21, నవంబర్ 2012, బుధవారం

ముందు ఆ సీట్‌లోంచి లే !

పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారుగారు ఒకచోట అన్నారు : "ధర్మవిచారణలో ఆత్మవిమర్శకే తప్ప పరవిమర్శకి తావు లేదు" అని ! అంటే ధర్మమంటే ఫలానా అనీ, దాన్ని ఆచరించాలనీ విన్నవారిలో ఎక్కువమంది చేసే పొఱపాటు - అది ఇతరుల్లో ఏమాత్రం ఉందో పరిశీలించి వారిని విమర్శించడం. ఇప్పటిదాకా అలాగే జఱుగుతూ వచ్చింది. ధర్మాలనేవి ఆచరించడానికి కాకుండా మనుషుల్లో అనవసరమైన వాచాలతని, వాగాడంబరాన్ని పెంచడానికీ, వాటి పేరు చెప్పి అవతలివాళ్ళ ముందఱి కాళ్ళకి బందాలెయ్యడానికీ, తద్ద్వారా ఒక విధమైన "ధర్మరాజకీయాలకి" పాల్పడడానికీ మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇది మిక్కిలి శోచనీయం. మనకి ఒక విషయం తెలిసినంత మాత్రాన దాన్ని ఇతరులకి చెప్పేఅర్హత మనకి స్వయంతంత్రం (automatic) గా సిద్ధించదు. పోనీ, అర్హతల సంగతెలా ఉన్నా, మనం అలా చెప్పగలిగినంత మాత్రాన మనం అవతలివారికి గురువులం గానీ, దేవదూతలం గానీ, దేవుళ్ళం గానీ అయిపోము. చెప్పదగ్గ స్థానంలో ఉన్నా కూడా చెప్పడం పనికిరాదు కొన్నిసార్లు. తెలిసినా/అడిగినా చెప్పడం అనవసరమంటాడు మనువు తన ధర్మశాస్త్రంలో ! అది వేఱే విషయం.

ఇతరులకి చెప్పడం అనే బాధ్యత అత్యంత బాధాకరమైనది. కనుక ఆ బాధ్యతని భగవంతుడు అందఱికీ అప్పగించడు. ఆ బాధని తట్టుకోగలవాళ్ళకే ఆయన దాన్ని అప్పగిస్తాడు. ఎందుకంటే ఈ లోకం ఒక పాత పిచ్చాసుపత్రి. ఇక్కడి రోగుల పిచ్చి బహు పురాతనమైనది. నరనరాలా బహులోతుగా జీర్ణించినటువంటిది. దానికి వైద్యం చేయబోతే మీదపడి కొట్టేవాళ్లే తప్ప "అయ్యో పాపం, నాకు వైద్యం చేయడానికొచ్చాడీయన" అని కృతజ్ఞత వహించి మొక్కేవాళ్ళెవరూ ఇక్కడ లేరు. మీకు వైద్యకట్నం (fees) ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఎలాగూ అదివ్వరు కనుక లాభాపేక్ష లేకుండా వైద్యం చెయ్యాల్సి ఉంటుంది. మీచేత మంచి చెప్పించుకొన్నవారు మిమ్మల్ని హింసించకపోతే అదే వైద్యకట్నంగా, అదే ఒక గొప్ప అదృష్టంగా భావించి "బతుకు జీవుడా" అనుకొని నిమ్మళంగా బయటపడాల్సిన పరిస్థితి ఉంది. మనకేమో వైద్యం రాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు వట్టి పిచ్చోళ్ళని గుర్తుపట్టేటంత పరిజ్ఞానం మాత్రమే మనకుంది. ఆ మాత్రం దానికే మనం అమాంతం వైద్యావతారమెత్తడం సమంజసం కాదేమో.

భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస దీని గుఱించి అనుగ్రహ భాషణం చేస్తూ "ఇతరులకి చెప్పాలంటే భగవంతుడి నుంచి లైసెన్సు తీసుకోవాలి" అని తెలియజేశారు. చాలా గొప్ప లైసెన్సు అది. ఊరికే రాదు. జన్మజన్మల ఉపాసనా, తపస్సూ ఉంటేనే తప్ప ! మనలాంటివాళ్ళు ఎంత చెప్పినా ఎవరి హృదయకవాటాలూ తెఱుచుకోవు. ఎవఱి మేధాకమలమూ వికసించదు. మనం ఎన్ని ఉపన్యాసాలిచ్చినా ఎవఱి జీవితమూ మారదు. మనం ఎంతగా మాట్లాడితే అంతగా సరికొత్త సమస్యలు తలెత్తడమే తప్ప ఏ పాత సమస్యా పరిష్కరించబడదు. కానీ ఆ లైసెన్సున్న వ్యక్తులు మాత్రం ఒక్క వాక్యం ఉచ్చరించగానే జీవితాలే మారిపోతాయి. లోకమే తలకిందులవుతుంది. తమ తపశ్శక్తితో భగవంతుడి దగ్గఱ చనువు సంపాదించిన మహనీయుల వాక్కులలోని రాజముద్ర అది.

శ్రీ బుద్ధభగవానుల జీవితచరిత్రలో తారసిల్లే అంగుళిమాలుడనే హంతకుడి గుఱించి చాలామంది వినే ఉంటారు. అతని అసలు పేరు అహింసకశర్మ. చాలా మేధావి. గురుకులంలో మిగతా అందఱు విద్యార్థులకంటే ముందుండేవాడు. అది సహించలేని అతని సహాధ్యాయులు అతనికీ, గురుపత్నికీ అక్రమసంబంధాన్ని అంటగట్టి అపప్రచారం చెయ్యడంతో అతన్ని గురువుగారు అర్ధాంతరంగా గురుకులంలోంచి వెళ్ళగొట్టారు. అతను ఇల్లు చేఱుకొని, జఱిగినదాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారనుకొని వారికి వివరించబోతే వాళ్ళు కూడా పూర్తిగా వినకుండా, అతన్ని నమ్మకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అహింసకశర్మ అందఱి దృష్టిలోను అకారణంగా నేఱస్థుడయ్యాడు. అతనికి జీవితం దుర్భరమైంది. అతను సమాజం మీద కక్ష గట్టాడు. అడవికి చేఱుకొని ఆ దారిన పోయేవాళ్ళందఱినీ చంపి ఉన్నదంతా దోచుకునేవాడు. తన చేతిలో చచ్చిపోయినవాళ్ళ చేతి బొటనవ్రేళ్ళు నఱికి మాలగా మెడలో ధరించేవాడు. అందువల్ల అతనికి అంగుళిమాలుడు అని పేరొచ్చింది. అలా కొన్ని వేలమంది అతని చేతిలో నిహతులయ్యారు. ఆఖరికి ఆ దారిగుండా శ్రీ బుద్ధభగవానులు ప్రయాణించడమూ, ఆయన్ని కూడా చంపి దోచుకుందామని అనుసరించిన అంగుళిమాలుడు ఆయన మహత్త్వానికి దాసోహం అని బౌద్ధభిక్షువుగా మారడమూ చరిత్రప్రసిద్ధమే.

ఈ వృత్తాంతంలో తథాగతుల మహత్త్వం కంటే ఎక్కువగా మనం గమనించాల్సింది - అంగుళిమాలుడు నిజంగానే తప్పుచేశాడని భావించిన ఆ కాలపు సామాజికులు తమని తాము ఏ విధంగా గురువు స్థానంలోను, దేవుడి స్థానంలోను కూర్చోబెట్టుకున్నారనేది. గురువుగారి గురుత్వం అతని శిష్యత్వాన్ని చెడగొట్టింది. తల్లిదండ్రుల దైవత్వం అతనిలోని మానవత్వాన్ని చంపేసింది. ఇహ ఆ గురుత్వం దేనికి ? ఆ తల్లిదండ్రుల దైవత్వం దేనికి ? అంతా వృథా. అతను నిజంగానే తప్పు చేసినా, దానిమీద తీర్పులిచ్చే అధికారమూ, ఆ ప్రాతిపదిక మీద అతన్ని వెలేసే అధికారమూ వాళ్ళకు ఉన్నాయా ? అని ! అంగుళిమాలుణ్ణే కాదు, అలా తప్పు చేశారనుకున్న ప్రతివారి విషయంలోను మన పూర్వులు తమకు లేని అధికారాల్ని కట్టబెట్టుకోవడం వల్లనే ఈనాడు మనం దేశంలో కోట్లాదిమంది అస్పృశ్యుల్ని చూస్తున్నామేమో ! తప్పులు తప్పులే. అవి ఎప్పటికీ ఒప్పులు కావు. కానీ ఆ మాట ఇతరులకి చెప్పడానికి మన తపశ్శక్తి సరిపోదు. మనకి లైసెన్సు లేదు.

ఇహ లేద్దాం. ఈ అన్యాయ, అనధికార గురుపీఠాన్ని, మనం అక్రమంగా ఆక్రమించుకున్న దేవుడి సీటుని ఖాళీ చేద్దాం. మన మొహాల్ని మనం ఒకసారి అద్దంలో చూసుకుందాం.

3 కామెంట్‌లు:

మనోహర్ చెనికల చెప్పారు...

సరిగా చెప్పారు. నాకు సరిగా సరిపోతుంది ఈ వ్యాసం. మిడిమిడి జ్ఞానంతో ఇతరులమీద తీర్పులిచ్చే నాబోటి వారు కొందరైనా ఇది చదివాక మారతారని అనిపిస్తుంది.

..nagarjuna.. చెప్పారు...

మంచి విషయాన్ని చెప్పారు. ధన్యవాదాలు.

Manavu చెప్పారు...

ఈ విషయం "కల్కి భగవాన్"విజయ్ కుమార్ కి చెప్పండి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి