28, ఏప్రిల్ 2013, ఆదివారం

డొక్కా సీతమ్మగారి 104వ వర్ధంతి ఈరోజు(27-4-1909).

గంగా భాగీరథీ సమానురాలైన డొక్కా సీతమ్మగారి 104వ వర్ధంతి ఈరోజు(27-4-1909).ఆంధ్రులసేవలకి సంతసించి సాక్షాత్తూ కాశీ అన్నపూర్ణ యే ఆంధ్రుల అన్నపూర్ణగా అవతరించిందేమో ఆంధ్రభూమి నడిబొడ్డున సస్యశ్యామలమైన తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురంతాలూకా,మండపేట గ్రామంలో శ్రీ అనిపిండి భవానీశంకరం గారి గర్భశుక్తి ముక్తాఫలంగా క్రీ.శ. 1849లో జన్మించినది సీతమ్మగారు. యుక్తవయసురాగానే రాజవోలు తాలూకాలోని లంకగన్నవరం కాపరస్థులు శ్రీ డొక్కా జోగన్నగారిని వివాహమాడి, వారికి ధర్మపత్నిగానేకాక,డొక్కావారింటి కులస్నుషగానేకాక,ఆంధ్రుల ఆదర్శమైన ఆడపడుచుగానేగాక,బారతదేశ సంస్కృతీ ధార్మికజీవన ధ్వజస్తంభముగా నిలచి అటుపుట్టినింటివారికి,ఇటుమెట్టినింటివారికి శాస్వతకీర్తి ప్రతిష్ఠలు సముపాజిర్జించిపెట్టిన భారత నారీ రత్నము.ఆమెకు నలుగురు సంతానము కల్గిరి.ఇద్దరు మగపిల్లలు,ఇద్దరు ఆడపిల్లు.ఇద్దరు ఆడపిల్లు ఆమె బ్రతికియున్నప్పుడే దివంగతులైరి. తనగీత బాగులేక భర్తగతించినను,మొక్కవోని ధైర్యంతో జీవిత పరమార్ధాన్ని గుర్తించి,"అహం వైశ్వానరో భూత్వా ప్రణినాం దేహమాశ్రితం" అనే భగవంతుని గీతకు తానే నిలువెత్తు నిదర్శనంగా నిలచిన మహనీయమూర్తి ఆమె.రేయనక పగలనక ఆకలిగొన్న ప్రతివాడు,పామరుడుకాని,పార్ధివుడుగాని అతిధి రూపంలో యున్నఆభగవంతుడేయని తలచి,క్షుథార్తజీవుల వ్యధార్తికి తనే స్వయముగా వండి,వడ్డించి క్షిప్రోపశమనము గావించి యావద్బారతీయులకు "ఇందరికీ అభయంబులిచ్చుచేయి,కందువగు మంచి బంగారు చేయి"అన్న అన్నమయ్యకీర్తించిన అన్నమయమైన చెయ్యి ఆమెది.19వ శతాబ్దపు హూణసామ్రాజ్యచక్రవర్తి చేయి క్రిందై తనది మీదుంట గర్వంగా ఎప్పుడూతలచని నిగర్వ ఆదర్శ జీవనమామెది.రవి యస్తమించని సామ్రాజ్యాధిపతి ఎడ్వర్డు సార్వభౌముని పట్టాభిషేక సమయంలో ఆప్రభువు ఆమె సేవలను గుర్తించి ప్రశంసాపత్రాన్ని సమర్పించారంటే యావత్ప్ర్రపంచము ఆమె "అన్నదాన"మహిమను గుర్తించినట్లే.ఆంధ్రప్రదేశ్ కూడా అన్నపూర్ణ వంటిదే అయితే ఆంధ్రప్రదేశే శాసన సభలో ఎవరిఫోటో యుండాలి?.అవసరమైనప్పుడు ఆమె ఫోటో లభించక పోతే నా సాహితీ మిత్రులు,పితృతుల్యులునగు కీ.శే.జి.కృష్ణగారు, ప్రముఖపాత్రికేయులు, హైదరాబాదునుంచి బ్రిటిషు ఎంబసీ వారికి లేఖ రాసి తెప్పించారని ఆయనే నాతో స్వయంగా చెప్పేరు. ఇక్కడ ప్రచురించిన ఫోటో ఆంధ్రపత్రిక 1911 సంవత్సరాది(విరోధికృత్) సంచికలో ప్రచురింపబడినది.ఆమె 104వ వర్దంతి సందర్భంగా ఈరోజు తెలుగు ద్రావిడబ్రాహ్మణ వంశ కీర్తిపతాకకు అవనత శిరస్కుడనై శ్రధ్దాంజలి ఘటిస్తున్నాను-గంటి లక్ష్మీ నరసింహమూర్తి(బెంగుళూరు).



ఇన్‌లైన్ చిత్రం 1

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

టపా బాగుంది, ఫోటో కనపడటం లేదు, ఓపెన్ కావటం లేదు, దయచేసి చూడండి.

అజ్ఞాత చెప్పారు...

oThank u for ur kind action. I have down loaded the photo, Thank u once again

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి