29, జులై 2010, గురువారం
రామునికీ రావణునికీ తేడా ఏంటి ?
వాలినే తీసుకోండి. ఆ వానరుడి దగ్గఱ శరీరబలాధిక్యం తప్ప ఇంక ఏ గొప్పతనమూ లేదు. దశాబ్దాల తరబడి విశ్వాస పాత్రుడుగా సేవ చేసిన తమ్ముణ్ణి అకారణంగా అనుమానించి వెళ్ళగొట్టాడు. అతని భార్యని బలాత్కారంగా అనుభవించాడు. అతను అన్నివిధాలా పశుప్రాయుడు. తానా పశువుని వధిస్తే తనకే దోషమూ లేదని శ్రీరామచంద్రమూర్తి చెప్పినది అక్షరాలా నిజం. కానీ శ్రీరామచంద్రమూర్తి తమ్ముణ్ణి ఎలా చూసుకున్నారు ? ఏ పరస్త్రీ జోలికి వెళ్ళారు ?
మైక్రోస్కోపులో పట్టిపట్టిచూస్తే మలంలో కూడా వైటమిన్లు, ప్రొటీన్‌లు కనిపిస్తాయి. అలాగని అందఱమూ మలాన్ని మన daily staple food గా మార్చుకొని తినలేం. అలాగే వాలి, కర్ణుడు లాంటి పక్కా విలన్లలో కూడా మినుకుమినుకుమంటూ ఒకటో రెండో సుగుణాలు కనిపిస్తాయి. అంతమాత్రాన వాళ్ళు సాత్త్వికగుణనిధులైన శ్రీరామచంద్రమూర్తి కన్నా, ధర్మరాజు కన్నా గొప్పవాళ్ళయిపోరు. ఇహ శ్రీరామచంద్రమూర్తిలో దోషాలు వెతకడమంటే సూర్యకాంతి చుఱుక్కుమంటోందనీ కనుక అది పనికిరాదనీ అనడం వంటిది. శూద్రక మహారాజు వ్రాసిన మృచ్ఛకటికంలో ఒక శ్లోకం ఉంది. దాని భావం ఏమంటే "తెల్లని వస్త్రం మీద ఒక చిన్న మఱక కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. నల్లని వస్త్రం మీద ఎన్ని మఱకలున్నా ఏమీ తెలియదు" అని అలాగే సకలసద్గుణాభిరాములైనవారిలోనే ప్రపంచం లోపాల్ని వెతకగలదు గానీ దుష్టులేం చేసినా అది దుష్టత్వంగా అనిపించదు. ఎందుకంటే ఆ దుష్టత్వానికి అలవాటు పడిపోతాం కనుక.
దీన్ని ఒక్కముక్కలో తేల్చవచ్చు. శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఎటువంటిదయ్యా అంటే - ఆయన్ని ఆరాధించడం కోసం గుళ్ళూ గోపురాలూ కట్టడానికి లక్షలాది మందిలో అది ప్రేరణనీ, స్ఫూర్తినీ ఇస్తుంది. కాని వాలి, రావణుడులాంటి వాళ్ళ గొప్పతనం "ఓహో ప్రతి దుర్మార్గుడిలోను కొంత సదంశ కూడా ఉంటుందన్నమాట" అనేటంత వఱకు మాత్రమే తేగలదు. వారికి గుడి కట్టి పూజించాలనే కోరిక మాత్రం ఎవఱికీ కలగదు.
11, జులై 2010, ఆదివారం
దాతలు సంతానమౌతారు, గ్రహీతలు తల్లిదండ్రులవుతారు
జీవితసత్యాలకు షుగర్ కోటింగ్ వేసి జనసామాన్యం చేత మింగించడానికి ఉద్దేశించినవి కథలు. కానీ అసత్యాలకూ, అపార్థాలకూ కూడా షుగర్ కోటింగు వేయొచ్చునని ఈ పైన పేర్కొన్న కథ మూలాన అవగతమవుతుంది. హిందూధర్మప్రోక్తమైన కర్మసిద్ధాంతానికి జనంలో ఏ విధమైన అపార్థాలు బయల్దేఱాయో ఈ ఒక్క కథా విని తెలుసుకోవచ్చు. ఇలాంటిదే "ఈ ఉపకారం చేసిపెట్టవయ్యా, చచ్చి నీ కడుపున పుడతా" ననడం కూడా ! ఎవఱు ఎవఱికి ఋణపడడం వల్ల పితాపుత్ర సంబంధం ఏర్పడుతుంది ? పితాపుత్ర సంబంధం ఏర్పడినప్పుడు ఎవఱు ఎవఱి మీద ఖర్చుపెట్టాల్సి వస్తుంది ? ఈ రెండు చిన్న సరళమైన ప్రశ్నల్ని మనవాళ్ళు వేసుకోకపోవడం వల్ల ఈ అయోమయం ఏర్పడింది. అంతేకాక, మన సంప్రదాయంలో తల్లిదండ్రులు దైవసమానులు కనుక తల్లిదండ్రులకు పిల్లలే ఋణపడతారనే పొఱపాటు అభిప్రాయం ఉంది. ఇది కేవలం అభిప్రాయమే తప్ప వాస్తవం కాదు. ఈ అభిప్రాయం ప్రచారంలోకి రావడానికి బహుశా ఒక కారణం - తమని తమ పిల్లలు దైవసమానులుగా చూసి వారంతట వారు తమకు సేవ చేసేదాకా వేచిచూడకుండా తల్లిదండ్రులు ముందే తమకి తాము దైవత్వాన్ని ఆపాదించుకోవడం. తలిదండ్రులకు పిల్లలు సేవ చేయాలని చెప్పబడింది కనుక పిల్లలే తల్లిదండ్రులకు ఋణపడ్డారని జనసామాన్యం అపోహపడడం. కానీ తల్లిదండ్రులే పూర్వజన్మలో పిల్లలకు ఋణపడి ఉన్నారనేదే అసలువాస్తవం. అందువల్ల వారు తమ రక్తమాంసాలు ధారపోసి మఱీ ఆ పిల్లలకి జన్మనిచ్చి పెంచాల్సివస్తుంది. ఆ కారణం చేత ఈ పైన ఉదాహరించిన కథలో ఋణపడింది యోగి. ఆ చెప్పుల్ని అతనికి ఋణమిచ్చినది మాదిగ. కాబట్టి కర్మసిద్ధాంతం ప్రకారం ఋణదాత అయిన మాదిగే మఱుజన్మలో ఋణగ్రహీత అయిన యోగికి కొడుకై పుట్టి తన ఋణాన్ని వసూలు చేసుకోవాల్సి ఉంది. కానీ తద్విరుద్ధంగా వ్రాశారు.
అయితే ఈ పై కథ బోధించే తప్పుడు అభిప్రాయాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. యోగులు కర్తృత్వ, భోక్తృత్వ భావనలతో ఏ పనీ చేయరు కనుక, ఎల్లవేళలా భగవంతునియందు సర్వశరణాగతి భావనతో ఉంటారు కనుక వారు ఎవఱినుంచి ఏ సేవ స్వీకరించినా వారికి ఋణపడే ప్రసక్తీ లేదు. ఆ ఋణసమాప్తి కోసం పునర్జన్మెత్తే ప్రసక్తి అంతకంటే లేదు. అదీగాక "శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే" అన్న గీతావచనం చొప్పున, ఒకవేళ యోగి పునర్జన్మ ఎత్తాల్సివచ్చినా తనలాంటి యోగుల యింట్లో గానీ లేదా పవిత్రహృదయులైన ధనికుల ఇంట్లో గానీ జన్మిస్తాడే తప్ప పై కథలో చెప్పినట్లు జఱగదు.
3, జులై 2010, శనివారం
ఆధ్యాత్మిక అంటువ్యాధులు-1
అసలు ఈ దేహమనే వ్యాధి పొడసూపడానికి కారణం కోరికలు. కోరికలంటే మనస్సుతో చేసే కర్మమే. మనం ప్రస్తుతం చేసిన/ చేస్తూ ఉన్న కర్మల ఫలాలే మనకి ఒక భావి- దేహాన్ని సిద్ధం చేసిపెడతాయి. (ఒకటి కాకపోతే వందలాది దేహాల్ని) ఆత్మకి ఈ దేహమనే వ్యాధి సోకినప్పట్నుంచి దానికి ఏ మాత్రమూ కులాసా ఉండదు. నిరంతరం ఆకలి, కామం, అకారణ రాగం, అకారణ ద్వేషం, ఏదో తెలియని భయం, బ్రతుకుబెంగ. ఈ వ్యాధినే శాశ్వత సహజస్థితిగా బ్రమయించే ఉన్మాదం కూడా దాన్తో పాటు సిద్ధం.
సరే, మన వ్యాధికి మన యొక్క మనఃకర్మలే కారణమైతే ఫర్వాలేదు. కానీ ఇతరుల కర్మలు కూడా మనకంటుకుంటే ఏం చేయాలి ? మనం అనవసరంగా ఇతరుల కర్మలక్కూడా మన దేహంతోనే మూల్యం చెల్లించాల్సివస్తే ఏంటి గతి ?
ఈ ప్రశ్నవేస్తే చాలామంది నైష్ఠిక హిందువులు కూడా అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో నిర్ఘాంతపోతారు. ఈ ప్రశ్నేదో కొత్తగా ఉందే ? అనుకుంటారు. "ఎవడి కర్మకి వాడే అనుభవించాలని కదా, హిందూ వేదాంతశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ? తద్విపర్యాసంగా ఈ గొడవేంటి, ఎవఱి కర్మఫలాలో మనకంటుకోవడమేంటి ?" అని విస్తుపోతారు. హిందూ కర్మసూత్రం అంత సులువైనదీ, సరళమైనదీ అయితే అది అందఱికీ అర్థమైపోయి ఈ పాటికి ప్రపంచమంతా హిందూమతంలోకి కన్వర్టయ్యేవాళ్లే. కానీ దురదృష్టవశాత్తు అది అత్యంత సంక్లిష్టమైనది. అందుకే మన పూర్వీకులు "గహనా కర్మణో గతిః" (కర్మఫలం ఏ దారిలో వచ్చి మనల్ని పట్టుకుంటుందో అర్థం చేసుకోవడం కష్టం) అని వాక్రుచ్చారు.
ఇతరుల కర్మఫలాలు ఏ దారిలో వచ్చి మనకంటుకొని మనల్ని పీడించడం మొదలు పెడతాయో ఒకటి-రెండు దృష్టాంతాల ద్వారా గ్రహించవచ్చు. వీటిని ఎక్కణ్ణుంచి సేకరించారని మాత్రం నన్నడగొద్దు. ఒకాయనకి ఇద్దఱు భార్యలు. వారిలో పెద్దామె ఆయనకి దగ్గఱి బంధువు. నిజానికి ఆమెని అతను పెళ్ళి చేసుకోలేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఆమెతో ఉన్నాడంతే ! ఆ తరువాత రెండో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ముగ్గుఱూ ఒకే యింట్లో ఉండేవారు. ఆ పెద్దామెతో భర్తకి సంబంధం ఉందని చిన్నామెకి తెలియదు. వీళ్ళూ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మసులుకున్నారు. అయితే పెళ్ళయ్యాక అతని వైఖరిలో మార్పొచ్చింది. అతను పూర్తిగా భార్యకే అంకితమయ్యాడు. ఆ పెద్దామెని తాకడమే మానేశాడు. పైకి అతని ప్రవర్తన సక్రమమైనదిగా, బహు నీతిమంతమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆ పెద్దామె అలా అనుకోలేదు. ఆమెకి అతని మీద మనసు తీఱలేదు. ఆమెకి ఇంకా చాలా కోరికలున్నాయి. పైకి వ్యక్తీకరించలేకపోయినా ఆమె అతని కోసం యథాపూర్వంగా తపిస్తూనే ఉంది. అతను పట్టించుకోలేదు. అతని నిరాదరణకు ఆమె మనసులోనే ఆక్రోశించింది, దుఃఖించింది. అతను ఎప్పటికీ మళ్ళీ దరిజేఱకపోవడంతో ఆమె స్వయంతృప్తికి అలవాటుపడింది. ఆ సమయంలో కూడా ఆమె మనసులో అతనే ఉండేవాడు. ఒక పనిమనిషి దగ్గఱ తన మనసులోని వేదనని తఱచుగా వెళ్ళగ్రక్కేది. అతనిలా తనను కౌగలించుకొమ్మని, తనని అతనిలా పిలవమని, తాకమని ఆ పనిమనిషిని ఒత్తిడి చేసేది. ఇలా ఎన్నో మానసిక బాధలతో సతమతమవుతూ కొన్ని సంవత్సరాలకి ఆ పెద్దామె ఆ అశాంతితోనే కన్నుమూసింది. తదుపరి మఱికొన్ని సంవత్సరాలకి ఆమె పెనిమిటి కూడా చనిపోయాడు.
మళ్ళీ మఱొకచోట జన్మించినాక ఆఱు-ఏడేళ్ళ వయసులోనే అతనికి తీవ్రమైన స్త్రీవాంఛ ఉండేది. కొద్ది దశాబ్దాల పాటు అలా అహోరాత్రాలూ బాధపడ్డాక అతనికి పెళ్ళయింది. అతని భార్య చాలా ఉత్తమురాలు. భర్తంటే చాలా ప్రేమ. కానీ శృంగారానికి మాత్రం విముఖురాలు. ఎంతగా అంటే, ఆమెతో అతను సగటున ఏడాదికి ముణ్ణాలుగుసార్లు కూడా ఆనందించినది లేదు. ఫలితంగా అతను నిరంతర స్వయంతృప్తికి అలవాటుపడ్డాడు. హోమోసెక్సులాంటి ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ అతను అలా కాలేదనుకోండి.
ఇక్కడ వర్ణించిన జన్మజన్మల ఉదంతాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే - ఈ జన్మలో చిన్నతనం నుండి అతను పడ్డ బాధలకి, పూర్వజన్మలో తెలిసో, తెలియకో తన పెద్దభార్యని పెట్టిన కామవాంఛాపరమైన మానసిక చిత్రహింసకీ సంబంధం ఉందని అవగతమౌతుంది. ఆమె ఎలాగైతే అతనితో సంబంధం వల్ల తనలో రెచ్చగొట్టబడ్డ కామవాంఛ అతని ద్వారా తీఱక బాధపడిందో, సరిగ్గా అలాగే అతనూ ఇప్పుడు బాధపడాల్సి వచ్చింది. ఆమెలాగే స్వయంతృప్తి అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఏ హోమోసెక్స్ (లెస్బియన్) భావనలకి లోనైందో అవే భావనల్ని ఇప్పుడు అతను కూడా అకారణంగా అనుభూతి చెందాల్సి వచ్చింది. ఆనాటి ఆమె బాధలన్నీ ఇప్పుడు అతనికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కానీ పూర్వజన్మలో తాళిగట్టిన భార్యకి అంకితమైన పుణ్యఫలం చేతను, ఆమె మనసులోనే భర్తకిచ్చిన శుభాభినందనల ఫలితంగాను ఇప్పుడుపతివ్రత అయిన స్త్రీ కళత్రంగా లభించింది. కానీ ఆమె ద్వారా అతనికి ఇప్పుడు కామోపశాంతి మాత్రం లేదు. పెద్దభార్య ఉసుఱు కూడా తగిలింది.
ఆ జన్మలో ఆ పెద్దభార్య పొందిన మానసిక బాధలకి పూర్తిగా అతనే కారణమా ? అని ప్రశ్నించుకుంటే, బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే, అది ఆమె తలరాత. "రాతలో లేనిది చేతలో జఱగదు" అంటాడు యోగివేమన. ఆ తలరాత అలా ఎందుకు ఉంది ? అంటే బహుశా ఆమె కూడా అంతకు పూర్వజన్మలో తన భర్తకి సంసారసుఖం లేకుండా చేసి ఉండొచ్చు. ఆ కర్మఫలాన్ని ఆ రూపంలో మఱుజన్మలో అనుభవించి ఉండవచ్చు. అలాగే ఆమె యొక్క పూర్వజన్మ భర్తకి అలా చేయాలనే సంకల్పం ఆమెలో ఎందుక్కలిగింది ? అనడిగితే "అది అతని పూర్వకర్మఫలం" అనాల్సి వస్తుంది. ఇలా ఒక కర్మఫలం ఎంతమందికి జన్మలవారీగా అంటుకుందో గమనించండి. ఆ కర్మఫలం పెద్దామె యొక్క పూర్వజన్మభర్త నుంచి పెద్దామెకి, ఆమెనుంచి ఇతనికి, ఇప్పుడు ఇతన్నుంచి ఇతని భార్యకి అంటుకో బోతున్నది. ఈమె నుంచి రాబోయే జన్మలో వేఱెవఱికో ?
"ఈ విధమైన అంటువ్యాధిలాంటి కర్మఫల సంక్రమణం నుంచి జీవులకు విముక్తి ఎలా ? దీనికి ఎక్కడ ముగింపు పలకాలి ?" అని ప్రశ్నించినప్పుడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు ఒక అమూల్యమైన మాట సెలవిచ్చారు. అది కర్మఫలమని గ్రహించి, మనసులో వ్యథ చెందకుండా, ఎవఱి మీదా తిరగబడకుండా దానితో రాజీపడి, ఎవఱినీ ద్వేషించకుండా, అందఱినీ క్షమించి, భగవంతునికి సర్వస్యశరణాగతి చేస్తే దాని ఫలం మనతోనే అంతరించిపోతుంది. భవిష్యత్తులో మన ద్వారా ఇంకెవఱికీ అంటుకోదు.
17, జూన్ 2010, గురువారం
తనయందు దైవత్వాన్ని ఆరోపించుకోవడం - పర్యవసానాలు
సరే, అంతా అనుకూలంగా సాగినంత కాలం, ఈ దైవత్వాపాదితులు తమకు ఆపాదించబడ్డ దైవత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నంత కాలం ఈ దైవభావన వల్ల నష్టమేమీ లేదు. అలా కాక ఏ కారణం చేతనైనా ఆ భగవత్సమానులు అడ్డం తిరిగితే వారి భగవత్తత్వం లోకకంటకంగా పరిణమిస్తుంది. "నా విష్ణుః పృథివీపతిః" (రాజు మానవరూపంలో ఉన్న విష్ణుమూర్తి) అని కీర్తించిన దశ నుంచి "రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు" అని మహాకవులు ఆక్రోశించే దశ దాకా వ్యవహారం ముదిఱిందంటేనే అలనాటి మానవ సంబంధాలు చారిత్రిక పరిణామ క్రమంలో ఎలా విషమించాయో తేటతెల్లమవుతోంది. ఇది కేవలం పాలకులకూ, పాలితులకూ మధ్యనే కాదు, తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్య, గురువులకూ శిష్యులకూ మధ్య,భార్యలకూ భర్తలకూ మధ్య కూడా ఇలాగే విషమించడాన్ని మనం ఆధునిక కాలంలో గమనించవచ్చు. ఈ విషమించడంలో కేవలం తల్లిదండ్రుల పాత్రో, లేక పిల్లల పాత్రో లేదు. అలాగే కేవలం గురువుల పాత్రో, శిష్యుల పాత్రో లేదు. అదే విధంగా కేవలం భర్త పాత్రో భార్య పాత్రో లేదు. కొన్ని కేసులలో వీరిదీ,మఱికొన్ని కేసులలో వారిదీ ఉంది.
మాతృత్వం, పితృత్వం, భర్తృత్వం, గురుత్వం ఇలాంటివి అదృశ్య పీఠాలు. ఇవి ఆధ్యాత్మికంగా శక్తిమంతమైనవి. అందువల్ల ఈ స్థానాలను అధిష్ఠించినది ఎవఱైనప్పటికీ, ఎలాంటివారైనప్పటికీ వారిచ్చే ఆశీర్వాదాలకీ, శాపాలకీ మఱుజన్మలో తప్పకుండా ఏదో ఒక స్థాయిలో ఫలితం కనబడుతుంది. అయితే కలియుగం ముదుఱుతున్నకొద్దీ అల్పబుద్ధులవారు ఎక్కువగా ఈ పీఠాల్లో తిష్ఠ వేస్తూండడమే మన అసలు సమస్య. అహంకారం, క్రోధప్రదర్శన మొదలైనవి ఆయా పీఠాల్ని బట్టి సంక్రమిస్తాయి. "ఆ పీఠాలు తమవి" అని భావించుకోవడం వల్ల వాటి దుష్ప్రభావాలు తీవరిస్తాయి. ఈ సందర్భంగా నాకొక కథ గుర్తుకొస్తోంది.
ఒకానొక రాజుగారు చాలా కోపిష్ఠి. ప్రతీ చిన్న విషయానికీ కోపం తెచ్చుకొని భయంకరమైన శిక్షలు విధించేవాడు. ఒకసారి ఒక ఋషి ఆయన్ని చూడ్డానికొచ్చి "మహారాజా ! దానమైనా, దండమైనా పాత్రమెఱిగి ఆచరించాలి. చిన్నతప్పులకు పెద్ద శిక్షలూ, పెద్ద తప్పులకు చిన్న శిక్షలూ విధించడం పాపహేతువు. అందుకు ఫలితాన్ని రాజే స్వయంగా అనుభవించాల్సి ఉంటుంది" అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు. ప్రతిదానికీ పెద్దపెద్ద శిక్షలు విధించడానికి కారణమవుతున్న తన ఆవేశాన్ని, కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో రాజుకు అర్థం కాక భార్యని పిలిచి సలహా అడిగాడు. "మహారాజా ! ఒక్క నెలరోజులు నాకు రాజ్యాధికారం ఇప్పించండి. ఎలా అదుపులో పెట్టుకోవాలో నేను చెబుతాను. అయితే నేనిప్పుడు పరిపాలకురాలుగా తీసుకునే నిర్ణయాలకు ఆ తరువాత నన్ను శిక్షించనని మాట ఇవ్వండి." అన్నదామె. రాజు "సరే"నని ఒప్పుకొని "ఒక నెలరోజులపాటు తన బదులు తన భార్యే రాజ్యపాలన చేస్తుందనీ, తనతో సహా అందఱూ ఆమె మాటనే శిరసావహించాల్సి ఉంటుం"దనీ దేశమంతా చాటింపు వేయించాడు. ఆమె సింహాసనం మీద కూర్చున్న మొదటిరోజే "ఏలినవారు" అని మర్యాదగా తనని సంబోధించనందుకు భర్తకు పది కొరడాదెబ్బలు విధించింది. ఇహ ఆ నెలంతా ఎలా ప్రవర్తించాలో అర్థం కాక రాజుకు ప్రత్యక్ష నరకమే కనిపించింది. నెలరోజుల తరువాత మళ్ళీ రాజ్యాధికారాన్ని చేపట్టినాక రాజు భార్యతో "నీ వల్ల కొరడాదెబ్బలు తింటే తిన్నాను గానీ ఈ నెలరోజుల్లో నా కోపం చాలామటుకు తగ్గిపోయింది. ఎప్పుడూ శిక్షలు విధించడమే తప్ప నేనెప్పుడూ శిక్షకి పాత్రుణ్ణి కాలేదు. బహుశా అందుకే ఇంతకుముందు నాకు కోపం తగ్గలేదేమో" అన్నాడు. రాణి నవ్వి "అసలు కారణం కొరడాదెబ్బలు కాదు మహారాజా ! కోపాన్ని సహించి అణిగిమణిగి పడుండేవారు ఉన్నంతకాలం కోపం తగ్గదు. సాధారణంగా అలా పడుండేవారి మీదనే మనకి కోపం వస్తుంది. అలా పడుండనివారి మీద చస్తే కోపం రాదు. మనకి ఎవఱిమీదైనా అధికారం ఉంది అని మనం అనుకుంటే మనకి వారి మీద ఎల్లప్పుడూ కోపం వస్తూనే ఉంటుంది." అని వివరించింది.
పిల్లల మీద తల్లిదండ్రులకీ, శిష్యుల మీద గురువులకీ అధికారం లేకపోలేదు. అంతకంటే వారిని తమకి భగవంతుడు అప్పగించిన sacred trust గా మన్నించడం ఎక్కువ సరైనది. పెంచమని, తీర్చిదిద్దమనీ దేవుడు మనకప్పగించినవారికి శాపాలిచ్చి వారి బతుకుల్ని పాడుచెయ్యాలనే దుష్టచింతన నుంచి పెద్దలు విముక్తులు కావాలి. అప్పుడే వారు నిజమైన పెద్దలనిపించుకుంటారు. మనం తల్లిదండ్రులమో, భర్తలమో, గురువులమో అయినంత మాత్రాన మనం దేవుడి స్థానాన్ని ఆయన అనుమతి లేకుండా దురాక్రమించాలనే దుష్టసంకల్పాన్ని విసర్జించాలి. మన పిల్లలూ, మన భార్యలూ, శిష్యులూ మనల్ని దైవసమానంగా మన్నిస్తే మన్నించనివ్వండి ! వారి పవిత్రభావనకి తగ్గ ఫలితాన్ని వారు పొందుతారు. కానీ మనం మాత్రం దేవుళ్ళం కాదనే స్పృహతోను, తద్భిన్నంగా సాధారణ మానవులమేననే తెలివిడితోను మన తోటి మానవులందఱినీ ఆత్మవత్తుగా దర్శిస్తూ నిరాడంబర, అదాంభిక జీవితాన్ని గడుపుదాం.
10, మే 2010, సోమవారం
ప్రశ్నించే వారు అనేకులు ఉన్నారు - జవాబు ఇచ్చేవారేరి?
సత్యాన్వేషణ అనే పేరుతో పలు వ్యక్తులు వేసే ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి? ఎటు నుండి చెప్పాలి? నేను ఒకటి చెప్పనా ? సత్యాన్వేషణ వేరు,రంధ్రాన్వేషణ వేరు. పై విధానం రంధ్రాన్వేషణ అవుతుంది కానీ సత్యాన్వేషణ కాదు. మేము చెప్పేది గొప్ప. మీరు పాటించేది శుద్ధ దండగ. మీరు వెర్రివాళ్లు కాబట్టి మా మాటలు విని ఆ భక్తి మార్గం వీడండి. అంటూ చెప్పేది రంధ్రాన్వేషణే అవుతుంది. అలా కాక జీవించడానికి పలు మార్గ్గాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఈ భక్తి అనేది ఒకటిగా కనిపిస్తోంది. కానీ నాకు అందులో నమ్మదగిన సత్యం గోచరించడం లేదు. అయినా అన్వేషిద్దాము. ఇందులో ఎంత సత్యం ఉందో. గురువులు ఏమి చెప్తున్నారు? శిష్యులు ఏమి పాటిస్తున్నారు. మనకు కనిపించే తేడా గురువుల వద్ద ఉన్నదా? శిష్యుల వద్ద ఉన్నదా? అసలు పూర్తిగా ఆ విధానం లోనే ఉన్నదా? లేదా నా దగ్గరే లోపం ఉన్నదా? ఇలా అన్ని వైపులా అన్వేషణ సాగిస్తే అది సత్యాన్వేషణ అవుతుంది.
మనిషి దేనికోసం జీవిస్తాడు? అతని అంతిమ ఆశయం ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? చిన్న పిల్లవాడికి చదవాలని, ఆటలాడాలని కోరిక. చదువు, తరువాత మంచి ఉద్యోగం సంపాదించాలని కోరిక. తరువాత భార్య, పిల్లలు ఇలా ఒకదాని తరువాత ఒకటి. ఇవన్నీ ఎందుకు? దేని కొసం ఈ కోరికలన్నీ కలుగుతున్నాయి ? దీనికి సమాధానం దొరకాలంటే ప్రశ్న మరోలా వేసుకోవాలి. ఈ కోరికలు తీరితే మనకు ఏమి కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. కానీ అది క్షణ కాలమే ఉంటుంది. మళ్లీ ఏదో కావాలంటుంది మనసు. మళ్లీ దానికోసం అన్వేషణ. అది లభిస్తే కొంత కాలం ఆనందం. ఇలా మళ్లీ మళ్లీ అడిగే మనసుకు అసలు ఏమికావాలి? నేను చెప్పనా? ఎప్పటికీ ఉండే ఆనందం కావాలి. మళ్లీ చెప్పాలంటే తృప్తి కలిగేంత ఆనందం కావాలి. దానికోసమే మనిషి పరుగు. అదే అతని అంతిమ మజిలీ. ఈ పరుగులో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అందరూ చివరికి చేరేది పరిపూర్ణ ఆనంద తీరానికే. కాకపోతే ఒకళ్లు ముందు, ఒకళ్లు వెనుక అంతే.
ఏదీ తెగేదాకా లాగకూడదు. కొత్త విషయం తెలుసుకోవాలనుకోవడం మంచిదే. కాని అన్ని విషయాలు నాకే తెలియాలనుకోవడం మొదటికే మోసం తెస్తుంది.
ఒకామె వంట బాగా చేసేది. కానీ కొంత కాలానికి ఆమెకి ఏ వంటచేసినా ఉప్పెక్కువో, కారమెక్కువో ఇలా ఏదో ఒక లోపంతో వంట చెడి పొతోంది. దానితోపదిమందీ వచ్చినప్పుడు ఆమె పరువు పోతోంది. పైగా పూర్వం బాగా వంట చేయగలదన్న పేరు. తీరా ఇప్పుడు గడ్డిలా ఉన్న వంట తిని ఏమంటారో. అన్న బెంగ ఎక్కువై పోయి చేతులు కాళ్లు వణికి పోతున్నాయి. తెలియని భయం ఆవరించి కళ్లు తిరిగి క్రింద పడిపోతోంది. దానితో ఆమె ఒక సైక్రియాటిస్ట్ ని కలిసింది. అతను అంతావిని ఓస్ ఇంతేనా మరేం ఫర్వాలేదు. మీరు వంట చేసే టప్పుడు మీకు ఇష్టమైన సంగీతంవింటూ వంట చేయండి. క్రమ క్రమంగా మీరు పూర్వం వలే వంట చేయగలుగుతారు. మీ వణుకు తగ్గుతుంది. అని ధైర్యం చెప్పి పంపించాడు. ఆమె ఇంటికి వెళ్లిఅలా వంట చేయడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న వాళ్ల్లు ఇది చూసి "ఇదేమి చోద్యమే!? అసలే పరధ్యానంతో వంటలు తగల బెడుతున్నావు. ఇప్పుడు పాటలు పెట్టుకుని వంటలు చేస్తే ఇక మేం తిన్నట్టే" అని ఒకళ్లు. "అయినా ఇలా ఎన్నాళ్ళు పాటలు వింటూ వంట చేస్తావు?" అని ఒకళ్లు, "ఎన్నాళ్లైనా ఇలా గడపాల్సిందేనా?" అని మరొకళ్లు. ప్రశ్నల మీద ప్రశ్నలు. అసలే ఆమె మనస్థితి బాగోలేదు. పైగా ఈ ప్రశ్నలతో ఆమెను రోజూ బుర్రతింటూ ఉండడంతో వంటలు బాగు కాలేదు సరికదా, ఆమెకు మరింత భయం పెరిగి పోయింది. ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వంట చేయాలంటే వచ్చే వణుకు ఇప్పుడు మామూలుగా రోజూ వంట చేయాలంటేనే వస్తోంది.
మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లిన ఆమె ద్వారా అంతా విన్న డాక్టరు "ఈసారి మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్లందర్నీ తీసుకురండి" అని చెప్పాడు. అలాగే తీసుకు వెళ్లింది. ఆమెను బయటకు పంపి వాళ్లందర్నీ కూర్చోబెట్టి " మీకు బుద్దుందా లేదా? అసలే మనస్థితి బాగోలేని ఆమెకు మీరు మరింత భయాన్ని కలిగిస్తారా? నేనా డాక్టరు మీరా? మీకంతా తెలిసినప్పుడు మరి నా దగ్గరకు రావడం దేనికి మీరే నయం చేయలేక పోయారా?" అని చివాట్లు పెట్టాడు. బిక్క మొహాలు వేసిన వారితో అనునయంగా అసలు విషయం చెప్పాడు. " ఆమెకు భర్త చనిపోవడంతో, బంధువులైన మీ మీద పిల్లలతో సహా ఆధారపడ వలసి రావడంతో ఆలోచనలు పెరిగిపోయాయి. "ఎలా బ్రతకడం? పిల్లలకు దిక్కేది?" అనే బెంగ మొదలైంది. ఆ బెంగలో నిద్ర కరువైంది. నిద్ర సరిగా లేకపోవడం వలన అనేక శారీరక మార్పులు సంభవించాయి. అలాగే పరధ్యానమూ అలవడింది. ఏ పనీ సవ్యంగా చేయలేకపోవడం, చిన్నసమస్యకే పెద్దగా క్రుంగి పోవడం, నిరాశ నిస్పృహలకు లోనవడం మొదలైంది. మనసులో గూడు కట్టుకున్న భయం వలన ఆమె మానసికంగా కృశించి పోయింది. అన్ని పనుల్లోను అంతో ఇంతో తేడాగా ప్రవర్తిస్తున్నా ఆమెకు ప్రధానంగా మీరు అప్పచెప్పిన వంట బాధ్యత వల్ల దానిలో తాను చేసే లోపాలే ఆమెకు పెనుభూతంలా కనిపించ సాగాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి ఆమెను ఇంతవరకూ తీసుకు వచ్చాయి. దీని కంతటికీ కారణం విపరీతమైన ఆలోచనలు . ముందు వాటిని మళ్లించ గలిగితే మనసు కాస్తకుదుట పడితే మళ్లీ మామూలు స్థితి వస్తుంది. అందుకే రాత్రి నిద్ర పట్టడానికి మందులు ఇస్తూనే ఆమెకు సంగీతమంటే ప్రాణమని తెలుసుకున్న నేను ఇష్టమైన పాటలు వింటూ వంట చేయమన్నాను. అలా కొంత వరకు ఆలోచనలు తగ్గుతాయి కనుక. కానీ మీరేం చేశారు. ఆమె మనసును మరింత కల్లోల పెట్టారు. దానితో మొదటికే మోసం వచ్చింది. ఇక్కడ ఒక విషయంలో మిమ్మల్ని అభినందించాలి. సొంత తల్లిని కూడా సరిగా చూసుకోవడం కరువైపోతున్న నేటి రోజులలో ఆమెకు చెల్లెళ్లైన మీరు ఇంత ప్రేమగా చూసుకోవడం, దానికి మీ భర్తలు కూడా అభ్యంతర పెట్టక పోవడం చాలా గొప్పవిషయం. ఇకనైనా పరిస్థితి అర్థం చేసుకుని ఆమెకు అనుగుణంగా నడుచుకోండి, చేతనైతే ఆమెలో ధైర్యాన్ని పెంచే మాటలు మాట్లాడండి. త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది అని చెప్పి పంపించాడు. ఇక ఆతరువాత
ఎప్పుడూ ఆమె అటువంటి భయంతో డాక్టరు వద్దకు రాలేదు.
అలాగే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే పెను మానసిక రోగాలను క్రమ క్రమంగా తొలగించి, మన జీవితాలను పరిపూర్ణ ఆనందం వైపు పయనింపచేయడానికి భారతీయ గురువులు శ్రమించి ఓ జీవన విధానమును ఏర్పరచారు. మనకు ప్రసాదించారు. కానీ మానవుడు స్వార్థమునకు లొంగి దానిని కూడా పూర్తిగా పాటించక తనకు అనుకూలముగ ఉన్నంత వరకు పాటించి, కష్ట తరముగ ఉన్నదానినిపాటింపక, తనను పరులు తప్పు పట్టు లోపల తానే ఇతరుల నడవడికను ప్రశ్నించి, మభ్యపెట్టి వారిచేత కూడ తన మార్గమును శహభాష్ అనిపించుకొని, తానేదో క్రొత్త మార్గమును కనుగొన్నా ననుకొని తాను భ్రమిస్తూ, ఇతరులను భ్రమింపచేస్తూ బ్రతుకుతున్నాడు. అదే భారతీయత అనుకొంటున్నాడు. మరోవైపు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రపంచీకరణ పుణ్యమా అని దేశాల మధ్య దూరం తరిగి అనేక అలవాట్లకు లోనై కన్నతల్లినే విమర్శించే వారు కొందరు తయారవుతున్నారు. ఈ విమర్శలు కొంత వరకూ మంచివే. మొదటి రకం వాడు తన తప్పులను సరిదిద్దుకోవడానికి పనికి వస్తాయి. అలా దిద్దుకున్న వాళ్లు అనేకులు ఉన్నారు. అలాగే కాలానుగుణంగా కూడా కొన్నిమార్పులు అవసరం. ఆ కోవలోనే సతీసహగమన నిషేధం, బహుభార్యాత్వ నిషేధం మొదలైన సంఘసంస్కరణలు జరిగాయి. మంచీ చెడూ సమానంగా ఉన్న నేటి సమాజంలో పుట్టిన మనం మనలనుసరిదిద్దుకోవడానికి చాలా దోహద పడుతున్నాయి. మన భారతీయ విలువల గొప్పతనాన్ని మరింత తెలుసుకునేలా చేస్తున్నాయి. కానీ ఈ మార్పును చూసి "నేనేదో గొప్ప ఘన కార్యం చేశాను, నేనలా ప్రశ్నించడం వల్లే ఈ సమాజంలొ పెనుమార్పులు సంభవించాయి" అని అత్యుత్సాహంతో మరింత లోతుకు వెళ్లి భారతీయమూలాలనే తూలనాడే స్వభావం హర్షించదగినది కాదు.
మితిమీరిన కామంలో పడి గిలగిల లాడుతున్న మనకు సత్యం ఎక్కడ కనిపిస్తుంది? అందుకే ఆ పై కథలోని ఆ బంధువుల వలే ప్రశ్నిస్తాం. "ఏమిటీ మనిషి మనో రోగాలను పోగొట్టి మంచి మార్గంలో పయనింప చేయడానికి ఈ జీవన విధానం రూపొందించ బడినదా? అంటే పుట్టుకతోనే మనకి అనేక మనోవైకల్యాలున్నాయా? వాటి కోసం మనం బ్రతికినంత కాలం ఈ తలా తోకా తెలియని దారిలో నడవాలా? "
ఇవే కదా మీ మనసులో ఇంకా మిగిలి ఉన్న ప్రశ్నలు. ప్రతీ రోజూ అన్నం తింటాం. ఎన్ని సార్లు తిన్న అన్నం మళ్లీ తింటాం ? ఎందుకని ? మనకు శక్తి లేదనా? కాదు కదా? శక్తి నశించకూడదని తింటాం. అలాగే మన జీవన విధానమూ ఓ క్రమ పద్ధతిలో మనలోని ఆనందాన్ని ఇనుమడింపచేసి శాశ్వత ఆనందం వైపు పరుగు పెట్టిస్తుంది. దీనిని పాటించే వారిలో తప్పులున్నాయేమో గానీ. పూర్తిగా ఈ విధానంలోనే తప్పులున్నాయనడం అసమంజసం.
ఏమిటి మరి ఈ జీవన విధానం?
నీలోకి చూడడం అంటే నిన్ను చూడడమే. నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు లోకాన్ని తెలుసుకుంటావు. లోకాన్ని ప్రశ్నించే ముందు నిన్ను నువ్వుప్రశ్నించుకో! నేనెవరు? నాకు కావలసినదేమిటి? నా పుట్టుకకు మూలం ఏమిటి? దాని పరమార్థం ఏమిటి? అని ఎప్పుడైనా ప్రశ్నించావా? సంతృప్తికర సమాధానం రాబట్టావా? అన్వేషణ సాగించావా? సమాజాన్ని చదవడం నీకు తెలుసేమో ? నిన్ను చదవడం తెలుసా? అదే పరా విద్య. అది తెలిసిన నాడు మృత్యువును జయిస్తావు. చావుకు తెగిస్తావు. తోటి ప్రాణిలో నీ రూపు చూస్తావు. తన కష్టం నీ కష్టంగా తపిస్తావు. నీ మాటలో చూపులో చర్యలో ప్రతి చర్యలో అణువణువులో అమృతం ఒలికిస్తావు. ఆ రహస్యం తెలియాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు నువ్వు వరుసగా స్వీకరించ వలసినదే! కాదని కోరికలతో రగిలి ప్రక్కదారి పట్టారా..? అన్నీ ఉన్నా ఆనందం మీకు కరువే! పోనీ ఇవేమీ వద్దని సరాసరి సన్యాసానికే వచ్చేశారా..? నిత్యానందుని గతి ఏమయిందో మీకు తెలుసుగా? ఏదైనా ఓ క్రమ పద్ధతిలో సాగాలి.
కాళిదాసు రఘువంశ రాజుల జీవనం గురించి ఈ విధంగా చెప్తాడు.
త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం|
యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం||
యోగ్యత కలవారికి దాన మిచ్చుటకే ధనమార్జించు వారును, నిజము పలుకుటకై మితముగా మాట్లాడు వారును, కీర్తి కొరకే విజయము పొంద గోరువారును, సంతానము కొరకే వివాహమాడు వారును...
శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం|
వార్థకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం||
బాల్యము నందు విద్యలు నేర్చు వారును, యవ్వనమున విషయా సక్తులును, వార్థక్యమున మౌనమును పాఠించుచూ సంపదలను అన్నిటినీ త్యజించి వానప్రస్థ జీవనము సాగించు వారును, అవసాన కాలమున సంకల్ప మాత్రము చేత యోగ మార్గమున శరీరమును త్యజించు వారును.... ( అయిన రఘువంశ కథను చెప్పబోవు చున్నాను )
ఈ గుణములు మనకు ఆదర్శములు.
ప్రశ్నించే వారు అనేకులు ఉన్నారు - జవాబు ఇచ్చేవారేరి? జనులు పరిపరివిధ వాదములతో నిస్తేజు లవుతున్నారు. ప్రేమ స్వరూపులైన సద్గురువులు తమ అమృతవాక్కులతో శాంత పరిచెదరు గాక ! సులభప్రసన్ను లగుదురు గాక!
[ రాజశేఖరుని విజయ శర్మ}
25, ఏప్రిల్ 2010, ఆదివారం
ఎట్టకేలకు అసలు విషయానికొస్తున్న పాశ్చాత్యులు
నలభయ్యేళ్ళ క్రితం బ్రహ్మశ్రీ కోట వెంకటాచలం గారనే మహానుభావుడు విజయవాడలో నివసించేవాడు. ఆయన ఆ రోజుల్లో "కలిశక విజ్ఞానము" అనే పేరుతో అనేక చరిత్రసంపుటాలని వెలువఱించారు. వాటిల్లో కొన్ని నేను చిన్నప్పుడు చదివాను. బ్రిటీషువారు ఏయే కారణాల చేత, ఏయే పద్ధతులలో భారతీయుల చరిత్రని వక్రీకరించారో అందులో ఆయన సప్రమాణంగా నిరూపించారు. "ఈ వక్రీకరణ చాలావఱకు ఉద్దేశపూర్వకం కాగా కొంతవఱకు దుర్‌భ్రమల వల్ల కూడా జఱిగింది" అని ఆయన వ్రాసినదాన్ని బట్టి తెలుస్తోంది. ఉదాహరణకి - ఇంగ్లీషువాళ్ళు మన చరిత్రతేదీలన్నీ మార్చిపారేయడానికి గల ఒక ప్రధాన కారణం - ఇండియాని పరిపాలించిన ప్రాచీన పారశీక రాజులలో ఇద్దఱు సైరస్‌లు ఉన్నారు. ఆ యిద్దఱినీ ఒక్కఱే అనుకొని భ్రమించి మొదటి సైరస్ యొక్క సమకాలీన సంఘటనల తేదీలన్నీ రెండో సైరస్ యొక్క తేదీకి అనుగుణంగా మార్చేశారట. ఇలాంటి వందలాది చారిత్రిక సూక్ష్మాల్ని గాలించి పట్టుకొన్న మహామేధావి కోట వెంకటాచలం గారు చివఱి రోజుల్లో సన్న్యాసాశ్రమ స్వీకారం చేసి పరమపదించారు. ఆయన పుస్తకాలు ఇప్పుడు ఎక్కడున్నాయో నాకు తెలియదు. వాటిని ఎవఱైనా పునర్ముద్రించి, ఇంకా ఇంగ్లీషు, హిందీ, శ్పానిష్, పోర్చుగీస్, చైనీస్, జపనీస్, అరబిక్ భాషలలోకి కూడా తర్జుమా చేసి వ్యాపింపజేస్తే బావుణ్ణు. "కోట వెంకటాచలం గారి పుస్తకాలే నిజమైన భారతదేశ చరిత్ర" అని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు స్వయంగా వాక్రుచ్చిన సంగతిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సి ఉంది.
కానీ ఇవేవీ తెలియక పోయినా పాశ్చాత్య చరిత్రకార ప్రపంచంలో కూడా ఇంగ్లీషువారి చరిత్రకల్పనలపై ఇటీవల పునరాలోచన బయలుదేఱింది. ఈ పునరాలోచనకు కొన్ని కారణాలున్నాయి.
౧. ఇటీవల కనుగొన్న సరస్వతీనది యొక్క అంతర్ధానకాలం - వేదకాలంగా బ్రిటీషు చరిత్రకారులు చెప్పిన క్రీ,.పూ. 1500 కంటే చాలాముందు (సుమారు క్రీ.పూ.2000 - అంటే 4 వేల సంవత్సరాల క్రితం) జఱిగినట్లు భూగర్భశాస్త్ర పరిశోధనల ద్వారా తేలడం. వేదాల్లో సరస్వతీనదిని వర్ణించినట్లుగా గంగానదిని వర్ణించడం జఱగలేదు. అదీగాక తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన బలరాముడు "సరస్వతీనది ఇదివఱకటిమల్లే నిరంతరాయంగా ప్రవహించడంలేదనీ, ఈమధ్యఅప్పుడప్పుడు ఎండిపోతోం"దనీ శ్రీకృష్ణుడితో చెప్పిన మహాభారతఘట్టం. అంటే సరస్వతీనది ఎండిపోవడం మహాభారత కాలం (క్రీ.పూ.3000) లో మొదలై అటుపిమ్మట వెయ్యేళ్ళకి పూర్తిగా ఎండిపోయిందని తెలుస్తోంది. సరస్వతీనది ఎండిపోవడమూ, దాని పరీవాహక ప్రాంతాల్లో వెలసిన సింధునాగరికత కుప్పకూలడమూ ఒకేసారి జఱిగినట్లు కనిపిస్తున్నందువల్ల సింధునాగరికత కూడా అప్పటి (మహాభారతకాలంనాటి) వైదిక నాగరికత కంటే భిన్నమైనదని బ్రిటీషు చరిత్రకారులు ఊహించినది వాస్తవం కాదేమోననే అనుమానాలు పాశ్చాత్య ప్రపంచంలో రేకెత్తుతున్నాయి.
౨. యూదుల ప్రాచీనత : ఓల్డు టెస్టమెంట్ ఆధారంగా యూదులు నాలుగువేల సంవత్సరాల నాటి జాతి. వారు మొదట్లో బ్రాహ్మణులని కొందఱు పాశ్చాత్యులు అభిప్రాయపడుతూండగా, బ్రాహ్మణులే యూదుల సంతానమని ఇంకొంతమంది పాశ్చాత్యులు వాదిస్తున్నారు. యూదుల ఆత్మగౌరవ భావన పెచ్చుమీఱిన ఈ రోజుల్లో వారు తమ జాతి ఔన్నత్యం కోసం తమకంటే ఎక్కువ ప్రాచీనత కలిగిన బ్రాహ్మణులతో తమకు ఎక్కడో, ఏ కాలంలోనో బాదరాయణ సంబంధం ఉన్నదని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారనేది స్పష్టం. ఈ తాపత్రయం వల్ల వారు భారతీయ గ్రంథాల అధ్యయనాన్ని ముమ్మరం చేసి బ్రిటీషు చరిత్రకారుల లొసుగులన్నీ బయటపెడుతూండడం మనకు కలిసొస్తున్న అంశం.
౩. గ్రీసులో బయటపడ్డ బుద్ధవిగ్రహం : బ్రిటీషు చరిత్రకారుల ననుసరించి బుద్ధుడు క్రీ.పూ.500 నాటివాడు. మనకు భారతదేశ పాఠశాలల్లో కూడా అలా అనే నేర్పుతున్నారు. కానీ పదేళ్ళ క్రితం గ్రీసులో బయటపడ్డ బుద్ధవిగ్రహాన్ని కార్బన్-14 టెస్ట్ చేయగా అది క్రీ.పూ.1,800 నాటిదని తేలింది. 2,500 ఏళ్ళనాటి బౌద్ధం అనే మాట దూదిపింజలా తేలిపోవడంతో ఇప్పుడు పాశ్చాత్యులు కిం కర్తవ్యం ? అని తలలు పట్టుకుంటున్నారు.
అందుచేత ఇప్పుడు అనేక మంది పాశ్చాత్య రచయితలూ, వెబ్‌సైట్లవారూ కూడా మనసు మార్చుకొని హిందూమతాన్ని కనీసం 5000 సంవత్సరాల నాటి ప్రపంచపు అత్యంత ప్రాచీనతమ ధర్మం (The oldest religion of the world) అని పేర్కొనడానికి సంశయించడం లేదు. ఉదాహరణకి - ఈ క్రింది లంకెలోకి వెళ్ళి అక్కడి యానిమేషన్ పిక్చర్ చూడండి.
http://mapsofwar.com/images/Religion.swf
ఏదేమైనా నిజం నిప్పులాంటిది. కదూ ?
8, జనవరి 2010, శుక్రవారం
నువ్వసలు మనిషివేనా ?-1
"హే తథాగతా ! పునర్జన్మ ఎత్తేది మనస్సా ? ఆత్మా ?" అని అడిగాడొకసారి ఆనందుడనే శిష్యుడు బుద్ధభగవానుల్ని.
అప్పుడు బుద్ధభగవానులు చిఱునవ్వుతో "నాయనా ! ఆత్మ జన్మలెత్తదు" అని మౌనం వహించారు.
ఆనందుడి సంశయం తీఱలేదు. మళ్ళీ అడిగాడు "అయితే మఱి జన్మలెత్తేది ఎవరు స్వామీ ? మనస్సా ?"
"మనస్సు జన్మలెత్తదు."
"మఱి మనస్సూ కాక, ఆత్మా కాక ఇహ జన్మలెత్తేది ఎవరు స్వామీ ?" ఆనందుడి అయోమయం ముమ్మరమైంది.
"కర్మ. అదే జన్మలెత్తుతుంది." తథాగతులు ఒక్క వాక్యంలో తెలియజేశారు.
శ్రీ బుద్ధ భగవానులు హిందువుగా జన్మించారు. హిందువుగానే నిర్వాణం పొందారు. తానొక కొత్తమతం స్థాపిస్తున్నట్లు ఆయన చెప్పుకోలేదు. ఆయన నిర్వాణం చెందిన వందేళ్ళకి బౌద్ధ ’మతం’ అనేదొకటి పుట్టింది. కనుక ఆయన వాక్యాలు బౌద్ధులకెంత ప్రమాణమో హిందువులకూ అంతే ప్రమాణం. అందుచేత ఆయన వచనాల్లో మనకి కావాల్సిన సందేశం కూడా ఇమిడి ఉంది.
మనుషులు తమని తాము మేదో-మజ్జాస్థి సంయుక్తమైన రక్తమాంస దేహాలుగాను, ఒకఱి సంతానంగాను, మఱొకటిగాను, మఱొకటిగాను భావించుకోవడం కేవలం అజ్ఞానపూర్వకమని శ్రీ తథాగతులవారి వచనాలు సూచిస్తున్నాయి. మానవుడి పూర్వకర్మ తనకనుగుణమైన జన్మని, దేహాన్ని తానే రూపొందించుకుంటుంది. ఆ జన్మనీ దేహాన్ని తనకివ్వగల తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ అది ప్రయాణిస్తుంది. పూర్వకర్మఫలాన్ని అనుభవించడానికి అనువైన దేశకాలాల్ని అది నిర్ణయించుకుంటుంది. కనుక జీవులుగా, మానవులుగా, దేహాలుగా మనకి ఈ ఇహలోకంలో గోచరిస్తున్నటువంటివన్నీ వాస్తవానికి వివిధ పూర్వీకుల యొక్క కర్మలే.
"కర్మలకి అంత శక్తి ఉందా ? కర్మలకి మేధ ఉందా ?" అని ఎవఱైనా ఆశ్చర్యానికి లోను కావచ్చు. మన హిందూ సంప్రదాయంలో చైతన్యరహితమైనదంటూ ఏదీ లేదు. అంతా చైతన్యమే. అంత చిన్మయమే. భగవంతుడి కాలు కడిగిన జలం గంగ అయింది. భగవంతుడి మనస్సే జగదంబ అని చెప్పబడుతున్నది. ఆయన ఆయుధాలే అన్నమాచార్యుడివంటి భక్తులుగా భూలోకంలో అవతరించాయి. ఆయన జటాజూటమే వీరభద్రుడయింది. అందుచేత చరిత్రలో ఎప్పుడో ఎక్కడో పుట్టి పెఱిగి చనిపోయిన ఏ అజ్ఞాత/ అనామక మానవుడి మనోమయ సంకల్పాలో ఇప్పుడు ఇక్కడ మనముందు ఇంకో మానవుడి రూపాన్ని ధరించి పునర్జీవించి కనిపిస్తున్నాయంటే అందులో ఆశ్చర్యమూ, అతిశయోక్తీ లేవు. పూర్వగ్రంథాల్లో కృత్య అనేదాని గుఱించి ప్రస్తావించబడింది. కృత్య అంటే ఒక శక్తిమంతమైన కృత్రిమ వ్యక్తి. ఎవఱినైనా చంపాలనుకున్నప్పుడు యాజకులు మంత్రపూర్వకంగా హోమకుండంలో నుంచి దాన్ని ఉత్పాదన చేస్తారు. అది రాక్షసుల వలె చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. తనని పుట్టించిన యాజకులు నియమించిన పని (కృత్యం) చెయ్యడమే దాని పని కనుక దానికి కృత్య అని పేరు. సంకల్పసహితమైన మన కర్మలు కూడా అలాంటి కృత్యలే. ఎటొచ్చీ అవి అమంత్రకంగా మన మనస్సులనే హోమకుండాల్లోంచి జనించిన సంకల్ప రాక్షసులు. తెలిసో తెలియకో వాటికి మనం అప్పగించిన పనికి అవి నెఱవేర్చకుండా మానవు. ఈ రోజు కాకపోతే వచ్చే జన్మలో !
మనం మనుషులం కాము. మనం మన పూర్వజన్మల్లోని సంకల్పాలం. ఆ సంకల్పాలు కర్మానుభవం కోసం ధరించిన రక్తమాంసాలం. ఆ సంకల్పాలు నెఱవేఱాక ఈ రక్తమాంసాలు అంతరించిపోతాయి. పుడుతూనే ప్రతి మనిషికీ దేవుడు ఒక అవతారకార్యాన్ని (life mission) ని అప్పగిస్తాడు. ఆ అవతారకార్యం చిన్నదీ కావచ్చు, పెద్దదీ కావచ్చు. మునిసిపల్ ఆఫీసులో అటెండరుగా ఉండడం ఒకడి అవతారకార్యమైతే, ముఖ్యమంత్రిగా ఉండడం ఇంకొకడి అవతారకార్యం కావచ్చు. కానీ అవన్నీ సమానంగా దైవాదేశాలే. అందుచేత అవన్నీ సమానంగా గౌరవాస్పదాలే. అలాగే ఒక జాతి యావత్తు ఒక నాయకుడి కోసం తపించిప్పుడు వారందఱి సంకల్పాల ఫలితంగా కృత్యలా జన్మిస్తాడతడు.
మిత్రమా ! నీవు మనిషివి కావు. నీవొక పూర్వకర్మవి. నీవొక సంకల్పానివి. నీవొక అవతారకార్యానివి. నీవు దైవాదేశాల్ని పాటించవు. నీవే స్వయంగా ఒక దైవాదేశమై ఉన్నావు. అదే నీ వ్యక్తిత్వం.
9, డిసెంబర్ 2009, బుధవారం
మనుషులెందుకు నాస్తికులవుతారు ?
ఆధునిక ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల్లో ఉగ్రవాదం కంటే నాస్తికత్వం అతిపెద్దసమస్య. ఇది కేవలం భారతదేశానికీ, హిందూమతానికి పరిమితమైనది కాదు. అన్ని దేశాలూ, అన్ని మతాలూ నాస్తికుల నుంచి ముప్పు నెదుర్కుంటున్నాయి. అయితే ఇదివఱకు నేననేకసార్లు చెప్పినట్లు నాస్తికత్వంలో కూడా చాలా రకాలున్నాయి. అందుచేత నిజమైన నాస్తికుల్ని గుర్తుపట్టడంలో మనం అప్పుడప్పుడు విఫలమవుతాం. అసలు మనుషులెందుకు నాస్తికులవుతారో చర్చిస్తే ఆ బెడదని ఎలా నివారించాలో, ఎక్కణ్ణుంచి ఆస్తికతా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాలో మనక్కాస్త స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది.
సాధారణంగా నాస్తికుల జాతకాల్లో శుభగ్రహాలూ, శుభస్థానాలూ భారీయెత్తున పాడై ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గురుడూ, చంద్రుడూ బాలేక పోవడం మామూలు. గురుచండాలయోగం (గురుడూ, రాహువూ ఒకే రాశిలో ఉండడం) వల్ల కూడా నాస్తికులవుతారని పెద్దలు చెప్పారు కానీ అది ఇతరేతర జాతకబలాల మీద కూడా ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రహయుతి ఉన్న జాతకాలవాళ్ళందఱూ పూర్తిస్థాయి నాస్తికులైనట్లుగా అనుభవంలో గోచరించడంలేదు. కాకపోతే కొంత ఆచారహీనత, శుచీశుభ్రాల దగ్గఱ రాజీపడ్డం, పెద్దల్ని ఎదిఱించడం లాంటివి కనిపిస్తున్నాయి. గురుచండాలయోగం స్త్రీలలోను, పురుషుల్లోను ఒకే విధంగా కాక కొద్దిపాటి తేడాతో పనిచేయడం కూడా ఉన్నది. ఇది కాకతాత్కాలిక నాస్తికత్వం అనే స్థితి ఒకటుంది. అంటే, మనకి కర్మఫలం అనుభవించే రాత బలంగా రాసున్నప్పుడు దానికి పరిహారాలేమీ చేసుకోకుండా అడ్డుపడడం కోసం గ్రహాలు తమ దశాభుక్తుల్లో మనిషిలో అవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఆ దశాభుక్తులు గడిచిపోగానే మనిషి మళ్లీ ఆస్తికమార్గం లోనికి వస్తాడు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది దీని గుఱించి కాదు.
నాస్తికులు ఈ రోజే హఠాత్తుగా నాస్తికులుగా మారలేదని గమనించడం అవసరం. వారిలో అత్యధికశాతం మంది గతజన్మల్లో కూడా నాస్తికులే అయ్యుంటారు. అయినా వారికి మళ్లీ మానవజన్మెత్తే అవకాశం రావడం వారి బ్యాంకు ఖాతాలో డబ్బు (పుణ్యం) ఇంకా మిగిలుండడం వల్లనే తప్ప వారి నాస్తికత్వాన్ని భగవంతుడు క్షమించాడని గానీ, వారి ధోరణి సరైనదని గానీ తాత్పర్యం కాదు. నాస్తికులు కూడా అనుకోకుండా కొన్ని పుణ్యాలు (పరోపకారాలూ, ప్రజాసేవ లాంటివి) చేస్తారు. కనుక వారిక్కూడా వాటి ఫలం లభించకపోదు. కొన్నిసార్లు భగవంతుడే నాస్తికుల భవిష్యద్‌గతి పట్ల ఆందోళన చెంది వారి మెడలు వంచి బలవంతంగా పుణ్యకార్యాలు చేయిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ : మన రాష్ట్రంలోని నాస్తికులంతా ఆరాధించే తెలుగు రచయిత కీ.శే. కొడవటిగంటి కుటుంబరావు. ఆయన జీవితమంతా దేవుణ్ణి, మతాన్ని దుమ్మెత్తిపోయడంలోనే గడిచిపోయింది. ఆయన ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు చందమామ పిల్లల మాసపత్రికవారు ఆయన్ని సంప్రదించి రామాయణం మీద పిల్లలకోసం ఒక ధారావాహిక (serial) వ్రాయమని కోరారు. తన సిద్ధాంతాలకి వ్యతిరేకమైనప్పటికీ పరిస్థితులు బాలేక కుటుంబరావు ఒడంబడక తప్పింది కాదు. ’వీరహనుమాన్" పేరుతో కొన్నిసంవత్సరాల పాటు ఆయన రామాయణం ఎపిసోడ్స్ వ్రాశాడు. అదెంత పుణ్యకార్యమో నేను వేఱే మనవి చెయ్యనక్కఱలేదు. అందఱికీ లభించే అవకాశం కూడా కాదు. కుటుంబరావు దైవదూషణ పట్ల, అందువల్ల అతనికి ప్రాప్తించబోయే దుర్గతి పట్ల భగవంతుడెంత వ్యథ చెంది ఉంటాడో, అతని పూర్వీకుల పుణ్యాల్ని దృష్టిలో ఉంచుకొని చందమామ రూపంలో అతనికొక అవకాశాన్ని ఇవ్వాలని ఎలా నిర్ణయించుకొని ఉంటాడో మనం ఊహించవచ్చు.
కొంతమంది తమ జీవితంలోని తొలి దశాబ్దాల్లో ఆస్తికులై ఉండి మలి దశాబ్దాల్లో నాస్తికులుగా పరిణమించడాన్ని గమనిస్తాం. ఇలాంటివారు నాస్తికత్వ ప్రచారం కోసం తఱచుగా చెప్పే చార్వాక పురాణం ఇలా మొదలవుతుంది. "నేనూ మీలాగే దేవుణ్ణి, దెయ్యాన్నీ ఆచారాల్నీ, శాస్త్రాల్నీ గుడ్డిగా నమ్మినవాణ్ణే. గుళ్ళచుట్టూ గోపురాల చుట్టూ తిరిగినవాణ్ణే. ఆలోచించాక/ ఫలానా పుస్తకం చదివాక నాలో అంతర్మథనం మొదలయింది." అంటూ ఒక అలుపెఱుగని సత్యాన్వేషకుడి పోజు, అపర బుద్ధభగవానుడి పోజు ఇస్తారు. ఇక్కడ గమనించాల్సింది - పూర్వజన్మవాసనలు అలాంటివారి ప్రజ్ఞనిఆక్రమించుకోవడానికి చిన్నప్పట్నుంచి వారి అధోచైతన్యంలో ఎలా కాచుక్కూర్చున్నాయి? అనేది. ప్రతి వాసనా క్రియాశీలం కావడానికి జీవితంలో కొంత సమయం తీసుకుంటుంది. బలీయమైన కామవాంఛా వాసనలతో జన్మించిన వ్యక్తిలో బాల్యంలోనే ఆ లక్షణాలు గోచరించవు. అప్పుడు అతను అందఱు పిల్లల్లాగానే ఉంటాడు. యౌవనం వచ్చాకనే ఆ లక్షణాలు గోచరిస్తాయి. నాస్తిక వాసనలైనా అంతే. తమ సమయం వచ్చాక అవి మనిషిని సంపూర్ణంగా ఆక్రమించుకుంటాయి. అంతకుముందు అతడు ఆధ్యాత్మికతలో పాల్గొంటున్నప్పటికీ అది ఒక అంటీముట్టని వ్యవహారమే తప్ప అతనేదో భక్తతుకారామ్ స్థాయి నుంచి నేరుగా గోరా, లవణం స్థాయికొచ్చేశాడనీ, ప్రతి ఆస్తికుడూ అలా అవుతాడనీ భావించరాదు. కానీ అందఱూ అలా అవ్వాలని నాస్తికులు కోరుకుంటారు. అందుకే వారు ఆ చార్వాక పురాణాల్ని వినిపించడం.
నాస్తిక వాసనలు ఎలా మొదలవుతాయో గ్రహిస్తే వాటికి మన జీవితంలో స్థానం లేకుండా చేసుకోవడం ఎలాగో అర్థం అవుతుంది. నాస్తికత్వ మూలాలు మన పచ్చిస్వార్థంలోను, మన అహంకారంలోను, అవగాహనారాహిత్యంలోను ఉన్నాయి. ఉదాహరణకి- ఒకడు తన భార్యని అమితంగా ఆఱో ప్రాణంలా ప్రేమిస్తూ ఉండవచ్చు. ఆమెకి ప్రాణాపాయకరమైన అనారోగ్యం చేస్తే అతను హోరాహోరీ పూజలూ, మ్రొక్కులూ, పుణ్యక్షేత్ర సందర్శనాలూ చేసి తన భార్యని బతికించమని దేవుడి కాళ్ళవేళ్ళా పడి వేడుకొని ఉండవచ్చు. కానీ ఆమె జాతకరీత్యా, అంతకంటే ముఖ్యంగా, ఆమె కర్మఫలం రీత్యా ఆమె చనిపోక తప్పని పరిస్థితి ఉండొచ్చు. ఆమెని స్వస్థురాల్ని చెయ్యడం ఆమెకే మంచిది కాదు గనుక అందుకు భగవంతుడు అంగీకరించక పోవచ్చు. తత్‌ఫలితంగా ఆమె చనిపోయి ఉండొచ్చు. ఎంత వేడుకున్నా తన ప్రార్థనలూ, పూజలూ ఫలించలేదు కనుక ఆ వ్యక్తి దేవుడి మీద కక్ష పూన్తాడు. కానీ దేవుడితో పోలిస్తే మానవుడు పరమ అల్పుడు. ఆయన మీద కక్ష తీర్చుకునే మార్గమే లేదతనికి. అందుకని ఈ రూట్‌లో వస్తాడు, "దేవుడూ లేడు, దెయ్యమూ లేదు, ఈ శాస్త్రాలన్నీ బొంకులు, పురాణాలన్నీ బూతులు, పూజారులు దొంగలు, మతస్థాపకులు మోసగాళ్ళు, మతమంతా బతుకుతెఱువు కోసం కనిపెట్టిన మహా ఇండస్ట్రీ" అంటూ బజారుకెక్కుతాడు. దేవుడివిగ్రహాల్నీ, పటాల్నీ ఇంట్లోంచి చెత్తకుప్ప మీదికి విసిరేస్తాడు. (ఇలాంటి సంఘటన ఒకటి మా పొఱుగున జఱిగింది) తరువాత కొంతకాలానికి అతను కూడా చనిపోయి వేఱేచోట జన్మిస్తాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అంతకుముందు లేని నాస్తిక వాసనలు మనిషిలో అంకురించడానికి దోహదించే జీవిత ఘటనల్లో ఇది ఒకానొకటి మాత్రమే. ఇక్కడ వరసలు మారతాయేమో గానీ కథ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే భార్య స్థానంలో కొడుకు పోవచ్చు, కూతురు పోవచ్చు, భర్త పోవచ్చు, స్నేహితుడు పోవచ్చు.
ఆ భార్య తనకెవరు, తానామెని పెళ్ళి చేసుకోకముందు ? అప్పుడామె ఒకఱి కూతురు మాత్రమే. ఆమె వారికి కూతురుగా పుట్టక ముందు అమె వారికి ఏమవుతుంది ? ఏమీ కాదు. ఆమెకా జన్మ ఎవడైతే ఇచ్చాడో ఆమె శాశ్వతంగా ఆయన ఆస్తే. ఆమే కాదు, మీరూ, నేను అందఱమూ ఆయన ఆస్తులమే. "నా కష్టార్జితం, నా డబ్బు, నేను కట్టించిన యిల్లు" అని గంతులేస్తారే అల్పమానవులు. ఎవఱికైనా ఏదైనా అఱువిస్తే అణాపైసలతో సహా వసూలు చేసుకునేదాకా నిద్రపోరే ! తిరిగివ్వకపోతే రక్తం కళ్ళజూస్తారే ! మఱి తానిచ్చిన ప్రాణాన్ని వెనక్కి తీసుకునే హక్కాయనకి లేదా ? తన హక్కుని తానుపయోగించుకున్నందుకు మనం ఆయన మీద కక్ష గట్టేదేంటి ? ప్రపంచంలో అందఱమూ పోవాల్సినవాళ్ళమే, కొంచెం ముందో వెనకో ! వెనక పోయేవాళ్ళంతా ముందుపోయేవాళ్ళ గుఱించి దేవుడి మీద కక్ష గడుతూనే ఉండాలా ?
మనుషులు కాస్త ఆగి ఇలా నిదానంగా ఆలోచిస్తే నాస్తికత్వం అనే ఈ జన్మజన్మల ఊబి తమని లాక్కుని కబళించకుండా తమని తాము కాపాడుకోవచ్చు.
భగవంతుడికి మనకంటే ఓర్పు కొన్నికోట్ల రెట్లు ఎక్కువ అనేది నిజమే గానీ అంతమాత్రాన మనం ఆయన్ని అవమానిస్తే ఆయన సహిస్తాడనుకోవడం అమాయకత్వం మాత్రమే. స్వతః పాపాలు అనే పాపశ్రేణి ఒకటుంది. అంటే అవి చేస్తే ఎవరూ శపించకుండానే వాటి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాగే దైవదూషణ/ దైవాభిభవం స్వతః పాపం కావడం చేత ఆయన మన పట్ల అపకారాన్ని సంకల్పించక పోయినా మనం తగువిధంగా అనుభవించాల్సి వస్తుంది. సృష్టి యావత్తు మన మీద తిరగబడుతుంది. స్వర్గతుల్యమైన సృష్టి ఒక్కపెట్టున మన పాలిట నరకంగా మారిపోతుంది. ఇలాంటి దూషణ జఱిగిన సందర్భాల్లో ఆయన తన వంతుగా చేసేదేమంటే - కొంతసేపు ఆ దూషకుల నుంచి ముఖం తిప్పుకోవడం. ఇక్కడ ’కొంతసేపు’ అనే మాటకర్థం కొన్నివేల సంవత్సరాలని ! ఆ తరువాతి జన్మల్లో వారు ఎన్ని కష్టాలు పడినా ఆయన వారిని ఆదుకోవడానికి రాడు, తన తరఫున ఎవఱినీ పంపడు కూడా ! "చాలామంది దేవుళ్ళకి మొక్కుకున్నాం, ఏమీ జఱగలేదు" అని చెబుతారు కొంతమంది. ఎంత అడిగినా దేవుడు వినిపించుకోక పోవడానికి కారణం ఇలాంటి పూర్వజన్మదోషాలే.
పక్షాంతరంలో - కొంతమంది ప్రతిచిన్న నలతకీ OTC మందులు మింగినట్లు ప్రతిచిన్న ఇబ్బందికీ దేవుడికి ఎడాపెడా మొక్కులు మొక్కేస్తూంటారు. అవసరం తీఱాక ఆ మొక్కుల్ని చెల్లించడం గుఱించి మర్చిపోతారు. అందువల్ల మఱుజన్మలో వారు ఎన్ని మొక్కులు మొక్కినా భగవంతుడు ఆలకించడు, పట్టించుకోడు. పైపెచ్చు అలాంటివాళ్ళు చాలా తఱచుగా ధననష్టాలకి లోనవడం, "ఆ లాభం ఈ గూబలోకి సరి" అన్నట్లు ఎప్పడు సంపాదించినది అప్పుడే ఖర్చయిపోతూండడం, ఏమీ మిగలకపోవడం, వెఱసి అతిసామాన్యమైన జీవితం సంప్రాప్తమవుతాయి. ఇలాంటివారు ఈ జన్మలో దేవుణ్ణి ఎంత నమ్మినా వారికి ఏ మంచీ జఱక్కపోవడం వల్ల ఇఱుగుపొఱుగులూ, బంధుమిత్త్రులూ వారి మీద ఎకసక్కెంగా వ్యాఖ్యానించడం కూడా ఉంది. "ఏంటో ! ఎప్పుడూ దేవుడూ, దెయ్యం, గుళ్ళూ, గోపురాలూ అని తిరుగుతూంటారు. అయినా వీసమెత్తు వెనకేసింది లేదు" అని ! ఆ వ్యాఖ్యలకి లోనైనవారికి క్రమంగా దేవుడి మీద అపనమ్మకం మొదలవుతుంది. అలా నాస్తికులయ్యేవాళ్ళు మఱికొంతమంది. సాధారణంగా మనలోని దోషాలే దేవుడి దోషాలుగా, గురువు దోషాలుగా కనిపిస్తాయి. అవి సాక్షాత్తు మన దోషాలేనని, దానికి వారు బాధ్యులు కారనీ, మనం మారితే మన పట్ల వారి వైఖరి మారుతుందనీ గమనించడమే ఆధ్యాత్మికతకి తొలిమెట్టు.
దేవుడిది దివ్యాహంకారం. ఆయన ఎంత దయామయుడో ఆధ్యాత్మిక క్రమశిక్షణ దగ్గఱ అంత రాజీలేనివాడు కూడాను. "నియన్తా (dictator) నియమో యమః, దండో దమయితా దమః " అని వర్ణిస్తున్నాయి విష్ణుసహస్రనామాలు ఆయన్ని ! కనుక ఆయనతో లేదా ఆయన గుఱించి యథేచ్ఛగా మాట్లాడ్డం క్షేమదాయకం కాదు. అది ఆత్మకి పతనహేతువు. ఒకసారి ఒకఱి వల్ల తాను విమర్శకి లోనైన తరువాత ఆయన వారిని వారి కర్మకి వదిలివేయడమే జఱుగుతుంది. "దైవదూషణ నరకానికి త్రోవ" అని మతగ్రంథాల్లో చెప్పబడింది. అయితే ఇక్కడ నరకమంటే ఖచ్చితంగా రౌరవ, కుంభీపాక, అసిపత్రాది నరకాలని కాదు. భూలోకంలోని మానవేతర (non-human) జన్మలన్నీ నరకం కిందనే జమ. చలేస్తే మానవులు కంబళ్ళు కప్పుకుంటారు. తిర్యక్కులు ఏం చేస్తాయి ? వాటికి ఏ రక్షణా లేదు. జీవితాలకి ఏ భరోసా లేదు. ఏది కావాలన్నా, ఎంత బాధగా ఉన్నా నోరు తెఱిచి చెప్పలేవు. అలా ఉంటాయి నరకాలంటే ! అవి దేవుడి చేత వదిలిపెట్టబడిన జన్మలు. పురాకృత దోషాలు తీవ్రతరమై సంప్రాప్తించే జన్మలు. "మానవుడంటే ఉన్నతి పొందిన జంతువు" అంటుంది పాశ్చాత్య విజ్ఞానం. "అలా కాదు, జంతువంటే పతనం చెందిన మానవుడు" అంటుంది హిందూధర్మం. నాస్తికత్వం ఇలాంటి పతనాల్లో అగ్రగణ్యమైనది.
మనుషులు నాస్తికులు కావడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి. "మనిషి తెలిసీ ఎందుకు పాపం చేస్తాడు స్వామీ ?" అని కర్మయోగంలో అర్జునుడు భగవంతుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్పినది : :కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ:" అన్నారు. ఎన్ని తెలిసినా కామక్రోధాలకి లోనయితే మనిషి పాపం చేస్తాడని ఆయన చెప్పారు. ఇక్కడ రజోగుణం (dominating nature) అనే మాట వాడారు, జాగ్రత్తగా గమనించండి. రజోగుణం అధికార బలారాధన, బలప్రదర్శన, సంపదల పట్ల ఆసక్తి, తాను గొప్పవాణ్ణనే అభిమానం, తనకన్నీ తెలుసుననే అహంకారం, తన గుఱించి అందఱూ గొప్పగా అనుకోవాలనే/ చెప్పుకోవాలనే దాంభిక ప్రవృత్తి మొదలైనవాటికి కారణం. ఈ లక్షణాలున్నవారు సహజంగా ఉగ్ర, పరుష స్వభావులై ఉంటారు. శాస్త్రాల్లో చెప్పబడని ఇంకో ప్రభేదానికి చెందిన రాజసిక (రజోగుణ) మనుషులు వీరిలోనే ఉంటారు. వారు ప్రచ్ఛన్న ఉగ్రులు (hidden aggressive). వాళ్ళెందుకు ప్రచ్ఛన్నులు ? అంటే - వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు. హుషారుగా చలాకీగా దర్శనమిస్తారు. ఎప్పుడూ సరదాగా జోక్స్ వేస్తూంటారు. చమత్కారంగా మాట్లాడతారు. ఆగండి, ఒక్క నిమిషం. ఇదంతా ఇతరుల పట్ల హీనభావంతోనే సుమా ! వారు వేసే జోక్స్ అన్నీ ఇతరుల హృదయాల్ని నొప్పించడానికీ, అవమానించడానికీ ఉద్దేశించినవే. తాము చాలా తెలివైనవాళ్ళమనీ, సృజనాత్మకులమనీ ఇంప్రెషన్ కలిగించడం కోసం చేసే పని అది. ఈ మధ్య పాశ్చాత్య మనశ్శాస్త్ర పరిశోధకులు కూడా ఈ జోకర్ల మనస్తత్త్వాన్ని శోధించి ఇది dominating nature లో ఒక భాగమని తేల్చడం గమనార్హం. చెప్పొచ్చేదేంటంటే, ఇలా ప్రతిదాన్నీ ఎగతాళి చేసేవారిలో భావి నాస్తికులు దాగి ఉన్నారని గ్రహించాలి. ప్రతి నాస్తికుడిలోను, లేదా ప్రతి అల్పవిశ్వాసిలోను ఈ తత్త్వాన్ని స్పష్టంగా గమనించవచ్చు. అతను కేవలం దేవుడు, మతం లాంటి మత/ ధార్మిక/ పారలౌకిక విషయాలనే కాక ప్రపంచంలో ప్రతి మనిషినీ, ప్రతి విషయాన్నీ ఎగతాళి చేసే దుర్లక్షణం గలవాడనీ, అతను వాడే పదజాలం ఎంత ఆడంబరంగా ఉన్నప్పటికీ అతనికి విషయాల పట్ల గంభీర వైఖరి (serious attitude) లేదని అర్థమౌతుంది. కనుక ఆధ్యాత్మిక మార్గం కావాలనుకున్నవారు ఈ హాస్యగాడి మనస్తత్త్వాన్ని సుదూరంగా వివర్జించాలి. ఈ మనస్తత్త్వం ఉన్నవాళ్ళని కూడా వివర్జించాలి. ఇప్పటికే ఆధ్యాత్మికతలో చాలా ముందుకెళ్ళినవారికి మాత్రం ఈ నియమం వర్తించదు.
నాస్తికత్వ అభివృద్ధిలో హాస్యగాడితనమంత పెద్దపాత్ర పోషించేది అధర్మశృంగారం. లోకంలో కొంతమంది మనుషులుంటారు. వారికి సాధారణ దాంపత్య సంబంధంలో మజా ఉండదు. దాని కంటే వేఱైన అసాధారణ కామవాంఛలతో వేగిపోతూంటారు వారు. ఒక నీతీ, నియమం లేకుండా, వివాహిత, అవివాహిత అని చూడకుండా, వావీ వరసా పట్టించుకోకుండా, మొత్తమ్మీద ఆడజీవి అయితే చాలు, దొఱికినదాన్ని దొఱికినట్లు వలలో వేసుకొని ఎడాపెడా అనుభవించడమే జీవితగమ్యంగా, నీచమైన కామకక్కుర్తితో బ్రతుకుతూంటారు. కానీ ఒకపక్క ఇలా చేస్తున్నప్పటికీ మనసులో మఱోపక్క తాము చేస్తున్నది మంచిపని కాదేమోననే అపరాధ భావన కూడా ఉంటుంది. అక్రమంగా సుఖించిన ప్రతిసారీ తమ పట్ల తాము తీవ్రమైన అసహ్యభావనతో లోలోపల క్రుంగిపోతూంటారు. అలాగని ఆ పని మానుకోలేరు. ఇది భగవంతుడి చేతుల్లో దండనకి దారితీస్తుందని వారు అంతకుముందే విని ఉంటారు. ఈ అపరాధ భావననీ, క్రుంగుబాటునీ జయించి ప్రశాంతంగా ఉండాలంటే దేవుడు, ధర్మం, ధర్మశృంగారంలాంటి పరిభావనల్ని వదిలించుకోవడం తప్ప వారికి గత్యంతరం కనిపించదు. ఇలా ఈ అధర్మశృంగార మార్గంలో నాస్తికులైనవాళ్ళు కోట్లాదిమంది.
ముందు మనుషులు గ్రహించాల్సింది ఇది. భగవంతుడు మనుషుల నుంచి అన్నివిషయాల్లోనూ సౌష్ఠవాన్ని (perfection) ఆశించడం లేదనేది. ఏ కొంచెం సద్గుణాలున్నా ఆయనకి చాలు. అందుకే భగవద్గీతలో కూడా "స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్" (ఈ ధర్మం అనేది ఏ కొంచెం ఆచరించినా సరే, గొప్ప భయం నుంచి కాపాడుతుంది. కాపాడతాను) అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఒక తల్లికి తన బిడ్డ తన బిడ్డగా మిగిలిపోయి తన దగ్గఱుంటే చాలు. జీవితంలో వాడు ఇంకేమి అయినా కాకపోయినా ఆమె సర్దుకుపోతుంది. దేవుడైనా అంతే ! దొంగతనానికి వెళ్ళేవాడు కూడా వెళ్ళబోయేముందు "స్వామీ ! ఈరోజు మంచి బేరం తగిలేలా అనుగ్రహించు" అని ప్రార్థిస్తే ఆయన సంతోషిస్తాడే తప్ప అసహ్యించుకోడు. అప్పుడాయన సమాజానికి నష్టం లేని దొంగతనాల్ని వాడిచేత చేయిస్తాడు. ఆ తరువాత సమయం చూసుకొని వాణ్ణి మార్చేస్తాడు. అందుకే రుద్రంలో శివుణ్ణి "చోరాణాం పతయే నమః" (దొంగల దేవుడికి వందనము) అని నమస్కరించారు.
ప్రార్థనల ద్వారా మనం ఆయన అధీనంలోకి వెళ్ళాక మన చిటికెనవేలు ఆయన పట్టుకుంటాడు. మనది తప్పులు చేయకుండా ఉండలేని స్వభావమైతే ఆ తప్పుల ద్వారా మనకి గానీ, ఇతరులకు గానీ నష్టం జఱక్కుండా జాగ్రత్తలు తీసుకొని ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. ఎన్నితప్పులు చేస్తున్నప్పటికీ దైవనామాన్ని వదలకుండా పట్టుకుంటే అదే ఏదో ఒకరోజు, ఏదో ఒక జన్మలో మనల్ని ఉద్ధరిస్తుంది. అన్నివిషయాల్లోనూ పరమ పరిశుద్ధంగా ఉండడం దైవనామస్మరణకి పూర్వార్హత కాదు. పరమపవిత్రులకీ, జీవన్ముక్తులకీ దేవుడితో అవసరమే లేదు. నారద మహర్షికి ఇతరుల మధ్య తగాదాలు పెట్టే అలవాటు. అది మాన్పించడం శ్రీహరిక్కూడా చేతకాలేదు. అందుచేత ఆ తగాదాల మూలాన అంతిమంగా లోకానికి మేలే చేకూడే విధంగా ఆయన జాగ్రత్తపడుతూ వచ్చాడు. అయితే ఒక్కసారి కూడా, "ఏమిట్రా ఇలా చేస్తున్నావ్ ?" అని తన భక్తుణ్ణి పల్లెత్తి మాటనలేదు. కనుక అధర్మశృంగారపరులు దేవుడికి దూరం కారు. దగ్గఱివాళ్ళే. ఎందుకంటే ఆయనే స్వయంగా గొప్ప శృంగారమూర్తి. ఎంతో కొంత దాని ఫలితం దానికుంటుంది గానీ దాని గుఱించి ఇప్పుడాలోచించి బుఱ్ఱపాడుచేసుకొని దేవుణ్ణి మొదలే వదిలిపెట్టడం అవివేకం. కనుక అధర్మశృంగారాన్ని మానుకోలేకపోతే దాన్తోపాటు మఱోపక్క అనునిత్య దైవోపాసన కూడా చేయడం మంచిది.
నాస్తికత్వానికి గల మఱో పార్శ్వం - దైవోపదేశం/ గురూపదేశం గానీ, దైవాదేశం/ గుర్వాదేశం గానీ లేకుండానే విపరీతంగా పుస్తకాలు చదవడం. ముఖ్యంగా మతవిషయంలో ఎవరు పడితే వారు వ్రాసిన పుస్తకాలు చదవడం పనికిరాదు. శాస్త్రాలు ఎవరికి వారు చదివితే అర్థమయ్యేవి కావు. ఈ రోజుల్లో ముద్రణయంత్రాల పుణ్యమా అని పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొఱుకుతున్నాయి. డబ్బులు పారేస్తే కొనుక్కోవచ్చు. అయితే భగవద్దర్శనం పొందనివాళ్ళు లేదా భగవదాదేశం లేనివాళ్ళు, గురుసేవ చెయ్యనివాళ్ళు, ఆత్మజ్ఞానం లేనివాళ్ళు, కించిత్‌తపోబలం కూడా లేనివాళ్ళు - ఇలాంటివాళ్ళు దేవుడి మీదా, మతం మీదా రాసే పుస్తకాలూ, వ్యాసాలూ చదవడం, మీదుమిక్కిలి వాటిని నమ్మడం మంచిది కాదు. మతగ్రంథాలు తపశ్శాలురైన ప్రాచీన మహనీయుల చేత రచింపబడ్డాయి. వారు దైవభక్తులు, గురుసేవా పరాయణులు, భగవత్‌సాక్షాత్కారమూ భగవదాదేశమూ కలిగినవారు, బ్రహ్మచర్య వ్రతదీక్షాపరులు, ఆత్మనిగ్రహవంతులు, లోక కల్యాణకాములు. అలాంటివారు వ్రాసినవాటిని మనలాంటివారు స్వతంత్రించి చదివితే మన మతధర్మ పరిజ్ఞానం అల్పాత్యల్పం కాబట్టి అంతరార్థాల సంగతలా ఉంచి, అన్నీ అపార్థాలే స్ఫురించి ఛప్పన్న గుంటల్లో, గోతుల్లో లేవలేకుండా పడిపోతాం. వట్టి భాష తెలిసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. అంబేడ్కరు సంస్కృతం నేర్చుకొని హిందూ మతగ్రంథాల్ని స్వయంగా చదివి ఆ తరువాత వాటిని ఏకిపారేస్తూ లావుపాటి సాహిత్యం సృష్టించాడు.
"విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్" (ఒక పండితుడి శ్రమని ఇంకో పండితుడే గ్రహించగలడు) అనే ఆర్యోక్తి చొప్పున ఆ ప్రాచీన మహనీయుల యథార్థభావం అవగతం కావాలంటే మళ్ళీ అంతటి సమకాలిక మహనీయుణ్ణే వెతికి పట్టుకొని పాదనమస్కారం చేసుకొని దయతో ఆ గ్రంథాన్ని వివరించవలసిందిగా ప్రార్థించాలి. ఈ రోజుల్లో అలా చెయ్యక పోవడం వల్ల అశిక్షితులైనవారు హిందూ మతగ్రంథాల్లో రామాయణం నుంచి మనుధర్మశాస్త్రం దాకా దేన్నీ వదలకుండా తమ స్వీయ అవగాహనా కోణం నుంచి బుఱద జల్లడమూ, లోతెఱుగని పామరజనం దాన్ని సుగంధద్రవ్యంగా భావించడమూ జఱుగుతున్నది.
నాస్తికత్వానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉన్నది.
పూజలూ, వ్రతాలూ చేసేవారు ఆ పూజాసమయంలో భగవంతుడి మీద మనసుని కేంద్రీకరించక పోవడం వల్ల ఆ సమయంలో వారు దేన్ని స్మరిస్తారో వారికి అదే ప్రాప్తిస్తుంది. వారు ఆ సమయంలో దేన్ని స్మరిస్తున్నారో ఆ సర్వాంతర్యామికి తెలుసు. అయితే పూజ ఎలా చేసినా చేసినందుకు తగు ఫలితమివ్వక తప్పదు. "యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్" అందువల్ల ఆ పూజకులు మఱుజన్మలో ఆ పుణ్యఫలాన్ని అనేక రూపాల్లో అనుభవిస్తారు. కానీ దైవభక్తి మాత్రం ఉండదు. "మాకు దైవభక్తి లేదు, మేం పూజలు చెయ్యం, కానీ మాకిప్పుడొచ్చిన నష్టమేంటి ?" అని వాదిస్తారు కూడా. ఈ వాదన ముదిఱి నాస్తికత్వంలోకి దిగే సంభావ్యత హెచ్చు. కనుక ఫోన్ చేసేటప్పుడు ఎలాగైతే కరెక్ట్ నంబర్ డయల్ చేస్తామో, అలాగే పూజ చేసేటప్పుడు కరెక్టుగా దేవుడి నెంబర్ డయల్ చేసేటట్లు చూసుకోవాలి.
(సమాప్తం)
7, నవంబర్ 2009, శనివారం
ఆ ఋణం తీఱుద్దామా ? లేక ఇంకా ఋణాల ఊబిలో కూరుకుపోదామా ?
ತಿಳಿದು ನೋಡಿದರೆ ಬಾಳು ಎಂಬುದಿದು ಋಣದ ರತ್ನಗಣಿಯೋ"
(ఎనితు జన్మదలి ఎనితు జీవరిగె ఎనితు నావు ఋణియో
తిళిదు నోడిదరె బాళు ఎంబుదిదు ఋణద రత్నగణియో)
"ఎన్ని జన్మల్లో ఎందఱు జీవులకి మనం ఋణగ్రస్తులమో
కనిపెట్టి చూస్తే ఈ జీవితమనేది ఋణరత్నాల నిక్షేపమేమో"
అంటారు ప్రముఖ కన్నడకవి శ్రీ ఎమ్.ఎస్. శివరుద్రప్ప. మనిషి పుడుతూనే దేవఋణం, పితృఋణం, ఋషిఋణం అని మూడురకాల ఋణాలతో జన్మిస్తాడని మన పూర్వగ్రంథాలు తెలుపుతున్నాయి. వివిధ దేవతలు మన శరీరంలోని వివిధ అవయవాలకి అధిష్ఠాన దేవతలై ఈ రూపాన్ని మనకి ప్రసాదించారు. వారే పంచభూతాల్లోను, సమస్త ప్రకృతిలోను నివసిస్తున్నారు. అందుచేత లోపలా, వెలుపలా కూడా వారే ఉన్నారు. వారు లోపల ఉన్నప్పుడు జీవశక్తులనీ, వెలుపల ఉన్నప్పుడు ప్రకృతిశక్తులనీ పిలవబడతారు. ఆ విధంగా వారు మనతో నిత్యనివాసం చేస్తున్నారు. కనుక దేవఋణాన్ని జప తపో ధ్యాన హోమ యజ్ఞాదుల ద్వారాను, పూజాదికాల ద్వారాను తీర్చాలి. అప్పుడు వారు సంతుష్టి చెంది మన జీవితానికి కావాల్సిన ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తారు.
పితృదేవతలు మన తండ్రుల వృషణాలలో నివసించి మన పుట్టుకకి కారణమయ్యారు. పైపైన చూడ్డానికి మన జన్మకి నిమిత్త కారకుడు మన తండ్రి అయినప్పటికీ, తెఱ వెనుకనున్న అసలు కారకులు పితృదేవతలే. వారి అనుగ్రహం లేకపోతే భార్యాభర్తలు ఎంత హోమ్ వర్క్ చేసినా ఏమీ లాభం లేదు. వారు మన పూర్వీకులు కారు. పితృలోకం అని ఒకటుంది. చనిపోయినవారు తమ పాపపుణ్యాల అనుసారంగా ఊర్ధ్వ, అధో లోకాలకి వెళ్ళబోయేముందు అక్కడ మజిలీ చేస్తారు. ఆ లోకానికి అధిపతులు పితృదేవతలు. అందుచేత వారిని సంతృప్తిపఱచడం కోసం ప్రతి సంవత్సరమూ తద్దినాలు పెట్టాలి. లేకపోతే వారు ఆగ్రహిస్తారు. విధివిహితంగా వివాహం చేసుకొని పెద్దల వంశాన్ని కొనసాగించడమే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గం.
ఇహపోతే ఋషిఋణం. దీన్ని ఒక రకంగా గురుఋణం అని చెప్పుకోవచ్చు. మానవులకి నాగరికత లేని రోజుల్లో భగవదాదేశం మీద వారి మధ్య జన్మించి వారికి ప్రాథమికమైన మంచి, చెడు, శుచీ, శుభ్రం, వావి-వరుస, రాజ-ప్రజా ధర్మాలూ, పతి-పత్నీధర్మాలూ, పితాపుత్ర ధర్మాలూ, గురుశిష్య ధర్మాలూ, దైవభక్తి, పాపభీతి గట్రా బోధించి, చూపించి వెళ్ళిన ఆదిమ గురువులున్నారు. వారికే ఋషులని పేరు. వారి బోధల్ని అచంచల విశ్వాసంతో వేలాది సంవత్సరాల పాటు మానవజాతి అనుసరించడం వల్లనే మానవ నాగరికత ఇప్పుడు ఇంత మహోన్నత స్థితికి చేఱుకుంది. అయితే ఇప్పుడు వాటిని ధైర్యంగా ఉల్లంఘిస్తున్నారు కనుక ఇది త్వరలో సంపూర్ణంగా పతనం (collapse) అవుతుంది. ఆ తరువాత ఆ ఆదిగురువులే పతనమైన ధర్మాల్ని తిరిగి నిలబెట్టడం కోసం భావి-అనాగరికుల మధ్యకి దిగిరావాల్సి వస్తుంది. వారికి సేవ చేద్దామంటే వారిప్పుడు మనకి లభించరు కనుక వారి గ్రంథాల్ని మనం అధ్యయనం చెయ్యడం, ఇతరులకి అధ్యాపనం చెప్పడం, ఆచరించడం - ఇవే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గాలు.
నా దృష్టిలో ఇంకో ఋణం ఉంది. అది ప్రకృతిఋణం. ప్రకృతి జగదంబా స్వరూపం. ఓమ్ ప్రకృత్యై నమః అంటారు లక్ష్మీ అష్టోత్తరంలో ! కనుక ఇక్కడ ప్రతివిషయాన్ని శ్రీ అమ్మవారు తన ప్రేమామృతంతో రంగరించి సృష్టించి ఉన్నారు. ఒక వడ్లగింజని తీసుకొని పరిశీలించండి. ఆ గింజలు తన మానవ బిడ్డలకి చేఱాలనే ఆ తల్లి తపన మీకర్థమవుతుంది. ఎంత పకడ్బందీగా ఆవిడ ఒక్కొక్క గింజని ప్యాకేజి చేసిపెట్టిందో చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. భగవంతుడు/ భగవతి తన మీద కుఱిపిస్తున్న ఈ వాత్సల్యానికి ప్రతిగా మనిషి ఏం చేస్తున్నాడు ? అవే ఆహార పదార్థాల్ని కల్తీ చేసి తోటి మానవులకి సరఫరా చేస్తున్నాడు. ఒకవేళ భగవంతుడు/ భగవతి ప్రత్యక్షమై " ఏరా ! నేను నీకు పరిశుద్ధమైన ప్రేమతో అందించిన ఆహారాన్ని అదే విధమైన ప్రేమతో నీ తోటి మానవులకి అందించాల్సిన అవసరం లేదా ? లేదని నువ్వంటే నీలాగే నేను కూడా నీకు కలుషితాహారాన్నే ప్రసాదిస్తే నీ గతేమవుతుందో ఆలోచించావా ?" అనడిగితే వీడి సమాధానమేంటి ?
మన పూర్వీకులు మనకొదిలిపోయిన పరిశుద్ధమైన నీటిని, గాలినీ, పరిసరాల్నీ మనం అలాగే ఉంచుతున్నామా ? వారు మనకి వాటిని ఎలా అందించారో అలాగే మనమూ భావితరాలకి అందిస్తే అదే నిజంగా దేవ, పితృఋణాల్ని తీర్చడం అవ్వదా ?
5, నవంబర్ 2009, గురువారం
ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషంట ! సిగ్గులేకపోతే సరి
కచ్చితంగా మతులు పోయాయి అందఱికీనూ.
ఈనాడులో ప్రచురించిన ఈ వార్త చదవండి: http://www.eenadu.net/story.asp?qry1=6&reccount=38 ఇదే వార్తని జతచేసిన కవిలెలోనైనా చదవవచ్చు.
--------------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧
---------
పిల్లలకు చదువు ఎలా చెప్పాలనేది నిపుణులకు తెలిసినట్టుగా మనకు తెలవదు. అలాంటి దాని సంగతి తేల్చడం కోసం పిల్లల తలిదండ్రుల వద్ద అభిప్రాయాలు తీసుకుంటారంట ! ఆ తల్లిదండ్రులెవరూ..? తమ పిల్లలు ఏ సిలబస్సులో చదూతున్నారో తెలీనివాళ్ళు!
మాన్యుఫాక్చరింగ్ ది కన్సెంట్ అని పుస్తకమేదో ఉన్నట్టుంది కదా.. అందులో ఇలాంటి వాటిని గురించి బహుశా చోమ్‌స్కీ చెప్పి ఉంటాడేమో! చెప్పాడో లేదో గానీ, మన ప్రభుత్వం మాత్రం ఇలాంటివాటిల్లో నైపుణ్యం సాధించింది.సెజ్‌ల పట్ల ప్రజాభిప్రాయం తీసుకునే పద్ధతులు చూసాం. ఇలాంటి వాటిల్లో అభిప్రాయాలు తయారుచేసే పద్ధతి ఇలాగన్నమాట. అయిలయ్య లాంటివాళ్ళు ఈ అభిప్రాయాల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తూంటారు. (అయిలయ్య ఇంకోమాటన్నాడు.. గిరిజన పిల్లలకు తెలుగు కంటే ఇంగ్లీషే బాగా వస్తున్నదంట. వాళ్ళు తెలుగులో తప్పుతున్నారంట, ఇంగ్లీషులో ప్యాసవుతున్నారంట. గిరిజనులకు తెలుగు పరాయి భాషే. వాళ్ళ మాతృభాషలో చెబితే సంతోషంగా బడికి వెళ్ళి చదూకుంటున్నారంట. "నేను చిన్నప్పటి నుంచీ తెలుగులో చదూకున్నాను, కానీ ఇప్పుడు ఇంగ్లీషులో రాసినంత బాగా తెలుగులో రాయలేను" అనీ అన్నాడు")
పంతుళ్ళు, అధికారులు - ఇంగ్లీషులో చదువు చెప్పడం కోసం సీబీయెస్యీ మొదలెట్టారండి. పంతుళ్ళకు, అధికారులకు అది కొరుకుడుబడలేదు, తిరిగి రాష్ట్ర సిలబస్సుకు రావాలని అడుగుతున్నారు. అంచేత ఇంగ్లీషు మీడియమ్ అయినా పర్లేదని అనుకుంటున్నట్టున్నారు. ఎవడి బాధలు వాడివి.
ఇలాంటి అభిప్రాయాల సేకరణలో భాషానిపుణులను, తెలుగు సంఘాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని మనం గోలెట్టాలి.
------------------------------------------------------------------------------------
అభిప్రాయం ౨
.......................
గత సంవత్సరం వీళ్ళు బలవంతంగా ఇంగ్లీషు మీడియమ్ లో కుక్కిన పిల్లల్లో సగం మంది "మాకోద్దీ ఇంగ్లీషు మీడియమ్ బాబో" అని ఈ సంవత్సరం నుంచి మళ్ళీ తెలుగుమీడియమ్ లోనే పోయి కూర్చుంటున్నారు. అది చూశైనా ఇంకా ఈ తల్లిదండ్రులకీ, ఈ అధికారులకీ, ఈ పంతుళ్ళకీ బుద్ధి రాకపోవడం విచారకరం. "అయినా సరే ఇంగ్లీషే కావా"లని చెప్పిన పంతుళ్ళ సంఖ్య అత్యల్పం. కానీ ఈనాడు వాళ్ళ అభిప్రాయాల్నే ఉద్ద్యోతిస్తున్నది చూడండి. లోపం ఎక్కడుందంటే మనవాళ్ళు భాషని సమాజంతో సంబంధం లేని ఒక ఐకాంతిక స్వమూర్తి (stand-alone entity) గా చూడ్డం దగ్గఱ. నేర్పితే వచ్చేస్తుందనుకుంటున్నారు. చుట్టూ ఉన్న సమాజంతో సంబంధం లేని భాషని కృత్రిమంగా అభివృద్ధి చెయ్యగలమనుకోవడం మూఢవిశ్వాసమని తెలుసుకోలేకపోతున్నారు. ఇంతమందికి ఇంగ్లీషు నేర్పాక ఆ తరువాత వాళ్ళేం చెయ్యాలో, వాళ్ళచేత ఏం చేయించాలో ఐడియా లేనివాళ్ళంతా ఇంగ్లీషు మీడియమ్ ని సమర్థిస్తున్నారు.
ముందు మన తెలుగువాళ్ళలో భాష గుఱించిన ఈ విధమైన దురభిప్రాయాల్ని పోగొట్టడానికి తెలుగభిమానులైన మేధావులంతా తలో వ్యాసమూ రాసి ఒక పుస్తకంగా విడుదల చెయ్యాలని నాకనిపిస్తుంది. ఆలోచన బావుందని మీరంటే ఈరోజే కార్యరంగంలోకి దిగుదాం. నావంతుగా నేను కొన్ని వ్యాసాలు రాయడానికి సిద్ధం. ముందు దీన్ని పి.డి.ఎఫ్. పుస్తకంగా అంతర్జాలంలో విడుదల చేసి తరువాత ప్రజాస్పందనని బట్టి ముద్రించి అమ్ముదాం.
-----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౩
అయిలయ్య చెప్పినమాటలు నేను సరిగ్గా రాయలేదు. తిరగ రాస్తున్నాను:
(అయిలయ్య ఇంకోమాటన్నాడు.. గిరిజన పిల్లలకు తెలుగు కంటే ఇంగ్లీషే బాగా వస్తున్నదంట. వాళ్ళు తెలుగులో తప్పుతున్నారంట, ఇంగ్లీషులో ప్యాసవుతున్నారంట. ఇంకా ఇలా అన్నాడు: "నేను చిన్నప్పటి నుంచీ తెలుగులో చదూకున్నాను, కానీ ఇప్పుడు ఇంగ్లీషులో రాసినంత బాగా తెలుగులో రాయలేను" )
------------------------------------------------------------------------------------
అభిప్రాయం ౪
ఇంతకీ ఎవరండీ ఈ అయిలయ్య? నాకు అర్థం కాలేదు.
* * *
తప్పదు. "అసలు భాష అన్నది పుట్టిందే మన అభిప్రాయాలూ ఆలోచనలూ వేఱేవారికి చేఱవెయ్యడం కోసం, కాబట్టి తెలుగు భాష ఉంటే ఎంత లేకపోతే ఎంత?" వంటి దరిద్రపుగొట్టు ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉండాలండీ ఆ వ్యాసాలలో.
----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౫
రాష్ట్ర జనాభాలో పూర్తిగా మూడు శాతం కూడా లేని నాన్-తెలుగు గిరిజనుల పేరు చెప్పి తెలుగుని తొక్కేయ్యాలని చూడ్డం, ఉర్దూ ముస్లిముల పేరు చెప్పి తొక్కెయ్యాలని చూడ్డం, లేకపోతే రాష్ట్ర సరిహద్దుల్లో నివసించే తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా గట్రా మైనారిటీ సమూహాల్ని చూపించి తొక్కేయాలని చూడ్డం, భాగ్యనగరానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూండే ఉత్తర భారతీయుల్ని చూపించి "అదిగో వాళ్ళొద్దంటున్నా"రని చెప్పి తొక్కెయ్యాలని చూడ్డం - ఈ కుట్రలన్నీ మనకిదివఱకే తెలుసు. ఈ వాదాలు చేసేవాళ్ళంతా రాష్ట్రంలో 92 శాతం మంది ఉన్న మెజారిటీ తెలుగువాళ్ళ భాషాహక్కుల గుఱించి మౌనం వహిస్తారు. వాటిని చాలా కన్వీనియంట్ గా మర్చిపోతారు. మనల్ని కూడా మర్చిపొమ్మంటారు.
---------------------------------------------------------------------------------
అభిప్రాయం ౬
ఇలా తెలుగు అక్కఱలేదు అనుకునేవాళ్లని అందఱినీ, ఏదో సినీమాలో చూపించినట్టుగా, గోనెసంచీలలో కట్టిపారేసి అప్రాచ్యదేశాలకి పార్శిల్ చేశేయాలండీ. అప్పుడు కానీ కుదరదు వీళ్ల తిక్క.
------------------------------------------------------------------------------------అభిప్రాయం ౮
హ్హ హ్హ హ్హ ఇంగ్లీషులో చదివితే ప్యాసవుతున్నారా? ఇంగ్లీషులో వాళ్ళు ఎంతమటుకు రాస్తారో, వాళ్ళ పరీక్ష పేపర్లు దిద్దే టీచర్లను అడగమని చెప్పండి.
పదవతరగతి వరకు తెలుగుమీడియంలో చదివి, ఇంటరులో ఇంగ్లీషు మీడియం చేరగానే, మనవాళ్ళకు 900 పైగా మార్కులు వస్తున్నాయంటే కారణం అది ఆంగ్ల గొప్పతనం కాదు. పరీక్ష పేపర్లు దిద్దేవాడి మహత్మ్యం. ఒక్కసారి పరీక్ష పేపర్లు దిద్దేవాడు, జవాబు పత్రంలో ఏం రాశాడో చూసి పేపరు దిద్దితే, మన రాష్ట్రంలో ఒక్కడు కూడా ఇంగ్లీషు మీడియం తీసుకోడు ఇంటరులో.
జవాబు పత్రంలో సగానికి పైగా కహానీలే ఉంటాయి. లేదా పరీక్ష పేపరునే అటు తిప్పి ఇటు తిప్పి రాస్తారు. అదే తెలుగు మీడియం వానికి ఆ అవకాశం ఉండదు.
పేపర్లు దిద్దేవాడికి మాత్రం డబ్బులు కావాలి అంతే. ఎన్ని ఎక్కువ పేపర్లు దిద్దితే అన్ని ఎక్కువ డబ్బులు.
----------------------------------------------------------------------
అభిప్రాయం ౯
"భాష ఉంటే ఎంత ? పోతే ఎంత ?" అని అడిగితే నేను కూడా "మిగతావి ఉంటే ఉంటే ఎంత పోతే ఎంత ?" అని అడుగుతాను. సమాధానం చెప్పమనండి. ఏం ? అడక్కూడదా ?
మానవహక్కులు ఉంటే ఎంత ? పోతే ఎంత ?
ఇండియా ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?
స్త్రీల హక్కులు ఉంటే ఎంత పోతే ఎంత ?
ఎస్సీలు ఎస్టీలూ ఉంటే ఎంత ? పోతే ఎంత ?
దేశాలు ఉంటే ఎవడిక్కావాలి ? లేకపోతే ఎవడిక్కావాలి ?
ప్రజాస్వామ్యం ఉంటే ఎవడిక్కావాలి ? లేకపోతే ఎవడిక్కావాలి ?
నేరాలు పెరిగితే ఏంటి ? పెరక్కపోతే ఏంటీ ?
భాష కేవలం పరస్పర వ్యక్తీకరణకే అయితే మఱి ఇంగ్లీషు కాకుండా ఏ భాషయినా పనికొస్తుందిగా ? బళ్ళలో ఇంగ్లీషే ఎందుకట ? తెలుగు ఎందుకు ఉండకూడదట ?
సరే, భాష పరస్పర వ్యక్తీకరణకే. బావుంది. మఱి ఆకలి కూడా ఏ పదార్థంతో నయినా తీర్చుకోవచ్చు కదా ? ఏది పడితే అది ఎందుకు తినడంలేదట జనం ? కామం భార్యతోనే ఎందుకు తీర్చుకోవాలి ? తల్లితో ఎందుకు తీర్చుకోకూడదు ? ఆఫ్టరాల్ ఈ తల్లి భార్య అనేవి కేవలం భాషే తప్ప కామానికి అవేమీ తెలియవుగా ?
ఇదొక పిచ్చివాగుడు. ఇది reasoning కాదు. Anti-reason. దాన్నొక reasoning లా చేసి చూపించడానికి ఆంగ్లభాషాభిమానులు కిందామీదా పడ్దం చూస్తూంటే నవ్వొస్తోంది. ఇలా మాట్లాడేవాళ్ళంతా నిజానికి తెలుగు భాషాభిమానులు వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఓడిపోయామని అనిపించుకోవడం ఇష్టం లేక, ఇలా మూలచ్చేద వాదానికి దిగుతారు. మూలచ్ఛేదవాదమంటే అసలు చర్చిస్తున్న విషయానికే విలువ తీసేయాలని అసలది చర్చనీయాంశమే కాదనీ నిరూపించడానికి పూనుకోవడం. ఇదొక రకం అవతలివాడి నోరు మూసే వ్యూహం. కొట్టి, చంపి ప్రతివాదుల్ని ఖతమ్ చెయ్యాలని చూడ్డం కంటే భిన్నం కాదు.
-------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౦
అణచివేతక్కూడా ఒక హద్దుంది. ఇక్కడ ఈ రాష్టంలో తెలుగుని పనిగట్టుకొని అణచివేస్తున్న విధానం అలాంటి అన్ని హద్దుల్నీ అధిగమిచింది. సరిగ్గా ఇలాంటి క్రూరమైన అణచివేతల్లోంచి పుడతారు భావి నియంతలూ, కర్కోటకులూ ! ఎక్కడ ఇలా అణచివేత పెచ్చుమీఱుతుందో అక్కడ తప్పకుండా ఒక నిరంకుశుడు ఆవిర్భవిస్తాడు. వాడు దయాదాక్షిణ్య రహితుడై ఉంటాడు. ఈ రోజు తెలుగుని అణచివేస్తున్నామని ముఱిసిపోవడం కాదు. ఈ రాష్ట్రంలో భవిష్యత్ సంవత్సరాల్లో భాషోన్మాదులైన నాయకులు అధికారాన్ని చేపట్టితే ఏం జఱుగుతుందో అది ఎవఱికి వారు ఊహించుకోవచ్చు. అప్పుడు ఇంగ్లీషు ఎదుర్కునే అణచివేత తెలుక్కి పదిరెట్లుగా ఉండొచ్చు. బహుశా ఆ దెబ్బకి ఇంగ్లీషు ఈ గడ్డమీదినుంచి శాశ్వతంగా అదృశ్యమైపోవచ్చు.
----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౨
ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు పుట్టడానికి కారణం ప్రస్తుతపుటుద్యోగాలకి తెలుగుతోకంటే అప్రాచ్యభాషలతో ఉన్న అవసరం సామీప్యం ఎక్కువ అవ్వడం వలన అని నాకు గట్టిగా అనిపిస్తుందండీ.
ఆంధ్రభాషోన్మాది ఏలే రోజు నిజంగా రావలసిన పరిస్థితి వచ్చేలాగే ఉంది, చూడబోతే.
-----------------------------------------------------------------------
అభిప్రాయం ౧౩
మనకి ఎక్కడ గుచ్చుకుంటోందో సరిగ్గా గ్రహించారు. కానీ ఎందుకలా గుచ్చుకుంటోందని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సి ఉంది. ఇతర దేశాల భాషలకి అడక్కుండానే రక్షణ లభించడానికీ, మన భాషకి నోరు తెఱిచి అడిగినా రక్షణ కఱువవ్వడానికీ మధ్య ఎక్కడ వ్యత్యాసం ఉందనేది ఆలోచించాలి. నా పరిశీలనలో--
౧. మన తెలుగు ఏ దేశానికీ గుర్తింపు పొందిన ఏకైక జాతీయభాష (recognized official language) కాకపోవడం ఒక పెద్ద కారణం. నిజానికి ఇదే అసలుకారణం కూడాను. ఇది ఒకానొక దేశంలో ఒక మూలన ఆంధ్రప్రదేశ్ అనే ఒక subordinate province యొక్క భాషగానే ఉండడం. ( ఈ province ఎంత పెద్దదనేది అనవసరం. ఆధికారికంగా ఇదొక province. అంతే!) నేపాలీ, బర్మీసు, సింహళీ, థాయ్ లాంటివి తెలుగు కంటె అన్నివిధాలా చిన్నాచితక భాషలయినప్పటికీ అవి తమ తమ దేశాల యొక్క జాతీయభాషలూ, అధికారభాషలు కూడా ! అవి ఆయా ప్రభుత్వాల చేత రాజ్యాంగబద్ధంగా రక్షితమైన భాషలు(languages protected by the national constitution) అందుచేత తెలుగు ఎదుర్కుంటున్న ఘోరమైన మనుగడ సమస్యని అవి ఎదుర్కోవడంలేదు. ఆ సంగతి కప్పిపుచ్చి ఈ రాష్టంలోని మేధావులు తెలుగు ఇలా నశించిపోవడం ఒక సహజమైన చారిత్రిక పరిణామం లాగాను, అది నశించకపోతే మన ఆధునీకరణకి అర్థం లేనట్లూ మాట్లాడ్డం నేర్చుకున్నారు.
౨.ఇతరదేశాల్లోని ఉద్యోగాలు ఆయా దేశాలవారికే పరిమితం. కానీ భారతీయ రాష్ట్రాలలోని ఉద్యోగాలు ఆయా రాష్టాలవారికి పరిమితం కాదు. అలా పరిమితం చేసుంటే, మన భాషలు హాయిగా బతకగలిగి ఉండేవి. కానీ అలా చెయ్యకపోవడాన ఈ రాష్ట్రంవారు పోయి ఆ రాష్టంవారి ఉద్యోగాల్ని హరించి వాటిల్లో తాము తిష్ఠ వేస్తారు. తత్ఫలితంగా వారూ ఇక్కడికొచ్చి మన పట్ల అదే చేస్తారు. ఇలా మనుషులు తమకి సంబంధం లేనిచోట్లకి వెళ్ళి వాళ్ళ ఆర్థిక అవకాశాల్ని దోచాలంటే అందుకు సహకరించే భాష ఒకటి కావాలి. అదే ఇంగ్లీషు. ఇది పరస్పర దోపిడీ వల్ల జఱుగుతున్నదని గ్రహించకుండా "ఇంగ్లీషు లేకపోతే రాష్ట్రం బయట ఉద్యోగాలు ఎలా సంపాదిస్తాం ?" అి అమాయకంగా ప్రశ్నిస్తారు. మనమూ అదే అనుకుంటాం. "బయటివాళ్ళని రానివ్వకపోతే, వాళ్లు మనల్ని రానివ్వరు కదా !" అని ! వాస్తవంలో మనమూ వాళ్లు చేసేది, పరస్పర భాషాహక్కుల్ని హరించేసుకోవడం. అందఱమూ కలిసి ఇంగ్లీషుని సింహాసనమెక్కించడం.
ఏ రాష్ట్రంవారు ఆ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునేట్లయితే, వారి ఉద్యోగావకాశాల్ని బయటివాళ్ళొచ్చి హరించకపోతే అప్పుడు ఇంగ్లీషు మీడియంతో అవసరమేముంది ? అప్పుడు ఇంజనీరింగు, మెడిసిన్ కూడా మనం తెలుగులోనే చదువుకుంటాం. ఉన్న ఉద్యోగావకాశాలతోనే తృప్తిపడతాం. తృప్తిపడనివాడు ప్రైవేట్ గా కోచింగ్ తీసుకొని ఇంగ్లీషు నేర్చుకొని బయటికి పోతాడు. కానీ బహుకొద్దిమందే ఉన్న అలాంటివాళ్ళకోసం ఈ ప్రభుత్వం అందఱి నెత్తినా బలవంతంగా ఇంగ్లీషుని - అదీ పాలుతాగే పసివయసు నుంచి రుద్దాలనుకోవడం, ఇక్కడ ఏ కొత్త ఉద్యోగావకాశాలూ కల్పించకుండా తన బాధ్యతని గాలికొదిలేసి అందఱినీ పొట్టపట్టుకొని బయటికి పొమ్మనడం, అందుకోసం ఇంగ్లీషు నేర్చుకోండని బలవంతం చెయ్యడం, సరే, అలాగని బయటికి పోతేనేమో అక్కడివాళ్లు "మా దేశానికి/ రాష్ట్రానికి ఎందుకొచ్చారు ?": అంటూ మన అంతు చూడ్డానికి ప్రయత్నించడం - ఏమిటిదంతా ? దీకికి అంతు ఎక్కడ ? ఎప్పుడు ?
౩. ఇప్పటి ఇంగ్లీషు వ్యామోహానికి అసలు కారణం - రాష్ట్రం యొక్క వాస్తవిక ప్రొఫెషనల్ అవసరాలతోను, అసలు ఉన్న ఇంజనీరింగ్ ఉద్యోగఖాళీల యొక్క మొత్తం సంఖ్యతోను నిమిత్తం లేకుండా ప్రతిభాప్రమాణాలతో సంబంధం లేకుండా కట్నార్థులకోసం, వలసదారుల కోసం ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు తెఱిచేసి సీట్ల సంఖ్య పెంచేయడం. దానివల్లా ఆ కోర్స్ చదివినవాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేక విదేశాల కెగబడ్డం. ఆ విదేశాలకోసం ఇంగ్లీషు. ఇదీ వరస. అసలు ఇంజనీరింగ్ లో ప్రవేశమే కష్టం చేసెయ్యాలి. సగం ఇంజనీరింగ్ కాలేజిలు మూసెయ్యాలి. సీట్లు తగ్గించాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులోని వార్షిక పరీక్షల్ని కూడా కష్టం చేసెయ్యాలి. సబ్జెక్టులూ, సిలబస్సు, కోర్స్ కాలావధి (సంవత్సరాలు) పెంచాలి. అదే సమయంలో పక్క రాష్ట్రాల్లోను, ఇతరదేశాల్లోను చదివిన ప్రొఫెషనల్ కోర్సుల్ని డీరికగ్నయిజ్ చెయ్యాలి. అప్పుడు వలసపోయి ఇంగ్లీష్ మీడియమ్ లో ఇంజనీరింగ్ చదివి ఇక్కడకొచ్చి షాన్లు కొట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడ ఫీజు కట్టి చదువుకున్నవాళ్ళ కోసమే. అలా ఎవడు పడితే వాడల్లా ఇంజనీరు కాజాలని విధంగా వ్యవస్థని బిగించాలి. ఆ తరువాత ఇంజనీరింగ్ ని తెలుగుమీడియమ్ లోకి మార్చినా అందులో చదువుకున్న ప్రతివాడికీ ఉద్యోగం చూపించడం సులభమవుతుంది కనుక అలా దాన్ని. మార్చెయ్యడం కూడా సులభమవుతుంది. ఎవరూ అభ్యంతరపెట్టరు. మెడిసిన్ కైనా ఇదే మంత్రం. అదే సమయంలో బీయెస్సీవాళ్ళ ఉద్యోగావకాశాల్ని బాగా హెచ్చించి జనం ఊరికే ఇంజనీరింగ్ అని ఎగబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిరకాల ఉద్యోగాల్ని కేవలం బీయెస్సీలకి ప్రత్యేకిస్తూ జీవో జారీచెయ్యాలి.
--------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౪
తెలుగే కాక చాలా భారతీయభాషలు (మన రాజ్యాంగంలో మనం గుర్తించి, మన మారకంపై ముద్రించుకుంటున్న భాషలు) కూడా వేఱే జాతీయభాషలు కానివి ఉన్నాయి కదండీ! వాటి పరిస్థితి కూడా ఇంతేనా? అసలు నా అనుమానం, హిందీ కూడా తెలుగులాగానే తత్సదృశమైన ఇబ్బందులని ఎదుర్కుంటోందని! తెలుగైతే కాస్త ఎక్కువ ఇబ్బంది పడుతోంది, ఆ ఇబ్బంది మనకి ప్రత్యక్షంగా తెలుస్తోంది కూడాను.
ఆహా! ఏ ముహూర్తంలో ప్రవేశించిందో కానీ ఈ అప్రాచ్యభాషావ్యామోహం, చాలామంది బుఱ్ఱలని ఇంకా దొలిచేస్తూనే ఉంది కదండీ!
పూర్వకాలంలో కూడా ఒక రాజ్యాన్నించి మఱొక రాజ్యానికి వెళ్లి ఉద్యోగాలు చేసినవారు ఉండే ఉంటారు. అప్పుడు అందఱికీ మాధ్యమంగా సంస్కృతమో ప్రాకృతమో నడిచేదనుకుంటాను. లేదా ప్రాంతీయభాష నేర్చేవారనుకుంటాను. కానీ ఇప్పుడు ఆ ఆ భాషలని పూర్తిగా వదలివేసి, ఇలా మన దేశంలో పుట్టని మఱొక భాషలోకి మారిపోయామంటే కారణం వేఱే రాజ్యాలలో ఉద్యోగాలు వెతుక్కోవడం అనడం కంటే, వేఱే రాజ్యాలలో ఉద్యోగాలు సైతం అలాంటి భాషతో ముడిపెట్టబడడం అనడం సబబేమోనండీ. నిజంగా మనం పరస్పర భాషాహక్కులని నశింపజేసేసుకున్నాం, ...కుంటున్నాం కూడాను.
ఒక రకంగా చూస్తే, వేఱే ప్రాంతానికి చెందిన మఱొక భారతీయ భాషతో సంపర్కం వలన కొన్ని క్రొత్త ప్రయోగాలూ క్రొత్త పదాలూ ఒక భాషలోకి చేరిన దృష్టాంతాలు లేకపోలేదు. మఱీ పోయి పోయి ఆంగ్లంతో కలవడం కంటే, సంస్కృతి పరంగా దగ్గఱ పోలికలున్న రెండు ప్రాంతాల భాషల కలయిక ఆహ్వానించదగ్గదే కదా. పైగా ఆ రెండు భాషలూ పోలికలు ఉన్నవే ఐతే, ఇక ఆ భాషలు భలే సంపన్నమౌతాయి కూడాను.
అసలు ఇంగ్లీషు ఎప్పుడు ఈ మధ్యలో దూరిందీ అంటే... అది అందఱికీ తెలిసిన చిదంబర రహస్యమే. కానీ ఇప్పటికీ మనం ఎందుకు దానినుండి బయటపడలేకపోతున్నామూ అన్నదే ప్రశ్న!
సాక్షి వ్యాసాలలో మొదటి సంపుటంలోనే మొదటి పది వ్యాసాలలో వస్తుందనుకుంటాను ఈ ప్రాంతీయభాషల గుఱించి జంఘాలశాస్త్రి పడే ఆవేదన. నాకు అదే గుర్తుకు వస్తోందండీ ఇప్పుడూ.
అసలు మనం మన దేశానికే బోలెడన్ని అవసరాలు ఉన్నాయనీ, మన దేశంలోనే కావలసినంతమంది వినియోగదారులూ ఉన్నారనీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడు ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఈ ఎగబడడం తగ్గుతుంది, ప్రాంతీయభాషల అభివృద్ధికి ఆటంకమూ ఉండదు.