26, ఏప్రిల్ 2013, శుక్రవారం

అయోధ్యానగరం


అయోధ్య నగరం ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, తీర్థంకరులు, మహనీయులపాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణ్భుగవానుడి అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం... అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్‌కు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ,మహిమరీత్యా ప్రఖ్యాతి చెందిన నగరం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, స్వామినారాయణుడు, ఎందరెందరోమహనీయులకు జన్మనిచ్చిన అయోధ్య ‘పూర్వనామం’సాకేత. కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం ఎందరెందరో ఇక్ష్వాకుల రాజులకు పుట్టిల్లుగాపరిఢవిల్లింది.
ఇక్ష్వాకు మహారాజు కుమారుడైన వైవస్వతమను అయోధ్యను అభివృద్ధి పరిచినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. భారతదేశంలో అతి పురాతన పుణ్యధామాలలో ఒకటిగా, మహిమాన్విత ధామాలలో ఒకటిగా పేరుప్రఖ్యాతులు సాధించిన‘అయోధ్య’కు ఆ పేరు రావడానికి శ్రీరాముడి తాతముత్తాతలే కారణం. శ్రీరాముని తాతలలో ఒకరైన‘అయుధ’ అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. ‘యుధ్’ అంటే సంస్కృతంలో యుద్ధమని, నాశనమని అర్థం. అ‘యుధ్’అంటే నాశనం కానిదని అర్థంగా చెబుతారు. కనుకకాశీనగరం ఎలా అయితే నాశనం లేని నగరంగా పురాణాలలో పేరుప్రఖ్యాతులుగా సాధించిందో అలాగే అయోధ్య నగరం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులలోనూ నాశనం చెందని నగరంగాప్రసిద్ధిగాంచింది. గౌతమబుద్ధుని కాలంలో ‘పాలి’్భషలో అయోధ్యను ‘అయోజహ’ అని పిలిచేవారు. బ్రిటీషువారి కాలంలో ఈ నగరాన్ని ‘అజోధ్య’, లేక ‘అజోదియా’ అనిపిలిచేవారు. మొగలుల కాలంలో అయోధ్య నగరం ఆగ్రా,కుతుబ్ రాజ్యాల ఆధీనంలో ఉండేది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి జన్మనిచ్చిన పుణ్యప్రదేశంగా ఖ్యాతికెక్కిన ‘అయోధ్య’ గాగ్రనది ఒడ్డున అలరారుతోంది. సరయూ నదిగా పేరుప్రఖ్యాతులు పొందిన ఈ నదిలోనే శ్రీరాముడు, అవతార సమాప్తిని చాలించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. సదా శ్రీరామ నామస్మరణంతో మారుమ్రోగే అయోధ్య నగరం విశాలమైన అందమైన ఆలయాలకు వేదికగా ఉంది. ఈ క్షేత్రంలో వందకు పైగా ఆలయాలున్నాయి. సూర్యవంశస్థులైన ఇక్ష్వాకుల రాజులెందరో పాలించిన ఈ నగరంలోనే 63వ రాజుగా పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసి,విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. రాముడి తండ్రి దశరథ మహారాజు అయోధ్యలో పుత్రకామేష్టీ యాగాన్ని నిర్వహించాడు. అలాగే హరిశ్చంద్రుడు,రాజసాగరుడు, భగీరధుడు విక్రమాదిత్యుడు గౌతమ బుద్ధుని పాదస్పర్శతో అయోధ్య నగరం పరమ పుణ్యప్రదమైన నగరంగా రూపుదిద్దుకుంది. గౌతమబుద్ధుడు అయోధ్య నగరాన్ని ఐదుసార్లు సందర్శించినట్టు తెలుస్తుంది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌సాగ్ అయోధ్య నగరాన్ని 7వ శతాబ్దంలోదర్శించాడు. 5వ శతాబ్దంలో పేక్సియాన్ అనే చైనా సన్యాసి సందర్శించాడు. ఎందరెందరో ఇక్ష్వాకుల రాజులకు ఆశ్రయమిచ్చిన అయోధ్యలో అనేక మతాలు,వంశాలు కూడా రాజ్యమేలాయి. బౌద్ధం, జైనం,హిందుత్వంతోపాటు ముస్లిం రాజులు కూడా అయోధ్యను పాలించారు. జైన తీర్థంకరులలో ముఖ్యులైన ఐదుగురి తీర్థంకరుల జననం ఈ అయోధ్యలోనే జరిగింది. మొదటితీర్థంకరుడు ఆదినాధ్, రెండో తీర్థంకరుడు అజిత్‌నాధ్,నాల్గవ తీర్థంకరుడు అభినంద్‌నాధ్, ఐదవ తీర్థంకరుడు సుమతీనాధ్, 14వ తీర్థంకరుడు అనంతనాధ్‌లు ఈక్షేత్రంలో జన్మించారని ఇక్కడి స్థల పురాణాల వచనం. అలాగే బాహుబలి, బ్రహ్మి, హరిశ్చంద్ర అచల్‌భారత్‌లు కూడా ఇక్కడ పుట్టారట. సాక్షాత్తు శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైన ‘అయోధ్య’ నగర సందర్శనం, స్మరణం సర్వపాపాలను హరిస్తుందట. ఈ నగరాన్ని సాక్షాత్తు దేవతలే నిర్మించారని, అందుకే ఇది భూతల స్వర్గమయిందని అధర్వణ వేదం చెబుతోంది. మోక్ష ధ్యానపురిగా మన పురాణాలలో ప్రఖ్యాతి చెందిన అయోధ్యా నగరం ఎన్నో మహిమాన్విత ఆలయాలకు నెలవు. అయోధ్యలో కాలుమోపిన భక్తులంతా ముందుగా ఇక్కడ సరయూ నదిలో స్నానాదికాలు చేయడం సంప్రదాయం. ‘స్వర్గ్‌ద్వార్’గా కీర్తికెక్కిన ఇక్కడే యాత్రికులు పిండ ప్రదానాలు చేస్తారు. సాక్షాత్తు శ్రీరాముడు అవతార సమాప్తిని చాలించినపుణ్యప్రదేశంగా ఇది ఖ్యాతికెక్కింది. సరయూ నది ఒడ్డునే లక్ష్మణ మందిరం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు కొలువుదీరాడు. దీనికి సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం ఉంది. శ్రీరాముని కుమారుడు ‘కుశుడు’నిర్మించిన ఆలయంగా ఇది ఖ్యాతికెక్కింది. విక్రమాదిత్య కాలంనుంచీ చరిత్రకు నిదర్శనంగా మిగిలిన ఆలయం ఇదొక్కటేగా దీనిని చెబుతారు. మిగిలిన ఆలయాలన్నీ ముస్లింల దాడులకు అంతరించిపోయినవే. నాగేశ్వరనాధ్ మందిరానికి సమీపంలో కాలేరామ్ మందిరం ఉంది. సరయూ నదిలో దొరికిన నల్లని సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రునివిగ్రహాలు ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్టించారు. ఇక్కడకు సమీపంలోనే ‘హనుమాన్ ఘడి’ ఉంది.ఇక్కడ నవాబు షాజుద్దౌలా నిర్మించిన రామచంద్రాలయం ఉంది. అయోధ్య నగరం నడిబొడ్డున ఉన్న ఈ మందిరానికి చేరుకోవడానికి 76మెట్లున్నాయి. హనుమంతుడు ఇక్కడో గుహలో ఉండిరామజన్మభూమిని రక్షించేవాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ అంజనీమాత ఒడిలో బాల ఆంజనేయుని మూర్తి దర్శనం భక్తులకు భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. దీనికి సమీపంలో‘కనక భవన్’ ఉంది. కైకేయి మాత సీతామహాసాధ్వికి బహుమతిగా ఇచ్చిన పుణ్యస్థలం ‘కనక భవన్’,బంగారు సింహాసనం ఉన్న ఈ భవనమే శ్రీరామచంద్రుని నివాస స్థలంగా చెబుతారు. బంగారు కిరీటాలు ధరించి రామలక్ష్మణ సీత విగ్రహాలు ఈ మందిరంలో దర్శనమిస్తాయి. ఈ విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తజన సందోహంతో అలరారుతుంది. సదా శ్రీరామనామ స్మరణంతో ఇక్కడి పరిసరాలు మారుమ్రోగుతాయి. అయోధ్య నగరంలోనే మరోచోట చోటిదేవ్‌కాళీ మందిరం ఉంది. వీటితోపాటు శ్రీరామ జానకి బిర్లా ఆలయం, తులసి స్మారక భవన్,రామ్‌కిపౌరి, దతువన్‌కుండ్, జానకి మహల్,బ్రహ్మకుండ్, లక్ష్మణ్‌కిలా, రామ్‌కధా మ్యూజియం,వాల్మీకి రామాయణ మ్యూజియం, సుందర సదన్,హరిహర మందిరం, తులసీదాసు మందిరం, క్షీరేశ్వరుని మందిరాలున్నాయి. ఇవన్నీ చూడదగినవి. అయోధ్యలో అత్యంత పుణ్యప్రదేశం రామజన్మభూమి ప్రాంతం. మన పురాణాలలో విశిష్టమైన పవిత్ర క్షేత్రంగా ఖ్యాతికెక్కినఅయోధ్య నగరం సప్తమోక్ష పురాణాలలో ఒకటి. ముక్తిక్షేత్రంగా, స్వర్గ్ధామ్‌గా పేర్గాంచిన ఈ నగరంలోకి అడుగిడినంత మాత్రానే సమస్త పాపాలు పోతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. సాక్షాత్తు వాల్మీకి మహర్షి రాసిన రామాయణ మహాకావ్యానికి వేదికగానిలిచిన అయోధ్య నగరం చేరుకోవడం చాలా సులువు. అయోధ్య చిన్న నగరమే అయినప్పటికీ ఇక్కడభక్తులకు కావల్సిన అనేక వసతులున్నాయి.
....................
చేరుకొనే మార్గం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 134 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ నగరానికి సమీపంలో ఉన్న ఫైజాబాద్‌లో విమానాశ్రయం కూడా ఉంది.
అలహాబాద్‌కు 166 కిలోమీటర్లు, గోరక్‌పూర్‌కు 132కిలోమీటర్లు, వారణాసికి 209 కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్యను సులువుగా చేరుకోవచ్చు.
............................
 
 

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి