9, డిసెంబర్ 2009, బుధవారం

మనుషులెందుకు నాస్తికులవుతారు ?

ఆనందస్వరూపులకు నమస్కారములు.

ఆధునిక ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల్లో ఉగ్రవాదం కంటే నాస్తికత్వం అతిపెద్దసమస్య. ఇది కేవలం భారతదేశానికీ, హిందూమతానికి పరిమితమైనది కాదు. అన్ని దేశాలూ, అన్ని మతాలూ నాస్తికుల నుంచి ముప్పు నెదుర్కుంటున్నాయి. అయితే ఇదివఱకు నేననేకసార్లు చెప్పినట్లు నాస్తికత్వంలో కూడా చాలా రకాలున్నాయి. అందుచేత నిజమైన నాస్తికుల్ని గుర్తుపట్టడంలో మనం అప్పుడప్పుడు విఫలమవుతాం. అసలు మనుషులెందుకు నాస్తికులవుతారో చర్చిస్తే ఆ బెడదని ఎలా నివారించాలో, ఎక్కణ్ణుంచి ఆస్తికతా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాలో మనక్కాస్త స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది.

సాధారణంగా నాస్తికుల జాతకాల్లో శుభగ్రహాలూ, శుభస్థానాలూ భారీయెత్తున పాడై ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గురుడూ, చంద్రుడూ బాలేక పోవడం మామూలు. గురుచండాలయోగం (గురుడూ, రాహువూ ఒకే రాశిలో ఉండడం) వల్ల కూడా నాస్తికులవుతారని పెద్దలు చెప్పారు కానీ అది ఇతరేతర జాతకబలాల మీద కూడా ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రహయుతి ఉన్న జాతకాలవాళ్ళందఱూ పూర్తిస్థాయి నాస్తికులైనట్లుగా అనుభవంలో గోచరించడంలేదు. కాకపోతే కొంత ఆచారహీనత, శుచీశుభ్రాల దగ్గఱ రాజీపడ్డం, పెద్దల్ని ఎదిఱించడం లాంటివి కనిపిస్తున్నాయి. గురుచండాలయోగం స్త్రీలలోను, పురుషుల్లోను ఒకే విధంగా కాక కొద్దిపాటి తేడాతో పనిచేయడం కూడా ఉన్నది. ఇది కాకతాత్కాలిక నాస్తికత్వం అనే స్థితి ఒకటుంది. అంటే, మనకి కర్మఫలం అనుభవించే రాత బలంగా రాసున్నప్పుడు దానికి పరిహారాలేమీ చేసుకోకుండా అడ్డుపడడం కోసం గ్రహాలు తమ దశాభుక్తుల్లో మనిషిలో అవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఆ దశాభుక్తులు గడిచిపోగానే మనిషి మళ్లీ ఆస్తికమార్గం లోనికి వస్తాడు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది దీని గుఱించి కాదు.

నాస్తికులు ఈ రోజే హఠాత్తుగా నాస్తికులుగా మారలేదని గమనించడం అవసరం. వారిలో అత్యధికశాతం మంది గతజన్మల్లో కూడా నాస్తికులే అయ్యుంటారు. అయినా వారికి మళ్లీ మానవజన్మెత్తే అవకాశం రావడం వారి బ్యాంకు ఖాతాలో డబ్బు (పుణ్యం) ఇంకా మిగిలుండడం వల్లనే తప్ప వారి నాస్తికత్వాన్ని భగవంతుడు క్షమించాడని గానీ, వారి ధోరణి సరైనదని గానీ తాత్పర్యం కాదు. నాస్తికులు కూడా అనుకోకుండా కొన్ని పుణ్యాలు (పరోపకారాలూ, ప్రజాసేవ లాంటివి) చేస్తారు. కనుక వారిక్కూడా వాటి ఫలం లభించకపోదు. కొన్నిసార్లు భగవంతుడే నాస్తికుల భవిష్యద్‌గతి పట్ల ఆందోళన చెంది వారి మెడలు వంచి బలవంతంగా పుణ్యకార్యాలు చేయిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ : మన రాష్ట్రంలోని నాస్తికులంతా ఆరాధించే తెలుగు రచయిత కీ.శే. కొడవటిగంటి కుటుంబరావు. ఆయన జీవితమంతా దేవుణ్ణి, మతాన్ని దుమ్మెత్తిపోయడంలోనే గడిచిపోయింది. ఆయన ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు చందమామ పిల్లల మాసపత్రికవారు ఆయన్ని సంప్రదించి రామాయణం మీద పిల్లలకోసం ఒక ధారావాహిక (serial) వ్రాయమని కోరారు. తన సిద్ధాంతాలకి వ్యతిరేకమైనప్పటికీ పరిస్థితులు బాలేక కుటుంబరావు ఒడంబడక తప్పింది కాదు. ’వీరహనుమాన్" పేరుతో కొన్నిసంవత్సరాల పాటు ఆయన రామాయణం ఎపిసోడ్స్ వ్రాశాడు. అదెంత పుణ్యకార్యమో నేను వేఱే మనవి చెయ్యనక్కఱలేదు. అందఱికీ లభించే అవకాశం కూడా కాదు. కుటుంబరావు దైవదూషణ పట్ల, అందువల్ల అతనికి ప్రాప్తించబోయే దుర్గతి పట్ల భగవంతుడెంత వ్యథ చెంది ఉంటాడో, అతని పూర్వీకుల పుణ్యాల్ని దృష్టిలో ఉంచుకొని చందమామ రూపంలో అతనికొక అవకాశాన్ని ఇవ్వాలని ఎలా నిర్ణయించుకొని ఉంటాడో మనం ఊహించవచ్చు.

కొంతమంది తమ జీవితంలోని తొలి దశాబ్దాల్లో ఆస్తికులై ఉండి మలి దశాబ్దాల్లో నాస్తికులుగా పరిణమించడాన్ని గమనిస్తాం. ఇలాంటివారు నాస్తికత్వ ప్రచారం కోసం తఱచుగా చెప్పే చార్వాక పురాణం ఇలా మొదలవుతుంది. "నేనూ మీలాగే దేవుణ్ణి, దెయ్యాన్నీ ఆచారాల్నీ, శాస్త్రాల్నీ గుడ్డిగా నమ్మినవాణ్ణే. గుళ్ళచుట్టూ గోపురాల చుట్టూ తిరిగినవాణ్ణే. ఆలోచించాక/ ఫలానా పుస్తకం చదివాక నాలో అంతర్మథనం మొదలయింది." అంటూ ఒక అలుపెఱుగని సత్యాన్వేషకుడి పోజు, అపర బుద్ధభగవానుడి పోజు ఇస్తారు. ఇక్కడ గమనించాల్సింది - పూర్వజన్మవాసనలు అలాంటివారి ప్రజ్ఞనిఆక్రమించుకోవడానికి చిన్నప్పట్నుంచి వారి అధోచైతన్యంలో ఎలా కాచుక్కూర్చున్నాయి? అనేది. ప్రతి వాసనా క్రియాశీలం కావడానికి జీవితంలో కొంత సమయం తీసుకుంటుంది. బలీయమైన కామవాంఛా వాసనలతో జన్మించిన వ్యక్తిలో బాల్యంలోనే ఆ లక్షణాలు గోచరించవు. అప్పుడు అతను అందఱు పిల్లల్లాగానే ఉంటాడు. యౌవనం వచ్చాకనే ఆ లక్షణాలు గోచరిస్తాయి. నాస్తిక వాసనలైనా అంతే. తమ సమయం వచ్చాక అవి మనిషిని సంపూర్ణంగా ఆక్రమించుకుంటాయి. అంతకుముందు అతడు ఆధ్యాత్మికతలో పాల్గొంటున్నప్పటికీ అది ఒక అంటీముట్టని వ్యవహారమే తప్ప అతనేదో భక్తతుకారామ్ స్థాయి నుంచి నేరుగా గోరా, లవణం స్థాయికొచ్చేశాడనీ, ప్రతి ఆస్తికుడూ అలా అవుతాడనీ భావించరాదు. కానీ అందఱూ అలా అవ్వాలని నాస్తికులు కోరుకుంటారు. అందుకే వారు ఆ చార్వాక పురాణాల్ని వినిపించడం.

నాస్తిక వాసనలు ఎలా మొదలవుతాయో గ్రహిస్తే వాటికి మన జీవితంలో స్థానం లేకుండా చేసుకోవడం ఎలాగో అర్థం అవుతుంది. నాస్తికత్వ మూలాలు మన పచ్చిస్వార్థంలోను, మన అహంకారంలోను, అవగాహనారాహిత్యంలోను ఉన్నాయి. ఉదాహరణకి- ఒకడు తన భార్యని అమితంగా ఆఱో ప్రాణంలా ప్రేమిస్తూ ఉండవచ్చు. ఆమెకి ప్రాణాపాయకరమైన అనారోగ్యం చేస్తే అతను హోరాహోరీ పూజలూ, మ్రొక్కులూ, పుణ్యక్షేత్ర సందర్శనాలూ చేసి తన భార్యని బతికించమని దేవుడి కాళ్ళవేళ్ళా పడి వేడుకొని ఉండవచ్చు. కానీ ఆమె జాతకరీత్యా, అంతకంటే ముఖ్యంగా, ఆమె కర్మఫలం రీత్యా ఆమె చనిపోక తప్పని పరిస్థితి ఉండొచ్చు. ఆమెని స్వస్థురాల్ని చెయ్యడం ఆమెకే మంచిది కాదు గనుక అందుకు భగవంతుడు అంగీకరించక పోవచ్చు. తత్‌ఫలితంగా ఆమె చనిపోయి ఉండొచ్చు. ఎంత వేడుకున్నా తన ప్రార్థనలూ, పూజలూ ఫలించలేదు కనుక ఆ వ్యక్తి దేవుడి మీద కక్ష పూన్తాడు. కానీ దేవుడితో పోలిస్తే మానవుడు పరమ అల్పుడు. ఆయన మీద కక్ష తీర్చుకునే మార్గమే లేదతనికి. అందుకని ఈ రూట్‌లో వస్తాడు, "దేవుడూ లేడు, దెయ్యమూ లేదు, ఈ శాస్త్రాలన్నీ బొంకులు, పురాణాలన్నీ బూతులు, పూజారులు దొంగలు, మతస్థాపకులు మోసగాళ్ళు, మతమంతా బతుకుతెఱువు కోసం కనిపెట్టిన మహా ఇండస్ట్రీ" అంటూ బజారుకెక్కుతాడు. దేవుడివిగ్రహాల్నీ, పటాల్నీ ఇంట్లోంచి చెత్తకుప్ప మీదికి విసిరేస్తాడు. (ఇలాంటి సంఘటన ఒకటి మా పొఱుగున జఱిగింది) తరువాత కొంతకాలానికి అతను కూడా చనిపోయి వేఱేచోట జన్మిస్తాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అంతకుముందు లేని నాస్తిక వాసనలు మనిషిలో అంకురించడానికి దోహదించే జీవిత ఘటనల్లో ఇది ఒకానొకటి మాత్రమే. ఇక్కడ వరసలు మారతాయేమో గానీ కథ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే భార్య స్థానంలో కొడుకు పోవచ్చు, కూతురు పోవచ్చు, భర్త పోవచ్చు, స్నేహితుడు పోవచ్చు.

ఆ భార్య తనకెవరు, తానామెని పెళ్ళి చేసుకోకముందు ? అప్పుడామె ఒకఱి కూతురు మాత్రమే. ఆమె వారికి కూతురుగా పుట్టక ముందు అమె వారికి ఏమవుతుంది ? ఏమీ కాదు. ఆమెకా జన్మ ఎవడైతే ఇచ్చాడో ఆమె శాశ్వతంగా ఆయన ఆస్తే. ఆమే కాదు, మీరూ, నేను అందఱమూ ఆయన ఆస్తులమే. "నా కష్టార్జితం, నా డబ్బు, నేను కట్టించిన యిల్లు" అని గంతులేస్తారే అల్పమానవులు. ఎవఱికైనా ఏదైనా అఱువిస్తే అణాపైసలతో సహా వసూలు చేసుకునేదాకా నిద్రపోరే ! తిరిగివ్వకపోతే రక్తం కళ్ళజూస్తారే ! మఱి తానిచ్చిన ప్రాణాన్ని వెనక్కి తీసుకునే హక్కాయనకి లేదా ? తన హక్కుని తానుపయోగించుకున్నందుకు మనం ఆయన మీద కక్ష గట్టేదేంటి ? ప్రపంచంలో అందఱమూ పోవాల్సినవాళ్ళమే, కొంచెం ముందో వెనకో ! వెనక పోయేవాళ్ళంతా ముందుపోయేవాళ్ళ గుఱించి దేవుడి మీద కక్ష గడుతూనే ఉండాలా ?

మనుషులు కాస్త ఆగి ఇలా నిదానంగా ఆలోచిస్తే నాస్తికత్వం అనే ఈ జన్మజన్మల ఊబి తమని లాక్కుని కబళించకుండా తమని తాము కాపాడుకోవచ్చు.

భగవంతుడికి మనకంటే ఓర్పు కొన్నికోట్ల రెట్లు ఎక్కువ అనేది నిజమే గానీ అంతమాత్రాన మనం ఆయన్ని అవమానిస్తే ఆయన సహిస్తాడనుకోవడం అమాయకత్వం మాత్రమే. స్వతః పాపాలు అనే పాపశ్రేణి ఒకటుంది. అంటే అవి చేస్తే ఎవరూ శపించకుండానే వాటి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాగే దైవదూషణ/ దైవాభిభవం స్వతః పాపం కావడం చేత ఆయన మన పట్ల అపకారాన్ని సంకల్పించక పోయినా మనం తగువిధంగా అనుభవించాల్సి వస్తుంది. సృష్టి యావత్తు మన మీద తిరగబడుతుంది. స్వర్గతుల్యమైన సృష్టి ఒక్కపెట్టున మన పాలిట నరకంగా మారిపోతుంది. ఇలాంటి దూషణ జఱిగిన సందర్భాల్లో ఆయన తన వంతుగా చేసేదేమంటే - కొంతసేపు ఆ దూషకుల నుంచి ముఖం తిప్పుకోవడం. ఇక్కడ కొంతసేపుఅనే మాటకర్థం కొన్నివేల సంవత్సరాలని ! ఆ తరువాతి జన్మల్లో వారు ఎన్ని కష్టాలు పడినా ఆయన వారిని ఆదుకోవడానికి రాడు, తన తరఫున ఎవఱినీ పంపడు కూడా ! "చాలామంది దేవుళ్ళకి మొక్కుకున్నాం, ఏమీ జఱగలేదు" అని చెబుతారు కొంతమంది. ఎంత అడిగినా దేవుడు వినిపించుకోక పోవడానికి కారణం ఇలాంటి పూర్వజన్మదోషాలే.

పక్షాంతరంలో - కొంతమంది ప్రతిచిన్న నలతకీ OTC మందులు మింగినట్లు ప్రతిచిన్న ఇబ్బందికీ దేవుడికి ఎడాపెడా మొక్కులు మొక్కేస్తూంటారు. అవసరం తీఱాక ఆ మొక్కుల్ని చెల్లించడం గుఱించి మర్చిపోతారు. అందువల్ల మఱుజన్మలో వారు ఎన్ని మొక్కులు మొక్కినా భగవంతుడు ఆలకించడు, పట్టించుకోడు. పైపెచ్చు అలాంటివాళ్ళు చాలా తఱచుగా ధననష్టాలకి లోనవడం, "ఆ లాభం ఈ గూబలోకి సరి" అన్నట్లు ఎప్పడు సంపాదించినది అప్పుడే ఖర్చయిపోతూండడం, ఏమీ మిగలకపోవడం, వెఱసి అతిసామాన్యమైన జీవితం సంప్రాప్తమవుతాయి. ఇలాంటివారు ఈ జన్మలో దేవుణ్ణి ఎంత నమ్మినా వారికి ఏ మంచీ జఱక్కపోవడం వల్ల ఇఱుగుపొఱుగులూ, బంధుమిత్త్రులూ వారి మీద ఎకసక్కెంగా వ్యాఖ్యానించడం కూడా ఉంది. "ఏంటో ! ఎప్పుడూ దేవుడూ, దెయ్యం, గుళ్ళూ, గోపురాలూ అని తిరుగుతూంటారు. అయినా వీసమెత్తు వెనకేసింది లేదు" అని ! ఆ వ్యాఖ్యలకి లోనైనవారికి క్రమంగా దేవుడి మీద అపనమ్మకం మొదలవుతుంది. అలా నాస్తికులయ్యేవాళ్ళు మఱికొంతమంది. సాధారణంగా మనలోని దోషాలే దేవుడి దోషాలుగా, గురువు దోషాలుగా కనిపిస్తాయి. అవి సాక్షాత్తు మన దోషాలేనని, దానికి వారు బాధ్యులు కారనీ, మనం మారితే మన పట్ల వారి వైఖరి మారుతుందనీ గమనించడమే ఆధ్యాత్మికతకి తొలిమెట్టు.

దేవుడిది దివ్యాహంకారం. ఆయన ఎంత దయామయుడో ఆధ్యాత్మిక క్రమశిక్షణ దగ్గఱ అంత రాజీలేనివాడు కూడాను. "నియన్తా (dictator) నియమో యమః, దండో దమయితా దమః " అని వర్ణిస్తున్నాయి విష్ణుసహస్రనామాలు ఆయన్ని ! కనుక ఆయనతో లేదా ఆయన గుఱించి యథేచ్ఛగా మాట్లాడ్డం క్షేమదాయకం కాదు. అది ఆత్మకి పతనహేతువు. ఒకసారి ఒకఱి వల్ల తాను విమర్శకి లోనైన తరువాత ఆయన వారిని వారి కర్మకి వదిలివేయడమే జఱుగుతుంది. "దైవదూషణ నరకానికి త్రోవ" అని మతగ్రంథాల్లో చెప్పబడింది. అయితే ఇక్కడ నరకమంటే ఖచ్చితంగా రౌరవ, కుంభీపాక, అసిపత్రాది నరకాలని కాదు. భూలోకంలోని మానవేతర (non-human) జన్మలన్నీ నరకం కిందనే జమ. చలేస్తే మానవులు కంబళ్ళు కప్పుకుంటారు. తిర్యక్కులు ఏం చేస్తాయి ? వాటికి ఏ రక్షణా లేదు. జీవితాలకి ఏ భరోసా లేదు. ఏది కావాలన్నా, ఎంత బాధగా ఉన్నా నోరు తెఱిచి చెప్పలేవు. అలా ఉంటాయి నరకాలంటే ! అవి దేవుడి చేత వదిలిపెట్టబడిన జన్మలు. పురాకృత దోషాలు తీవ్రతరమై సంప్రాప్తించే జన్మలు. "మానవుడంటే ఉన్నతి పొందిన జంతువు" అంటుంది పాశ్చాత్య విజ్ఞానం. "అలా కాదు, జంతువంటే పతనం చెందిన మానవుడు" అంటుంది హిందూధర్మం. నాస్తికత్వం ఇలాంటి పతనాల్లో అగ్రగణ్యమైనది.

మనుషులు నాస్తికులు కావడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి. "మనిషి తెలిసీ ఎందుకు పాపం చేస్తాడు స్వామీ ?" అని కర్మయోగంలో అర్జునుడు భగవంతుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్పినది : :కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ:" అన్నారు. ఎన్ని తెలిసినా కామక్రోధాలకి లోనయితే మనిషి పాపం చేస్తాడని ఆయన చెప్పారు. ఇక్కడ రజోగుణం (dominating nature) అనే మాట వాడారు, జాగ్రత్తగా గమనించండి. రజోగుణం అధికార బలారాధన, బలప్రదర్శన, సంపదల పట్ల ఆసక్తి, తాను గొప్పవాణ్ణనే అభిమానం, తనకన్నీ తెలుసుననే అహంకారం, తన గుఱించి అందఱూ గొప్పగా అనుకోవాలనే/ చెప్పుకోవాలనే దాంభిక ప్రవృత్తి మొదలైనవాటికి కారణం. ఈ లక్షణాలున్నవారు సహజంగా ఉగ్ర, పరుష స్వభావులై ఉంటారు. శాస్త్రాల్లో చెప్పబడని ఇంకో ప్రభేదానికి చెందిన రాజసిక (రజోగుణ) మనుషులు వీరిలోనే ఉంటారు. వారు ప్రచ్ఛన్న ఉగ్రులు (hidden aggressive). వాళ్ళెందుకు ప్రచ్ఛన్నులు ? అంటే - వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు. హుషారుగా చలాకీగా దర్శనమిస్తారు. ఎప్పుడూ సరదాగా జోక్స్ వేస్తూంటారు. చమత్కారంగా మాట్లాడతారు. ఆగండి, ఒక్క నిమిషం. ఇదంతా ఇతరుల పట్ల హీనభావంతోనే సుమా ! వారు వేసే జోక్స్ అన్నీ ఇతరుల హృదయాల్ని నొప్పించడానికీ, అవమానించడానికీ ఉద్దేశించినవే. తాము చాలా తెలివైనవాళ్ళమనీ, సృజనాత్మకులమనీ ఇంప్రెషన్ కలిగించడం కోసం చేసే పని అది. ఈ మధ్య పాశ్చాత్య మనశ్శాస్త్ర పరిశోధకులు కూడా ఈ జోకర్ల మనస్తత్త్వాన్ని శోధించి ఇది dominating nature లో ఒక భాగమని తేల్చడం గమనార్హం. చెప్పొచ్చేదేంటంటే, ఇలా ప్రతిదాన్నీ ఎగతాళి చేసేవారిలో భావి నాస్తికులు దాగి ఉన్నారని గ్రహించాలి. ప్రతి నాస్తికుడిలోను, లేదా ప్రతి అల్పవిశ్వాసిలోను ఈ తత్త్వాన్ని స్పష్టంగా గమనించవచ్చు. అతను కేవలం దేవుడు, మతం లాంటి మత/ ధార్మిక/ పారలౌకిక విషయాలనే కాక ప్రపంచంలో ప్రతి మనిషినీ, ప్రతి విషయాన్నీ ఎగతాళి చేసే దుర్లక్షణం గలవాడనీ, అతను వాడే పదజాలం ఎంత ఆడంబరంగా ఉన్నప్పటికీ అతనికి విషయాల పట్ల గంభీర వైఖరి (serious attitude) లేదని అర్థమౌతుంది. కనుక ఆధ్యాత్మిక మార్గం కావాలనుకున్నవారు ఈ హాస్యగాడి మనస్తత్త్వాన్ని సుదూరంగా వివర్జించాలి. ఈ మనస్తత్త్వం ఉన్నవాళ్ళని కూడా వివర్జించాలి. ఇప్పటికే ఆధ్యాత్మికతలో చాలా ముందుకెళ్ళినవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. 

నాస్తికత్వ అభివృద్ధిలో హాస్యగాడితనమంత పెద్దపాత్ర పోషించేది అధర్మశృంగారం. లోకంలో కొంతమంది మనుషులుంటారు. వారికి సాధారణ దాంపత్య సంబంధంలో మజా ఉండదు. దాని కంటే వేఱైన అసాధారణ కామవాంఛలతో వేగిపోతూంటారు వారు. ఒక నీతీ, నియమం లేకుండా, వివాహిత, అవివాహిత అని చూడకుండా, వావీ వరసా పట్టించుకోకుండా, మొత్తమ్మీద ఆడజీవి అయితే చాలు, దొఱికినదాన్ని దొఱికినట్లు వలలో వేసుకొని ఎడాపెడా అనుభవించడమే జీవితగమ్యంగా, నీచమైన కామకక్కుర్తితో బ్రతుకుతూంటారు. కానీ ఒకపక్క ఇలా చేస్తున్నప్పటికీ మనసులో మఱోపక్క తాము చేస్తున్నది మంచిపని కాదేమోననే అపరాధ భావన కూడా ఉంటుంది. అక్రమంగా సుఖించిన ప్రతిసారీ తమ పట్ల తాము తీవ్రమైన అసహ్యభావనతో లోలోపల క్రుంగిపోతూంటారు. అలాగని ఆ పని మానుకోలేరు. ఇది భగవంతుడి చేతుల్లో దండనకి దారితీస్తుందని వారు అంతకుముందే విని ఉంటారు. ఈ అపరాధ భావననీ, క్రుంగుబాటునీ జయించి ప్రశాంతంగా ఉండాలంటే దేవుడు, ధర్మం, ధర్మశృంగారంలాంటి పరిభావనల్ని వదిలించుకోవడం తప్ప వారికి గత్యంతరం కనిపించదు. ఇలా ఈ అధర్మశృంగార మార్గంలో నాస్తికులైనవాళ్ళు కోట్లాదిమంది. 

ముందు మనుషులు గ్రహించాల్సింది ఇది. భగవంతుడు మనుషుల నుంచి అన్నివిషయాల్లోనూ సౌష్ఠవాన్ని (perfection) ఆశించడం లేదనేది. ఏ కొంచెం సద్గుణాలున్నా ఆయనకి చాలు. అందుకే భగవద్గీతలో కూడా "స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్" (ఈ ధర్మం అనేది ఏ కొంచెం ఆచరించినా సరే, గొప్ప భయం నుంచి కాపాడుతుంది. కాపాడతాను) అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఒక తల్లికి తన బిడ్డ తన బిడ్డగా మిగిలిపోయి తన దగ్గఱుంటే చాలు. జీవితంలో వాడు ఇంకేమి అయినా కాకపోయినా ఆమె సర్దుకుపోతుంది. దేవుడైనా అంతే ! దొంగతనానికి వెళ్ళేవాడు కూడా వెళ్ళబోయేముందు "స్వామీ ! ఈరోజు మంచి బేరం తగిలేలా అనుగ్రహించు" అని ప్రార్థిస్తే ఆయన సంతోషిస్తాడే తప్ప అసహ్యించుకోడు. అప్పుడాయన సమాజానికి నష్టం లేని దొంగతనాల్ని వాడిచేత చేయిస్తాడు. ఆ తరువాత సమయం చూసుకొని వాణ్ణి మార్చేస్తాడు. అందుకే రుద్రంలో శివుణ్ణి "చోరాణాం పతయే నమః" (దొంగల దేవుడికి వందనము) అని నమస్కరించారు.

ప్రార్థనల ద్వారా మనం ఆయన అధీనంలోకి వెళ్ళాక మన చిటికెనవేలు ఆయన పట్టుకుంటాడు. మనది తప్పులు చేయకుండా ఉండలేని స్వభావమైతే ఆ తప్పుల ద్వారా మనకి గానీ, ఇతరులకు గానీ నష్టం జఱక్కుండా జాగ్రత్తలు తీసుకొని ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. ఎన్నితప్పులు చేస్తున్నప్పటికీ దైవనామాన్ని వదలకుండా పట్టుకుంటే అదే ఏదో ఒకరోజు, ఏదో ఒక జన్మలో మనల్ని ఉద్ధరిస్తుంది. అన్నివిషయాల్లోనూ పరమ పరిశుద్ధంగా ఉండడం దైవనామస్మరణకి పూర్వార్హత కాదు. పరమపవిత్రులకీ, జీవన్ముక్తులకీ దేవుడితో అవసరమే లేదు. నారద మహర్షికి ఇతరుల మధ్య తగాదాలు పెట్టే అలవాటు. అది మాన్పించడం శ్రీహరిక్కూడా చేతకాలేదు. అందుచేత ఆ తగాదాల మూలాన అంతిమంగా లోకానికి మేలే చేకూడే విధంగా ఆయన జాగ్రత్తపడుతూ వచ్చాడు. అయితే ఒక్కసారి కూడా, "ఏమిట్రా ఇలా చేస్తున్నావ్ ?" అని తన భక్తుణ్ణి పల్లెత్తి మాటనలేదు. కనుక అధర్మశృంగారపరులు దేవుడికి దూరం కారు. దగ్గఱివాళ్ళే. ఎందుకంటే ఆయనే స్వయంగా గొప్ప శృంగారమూర్తి. ఎంతో కొంత దాని ఫలితం దానికుంటుంది గానీ దాని గుఱించి ఇప్పుడాలోచించి బుఱ్ఱపాడుచేసుకొని దేవుణ్ణి మొదలే వదిలిపెట్టడం అవివేకం. కనుక అధర్మశృంగారాన్ని మానుకోలేకపోతే దాన్తోపాటు మఱోపక్క అనునిత్య దైవోపాసన కూడా చేయడం మంచిది.

నాస్తికత్వానికి గల మఱో పార్శ్వం - దైవోపదేశం/ గురూపదేశం గానీ, దైవాదేశం/ గుర్వాదేశం గానీ లేకుండానే విపరీతంగా పుస్తకాలు చదవడం. ముఖ్యంగా మతవిషయంలో ఎవరు పడితే వారు వ్రాసిన పుస్తకాలు చదవడం పనికిరాదు. శాస్త్రాలు ఎవరికి వారు చదివితే అర్థమయ్యేవి కావు. ఈ రోజుల్లో ముద్రణయంత్రాల పుణ్యమా అని పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొఱుకుతున్నాయి. డబ్బులు పారేస్తే కొనుక్కోవచ్చు. అయితే భగవద్దర్శనం పొందనివాళ్ళు లేదా భగవదాదేశం లేనివాళ్ళు, గురుసేవ చెయ్యనివాళ్ళు, ఆత్మజ్ఞానం లేనివాళ్ళు, కించిత్‌తపోబలం కూడా లేనివాళ్ళు - ఇలాంటివాళ్ళు దేవుడి మీదా, మతం మీదా రాసే పుస్తకాలూ, వ్యాసాలూ చదవడం, మీదుమిక్కిలి వాటిని నమ్మడం మంచిది కాదు. మతగ్రంథాలు తపశ్శాలురైన ప్రాచీన మహనీయుల చేత రచింపబడ్డాయి. వారు దైవభక్తులు, గురుసేవా పరాయణులు, భగవత్‌సాక్షాత్కారమూ భగవదాదేశమూ కలిగినవారు, బ్రహ్మచర్య వ్రతదీక్షాపరులు, ఆత్మనిగ్రహవంతులు, లోక కల్యాణకాములు. అలాంటివారు వ్రాసినవాటిని మనలాంటివారు స్వతంత్రించి చదివితే మన మతధర్మ పరిజ్ఞానం అల్పాత్యల్పం కాబట్టి అంతరార్థాల సంగతలా ఉంచి, అన్నీ అపార్థాలే స్ఫురించి ఛప్పన్న గుంటల్లో, గోతుల్లో లేవలేకుండా పడిపోతాం. వట్టి భాష తెలిసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. అంబేడ్కరు సంస్కృతం నేర్చుకొని హిందూ మతగ్రంథాల్ని స్వయంగా చదివి ఆ తరువాత వాటిని ఏకిపారేస్తూ లావుపాటి సాహిత్యం సృష్టించాడు.

"విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్" (ఒక పండితుడి శ్రమని ఇంకో పండితుడే గ్రహించగలడు) అనే ఆర్యోక్తి చొప్పున ఆ ప్రాచీన మహనీయుల యథార్థభావం అవగతం కావాలంటే మళ్ళీ అంతటి సమకాలిక మహనీయుణ్ణే వెతికి పట్టుకొని పాదనమస్కారం చేసుకొని దయతో ఆ గ్రంథాన్ని వివరించవలసిందిగా ప్రార్థించాలి. ఈ రోజుల్లో అలా చెయ్యక పోవడం వల్ల అశిక్షితులైనవారు హిందూ మతగ్రంథాల్లో రామాయణం నుంచి మనుధర్మశాస్త్రం దాకా దేన్నీ వదలకుండా తమ స్వీయ అవగాహనా కోణం నుంచి బుఱద జల్లడమూ, లోతెఱుగని పామరజనం దాన్ని సుగంధద్రవ్యంగా భావించడమూ జఱుగుతున్నది.

నాస్తికత్వానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉన్నది.

పూజలూ, వ్రతాలూ చేసేవారు ఆ పూజాసమయంలో భగవంతుడి మీద మనసుని కేంద్రీకరించక పోవడం వల్ల ఆ సమయంలో వారు దేన్ని స్మరిస్తారో వారికి అదే ప్రాప్తిస్తుంది. వారు ఆ సమయంలో దేన్ని స్మరిస్తున్నారో ఆ సర్వాంతర్యామికి తెలుసు. అయితే పూజ ఎలా చేసినా చేసినందుకు తగు ఫలితమివ్వక తప్పదు. "యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్" అందువల్ల ఆ పూజకులు మఱుజన్మలో ఆ పుణ్యఫలాన్ని అనేక రూపాల్లో అనుభవిస్తారు. కానీ దైవభక్తి మాత్రం ఉండదు. "మాకు దైవభక్తి లేదు, మేం పూజలు చెయ్యం, కానీ మాకిప్పుడొచ్చిన నష్టమేంటి ?" అని వాదిస్తారు కూడా. ఈ వాదన ముదిఱి నాస్తికత్వంలోకి దిగే సంభావ్యత హెచ్చు. కనుక ఫోన్ చేసేటప్పుడు ఎలాగైతే కరెక్ట్ నంబర్ డయల్ చేస్తామో, అలాగే పూజ చేసేటప్పుడు కరెక్టుగా దేవుడి నెంబర్ డయల్ చేసేటట్లు చూసుకోవాలి.

(సమాప్తం)

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి