1, అక్టోబర్ 2013, మంగళవారం

హేతువాదదృష్టితో చూస్తే కనపడే ప్రకృతిని ఆథ్యాత్మికంగా చూస్తే ......[దేవుడంటే ఎవరు ? 2 ]

"దేవుడంటే మనిషి చేసిన ఒక కల్పన.   పూర్వ జన్మ అనే ఆలోచనలలో, పాపపుణ్యాలనే నమ్మకంలో పడదోయడం ద్వారా శాంతి భద్రతల నిర్వహణను సులభం చేసుకోవచ్చుననే ఆశతో పాలకులు దీనిని ప్రోత్సహించారు" అంటూ సాయిరాం జవాబు మొదలు పెట్టాడు.  
"ఆ పాలకులే కనక వీటిని నిజంగా నమ్మిన వారైతే ఇవాళ ఇన్ని కుంభకోణాలు జరగవు.  గుడులలో దొంగతనాలు జరుగవు. కేవలం జనాలను నమ్మించడానికి పురోహిత వర్గాల వారిని కలుపుకొని దేవుడు, దెయ్యం అంటూ ఏమేమో చెప్పారు. చెబుతున్నారు.   దేవుడంటూ ఉంటే ఇదమిత్థంగా అతడు ఇదీ అని చెప్పవచ్చు. లేని వాడి గురించి ఏముంది? ఏమైనా చెప్పవచ్చు.  మీరంతా చేస్తున్న పని అదే" అన్నాడు సాయిరాం. 

"నాయనా సాయిరాం! దేవుడనే మాటకు నీ భావన అదే అయితే, ఆ దేవుడు అసత్యమే.  దేవుడనే మాటకు నువ్వు చెప్పిన అర్థమే నిజమైతే, నేను కూడా నీతో పాటు నిరీశ్వరవాదినే" అన్నారు సుబ్రహ్మణ్యం గారు. 

అది విని అక్కడే ఉన్న మరో అతిథి సూర్యనారాయణ మూర్తి గారు గొల్లున నవ్వారు. 

"ఎందుకు నవ్వుతున్నారు? మీ దేవుడంటే ఏమిటో మీరు ఇదమిత్థంగా చెప్పాలి.  అంతే తప్ప దేవుడున్నాడంటూ ఏవేవో కల్పించి చెప్పి, ప్రజలను మోసగించకూదదు" అంటూ సాయిరాం తన వాదన కొనసాగించాడు.  మూర్తి గారు ఏదో జవాబు చెప్పేంతలో సుబ్రహ్మణ్యం గారు కలగజేసుకుని, "సాయిరాం లో నిజాయితీ ఉంది.  అతడు మనసా, వాచా, కర్మణా ఒక్కటే నమ్ముతున్నాడు.  దానినే మాట్లాడుతున్నాడు.  దానినే పాటిస్తున్నాడు.  భగవంతుడి కృప అతడికి పరిపూర్ణంగా లభిస్తుంది.  పైకి ఒకటి చెబుతూ చాటున మరొక విధంగా ప్రవర్తించే వారితో పోల్చి చూస్తే, దైవానికి ఎక్కువ దగ్గరైన వాడు సాయిరామే.  అతడిని కన్న తల్లితండ్రులు సంతోష పడే రోజు ఖచ్చితంగా వస్తుంది" అన్నారు. 

"నిజమే! మీరు కాబట్టి, ఇంత ఔదార్యం చూపుతున్నారు.  మతోన్మాదుల దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడి చూడమనండి! భ్రష్టుడివంటూ తిట్టిపోస్తారు" అన్నారు సూర్యనారాయణ మూర్తి గారు. 

"సుబ్రహ్మణ్యం గారు నన్ను  పొగిడి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు.  నాకు మీ నుంచి కావలసింది ఖచ్చితంగా దేవుడంటే ఇదీ అనే సమాధానం.  దానితో దేవుడు నిజమో, కల్పనో  తేలిపోతుంది" అన్నాడు సాయిరాం.   వాతావరణం కాస్త గంభీరంగా మారింది. 

"దేవుణ్ణి నీ కళ్ళకే చూపించాలా?" నేనడిగాను. 

"అవును"

"లేకపోతే దేవుడు సత్యం కాదా?  భూమ్యాకర్షణ శక్తి నిజం.  మరి దానిని చూపించగలవా? .....   విమానాలు, రాకెట్లు లేని కాలంలోనే భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళు మూఢులా?"


​ సాయిరాం పెదవి విప్పాడు "అది సైన్సు.  మానవుడు తార్కికమైన బుద్ధితో ఆలోచిస్తూ పెరిగాడు.  ఒడ్డున ఉన్న వాడికి సముద్రంలో దూరం నుంచి వస్తున్న ఓడ మీది జండా కనిపించింది.  తరువాత పొగ గొట్టం కనిపించింది.  తరువాత ఓడ పై భాగం, ఆఖరుగా ఓడ కింది భాగం కనిపించాయి.  దానిని బట్టి, భూమి వాస్తవ ఆకారాన్ని అతడు ఊహించ గలిగాడు.   ఇవాళ రాకెట్ సాయంతో రోదసి లోకి వెళ్లి ఫోటోలు తీసినప్పుడు అదే నిజమని నిగ్గు తేలింది.  భూమి బల్లపరుపుగా ఉందని వాదించిన మతాలున్నాయి. దానికి భిన్నంగా వాదించిన వారి తలలు నరికే మూఢులను అవి తయారు చేశాయి.  ​ఇవాల్టికి కూడా సృష్టి కేవలం ఆరువేల ఏళ్ళ క్రితం మాత్రమే ప్రారంభమైందని నూరిపోస్తున్న మతాలున్నాయి.  దేవుడు కల్పన అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా?". 

సాయిరాం ని నేనడిగాను - "భూమి వాస్తవ ఆకారం, భూమ్యాకర్షణ శక్తుల లాగానే బుద్ధికి మాత్రమే అందే సత్యాలు, కళ్ళకు కనిపించని సత్యాలు ఉన్నట్లుగా సైన్సు కూడా అంగీకరిస్తోంది కదా! అలాంటప్పుడు దేవుణ్ణి కళ్ళకే చూపించాలని వాదించడం అశాస్త్రీయమే కదా". 

"కళ్ళకు కనిపించక పోయినా పర్వాలేదు.  దేవుణ్ణి తార్కికంగా నిరూపిస్తే చాలు" అని ఒప్పుకున్నాడు సాయిరాం. 
"ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను.  కళ్ళకు కనిపించని రూపంలో మాత్రమే దేవుడున్నాడని ఎవరూ అనడం లేదు.  విషంలో ఔషధం  లాగా, కనిపించే దానిలో కనిపించని రీతిలో కూడా అతడున్నాడని చెప్పడానికే విషము - మందు ఉదాహరణను నీ దృష్టికి తెచ్చాను.  భగవంతుడు తర్కానికి కొద్దిగా అందుతాడు.  అందనంత పెద్దవాడు కూడా.  ముందుగా ఇప్పటి వరకు నువ్వు అంగీకరించిన దాని సారాంశంగా, ఈ సృష్టిని మనం మానవుడి కళ్ళకు కనిపించేదిగా, కనిపించనిదిగా విభజించి చూడడానికి సైన్సు ఒప్పుకునేదీ లేనిదీ తేల్చి చెప్పు" - సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేసారు. 

"మీరు ఎలా వర్గీకరించినా సైన్సు కు సమ్మతమే.  క్లాసిఫికేషన్ అనేది సైన్సు తొలి మెట్లలో ఒకటి.  ఎటొచ్చీ అది సమగ్రంగా ఉండాలి.  అంతే" అన్నాడు సాయిరాం. 
సూర్యనారాయణ మూర్తి గారు తిరిగి రంగంలోకి దిగారు "నన్ను కాస్త చెప్పనివ్వండి! కనిపించేదిగా, కనిపించనిదిగా సృష్టిని వర్గీకరించడం సమగ్రమైన విధానం కాదు.  కనిపించడం అంటే దేనికి? కళ్ళకు మాత్రమేనా?  పూల పరిమళాన్ని కళ్ళు చూడగలవా?  మంచు చల్లదనం కళ్ళకు కనబడుతుందా? అందుకే సృష్టిని భారతీయ శాస్త్రజ్ఞులు పంచభూతాలుగా వర్గీకరించారు.   అవి పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు.  వీటిలో ఆకాశ తరంగాలలో మన చెవికి వినబడేవి ఉన్నాయి.  మనం వినలేనివీ కోకొల్లలుగా ఉన్నాయి.  వాయువుని మన చర్మం స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది.  తేజస్సుని అనగా కాంతిని మాత్రమే మన కళ్ళు గుర్తించగలుగుతాయి.  అదీ కొంత మేర మాత్రమే.  జలాన్ని మన నాలుక కొంత  మేర మాత్రమే రుచిచూడ గలుగుతుంది .  పృథ్విని మన ముక్కు వాసన ద్వారా కొంత వరకు మాత్రమే పసిగడుతుంది.  కాబట్టి, కళ్ళకు కనిపించడం అని కాక, పంచేంద్రియాలలో దేనికైనా సరే తెలిసేదీ, వీటిలో వేటికీ అందనిది అని సృష్టిని విభజించుకోవడం సమంజసం.  సృష్టి పంచభూతాత్మకమైనది. అలాగే వాటిని గమనించగలిగిన మానవుడు కూడా?"

"మరైతే దేవుడు?" సాయిరాం ప్రశ్నించాడు.  

ఇంకా ఉంది  ............ మరి కొంత కాలం ఆగాల్సిందే 

30, సెప్టెంబర్ 2013, సోమవారం

హేతువాదదృష్టితో చూస్తే కనపడే ప్రకృతిని ఆథ్యాత్మికంగా చూస్తే ......[దేవుడంటే ఎవరు ? 1]

"మీ మందుల షాపు పేరేమిటి నాయనా?"  ..  వి.వి. సుబ్రహ్మణ్యం గారు ప్రశాంతంగా తన సంభాషణ ప్రారంభించారు.
"సత్యా మెడికల్ షాప్ (పేరు మార్చి రాశాను)" అని సాయిరాం బదులిచ్చాడు.  
"మీరమ్ముతున్నవన్నీ విషాలని నిరూపిస్తా.  దానికి నువ్వు మందుల దుకాణం అని పేరు పెట్టావంటా......
కావాలంటే ఎ సీసాలోవైనా గుప్పెడు మాత్రలు మింగి చూడు.  నీకే తెలుస్తుంది.  అవన్నీ విషాలైనప్పుడు సత్యా పాయిజన్ షాప్ అని పెట్టుకోవాలి కానీ, సత్యా మెడికల్ షాప్ అని పేరు పెట్టడం హేతువాదం ఎలా అవుతుంది? నువ్వమ్మే వాటిలో విషానికి భిన్నంగా మందుని నా కళ్ళకు చూపించ గలవా?"
- సుబ్రహ్మణ్యం గారి తర్కానికి సాయిరాం బిత్తరపోయాడు.
"అదేంటండీ అలా అంటారు? వాటిని తప్పుగా వాడితే అవి విషాలే.  వాటినే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తగిన పద్ధతిలో వాడినప్పుడు అవే మందులవుతాయి" అని కాస్త విసురుగా సమాధానం చెప్పాడు.
కోప్పడకు నాయనా - నా భావం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఈ చిన్న ఉపమానం.  నీ దుకాణంలో ఉన్న విషాలు కేవలం శాస్త్రవేత్త చూపు వల్ల  ఔషధాలవుతున్నాయి.  అలాగే కేవలం మనుషులుగా, పంచభూతాలుగా, రసాయనిక పదార్థాలుగా, భౌతిక వస్తువులుగా ఉన్నవన్నీ గురువు ఇచ్చే చూపు వల్ల దైవ స్వరూపాలవుతాయి.  హేతువాదంతో చూస్తె అంతా ప్రకృతే.  ఆధ్యాత్మిక దృష్టితో చూస్తె ఈ ప్రకృతి వెనుక ఉన్న అందమైన ప్రణాళిక, దానిని నడిపించే మహోన్నతమైన ధర్మం - ఆచూకీ అందుతాయి.  పాల నుంచి వెన్నని తీసినట్లుగా శాస్త్రవేత్త అయిన గురువు కూడా ఈ సత్యదర్శనం చేయించి మనిషి నుంచి మనీషిని ఆవిష్కరిస్తాడు.  అప్పుడు అంతా దైవమయమే.  ఇందాక నువ్వు ప్రస్తావించిన algebra లో X అనుకుని బయలుదేరి సమాధానాన్ని కనుక్కున్నట్లే, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న ప్రజ్ఞనే దేవుడని అనుకుని శోధిస్తూ వెళ్ళడమే సత్యాన్వేషణ.  ఈ శోధన లోనే మానవుడు పురోగమిస్తాడు.  దార్మికుడవుతాడు. శాస్త్రాలు పుట్టేదీ, శాంతి లభించేదీ రెండూ దీని నుంచే.  ప్రపంచ వికాసానికి మార్గం ఇదే.  ఇదే భారతీయమైన ఆధ్యాత్మిక సాధన.
ఈ సాధనలో పురోగమించిన వారిలో తమకు బాగా నచ్చిన వారి పేర్లను ప్రజలు అభిమానిస్తారు.  స్మరిస్తారు.  వారి సుగుణాలను ఆరాధిస్తూ తమ బిడ్డలకు ఆ పేర్లు పెట్టుకుంటారు.  అలా పెట్టుకున్నదే సాయిరాం అనే నీ పేరు.  అలాంటి తల్లితండ్రులను అవివేకులుగా నిందిస్తూ, రాముడి గురించి, రామ రాజ్యాన్ని గురించి ఏమీ తెలియకుండానే తేలికగా మాట్లాడేసే నిన్ను చూసి బాధపడుతున్నా.  స్వదేశీయులనుంచి స్వజాతీయుల నుంచి కూడా తనను తాను రక్షించుకోవలసిన దుస్థితిలో ఈ దేశం, ఈ సంస్కృతీ, ఇక్కడి విజ్ఞానం, వివేకం ఉన్నందుకు ఇంకా బాధపడుతున్నా.  ఇదంతా మనని పరాయి వారికి మళ్ళీ బానిసలుగా చేయడానికి ఎంతో కాలం పట్టదు.  నువ్వు ఎడ్యుకేట్ చేయడం కాదు, మొదట నువ్వు ఎదుకేట్ కావాలి.  మీ అమ్మానాన్నలు నిన్ను చూసి గర్వించ గలిగే రోజు రావాలి.  ఐ విష్ యు wisdom.
"సార్! బాధ్యతలను మేమూ సమర్థిస్తాం.  కానీ, మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తాం.  దేవుడంటూ ఫలానా ఎవడో ఉన్నాడని అనుకుంటూ ముందుకు వెళ్ళడమే సాధన అని మీరంటున్నారు తప్ప, ఆ దేముడిని మీరు చూపించలేక పోతున్నారు.  కనిపించని ఆ దేవుడి పేరుతో ఎన్ని మోసాలు, అరాచకాలు జరుగుతున్నాయో మీరు లెక్కలోకి తీసుకోవడం లేదు.  ఈ దారుణాలకు అడ్డుకట్ట పడాలంటే ఆయన ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించని వాడు కాకూడదు.  దేవుణ్ణి మీరు అందరికీ చూపించాలి" - సాయిరాం పెదవి విప్పాడు.
"బాబూ! దేవుడంటే నీ నిర్వచనం ఏమిటో కాస్త చెబుదూ!"
"సార్! దేవుడున్నాడని అంటున్నారు కాబట్టి మీరే చెప్పండి ఆయనెవరో"
"అది కాదయ్యా! లేదంటున్నావు కాబట్టి, ఎవడు లేడని అంటున్నావో నువ్వే చెప్పు! అప్పుడు మన డిబేట్ కొనసాగిద్దాం"
............. మిగతా వచ్చే సంచికలో
డాక్టర్ వాగ్దేవి గారికి క్షమార్పణలతో ............. 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం: 

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం. 

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి? 

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష

2) హరి వర్ష

3) ఇలవ్రిత వర్ష

4) కురు వర్ష

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష

7) కింపురుష వర్ష

భద్రస్వ వర్ష 



పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు. 

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని ! 

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు. 

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

భారత్ మాతా కి జై !

సనాతన ధర్మం/హిందుత్వం
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలుfrom ( Indian Culture)facebook

29, జులై 2013, సోమవారం

బతకాలి మన ధర్మం.. అందుకుఏ మహా సమ్మేళనం

బతకాలి మన ధర్మం.. అందుకుఏ మహా సమ్మేళనం

July 29, 2013
  స్వామీజీ అనే పదానికి కొత్త అర్థం.. పరమార్థం.. స్వామి పరిపూర్ణానంద సరస్వతి. హిందూ ధర్మం మంటగలిసి పోతుందంటూ పెదవి విరిచి, పక్కవారి వంక చూస్తే సరిపోదు.. ధర్మపరిరక్షణ కోసం, తద్వారా ఆత్మోన్నతి సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలంటారాయన. ప్రవచనాలు చెప్పి ఊరుకుంటే ధర్మం బతకదని గ్రహించి 'టీమ్ స్క్వేర్' పేరిట నాలుగంచెల ధర్మపరిరక్షణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాంతో పాటు భాగ్యనగరంలో వచ్చే డిసెంబర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పండితులతో అంతర్జాతీయ హిందూ మహాసభలు నిర్వహించాలని సంకల్పించారు. మనం ధర్మాన్ని రక్షించుకోలేకపోతే మనల్ని మనం కాపాడుకోలేం అంటున్న స్వామి పరిపూర్ణానంద మరేం చెబుతున్నారో విందాం.

అమెరికాలో ఉంటున్న తెలుగు వారు కొన్నేళ్లుగా నన్ను అక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. అమెరికా ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నించుకున్నాను. రాష్ట్రంలో నేను చేయాల్సింది చాలా వుంది. ఎన్నో దళిత వాడల్లో పర్యటించాను. వారి వెనకబాటుతనాన్ని గమనించాను. వాళ్లు మతం మారడానికి కారణం డబ్బు మాత్రమే కాదు.. నిరాదరణ అని అర్థం అయింది. నేను హిందూధర్మంలో భాగస్వామిని అనే ఆత్మాభిమానం వారిలో కల్పించాలి. అప్పుడే దళితులు ఉన్నతి సాధిస్తారు. అలాగే యువతలో హిందూ ధర్మం పట్ల అవగాహన పెంపొందించాలి. మన ధర్మాన్ని అనుసరించేలా వారికి ఆధ్యాత్మిక తేజాన్ని అందించాలి. రాష్ట్రంలో నేను చేయాల్సింది ఇంత వుండగా అమెరికా వెళ్లి ఏం చేయాలని రెండు సార్లు వాళ్ల ఆహ్వానాన్ని కాదన్నాను. తప్పనిసరై ఈ ఏడాది 46 రోజుల పాటు అమెరికాలో పర్యటించాను. 9 రాష్ట్రాలలోని అనేక పట్టణాల్లో పర్యటించాను. ఆ దేశాన్ని చూశాక అంతవరకు అమెరికా పట్ల నాకున్న అభిప్రాయం మారిపోయింది.

నా రాష్ట్రం ఇలా వుంటే...?
అమెరికాలో వున్న భారతీయుల ఇళ్లలో సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ప్రతి ఇంట్లోని దేవుడి గదిని ఆలయంలా తీర్చిదిద్దుకున్నారు. కొన్ని సంస్థలు కులాల ప్రాతిపదికగా వున్నా దేవాలయం దగ్గరకు వచ్చే సరికి హిందూ కమ్యూనిటీ సెంటర్స్ పేరిట అంతా ఏకం అవుతున్నారు. వారంలో ఒకసారి అందరూ కలుస్తున్నారు. «మనం ఇక్కడ ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా కునారిల్లుతుంటే అమెరికాలో వుంటున్న మన వాళ్లు సమష్టిగా ధర్మ పరిరక్షణ కోసం ఆలోచించడం నన్ను అబ్బురపరిచింది. అమెరికాలో అద్భుతమైన వ్యవస్థ వుంది. అక్కడ ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందిస్తున్నారు. విలువలతో కూడిన విద్య గతంలో మన గురుకుల వ్యవస్థల్లో వుండేది. ఈ రోజున ఆ విధానాన్ని అమెరికాలో విద్యార్థులకు అందిస్తున్నారు. న్యాయం, పోలీస్, వైద్య వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి. అమెరికాలో ఆ దేశం వారి కంటే వేరు వేరు దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఎక్కువ. వారిలో కూడా నా అమెరికా, నా దేశం అనే భక్తి భావం కనిపించింది. ఈ అంశాలే అమెరికాను అభివృద్ధిలో అంత ఎత్తున నిలిపాయి. నా రాష్ట్రం కూడా ఇలా వుంటే ఎంత బావుండు అనే తపన నాలో మొదలైంది. గ్లోబల్ హిందూ హెరిటే జ్ ఫౌండేషన్ వారు నా అమెరికా పర్యటన వ్యవహారాలన్నీ చూసుకున్నారు. 46 రోజుల పర్యటనలో సుమారు 50 లక్షల రూపాయల వరకు భక్తుల నుంచి కానుకలుగా అందాయి. ఆ డబ్బు మొత్తాన్ని నేను నా టూర్ ఆర్గనైజ్ చేసిన ఫౌండేషన్ వారికే ఇచ్చేశాను.

స్వాములు ఇస్తారు.. పుచ్చుకోరు!
మన దేశంలో సాధువులు, సన్యాసులకు అమెరికా వంటి దేశాలకు వెళ్లి లక్షలు పోగేసుకొచ్చుకుంటారనే విమర్శ వుంది. నిజానికి సన్యాసులకు డబ్బెందుకు? స్వాములు జ్ఞానాన్ని ఇస్తారు.. మరేవీ పుచ్చుకోరు. ఆ డబ్బును ఏం చేద్దాం అని అడిగారు ఫౌండేషన్ సభ్యులు. మాతృదేశంలో ధర్మపరిరక్షణకు ఈ డబ్బును ఖర్చు చేయండి అని చెప్పాను. అందుకోసం నాలుగంచెల పథకాన్ని రూపొందించాం. అందులో భాగంగా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అలాంటి ఒక హాస్టల్‌ను అనంతపురంలో ఇప్పటికే నేను ప్రారంభించాను. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లల్ని అందులో చేర్చుకుని వారికి విలువలతో కూడిన ఉచిత విద్యను అందిస్తున్నాం. వారికి సంస్కృతి, సంప్రదాయాలు బోధిస్తున్నాం. అక్కడ చదువుకున్న పిల్లలు మంచి మార్కులతో ఇతర స్కూళ్లలోని పిల్లలతో పోటీ పడుతున్నారు. ఇలాంటి హాస్టళ్లు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పించాం. వచ్చే ఏడాది కల్లా కనీసం 6 జిల్లాల్లో ఇలాంటి హాస్టళ్లు ప్రారంభం అవుతున్నాయి. అలా ఏడాదికి రెండు వేల మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నతి సాధిస్తే, ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా సమాజం అభివృద్ధి సాధిస్తుందని నా విశ్వాసం. అమెరికాతో పాటు వివిధ దేశాలలో వుంటున్న మన వారు నలుగురు ఒక జిల్లాను చొప్పున దత్తత తీసుకుని ఈ బాధ్యతను చేపట్టాలని నిర్ణయించాం. భారతదేశాన్ని, యువతను, వ్యవసాయాన్ని, పశుసంపదను ఉద్ధరించే లక్ష్యంతో పుణ్య కల్చరల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో గో సంపదను, రైతును, ఆలయాల్ని పరిరక్షించే చర్యలు చేపట్టాలని సంకల్పించాం.

గోవు..ఆలయాలు, ధర్మం బతకాలి
గోవధ పెరుగుతోందని ఆందోళన పడుతున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎవరూ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు. మనం మట్టికి దూరమై పోయి పుట్టెడు కష్టాలు కొనితెచ్చుకుంటున్నాం. ఒక ఆవును పెంచితే వచే ్చ వ్యర్థాలతో ఎకరాల కొద్దీ పంటను ఎరువులు లేకుండా పండించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. అందుకే రైతు అప్పుల పాలు కాకుండా చూడడంతో పాటు గోవధను తగ్గించేందుకు గోకులాల్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాం. కాకినాడ శ్రీపీఠంలో ఇప్పటికే దయానంద సరస్వతి గోకులం ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు పని మొదలుపెట్టాం. ఈ గోకులాలను ఆదర్శవంతంగా, గోవుల పట్ల భక్తి పెరిగేలా తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడి దేశీ ఆవులను రైతులకు దత్తత ఇస్తాం. అవి ముసలివి అయిపోయాక వాటిని మాకు అప్పగిస్తే, అవసాన దశలో అవి స్వేచ్ఛగా జీవించేందుకు వీలుగా ప్రతి జిల్లా కేంద్రంలో గో స్వేచ్ఛా సంచార కేంద్రాలను ఏర్పాటే చేసే ప్రయత్నం చేస్తున్నాం. గోకులాల వల్ల గోసంపద పెరగడంతో పాటు, ఉత్పత్తి వ్యయం తగ్గి రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి. ఇక ప్రతి జిల్లాలో నాలుగు ప్రాచీన ఆలయాల్ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయాలని సంకల్పించాం. కొత్త ఆలయాలు కట్టుకుంటూ పోయేకంటే వున్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం ప్రధానం. అందుకే ప్రతి జిల్లాలో నాలుగు ఆలయాల్ని తీసుకుని వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఆ ఆలయాల్లో అన్ని పూజలు ఉచితంగా చేసేలా ఏర్పాటు చేస్తాం. ఈ బాధ్యతలు నిర్వర్తించి, ధర్మపరిరక్షణ చేసేందుకు జిల్లాకు నలుగురు సుశిక్షితులైన ధర్మపరిరక్షకులను ఏర్పాటు చేస్తాం. దేవాలయం కేంద్రంగా, సమాజాన్ని చైతన్యపరచి ధర్మపరిరక్షణ చేసేందుకు వీరు కృషి చేస్తారు. ఇలా ధర్మపరిరక్షణ జరిగి, బడుగులు అభివృద్ధి చెంది, గోవులు, రైతులు సుభిక్షంగా వుంటే మన దేశంలో అభివృద్ధికి కొదువ ఏముంటుంది? మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. అందుకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలి.

హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు పండితులు, ప్రముఖుల సూచనలు తీసుకుని, కార్యాచరణ రూపొందించేందుకు గాను వచ్చే డిసెంబర్‌లో అంతర్జాతీయ హిందూ సభలు ఏర్పాటు చేస్తున్నాం. స్వామి దయానంద సరస్వతి ఈ సదస్సుకు సార«థ్యం వహిస్తారు. యువతలో హిందూ ధర్మాన్ని పాదుకొల్పేందుకు ఏం చేయాలనే అంశంతో పాటు ప్రామాణికమైన పురాణాలు ఏవి అనే అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తాం. డిసెంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు లక్ష మంది పాల్గొంటారు. మొత్తం ఏడు దేశాల ప్రతినిధులతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి 50 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఆశారామ్ బాపూజీ, శ్రీశ్రీరవిశంకర్, బాబా రామ్‌దేవ్ వంటి ప్రముఖులతో పాటు మన రాష్ట్రానికి చెందిన పలువురు పండితులు, పెద్దలు సదస్సులో పాల్గొంటారు. హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశంపై అమెరికాలో వుంటున్న తెలుగు యువతీయువకులు ప్రసంగిస్తారు. వారే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా మన సమాజంలోని పెద్దలందరితో ఈ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ సభల్లో పాలుపంచుకోవాలన్నా, హిందూ పరిరక్షణ ఉద్యమంతో చేయి కలపాలన్నా  www.sreepeetham.in? వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
- టి. కుమార్

11, జులై 2013, గురువారం

హరినామ మహిమ


ఒకానొక రోజున కాశీ మిశ్రుని భవనములో వేంచేసి ఉన్న శ్రీ చైతన్య మహాప్రభువును కృష్ణ దాసు అను ఒక భక్తుడు బ్రహ్మాది దేవతలకు గూడ గోచరముకాని కృష్ణ నామ మహిమను గురించి చెప్ప వలసినదిగా కోరెను.  అపుడు శ్రీమన్మహా ప్రభువు ఇట్లు వివరించెను.

ఓ క్రిష్ణదాసా! కృష్ణ నామ మహిమ అపారమైనది.  ఈ నామ ప్రభావమును గూర్చి క్రిష్ణునికే తెలియదనినను అతిశయోక్తి కానేరదు. ఐనను నామ మహిమను గురించి అనేక శాస్త్రములలో నేను గ్రహించిన దానిని నీకు చెప్పెదను.  దీనిని విశ్వాసముతో శ్రద్దగా వినుము.  ఫలితముగా నీవు ఈ ఘోర సంసార సముద్రము నుండి తరించగలవు.

హరినామమును ఉచ్చరించుట వలన సమస్త పాపములు తొలగిపోవును.  అన్ని రకముల వ్యాధులు నిర్మూలనమగును.  సమస్త దుఃఖములు సమసిపోవును.  ఆకలి బాధ క్షీణించును.  నరకములో నున్న వారు గూడ శీఘ్రముగా తరింతురు.   ప్రారబ్ద కర్మము ఖండింప బడును.  సమస్త అపరాధములు క్షీణించును.

దాన, వ్రత, హోమాది సమస్త కర్మలు నామమునే ఆశ్రయించును.   వేదములన్నిటియందు సారభూతమై సూర్యుని వలె ప్రకాశించునది నామమే.  సమస్త పుణ్య తీర్ధముల (ఫలితము) కంటే నామము సర్వోత్క్రుష్టమని సమస్త శాస్త్రములు ఘోషించుచున్నవి.   సమస్త శుభకర్మలు నామముపై ఆధారపడి యున్నవి.  ఐనను వాటి అన్నిటికంటే ఉత్తమ ఫలితమును ఒక్క నామమే ఒసంగును.  భగవంతుని సర్వ శక్తులు నామము నందు ఇమిడి యున్నవి.  సమస్త జీవరాసులకు ఆనందము నిచ్చునది భగవన్నామమొక్కటే.  శ్రద్ధతో హరినామమును కీర్తించినవారు జగత్తులో పూజనీయులు.  దిక్కులేని వారికి నామమే దిక్కు.  పతితులను గూడ పావనులనుగా జేయు సామర్ధ్యము నామమునకు గలదు.

కృష్ణ నామమును సర్వకాల సర్వావస్తల యందు కీర్తించు వారు ఆ నామ సంకీర్తన వలననే ముక్తిని పొందుదురు.  మరియు వారికి వైకుంఠ ధామములో నిరంతరము హరిని కీర్తించు భాగ్యము, భగవత్ప్రీతియు కలుగును.  స్వయముగా నామమే పురుషార్ధములనిచ్చును.  భక్తి  అంగములలో నామము ప్రధానమైనదని శృతి, స్మృతి, శాస్త్రములు చెప్పుచున్నవి.  


దీనికి అసంఖ్యాకములైన ప్రమాణములు గలవు.
--

నామము సర్వ పాపములను వినాశనము చేయును:

1.
అయం హి కృత నిర్వేశో జన్మకోట్యంహసామపి
  
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః (భాగవతము 6-2-7) 

సమస్త పాపములను నశింపజేయుటయే నామము యొక్క ప్రప్రథమ ధర్మము.  దానికి ప్రమాణం ఏమనగా - అజామిళుడు అవసానకాలమందు "నారాయణ" శబ్దము ముమ్మారు ఉచ్చరించి కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది భగవత్సాన్నిధ్యము జేరెను.
సమస్త వ్రతములకంటే నామము ఉఛ్ఛమమైనది.

2.
న నిష్క్రుతై రుదితై: బ్రహ్మ వాదిభి
  
స్తథా విశుధ్యత్యఘవాన్ వ్రాతాదిభి:
  
యథా హరేర్నామ పదైరుదాహృతై
  
సదుత్తమః శ్లోక గుణోపలంభకం (భాగవతము 6-2-11)
చాన్ద్రాయణాది వ్రతములు పాపాత్ములను పాపముల నుండి శాస్త్రములలో చెప్పిన రీతిని తరింప జేయలేవు.  ఏలననగా, తాత్కాలిక వ్రతాదుల వలన పాప వాసన, పాప భీజము నశింపవు.  కాని కృష్ణ నామమును ఉచ్చరించుట వలన పూర్వక్రుత పాపమే గాక, పాపమునకు మూలకారణమగు అవిద్య గూడ తొలగి పోవును.  సమస్త పాపములనుండి రక్షించి ముక్తి నొసంగునది నామమే కావున దీనికి మించిన వ్రతము వేరొకటి లేదు.
సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)



గోవింద కీర్తనమనేది అగ్ని జీవుల యొక్క భూత భవిష్యద్ వర్తమానముల పాపములనన్నిటిని అనాయాసముగా దహించి వేయును.  కావున కలియుగములో నామము కంటే జీవులకు బంధువు లేరు (లఘు భాగవతము).

ఈ భూలోకమున నిరంతరము సజ్జనులను పీడించు ద్రోహ చింతన గలిగిన వారు గూడ సదా హరికీర్తన వలన పవిత్రులై ధన్యులగుదురు
(లఘు భాగవతము).

శాస్త్రములలో లెక్కలేనన్ని ప్రాయశ్చిత్తములు చెప్పబడి యున్నవి.  కాని అవి ఏవియు కృష్ణ నామ కీర్తనమునకు సమము కానేరవు. (కూర్మ పురాణము)

ఏ పాపియు గూడ చేయలేనంతటి పాపమును గూడ హరింప జేయ గల శక్తి నామమునకుఉన్నది .  భగవన్నామ మహిమ అంతటిది.  అనగా నామము ఎంతటి పాపమునైనాను తుడిచి వేయునని అర్ధము.

(కూర్మ పురాణము)

ఎవరు అచ్యుత, గోవింద, మధుసూదన యని భగవంతుని నామమును ఆర్తితో ఉచ్చరించుదురో వారి సర్వ రోగములు (శారీరక, మానసిక) నశింప బడును.  ఇది ముమ్మాటికీ సత్యము (బృహద్ నారదీయము).

మహాపాతకుడైనను అహర్నిశము జగదీశ్వరుడగు హరిని  కీర్తించిన యెడల అంతః శుద్ధి గలిగి సజ్జన సాంగత్యమునకు యోగ్యత కలుగును(బ్రహ్మాండ పురాణము).

మహావ్యాధి పీదితుడైన వాడు, రాజదండనము అనుభవించువాడు 'నారాయణ' అని ఆర్తితో నుచ్చరించినచో వారు ఆయా బాధల నుండి తత్ క్షణము విముక్తులగుదురు (వహ్ని పురాణము).

నిరంతరము హరినామ కీర్తనము చేయువారికి సర్వరోగములు; క్లేశములు; సర్వ ఉపద్రవములు; సర్వ అరిష్టములు తొలగిపోవును (బృహద్ విష్ణు పురాణము).

సూర్యుడు అంధకారమును, ప్రబలమగు వాయువు మేఘములను దూరీభూతము చేయునట్లు అనంతుడైన భగవంతుని నామమును ఆశ్రయించిన వారికి (అనగా శ్రవణ, కీర్తనము చేయు వారికి) వ్యసన రూప దుఃఖములన్నియు పటాపంచలగును.  (భాగవతము 12-12-48)

కష్టము వచ్చినపుడు, మనో వ్యాకులత ఏర్పడినపుడు, పతనమొందినపుడు, భయము కలిగినపుడు, ఘోరమైన వ్యాధి పీడితుడై దానికి నివారణోపాయము లేనపుడు "నారాయణ" శబ్దము నొక్కసారి కీర్తించినచో సమస్త దుఃఖములనుండి విముక్తులై సుఖశాంతులను పొందగలరు (విష్ణు ధర్మోత్తరము).



 సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)
ప్రాపంచిక ఫలితములనాశించి గాని ఇతరులను హేళన చేయు ఉద్దేశ్యముతో గాని, గానము చేయవలెనని గాని, ఆశ్రద్ధతో గాని వైకుంఠుని నామమును ఎవరు ఆశ్రయించుదురో, వారి అశేష పాపములు హరింపబడును.  ఈ విషయమును శాస్త్రవేత్తలగు భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు.

పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప్త ఆహతః
హరిరిత్యవశే నాహ పుమాన్ నార్హతి యాతనాః (భాగవతము 6-2-15)
పైనుండి క్రింద పడినపుడు గాని, నడచుచు జారినపుడు గాని, శరీరమునకు గాయము తగిలినపుడు గాని, సర్పాది క్రూర జంతువుల వలన హాని కలిగినపుడు గాని, రోగపీడితుడైనపుడు లేదా ఇతరులు శిక్షించినపుడు గాని ఎవరు కృష్ణ, హరి, నారాయణ అను నామములను ఉచ్చరించుదురో వారికి ఎన్నడును నరక బాధ కలుగదు.

అజ్ఞానా దథవా జ్ఞానాదుత్తమః శ్లోకనామ యత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథా 2నలః (భాగవతము 6-2-18)
అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే  ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును. 

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి