జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
శ్రీరామదూతం శిరసా నమామి!
పెఱటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు, మన సంప్రదాయం, పెద్దలు మనకిచ్చిన అతి గొప్ప మంత్రాలను మనం అలాగే నిర్లక్ష్యం చేస్తున్నాం . ’రామ’ అనే పదాన్నీ, దాని శక్తిని తక్కువగా అంచనా వేసుకుని ఎంతో కోల్పోతున్నాం. ఎవఱైనా "చాలా కష్టం వచ్చింది. ఏం చెయ్యమంటావి ?" అని అడిగితే రామనామ జపం చెయ్యమని చెప్పి చూడండి, వాళ్ళ ప్రతిచర్య గమనించండి. "ఏమిటండీ, నేను ఇంత కష్టంలో ఉండి సలహా అడిగితే మీరు సింపుల్ గా రామనామం చెయ్యమని చెప్తారేంటి ?" అంటారు. అంటే సమస్య కనపడినంత పెద్దగా, ఆర్భాటంగా, హంగుగా పరిష్కారం కూడా ఉండాలన్నమాట. "ఇంత పెద్ద తతంగం చేస్తే ఈ సమస్య తప్పింది" అని చెప్పుకోవడానికా? అలాగని ఏ క్రతువునీ నేను తక్కువ చెయ్యట్లేదు. రామనామానికి ఆ శక్తి ఉంది కాబట్టి, పెద్దలు నిరూపించి కూడా చూపించారు కాబట్టి మనం చెప్తాం. అవతలివారికి కూడా నమ్మకం ఉండాలికదా, ఆ నమ్మకం లేకుండా, "ఏమిటో ఉత్త రామనామం చేస్తే ఈ కష్టం తీఱిపోతుందా ?" అనుకుంటే ఎలా?
గురువుగారు ఒక కధ చెప్తూ ఉండేవారు. విభీషణుని రాజ్యంలో ఎవఱికో సముద్రం దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళవలసిన అవసరం పడిందట. రాజుగారిని అడిగితే "నేను ఒక రక్ష కట్టి ఇస్తాను, అది చేతిలో పట్టుకుని నడువు, సముద్రంలో నువ్వు మునగవు, ఐతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్షను విప్పి చూడడానికి ప్రయత్నించకు" అన్నాడట. "సరే" అని అతను బయలుదేఱాడట. సగం సముద్రం దాటేసరికి ఉత్సుకత ఆపుకోలేక, "ఏముంది ఇంత శక్తివంతమైన రక్షలో ?" అని విప్పి చూసాడట. "రామ" అని రాసి ఉందట. అందులో ! "ఓహ్ ఇంతేనా ?" అనుకున్నాడట, బుడుంగున మునిగిపోయాడట. ఇది సమస్యల్లో ఉన్నవారికి రామనామం చెయ్యమని చెప్తే ఎదురయ్యే పరిస్థితి,.
శ్రీరామ ప్రాతిపదికమవశేనాఽపి సంగృణన్ |
ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం తతో బుద్ధి పూర్వకమ్ ||
ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం తతో బుద్ధి పూర్వకమ్ ||
అని రామాయణ మాహాత్మ్యం చెపుతోంది. "అనుకోకుండా ఐనా రాముని తలుచుకుంటే ముక్తి దొఱుకుతుంది, ఇక బుద్ధిపూర్వకంగా తలుచుకుంటేనో...?" అని ఈ శ్లోకానికి అర్ధం. ఇక మనకు బాగా కావాల్సిన వారనో, వృద్ధిలోకి రావాలనో రామనామాన్ని సిఫారసు చేస్తామనుకోండి. ఇక మొదలుపెడతారు వాళ్ళ బాధ్యతల చిట్టాలు. "ఇన్ని బరువుబాధ్యతల్లో ఎక్కడ కుదురుతుందండీ చెయ్యడానికి ?" అని. "ఈ మోత బరువు ఇప్పుడెందుకు, రిటైరైన తర్వాత చేస్తాలే !" అని ! ఇదొక్కటే బరువు మనకి. కానీ నిజానికి అన్ని బరువులనీ వదిలించుకునే బరువు ఇది. ఈ బరువు ఒక్కటి మొయ్యడానికి సిద్ధపడితే మిగతావన్నీ తేలికైపోతాయి, వదిలిపోతాయి. ఇది తెలియక మనం రామనామం బరువనుకుంటున్నాం. కఱువొచ్చినట్టుగా మిగతా విషయాలకోసం పరిగెడుతున్నాం.
ఏదైనా ఎక్కువ వాడితే లభ్యత తగ్గి కఱువొస్తుంది. కాని రామనామం పెఱుగుతుంది, శతకోటి సూర్యుల పగిది పెఱిగి, ప్రవర్ధమానమై, లోకాన్ని కాంతిమంతం చేస్తుంది. మనం చేసే రామనామం, మనల్నే కాక లోకం మొత్తాన్నీ ఉద్ధరిస్తుంది. ఇహపరసాధకం రామనామం. అందుకే మన పెద్దలు ఊరూరా రామునికి గుళ్ళు కట్టారు. తెలిసైనా, తెలియకైనా రాముడి గుఱించి అనుకుంటారనీ, బాగుపడతారనీ వారు చేసిన పని అది. ’రామ’ అనేది ఏదో రెండక్షరాల పదం కాదు”అది రెండున్నాయి’ అనుకునే స్థితి నుండి”అంతా ఒకటే’ అనే అద్వైత భావనని మనసులో పెంచగలదు.’లోకా స్సమస్తా స్సుఖినోభవంతు’ అన్న ఋషివాక్యాన్ని పునఃప్రతిష్ఠించగలదు. అలాంటి అమేయమైన రామనామాన్ని బరువనుకోకుండా, ఎవఱూ చెప్పలేదనకుండా, నిత్యం జపిద్దాం. ఇహపరాలు రెండింటిలో సార్ధకత్వాన్ని పొందుదాం.
ఏమైనా తప్పులుంటే పెద్దలు క్షమించి సరిదిద్దగలరు. రామనామం పట్ల, ఆ నామానికున్న శక్తి పట్ల నా తోటివాళ్ళ నిర్లక్ష్యాన్ని, నిరాసక్తతని చూసి ఆవేదనతో రాస్తున్నాను.
భవదీయుడు, మనోహర్ చెనికల....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి