31, డిసెంబర్ 2013, మంగళవారం

గుడి ఉన్న ఊళ్ళోనే మనుగడ

ప్రతిష్ఠ చేసిన ప్రదేశాల్లో జీవించే అర్హత ప్రతి మానవునికీ ఉంది.

ఆదియోగి శివుడు అగస్త్య మహామునిని దక్షిణ భారతావనికి పంపించారు.  దక్కను  పీఠభూమికి దక్షిణాన ప్రతి పల్లెనూ, జనావాసాన్నీ ఆ మహాముని ఏదో రకమైన ప్రతిష్ఠలతో పవిత్రం చేశారు.  తద్వారా ఆ ప్రాంతాల్లో ఆథ్యాత్మిక ప్రక్రియ ప్రారంభమై, కొనసాగేలా చూశారు. మానవుడు నివసించే ఏ ఒక్క జనావాసాన్నీ కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఇలా చేయడానికి ఆయనకు 4,౦౦౦ సంవత్సరాల కాలం పట్టిందని చెబుతారు.  అయితే అది నాలుగు వేల ఏళ్ళా, నాలుగు వందల ఏళ్ళా, అంత కాకుంటే పోనీ 140 ఏళ్ళా అనేది మనకు తెలియదు.  కానీ, ఆయన చేసిన ఈ బృహత్తర కార్యక్రమం, అందుకోసం ఆయన చేసిన సుదీర్ఘ యాత్ర గమనిస్తే, ఆయన అసాధారణ రీతిలో ఎంతో దీర్ఘకాలం సాధన చేశారన్నది అర్థమవుతుంది.

ప్రతిష్ఠ చేయడమనేది ఓ సజీవ ప్రక్రియ.  మట్టిని ఆహారంగా మార్చామనుకోండి, దాన్ని వ్యవసాయం అంటున్నాం. అదే ఆహారాన్ని మాంసంగా, ఎముకలుగా మార్చేదాన్ని జీర్ణ క్రియగా, మళ్ళీ ఈ మాంస శరీరాన్ని మట్టిగా మార్చడాన్ని దహనం లేదా ఖననం అంటున్నాం.  ఇక్కడ పేర్కొన్న ఈ మాంసాన్ని లేదా ఓ రాయిని, ఇవీ అవీ కాకుంటే ఏ ఖాళీ ప్రదేశాన్నయినా దివ్య భూమికగా మార్చగలిగితే, ఆ ప్రక్రియే ప్రతిష్ఠ.  ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఒకే శక్తి రూపాలనీ, ఒకే శక్తి కోట్లాది రూపాల్లో, అనేక విధాలుగా వక్తమవుతోందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది కదా.  విషయం అదే అయినప్పుడు, దివ్యత్వమని, రాయి అని, మగాడు లేదా ఆడది అని, రాక్షసుడని మనం అంటున్నవన్నీ వివిధ రూపాల్లో గోచరిస్తున్న, పనిచేస్తున్న ఒకే శక్తి మాత్రమె.  ఉదాహరణకు విద్యుత్తు ఒకటే.  కాని అదే దీపంగా వెలుగుతుంది, ధ్వనిగా వినవస్తుంది.  సాంకేతికతను బట్టి విద్యుత్తూ వివిధ రకాలుగా వ్యక్తమవుతుంది.  అలాగే ఈ ప్రతిష్ఠ కూడా ఒక సామ్కేతికతే.  అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉంటే, మన చుట్టు ఉన్న ఈ సామాన్యమైన సాధారణమైన ప్రదేశాలను దివ్యంగా మార్చగలుగుతాం.  దారి పక్కనున్న ఓ చిన్న రాయిని తీసుకుని దాన్ని ఓ దేవుడిగానో, దేవత గానో మార్చేయ గలుగుతాం.  అదే ప్రతిష్ఠ అనే అద్భుతం.

మన సంస్కృతిలో ఈ అఖండ విజ్ఞానాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేయడం జరిగింది.  మన సంస్కృతిలో ఈ విజ్ఞానాన్ని పరమోత్క్రుష్టమైనదిగా నిర్ధారించారు.  మన సంస్కృతిలో మనమేమి తింటున్నాం, మనమెలా ఉన్నాం, మనమెంత కాలం బతుకుతాం అనేవి అంత ముఖ్యమైనవి కాదు.  మన జీవితంలో ఏదో ఓ తరుణంలో సృష్టిమూలాలను అన్వేషించాలనే వాంఛ ప్రతివారికీ తప్పకుండా వచ్చి తీరుతుంది.  దీన్ని అందుకోవాలనే తపన పడే ప్రతి మానవునకూ ఈ అవకాశం అందివచ్చే విధంగా చేయక పొతే, అతనికి యదార్థమైన సంక్షేమాన్ని అందించడంలో సమాజం విఫలమైనట్లే.

మానవాళి అభ్యున్నతికి అవసరమైన ఈ సంక్షేమ దృష్టి తోనే ప్రతివీధిలో కనీసం ముడేసి దేవాలయాలు ఉండడాన్ని ఈ సంస్కృతిలో భాగం చేశారు.  ఎందుకంటే, పవిత్రమైన వాతావరణం లేని ప్రదేశం, కొన్ని అడుగులైనా సరే, ఉండరాదన్న విజ్ఞతతో  చేసిన గొప్ప ఏర్పాటు ఇది.  ఇదేదో ఓ గుడికి పోటీగా మరో గుడి నిర్మించాలనుకోవడం కానే కాదు.  ఎవరూ కూడా ప్రతిష్ఠ కాని ప్రదేశంలో ఒక్క అడుగు కూడా వేయరాడనే సదుద్దేశంతో చేసినది.  ఎవరు కూడా ప్రతిష్ఠ కాని వాతావరణంలో జీవితం దుర్భరం చేసుకోరాదన్న విశేష ఆదరణ బుద్ధితో చేసిన మహాత్కార్యమిది.  అందుకే ముందుగా గుడిని నిర్మించి ఆ తరువాతే దానిచుట్టూ నివాసాలు నిర్మిస్తూ వచ్చారు.

దక్షిణాది యావత్తూ, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం యావత్తూ ఇదే తీరున నిర్మితమైంది. తమిళ నాడు లోని చెప్పుకోదగిన ప్రతి పట్టణంలో ఓ బృహత్ దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది.  దాని చుట్టూనే పట్టణం.  ఎందుకంటే మనమేలాంటి ఇంటిలో ఉంటున్నాం అన్నది ముఖ్యం కాదు.  ఆ ఇల్లు పదివేల చదరపు అడుగుల్లో నిర్మిమ్చినదా, లేక వెయ్యి చదరపు అడుగుల్లో కట్టినాడా అనేది అంతకన్నా ముఖ్యం కాదు.  దానివల్ల చివరకు మన జీవితంలో తేడా ఏదీ ఉండదు.  కానీ, ప్రతిష్ఠ చేసిన వాతావరణంలో నివాసం వల్ల మన జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది.  ఎంతో తేడా కనిపిస్తుంది.  ఈ విజ్ఞానంతోనే, ఈ అనుభవసారంతోనే, వారు మానవ ఆవాసాలను ఈ విధంగా నిర్మించారు.  ఊళ్ళో 25 గడపలు ఉన్నాయంటే, కచ్చితంగా ఓ దేవాలయం ఉండి తీరాలి.  మనం ఆ గుడికి వెళ్ళినా, వెళ్లక పోయినా, మనం అక్కడ ప్రార్థించినా, ప్రార్థించక పోయినా, మనకు ఏదైనా మంత్రం తెలిసినా, తెలియకున్నా పరవాలేదు.  అసలది సమస్యే కాదు.  జీవితంలో ప్రతి క్షణం మనం ప్రతిష్టించిన వాతావరణంలోనే ఉండాలి.  అదే దీని పరమార్థం. 
[kbn sharma]

18, డిసెంబర్ 2013, బుధవారం

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?


తొమ్మిది సంవత్సరాలపాటు సాగిన కంచి కథకు ఎట్టకేలకు నవంబర్ 26వ తేదీన పుదుచ్చేరి ప్రత్యేక కోర్టు ముగింపు పలికింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వామీజీ జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ నిర్దోషులని కోర్టు తీర్పు చెప్పింది. మొత్తం 24 మంది నిందితులలో ఒక నిందితుడు 2013 మార్చిలో చెన్నైలో హత్యకు గురవగా మిగిలిన 23 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు జస్టిస్ మురుగన్ ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. 

ఈ తీర్పు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. శంకర్ రామన్ ను హత్య చేసింది ఎవరు? 9 సంవత్సరాలు విచారణ చేసిన తరువాత కూడా అసలైన హంతకులను ఎందుకు పట్టుకోలేదు? ఇక రెండవ ప్రశ్న. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరూ గౌరవించే కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములను అక్రమంగా నిర్బంధించి, కేసులో ఇరికించి వారి గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చటానికి పన్నిన వ్యూహంలో భాగస్వాములు ఎవరు? హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కేసులు నడిపించిన తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు ఏమి చెప్పింది? ఏమి చెబితే, ఎంత చెబితే పోయిన స్వామీజీల గౌరవం తిరిగి వస్తుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, కోర్టు, విచారణ యంత్రాంగం, మీడియా ఏమి సమాధానం చెబుతుంది?

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామికి, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మధ్య మీడియా కూడా గుర్తించని వైరం ఏదో ఉండి ఉంటుందని ఆ సమయంలో (2004లో) వార్తలు వచ్చాయి. ఆ కక్షసాధింపు చర్యలో భాగంగా ఈ ఘాతుకం జరిగి ఉంటుందా?

2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలమూరు జిల్లాలో తెల్లవారితే దీపావళి పండుగ అనగా అర్థరాత్రి పూట పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఆ సమయంలో ''అర్థరాత్రి చడీచప్పుడు కాకుండా నిర్బంధించటానికి నేనేమైనా వీరప్పన్ నా?'' అని స్వామీజీ పోలీసులను ప్రశ్నించారు. తెల్లవారితే దీపావళి పండుగ అనగా అభియోగాలపై అభియోగాలు మోపి బెయిల్ పై త్వరగా బైటపడకుండా కూడ చూసారు. చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అనేక తప్పులు చేసింది.  ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును జ్ఞాపకం చేసుకొంటే ఒక్కసారిగా మనస్సు కలుక్కుమంటుంది. 80 కోట్లకు పైగా జనాభా ఉన్న హిందూ సమాజం, హిందూ సంస్థల నాయకులు దీనిపై వెంటనే ఏమీ చేయలేకపోయారు...!? రాజకీయ అధికారం ముందు ఏమీ తోచనివారయ్యారా? అటువంటి పరిస్థితులు ఎందుకు నిర్మాణమయ్యాయి? ఆలోచించవలసిన అవసరం మనందరకు ఉంది.

నిర్ధారణగా ఇది అని చెప్పలేము గాని, ఒక్కసారి గతంలోకి వెళితే కొన్ని విషయాలు, కొన్ని చేదు నిజాలు మనకు జ్ఞాపకం వస్తాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోప్ జాన్ పాల్-2 భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోప్ జాన్ పాల్ చేసిన వ్యాఖ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. "ఆసియా ఖండం, అందులో భారతదేశం కోతకు సిద్ధంగా ఉంది" - అంటే భారతదేశాన్ని క్రైస్తవదేశంగా చేయటానికి అనువుగా ఉంది అని ప్రకటించారు. దేశంలో క్రైస్తవ ప్రాబల్యం పెరిగితే దానిని నిరోధించేది, ఎదుర్కొనేది హిందూ సమాజంలోని సాధుసంతులు, సంఘము, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు. వాటి గౌరవ ప్రతిష్ఠలను సమాజంలో దిగజార్చాలని నిర్ణయించారా? అందుకే ఈ పథకం రచించబడిందా?

కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకం అమలులో భాగంగా ఈ అరెస్టులు, స్వామీజీల మీద, సంఘం మీద దాడులు, ఆరోపణ పర్వాలు సాగుతున్నాయా? ఇవి ఏవి హిందూ సమాజానికి పట్టవు. ఇక్కడ మీడియా రంగం కూడా వ్యవహరించిన తీరు ఎంతో గర్హించదగినది. ప్రపంచంలో అనేక దేశాలలో అమెరికా అండదండలతో క్రైస్తవం ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఎక్కడోదాక అవసరం లేదు - కేరళ, తమిళనాడులలో క్రైస్తవుల అకృత్యాలే అనేకం. వాటిని విచారణ జరిపించి దోషులను శిక్షించారా? కేరళలో నన్స్ పై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి పుస్తకాలే వచ్చాయి. అధికారుల అండదండల కారణంగా వేటిపైన సరియైన చర్య తీసుకోలేదు. పెరిగిపోతున్న క్రైస్తవుల అరాచకాల గురించి అనేక మంది పెద్ద మనుషులను వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమ బాధను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. కాని క్రైస్తవానికి వ్యతిరేకంగా గళం మాత్రం విప్పరు. ఇది కాంగ్రెసుకు కలిసి వస్తున్నది. ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం చేజారుతున్న తన ఆశలను పెంచుకొనేందుకు ఏమైనా చేసేందుకు సిద్ధం కావచ్చు. మైనార్టీల సంరక్షణ పేరుతో హిందూ సంస్థలను స్వామీజీలను వేధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక.

వైరము లేని హింసను చేయటానికి సిద్ధపడని హిందూసమాజం తన పైన శతృత్వం వహించి పని చేస్తున్న శక్తులను గుర్తించే పరిస్థితులు లేవు. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కేవలం ఆధ్యాత్యిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి జనకల్యాణ పరిషత్ స్థాపించారు. దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు వారి మార్గదర్శనంలో నడుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలని క్రైస్తవులు అనుకొని ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రభుత్వాలు సహకరిస్తూ ఉండి ఉండవచ్చు. ఇది ఈ రోజు హిందూ సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు. ఈ సవాలును స్వీకరించి ఆ ఎత్తుగడలను వమ్ము చేయగలుగుతామా?

యుపిఎ ప్రభుత్వం 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నుండి హిందూ సమాజంలోని పెద్దలు, స్వామీజీల సంస్థలను నైతికంగా (తాత్కాలికంగానైనా) దిగజార్చాలనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇది గమనించదగ్గ పరిణామం.

దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దూషణల పర్వం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక కావలసింది ప్రజలను గందరగోళంలో పడేయటం. దానిద్వారా తిరిగి అధికారం కాపాడుకోగలుగుతామా అన్నది ఇప్పటి కాంగ్రెస్ వ్యూహం. దీనిని జాగ్రత్తగా గమనించి మరిన్ని దాడులు జరగకుండా హిందూసమాజం అప్రమత్తం కావాలి. మీడియా ఎత్తుగడలను కూడా గమనించాలి. అప్పడు మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం.

9 సంవత్సరాల కంచి కథకు ఇప్పుడు ముగింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని కథలు నిర్మాణం కాకుండా చూసుకోవటం ఇప్పుడు హిందూ సమాజం ముందున్న కర్తవ్యం.
- రాము
http://www.lokahitham.net/

10, డిసెంబర్ 2013, మంగళవారం

అప్పులన్నీ తీరిన తరువాత పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత, దేవునిగూర్చి తలంచుకొనవచ్చును.

ఒకానొక పట్టణము నందు మధ్యతరగతికి చెందిన ఒక కుటుంబము కలదు. అందు ఇంటి
యజమానికి ఒక చిన్న ఉద్యోగము. భార్య సదాచారవతి. ఆ యిల్లాలు ప్రతిదినము
ఉషఃకాలముననే నిద్రలేచి స్నానాదులను నిర్వర్తించుకొని దైవధ్యానము
చేసికొనుచుండును. ఒక జపమాలను తీసుకుని భక్తితో రామనామమును
నూటెనిమిదిసార్లు జపించుచుండును. తదుపరి ఒక అధ్యాయమును గీతాపారాయణము
చేయుచుండెను. పూర్వ్జజన్మార్జిత సుకృతవశమున ఆమెకు పుట్టుకతోనే చక్కని
దైవసంస్కార మేర్పడెను. ప్రార్థన చేయక ఒక్కనాడైనను గంగపుచ్చు కొనదు.
అసారమగు ఈ సంసారమున సర్వేశరుడొక్కడే సారమను పూర్ణవిశ్వాసము అమె
కలిగియుండుట వలన గృహకృత్యములను యథావిధి జరుపుకొనుచుండినను మనస్సు మాత్రము
భగవంతుని పాదపద్మములందే సంలగ్నమై యుండును.

ఇక ఆ పై భర్త గారి సంస్కారము వేరుగ నుండెను. భగవంతుని అస్తిత్వమును అతడు
కాదనడుకాని 'ఇపుడే ఏమితొందర, నిదానముగా తరువాత ఎపుడైన దైవచింతన
చేసికొనవచ్చును' అను ధోరణిని అతడు ప్రదర్శించుచుండును. ఈ పద్దతి భార్యకు
నచ్చలేదు. ఒకనాడామె భర్త తీరికగ ఉన్న సమయము చూచి అతనితో నిట్లనెను -
"ఏమండీ! ఒక్కసారైనను రామనామము ఉచ్చరించక, భగవంతుని సేవింపక జీవితమును
గడుపుచున్నారే! ఇది ఎంత ప్రమాదము! ఏ సమయమున ఏమి ఆపద సంభవించునో
ఎవరికెరుక! ఈ జీవిత సమయమున ఏమి ఆపద సంభవించునో ఎవరికెరుక! ఈ జీవితములు
ఏమి శాశ్వతము! ఏ క్షణము ఈ ప్రాణవాయువు దేహమును విడిచిపోవునో ఎవరును
చెప్పలేరు. బ్రతికిన నాలుగురోజులు కృష్ణా, రామా యని భగవన్నామము
ఉచ్చరించుచు పుణ్యము కట్టుకొనిన మాత్రమే ఈ జీవితము సార్థక మగునుగాని,
వ్యర్థముగ ప్రాపంచిక కార్యములందే గడిపివైచినచో మహా ప్రమాదము సంభవింపగలదు.
కాబట్టి ప్రతిరోజు కనీసము ఒక్కసారైన భగవంతుని గూర్చి చింతింపుడు.
రామనామమును ఉచ్చరింపుడు. రవ్వంత పుణ్యమైనా ప్రతిదినము సంపాదింపుడు. ఇదిగో
జపమాల తీసికొని భక్తితో జపము ప్రారంభించుడు!

సహధర్మచారిణి యొక్క భావగర్భితములగు ఆ వాక్యములను విని భర్త ఇట్లనెను.
"ఓసీ! నీవు చెప్పినదంతయు సత్యమే. దేవుని గూర్చి తలంచుట మన ధర్మమని నేను
ఒప్పుకొనుచున్నాను. అధి చేయ వలసిన కార్యమే. కాని ఇప్పుడెమి తొందర?
ఇప్పుడు నేను ఉద్యోగము చేయుచున్నాను. అది పూర్తి అయిన పిదప,
'రిటైర్‌మెంట్‌' వచ్చిన తరువాత, పిల్లలు పెండిండ్లు అయిన పిదప,
అప్పులన్నీ తీరిన తరువాత పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత, దేవునిగూర్చి
తలంచుకొనవచ్చును. అప్పుడిక ఏ గొడవలు ఉండవు" కాబట్టి శాంతముగా, నిశ్చలముగా
ధ్యానము చేసికొనవచ్చును.

భర్తయొక్క ఆ వాక్యములను వినగానే గృహిణికి గొప్ప హృదయా వేదన కలిగి భర్తకు
తన మనోనిశ్చయమును గూర్చి నచ్చజెప్పుటకై ఎంతయో ప్రయత్నించెను. కాని ఫలితము
లేకపోయెను. భర్త ఈషణ్మాత్రమైనను తన హృదయమును మార్చుకొనలేదు. పాత
పద్దతిలోనే తన కార్యక్రమమును నిర్వహించుకొనుచు పోవుచుండెను. భర్త యొక్క
మనస్సును దైవమార్గమున ఎట్లు మరలించవలెనో ఆమెకు తోచకుండెను.

ఇట్లుండ కొంతకాలమునకు విధివశాత్తు భర్తయొక్క ఆరోగ్యము లోపించెను. అతడు
తీవ్రమగు జ్వరముతో బాధపడుచుండెను. డాక్టరుగారు వచ్చి రోగిని పరిశీలించి
ఒక సీసాలో మందు పోసియిచ్చి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క
జౌంసు చొప్పున ఇచ్చుచుండుమని భార్యకు చెప్పి, ఆ విషయమును భర్తకు కూడ
తెలియజేసి వెడలి పోయెను. వైద్యుడు గృహమును వీడిన తదుపరి భార్య ఆ మందును
దాచివైచి ఊరకుండెను. భర్తకు ఇవ్వలేదు. ఒకపూట గడచిపోయెను. రెండుపూటలు
గడచిపోయెను. కాని భర్తకు ఏమాత్రము మందు ఒసంగలేదు. ఈ విషయము తెలిసికొని
భర్త వెంటనే భార్యను పిలిపించి "డాక్టరుగారు మందు ఇచ్చినది త్రాగుటకా,
దాచి పెట్టుకొనుటకా?" అని ప్రశ్నింప వెంటనే ఆ గృహిణి సమయోచితముగ
నిట్లుపలికెను.

'మందు విషయమై ఇపుడు ఎమితొందర? నిదానముగా ఇంకొక వారందినములైన పిదప
త్రాగవచ్చును.' ఆ వాక్యములను విని భర్త "నీకు మతి పోయినట్లుగా ఉన్నదే!
రోగము వచ్చినపుడుగదా మందు త్రాగవలె" అని పలుక అంతట ఆ యిల్లాలు భర్తకు ఈ
ప్రకారముగ చక్కతిబోధ సలిపెను -

"మహాశయా! ఇపుడు మీరు దారికి వచ్చినారు. రోగము వచ్చి నపుడు కదా మందు
త్రాగవలె అను మీ వాక్యము చాలా హేతుకమైనది. అయితే పుట్టిన ప్రతిప్రాణి
భవరోగముచే బాధపడుచుండగా ఆ రోగమును బాపుకొనుటకు భగవన్నామామృతమును ఔషధమును
వెంటనే ఏల త్రాగరాదు? ఆలస్యమేల చేయ్యవలెను? శరీరము క్షణికము కదా! రేపునకు
రూపు లేదుకదా! అట్టిచో వార్థక్యము వరకు ఆ భగవచ్చింతనమును పవిత్రకార్యమును
వాయిదావేయుట పాడియా! కాబట్టి సంసార రోగము, పుట్టుక చావు అనురోగము
తగుల్కొనిన ఈ క్షణమందే ఆ రోగమును తొలగించుటకు రామనామమును, కృష్ణనామమును,
భగవన్నామమును స్మరించవలెను. దైవచింతన, భగవద్ధ్యానము చేయవలెను.
వార్ధక్యము, మృత్యువు కాచుకొనియున్నవి. రోగములు జీవుని ఆక్రమించుటకు
సిద్ధము గానున్నవి. ఇట్టి పరిస్థితి యందు మీనమేషములు లెక్క పెట్టుచు
భవరోగ చికిత్సయగు దైవద్ధ్యానామృతమును గ్రోలక ఆలసించుట పాడికాదు. అలసత్వము
ప్రమాదహేతువు. కాబట్టి ఇపుడే రామనామమును ఉచ్చరింపుడు,జపించుడు!"

పత్నియొక్క ఈ చక్కటి బోధను ఆలకించి భర్త వెంటనే రామనామమును భక్తితో
జపించసాగెను. వెనువెంటనే భార్య భర్తకు ఔషధమును ఒసంగ అతనిరోగము
ఉపశమించెను. ఈ ప్రకారముగ శారీరక, మానసికములను రెండు రోగములున్ను
తొలిగిపోయి అతడు పరమ శాంతిని బడసెను.

నీతి: సంసారరోగము తగుల్కొని పుట్టుచు, చచ్చుచు నానా బాధలను పొందుచున్న
జీవుడు ఆరోగము తొలగుటకు అవసరమైన ఆత్మజ్ఞానమును ఔషధమును సేవించి శాంతిని
బడయవలెను. ఆలస్యము చేయరాదు.

by  k.radhakrishna

28, నవంబర్ 2013, గురువారం

నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు? ఏం చేస్తున్నావు !



ఒక హిందువుని నువ్వు ఎలా హిందువువు అయ్యావు.  అసలు హిందూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే, అతడు స్పష్టమైన కారణాన్ని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.  ఈ వైఫల్యమే గందరగోళానికి, అయోమయానికి దారి తీసింది. 

ఏదో ........ మనం హిందువులం, ఓ గురువు దగ్గర మంత్రం తీసేసుకున్నాం.  రోజూ గంటో, అరగంటో పూజ చేసుకుంటాం, అవకాశం కుదిరితే సాయంత్రం కొంత సేపు దీపం పెట్టుకుని, పారాయణ చేసుకుంటాం, ఖాళీ సమయం దొరికితే ఉపన్యాసాలు వింటాం, టీవీలో ప్రవచనాలు చూస్తాం, పండుగలోస్తే పిండివంటలు చేసుకుని తింటాం, అప్పుడప్పుడు తిరుపతి వెళతాం ............ కాశీ కెళతామ్  .......  దగ్గరున్న దేవాలయాలను దర్శించుకుంటాం, ఇది చాలదా? - అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు.  ఇవన్నీ ధర్మంలో భాగమే అయినప్పటికీ, ఇదే ధర్మం అని అనుకోవడం వల్లనే అఖండమైన ధర్మానికి పరిధి ఏర్పడింది.  
ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలేనా?
మంత్రాలు, హొమాలేనా?
గుళ్ళూ, గోపురాలేనా?
పండుగలు, తీర్థయాత్రలేనా?
అసలు ఇవన్నీ ఏమిటి?  ఈ ధర్మంలో ఇంకా తెలుసుకోదగ్గ అంశాలున్నాయా? లేవా? 
అసలు హిందుత్వం ధర్మమా? మతమా? మతానికీ, ధర్మానికీ తేడా ఏమిటి?
ధర్మమే అయితే దీనిలోని గొప్పదనమేమిటి? 
ఇదెప్పుడు పుట్టింది?
ఎవరు దీనికి కారకులు?
వీటన్నింటినీ తెలుసుకోవడం ప్రతి హిందువు కనీస ధర్మం, తప్పనిసరి కర్తవ్యం.  
ఓ వస్తువును కొంటే దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ అడిగి తెలుసుకొంటాం.  ఓ స్థలం కొనుగోలు చేయాలంటే దానిపై ఆరా తీసి, దస్తావేజులన్నీ సరిగా ఉన్నదీ లేనిదీ న్యాయనిపుణులతో సంప్రదించి, అనేక కోణాలలో పరిశీలన చేస్తాం.  అలాంటిది, మనం ఏ ధర్మంలో పుట్టి జీవిస్తున్నామో, అట్టి ధర్మం గురించి గానీ, దాని పూర్వాపరాల గురించి గానీ ఎవరికైనా జిజ్ఞాస కలిగిందా?  నమ్మకం ముసుగులో ఎవరో ఏదో చెబితే దానిని ఆచరిస్తూ పోవడమేనా?

వెలుగునివ్వడం ఒక్కతే దీపం పరమార్థం కాదు.  మరిన్ని దీపాలను వెలిగించడం కూడా. అలాగే, ధర్మాన్ని తనవరకే పరిమితం  చేసుకుని,ఎవరు ఎలా పోయినా నేను మాత్రం ధార్మికంగా ఉన్నానా! లేనా? అని సరిపెట్టుకుంటే సబబేనా.  ఈ ధోరణి వల్లనే ధార్మికులు క్షీణిస్తున్నారు.  ధర్మం పట్ల కనీస అవగాహన కూడా అంతరించి పోతోంది. 

మనం ఏ దేవుణ్ణి కొలుస్తున్నా, ఏ గురువును ఆశ్రయించి ఉన్నా, ముందుగా మనకు ధర్మం పట్ల అవగాహన కుదిరితే అటుపిమ్మట భావి తరాలకు ఈ అవగాహనను అందించే ప్రయత్నం చెయ్యగలం.  ఇతరులు అడిగే ప్రశ్నలకు  చెప్పగలం.  వీటన్నింటినీ మించి మనం  ఆచరిస్తున్న ధర్మం పట్ల మనక్కూడా అవగాహన కలిగిన నాడే మనకు ఆత్మ స్థైర్యం కలుగుతుంది.  ఈ ధర్మం పట్ల నిష్ఠ కుదురుతుంది.  ఆసక్తీ పెరుగుతుంది. 

గోబెల్స్ ప్రచార ఎత్తుగడలూ, మార్కెటింగ్ తంత్రాలు, డబ్బు బలంతో సత్యం, ధర్మం, మానవత్వాల మీద దురాక్రమణ సాగిస్తుంటే,  నిలువరించే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేకుండా పోయింది.  టీవీ, ఇంటర్నెట్, కిరాయి ప్రచారకుల సైన్యాల దాడితో వాటిల్లుతున్న ఉప్పెన లాంటి నష్టాన్ని చూస్తే ధర్మానికి గొడ్డలిపెట్టు కానుందని తెలుస్తోంది. 
 
 
ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశం సుసంపన్నమై ఉంది.  అందుకు మూలకారణం భగవంతుడు ఈ భూమి పైనే అవతరించి, విశ్వానికి కావలసిన దివ్య సందేశాన్నందించి, మార్గదర్శనం చేయడం.  అలా భగవద్దత్తమయినదే ఈ ధర్మం.
కోట్ల సంవత్సరాలకు పూర్వమే ధర్మం ఇక్కడ పరివ్యాప్తమై ఉంది.  ఇది ఏనాడు పుట్టిందో ఎవ్వరం తెలుపలేం.  అందుకే, దీనిని సనాతన ధర్మమని అన్నారు.  ఇదే ఆర్య ధర్మమని, ఆర్ష ధర్మమని, వేద ధర్మమని అనేక పేర్లతో వ్యవహారంలో నిలచింది.  ఋషుల కాలంలోనే దీనికి హిందూ ధర్మమనే పేరు నిర్ణయమయింది. 
ఇటీవలి కాలంలో పుట్టిన మతాలు ప్రపంచమంతటినీ తమ పరం చేసుకోవాలనే దురాలోచనతో, పవిత్రము, సనాతనము అయిన మన హిందూ ధర్మం మీద బురద చల్ల జూస్తున్నాయి.  మహర్షులు, శంకర, వివేకానందుల వారసులమైన మనం విధర్మీయుల కుయుక్తులను అర్థం చేసుకోవాలి.  వారు మన హిందూ శబ్దం మీద ఎన్నో, ఎన్నెన్నో అపవాదులు అల్లుతున్నారు. 
హిందూ అనే పేరు పరాయి వాళ్ళు పెట్టిందని కొందరు, సింధు శబ్దాన్ని పలకడం చేతకాని పరదేశీయులు 'హిందూ' అని పలకడంతో, అదే మనకు స్థిరపడిపొయిందని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. 
ఇలా ఒకటా .....  రెండా!  చాపకింద నీరులా తప్పుడు ప్రచారాలు ముమ్మరంగా సాగిపోతున్నాయి.
ఈ తప్పుడు ప్రచారాలను విజ్ఞులు కూడా తిప్పికొట్టలేక సతమతముతున్నారు.  మరో పక్క నుండి మన సనాతన సంస్కృతినీ, అది బోధించే ఆచారాలనూ హేళన చేస్తున్నారు.  పదే పదే నోటికొచ్చినట్లు విమర్శిస్తూ, నిజాన్ని అబద్ధంగా, అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.  మన చరిత్రలను వక్రీకరించి, మన చారిత్రిక అంశాలపై మనకే అనుమానాలను రేకెత్తిస్తున్నారు.
ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా ....... ?
మన మీద మనకే అనుమానాలు పుట్టాలని! హిందువుకు తన చరిత్ర మీద తనకే అసహ్యం కలగాలని! హిందువు అనుకునేందుకు ప్రతి హిందువు సిగ్గుతో తలదించుకోవాలని!
ఇలా జరిగిననాడు ఈ దేశం నుంచి హిందూ ధర్మాన్ని సమూలంగా పీకి పారేయవచ్చుననే దురాలోచనతో కుట్ర పన్నుతున్నారు. 
వంద రాళ్ళు విసిరితే, ఏదో ఒకటైనా లక్ష్యానికి తగిలి, అది రాలి పడుతుందనే వ్యూహంతో, హిందూ వ్యతిరేకులు ముందుకు సాగిపోతున్నారు.  పదే.. పదే.. ఈ హిందూ ధర్మం పై దుమ్మెత్తి పోస్తూ, విమర్శిస్తూంటే ఏదో ఓ రోజు హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయవచ్చుననే ఆశతో ముప్పేట దాడులను ప్రారంభించేశారు. 
ఈ దాడిలో హిందూ సమాజం ఇప్పటికే చాలా దెబ్బతిని తీవ్రంగా నష్ట పోయింది.  దీనిని ఇలాగే కొనసాగిస్తామా! లేక, వాటిని తిప్పి కొట్టి మన ధర్మాన్ని నిలబెట్టుకుంటామా? ఇదే పెద్ద ప్రశ్న!
అసలింతకీ మనపై ఇన్ని దాడులు జరగడానికి మూలకారణం తెలుసా ......? హిందుత్వం అంటే తెలుసా......?  నువ్వెలా హిందువయ్యావు ....? 'హిందూ' శబ్దానికి అర్థమేమిటి?  హిందూ ఆచారాల అంతరార్థమేమిటి? - అని ప్రశ్నిస్తే, సూటిగా సమాధానం చెప్పలేక పోవడం.
ఏదో ....... పెద్దలు చెప్పారు, మేం పాటిస్తున్నాం అనడమే వినబడుతోంది.  పరమ పావనమైన హిందూ ధర్మంలో పుట్టి, దీనిని ఆచరిస్తున్న వారిలో చాలా మందికి దీనిపట్ల ప్రాథమిక అవగాహన లేకుండా ఏదో హిందువుగా బతికేస్తున్న వారి సంఖ్యే చా......లా ఎక్కువ.  అందుకే, ఈ ధర్మానికి తూట్లు పొడవడానికి సిద్ధంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి.......  దీనికి పరిష్కారం ఏమిటి?


23, నవంబర్ 2013, శనివారం

సరియైన గురువును గుర్తించడం ఎలా?

సరియైన గురువును గుర్తించడం ఎలా?
ఉత్తమ,  మధ్యమ, తృతీయులుగా గురువులు 3 రకాలు.  అందుకే"సగురుమేవాభిగచ్ఛేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం"  అని కఠోపనిషత్తు అంటుంది.  ఉత్తమ గురువనగా శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడు.  అట్టి ఉత్తమ గురువును ఆశ్రయించుటచే సాధకుడు సంప్రదాయబద్ధంగా జ్ఞానాన్ని పొంది తరించగలడు.    

ఉత్తమ గురువు లక్షణాలేవి?
"ఛందోఅధీతేసశ్రోత్రియః" సంప్రదాయబద్ధంగా బాల్యంలోనే ఉపనయన సంస్కారం పొంది గురుకులవాసం చేస్తూ వేదాధ్యయనం ద్వారా  కర్మ, ఉపాసనలను యధావిధిగా ఆచరించేవాడే శ్రోత్రియుడు.  
ఇతడే శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా వేదాంత తత్త్వార్ధాన్ని గ్రహించి దాని యందే స్థిరమైన నిష్ఠను కలిగి ఉంటాడు.  "బ్రహ్మణి నిష్ఠా యస్య స బ్రహ్మనిష్ఠః" ఇతడే బ్రహ్మనిష్ఠుడు అనబడతాడు.  ఇతను పరమాత్మ తత్వ చింతనలో స్థిరమైన నిష్ఠను పొంది తనను ఆశ్రయించిన శిష్యులకు సంప్రదాయబద్ధంగా జ్ఞానాన్ని అందజేస్తాడు.  అందుకే ఇతనిని శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడని, ఉత్తమ గురువని శాస్త్రాలు సూచిస్తున్నాయి.  

మధ్యమ గురువు లక్షణాలేవి?
ఇతను శ్రోత్రీయుడే కాని అధ్యాపకుని వంటివాడు.  ఇతడు గురుకుల వాసం చేసి వేదవేదాంగాలను అధ్యయనం చేసినప్పటికీ బ్రహ్మనిష్ఠుడు కాకపొవుటచే తను నేర్చిన విద్య కేవలం ఇతరులకు బోధించుటకే పరిమితమౌతుంది. 

తృతీయ గురువు లక్షణాలేవి?
ఇతను కేవలం బ్రహ్మనిష్ఠుడు మాత్రమే.  ప్రారబ్దవశం చేత, జన్మాంతర సంస్కారం తోడై, తత్త్వమస్యాది మహా వాక్యార్థాన్ని తత్త్వ విచారణతో గ్రహించి బ్రహ్మచింతనలోనే జీవితాన్ని అంకితం చేసుకొన్న సాధకుడు.  ఇతను సంప్రదాయంగా శాస్త్రాధ్యయనం చేయని కారణం చే ఇతరులకు బోధించుటకు అవకాశముండదు.  కనుక ఇతను కేవలం బ్రహ్మనిష్ఠుడగుటచే స్వస్వరూప ఆత్మజ్ఞానంతో తన ఉద్ధరణకే పరిమిత మగుచున్నాడు. 

అధమాధమ గురువులు   
వీరికి శ్రోత్రియత్వము, బ్రహ్మనిష్ఠ, ఆచరణ, అనుష్ఠానములు ఏవీ వుండవు.  రాగద్వేషాలు, కామక్రోధాలు, కోరికలు, భోగలాలసత్వము, కీర్తికాంక్ష, ధన వ్యామోహం మొదలగు భావనలతో సతమతమవుతుంటారు.  వీరు చెప్పుకోవడానికే గురువు కానీ, అందరికీ బరువే.  చివరకు వారికి వారే బరువనిపిస్తారు.  వీరినే మిథ్యాచారు లంటుంది శాస్త్రం. 

సద్గురువును ఆశ్రయించిన శిష్యుని ప్రవర్తన ఎలా ఉండాలి? 
శిష్యులనగా శిక్షకు, తత్త్వొపదేశము పొందుటకు యోగ్యులైనవారని అర్థం.  అయితే కొందరు లౌకిక ప్రయోజనాలకై తమ కోరికలను నెరవేర్చుకొనేందుకు ప్రాథాన్యతనిచ్చి ఆధ్యాత్మికమార్గాన్ని ఆశ్రయిస్తారు.  వీరు ఎప్పటికీ శిష్యులనబడరు.  శిష్యుడైనవాడు కేవలం ఆత్మజ్ఞాన ప్రాప్తికై పరిశుద్ధమైన భావనతో గురువు నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తాడు.  ఇలా గురువుపై శిష్యునికి, శిష్యునిపై గురువుకి గల సత్య సంబంధమే గురుశిష్య సంబంధము.

గురువు నాశ్రయించిన భక్తునికి మోక్షం సంప్రాప్తిస్తుందా?
గురువుని ఆశ్రయించిన వాడిని శిష్యుడంటామే కాని, భక్తుడని సంబోధించము.   సంపూర్ణమైన శ్రద్ధ, భక్తితో గురువును ఆశ్రయించేవాడే శిష్యుడు.  అయితే అతని లక్ష్యం ఆథ్యాత్మిక సాధనా? లేక భౌతిక వాంచలను పొందడం కోసమా? అని తనలో తాను ప్రశ్నించుకోవాలి.
ప్రప్రథమంగా కోరికలను పొందాలనే భావనతో గురువును ఆశ్రయించినా క్రమేపీ సంస్కారం చేత గురువు యొక్క సన్నిధిలో మనసు ఆథ్యాత్మిక సాధన వైపు మరలుతుంది.  అట్టి వ్యక్తి క్రమంగా ఆథ్యాత్మిక మార్గం లోని విశిష్టతను, మాధుర్యాన్ని తప్పక గ్రహిస్తాడు.  తద్వారా మోక్షమార్గంలో పయనించే పరిణతి కలిగి, భౌతిక  వాంచలు క్రమేపీ సన్నగిల్లుతాయి.  గురువు అనుగ్రహంతో మోక్షాన్ని పొందుతాడు. 

కొందరు గురువులు భక్తులను ఎంచుకుని మోక్షాన్ని ఇప్పిస్తారని అంటారు నిజమేనా? 
ఎవరో ఇచ్చేది, ఎక్కడికో వెళ్లి తెచ్చుకొనేదీ మోక్షమనబడదు.  పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే మోక్షం.  ఎక్కడికో వెళ్ళడం మొక్షమైతే అక్కడి నుండి ఇంకాస్త మంచి చోటుకు వెళ్తే బాగుంటుందని ఆశలు పుడతాయి. పరమాత్మ ఏదో ఒక లోకంలో ఉన్నాడని, మనం మూటా ముల్లె సర్దుకుని అక్కడకి వెళ్ళాలని అందుకోసం ఒక గురువు టూరిస్ట్ ఏజంటు లా కొందర్నే ఎంచుకుని తీసుకెడతాడనే భావాలను మన శాస్త్రాలు అంగీకరించవు.  మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని గురువు బోధించగలడే కానీ, మోక్షాన్నివ్వడం ఎవరితరమూ కాదు.  

1, అక్టోబర్ 2013, మంగళవారం

హేతువాదదృష్టితో చూస్తే కనపడే ప్రకృతిని ఆథ్యాత్మికంగా చూస్తే ......[దేవుడంటే ఎవరు ? 2 ]

"దేవుడంటే మనిషి చేసిన ఒక కల్పన.   పూర్వ జన్మ అనే ఆలోచనలలో, పాపపుణ్యాలనే నమ్మకంలో పడదోయడం ద్వారా శాంతి భద్రతల నిర్వహణను సులభం చేసుకోవచ్చుననే ఆశతో పాలకులు దీనిని ప్రోత్సహించారు" అంటూ సాయిరాం జవాబు మొదలు పెట్టాడు.  
"ఆ పాలకులే కనక వీటిని నిజంగా నమ్మిన వారైతే ఇవాళ ఇన్ని కుంభకోణాలు జరగవు.  గుడులలో దొంగతనాలు జరుగవు. కేవలం జనాలను నమ్మించడానికి పురోహిత వర్గాల వారిని కలుపుకొని దేవుడు, దెయ్యం అంటూ ఏమేమో చెప్పారు. చెబుతున్నారు.   దేవుడంటూ ఉంటే ఇదమిత్థంగా అతడు ఇదీ అని చెప్పవచ్చు. లేని వాడి గురించి ఏముంది? ఏమైనా చెప్పవచ్చు.  మీరంతా చేస్తున్న పని అదే" అన్నాడు సాయిరాం. 

"నాయనా సాయిరాం! దేవుడనే మాటకు నీ భావన అదే అయితే, ఆ దేవుడు అసత్యమే.  దేవుడనే మాటకు నువ్వు చెప్పిన అర్థమే నిజమైతే, నేను కూడా నీతో పాటు నిరీశ్వరవాదినే" అన్నారు సుబ్రహ్మణ్యం గారు. 

అది విని అక్కడే ఉన్న మరో అతిథి సూర్యనారాయణ మూర్తి గారు గొల్లున నవ్వారు. 

"ఎందుకు నవ్వుతున్నారు? మీ దేవుడంటే ఏమిటో మీరు ఇదమిత్థంగా చెప్పాలి.  అంతే తప్ప దేవుడున్నాడంటూ ఏవేవో కల్పించి చెప్పి, ప్రజలను మోసగించకూదదు" అంటూ సాయిరాం తన వాదన కొనసాగించాడు.  మూర్తి గారు ఏదో జవాబు చెప్పేంతలో సుబ్రహ్మణ్యం గారు కలగజేసుకుని, "సాయిరాం లో నిజాయితీ ఉంది.  అతడు మనసా, వాచా, కర్మణా ఒక్కటే నమ్ముతున్నాడు.  దానినే మాట్లాడుతున్నాడు.  దానినే పాటిస్తున్నాడు.  భగవంతుడి కృప అతడికి పరిపూర్ణంగా లభిస్తుంది.  పైకి ఒకటి చెబుతూ చాటున మరొక విధంగా ప్రవర్తించే వారితో పోల్చి చూస్తే, దైవానికి ఎక్కువ దగ్గరైన వాడు సాయిరామే.  అతడిని కన్న తల్లితండ్రులు సంతోష పడే రోజు ఖచ్చితంగా వస్తుంది" అన్నారు. 

"నిజమే! మీరు కాబట్టి, ఇంత ఔదార్యం చూపుతున్నారు.  మతోన్మాదుల దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడి చూడమనండి! భ్రష్టుడివంటూ తిట్టిపోస్తారు" అన్నారు సూర్యనారాయణ మూర్తి గారు. 

"సుబ్రహ్మణ్యం గారు నన్ను  పొగిడి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు.  నాకు మీ నుంచి కావలసింది ఖచ్చితంగా దేవుడంటే ఇదీ అనే సమాధానం.  దానితో దేవుడు నిజమో, కల్పనో  తేలిపోతుంది" అన్నాడు సాయిరాం.   వాతావరణం కాస్త గంభీరంగా మారింది. 

"దేవుణ్ణి నీ కళ్ళకే చూపించాలా?" నేనడిగాను. 

"అవును"

"లేకపోతే దేవుడు సత్యం కాదా?  భూమ్యాకర్షణ శక్తి నిజం.  మరి దానిని చూపించగలవా? .....   విమానాలు, రాకెట్లు లేని కాలంలోనే భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళు మూఢులా?"


​ సాయిరాం పెదవి విప్పాడు "అది సైన్సు.  మానవుడు తార్కికమైన బుద్ధితో ఆలోచిస్తూ పెరిగాడు.  ఒడ్డున ఉన్న వాడికి సముద్రంలో దూరం నుంచి వస్తున్న ఓడ మీది జండా కనిపించింది.  తరువాత పొగ గొట్టం కనిపించింది.  తరువాత ఓడ పై భాగం, ఆఖరుగా ఓడ కింది భాగం కనిపించాయి.  దానిని బట్టి, భూమి వాస్తవ ఆకారాన్ని అతడు ఊహించ గలిగాడు.   ఇవాళ రాకెట్ సాయంతో రోదసి లోకి వెళ్లి ఫోటోలు తీసినప్పుడు అదే నిజమని నిగ్గు తేలింది.  భూమి బల్లపరుపుగా ఉందని వాదించిన మతాలున్నాయి. దానికి భిన్నంగా వాదించిన వారి తలలు నరికే మూఢులను అవి తయారు చేశాయి.  ​ఇవాల్టికి కూడా సృష్టి కేవలం ఆరువేల ఏళ్ళ క్రితం మాత్రమే ప్రారంభమైందని నూరిపోస్తున్న మతాలున్నాయి.  దేవుడు కల్పన అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా?". 

సాయిరాం ని నేనడిగాను - "భూమి వాస్తవ ఆకారం, భూమ్యాకర్షణ శక్తుల లాగానే బుద్ధికి మాత్రమే అందే సత్యాలు, కళ్ళకు కనిపించని సత్యాలు ఉన్నట్లుగా సైన్సు కూడా అంగీకరిస్తోంది కదా! అలాంటప్పుడు దేవుణ్ణి కళ్ళకే చూపించాలని వాదించడం అశాస్త్రీయమే కదా". 

"కళ్ళకు కనిపించక పోయినా పర్వాలేదు.  దేవుణ్ణి తార్కికంగా నిరూపిస్తే చాలు" అని ఒప్పుకున్నాడు సాయిరాం. 
"ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను.  కళ్ళకు కనిపించని రూపంలో మాత్రమే దేవుడున్నాడని ఎవరూ అనడం లేదు.  విషంలో ఔషధం  లాగా, కనిపించే దానిలో కనిపించని రీతిలో కూడా అతడున్నాడని చెప్పడానికే విషము - మందు ఉదాహరణను నీ దృష్టికి తెచ్చాను.  భగవంతుడు తర్కానికి కొద్దిగా అందుతాడు.  అందనంత పెద్దవాడు కూడా.  ముందుగా ఇప్పటి వరకు నువ్వు అంగీకరించిన దాని సారాంశంగా, ఈ సృష్టిని మనం మానవుడి కళ్ళకు కనిపించేదిగా, కనిపించనిదిగా విభజించి చూడడానికి సైన్సు ఒప్పుకునేదీ లేనిదీ తేల్చి చెప్పు" - సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేసారు. 

"మీరు ఎలా వర్గీకరించినా సైన్సు కు సమ్మతమే.  క్లాసిఫికేషన్ అనేది సైన్సు తొలి మెట్లలో ఒకటి.  ఎటొచ్చీ అది సమగ్రంగా ఉండాలి.  అంతే" అన్నాడు సాయిరాం. 
సూర్యనారాయణ మూర్తి గారు తిరిగి రంగంలోకి దిగారు "నన్ను కాస్త చెప్పనివ్వండి! కనిపించేదిగా, కనిపించనిదిగా సృష్టిని వర్గీకరించడం సమగ్రమైన విధానం కాదు.  కనిపించడం అంటే దేనికి? కళ్ళకు మాత్రమేనా?  పూల పరిమళాన్ని కళ్ళు చూడగలవా?  మంచు చల్లదనం కళ్ళకు కనబడుతుందా? అందుకే సృష్టిని భారతీయ శాస్త్రజ్ఞులు పంచభూతాలుగా వర్గీకరించారు.   అవి పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు.  వీటిలో ఆకాశ తరంగాలలో మన చెవికి వినబడేవి ఉన్నాయి.  మనం వినలేనివీ కోకొల్లలుగా ఉన్నాయి.  వాయువుని మన చర్మం స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది.  తేజస్సుని అనగా కాంతిని మాత్రమే మన కళ్ళు గుర్తించగలుగుతాయి.  అదీ కొంత మేర మాత్రమే.  జలాన్ని మన నాలుక కొంత  మేర మాత్రమే రుచిచూడ గలుగుతుంది .  పృథ్విని మన ముక్కు వాసన ద్వారా కొంత వరకు మాత్రమే పసిగడుతుంది.  కాబట్టి, కళ్ళకు కనిపించడం అని కాక, పంచేంద్రియాలలో దేనికైనా సరే తెలిసేదీ, వీటిలో వేటికీ అందనిది అని సృష్టిని విభజించుకోవడం సమంజసం.  సృష్టి పంచభూతాత్మకమైనది. అలాగే వాటిని గమనించగలిగిన మానవుడు కూడా?"

"మరైతే దేవుడు?" సాయిరాం ప్రశ్నించాడు.  

ఇంకా ఉంది  ............ మరి కొంత కాలం ఆగాల్సిందే 

30, సెప్టెంబర్ 2013, సోమవారం

హేతువాదదృష్టితో చూస్తే కనపడే ప్రకృతిని ఆథ్యాత్మికంగా చూస్తే ......[దేవుడంటే ఎవరు ? 1]

"మీ మందుల షాపు పేరేమిటి నాయనా?"  ..  వి.వి. సుబ్రహ్మణ్యం గారు ప్రశాంతంగా తన సంభాషణ ప్రారంభించారు.
"సత్యా మెడికల్ షాప్ (పేరు మార్చి రాశాను)" అని సాయిరాం బదులిచ్చాడు.  
"మీరమ్ముతున్నవన్నీ విషాలని నిరూపిస్తా.  దానికి నువ్వు మందుల దుకాణం అని పేరు పెట్టావంటా......
కావాలంటే ఎ సీసాలోవైనా గుప్పెడు మాత్రలు మింగి చూడు.  నీకే తెలుస్తుంది.  అవన్నీ విషాలైనప్పుడు సత్యా పాయిజన్ షాప్ అని పెట్టుకోవాలి కానీ, సత్యా మెడికల్ షాప్ అని పేరు పెట్టడం హేతువాదం ఎలా అవుతుంది? నువ్వమ్మే వాటిలో విషానికి భిన్నంగా మందుని నా కళ్ళకు చూపించ గలవా?"
- సుబ్రహ్మణ్యం గారి తర్కానికి సాయిరాం బిత్తరపోయాడు.
"అదేంటండీ అలా అంటారు? వాటిని తప్పుగా వాడితే అవి విషాలే.  వాటినే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తగిన పద్ధతిలో వాడినప్పుడు అవే మందులవుతాయి" అని కాస్త విసురుగా సమాధానం చెప్పాడు.
కోప్పడకు నాయనా - నా భావం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఈ చిన్న ఉపమానం.  నీ దుకాణంలో ఉన్న విషాలు కేవలం శాస్త్రవేత్త చూపు వల్ల  ఔషధాలవుతున్నాయి.  అలాగే కేవలం మనుషులుగా, పంచభూతాలుగా, రసాయనిక పదార్థాలుగా, భౌతిక వస్తువులుగా ఉన్నవన్నీ గురువు ఇచ్చే చూపు వల్ల దైవ స్వరూపాలవుతాయి.  హేతువాదంతో చూస్తె అంతా ప్రకృతే.  ఆధ్యాత్మిక దృష్టితో చూస్తె ఈ ప్రకృతి వెనుక ఉన్న అందమైన ప్రణాళిక, దానిని నడిపించే మహోన్నతమైన ధర్మం - ఆచూకీ అందుతాయి.  పాల నుంచి వెన్నని తీసినట్లుగా శాస్త్రవేత్త అయిన గురువు కూడా ఈ సత్యదర్శనం చేయించి మనిషి నుంచి మనీషిని ఆవిష్కరిస్తాడు.  అప్పుడు అంతా దైవమయమే.  ఇందాక నువ్వు ప్రస్తావించిన algebra లో X అనుకుని బయలుదేరి సమాధానాన్ని కనుక్కున్నట్లే, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న ప్రజ్ఞనే దేవుడని అనుకుని శోధిస్తూ వెళ్ళడమే సత్యాన్వేషణ.  ఈ శోధన లోనే మానవుడు పురోగమిస్తాడు.  దార్మికుడవుతాడు. శాస్త్రాలు పుట్టేదీ, శాంతి లభించేదీ రెండూ దీని నుంచే.  ప్రపంచ వికాసానికి మార్గం ఇదే.  ఇదే భారతీయమైన ఆధ్యాత్మిక సాధన.
ఈ సాధనలో పురోగమించిన వారిలో తమకు బాగా నచ్చిన వారి పేర్లను ప్రజలు అభిమానిస్తారు.  స్మరిస్తారు.  వారి సుగుణాలను ఆరాధిస్తూ తమ బిడ్డలకు ఆ పేర్లు పెట్టుకుంటారు.  అలా పెట్టుకున్నదే సాయిరాం అనే నీ పేరు.  అలాంటి తల్లితండ్రులను అవివేకులుగా నిందిస్తూ, రాముడి గురించి, రామ రాజ్యాన్ని గురించి ఏమీ తెలియకుండానే తేలికగా మాట్లాడేసే నిన్ను చూసి బాధపడుతున్నా.  స్వదేశీయులనుంచి స్వజాతీయుల నుంచి కూడా తనను తాను రక్షించుకోవలసిన దుస్థితిలో ఈ దేశం, ఈ సంస్కృతీ, ఇక్కడి విజ్ఞానం, వివేకం ఉన్నందుకు ఇంకా బాధపడుతున్నా.  ఇదంతా మనని పరాయి వారికి మళ్ళీ బానిసలుగా చేయడానికి ఎంతో కాలం పట్టదు.  నువ్వు ఎడ్యుకేట్ చేయడం కాదు, మొదట నువ్వు ఎదుకేట్ కావాలి.  మీ అమ్మానాన్నలు నిన్ను చూసి గర్వించ గలిగే రోజు రావాలి.  ఐ విష్ యు wisdom.
"సార్! బాధ్యతలను మేమూ సమర్థిస్తాం.  కానీ, మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తాం.  దేవుడంటూ ఫలానా ఎవడో ఉన్నాడని అనుకుంటూ ముందుకు వెళ్ళడమే సాధన అని మీరంటున్నారు తప్ప, ఆ దేముడిని మీరు చూపించలేక పోతున్నారు.  కనిపించని ఆ దేవుడి పేరుతో ఎన్ని మోసాలు, అరాచకాలు జరుగుతున్నాయో మీరు లెక్కలోకి తీసుకోవడం లేదు.  ఈ దారుణాలకు అడ్డుకట్ట పడాలంటే ఆయన ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించని వాడు కాకూడదు.  దేవుణ్ణి మీరు అందరికీ చూపించాలి" - సాయిరాం పెదవి విప్పాడు.
"బాబూ! దేవుడంటే నీ నిర్వచనం ఏమిటో కాస్త చెబుదూ!"
"సార్! దేవుడున్నాడని అంటున్నారు కాబట్టి మీరే చెప్పండి ఆయనెవరో"
"అది కాదయ్యా! లేదంటున్నావు కాబట్టి, ఎవడు లేడని అంటున్నావో నువ్వే చెప్పు! అప్పుడు మన డిబేట్ కొనసాగిద్దాం"
............. మిగతా వచ్చే సంచికలో
డాక్టర్ వాగ్దేవి గారికి క్షమార్పణలతో ............. 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం: 

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం. 

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి? 

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష

2) హరి వర్ష

3) ఇలవ్రిత వర్ష

4) కురు వర్ష

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష

7) కింపురుష వర్ష

భద్రస్వ వర్ష 



పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు. 

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని ! 

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు. 

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

భారత్ మాతా కి జై !

సనాతన ధర్మం/హిందుత్వం
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలుfrom ( Indian Culture)facebook

29, జులై 2013, సోమవారం

బతకాలి మన ధర్మం.. అందుకుఏ మహా సమ్మేళనం

బతకాలి మన ధర్మం.. అందుకుఏ మహా సమ్మేళనం

July 29, 2013
  స్వామీజీ అనే పదానికి కొత్త అర్థం.. పరమార్థం.. స్వామి పరిపూర్ణానంద సరస్వతి. హిందూ ధర్మం మంటగలిసి పోతుందంటూ పెదవి విరిచి, పక్కవారి వంక చూస్తే సరిపోదు.. ధర్మపరిరక్షణ కోసం, తద్వారా ఆత్మోన్నతి సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలంటారాయన. ప్రవచనాలు చెప్పి ఊరుకుంటే ధర్మం బతకదని గ్రహించి 'టీమ్ స్క్వేర్' పేరిట నాలుగంచెల ధర్మపరిరక్షణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాంతో పాటు భాగ్యనగరంలో వచ్చే డిసెంబర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పండితులతో అంతర్జాతీయ హిందూ మహాసభలు నిర్వహించాలని సంకల్పించారు. మనం ధర్మాన్ని రక్షించుకోలేకపోతే మనల్ని మనం కాపాడుకోలేం అంటున్న స్వామి పరిపూర్ణానంద మరేం చెబుతున్నారో విందాం.

అమెరికాలో ఉంటున్న తెలుగు వారు కొన్నేళ్లుగా నన్ను అక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. అమెరికా ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నించుకున్నాను. రాష్ట్రంలో నేను చేయాల్సింది చాలా వుంది. ఎన్నో దళిత వాడల్లో పర్యటించాను. వారి వెనకబాటుతనాన్ని గమనించాను. వాళ్లు మతం మారడానికి కారణం డబ్బు మాత్రమే కాదు.. నిరాదరణ అని అర్థం అయింది. నేను హిందూధర్మంలో భాగస్వామిని అనే ఆత్మాభిమానం వారిలో కల్పించాలి. అప్పుడే దళితులు ఉన్నతి సాధిస్తారు. అలాగే యువతలో హిందూ ధర్మం పట్ల అవగాహన పెంపొందించాలి. మన ధర్మాన్ని అనుసరించేలా వారికి ఆధ్యాత్మిక తేజాన్ని అందించాలి. రాష్ట్రంలో నేను చేయాల్సింది ఇంత వుండగా అమెరికా వెళ్లి ఏం చేయాలని రెండు సార్లు వాళ్ల ఆహ్వానాన్ని కాదన్నాను. తప్పనిసరై ఈ ఏడాది 46 రోజుల పాటు అమెరికాలో పర్యటించాను. 9 రాష్ట్రాలలోని అనేక పట్టణాల్లో పర్యటించాను. ఆ దేశాన్ని చూశాక అంతవరకు అమెరికా పట్ల నాకున్న అభిప్రాయం మారిపోయింది.

నా రాష్ట్రం ఇలా వుంటే...?
అమెరికాలో వున్న భారతీయుల ఇళ్లలో సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ప్రతి ఇంట్లోని దేవుడి గదిని ఆలయంలా తీర్చిదిద్దుకున్నారు. కొన్ని సంస్థలు కులాల ప్రాతిపదికగా వున్నా దేవాలయం దగ్గరకు వచ్చే సరికి హిందూ కమ్యూనిటీ సెంటర్స్ పేరిట అంతా ఏకం అవుతున్నారు. వారంలో ఒకసారి అందరూ కలుస్తున్నారు. «మనం ఇక్కడ ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా కునారిల్లుతుంటే అమెరికాలో వుంటున్న మన వాళ్లు సమష్టిగా ధర్మ పరిరక్షణ కోసం ఆలోచించడం నన్ను అబ్బురపరిచింది. అమెరికాలో అద్భుతమైన వ్యవస్థ వుంది. అక్కడ ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందిస్తున్నారు. విలువలతో కూడిన విద్య గతంలో మన గురుకుల వ్యవస్థల్లో వుండేది. ఈ రోజున ఆ విధానాన్ని అమెరికాలో విద్యార్థులకు అందిస్తున్నారు. న్యాయం, పోలీస్, వైద్య వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి. అమెరికాలో ఆ దేశం వారి కంటే వేరు వేరు దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఎక్కువ. వారిలో కూడా నా అమెరికా, నా దేశం అనే భక్తి భావం కనిపించింది. ఈ అంశాలే అమెరికాను అభివృద్ధిలో అంత ఎత్తున నిలిపాయి. నా రాష్ట్రం కూడా ఇలా వుంటే ఎంత బావుండు అనే తపన నాలో మొదలైంది. గ్లోబల్ హిందూ హెరిటే జ్ ఫౌండేషన్ వారు నా అమెరికా పర్యటన వ్యవహారాలన్నీ చూసుకున్నారు. 46 రోజుల పర్యటనలో సుమారు 50 లక్షల రూపాయల వరకు భక్తుల నుంచి కానుకలుగా అందాయి. ఆ డబ్బు మొత్తాన్ని నేను నా టూర్ ఆర్గనైజ్ చేసిన ఫౌండేషన్ వారికే ఇచ్చేశాను.

స్వాములు ఇస్తారు.. పుచ్చుకోరు!
మన దేశంలో సాధువులు, సన్యాసులకు అమెరికా వంటి దేశాలకు వెళ్లి లక్షలు పోగేసుకొచ్చుకుంటారనే విమర్శ వుంది. నిజానికి సన్యాసులకు డబ్బెందుకు? స్వాములు జ్ఞానాన్ని ఇస్తారు.. మరేవీ పుచ్చుకోరు. ఆ డబ్బును ఏం చేద్దాం అని అడిగారు ఫౌండేషన్ సభ్యులు. మాతృదేశంలో ధర్మపరిరక్షణకు ఈ డబ్బును ఖర్చు చేయండి అని చెప్పాను. అందుకోసం నాలుగంచెల పథకాన్ని రూపొందించాం. అందులో భాగంగా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అలాంటి ఒక హాస్టల్‌ను అనంతపురంలో ఇప్పటికే నేను ప్రారంభించాను. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లల్ని అందులో చేర్చుకుని వారికి విలువలతో కూడిన ఉచిత విద్యను అందిస్తున్నాం. వారికి సంస్కృతి, సంప్రదాయాలు బోధిస్తున్నాం. అక్కడ చదువుకున్న పిల్లలు మంచి మార్కులతో ఇతర స్కూళ్లలోని పిల్లలతో పోటీ పడుతున్నారు. ఇలాంటి హాస్టళ్లు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పించాం. వచ్చే ఏడాది కల్లా కనీసం 6 జిల్లాల్లో ఇలాంటి హాస్టళ్లు ప్రారంభం అవుతున్నాయి. అలా ఏడాదికి రెండు వేల మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నతి సాధిస్తే, ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా సమాజం అభివృద్ధి సాధిస్తుందని నా విశ్వాసం. అమెరికాతో పాటు వివిధ దేశాలలో వుంటున్న మన వారు నలుగురు ఒక జిల్లాను చొప్పున దత్తత తీసుకుని ఈ బాధ్యతను చేపట్టాలని నిర్ణయించాం. భారతదేశాన్ని, యువతను, వ్యవసాయాన్ని, పశుసంపదను ఉద్ధరించే లక్ష్యంతో పుణ్య కల్చరల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో గో సంపదను, రైతును, ఆలయాల్ని పరిరక్షించే చర్యలు చేపట్టాలని సంకల్పించాం.

గోవు..ఆలయాలు, ధర్మం బతకాలి
గోవధ పెరుగుతోందని ఆందోళన పడుతున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎవరూ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు. మనం మట్టికి దూరమై పోయి పుట్టెడు కష్టాలు కొనితెచ్చుకుంటున్నాం. ఒక ఆవును పెంచితే వచే ్చ వ్యర్థాలతో ఎకరాల కొద్దీ పంటను ఎరువులు లేకుండా పండించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. అందుకే రైతు అప్పుల పాలు కాకుండా చూడడంతో పాటు గోవధను తగ్గించేందుకు గోకులాల్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాం. కాకినాడ శ్రీపీఠంలో ఇప్పటికే దయానంద సరస్వతి గోకులం ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు పని మొదలుపెట్టాం. ఈ గోకులాలను ఆదర్శవంతంగా, గోవుల పట్ల భక్తి పెరిగేలా తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడి దేశీ ఆవులను రైతులకు దత్తత ఇస్తాం. అవి ముసలివి అయిపోయాక వాటిని మాకు అప్పగిస్తే, అవసాన దశలో అవి స్వేచ్ఛగా జీవించేందుకు వీలుగా ప్రతి జిల్లా కేంద్రంలో గో స్వేచ్ఛా సంచార కేంద్రాలను ఏర్పాటే చేసే ప్రయత్నం చేస్తున్నాం. గోకులాల వల్ల గోసంపద పెరగడంతో పాటు, ఉత్పత్తి వ్యయం తగ్గి రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి. ఇక ప్రతి జిల్లాలో నాలుగు ప్రాచీన ఆలయాల్ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయాలని సంకల్పించాం. కొత్త ఆలయాలు కట్టుకుంటూ పోయేకంటే వున్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం ప్రధానం. అందుకే ప్రతి జిల్లాలో నాలుగు ఆలయాల్ని తీసుకుని వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఆ ఆలయాల్లో అన్ని పూజలు ఉచితంగా చేసేలా ఏర్పాటు చేస్తాం. ఈ బాధ్యతలు నిర్వర్తించి, ధర్మపరిరక్షణ చేసేందుకు జిల్లాకు నలుగురు సుశిక్షితులైన ధర్మపరిరక్షకులను ఏర్పాటు చేస్తాం. దేవాలయం కేంద్రంగా, సమాజాన్ని చైతన్యపరచి ధర్మపరిరక్షణ చేసేందుకు వీరు కృషి చేస్తారు. ఇలా ధర్మపరిరక్షణ జరిగి, బడుగులు అభివృద్ధి చెంది, గోవులు, రైతులు సుభిక్షంగా వుంటే మన దేశంలో అభివృద్ధికి కొదువ ఏముంటుంది? మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. అందుకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలి.

హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు పండితులు, ప్రముఖుల సూచనలు తీసుకుని, కార్యాచరణ రూపొందించేందుకు గాను వచ్చే డిసెంబర్‌లో అంతర్జాతీయ హిందూ సభలు ఏర్పాటు చేస్తున్నాం. స్వామి దయానంద సరస్వతి ఈ సదస్సుకు సార«థ్యం వహిస్తారు. యువతలో హిందూ ధర్మాన్ని పాదుకొల్పేందుకు ఏం చేయాలనే అంశంతో పాటు ప్రామాణికమైన పురాణాలు ఏవి అనే అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తాం. డిసెంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు లక్ష మంది పాల్గొంటారు. మొత్తం ఏడు దేశాల ప్రతినిధులతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి 50 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఆశారామ్ బాపూజీ, శ్రీశ్రీరవిశంకర్, బాబా రామ్‌దేవ్ వంటి ప్రముఖులతో పాటు మన రాష్ట్రానికి చెందిన పలువురు పండితులు, పెద్దలు సదస్సులో పాల్గొంటారు. హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశంపై అమెరికాలో వుంటున్న తెలుగు యువతీయువకులు ప్రసంగిస్తారు. వారే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా మన సమాజంలోని పెద్దలందరితో ఈ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ సభల్లో పాలుపంచుకోవాలన్నా, హిందూ పరిరక్షణ ఉద్యమంతో చేయి కలపాలన్నా  www.sreepeetham.in? వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
- టి. కుమార్

11, జులై 2013, గురువారం

హరినామ మహిమ


ఒకానొక రోజున కాశీ మిశ్రుని భవనములో వేంచేసి ఉన్న శ్రీ చైతన్య మహాప్రభువును కృష్ణ దాసు అను ఒక భక్తుడు బ్రహ్మాది దేవతలకు గూడ గోచరముకాని కృష్ణ నామ మహిమను గురించి చెప్ప వలసినదిగా కోరెనుఅపుడు శ్రీమన్మహా ప్రభువు ఇట్లు వివరించెను.

క్రిష్ణదాసా! కృష్ణ నామ మహిమ అపారమైనది నామ ప్రభావమును గూర్చి క్రిష్ణునికే తెలియదనినను అతిశయోక్తి కానేరదు. ఐనను నామ మహిమను గురించి అనేక శాస్త్రములలో నేను గ్రహించిన దానిని నీకు చెప్పెదనుదీనిని విశ్వాసముతో శ్రద్దగా వినుముఫలితముగా నీవు ఘోర సంసార సముద్రము నుండి తరించగలవు.

హరినామమును ఉచ్చరించుట వలన సమస్త పాపములు తొలగిపోవునుఅన్ని రకముల వ్యాధులు నిర్మూలనమగునుసమస్త దుఃఖములు సమసిపోవునుఆకలి బాధ క్షీణించునునరకములో నున్న వారు గూడ శీఘ్రముగా తరింతురు.   ప్రారబ్ద కర్మము ఖండింప బడునుసమస్త అపరాధములు క్షీణించును.

దాన, వ్రత, హోమాది సమస్త కర్మలు నామమునే ఆశ్రయించును.   వేదములన్నిటియందు సారభూతమై సూర్యుని వలె ప్రకాశించునది నామమేసమస్త పుణ్య తీర్ధముల (ఫలితము) కంటే నామము సర్వోత్క్రుష్టమని సమస్త శాస్త్రములు ఘోషించుచున్నవి.   సమస్త శుభకర్మలు నామముపై ఆధారపడి యున్నవిఐనను వాటి అన్నిటికంటే ఉత్తమ ఫలితమును ఒక్క నామమే ఒసంగునుభగవంతుని సర్వ శక్తులు నామము నందు ఇమిడి యున్నవిసమస్త జీవరాసులకు ఆనందము నిచ్చునది భగవన్నామమొక్కటేశ్రద్ధతో హరినామమును కీర్తించినవారు జగత్తులో పూజనీయులుదిక్కులేని వారికి నామమే దిక్కుపతితులను గూడ పావనులనుగా జేయు సామర్ధ్యము నామమునకు గలదు.

కృష్ణ నామమును సర్వకాల సర్వావస్తల యందు కీర్తించు వారు నామ సంకీర్తన వలననే ముక్తిని పొందుదురుమరియు వారికి వైకుంఠ ధామములో నిరంతరము హరిని కీర్తించు భాగ్యము, భగవత్ప్రీతియు కలుగునుస్వయముగా నామమే పురుషార్ధములనిచ్చునుభక్తి  అంగములలో నామము ప్రధానమైనదని శృతి, స్మృతి, శాస్త్రములు చెప్పుచున్నవి.  


దీనికి అసంఖ్యాకములైన ప్రమాణములు గలవు.
--

నామము సర్వ పాపములను వినాశనము చేయును:

1.
అయం హి కృత నిర్వేశో జన్మకోట్యంహసామపి
  
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః (భాగవతము 6-2-7) 

సమస్త పాపములను నశింపజేయుటయే నామము యొక్క ప్రప్రథమ ధర్మముదానికి ప్రమాణం ఏమనగా - అజామిళుడు అవసానకాలమందు "నారాయణ" శబ్దము ముమ్మారు ఉచ్చరించి కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది భగవత్సాన్నిధ్యము జేరెను.
సమస్త వ్రతములకంటే నామము ఉఛ్ఛమమైనది.

2.
నిష్క్రుతై రుదితై: బ్రహ్మ వాదిభి
  
స్తథా విశుధ్యత్యఘవాన్ వ్రాతాదిభి:
  
యథా హరేర్నామ పదైరుదాహృతై
  
సదుత్తమః శ్లోక గుణోపలంభకం (భాగవతము 6-2-11)
చాన్ద్రాయణాది వ్రతములు పాపాత్ములను పాపముల నుండి శాస్త్రములలో చెప్పిన రీతిని తరింప జేయలేవుఏలననగా, తాత్కాలిక వ్రతాదుల వలన పాప వాసన, పాప భీజము నశింపవుకాని కృష్ణ నామమును ఉచ్చరించుట వలన పూర్వక్రుత పాపమే గాక, పాపమునకు మూలకారణమగు అవిద్య గూడ తొలగి పోవునుసమస్త పాపములనుండి రక్షించి ముక్తి నొసంగునది నామమే కావున దీనికి మించిన వ్రతము వేరొకటి లేదు.
సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)



గోవింద కీర్తనమనేది అగ్ని జీవుల యొక్క భూత భవిష్యద్ వర్తమానముల పాపములనన్నిటిని అనాయాసముగా దహించి వేయును.  కావున కలియుగములో నామము కంటే జీవులకు బంధువు లేరు (లఘు భాగవతము).

ఈ భూలోకమున నిరంతరము సజ్జనులను పీడించు ద్రోహ చింతన గలిగిన వారు గూడ సదా హరికీర్తన వలన పవిత్రులై ధన్యులగుదురు
(లఘు భాగవతము).

శాస్త్రములలో లెక్కలేనన్ని ప్రాయశ్చిత్తములు చెప్పబడి యున్నవి.  కాని అవి ఏవియు కృష్ణ నామ కీర్తనమునకు సమము కానేరవు. (కూర్మ పురాణము)

ఏ పాపియు గూడ చేయలేనంతటి పాపమును గూడ హరింప జేయ గల శక్తి నామమునకుఉన్నది .  భగవన్నామ మహిమ అంతటిది.  అనగా నామము ఎంతటి పాపమునైనాను తుడిచి వేయునని అర్ధము.

(కూర్మ పురాణము)

ఎవరు అచ్యుత, గోవింద, మధుసూదన యని భగవంతుని నామమును ఆర్తితో ఉచ్చరించుదురో వారి సర్వ రోగములు (శారీరక, మానసిక) నశింప బడును.  ఇది ముమ్మాటికీ సత్యము (బృహద్ నారదీయము).

మహాపాతకుడైనను అహర్నిశము జగదీశ్వరుడగు హరిని  కీర్తించిన యెడల అంతః శుద్ధి గలిగి సజ్జన సాంగత్యమునకు యోగ్యత కలుగును(బ్రహ్మాండ పురాణము).

మహావ్యాధి పీదితుడైన వాడు, రాజదండనము అనుభవించువాడు 'నారాయణ' అని ఆర్తితో నుచ్చరించినచో వారు ఆయా బాధల నుండి తత్ క్షణము విముక్తులగుదురు (వహ్ని పురాణము).

నిరంతరము హరినామ కీర్తనము చేయువారికి సర్వరోగములు; క్లేశములు; సర్వ ఉపద్రవములు; సర్వ అరిష్టములు తొలగిపోవును (బృహద్ విష్ణు పురాణము).

సూర్యుడు అంధకారమును, ప్రబలమగు వాయువు మేఘములను దూరీభూతము చేయునట్లు అనంతుడైన భగవంతుని నామమును ఆశ్రయించిన వారికి (అనగా శ్రవణ, కీర్తనము చేయు వారికి) వ్యసన రూప దుఃఖములన్నియు పటాపంచలగును.  (భాగవతము 12-12-48)

కష్టము వచ్చినపుడు, మనో వ్యాకులత ఏర్పడినపుడు, పతనమొందినపుడు, భయము కలిగినపుడు, ఘోరమైన వ్యాధి పీడితుడై దానికి నివారణోపాయము లేనపుడు "నారాయణ" శబ్దము నొక్కసారి కీర్తించినచో సమస్త దుఃఖములనుండి విముక్తులై సుఖశాంతులను పొందగలరు (విష్ణు ధర్మోత్తరము).



 సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)
ప్రాపంచిక ఫలితములనాశించి గాని ఇతరులను హేళన చేయు ఉద్దేశ్యముతో గాని, గానము చేయవలెనని గాని, ఆశ్రద్ధతో గాని వైకుంఠుని నామమును ఎవరు ఆశ్రయించుదురో, వారి అశేష పాపములు హరింపబడును.  ఈ విషయమును శాస్త్రవేత్తలగు భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు.

పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప్త ఆహతః
హరిరిత్యవశే నాహ పుమాన్ నార్హతి యాతనాః (భాగవతము 6-2-15)
పైనుండి క్రింద పడినపుడు గాని, నడచుచు జారినపుడు గాని, శరీరమునకు గాయము తగిలినపుడు గాని, సర్పాది క్రూర జంతువుల వలన హాని కలిగినపుడు గాని, రోగపీడితుడైనపుడు లేదా ఇతరులు శిక్షించినపుడు గాని ఎవరు కృష్ణ, హరి, నారాయణ అను నామములను ఉచ్చరించుదురో వారికి ఎన్నడును నరక బాధ కలుగదు.

అజ్ఞానా దథవా జ్ఞానాదుత్తమః శ్లోకనామ యత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథా 2నలః (భాగవతము 6-2-18)
అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే  ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును. 

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి