19, సెప్టెంబర్ 2012, బుధవారం

శరణాగతే అవినీతికి మందు

"నాక్కొంచెం నమ్మకమివ్వు"

ఇది ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన నినాదం. సెక్యులరిజమ్ పేరుతో, శాస్త్రీయ దృక్పథం పేరుతో దేన్నీ నమ్మొద్దని, లౌకికంగా ఆలోచించమనీ మనుషులకి చిన్నప్పట్నుంచి గ్యాసుకొట్టాక ఇహ నమ్మకాలు ఎక్కణ్ణుంచి వస్తాయి ? ఉన్న నమ్మకాలన్నీ పోయి మనుషుల్లో స్వార్థం పెఱుగుతుంది (పెఱిగింది). మూఢనమ్మకాల్ని పారద్రోలే పేరిట మంచి నమ్మకాల్ని కూడా పారద్రోలుతున్నారు, పొలాల్లో ఎండోసల్ఫాన్ వేస్తే పురుగులతో పాటు మనుషులు కూడా చచ్చినట్లు ! స్వార్థం పెఱిగిన సమాజంలో మనుషులు మానసికంగా ఒంటరివాళ్ళయిపోతారు. ఎంతగా ఒంటరివాళ్ళవుతారో అంతగా అభద్రతాభావన హెచ్చుతుంది. అభద్రత హెచ్చేకొద్ది మానసిక స్థైర్యం కోసం ధనాన్ని ఆశ్రయించడం కూడా ముమ్మరమవుతుంది. మనసు ధనం కోసం వెంపరలాడేకొద్దీ ఎంత సంపాదించినా చాలదనిపిస్తుంది. అలా అనిపించాక ఏం చేశైనా సరే, ఇంకా సంపాదించాలనిపిస్తుంది. ఎవరో ఏదో సంపాదిస్తున్నారని మనం కూడా అలా సంపాదించాలనుకోవడం. అందుకని ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా, దారి తెలిసినా తెలియక పోయినా, ఒకవేళ మనం అనుకున్నట్లు సంపాదించగలిగితే దాన్తో మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో మనకే అర్థం కాకపోయినా గుడ్డెద్దులా ఆ చేలో పడి పోవడం. ఇదొక అంతులేని అగాధపు ఊబి. ఇదొక నిరంతర అశాంతిమయమైన, పైకి జబ్బులా కనిపించని మానసిక జబ్బు.

"డబ్బు, డబ్బు, డబ్బు" అని జపం చేస్తే డబ్బొస్తుందా ?

ఎవరి డబ్బో చూసి మనం ఆబగా లొట్టలేస్తే మనకి డబ్బొస్తుందా ?

డబ్బు సంపాదించినవాళ్ళ "Celebrated seven habits" ఏంటో పొల్లుపోకుండా తెలుసుకొని మనమూ వాటిని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా డబ్బొస్తుందా ?

రాదు, రానేరాదు. ఎప్పటికీ రాదు.

డబ్బుయోగాన్ని మనిషి నుదుట దేవుడు రాయాలి. అలా రాయాలంటే మన పూర్వజన్మపుణ్యం కలిసిరావాలి. మన పుణ్యం ఖాతాలో డబ్బుంటే దాన్ని ఎవఱూ ఆపలేరు. ఆ నమ్మకం నిజంగా ఉంటే వెధవపనులు చేసి సంపాదిద్దామనే సంకల్పం మనుషుల్లో కలగదు. "దేవుడున్నాడు. ఆయన్ని నేను నమ్ముతున్నాను. ఆయన నాకూ, నా కుటుంబానికీ అన్యాయం చేయడు. నా భక్తి, నా పుణ్యం, నా మంచితనం ఇవే నా వాళ్ళని కాపాడతాయి" అని నమ్ముకుంటే అదే జఱుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవరలా నమ్ముకుంటున్నారు ? ఆత్మవిశ్వాసం పేరుతో తమ జీవితాల బాధ్యత పూర్తిగా తమ మీదనే వేసుకుంటున్నారు. నిజానికి వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు, అలా వేసుకోవడం తప్ప, అదీ ఎవడో చవకబారు వ్యక్తిత్వ చిట్కాలు చెప్పాడని ! ఈ కాలంలో పెచ్చుమీఱిన అవినీతికి కారణం దేవుడి మీద నమ్మకం లోపించడం. ఆయన తమ సంగతీ, తమ తరువాతి తరాల సంగతీ చూసుకుంటాడని విశ్వసించకపోవడం. తమకి చెందని తమ జీవితాల బరువుని తామే మొయ్యాలనుకోవడం.

Give God a chance. Give Nature a chance. Give spontaneity a chance.

ఇదే కర్మయోగం బోధించేది. ఆ తరువాత మీ జీవితం ఎంత నమ్మలేని విధంగా ఆనందమయంగా మారిపోతుందో మీరే చూస్తారు.

14.11.2009

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి