్మఫలం అనే రిఫ్రిజిరేటర్ లో దాచబడి భద్రంగా అతనికి మఱుజన్మలో అందించబడతాయి. ఆ తరువాత అతను తన ముఖాన్ని అద్దంలో చూసుకొని తననెందుకిలా భగవంతుడు అందవికారంగా పుట్టించాడో అర్థం కాక కుమిలిపోతూంటాడు. అది భగవంతుడు ఇవ్వాలనుకొని ఇచ్చిన అందవికారం కాదు. ఇతను ఒకప్పుడు కోరి యెంచుకున్నదే.
"అందమైన ప్రతివారూ మానసికంగా అందంగా ఉంటారనే హామీ ఏముంది ? ఈ అందగాళ్ళు/ అందగత్తెలు అంత మంచి పూర్వజన్మసంస్కారం గలవారైతే మఱి ఇప్పుడు ఈ జన్మలో ఆ సంస్కారం కొనసాగలేదెందుకని ? వీరిలో పిసినిగొట్లూ, కుట్రదారులూ, ద్రోహులూ, రౌడీలూ, కేడీలూ, వ్యభిచారిణులూ కూడా ఉన్నారెందువల్ల ?" అనే విచికిత్స తలెత్తుతుంది. సత్సంస్కారాలు మఱుజన్మలో కొనసాగాలన్నా దానికి మానవుడు ప్రయత్నపూర్వకంగా సంకల్పించుకోవాలి. అలా కొనసాగకుండా మధ్యలోనే చెడిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడేం చేస్తాడు ? అందుకే సాయిబాబా ఒక భక్తుడితో అన్నారు : "నా దగ్గఱికి వచ్చేవారంతా మోక్షం పొందుతారా అనుకుంటున్నావు కదూ నీ మనసులో ? ఆ మామిడిచెట్టు వైపు చూడు. అక్కడున్న పూత అంతా కాపైతే ఎంత మంచి పంట అవుతుంది ? కానీ అలా జఱగదు. పూతగానే చాలా మట్టుకు రాలిపోతుంది. కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని మాత్రమే పండ్లవుతాయి." అలాగే ఒకప్పుడు మనిషి చేసిన మంచి ఆలోచనల ఫలితంగా అతనికి మంచి రూపం లభిస్తుంది. కానీ తదనంతరం అలవాటు చేసుకొన్న, అతనికి అత్యంత ప్రియమైన దుష్టసంస్కారాలు సమాంతరంగా కొనసాగుతాయి.
మనం చేసే ప్రతి వక్రాలోచనా, పలికే ప్రతి వంకరమాటా, చేసే ప్రతివంకర చేష్టా ఆత్మతేజస్సుపై దుమ్ములా కప్పేసి దాని సౌందర్యాన్ని మఱుగుపఱుస్తుంది. ఇందుకు విపర్యస్తంగా సదుద్దేశంతో మనం చేసే ప్రతి సత్కర్మ మన ఆత్మని పరిశుభ్రం చేసే చీపురుగా ఉపయోగపడి దాని సత్యస్వరూపాన్ని వెలికి తీస్తుంది. ఆత్మే అసలైన దీపం. దేహాలు పైపై చిమ్నీలు మాత్రమే. ఆత్మ అంటే మఱింకేమీ కాదు. మనలోని సూక్ష్మ భగవంతుడే. శ్రీ రామకృష్ణపరమహంస కఠోర తపస్సాధనల్ని ఆచరించే రోజులలో ఆయన శరీరం బంగారంలా ధగధగ మెఱిసిపోతూండేదనీ దిష్టి తగుల్తుందేమోనన్న భయంతో శిష్యులు ఆయన మీద పట్టుపీతాంబరాలు కప్పేవారనీ చదివాం. కనుక సదాలోచనల ద్వారా ఆత్మతేజస్సును వృద్ధి పొందించుకుంటే శరీరతేజస్సు దానంతట అదే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది.
20, అక్టోబర్ 2010, బుధవారం
కొందఱు భార్యలు కూడా తమ భర్తలకు గురువులు కావచ్చు
"భార్యకు భర్త గురుమూర్తి" అని శ్రీగురుచరిత్రలో సూచించబడింది. అందుచేత ఒక శిష్యుడు తన గురువుగారికి ఏ విధంగానైతే సేవ చేస్తాడో అదే విధంగా భార్య భర్తకు సేవ చేయడం ద్వారా పరమార్థాన్ని సాధించుకుంటుందని సూచించారు. అంటే భర్తృద్రోహం గురుద్రోహంతో సమానం. గురుద్రోహం దైవద్రోహంతో సమానం. విపర్యస్తంగా ఇదే ఉదాహరణ గురు-శిష్య సంబంధానిక్కూడా చెప్పారు, ఒక మహాపతివ్రత తన భర్తను ఎలా సేవిస్తుందో ఒక శిష్యుడు కూడా తన గురువుని అలాగే సేవించాలని !
హిందూ సంప్రదాయాన్ననుసరించి భార్యాభర్తలకు అభేదం. హిందూధర్మంలో భార్యాభర్తల సంబంధం ఒప్పందమూ కాదు, కాంట్రాక్టూ కాదు, తాత్కాలికమూ కాదు. స్వసంకల్పానుసారంగా రద్దుచేసుకోదగినది అంతకంటే కాదు. తల్లివలె, తండ్రి వలె, సోదరుడి వలె అది రక్తసంబంధంతో సమానం. గురువు వలె అది ఒక ఆధ్యాత్మిక సంబంధం. అంటే భార్య అనేది భర్త యొక్క స్త్రీస్వరూపమే. అతని యొక్క మనశ్శక్తులే అతనికి సహాయపడే నిమిత్తం ఆమెగా అవతారం ధరించాయని భావించబడుతున్నది. అందుచేత ఆమె పురుషుడి శక్తిస్వరూపిణి అన్నారు. అయితే అనుభవంలో చూసినప్పుడు కోట్లాదిమంది స్త్రీలలో కొన్నివందలమందికి మాత్రమే ఈ ఆధ్యాత్మిక సత్యం అనువర్తనీయం. మిగతా స్త్రీలంతా ఏదో పూర్వఋణానుబంధశేషం వల్ల తమ ప్రస్తుత భర్తల దగ్గఱికి వచ్చిచేఱినవాళ్ళై ఉంటారు. అటువంటివారు ఎలా వచ్చిచేఱారో అలాగే తమ ఋణం తీఱిపోగానే వెళతారు కూడా ! అదే విధంగా భర్త అనేవాడు సైద్ధాంతికంగా భార్య యొక్క పురుషస్వరూపమే. వారిద్దఱూ ఏకశరీరులు. వారిద్దఱూ ఒకఱికొకఱు ప్రతినిధులు. అందువల్లనే హిందూ ధార్మిక సంప్రదాయంలో మటుకు విడాకుల సంగతి ఎక్కడా ప్రస్తావించబడలేదు. హిందూమతం, ఒక మతంగా విడాకుల్ని అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆమోదించలేదు. అంటే హిందువులలో అవి లౌకికంగా, సామాజికంగా ఉనికిలో లేవని కాదు. చాలా ప్రాచీనకాలంలోనే విడాకులున్నాయని కౌటిల్యుడి అర్థశాస్త్రం వంటి గ్రంథాల ద్వారా తెలియవస్తున్నది. అయితే ఆ ప్రస్తావన ఇప్పుడిక్కడ సంగతం కాదు.
గురు-శిష్య సంబంధంలో శృంగారానికి తావు లేనప్పుడు భార్యతో శృంగారసంబంధం కలిగి ఉన్న భర్త ఆమెకు గురువు కావడమేంటని కొందఱి సందేహం. మనందఱికీ శృంగారం చాలా పెద్ద విషయం. కానీ దేవుడికి చాలా చిన్న విషయం. అందువల్లనే మనకీ సందేహం. మన దృష్టిలో శృంగారానికీ, ఆధ్యాత్మికతకీ చుక్కెదురు. సన్న్యాసుల ఆధ్యాత్మిక ఆదర్శాల్ని గృహస్థులు కూడా తలకెక్కించుకోవడం వల్ల ఏర్పడ్డ అయోమయమిది. కానీ గృహస్థాదర్శాలూ, సన్న్యాసాదర్శాలూ ఒకటి కావు. రెంటికీ పొత్తు కుదఱదు. ఇవి ఆధ్యాత్మిక సాధనలో రెండు వేఱు వేఱు పంథాలు, రెంటినీ కలగాపులగం చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి శృంగారమనేది నిండా ఆమోదయోగ్యమైన ఆశ్రమవిహితమైన జీవనశైలియే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోను తప్పుపట్టకూడదు. అందులో పాల్గొనకుండా బలవంతాన మానకూడదు. గృహస్థాశ్రమానికి సంబంధించినంతవఱకూ గురువులంటే శిష్యులతో/ శిష్యురాళ్ళతో శృంగారసంబంధం లేనివారు మాత్రమే కాదు, ఆ సంబంధం ఉన్నవారు కూడా గురువులే. అన్నిరకాల శృంగారాలకూ ఆశ్రమవిహితంగా స్వచ్ఛందంగా దూరమైపోయిన సన్న్యాస గురువులతో గృహస్థ గురువుల్ని పోల్చి వారిని నిందించడం సరికాదు. ఎందుకంటే ఆ సంబంధం వల్ల వారివారి గురుహోదాకు ఏ విధమైన భంగమూ వాటిల్లదు. వారి పట్ల శిష్యులు/ శిష్యురాళ్ళు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలలోను, చూపించాల్సిన పూజ్యభావనలోను సహితం ఏ విధమైన మార్పూ ఉండదు. అంటే ఆ సంబంధం ఏర్పడ్డ తరువాత కూడా ఆ గురువులు తమ తమ శిష్యులకు/ శిష్యురాళ్ళకు యథావిధిగా పూజనీయులే ఔతారు, పరిచరణీయులే అవుతారు. అయితే ఒకపక్క ఆ సంబంధాన్ని కలిగి ఉంటూ మఱోపక్క ఆ సంబంధం తమ మధ్య లేదన్నట్లు బహిరంగ ప్రదర్శన ఇవ్వడం మాత్రం భగవంతుని దృష్టిలో కుటిలత్వమూ, మహాపాపమూ అవుతుంది.
భార్యకు భర్త గురువైనట్లే, భార్య కూడా భర్తకు గురువు కావచ్చు. అంతమాత్రాన ఆమెతో కాపరం చేసే అర్హతని భర్త కోల్పోడు. అగస్త్యమహర్షి లోపముద్రాదేవి నుంచి ముందు శ్రీవిద్యోపదేశాన్ని పొంది కొంతకాలం తపస్సు చేసి సిద్ధుడైతేనే గానీ ఆమెని వివాహం చేసుకోవడానికి అర్హత లభించలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే ఆయన భార్య పూర్వాశ్రమంలో ఆయనకు గురువే. అయితే అది వారి దాంపత్యజీవితానికి ఏ విధంగానూ ఆటంకం కాలేదు.
అయితే ఈ వివరాల్ని ఈ కాలపు పురుషద్వేషులైన స్త్రీల వాదానికి ఉపబలకంగా తలవడం సరి కాదు. ప్రాథమికంగా వారి వాదాన్ని హిందూధర్మం ఆమోదించదు. ఈ పైన పేర్కొన్న సారాంశం మన సనాతన ధర్మానికి సమ్మతమైనదే. ఇది సత్యం కనుకనే ఇక్కడ చెప్పబడింది.
19, సెప్టెంబర్ 2010, ఆదివారం
యోగాలు ఎలా పుట్టాయి ?
మనిషి అనేవాడు దేహం-ప్రాణం-హృదయం-కర్మేంద్రియ-జ్జానేంద్రియ-మనో-బుద్ది-ఆత్మల కలయిక.
మనిషికి కర్మేంద్రియాలున్నాయి. వీటిద్వారా భగవంతుని అందుకునేది కర్మయోగం. కొందరు పని చెయ్యకుండా క్షణం ఊరుకోలేరు. వారి జీవితం అంతా కర్మ మయంగా ఉంటుంది. అటువంటివారికి కర్మయోగం సరిపోతుంది. అంటే వీరు Action-oriented people.
మనిషికి జ్ఞానేంద్రియాలున్నాయి. వీటి ద్వారా దేవుని చేరుకునేది జ్ఞానయోగం. కొందరిలో బుద్ది చాలా తీక్షణంగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిపైన ఆధారపడకుండా, ఏ బంధాలలోనూ ఇమడకుండా, పూర్తిస్వతంత్రంగా ఉండాలనే గట్టి వ్యక్తిత్వం కలవాళ్ళకు సరిపోయేది జ్ఞానయోగం. ఇది ఎక్కువగా పురుషులకు సరిపోతుంది. వీరు ultimate freedom-lovers.
మనిషికి స్పందించే హృదయం ఉంది. దానిద్వారా కలిగే ప్రేమతత్వంతో భగవంతునిచేర్చేది భక్తియోగం. సున్నిత మనస్కులకు, దయాస్వభావులకు, ఒకరిపైన ఆధారపడే స్వభావం ఉన్నవారికి సరిపోయేది భక్తి యోగం. ఇది ఎక్కువగా స్త్రీలకు సరిపోతుంది. వీరు sentimental and loving people.
మనిషికి శరీరం ఉంది. కొందరికి దేహస్పృహ ఎక్కువగా ఉంటుంది. దేహాన్ని దాటి వాళ్ళ ఆలోచనలు ముందుకు పోలేవు. వీరికి ముందుగా కావలసింది హఠయోగం. శరీరంలో కఫ శ్లేష్మాది కల్మషాలు ఎక్కువగా ఉన్నవారికి వాటి ప్రక్షాళణ కోసం ఇది బాగా పనిచేస్తుంది. వీరు body-oriented people.
మనిషికి మనస్సు ఉంది. దానిద్వారా పరమాత్ముని చేరుకోవటం రాజయోగం. మనో మయ జీవులకు ఆలోచనాపరులకు రాజయోగం చక్కగా సరిపోతుంది. వీరు mind-oriented, thoughtful people.
మనిషికి ప్రాణశక్తి ఉన్నది. దానిద్వారా ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుని చేరుకోవటం కుండలినీ యోగం. ప్రాణ సాధకులకు, ప్రాణ శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఈ యోగం బాగా సరిపోతుంది. వీరు energy-oriented people.
ఇతర మతాలవలె అందరినీ ఒకే గాటన కట్టకుండా, ఎవరి వీలును బట్టి వారికి దారిచూపడమే మన సనాతన మతం యొక్క విశిష్టత. నువ్వున్న చోటినుంచి ముందుకు నడువు, నువ్వున్న చోటినుంచి పైకి ఎదుగు అని మన మతం చెబుతుంది.
ఆ క్రమంలో పుట్టినవే వివిధ యోగ ప్రక్రియలు.
5, సెప్టెంబర్ 2010, ఆదివారం
రష్యన్ల భారతీయ మూలాలు
రష్యన్ భాష ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందినదనే సత్యం గత 140 సంవత్సరాలుగా భాషాశాస్త్రవేత్తలకు తెలుసు. ఇది బృహత్తరమైన Indo-European Family of Languages లో శ్లావిక్ అనే ఉపకుటుంబానికి చెందినదిగా వారు పరిగణిస్తూ వచ్చారు. కానీ ఇండో-యూరోపియన్ కుటుంబం అనే కాన్సెప్టు బ్రిటీషువారి కల్పన అనీ, సంస్కృతం ఒక్కటే ఆ కుటుంబంలోని 130 భాషల్నీ సమన్వయం చేసి, వాటన్నింటికీ మూలాల్ని చూప గల ఏకైక భాష కనుక ఆ భాషలన్నింటినీ Sanskrit Family అనే అనాలని మన భారతీయ పండితుల అభిప్రాయం. రష్యన్ కీ సంస్కృతానికీ ఉన్న పోలికల్ని ఒకసారి గమనించండి.
ఇంగ్లీషులో ఉన్నట్లు రష్యన్ లో is, are లూ ఆర్టికిల్సూ లేవు. కానీ సంస్కృతంలో మాదిరి ద్వివచనం ఉన్నది. కానీ ఆధునిక రష్యన్ లో దీన్నెవఱూ వాడరు.
ఉదా :- ఏతొ మొయి సుయిన్ - He is my son - వీడు నా కొడుకు
సంస్కృతం = ఏష మమ సూనుః
తుయ్ స్తొయీష్ - You are standing = నువ్వు నిలబడుతున్నావు.
సంస్కృతం = త్వం స్థాస్యసి
తత్ - అది (సంస్కృతంలో కూడా తత్ అంటే అది)
ఏతా - ఇది (సంస్కృతంలో ఏతత్ -ఇది)
యా = నేను
అన్ - అతడు (అనేన మొ|| అసౌ రూపాల నుంచి కావచ్చు)
వామ్ - మీకు (సంస్కృతంలో కూడా వామ్ అంటే మీకు)
నష్ - మా యొక్క (సంస్కృతంలో నస్- మా యొక్క)
త్వయీ - నీది (సంస్కృతంలో త్వయి అంటే నీయందు)
వుయ్ - మీరు (సంస్కృతంలో యూయమ్)
దోమ్ - ఇల్లు (సం. ధామ)
వొదా - నీరు (సం.ఉదన్)
యా జ్నాయే - I know (సం. అహమ్ జానే)
తుయ్ జ్నాయేష్ - నీకు తెలుసు
అన్ జ్నాయేత్ - అతనికి తెలుసు
ముయ్ జ్నాయేమ్ - మాకు తెలుసు
కూదా - ఎక్కడ (సం. కుతః)
జన్యా - తల్లి (సంస్కృతంలో కూడా జన్యా - తల్లి)
యాత్రోవ్ - తోడికోడలు ( సంస్కృతంలో యాతృ/ యాతా - తోడికోడలు)
కానీ కొన్ని అత్యంత ప్రాథమిక పదాలకు సంస్కృతంతో సంబంధం ఉన్నట్లు
అనిపించదు. ఉదాహరణకు -
జొవ్యూత్ - పేరు
యాయిత్సో - గుడ్డు
కోష్కా - పిల్లి
మిహతా ఐరోపేయుల మాదిరే రష్యన్లు కూడా గోడసున్నం తెలుపైనప్పటికీ వారి ముఖకవళికలు యూరోపియన్ల లాగా లేకపోవడాన్ని గమనించండి. వారు ఎక్కువగా ఉత్తర భారతీయుల్ని పోలి ఉంటారు. నా అభిప్రాయంలో - మహాభారత యుద్ధం తరువాత - అంటే నాలుగైదు వేల సంవత్సరాల క్రితం రష్యాకు వలసపోయిన భారతీయులే రష్యన్లు అయ్యుండొచ్చు. మనకది ఐతిహాసిక కాలమే గానీ ఇతర దేశాలకు మాత్రం చరిత్రపూర్వయుగం కిందనే జమ. కనుక ఇందులోని సత్యాసత్యాలకు సంబంధించి ఆ దేశాల్లో రికార్డులు లభించవు. లేకపోతే అన్ని సంస్కృతపదాలు రూపు చెడకుండా ఆ భాషలో ఇప్పటికీ వ్యవహారంలో ఉండడం సాధ్యం కాదు. రష్యాని మహాభారతంలో ఉత్తరకురుభూములని వ్యవహరించారు. సంస్కృతంలోని విసర్గ ఐరోపేయ భాషల్లో సకార పొల్లు (స్) గా మారుతుంది గనుక-
(ఉత్తర) కురుః - కురుస్ - రూస్ - రూస్సియా - రష్యా అయిందా ?