20, జనవరి 2012, శుక్రవారం

పురాతన ఈజిప్టులో శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారా ?

ఆమధ్య పుణ్యభూమి గూగుల్ గుంపులో టపా అయిన ఒక చర్చాహారం (Thread)


ఒక సభ్యుడు :

జగన్నాథరథయాత్రను పోలిన రథయాత్రలను ఈజిప్టులో చూసి శ్రీ....... గారు వ్రాసిన వ్యాసం చదవండి..ఇతడు సదరు మేనేజిమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకన్నా ఒక ఏడాది ముందువాడు..

http://satyameva-jayate.org/2011/10/07/krishna-rathyatra-egypt/?utm_s...|+Satyameva+Jayate+||%29



రెండో సభ్యుడు :

మంచి లింకు ఇచ్చారు. పొష్ట్ బాగుంది. అక్కడ కామెంట్ సెక్షన్లొ http://2ndlook.wordpress.com/ ఈ బ్లాగు వుంది. అందులొ కొన్ని పొష్ట్ లు బాగా ఉన్నాయి.



మూడో సభ్యుడు :


చాలా ఆసక్తికరంగా ఉంది. రచయిత (లేదా అతని స్ఫూర్తిదాయకుడు) కృష్ణుడి రథయాత్రకి మించి చాలా విషయాల్ని స్పృశించారు. ముఖ్యంగా ప్రాచీన ఈజిప్షియన్లు తమ పూర్వీకుల అసలు మాతృభూమి పుంట్ అనీ, అది చాలా పెద్దదేశమనీ, అది హిందూమహాసముద్ర తీరాన ఉందనీ చెప్పుకున్న వైనం దిగ్భ్రాంతి కలిగించింది.



కానీ కొన్ని సందేహాలు మిగిలిపోయాయి.



ఇండియాకి పుంట్ అనే పేరు ఎలా వచ్చింది ?



అంతేకాదు, ఈజిప్షియన్ల పూర్వీకులు భారతీయులైతే మఱి ఇండియాలో విస్తారంగా లేని పాషండ ఆచారాలు - తల్లినీ, చెల్లినీ, కూతురినీ పెళ్ళి చేసుకోవడం లాంటివి ఈజిప్షియన్లకి ఎలా వచ్చాయి ? అంటే అలాంటివి ఇండియాలో కూడా ఉన్నరోజుల్లో వాళ్ళు ఈజిప్టుకి వలసపోయారా ? ఎందుకంటే ఈజిప్షియన్ రాజవంశాల చరిత్ర ఏడెనిమిదివేల సంవత్సరాల నాటిది. అప్పుడు ఇండియా కూడా ఎలా ఉండేదో మనకి తెలీదు.



12,000 సంవత్సరాల నాటివైన ఈజిప్షియన్ గీజా పిరమిడ్స్ కట్టినది ఈజిప్షియన్లు కారనీ, అంతకుముందు అక్కడ నివసించిన రాక్షసజాతి కావచ్చునని వ్యాసరచయిత చేసిన సూచన ఆసక్తికరంగా ఉంది.



అయితే ఆ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యల్లో ఒకదాన్ని గంభీరంగా తీసుకోవాల్సి ఉంది. ఆ వ్యాఖ్యాత ఏమంటాడంటే - చరిత్రపూర్వయుగంలో జాతుల మధ్యా, దేశాల మధ్యా చాలా give and take చోటుచేసుకుంది. ఏ జ్ఞానం ఎక్కణ్ణుంచి ఎక్కడికి ప్రయాణించిందో ఇప్పుడు చెప్పడం కష్టం. ఉదాహరణకి - ప్రపంచంలో సాఫ్టువేరు కంపెనీలన్నీ నశించి ఒక్క Infosys శిథిలాలు మాత్రమే మిగిల్తే సాఫ్టువేరుకు భారతదేశమే మూలమనే పొఱపాటభిప్రాయం భావితరాలకి కలగొచ్చు అంటాడు.



నేను అతనితో కొంతవఱకు ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం హిందూమతం అనుకుంటున్నదాని క్కూడా ఇండియాయే జన్మస్థానం కాకపోవచ్చు. మన ఋషులు మన దేశస్థులు కాకపోవచ్చు. ఇది ఒక ప్రపంచమతంగా విలసిల్లిన యుగం ఒకటున్నది కావచ్చు. అన్నిదేశాలలోనూ నశించి ఇక్కడ మాత్రం మిగలడం చేత ఇదే ఈ మతానికి జన్మస్థానమని మనం భ్రమిస్తూండొచ్చు. దీని అసలు జన్మస్థానం సముద్రగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఎడారిగా మారి ఉండొచ్చు



నాల్గో సభ్యుడు :



నేను .... గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.



చరిత్రలో ఎంతో దూరం వెళ్ళకుండానే
http://ancientindians.files.wordpress.com/2008/12/epicindiacities.jpg

ఫ్ఘనిస్తాన్ మొదలుకొని బర్మా వరకు భారత దేశంగా పేరు ఉన్న విషయం మనకు తెలుసును. అలాంటిది ౫౦౦౦ సంవత్సరాల క్రితం మాట అంటే మనకు అసలు ఏమి తెలియదనే చెప్పాలి.



మరొక విషయం -- ప్రస్తుతం పురావస్తు శాస్త్రం ప్రకారం ౩౦౦౦ bc ముందు పెద్ద కట్టడాలు ఏమి జరగలేదు. ఆ గిజా పిరమిడ్ ౨౫౦౦ bc లో కట్టి ఉంటారని ప్రస్తుతం నమ్ముతున్నారు:



Egyptologistsbelieve that the pyramid was built as a tomb for fourth dynasty



http://en.wikipedia.org/wiki/Egyptologists


http://en.wikipedia.org/wiki/Fourth_dynasty_of_Egypt


Egyptian Pharaoh Khufu (Cheops in Greek) over an approximately 20 year period concluding around 2560 BC.


http://en.wikipedia.org/wiki/Khufu



http://en.wikipedia.org/wiki/Ancient_Egypt



మొదటి సభ్యుడు :



కోటవేంకటాచలం గారి పుస్తకం చదివినమీదట పాశ్చాత్య పురావస్తుశాస్త్రవేత్తలు పిరమిడ్ల ప్రాచీనతను కుదించేశారేమో నని అనుమానం కలుగుతోంది. ....గారు వ్యాఖ్యలనుండి వెలికితీసి పంపిన లంకె పాశ్చాత్యుల దురాగతాల చిట్టా లా ఉంది.



బిభువ్రాసిన కొన్ని వ్యాసాలు పూర్వం చదివాను కానీ పుణ్యభూమి సభ్యులకు పంపలేదేమో. గ్రహమ్ హాన్కాక్ గూడొకటి ఉన్నది - అందలో అతడు వ్రాసిన వ్యాసాలు ఆసక్తకరంగా ఉన్నాయి. వాటిని తన బ్లాగులో సేకరించి ఉంచాడని గమనించాను, ఇది చూడండి.



http://bibhudev.blogspot.com/



అయిదో సభ్యుడు :



.....గారూ ! మీ అభిప్రాయం హిందు తత్వానికి వర్తించదు మన ప్రస్తావనలో (పురాణాలలో )ఉన్న బౌగోళిక నైసర్గిక అంశాలన్నీ ఈ దేశానికే వర్తిస్తాయి పురాణాలలో ఉన్న చాలా దేశాలు రాజ్యాలు అక్కడి మనుషుల వర్ణనలను ఒకసారి అధ్యయనం చేస్తే మనకు ఈ ఇజిప్టు లంకె దొరుకుతుంది మన సమస్య అల్లా మనం మన పురాణాలను ఆధారాలుగా పరిగణలో కి తీసుకోకుండా చరిత్ర గురించి మాట్లాడుతాము..... పురాణాలను ప్రస్తావించని పురాతన చరిత్రపరిశోధనలు నా దృష్టిలో సమగ్రం కాదు.


మూడో సభ్యుడు :



పురాణాల్ని పరిగణనలోకి తీసుకోకుండా చరిత్రరచన సమగ్రం కాదని నేనూ భావిస్తాను. అయితే హిందూమతం ఒకప్పుడు ప్రపంచంలో అన్నిచోట్లా ఉన్నట్లు పురాణాలు వర్ణించాయి. ముఖ్యంగా భాగవతంలోని భూగోళవర్ణనలో కొన్ని ద్వీపాలలో (ఈనాటి పరిభాషలో ఖండాలు లేక continents) శివుణ్ణి, మఱికొన్ని ద్వీపాలలో యజ్ఞేశ్వరరూపుడైన విష్ణువునీ పూజిస్తారని చెప్పబడింది. అంటే హిందూమతం పురాణాల కంటే ప్రాచీనమని అంగీకరించక తప్పదు గదా ! ఆ ప్రాచీన మూలహిందూమతం కేవలం ఇండియాకి మాత్రమే సంబంధించినదని కాకపోవచ్చునని నా ఊహ. కొన్నిఒరిజినల్ అంశాల్ని ఇక్కడివాళ్ళు జోడించారు. మఱికొన్ని బయటినుంచి వచ్చాయి. వెఱసి హిందూమతం అంటున్నాం. మన ఋషుల్లో కొందఱు గ్రీన్ ల్యాండ్ కి, మఱికొందఱు శ్కాండినేవియాకి చెందినవాళ్ళనే అనుమానం ఇప్పటికీ ఉంది, వేదాల్లో కొన్ని మంత్రాల్ని బట్టి ! ఈ అనుమానాన్ని మొదట వ్యక్తం చేసినది లోకమాన్య బాలగంగాధర టిళక్ గారు, The Orion అనే గ్రంథంలో !



రెండో సభ్యుడు :


మంచి చర్చ జరుగుతోంది. ....గారు & ....గారు చెప్పినా విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కోట వెంకటచలం గారి గురించి వినడమే కానీ చదివింది లేదు. ఈసారి మన దేశం వచ్చినప్పుడు వెతికి పట్టుకుంటాను.



అయిదో సభ్యుడు :



తిలక్ గారు ఉన్నప్పుడు డి ఎన్ ఏ టెస్టు లు ...,వస్తువుల కాల నిర్ణయం లాంటి పద్దతులు లేవు .. అప్పుడు ఆర్యుల గురించి బయటి నుంచి వచ్చినారనే అభిప్రాయం ఉండేది ,అన్ని పరిశోధనలలో నేటి ఆధారాలతో ఆర్యులు బయటి వారు కాదని సరస్వతి నది ఆధారంతో కల్యాణ రామన్ గారు గుర్రం ఇక్కడదే అని రాజారామన్ నిరూపించారు మొన్నటి డి ఎన్ ఏ టెస్టు ద్వారా ఈ దేశం లో ఉన్న వాళ్ళందరి డి ఎన్ ఏ ఒకటే అని తేల్చేసారు .., అయినా లక్షల సంవత్సరాల క్రిందట జరిగిన చరిత్ర ఎక్కడడైనా కావొచ్చు భూగోళ స్వరూపమే మారిపోయి ఉండవచ్చు



మొన్న ఒక పరిశోధనలో మానవుడు చేప నుంచి వచ్చాడని కనుక్కొన్నారు నాకు మత్స్యావతారం (నీటిలో మొదటి జీవం ),కూర్మ (నీరు-భూమి ఉభయచరం ) , వరాహ (భూమిపై మొదటి జీవం ), నారసింహ (మనిషి+జంతువు ), వామన (పొట్టి మనిషి), పరశురామ (మనుషుల్లో మృగ రూప క్రూరత్వాన్ని ఉన్న వారందరిని నాశనం చేసినవాడు), రామ (పరిపూర్ణ మనిషి), కృష్ణ (మనిషికి సామాజికజీవనంలో ఎలా జీవించాలో మార్గదర్శనం ) ఇలాపరిణామక్రియలన్ని మన వాళ్ళు వివరించారు అని అనిపిస్తోంది.



ఆఱో సభ్యుడు :



చాలా బాగా చెప్పారు... ఇది విన్నాక మన సంస్కృతులు వాటిని ముందు తరాల వారికీ అందించాలని మనపూర్వికులు తీసుకున్న జాగ్రత్తలు.. అద్భుతంగా ఉన్నాయి. ఆలోచిస్తుంటే.. చాలా సంతోషంగా అనిపిస్తోంది



మూడో సభ్యుడు :



ఈ వివరణ ఇంతకుముందు విన్నాను. కానీ మన పురాణాలకి అలా భౌతిక భాష్యం చెబితే అవి నిజంగా జఱగలేదనీ, ప్రతీదీ కవితాత్మకంగా కల్పించారనే అభిప్రాయం కలుగుతుంది. ఆ తరువాత మళ్లీ యథాప్రకారం మన వ్యాసుడూ, వాల్మీకీ బోనెక్కాల్సి వస్తుంది. కనుక మన మతవిశ్వాసాలకి భౌతిక భాష్యాలు ఇవ్వడమనే ఇఱవయ్యో శతాబ్దపు పండిత ధోరణిని మనం ఈ శతాబ్దంలో మానేస్తే మావుంటుందని నా ఊహ. అప్పట్లో - అంటే మా చిన్నప్పుడు నాస్తిక దాడుల నుంచి తమని తాము కాపాడుకోవడం కోసం మన పండితులు మన విశ్వాసాల్లోని సైన్సుని వెలికి తీయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియలో కొంత "అతి" కూడా తయారైంది. మన మతవిశ్వాసాల్ని విశ్వాసాలుగానే తీసుకుందాం. ఇవి మా విశ్వాసాలని బోఱవిఱుచుకుని ధీమాగా చాటుదాం. తప్పేముంది ? ప్రతీదానికీ మనం నాస్తికుల కోర్టులో ముద్దాయిల్లా బోనెక్కాలా ? అవసరం లేదు కదా ?



ఇహపోతే ఆర్య-ద్రావిడ విషయం కాదు నేనన్నది. మన మతం యొక్క రూపకల్పనలో కేవలం మన చేయి మాత్రమే ఉండి ఉండదు. అసలు "మన మతం" అంటున్నది "పూర్తిగా మనది మాత్రమే" కాకపోవచ్చు అంటున్నాను. ఇతర దేశాల్లో హిందూసంస్కృతి అవశేషాలు కనపడుతున్నాయన్నప్పుడు అవి ఇక్కణ్ణుంచే అక్కడికి వెళ్ళాయని ఖరాఖండిగా చెప్పలేం, ఇది ఒకప్పుడు ప్రపంచమతం అనేది దృష్టిలో పెట్టుకుంటే !



ఏడో సభ్యుడు :



జై శ్రీరాం, శ్రీరామదూతం శిరసా నమామి ! కానీ ఇవి ఇదే వరుసలో ఉన్నాయని అనుకోలేము. ఉదాహరణకి, బలిచక్రవర్తి ప్రహ్లాదునికి మనుమడు, ఆ లెక్కన చూస్తే కూర్మావతారం, నరసింహస్వామి తర్వాత జరిగింది. ఇక భాగవతంలో చూస్తే అటూఇటూగా ఇరవైఒక్క అవతారాలను పేర్కొన్నారు. స్థూలంగా మీరన్నట్టు అనుకున్నా , రేపు పొద్దున ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే ఏం చెబుతాం? ఇలాంటి వాటిగురించి కూడా పరిశోధన జరగాలి. కానీ అలాంటి మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి పరిశోధనలు చేసినవారు చాలా అరుదు.



నిన్ననే ఒక పాత నాటకం చదివాను. "అశోకం" అని . రావణుడు గొప్ప ప్రేమికుడనీ, సీతని ఎత్తుకొచ్చినా పెళ్ళి చేసుకోవాలనే సదుద్దేశ్యం కలవాడనీ, రావణుడు చనిపోయాక సీత అతని తల తన ఒళ్ళో పెట్టుకుని రోదించిందనీ, అందుకే రాముడు పరిత్యజించాడనీ. ఇలా సాగుతుంది ఆ నాటకం. చదివిన నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. రాముడిని హీరో చెయ్యాలని రామాయణంలో అతన్ని పని గట్టుకుని పొగిడారని, రావణుడిని రాక్షసుడిని చేసారని , అసలు రాక్షస అనే శబ్దం "రక్షస్" అంటే రక్షించే వాడు అన్న ధాతువు నుండి పుట్టిందనీ. తన వర్గాన్ని ధర్మంగా కాపాడుకునే రావణుడినీ అతని అనుచరులనీ పని గట్టుకుని ఆర్యులైన బ్రాహ్మణులు పురికొల్పగా రాముడు సంహరించాడని...... ఇలా ఆర్యులు అనేది ఒక కట్టుకధ అని ఇప్పుడు నిరుపితం అయ్యింది కదా, మరి ఈ తరహా జనాలంతా తమ ముఖాలెక్కడ దాచుకుంటారో,



చాలా కొద్దిమంది తప్ప అందరూ ఇలాంటి పరిశోధకులే మన ఖర్మకొద్దీ.. ఎక్కడో నూటికీ కోటికీ వెంకటాచలం, అప్పలాచార్యస్వామి వంటి మహానుభావులు ప్రయత్నించినా అది సఫలం కావడంలేదు. తామరతంపరలా వచ్చిపడుతున్న ఈ విమర్శల్లో వారు చేసిన అద్భుతమైన పరిశోధనలు మరుగున పడిపోతున్నాయి.



మూడో సభ్యుడు :



నేను ఇందాక చెప్పినదే మఱికాస్త ! లలితాసహస్రనామాల్లో ఓఢ్యాణ పీఠనిలయా అనే నామం ఉంది. ఈ ఓఢ్యాణపీఠం వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. లలితోపాసన మొదట ప్రారంభమైంది అక్కడేనట. కానీ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అంటే అంతా తుఱకదేశం. కానీ లలితా ఉపాసన ఇక్కడ ఇండియాలో బట్టకట్టింది. ఇలాగే ఎన్నో హిందూ సంప్రదాయాలు విదేశాల్లో జన్మించి ఇక్కడ ఆశ్రయం పొంది ఉంటాయని నేననుకుంటున్నాను.


అయిదో సభ్యుడు :

కూర్మానికీ, బలికీ ఏమిటి సంబంధం ? వామనుడికీ, బలికీ కదా సంబంధం ?


ఏడో సభ్యుడు :

సాగరమధనం జరిగింది బలిచక్రవర్తి సమయంలోనే కదా ?

అయిదో సభ్యుడు :

లేదండి !

ఎనిమిదో సభ్యుడు :

ఆఫ్ఘనిస్తాన్ కూడా గాంధార దేశమనే పేరుతో భరతవర్షంలో భాగంగానే వర్ణించబడి ఉంది కదా ?

అయిదో సభ్యుడు :

అవును. ఒకప్పటి భారతం ఇప్పటి ఇరాక్ నుంచి ఇండోనేషియా వరకు వ్యాపించింది.

రెండో సభ్యుడు :


http://2ndlook.wordpress.com/


http://bibhudev.blogspot.com/



మిత్రులు అందరు ఇస్తున్న వివిద లింకులు అన్ని అందుబాటులొ ఉండేవిదంగా ఒక పట్టిక (బ్లాగు పేజి) ప్రచురిస్తే బాగుంటుంది. ఎవరికి వారు Google లొ వెతుక్కొవచ్చు కాని, సమయము వృదా అవుతుంది. అన్ని ఒక ప్లేస్ లొ ఉంటే బాగుంటుంది.


అయిదో సభ్యుడు :


లంకెలో చాలా విషయాలు ఉన్నాయి -కృతజ్ఞతలు


మూడో సభ్యుడు :


పూర్వం ఎక్కడెక్కడైతే హిందూమతం ఉండేదో అదల్లా భారతదేశం అనుకోవడం సరైన కోణం కాదనుకుంటా. నిజానికి ఈ విషయంలో చాలా confusion ప్రచారంలో ఉంది. మనమంతా ఆ confusion లోనే పుట్టి పెఱిగాం. భారతదేశం అనేది ఒక ఆధునిక రాజకీయ పరిభావన. ఇది ఇటీవలి British ideological construct. ఇది ప్రాచీనం కాదు. ప్రాచీనకాలంలో తెలిసినవి భారతవర్షం, భారతఖండం మాత్రమే. అయితే ఇవిరాజకీయ స్వరూపాలూ కావు. సాంస్కృతిక స్వరూపాలూ కావు. భౌగోళికాలు మాత్రమే. జంబూద్వీపం (Asia) లో ఉన్న ఇలావృతవర్షం, రమ్యకవర్షం, కిన్నరవర్షం, కింపురుషవర్షం లాంటి అనేక వర్షాలలో ఒకటి భారతవర్షం. మళ్లీ ఇదీ, భరతఖండమూ ఒకటి కావు. బ్రహ్మాండ పురాణంలో వీటన్నింటి గుఱించిన వర్ణనా విపులంగా ఇచ్చారు. ఒకసారి చూడండి.

అయిదో సభ్యుడు :


ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది. ఇక్కడ మూలాలు సాంస్కృతిక ఐక్యతతో ఉన్నాయి బ్రిటిషువాడు అసలు మనం ఒక దేశం అని ఎప్పుడూ ఒప్పుకోలే. వాడి అవసరం దృష్ట్యా ! గంగ అనాది. గోవు, రాముడు, కృష్ణుడు, ఇతర ఆచారాలు, వ్యవహారాలూ ప్రకృతిపూజ - అన్నీ కూడా ఒక వివిధరకాల పూలతో చేసిన పూలమాలలో దారంలా ఇక్కడ ఒకే జాతి తరతరాలుగా నివసిస్తున్నది.


శ్లో|| ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణమ్ |


వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సంతతిః |


(ఇంకా ఉంది)

19, జనవరి 2012, గురువారం

14, జనవరి 2012, శనివారం

మంచిభార్య కావాలన్నా తపస్సు చేయాలి

మంచిభర్త రావాలని పెళ్ళికాని ఆడపిల్లలచేత సాంప్రదాయిక విశ్వాసాలున్న హిందూ పెద్దలు కొన్ని వ్రతాలూ, నోములూ, పండుగలూ, పారాయణలూ ఆచరింపజేస్తూంటారు. ఈ విధమైన ఆచరణల్లో వరలక్ష్మీవ్రతం, అట్లతద్దె మొదలైనవి ఉన్నాయి. ఆడపిల్లల్లో కూడా పాశ్చాత్యవిద్య విస్తారంగా ప్రబలినాక ఈ సత్సంప్రదాయం క్రమేపీ మఱుగున పడుతూ వస్తున్నది. అయినా ఎంతకీ పెళ్ళికాని సందర్భాలలో - వయసు వాటారుతున్న కన్యల చేత ఆఖరి ప్రయత్నంగా రుక్మిణీకల్యాణం పారాయణ చేయించడం ఇప్పటికీ ఉన్నది.

మంచిభార్య రావాలని చెప్పి మగపిల్లల చేత ఈ విధమైన ఆచరణలు చేయించడం మాత్రం ఎక్కడా లేదు. "భార్య అంటే అబల, ఎలా కావాలంటే అలా వాయించదగ్గ తబల, అనుకూలంగా ఉండక ఏం చేస్తుందిలే ?" అనుకుని మనవాళ్లు ఈ విషయానికి అస్సలు ప్రాధాన్యమే ఇవ్వకపోవడం ఒక కారణం. కానీ మన ప్రాచీన కథల్నీ, పురాణాల్నీ పరిశీలిస్తే భర్తలకి జీవితాన్ని నరకప్రాయం చేసిన భార్యలు సృష్ట్యాదినుంచీ ఉన్నారు. వీరు ఫెమినిజంతో వచ్చినవారు కారు. అది పోయినంత మాత్రాన పోయేవారూ కారు. పైకి అందఱి ముందూ అణిగిమణిగి ఉన్నట్లు కనిపిస్తూ (నటిస్తూ) రహస్యంగా తమ తెలివితేటలకి పదునుపెట్టుకునే తరహా స్త్రీలక్కూడా కొదవలేదీ భారతభూమిలో ! కొన్నిసార్లు భర్త ఒక్కడికి మాత్రం విధేయురాలుగా ఉంటూ ఇహ తతిమ్మా కుటుంబసభ్యులందఱికీ ద్రోహం తలపెట్టే క్యారెక్టర్లు కూడా మొదట్నుంచీ ఉన్నాయి. అందుచేత మంచిభార్య, అందమైన భార్య రావాలంటే మగపిల్లలు కాస్త తపస్సు చేయడం అవసరం. ముఖ్యంగా ఈ నాగరికతలో స్త్రీల మనస్సుని మళ్ళించి, వాళ్ళ మతి పోగొట్టి, వాళ్ళు భర్తకీ, పిల్లలకీ పనికిరాకుండా పోయేలా పాడుచేసే బయటి ప్రభావాలు చాలా ఎక్కువయ్యాయి.

మనం రోజూ పొద్దున్నే లేచి ఎవఱి మొహం చూస్తామో, ఎవఱితో కలిసి ఒకే కప్పుకింద నివసిస్తామో, ఎవఱి సాన్నిహిత్యంలో మనసులోని బరువులు దించుకుంటామో, ఎవఱున్నారనే ధైర్యంతో ఇంటినుంచి బయటికీ, బయట్నుంచి ఇంటికీ వెళతామో ఆ జీవితభాగస్వామి(ని) సరైన వ్యక్తి అయి ఉండడం చాలా ముఖ్యం. వధువు ఆరోగ్యవంతురాలూ, పిల్లల్ని కనగల త్రాణ గలిగినదీ, రజోదోషాలతో బాధలు పడనిదీ అయి ఉండాలి. ఆమెకు పెళ్ళి కాక ముందు ఏ ఇతర పురుషుడితోనూ సంబంధం, అభిమానం, అటాచిమెంట్ ఉండకూడదు. ఒకఱో ఇద్దఱో అన్నదమ్ములు గలదై ఉండాలి. కేవలం అక్కచెల్లెళ్ళు మాత్రమే ఉన్న స్త్రీలల్లో ఫెమినిస్టు భావాలు చాలా అధికంగా ఉంటాయి. అలాంటి ప్రిజుడీసులు భర్తతో సర్దుకు పోయే ప్రక్రియకి హిమాలయాల్లా, మేరుపర్వతాల్లా అడ్డుపడతాయి. తండ్రి వదిలేసిన తల్లి గలదీ, మొదట్నుంచీ తల్లిపోషణలోనే ఉన్నదీ అయిన కన్య కూడా ఈ పై తరహాకి చెందినదే అయి ఉంటుంది. కానీ వాళ్ళింట్లో దైవభక్తి బావున్నప్పుడు ఫెమినిస్టు ధోరణులు కాస్త తగ్గుముఖంలోనే ఉంటాయి. కనుక చేసుకోవచ్చు.

ఆమె యొక్క బంధుమిత్త్రవర్గంలో అత్యంత ధనికులూ, కోర్టుపక్షులూ, జైలుపక్షులూ, పాత్రికేయులూ, పోలీసులూ, న్యాయవాదులూ ఉంటే అవన్నీ ఏదో ఒకరోజున వరుడి మెడకి గుదిబండల్లా చుట్టుకోవడం ఖాయం. ఇహపోతే పెళ్ళయ్యాక స్త్రీ జీవితాంతం భర్తకే విధేయురాలై ఉండాలి. ఇతరుల కోసం భర్తని నిలువునా నట్టేట్లో ముంచేదై ఉండకూడదు, ఆ ఇతరులు పుట్టింటివాళ్ళయినా సరే, సాక్షాత్తూ తన కడుపున పుట్టిన పిల్లలైనా సరే ! అతివిద్య, అతితెలివితేటలు, అతి-అఛీవ్‌మెంట్లు, అతిలోకజ్ఞానం, అతిసంపాదన, అతి-ఆస్తులూ, అతిపరిచయాలూ, అతి ఆత్మవిశ్వాసం, అతివాగుడు గల స్త్రీలు కూడా పెళ్ళికి బొత్తిగా పనికిరారు. అలాంటివారిని మొగ్గలోనే తిరస్కరించడం, ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవడం మగవాడికి అన్నివిధాలా శ్రేయస్కరం. వారిని కాస్త తెలివిగా సమయస్ఫూర్తితో ఇంటర్వ్యూ చేస్తే ఈ లక్షణాలు వారిలో ఉన్నాయా ? లేదా ? అనేది వాసనపట్టవచ్చు.

అయితే ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా భగవదనుగ్రహం గనక లోపిస్తే గయ్యాళిగంపలు మన ఇంట్లో అడుగుపెట్టడం ఖాయం. వారు మనల్ని రాచిరంపాన పెట్టడం తథ్యం. ఎంత ప్రయత్నించు, సర్వశుభలక్షణాలూ మూర్తీభవించిన ఆ స్వప్నసుందరీమణి ఎక్కడా లభించదు. ప్రతివారిలోనూ ఏవో కొన్ని లోటుపాట్లు ఉండనే ఉంటాయి, మనలో ఉన్నట్లే ! పూర్వజన్మలో స్త్రీలని హింసించినవారు మాత్రమే ఈ జన్మలో వారి చేతుల్లో హింసలు పడతారు. స్త్రీజనాభిమానులైన ఇతరులకి ఏ బాధా లేదు. కాబట్టి "ఈ జన్మలో మంచివాళ్ళమే కదా, మనకీ అశాంతి ఎందుకు సంప్రాప్తమయిందో" అని కుమిలిపోవడం అమాయకత్వం. ఆ జన్మకి సంబంధించిన లెక్కల పుస్తకాలూ, దస్తరాలూ ఎప్పుడో పరిష్కరించి మూసేయడం జఱిగింది. వాటిమీద ’న్యాయమూర్తి’ ఇచ్చిన తీర్పొక్కటే ఇప్పుడు ఈ జన్మ ద్వారా అమలవుతున్నది. ఈ జన్మకి సంబంధించిన అకౌంట్లూ, ఫైళ్ళూ ఇప్పుడింకా తయారవుతూ ఉన్నాయి. వీటిమీద చివర్లో వస్తుంది తీర్పు. అది వచ్చే జన్మలో అమలవుతుంది.

మన కంటే మనల్ని పుట్టించినవాడికి బాగా తెలుసు మనకేది మంచిదో ! కనుక మగపిల్లలు మంచిభార్య రావాలని చెప్పి కనకదుర్గమ్మవారిని లేదా లలితాంబికను నిష్ఠగా కొలిస్తే ఆవిడే పూర్వజన్మదోషాన్ని నివర్తించి తమకు తగ్గ భార్యల్ని సిద్ధం చేస్తారు. తనకు తగ్గ భార్య వస్తే చాలు, ఆమే సర్వశుభలక్షణవతి. అన్ని శుభలక్షణాలూ ఉండి తనకు మాత్రం అనుకూలురాలు కాకపోతే ఉపయోగమేముంది ? నిజం చెప్పాలంటే దుర్గోపాసకులకి భార్యే కాదు. యావత్ స్త్రీజాతీ అనుకూలంగా మారిపోతుంది. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడాను ! (దీన్ని మఱోలా అపార్థం చేసుకోవద్దు) ఈ విషయప్రాధాన్యాన్ని గమనించే అర్గళాస్తోత్రంలో--

శ్లో|| భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

అని అమ్మవారిని ప్రార్థించారు కొందఱు పూర్వీకులు. కొందఱు పురుషులు ఒక్క భార్యతో సంతృప్తి చెందరు. వారిక్కూడా ఇదే పద్ధతి. వధువును నిర్ణయించుకోవడానికి 11 నెలల ముందునుంచి సత్కళత్ర సిద్ధి (మంచిభార్య లభించడం) అనే సంకల్పంతో ప్రతినెలా నెలకోసారి చొప్పున లక్ష్మీహోమం చేసుకోవడం కూడా అద్భుతఫలప్రదం. కాస్త ఖర్చవుతుంది కానీ తప్పదు.

13, జనవరి 2012, శుక్రవారం

సంక్రాంతి అంటే !!!!!

మనకందరికీ నక్షత్రాలు 27 అని బాగా తెలుసు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాల లెక్కన 108 పాదాలుగా నక్షత్రాలు విభజించారు. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభజించారు. ఇందులో భాగంగా... సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలాగే... మకరరాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు శాస్త్ర, పురాణాల వాక్కు.

(నేటి వైజ్ఙానికులకు, అంతా ట్రాష్ అనుక్కునేవారికి ఇది విచిత్రంగానో మూఢనమ్మకంగానో తోచవచ్చు లేదా ఈ జ్యోతిష్యం, సూర్యుడు, నక్షత్రాలు బ్లా బ్లా బ్లా అని అనుక్కోనూవచ్చు. పాపం వారికి తెలియనిదేమంటే భౌగోళికంగా కూడా ఈ సంక్రాంతి రోజు నుంచీ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు మిగిలిన ఆరు నెలలపాటు కొంచెం సూర్యుని వైపు మొగ్గి (TILT) తిరుగుతుంది. దాని వలన సూర్యుని ఆకర్షణ శక్తి భూమి మీద పడి తదనుగుణ లక్షణాలు , సూర్య తరంగాలు భూమి మీద ఉండేవారి మీద ప్రసరిస్తాయి. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని పెద్దలు నిర్ణయించారు, దీని వెనకున్న శక్తినే మనం దైవం అంటాం, పాపం వారికేమనాలో తెలియక తంటాలు పడుతుంటారు. (అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా కదా మరి, అలా వెతికేస్తే చేతికి దొరికేస్తుందేమిటి పరబ్రహ్మం...?)

సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుందని శాస్త్రవచనం

అందుచేత ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది... కాబట్టి.. దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతి సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే... ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. అంతే కాదు దక్షిణాయనం అంతా ఉపాసనాకాలం దక్షిణాయనం లో మరణిస్తే ఉపాసన చేసుకునే అవకాశం పోతుందని పెద్దలు ఊర్ధ్వముఖరేతస్సు కలవారు తమ మరణాన్ని ఉత్తరాయణంలో పొందేవారు. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛందమరణాన్ని కోరుకున్నాడు.

రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టి ఆధ్యాత్మికంగా అందరూ పై పై మెట్లు ఎక్కాలని ఆశిస్తూ....

సర్వే జనాః సుఖినో భవంతు |

-------------------------------------------------------

8, జనవరి 2012, ఆదివారం

ఇవి హిందూ దేవాలయాలా ? ఇంగ్లీష్ చర్చిలా ?

ఈ రోజుల్లో ఏ హిందూ దేవాలయంలో చూసినా ఇంగ్లీషు రాజ్యమేలుతున్నట్లు కనిపిస్తున్నది. దేవాలయం గుమ్మం దగ్గఱ అడుగుపెడుతూనే Phalaanaa Swamy -Phalaanaa Ammavaarla Devasthaanam అని ఇంగ్లీషులో రాసున్న ఱెక్కమాను కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక Silence, Q (queue), No smoking అని కనిపిస్తాయి. దేవుడికి చేసే సేవల జాబితా ఇంగ్లీషులో రాసి గోడకి తగిలిస్తున్నారు. Ticket Counter అని రాసుండడమే కాక ఆ టిక్కెట్లూ, రశీదులూ, టోకెన్‌లూ అన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. ఇహ భక్తులకి సంబంధం లేని కార్యాలయ సామగ్రి అయిన దేవాలయ చిట్టాలూ, లెక్కలూ, ఆవర్జాలూ, కవిలెలూ, ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారాలూ అన్ని సర్వం సమస్తం ఇంగ్లీషులోనే ! ఇంకా శంకుస్థాపన ఫలకాలూ, దాతల పేర్లు కూడా ఇంగ్లీషులోనే !

ఈ మధ్య గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఇంకో వైచిత్రి కూడా గమనించాను. అక్కడ పైన చెప్పిన విధంగా ఫలకాలూ, టిక్కెట్లూ ఉండడమే కాక మంత్రాల్ని ఇంగ్లీషులో ముద్రించిన శాలువాలు కప్పుకొని పూజారులు పూజలు చేయడం గోచరించింది. ఉండబట్టలేక అడిగేశాను : "మీరు హిందూదేవాలయంలో పనిచేస్తూ ఇలా ఇంగ్లీషులో రాసున్న శాలువాలతో పూజలు చేయొచ్చునా ? దీని బదులు జీన్ ప్యాంట్లేసుకొని పూజ చెయొచ్చు గదా ?" అని ! అతని పక్కనున్న కొంచెం పెద్ద పూజారి అందుకొని "భాష ఏదైనా ఆ స్వామినామం ఉంటే చాలని మా ఉద్దేశం" అని సమర్థించుకోబోయాడు. "బావుందండీ ! కానీ సంప్రదాయం సంప్రదాయమే కదా ? నా మనస్సు కలుక్కుమంది అందుకే అడిగాను" అన్నాను నేను. నా నోటిదాకా ఎన్నో మాటలొచ్చాయి. కానీ నేనక్కడికి వెళ్ళిన ప్రయోజనం అక్కడి పూజారులతో వాదించడం కాదు గనుక నోరు మూసుకొని పూజచేయించి బయటపడ్డాను. మంత్రాలయ రాఘవేంద్రస్వామి వారి ఆలయంలో కూడా సర్వేసర్వత్ర ఇదే తంతు. సేవ చేయించిన భక్తులకి స్వామినామాన్ని శ్లోకాన్ని ఇంగ్లీషులో ముద్రించిన సిల్కు శాలువా బహుకరిస్తారు. ఇంగ్లీషు అక్షరాల్లో మఠం పేరు చెక్కిన స్వామివిగ్రహాన్ని ఇస్తారు. ఇక్కడి వైచిత్రి ఇంకో రకంగా ఉంటుంది. భాష విషయంలో ఇంత సంప్రదాయ ఉల్లంఘన చేస్తున్న మంత్రాలయ మఠం వారు ప్యాంటూ, చొక్కా ధరించిన భక్తులకి భోజనం పెట్టరు. పరాయిభాషని ఆప్యాయంగా కౌగలించుకున్నవారు పరాయివేషాన్ని మాత్రం ఎందుకలా కౌగలించుకోలేక పోతున్నారో వారే చెప్పాలి. నా దృష్టిలో ఆ రెండూ మన మతానికి విసర్జనీయాలే.

ఇలా ఉన్నారు మతాచార్యులు, తాము చెడిపోయింది గాక తతిమ్మా హిందువులందఱినీ చెడగొడుతూ ! వీళ్ళని హిందువులు నమ్ముకున్నదొకదానికి. వీళ్ళు ఆచరణలో చేస్తున్నది మాత్రం ఇంకొకటి. వీళ్ళు మధ్వులో, వైష్ణవులో, శైవులో, స్మార్తులో ఎవరైతేనేంటి ? ఏ ఱాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి ? మఱి దేవాలయాల్లో క్రైస్తవుల్ని నియమిస్తే మనమెందుకు నెత్తీ నోరూ లబలబా కొట్టుకోవడం, ఇక్కడ పనిచేస్తున్న బ్రాహ్మలే ఇలా క్రమక్రమంగా మానసిక, అనుష్ఠాన క్రైస్తవులుగా మారిపోతున్నప్పుడు ?

నిజమేనా ? భాష ఏదైనా ఆ స్వామినామం ఉంటే చాలా ?

దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మొదట్లో ఈ దేశంలో ఇంగ్లీషువారి సైనికస్థావరాలకే పరిమితమైన ఇంగ్లీషు, వారికి రాజకీయాధికారం దఖలుపడ్డాక కార్యాలయాల్లో ప్రవేశించింది. అటుపిమ్మట పాఠశాలల్లోకి ప్రవేశించింది. పిదప ఇళ్ళలోకి ప్రవేశించింది. ఇప్పుడు సంప్రదాయానికీ, సంస్కృతులకీ కాణాచిగా నిలవాల్సిన దేవాలయాల్ని సైతం సంపూర్ణంగా ఆక్రమించేసింది. ఇక్కడ నేర్చుకోవాల్సిన గుణపాఠం "ఏదీ అక్కడితో ఆగదు" అని ! ఈరోజు ఏ భాషయినా ఏ లిపైనా ఫర్వాలేదంటున్నవారు ఱేపు ఏ దేవుడైనా ఫర్వాలేదంటే ? వాళ్ళు అనేదేంటి ? వాళ్ళ బదులు భక్తులే అనేస్తారు. ఱేపు మంత్రాలు కూడా ఇంగ్లీషులోనే చదివే సంభావ్యతని నేను త్రోసిపుచ్చలేను. అలాగే ఇంగ్లీషు రామాయణాలూ, ఇంగ్లీషు గీతలూ మైకులు పెట్టి మఱీ వినిపిస్తారేమో తెలియదు. ఆ తరువాత వాటి స్థానంలో బైబిల్ వినబడుతుంది. మతానికీ, జాతీయతకీ, సంస్కృతికీ, భాషే ఆయువుపట్టు. భాష మారితే అన్నీ మారిపోతాయనే జ్ఞానం ఈ జాతికెప్పుడు కలుగుతుంది ? ఇంగ్లీషేమైనా భారతీయభాషా ? అదేమైనా మన మతానికి సంస్కృతంలా పవిత్రమైన భాషా ? ఇతరదేశాలవాళ్ళకి మన సంస్కృతిని పరిచయం చేయడం కోసం మాత్రమే ఇంగ్లీషు. మనలో మనకి ఇంగ్లీషు అవసరమా ? మన దేవాలయాల్లో ఇంగ్లీషు అవసరమా ? ఇతరదేశాలతో వ్యవహరించడం కోసం ఇంగ్లీషన్నారు. తలూపాము. సైన్సూ, టెక్నాలజీ ఇంగ్లీషులో ఉన్నాయన్నారు. సరేనన్నాము. కంప్యూటర్లకోసం ఇంగ్లీషన్నారు చేతులెత్తేశాము. ఇప్పుడు దేవాలయాల్లో కర్ణకఠోరంగా ఈ ఇంగ్లీషేంటి ? అది కనీసం మనల్ని ప్రేమగా చూసుకున్నవాళ్ళ భాషైనా కాదు.

మనం ఇలా మన భాషల స్థానంలో అవి ఎక్కడుంటే అక్కడల్లా వాటిని ఎత్తి అవతల పారేసి అతికినా అతక్కపోయినా ఇంగ్లీషుని ప్రతిష్ఠిస్తున్నాం. తద్ద్వారా మనం చరిత్రలో మన ఉనికినీ, మన పూర్వీకుల ఉనికినీ రద్దు చేసిపారేస్తున్నాం. తెల్లవాళ్ళ చేతుల్లో నశించిపోయిన ఎన్నో ఆఫ్రికన్, అమెరికన్ తెగల దారిలో మనం నడుస్తున్నాం, మహోజ్జ్వలమైన చరిత్రా, సంస్కృతీ ఉండీ కూడా ! ఇంతమందిమి ఉండీ మనం ఒక భాషాజాతిగా నిష్కారణంగా అనవసరంగా ఎవరూ మనల్ని చంపకుండానే అంతరించిపోతున్నాం. కాదు, విదేశీ భాషావ్యామోహంతో మనల్ని మనమే అంతం చేసుకుంటున్నాం. ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఇలా కొనసాగితే భావితరాలకి మనం దొఱక్కుండా పోతాం. మన పేర్లు, మన పూర్వీకుల పేర్లూ వినిపించవు. మన ఘనతలు కనిపించవు. ఇంగ్లీషే కనిపిస్తుంది. ఇంగ్లండే వినిపిస్తుంది. భవిష్యత్తులో ప్రతిదానికీ మూలాలు తెల్లవాళ్ళలోనే వెతకబడతాయి. ఆంధ్రా తెలియదు. ఆంధ్రుల గొప్పతనం తెలియదు. అసలు మనమంటూ మనుషులం ఉన్నామని కూడా భావితరాలకి ఎఱుక కలిగే అవకాశం లేదు.

ఈ దేశంలోంచి ఇంగ్లీషువాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళదైన ప్రతిదాన్నీ ఆబగా అప్యాయంగా కావిలించుకున్న ఈ మానసిక బానిసల జాతికి స్వాతంత్ర్యం ఎందులోనో, దేనికో నా కర్థం కావడంలేదు. మనకీ కుహనా స్వాతంత్ర్యం లేనిరోజుల్లోనే మనం సరైన మార్గంలో ఉన్నట్లు కనిపిస్తున్నది.

(కలగూరగంప బ్లాగునుంచి)

4, జనవరి 2012, బుధవారం

హోటళ్ళ సంస్కృతికి ప్రత్యామ్నాయం అవసరం

హైదరాబాదులో ఆదివారం రోజున బయటికి రావాలంటే భయం. మిహతా వారాల్లో కంటే ఆదివారం పూట వాహనాల రద్దీ జాస్తి. రోడ్డు మీద మనల్ని పద్మవ్యూహం లా చుట్టుముట్టే ప్రతివాహనం మీదా ముందుసీట్లో ఒక మగవాడు, వెనకసీట్లో మహిళ(లు). ఇది ఆ రోజు సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యం. "ఆదివారం పూటే ఎందుకిలా ?" అనడిగితే చాలా ఉంది చెప్పడానికి. పాపం, ఆ మగవాళ్ళు "కనీసం ఆదివారమన్నా కాస్త ఆలస్యంగా నిద్రలేద్దాం. క్యాంటీన్ వంటని ఒక్కరోజైనా మర్చిపోయి ఇంటివంట రుచిచూద్దాం. భార్యాబిడ్డలతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం, క్యారమ్సూ, ఛెస్సూ ఆడుకుందాం. చాలా కాలంగా చదవాలని ముచ్చటపడి కొనుక్కున్న పుస్తకాన్ని కనీసం ఈ వారమైనా తెఱిచి చూద్దాం." అని ఏవేవో ఊహలతో ఉంటారు. కానీ ఆ రోజు కూడా వాళ్ళని ప్రశాంతంగా ఒకపూట నిద్రపోనివ్వరు పూర్తికాలిక గృహిణులైన ఆ భార్యలు. "నన్ను బయటికి తీసుకెళతావా ? ఛస్తావా ? నాకు అలా తిరిగి రావాలనుంది" అని బలవంతంగా భర్తల్ని బయటికి బయల్దేఱదీస్తారు. "రోజూ అన్నిచోట్లకూ తిరిగీ తిరిగీ నాకు విసుగొచ్చింది" అని అనదల్చుకున్న ఆ భర్త మాటలు గుండె గొంతుకలోన కొట్లాడినట్లు లోలోపలే అణిగిపోతాయి. ఆ రోజుకిహ ఆ ఇంట్లో వంట ఉండదు. సినిమా మల్టిప్లెక్సు, షాపింగు మల్టిప్లెక్సు, భోజనం మల్టిప్లెక్సు, కాలకృత్యాలు కూడా మల్టిప్లెక్సు.. ఇంటికొచ్చాక బి-కాంప్లెక్సు.


మనకు మన మనుషులు మధురస్మృతులు కావడం మానేసి హోటళ్ళు, సినిమాహాళ్ళూ, ప్లాస్టిక్ చెత్తతో నిండిన పార్కులూ, వాహనరద్దీలూ, పొగలూ, దుమ్మూ, ధూళీ, కాలుష్యం - ఇవన్నీ మధురస్మృతులుగా పరిణమించడం విచారకరం. ఈ రకమైన గృహ అశాంతికి ఒక కారణం - హోటల్ భోజనాలు ఇంట్లో భోజనాల కంటే బావుంటాయనే వృథాభ్రాంతి. అలా ఖర్చుపెట్టడం దర్జా అనే మఱో భ్రాంతి. దాన్ని విశ్రాంతిగా భావిస్తూ, ఒక sense of wellbeing ని అనుభూతి చెందాలని ప్రయత్నించే అమాయకత్వం. ఇది ఎక్కువభాగం వారపత్రికల్లో సీరియళ్ళు చదవడం వల్లా, టీవీలలో సీరియళ్ళు చూడ్డం వల్లా మన కుటుంబాల మీద పడ్డ ప్రతీప ప్రభావం. అదే సమయంలో ధనిక, ఎగువ మధ్యతరగతి జీవనశైలిని అనుభూతి చెందాలనే ఉత్సుకత. సరే, అది ప్రస్తావనాంతరం.


ప్రయాణంలో ఆచారం అర్ధభాగమే అన్నారు పెద్దలు. కనుక ప్రయాణంలో ఉన్నప్పుడు హోటళ్ళ దగ్గఱ రాజీపడొచ్చు. తప్పులేదు. కానీ ఉన్న ఊళ్ళోనే ఉంటూ ఈ అనాచారాలేంటి ? హోటళ్ళు హోటళ్ళుగా ఉండడం మానేసి అవి హిందూజాతికి దేవాలయాలతో సమానమైన ప్రాముఖ్యం గల సంస్థలుగా మారడం చాలా బాధ కలిగిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం ఒకాయన ఉత్తరాది నుంచి దిగొచ్చి హైదరాబాదు చందానగర్ లో ఒక హోటల్లో మకాం పెట్టాడు "జ్యోతిష్యం చెప్పబడును" అంటూ ! హోటల్ లో మకాం పెట్టి వైద్యం చేసేవారి గుఱించి విన్నాం. జ్యోతిష్యం చెప్పేవారు కూడా ఉన్నారని తెలియడం అదే మొదటిసారి.


అదే విధంగా ఈ మధ్య హోటళ్ళలో పెళ్ళిళ్ళు, గర్భాధానాలూ, ఉపనయనాలూ చేయడం గుఱించి వింటున్నాను. ఇందుకు బ్రాహ్మణులు ఎలా అనుమతిస్తున్నారో నాకు తెలియదు. ఎలా చూసుకున్నా సరే, అవి ఎంత ఖరీదైన హోటళ్ళయినా సరే, హోటళ్ళు పవిత్రమైన ప్రదేశాలు మాత్రం కావు. అక్కడ నానాజాతులవారూ, నానా చిత్ర (చెత్త) అలవాట్లవారూ బసచేస్తారు. అక్కడ కొందఱు జనం బాత్‌రూములకీ, టాయిలెట్లకీ వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కోకుండా తిరిగేస్తూ ఉంటారు. అవి అనేక నీచ కార్యకలాపాలకు నిలయాలు. రౌడీలూ, గూండాలూ అక్కడ గదులు తీసుకొని "ఎవఱిని లేపెయ్యాలా ?" అని హింసాత్మక సమాలోచనలు చేస్తారు. భారీ లంచాల డీలింగులు కూడా అక్కడ కుదుర్చుకుంటూ ఉంటారు. అక్కడి సమావేశ మందిరాలలో తఱచుగా మందుపార్టీలు జఱుగుతుంటాయి. పిలుపుబాలికలు చాలా తఱచుగా హోటళ్ళని సందర్శిస్తూంటారు. అలాంటిచోట్ల కూర్చుని "గణానాం త్వా గణపతిం హవామహే, కవిం కవీనాం.." అని దేవతల్ని ఆవాహన చేస్తే వారు వస్తారా ? మన నైవేద్యాలు స్వీకరిస్తారా ? మన క్రతువుల్ని సఫలం చేస్తారా ? ఎవఱెవఱో, ఎందఱెందఱో ఎక్కితొక్కిన పరాయి ముఱికిమంచాల మీద మన గర్భాధాన మహోత్సవాలు జఱుపుకోవడంలోని వెగటునీ, అసహ్యాన్ని ఈ హిందూజాతి అనుభూతి చెందడం లేదేమీ ? మన మతధర్మ స్పృహనీ, మనో సున్నితత్వాల్ని మొఱటుబార్చి మనల్ని ఇలా మనుషుల స్థాయి నుంచి పందుల స్థాయికి దిగజార్చినదెవఱు ?


ఈ వెధవపని చేస్తున్నది మనం (హిందువులం) మాత్రమేననీ, ఇతరమతాలవారు ఇప్పటికీ తమ యొక్క సకలసబ్బండు కర్మల్నీ, సంస్కారాల్నీ తమ ప్రార్థనాలయాల్లోనే నిర్వహిస్తున్నారనీ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం. ఇంట్లో వివాహం కుదఱకపోతే కల్యాణమండపాలన్నారు. సమ్మతించాం. ఇంట్లో ఆబ్దికాలు కుదఱకపోతే అవి జఱిపించే బ్రాహ్మల ఇళ్ళకే వెళుతున్నామన్నారు. తల పంకించాం. పెళ్ళిముహూర్తానికి రాలేనివాళ్ళ కోసం హోటల్లో వారిని కలుసుకునే కార్యక్రమం (రిసెప్షన్) ఏర్పాటు చేశామన్నారు. కానీ అలా మెట్టుమెట్టూ దిగిపోతూ - ఈరోజు మఱీ అంకఛండాలంగా హోటళ్ళలో పెళ్ళిళ్ళూ, గర్భాధానాలూ, ఉపనయనాలూ, బ్రహ్మోపదేశాలూ ఏంటి బాబూ ? హోటళ్ళేమైనా దేవాలయాలా ?


వైదిక/ శ్రౌత/స్మార్త క్రియల నిర్వహణకు సరైన కాలమూ, దేశమూ అవసరం అన్నారు పెద్దలు. యోగాభ్యాసానిక్కూడా సరైన కాలమూ, దేశమూ అవసరమని హఠయోగప్రదీపికలోను, భగవద్గీతలోను చెప్పబడింది. కానీ హోటళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను ఆ శ్రేణిలో చేఱవు. పూటకూళ్ళ కొంపల్లో గదులు అద్దెకు తీసుకొని శ్రౌతమూ, స్మార్తమూ నిర్వహించుకో వలసినదని ఏ ధర్మశాస్త్రమూ అనుశాసించి ఉండలేదు.


"గ్రాండ్ కాకతీయలో ఉపనయనము చేసికొనుము"

"హోటల్ వైస్రాయ్ లో పెండ్లి చేసుకొనుము."

"కృష్ణా ఓబెరాయ్ లో శోభనము జఱుపుకొనుము"

"అనేక బ్యాంకుల్ని యథాశక్తి ముంచి రాజీవ్ రెడ్డిగారు నిర్వహిస్తున్న ఖరీదైన కంట్రీక్లబ్ లో నీ తండ్రికి తద్దినము పెట్టుము"


అని ఏ గ్రంథంలోను వ్రాసిలేదు. ఒకవేళ మన ఇళ్ళలో ఈ క్రియల్ని నిర్వహించుకోవడం అధునాతన జీవనశైలిలో ఏ కారణం చేతనైనా వీలుపడకపోతే, హిందువులమంతా కలిసి ప్రతి ఊళ్ళోను వాటి కోసం ప్రత్యేక భవనాలు కట్టుకుందాం. అంతే తప్ప ఈ హోటళ్ళ వ్యామోహంతో తరతరాల పవిత్ర సంప్రదాయాన్ని భ్రష్టుపట్టించరాదు.

2, జనవరి 2012, సోమవారం

సనాతనధర్మానికి ప్రమాదం లేదు

మనలో చాలామంది ఆందోళన చెందేది - మతమార్పుల వల్ల హిందూధర్మం కాలగర్భంలో కలుస్తుందేమోనని ! ప్రజాస్వామ్యయుగంలో ప్రజలెక్కువమంది దేనికి జై కొడితే అదే నిలుస్తుందనీ, కనుక హిందువుల సంఖ్య తగ్గితే హిందూధర్మం నశించిపోయినట్లేననీ భావించే భయభ్రాంతిపూరితభావనే ఇందుక్కారణం. ఇది పాక్షికంగా మాత్రమే వాస్తవం. ’పాక్షికంగా” అని ఎందుకంటున్నానంటే హిందూధర్మం చుట్టూ ఏర్పడిన అనంతరకాలీన ఉపరితల నిర్మాణాల్ని (super structures of later times) ని మాత్రమే మతమార్పులు కూలగొట్ట గలవు. మూలహిందూధర్మాన్ని మాత్రం ఏమీ చేయజాలవు. ఉపరితల నిర్మాణాలంటే మన సంగీతం, సాహిత్యం మొ||


కానీ మూలహిందూధర్మం నశించిపోవడం జఱగదు. ఎందుకంటే హిందూధర్మం జనసంఖ్య మీద ఆధారపడినది కాదు. దీన్ని ప్రత్యేకంగా "సనాతనధర్మం" అని పిలవడానికీ, మిగతా వన్నీ కేవలం "మతాలు" (cults) మాత్రమే అవడానికీ గల కారణం ఇది. ఈ "మతాలు" కలిపురుషవిజృంభణలో భాగంగా కొత్తగా ఉప్పతిల్లినటువంటివి. పురాణాలలో చెప్పినట్లు, అల్పజ్ఞానులూ, అల్పమేధస్కులూ, అల్పాయుష్కులూ, శిశ్నోదరపరాయణులూ అయిన కలికాలపు హీనజనం యొక్క సంస్కారానికీ, అవసరాలకూ అనుగుణంగా భగవంతుడు ఆధ్యాత్మికతాకషాయాన్ని బాగా నీళ్ళుపోసి పల్చబార్చి భూలోకంలోకి పంపినటువంటివి. అంటే ఈ సంకుచితమతాలకొక తాత్కాలికమైన చారిత్రిక పాత్ర ఉన్నది. ఆ పాత్ర ప్రయోజనం నెఱవేఱగానే వాటంతట అవే కాలగర్భంలో కలిసిపోతాయి.


ఈ విషయాన్ని మనం కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీపాద శ్రీవల్లభుల జీవితచరిత్రలో ఇలా ఉంది. దత్తాత్రేయస్వాములవారి ఆజ్ఞానుసారం శంకరభట్టు సంస్కృతంలో శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర వ్రాశాడు. దానికున్న రెండుప్రతులలో ఒకదాన్ని సిద్ధులూ, గంధర్వులూ తీసుకెళ్ళిపోగా ఒక ప్రతి మట్టుకు పశ్చిమగోదావరిజిల్లా భీమవరానికి చెందిన మల్లాదివారింట్లో ఉన్నది. శ్రీమాన్ మల్లాది గోవిందదీక్షితులు తల్లివైపునుంచి శ్రీపాద శ్రీవల్లభుల వంశానికి చెందినవారు. వారు మళ్ళీ దత్తాజ్ఞ ననుసరించి ఆ పుస్తకాన్ని కొద్ది సంవత్సరాల క్రితం తెలుగులోకి అనువదించారు. అనూచానంగా వచ్చిన మూలసంస్కృత ప్రతిని కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. కలియుగం గడిచిపోయి సత్యయుగం వచ్చిన తరువాత సంస్కృతప్రతిని సిద్ధులు మళ్ళీ భూలోకానికి తీసుకొస్తారని వ్రాశారు.


రెండో ఆధారాన్ని వాగ్గేయకారశిరోమణి శ్రీ త్యాగరాజు జీవితంలో చూడవచ్చు. నారదమహర్షి సంగీతం మీద ఒక పుస్తకం వ్రాశారనీ, అది అంతరించిపోయిందనీ విని త్యాగరాజుగారు బాధపడ్డారు. కానీ ఆ తరువాతికాలంలో నారదమహర్షే ఆయనకు స్వయంగా దర్శనమిచ్చి ఆ సంగీతగ్రంథంలోని రహస్యాల్ని బోధించారు. ఆ గ్రంథం భౌతికంగా జనాల పఠనపాఠనాల్లోంచి తొలగిపోయింది. కానీ దాన్ని రచించిన నారదమహర్షి మాత్రం ఇప్పటికీ ఉన్నారు.


మూడో ఆధారాన్ని విద్యారణ్యస్వాములవారి జీవితచరిత్రలోంచి గ్రహించవచ్చు. శ్రీ వేదవ్యాస మహర్షులవారు కాశీలో రోజూ పొద్దుపొడవకముందే మారువేషంలో గంగానదిలో స్నానానికి వస్తారని ఆయన విన్నాడట. రాత్రంతా నిద్రకాచి తెల్లవారుఝామున అక్కడికి నాలుగు కుక్కలతో వచ్చిన మాలవాడే వేదవ్యాసుడని గ్రహించి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడట. ఆ మాలాయన తనను కసిరినా, తన్నినా, తోసినా, బండబూతులు తిట్టినా విద్యారణ్యుల వారు వదల్లేదట. అప్పు డాయన సంతోషించి తన నిజస్వరూపంతో విద్యారణ్యస్వాములవారికి దర్శనమిచ్చాడట.


నాలుగో ఆధారం - నా స్వానుభవం. నాచేత అమ్మవారు కొన్ని మంత్రాలు చదివించారు. ఆవిడ ఉపదేశిస్తూంటే నేను పలికాను. కానీ చిత్రమేంటంటే ఆ మంత్రాల్ని నేనప్పటి వఱకూ ఎక్కడా వినలేదు, కనలేదు, చదవలేదు. అవి ఉన్నట్లు నాకే కాదు, ఇతరులక్కూడా తెలియదు. ఇవి ఎక్కడివో, ఏనాటివో, ఏ ఋషి దర్శించినవో !!


అంటే ఈ హిందూమంత్రాలూ, శాస్త్రాలూ, ఉపాసనాపద్ధతులూ అన్నీ వాటివాటి అధిష్ఠాన దేవతల చేతా, సిద్ధపురుషుల చేతా, గోత్రఋషుల చేతా భద్రంగా కాపాడబడుతున్నాయి. ఈరోజున బజారులో దొఱక్కపోయినంతమాత్రాన అవేమీ నశించిపోలేదు. ఎప్పటికీ నశించవు కూడా. వాటిని నేర్చుకోవడానికి అర్హులైన ఉపాసకులు లేక వారు వాటిని బహిరంగపఱచడం లేదు. ఈ కలిదోషం పూర్తిగా నివర్తించాలనే వారూ ఎదుఱుచూస్తున్నారు. కానీ మఱో 400 - 500 సంవత్సరాలకు గానీ ఆ శుభదినం రాకపోవచ్చు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి