11, జులై 2013, గురువారం

హరినామ మహిమ


ఒకానొక రోజున కాశీ మిశ్రుని భవనములో వేంచేసి ఉన్న శ్రీ చైతన్య మహాప్రభువును కృష్ణ దాసు అను ఒక భక్తుడు బ్రహ్మాది దేవతలకు గూడ గోచరముకాని కృష్ణ నామ మహిమను గురించి చెప్ప వలసినదిగా కోరెనుఅపుడు శ్రీమన్మహా ప్రభువు ఇట్లు వివరించెను.

క్రిష్ణదాసా! కృష్ణ నామ మహిమ అపారమైనది నామ ప్రభావమును గూర్చి క్రిష్ణునికే తెలియదనినను అతిశయోక్తి కానేరదు. ఐనను నామ మహిమను గురించి అనేక శాస్త్రములలో నేను గ్రహించిన దానిని నీకు చెప్పెదనుదీనిని విశ్వాసముతో శ్రద్దగా వినుముఫలితముగా నీవు ఘోర సంసార సముద్రము నుండి తరించగలవు.

హరినామమును ఉచ్చరించుట వలన సమస్త పాపములు తొలగిపోవునుఅన్ని రకముల వ్యాధులు నిర్మూలనమగునుసమస్త దుఃఖములు సమసిపోవునుఆకలి బాధ క్షీణించునునరకములో నున్న వారు గూడ శీఘ్రముగా తరింతురు.   ప్రారబ్ద కర్మము ఖండింప బడునుసమస్త అపరాధములు క్షీణించును.

దాన, వ్రత, హోమాది సమస్త కర్మలు నామమునే ఆశ్రయించును.   వేదములన్నిటియందు సారభూతమై సూర్యుని వలె ప్రకాశించునది నామమేసమస్త పుణ్య తీర్ధముల (ఫలితము) కంటే నామము సర్వోత్క్రుష్టమని సమస్త శాస్త్రములు ఘోషించుచున్నవి.   సమస్త శుభకర్మలు నామముపై ఆధారపడి యున్నవిఐనను వాటి అన్నిటికంటే ఉత్తమ ఫలితమును ఒక్క నామమే ఒసంగునుభగవంతుని సర్వ శక్తులు నామము నందు ఇమిడి యున్నవిసమస్త జీవరాసులకు ఆనందము నిచ్చునది భగవన్నామమొక్కటేశ్రద్ధతో హరినామమును కీర్తించినవారు జగత్తులో పూజనీయులుదిక్కులేని వారికి నామమే దిక్కుపతితులను గూడ పావనులనుగా జేయు సామర్ధ్యము నామమునకు గలదు.

కృష్ణ నామమును సర్వకాల సర్వావస్తల యందు కీర్తించు వారు నామ సంకీర్తన వలననే ముక్తిని పొందుదురుమరియు వారికి వైకుంఠ ధామములో నిరంతరము హరిని కీర్తించు భాగ్యము, భగవత్ప్రీతియు కలుగునుస్వయముగా నామమే పురుషార్ధములనిచ్చునుభక్తి  అంగములలో నామము ప్రధానమైనదని శృతి, స్మృతి, శాస్త్రములు చెప్పుచున్నవి.  


దీనికి అసంఖ్యాకములైన ప్రమాణములు గలవు.
--

నామము సర్వ పాపములను వినాశనము చేయును:

1.
అయం హి కృత నిర్వేశో జన్మకోట్యంహసామపి
  
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః (భాగవతము 6-2-7) 

సమస్త పాపములను నశింపజేయుటయే నామము యొక్క ప్రప్రథమ ధర్మముదానికి ప్రమాణం ఏమనగా - అజామిళుడు అవసానకాలమందు "నారాయణ" శబ్దము ముమ్మారు ఉచ్చరించి కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది భగవత్సాన్నిధ్యము జేరెను.
సమస్త వ్రతములకంటే నామము ఉఛ్ఛమమైనది.

2.
నిష్క్రుతై రుదితై: బ్రహ్మ వాదిభి
  
స్తథా విశుధ్యత్యఘవాన్ వ్రాతాదిభి:
  
యథా హరేర్నామ పదైరుదాహృతై
  
సదుత్తమః శ్లోక గుణోపలంభకం (భాగవతము 6-2-11)
చాన్ద్రాయణాది వ్రతములు పాపాత్ములను పాపముల నుండి శాస్త్రములలో చెప్పిన రీతిని తరింప జేయలేవుఏలననగా, తాత్కాలిక వ్రతాదుల వలన పాప వాసన, పాప భీజము నశింపవుకాని కృష్ణ నామమును ఉచ్చరించుట వలన పూర్వక్రుత పాపమే గాక, పాపమునకు మూలకారణమగు అవిద్య గూడ తొలగి పోవునుసమస్త పాపములనుండి రక్షించి ముక్తి నొసంగునది నామమే కావున దీనికి మించిన వ్రతము వేరొకటి లేదు.
సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)



గోవింద కీర్తనమనేది అగ్ని జీవుల యొక్క భూత భవిష్యద్ వర్తమానముల పాపములనన్నిటిని అనాయాసముగా దహించి వేయును.  కావున కలియుగములో నామము కంటే జీవులకు బంధువు లేరు (లఘు భాగవతము).

ఈ భూలోకమున నిరంతరము సజ్జనులను పీడించు ద్రోహ చింతన గలిగిన వారు గూడ సదా హరికీర్తన వలన పవిత్రులై ధన్యులగుదురు
(లఘు భాగవతము).

శాస్త్రములలో లెక్కలేనన్ని ప్రాయశ్చిత్తములు చెప్పబడి యున్నవి.  కాని అవి ఏవియు కృష్ణ నామ కీర్తనమునకు సమము కానేరవు. (కూర్మ పురాణము)

ఏ పాపియు గూడ చేయలేనంతటి పాపమును గూడ హరింప జేయ గల శక్తి నామమునకుఉన్నది .  భగవన్నామ మహిమ అంతటిది.  అనగా నామము ఎంతటి పాపమునైనాను తుడిచి వేయునని అర్ధము.

(కూర్మ పురాణము)

ఎవరు అచ్యుత, గోవింద, మధుసూదన యని భగవంతుని నామమును ఆర్తితో ఉచ్చరించుదురో వారి సర్వ రోగములు (శారీరక, మానసిక) నశింప బడును.  ఇది ముమ్మాటికీ సత్యము (బృహద్ నారదీయము).

మహాపాతకుడైనను అహర్నిశము జగదీశ్వరుడగు హరిని  కీర్తించిన యెడల అంతః శుద్ధి గలిగి సజ్జన సాంగత్యమునకు యోగ్యత కలుగును(బ్రహ్మాండ పురాణము).

మహావ్యాధి పీదితుడైన వాడు, రాజదండనము అనుభవించువాడు 'నారాయణ' అని ఆర్తితో నుచ్చరించినచో వారు ఆయా బాధల నుండి తత్ క్షణము విముక్తులగుదురు (వహ్ని పురాణము).

నిరంతరము హరినామ కీర్తనము చేయువారికి సర్వరోగములు; క్లేశములు; సర్వ ఉపద్రవములు; సర్వ అరిష్టములు తొలగిపోవును (బృహద్ విష్ణు పురాణము).

సూర్యుడు అంధకారమును, ప్రబలమగు వాయువు మేఘములను దూరీభూతము చేయునట్లు అనంతుడైన భగవంతుని నామమును ఆశ్రయించిన వారికి (అనగా శ్రవణ, కీర్తనము చేయు వారికి) వ్యసన రూప దుఃఖములన్నియు పటాపంచలగును.  (భాగవతము 12-12-48)

కష్టము వచ్చినపుడు, మనో వ్యాకులత ఏర్పడినపుడు, పతనమొందినపుడు, భయము కలిగినపుడు, ఘోరమైన వ్యాధి పీడితుడై దానికి నివారణోపాయము లేనపుడు "నారాయణ" శబ్దము నొక్కసారి కీర్తించినచో సమస్త దుఃఖములనుండి విముక్తులై సుఖశాంతులను పొందగలరు (విష్ణు ధర్మోత్తరము).



 సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)
ప్రాపంచిక ఫలితములనాశించి గాని ఇతరులను హేళన చేయు ఉద్దేశ్యముతో గాని, గానము చేయవలెనని గాని, ఆశ్రద్ధతో గాని వైకుంఠుని నామమును ఎవరు ఆశ్రయించుదురో, వారి అశేష పాపములు హరింపబడును.  ఈ విషయమును శాస్త్రవేత్తలగు భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు.

పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప్త ఆహతః
హరిరిత్యవశే నాహ పుమాన్ నార్హతి యాతనాః (భాగవతము 6-2-15)
పైనుండి క్రింద పడినపుడు గాని, నడచుచు జారినపుడు గాని, శరీరమునకు గాయము తగిలినపుడు గాని, సర్పాది క్రూర జంతువుల వలన హాని కలిగినపుడు గాని, రోగపీడితుడైనపుడు లేదా ఇతరులు శిక్షించినపుడు గాని ఎవరు కృష్ణ, హరి, నారాయణ అను నామములను ఉచ్చరించుదురో వారికి ఎన్నడును నరక బాధ కలుగదు.

అజ్ఞానా దథవా జ్ఞానాదుత్తమః శ్లోకనామ యత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథా 2నలః (భాగవతము 6-2-18)
అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే  ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును. 

8, జులై 2013, సోమవారం

తిథి నిర్ణయంలో సందేహం--సమాధానం

నమస్కారమ్

తిధి నిర్ణయం ఎలా జరుగుతుందో వివరించగలరు

 రోజు (19th July 2013) ఏకాదశి తిధి కదా. కానీ ఒక సంప్రదాయం ప్రకారం ఏకాదశి రేపు అని అన్నారు. దానితోనాకు  సన్దీహమ్ కలిగినది

అలాగే తది ద్వయం విషయమై కుడా ప్రస్తావించ మనవి

(please mention if any reference available on this topic) 
 .....................................................................................................................................

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
కించిత్ ఆలస్యంగా స్పందిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఈ తిథి సంబంధ విషయమైన చర్చలు, ఏకాదశి గురించి ఇతః పూర్వం ఇక్కడ చర్చలు జరిగాయి.
మనకి కాలాన్ని గణించడానికి సౌరమానం, చాంద్రమానం, బ్రాహస్పత్యం అని ఉన్నాయి ఒకటి సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని, మరొకటి చంద్ర గమనాన్ని ఆధారం చేసుకొని మరొకటి గురు గ్రహ గమనాన్ని ఆధారం చేసుకొని. ఐతే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు ఆ తిథి అన్నది అందరికీ తెలిసిందే. ఐతే ఆయా తిథుల్లో చేసే విశేష కార్యక్రమము లేదే ఆ నైమిత్తిక తిథిని ఎలా జరుపుకోవాలన్నది కల్పంలో కానీ, ఇతర శాస్త్ర గ్రంథాలు, పురాణాదులలో ఉంటుంది. అపర కర్మలకి మధ్యాహ్నం పూటకి తిథి ఎక్కువగా వ్యాపించి ఉన్న రోజుని ఎంచుకున్నట్లే కొన్ని కొన్ని తిథులలో చేయవలసిన విశేష కార్యం ఆ రోజు ఆ తిథి ఎంత సేపు ఉన్నది ఏ కాలంలో ఉన్నదీ చూస్తారు.

సూర్యోదయానికి రెండు / మూడు ఘడియలు దశమితో కూడిన ఏకాదశిని వర్జిస్తారు. తిథి విద్ధ/విద్ధం అంటారు ఆ రోజు వ్రతం చేసినా ఆ ఫలితాన్ని ఇవ్వరు. దానికన్నా ద్వాదశితో కలిసి ఉన్న ఏకాదశి వ్రతం చేయమని చెప్తారు. దీనికి సంబంధించి పురాణ ఉప ఆఖ్యానాలు కూడా ఉన్నాయి. ఏకాదశీ తిథినిర్ణయం అని నిర్ణయ సింధు, ధర్మ సింధులాంటి గ్రంథాలలో ప్రత్యేకంగా వ్రాయబడింది పూర్తి వివరాలకు అవి చూడగలరు.

అలాగే కొన్ని వ్రతాలు నక్త వ్రతాలుంటాయి, వినాయక చవితి, సత్య నారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతం వంటివి నక్త వ్రతాలు. అంటే ఉదయం నుండీ దీక్షితుడై ఉపవసించి ఆ క్రతువుకు కావలసిన సంబారాలనేర్పరుచుకొని సాయంత్రం పూట ఈ వ్రతాలనాచరించాలి. కాబట్టి వినాయక చవితి సాయంత్రం ఏరోజు ఉంటే ఆసమయంలో వ్రతం చేయాలి కానీ ప్రస్తుతం ఉదయం పూట చవితిని చూసేసి చేసుకుంటున్నాం. ఒక్క కేదారేశ్వర వ్రతం ఒక్కటీ సాయంత్రం జరుగుతున్నట్లుంది చాలా చోట్ల. సత్యనారాయణ వ్రతం కూడా కొందరిళ్ళలో ఇంకా సాయంత్రాలే చేస్తున్నారు అదే పద్ధతి, కథలో కూడా అలాగే చేయాలని ఉంది.

సూక్ష్మంగా మీరడిగిన ప్రశ్నకు

సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథే ఆనాటి తిథి ఐతే ఏకాదశి వ్రతానికి ఉదాహరణకి ఉదయం 5-6 మధ్యలో దశమి వెళ్ళి6.15కి ఏకాదశి వచ్చిందనుక్కోండి ఆనాడు ఏకాదశి వ్రతానికి పనికిరాదన్నమాట.
నైమిత్తిక కర్మాచరణకు ఏ విధంగా చేయాలో శాస్త్రం చెప్పినట్లుగా చేసుకోవాలి

సంపూర్ణ ఏకాదశీ యత్ర ప్రభాతే కించిదేవసా
తత్ర ఉపోష్యా ద్వితీయాచ పరాచేద్యది వర్థతే!!

బ్రహ్మ వైవర్త పురాణంలో ఇలా చెప్పారు సంపూర్ణంగా ఒకరోజు ఏకాదశి తిథి ఉండి మరునాడు కొద్దిగా ఏకాదశి తిథిఉంటే రెండవ నాడే ఉపవాసం చేయాలి. అయితే ద్వాదశి తిథి వ్యాప్తిచెంది ఉండాలి, అంటే ఉపవాసం చేసిన నాటికిమర్నాడు ద్వాదశి తిథి వుండాలి.

షష్ఠి దండాత్మికా యత్ర ప్రభాతే  తిథి త్రయం
కుర్వంతి గృహిణి: పూర్వం చైవ యత్యాదయ: తథా!!
ఒక సూర్యోదయం నుండి మరొక సూర్యోదయం వరకు కల 60 ఘడియల కాలంలో తిథి త్రయం (దశమి సఏకాదశిసద్వాదశి) ఉన్నప్పుడు  సూర్యోదయ సమయంలో ద్వాదశి తిథి ఉందో దానికన్న ముందున్న రోజే గృహస్థులును,సన్యాసులు/యతీశ్వరులును ఉపవాసం చేయాలి.

28, జూన్ 2013, శుక్రవారం

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు

  • - డాక్టర్ కందుకూరి శివానందమూర్తి
  • 27/06/2013
................... కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యాత్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపోవడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. .................... గడచిన వారం రోజులలో హిమాలయాలలోని కేదార యాత్రీకుల ఆపదలు చాలా తెలుసుకున్నాం. ఈనాటికి ఐదువేల మంది చనిపోయారని తెలుస్తున్నది. సుమారు ఎనభైరెండువేల మంది ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో క్షే మంగా రక్షింపబడ్డారు. చాలామంది ఇళ్ళకి చేరుకున్నారు. దాదాపు అక్కడ ఇరుక్కున్న వారందరూ రక్షింపబడినట్టే. నేడో రేపో ఆ మిగతా పని కూడా పూర్తి అవుతుంది. భారతీయ వాయుసేన యంత్రాంగం ఆరు రోజులలో చాలా గొప్ప సేవ చేసింది. ఈ సంఘటనపైన ఎన్నో రకాల వ్యాఖ్యలు సహజంగా వినబడుతున్నాయ. అసలు ఈ మతం నమ్మకంతో ఇంతమంది అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళాలి? ఇదంతా కేవలం మూఢనమ్మకం వల్ల వచ్చి న ఆపద కాదా..? ఇదొకరకం విమర్శ! ఇలాంటి నమ్మకాలు లేకపోతే ఇంతమంది పోయుండేవారు కాదుకదా..అని మరో వ్యాఖ్యానం. మనం గొప్ప నాగరికతతో తయారుచేసుకున్న రోడ్లపైన దేశం మొత్తం మీద పది రోజులకొకసారి ఐదువేల మంది పోతూ ఉండవచ్చు. దానికి ఏ విశ్వాసము కారణము కాదు. కేవలం మన నాగరికతలోని అనాగరికతే కారణం! మన సాంకేతిక విద్యకి పరాకాష్టగా నిర్మించిన ‘టైటానిక్’ అనే ప్రయాణికుల నౌకకి పట్టిన గతికి ఎవరు బాధ్యులు? మరొక్క రోజు ప్రయా ణం క్షేమంగా సాగితే ఆ పధ్నాలుగు వం దల మంది మహా వైభవంగా ఉత్సవం చేసుకుని ఉండేవారు. ఇలాంటివి ఎన్నో! మన భారతదేశంలో ఏ క్షణంలో లెక్క చూసినా సుమారు 15 కోట్ల మంది భక్తులు దేవాలయాలలో, క్షేత్రాలలో, మఠాలలో ఉంటూ ఉంటారు. వీరందరిలో 99 శాతం క్షేమంగా తిరిగి వస్తున్నారు. ప్రమాదాలెన్ని జరిగినా ప్రజల విశ్వాసం మాత్రం ఏమీ తగ్గదు. మానవ జీవితంలో వ్యక్తికి, సంఘానికి కూడా శుభాశుభాలు, అనుకోని ఆపదలు అక్కడక్కడ కలుగుతూనే ఉంటాయి. దానివల్ల జీవన స్రవంతి ఆగకుండా సాగుతూనే ఉంటుంది. కేదారయాత్ర విషయంలో ఆలోచిస్తే అక్కడ జరిగిన ప్రకృతి బీభత్సంలో ఎనభై రెండు వేల మంది క్షే మంగా తిరిగి రావడం చాలా గొప్ప విష యం. ప్రకృతియొక్క ఆగ్రహం కంటే భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఎక్కు వే ఉంది. ఇటువంటి సంఘటనలకు ఏదో కారణం వెతకనే కూడదు. ఆవిధంగా ఎంత తిప్పలు పడ్డా సరియైన కారణం దొరకదు. కానీ ఓ దుర్మార్గుడు బాంబు పేల్చి ఒక వందమందిని చంపడంలో కారణం ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ విధంగా కారణం తెలిసిన చోట ఒక కర్తవ్యం ఉంటుంది. మృ తులు పదిమందైనా, వందమందైనా కానీ చాలా విచారకరమే. కానీ ఆపదయొక్క పరిమాణాన్నిబట్టి నష్టాన్ని అవగాహన చేసుకోవలసి ఉంటుంది. కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యా త్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపో వడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళిమొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. ఆవిధంగా మొక్కులు చెల్లించుకునే క్షేత్రాలు దేశం లోపలే అనేక సంఖ్యలో ఉన్నాయి. కేదారయాత్ర చరిత్రలో - పంచపాండవులు ద్రౌపదీదేవితో కలిసి పాదచారులై కేదారానికి మహాప్రస్థానం వెళ్ళారని మహాభారతం వర్ణిస్తోంది. ఆ ఆలయంలో పంచపాండవుల మూర్తులు కూడా ఉన్నాయి. ఆ యా త్రలో ఎటువంటి సౌకర్యాలు అమర్చుకోకుండా ఈశ్వరధ్యానంలో నడచి, నడచి శరీరాలు విసర్జించారు వాళ్ళు. ధర్మరాజు మాత్రమే చివరి పర్వతాగ్రందాకా వెళ్ళి దేవతల దర్శనం చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ పడిపోయినా ఒక కుక్క మాత్రం ఆయనతో చివరివరకు నడిచి వచ్చింది. ధర్మదేవత ఆయన్ని స్వర్గానికి ఆహ్వానించినా కుక్కను కూడా తనతో అనుమతించాలని పట్టుపట్టాడు. ఆయన న్యాయ దృష్టికి దేవతలు మెచ్చారు. ఆ కుక్క ఎవరో కాదు ఆయనని పరీక్షించిన ధర్మదేవతే అని ఋజువైంది. మహాప్రస్థానమంటే ఈ లో కాన్ని శాశ్వతంగా వదిలి తిరిగివచ్చే సం కల్పం లేక పైలోకాలకి ప్రస్థానం సంకల్పించి దేహత్యాగం చేయడమన్నమాట. ఈ యాత్ర చేయడంలో అటువంటి మనఃప్రవృత్తి కొందరికి ఉంటూనే ఉండింది. సంసారాన్ని వదలిపెట్టిన విరాగులు, అటువంటి భావన కలిగిన కొద్దిపాటి గృహస్థులు, ఇక బైరాగులు, సన్యాసులు, జీవనయాత్ర పూర్తికాబోతున్నదని నిశ్చయం చేసుకున్న వారు అనేకమంది ఏవిధమైన జాగ్రత్తలు, అన్న వస్త్రాల ఏర్పాట్లు కూడా చేసుకోక అటువెళ్ళి తిరిగి రాలేదు. ఒకవేళ అక్కడ చేరిన తరువాత కూడా స్వాధీనం కాని శరీరంలో వారుకాలం గడిపేవారుకాదు. ఈశ్వర ధ్యానంతో ప్రాణాయామం దీక్షగా చేసి ఊపిరి చాలా వరకు నిగ్రహించి, నెమ్మదిగా ఆ ప్రక్కన కొండ చివరికి చేరి, మనస్సు, బుద్ధి, చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసి మైలు లోతైన అలకనందలోయలో శరీరాన్ని విసర్జించేవారు. ఆ నిగ్రహం చేత కేవలం శరీరమే లోయలో పడి ఆ జీవాత్మ దారిలోనే శరీరాన్ని వదిలి ఊర్థ్వలోకాలని చేరుకునేది. ఇది ‘‘్భృగుపాత’’మనే పేరుగల దేహాన్ని విసర్జించే ఒకానొక ప్రక్రియ. అది దుఃఖంతో చేసుకునే ఆత్మహత్యకాదు. ఇదంతా సుదీర్ఘమైన సాధనతో పూర్తి విరాగంతో ఊర్థ్వ గతిపైన దీక్షతో మోక్షప్రదాత అయిన పరమశివుడు కేదారనాధుని దయపైన నమ్మకంతో చేసిన పని. అలాంటి వారు వేలమంది ఉండరుకదా? హిమవంతం తపోభూమి.గృహస్థులకు సంబంధించిన కర్మభూమి కాదు. వేదవ్యాస మునీంద్రుడు తన దివ్యశరీరంతో అక్కడ శాశ్వతంగా నిలిచిపోయాడు. శ్రీకృష్ణుని అంశ తేజోరూపంతో హిమాలయాలలోనే ఉండిపోయింది. అంతేకాక బ్రాహ్మణుడై మహాపాపం చేసిన అశ్వత్థామ శాపగ్రస్థుడై, రోగగ్రస్థుడై అక్కడే తిరుగుతున్నాడు. అక్కడ పవిత్ర వాతావరణంలో తన పాపం కొంత క్షయిస్తుందని సంకల్పం కావచ్చు. ఇంకా వేలాది మంది అక్కడక్కడ నందాదేవి వంటి పర్వతగుహలలో తపస్సు చేసుకుంటున్నారు. బదరీ, కేదార క్షేత్రాలున్న అన్నపూర్ణ హిమాలయ పర్వత పంక్తికి వెనుకనే ఉన్న మహోన్నత కైలాస పర్వత ప్రాంతంలో రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మజ్ఞాని అయిన హనుమంతుడు చిరంజీవిగా సంచరిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ గృహస్థుల యాత్రాస్థలాలు కావు. సౌకర్యాలతో యాత్ర, వినోదయాత్ర, వ్యాపార సరళితో కలిసి నేటి పరిస్థితి ఇలాగ మారింది. లౌకిక క్షేమాన్ని ప్రక్కన పెట్టి, కేవలం తాత్విక దృష్టితో చూడగలిగితే అక్కడే దేహాన్ని వదలిన యాత్రికులకి చివరి క్షణంలో దుఃఖమే కలిగిందో లేక శాంతి లభించిందో మనకి తెలియదు. వాళ్ళే ఒక వేళ ఇంటికి తిరిగి వచ్చినా ఏదో ఒకనాడు మృత్యువు తప్పదు. ఇక్కడి మృత్యువు పరిస్థితులు ఎవరి స్వాధీనంలోనూ ఉండవు. ఎట్టి మృత్యువు ఏ జీవునికి మంచిదో, ఉత్తమమో తెలియదు. శరీరం ప్రకృతి వశం, జీవుని గతి కర్మవశం అయి ఉండగా జీవుడు ఈశ్వరునితో ఎంత సంబంధం పెట్టుకున్నాడో అంతమాత్రమే వారిగతి ఈశ్వరేచ్ఛ అయి ఉంటుంది. మనమందరం ఈ దేహయాత్ర చాలించిన యాత్రికులందరి జీవులకు శివానుగ్రహం కలిగి పూర్ణశాతం లభించాలని ఈశ్వరుని వేడుకుందాం. వారికి, వారి కుటుంబాలకి మనఃస్ఫూర్తిగా సానుభూతి చెప్పుకుందాం. భవిష్యత్తులో యాత్రికులందరికి అక్కడి ప్రకృతి ప్రసన్నమై ఉండుగాక! ఈ సందర్భంలో ఒక కథని జ్ఞాపం చేసుకుందాం... ఒకనాడొక బ్రాహ్మణుడు మండుటెండలో నడచి, ఆకలితో నీరసించి ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఉన్న గృహస్థుని చూచి ప్రాణం పోతున్నదని సౌంఙ్ఞతో ఆహారం వేడుకున్నాడు. ఆ గృహస్థు ఇంటి ముందరే ఉన్న చెరువును చూపించి వెంటనే స్నానం చేసి రమ్మని, భోజనం సిద్ధంగా ఉన్నదని అన్నాడు. అంతవరకూ కూడా ప్రాణం నిలువదని వెంటనే ఏదో ఇవ్వమని అడిగితే ఒక గినె్నలో పాయసం ఇచ్చాడు. తీరా పాయసం పాత్ర చేతికి రాగానే కొద్ది ధైర్యం వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఒక క్షణంలో స్నానం ముగిద్దామనుకుని ఆ పాయసపాత్రను గట్టుమీద పెట్టాడు. పాపమాతడు త్వరగానే స్నానం ముగించాడు. కాని సమీపంలో చెట్టుపైన ఉన్న ఒక గద్ద ఒక విషసర్పాన్ని గోళ్ళతో చీల్చింది. ఆ మరణవేదనలో ఆ సర్పం విషం కక్కింది. ఆ విషం తిన్నగా పాయసంలో పడింది. ఎంతో ఆత్రంతో ఆకలితో ఉన్న ఆ బ్రహ్మణుడు వేగంగా పాయసం త్రాగేశాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే అక్కడే మరణించాడు. గ్రామస్థులు ఆయన మరణానికి కారకులెవ్వరని చర్చించారు. అడిగిన వెంటనే చేతికి పాయసాన్ని అందించక స్నానం చేయమని సూచించిన గృహస్థునిది తప్పా? విషం కక్కిన సర్పానిది తప్పా? అదే క్షణంలో సర్పాన్ని చీల్చి చంపిన ఆ గద్ద కారణమా? పాయసం వెంటనే తాగకుండా స్నానం కోసం ఆలస్యం చేసిన బ్రాహ్మణునిది తప్పా? చర్చలో గ్రామస్థులు తేల్చలేకపోయారు. వెంటనే ఆ ప్రక్కనే నడచిపోతున్న సాధువు కనిపిస్తే అతనిని సందేహం తీర్చమని అడిగారు. ఆ సాధువు నవ్వి - ఆ బ్రాహ్మణుని మృత్యువుకి ఆ గృహస్థుకాని, ఆ సర్పంకాని, ఆ గద్ధకాని, చివరగా ఆ బ్రాహ్మణుడే కాని ఇందులో ఎవరైనా ఒక్కరు బాధ్యులని నిర్ణయిస్తే దానివల్ల అట్టివారికా పాపం సంక్రమిస్తుందని తెలిపాడు. ఎందుకంటే ఆ మృత్యువులో అసలు పాపమే లేదు. ఎవరి పాప మూ లేదు. ఇటువంటి సహజ సంఘటనలకు ఎవరినీ బాధ్యులని నిర్ణయించడం సరికాదు. ఒక కారు ప్రమాదం జరిగితే దానికి ఎవరినో బాధ్యులుగా నిర్ణయించి చర్య తీసుకోవడం సమాజ జీవనంలోని ఒక శాసన వ్యవస్థగా కొనసాగడం నాగరిక జీవనంలో ఒక భాగం మాత్రమే. అన్నింటికీ మనం చూపించే కారణాలు పూర్తిగా నిజం కావు. ఇది విశేష సత్యం.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి