23, నవంబర్ 2013, శనివారం

సరియైన గురువును గుర్తించడం ఎలా?

సరియైన గురువును గుర్తించడం ఎలా?
ఉత్తమ,  మధ్యమ, తృతీయులుగా గురువులు 3 రకాలు.  అందుకే"సగురుమేవాభిగచ్ఛేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం"  అని కఠోపనిషత్తు అంటుంది.  ఉత్తమ గురువనగా శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడు.  అట్టి ఉత్తమ గురువును ఆశ్రయించుటచే సాధకుడు సంప్రదాయబద్ధంగా జ్ఞానాన్ని పొంది తరించగలడు.    

ఉత్తమ గురువు లక్షణాలేవి?
"ఛందోఅధీతేసశ్రోత్రియః" సంప్రదాయబద్ధంగా బాల్యంలోనే ఉపనయన సంస్కారం పొంది గురుకులవాసం చేస్తూ వేదాధ్యయనం ద్వారా  కర్మ, ఉపాసనలను యధావిధిగా ఆచరించేవాడే శ్రోత్రియుడు.  
ఇతడే శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా వేదాంత తత్త్వార్ధాన్ని గ్రహించి దాని యందే స్థిరమైన నిష్ఠను కలిగి ఉంటాడు.  "బ్రహ్మణి నిష్ఠా యస్య స బ్రహ్మనిష్ఠః" ఇతడే బ్రహ్మనిష్ఠుడు అనబడతాడు.  ఇతను పరమాత్మ తత్వ చింతనలో స్థిరమైన నిష్ఠను పొంది తనను ఆశ్రయించిన శిష్యులకు సంప్రదాయబద్ధంగా జ్ఞానాన్ని అందజేస్తాడు.  అందుకే ఇతనిని శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడని, ఉత్తమ గురువని శాస్త్రాలు సూచిస్తున్నాయి.  

మధ్యమ గురువు లక్షణాలేవి?
ఇతను శ్రోత్రీయుడే కాని అధ్యాపకుని వంటివాడు.  ఇతడు గురుకుల వాసం చేసి వేదవేదాంగాలను అధ్యయనం చేసినప్పటికీ బ్రహ్మనిష్ఠుడు కాకపొవుటచే తను నేర్చిన విద్య కేవలం ఇతరులకు బోధించుటకే పరిమితమౌతుంది. 

తృతీయ గురువు లక్షణాలేవి?
ఇతను కేవలం బ్రహ్మనిష్ఠుడు మాత్రమే.  ప్రారబ్దవశం చేత, జన్మాంతర సంస్కారం తోడై, తత్త్వమస్యాది మహా వాక్యార్థాన్ని తత్త్వ విచారణతో గ్రహించి బ్రహ్మచింతనలోనే జీవితాన్ని అంకితం చేసుకొన్న సాధకుడు.  ఇతను సంప్రదాయంగా శాస్త్రాధ్యయనం చేయని కారణం చే ఇతరులకు బోధించుటకు అవకాశముండదు.  కనుక ఇతను కేవలం బ్రహ్మనిష్ఠుడగుటచే స్వస్వరూప ఆత్మజ్ఞానంతో తన ఉద్ధరణకే పరిమిత మగుచున్నాడు. 

అధమాధమ గురువులు   
వీరికి శ్రోత్రియత్వము, బ్రహ్మనిష్ఠ, ఆచరణ, అనుష్ఠానములు ఏవీ వుండవు.  రాగద్వేషాలు, కామక్రోధాలు, కోరికలు, భోగలాలసత్వము, కీర్తికాంక్ష, ధన వ్యామోహం మొదలగు భావనలతో సతమతమవుతుంటారు.  వీరు చెప్పుకోవడానికే గురువు కానీ, అందరికీ బరువే.  చివరకు వారికి వారే బరువనిపిస్తారు.  వీరినే మిథ్యాచారు లంటుంది శాస్త్రం. 

సద్గురువును ఆశ్రయించిన శిష్యుని ప్రవర్తన ఎలా ఉండాలి? 
శిష్యులనగా శిక్షకు, తత్త్వొపదేశము పొందుటకు యోగ్యులైనవారని అర్థం.  అయితే కొందరు లౌకిక ప్రయోజనాలకై తమ కోరికలను నెరవేర్చుకొనేందుకు ప్రాథాన్యతనిచ్చి ఆధ్యాత్మికమార్గాన్ని ఆశ్రయిస్తారు.  వీరు ఎప్పటికీ శిష్యులనబడరు.  శిష్యుడైనవాడు కేవలం ఆత్మజ్ఞాన ప్రాప్తికై పరిశుద్ధమైన భావనతో గురువు నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తాడు.  ఇలా గురువుపై శిష్యునికి, శిష్యునిపై గురువుకి గల సత్య సంబంధమే గురుశిష్య సంబంధము.

గురువు నాశ్రయించిన భక్తునికి మోక్షం సంప్రాప్తిస్తుందా?
గురువుని ఆశ్రయించిన వాడిని శిష్యుడంటామే కాని, భక్తుడని సంబోధించము.   సంపూర్ణమైన శ్రద్ధ, భక్తితో గురువును ఆశ్రయించేవాడే శిష్యుడు.  అయితే అతని లక్ష్యం ఆథ్యాత్మిక సాధనా? లేక భౌతిక వాంచలను పొందడం కోసమా? అని తనలో తాను ప్రశ్నించుకోవాలి.
ప్రప్రథమంగా కోరికలను పొందాలనే భావనతో గురువును ఆశ్రయించినా క్రమేపీ సంస్కారం చేత గురువు యొక్క సన్నిధిలో మనసు ఆథ్యాత్మిక సాధన వైపు మరలుతుంది.  అట్టి వ్యక్తి క్రమంగా ఆథ్యాత్మిక మార్గం లోని విశిష్టతను, మాధుర్యాన్ని తప్పక గ్రహిస్తాడు.  తద్వారా మోక్షమార్గంలో పయనించే పరిణతి కలిగి, భౌతిక  వాంచలు క్రమేపీ సన్నగిల్లుతాయి.  గురువు అనుగ్రహంతో మోక్షాన్ని పొందుతాడు. 

కొందరు గురువులు భక్తులను ఎంచుకుని మోక్షాన్ని ఇప్పిస్తారని అంటారు నిజమేనా? 
ఎవరో ఇచ్చేది, ఎక్కడికో వెళ్లి తెచ్చుకొనేదీ మోక్షమనబడదు.  పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే మోక్షం.  ఎక్కడికో వెళ్ళడం మొక్షమైతే అక్కడి నుండి ఇంకాస్త మంచి చోటుకు వెళ్తే బాగుంటుందని ఆశలు పుడతాయి. పరమాత్మ ఏదో ఒక లోకంలో ఉన్నాడని, మనం మూటా ముల్లె సర్దుకుని అక్కడకి వెళ్ళాలని అందుకోసం ఒక గురువు టూరిస్ట్ ఏజంటు లా కొందర్నే ఎంచుకుని తీసుకెడతాడనే భావాలను మన శాస్త్రాలు అంగీకరించవు.  మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని గురువు బోధించగలడే కానీ, మోక్షాన్నివ్వడం ఎవరితరమూ కాదు.  

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి