29, జనవరి 2013, మంగళవారం

మాతంగకన్య అనే పేరు ఎలావచ్చింది అమ్మవారికి

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
అమ్మవారికి మాతంగకన్య అని పేరు ఉన్నది. గురువుగారు తమ ప్రార్ధనాశ్లోకాల్లో కూదా మాతంగకన్యాం మనసా స్మరామి అన్న శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. దీని అర్ధం, ఈ పేరు ఎలా వచ్చిందో ఎవరైనా తెలుపగలరు.ఈ పేరు కీ రామాయణంలోని మతంగ మహర్షికి ఏమన్నా సంబంధం ఉన్నదా.అదికూడా తెలుపగలరు.
విధేయుడు,
..............





నమస్తే ,

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి II
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే
పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే జయ లీలశుకప్రియే.II


చక్కని ప్రశ్న అడిగారండీ, రోజూ చదువుతూ ఉంటాము కానీ, ఆ పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచన రాలేదు.

నేను చదివినదాని ప్రకారం, మాతంగ కన్య అంటే, మతంగ మహర్షికి కూతురిగా పుట్టింది అమ్మవారు ఒకసారి. అందుకే పూజ్య గురువు గారు చెబుతూ ఉంటారు, లోకంలో ఎవరైనా సరే, ఆర్తితో అమ్మని ప్రార్ధిస్తే, ఎంతమందికైనా అమ్మ కూతురిగా వచ్చి ఉద్ధరిస్తుంది, కాత్యాయినీ, జానకి, మాతంగి, హైమవతి ఇలా.. కానీ అన్ని రూపాలలో, అన్ని నామాలలో అమ్మ ప్రక్కన ఉండేది ఒక్క మా శంకరుడు మాత్రమే. అమ్మ "సదాశివపతివ్రత" కదా.

మాతంగ కన్య అనే నామము వెనుక ఉన్న వృత్తాంతము, లలితోపాఖ్యానం నుంచి గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇచ్చిన వివరణలోంచి వ్రాస్తున్నది.

మతంగ మహర్షి గొప్ప తపస్వి. వారు హిమవంతునికి స్నేహితుడు. ఒకనాడు హిమవంతుడు, ఆయన గౌరి దేవికి తండ్రిని అని చెప్తూ, అతిశయంతో చెప్తారు. ఈ మాటకి అవమానపడినట్లుగా భావించి, మతంగ మహర్షి తపస్సు చేస్తారు. ఆయన లలితాపరాభట్టారికా స్వరూపమైన శ్యామలాదేవి (ముద్రిణీ దేవి, మంత్రిణీదేవి అని కూడా అంటారు) ని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్యామలాదేవి, మతంగ మహర్షి భార్య అయిన సిద్ధమతి దేవికి స్వప్నంలో కనిపించి ఒక పువ్వుని ప్రసాదంగా ఇస్తారు.

అనతి కాలంలోనే మతంగ మహర్షి, సిద్ధమతిదేవి లకి ఒక చక్కని ఆడపిల్ల జన్మించినది. ఆ వచ్చినది అమ్మవారే. ఆమెని లఘుశ్యామ అని పిలిచారు. అంటే చాలా తక్కువ సమయంలో జన్మించింది అని. ఆమెనే మాతంగి, మాతంగ కన్యకా అని పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మతంగ కన్యయే, ఆమె యొక్క శక్తితో కోట్ల మంది కన్యలను సృష్టించినది, వారు మంత్రిణీ దేవి యొక్క ప్రాంగణంలో ఉండి అమ్మవారి స్తోత్రం చేస్తూ ఉంటారు.

అయితే ఈ మతంగ మహర్షి, శ్రీరామాయణంలో చెప్పబడిన మతంగ మహర్షి ఒక్కరా కాదా అనే విషయం తెలియదు.

ఈ క్రింది లంకె కూడా చూడండి..

http://www.kamakoti.org/kamakoti/brahmandapurana/bookview.php?chapnum=25


పైన వ్రాసిన వివరణలో ఏమైనా దోషం ఉంటే పెద్దలు మన్నించి సరిచేయగలరు.




నమస్కారం.

దశ మహా విద్యలలో కొలిచే అమ్మవారి ఒకరూపం మాతంగి. గురువు గారి పఠించే ప్రార్ధనా శ్లోకంలో అమ్మవారు ఈమే కావచ్చు. ఈమె రూపం ఇలా ఉంటుంది.




---

మాతంగియే రాజ శ్యామల, లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లియే ఆమె. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవు.


కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి