1, అక్టోబర్ 2013, మంగళవారం

హేతువాదదృష్టితో చూస్తే కనపడే ప్రకృతిని ఆథ్యాత్మికంగా చూస్తే ......[దేవుడంటే ఎవరు ? 2 ]

"దేవుడంటే మనిషి చేసిన ఒక కల్పన.   పూర్వ జన్మ అనే ఆలోచనలలో, పాపపుణ్యాలనే నమ్మకంలో పడదోయడం ద్వారా శాంతి భద్రతల నిర్వహణను సులభం చేసుకోవచ్చుననే ఆశతో పాలకులు దీనిని ప్రోత్సహించారు" అంటూ సాయిరాం జవాబు మొదలు పెట్టాడు.  
"ఆ పాలకులే కనక వీటిని నిజంగా నమ్మిన వారైతే ఇవాళ ఇన్ని కుంభకోణాలు జరగవు.  గుడులలో దొంగతనాలు జరుగవు. కేవలం జనాలను నమ్మించడానికి పురోహిత వర్గాల వారిని కలుపుకొని దేవుడు, దెయ్యం అంటూ ఏమేమో చెప్పారు. చెబుతున్నారు.   దేవుడంటూ ఉంటే ఇదమిత్థంగా అతడు ఇదీ అని చెప్పవచ్చు. లేని వాడి గురించి ఏముంది? ఏమైనా చెప్పవచ్చు.  మీరంతా చేస్తున్న పని అదే" అన్నాడు సాయిరాం. 

"నాయనా సాయిరాం! దేవుడనే మాటకు నీ భావన అదే అయితే, ఆ దేవుడు అసత్యమే.  దేవుడనే మాటకు నువ్వు చెప్పిన అర్థమే నిజమైతే, నేను కూడా నీతో పాటు నిరీశ్వరవాదినే" అన్నారు సుబ్రహ్మణ్యం గారు. 

అది విని అక్కడే ఉన్న మరో అతిథి సూర్యనారాయణ మూర్తి గారు గొల్లున నవ్వారు. 

"ఎందుకు నవ్వుతున్నారు? మీ దేవుడంటే ఏమిటో మీరు ఇదమిత్థంగా చెప్పాలి.  అంతే తప్ప దేవుడున్నాడంటూ ఏవేవో కల్పించి చెప్పి, ప్రజలను మోసగించకూదదు" అంటూ సాయిరాం తన వాదన కొనసాగించాడు.  మూర్తి గారు ఏదో జవాబు చెప్పేంతలో సుబ్రహ్మణ్యం గారు కలగజేసుకుని, "సాయిరాం లో నిజాయితీ ఉంది.  అతడు మనసా, వాచా, కర్మణా ఒక్కటే నమ్ముతున్నాడు.  దానినే మాట్లాడుతున్నాడు.  దానినే పాటిస్తున్నాడు.  భగవంతుడి కృప అతడికి పరిపూర్ణంగా లభిస్తుంది.  పైకి ఒకటి చెబుతూ చాటున మరొక విధంగా ప్రవర్తించే వారితో పోల్చి చూస్తే, దైవానికి ఎక్కువ దగ్గరైన వాడు సాయిరామే.  అతడిని కన్న తల్లితండ్రులు సంతోష పడే రోజు ఖచ్చితంగా వస్తుంది" అన్నారు. 

"నిజమే! మీరు కాబట్టి, ఇంత ఔదార్యం చూపుతున్నారు.  మతోన్మాదుల దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడి చూడమనండి! భ్రష్టుడివంటూ తిట్టిపోస్తారు" అన్నారు సూర్యనారాయణ మూర్తి గారు. 

"సుబ్రహ్మణ్యం గారు నన్ను  పొగిడి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు.  నాకు మీ నుంచి కావలసింది ఖచ్చితంగా దేవుడంటే ఇదీ అనే సమాధానం.  దానితో దేవుడు నిజమో, కల్పనో  తేలిపోతుంది" అన్నాడు సాయిరాం.   వాతావరణం కాస్త గంభీరంగా మారింది. 

"దేవుణ్ణి నీ కళ్ళకే చూపించాలా?" నేనడిగాను. 

"అవును"

"లేకపోతే దేవుడు సత్యం కాదా?  భూమ్యాకర్షణ శక్తి నిజం.  మరి దానిని చూపించగలవా? .....   విమానాలు, రాకెట్లు లేని కాలంలోనే భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళు మూఢులా?"


​ సాయిరాం పెదవి విప్పాడు "అది సైన్సు.  మానవుడు తార్కికమైన బుద్ధితో ఆలోచిస్తూ పెరిగాడు.  ఒడ్డున ఉన్న వాడికి సముద్రంలో దూరం నుంచి వస్తున్న ఓడ మీది జండా కనిపించింది.  తరువాత పొగ గొట్టం కనిపించింది.  తరువాత ఓడ పై భాగం, ఆఖరుగా ఓడ కింది భాగం కనిపించాయి.  దానిని బట్టి, భూమి వాస్తవ ఆకారాన్ని అతడు ఊహించ గలిగాడు.   ఇవాళ రాకెట్ సాయంతో రోదసి లోకి వెళ్లి ఫోటోలు తీసినప్పుడు అదే నిజమని నిగ్గు తేలింది.  భూమి బల్లపరుపుగా ఉందని వాదించిన మతాలున్నాయి. దానికి భిన్నంగా వాదించిన వారి తలలు నరికే మూఢులను అవి తయారు చేశాయి.  ​ఇవాల్టికి కూడా సృష్టి కేవలం ఆరువేల ఏళ్ళ క్రితం మాత్రమే ప్రారంభమైందని నూరిపోస్తున్న మతాలున్నాయి.  దేవుడు కల్పన అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా?". 

సాయిరాం ని నేనడిగాను - "భూమి వాస్తవ ఆకారం, భూమ్యాకర్షణ శక్తుల లాగానే బుద్ధికి మాత్రమే అందే సత్యాలు, కళ్ళకు కనిపించని సత్యాలు ఉన్నట్లుగా సైన్సు కూడా అంగీకరిస్తోంది కదా! అలాంటప్పుడు దేవుణ్ణి కళ్ళకే చూపించాలని వాదించడం అశాస్త్రీయమే కదా". 

"కళ్ళకు కనిపించక పోయినా పర్వాలేదు.  దేవుణ్ణి తార్కికంగా నిరూపిస్తే చాలు" అని ఒప్పుకున్నాడు సాయిరాం. 
"ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను.  కళ్ళకు కనిపించని రూపంలో మాత్రమే దేవుడున్నాడని ఎవరూ అనడం లేదు.  విషంలో ఔషధం  లాగా, కనిపించే దానిలో కనిపించని రీతిలో కూడా అతడున్నాడని చెప్పడానికే విషము - మందు ఉదాహరణను నీ దృష్టికి తెచ్చాను.  భగవంతుడు తర్కానికి కొద్దిగా అందుతాడు.  అందనంత పెద్దవాడు కూడా.  ముందుగా ఇప్పటి వరకు నువ్వు అంగీకరించిన దాని సారాంశంగా, ఈ సృష్టిని మనం మానవుడి కళ్ళకు కనిపించేదిగా, కనిపించనిదిగా విభజించి చూడడానికి సైన్సు ఒప్పుకునేదీ లేనిదీ తేల్చి చెప్పు" - సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేసారు. 

"మీరు ఎలా వర్గీకరించినా సైన్సు కు సమ్మతమే.  క్లాసిఫికేషన్ అనేది సైన్సు తొలి మెట్లలో ఒకటి.  ఎటొచ్చీ అది సమగ్రంగా ఉండాలి.  అంతే" అన్నాడు సాయిరాం. 
సూర్యనారాయణ మూర్తి గారు తిరిగి రంగంలోకి దిగారు "నన్ను కాస్త చెప్పనివ్వండి! కనిపించేదిగా, కనిపించనిదిగా సృష్టిని వర్గీకరించడం సమగ్రమైన విధానం కాదు.  కనిపించడం అంటే దేనికి? కళ్ళకు మాత్రమేనా?  పూల పరిమళాన్ని కళ్ళు చూడగలవా?  మంచు చల్లదనం కళ్ళకు కనబడుతుందా? అందుకే సృష్టిని భారతీయ శాస్త్రజ్ఞులు పంచభూతాలుగా వర్గీకరించారు.   అవి పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు.  వీటిలో ఆకాశ తరంగాలలో మన చెవికి వినబడేవి ఉన్నాయి.  మనం వినలేనివీ కోకొల్లలుగా ఉన్నాయి.  వాయువుని మన చర్మం స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది.  తేజస్సుని అనగా కాంతిని మాత్రమే మన కళ్ళు గుర్తించగలుగుతాయి.  అదీ కొంత మేర మాత్రమే.  జలాన్ని మన నాలుక కొంత  మేర మాత్రమే రుచిచూడ గలుగుతుంది .  పృథ్విని మన ముక్కు వాసన ద్వారా కొంత వరకు మాత్రమే పసిగడుతుంది.  కాబట్టి, కళ్ళకు కనిపించడం అని కాక, పంచేంద్రియాలలో దేనికైనా సరే తెలిసేదీ, వీటిలో వేటికీ అందనిది అని సృష్టిని విభజించుకోవడం సమంజసం.  సృష్టి పంచభూతాత్మకమైనది. అలాగే వాటిని గమనించగలిగిన మానవుడు కూడా?"

"మరైతే దేవుడు?" సాయిరాం ప్రశ్నించాడు.  

ఇంకా ఉంది  ............ మరి కొంత కాలం ఆగాల్సిందే 

1 కామెంట్‌:

ladyejacobowitz చెప్పారు...

Hard Rock Casino and Resort: Sports Booking, Casino - Dr.MCD
Looking 목포 출장마사지 for a casino near you? 부천 출장안마 Dr.MCD has everything you need in your game, with state-of-the-art mobile app, sports 평택 출장마사지 betting, 영천 출장안마 live dealer 삼척 출장마사지 and more.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి