9, డిసెంబర్ 2009, బుధవారం

మనుషులెందుకు నాస్తికులవుతారు ?

ఆనందస్వరూపులకు నమస్కారములు.

ఆధునిక ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల్లో ఉగ్రవాదం కంటే నాస్తికత్వం అతిపెద్దసమస్య. ఇది కేవలం భారతదేశానికీ, హిందూమతానికి పరిమితమైనది కాదు. అన్ని దేశాలూ, అన్ని మతాలూ నాస్తికుల నుంచి ముప్పు నెదుర్కుంటున్నాయి. అయితే ఇదివఱకు నేననేకసార్లు చెప్పినట్లు నాస్తికత్వంలో కూడా చాలా రకాలున్నాయి. అందుచేత నిజమైన నాస్తికుల్ని గుర్తుపట్టడంలో మనం అప్పుడప్పుడు విఫలమవుతాం. అసలు మనుషులెందుకు నాస్తికులవుతారో చర్చిస్తే ఆ బెడదని ఎలా నివారించాలో, ఎక్కణ్ణుంచి ఆస్తికతా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాలో మనక్కాస్త స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది.

సాధారణంగా నాస్తికుల జాతకాల్లో శుభగ్రహాలూ, శుభస్థానాలూ భారీయెత్తున పాడై ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గురుడూ, చంద్రుడూ బాలేక పోవడం మామూలు. గురుచండాలయోగం (గురుడూ, రాహువూ ఒకే రాశిలో ఉండడం) వల్ల కూడా నాస్తికులవుతారని పెద్దలు చెప్పారు కానీ అది ఇతరేతర జాతకబలాల మీద కూడా ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రహయుతి ఉన్న జాతకాలవాళ్ళందఱూ పూర్తిస్థాయి నాస్తికులైనట్లుగా అనుభవంలో గోచరించడంలేదు. కాకపోతే కొంత ఆచారహీనత, శుచీశుభ్రాల దగ్గఱ రాజీపడ్డం, పెద్దల్ని ఎదిఱించడం లాంటివి కనిపిస్తున్నాయి. గురుచండాలయోగం స్త్రీలలోను, పురుషుల్లోను ఒకే విధంగా కాక కొద్దిపాటి తేడాతో పనిచేయడం కూడా ఉన్నది. ఇది కాకతాత్కాలిక నాస్తికత్వం అనే స్థితి ఒకటుంది. అంటే, మనకి కర్మఫలం అనుభవించే రాత బలంగా రాసున్నప్పుడు దానికి పరిహారాలేమీ చేసుకోకుండా అడ్డుపడడం కోసం గ్రహాలు తమ దశాభుక్తుల్లో మనిషిలో అవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఆ దశాభుక్తులు గడిచిపోగానే మనిషి మళ్లీ ఆస్తికమార్గం లోనికి వస్తాడు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది దీని గుఱించి కాదు.

నాస్తికులు ఈ రోజే హఠాత్తుగా నాస్తికులుగా మారలేదని గమనించడం అవసరం. వారిలో అత్యధికశాతం మంది గతజన్మల్లో కూడా నాస్తికులే అయ్యుంటారు. అయినా వారికి మళ్లీ మానవజన్మెత్తే అవకాశం రావడం వారి బ్యాంకు ఖాతాలో డబ్బు (పుణ్యం) ఇంకా మిగిలుండడం వల్లనే తప్ప వారి నాస్తికత్వాన్ని భగవంతుడు క్షమించాడని గానీ, వారి ధోరణి సరైనదని గానీ తాత్పర్యం కాదు. నాస్తికులు కూడా అనుకోకుండా కొన్ని పుణ్యాలు (పరోపకారాలూ, ప్రజాసేవ లాంటివి) చేస్తారు. కనుక వారిక్కూడా వాటి ఫలం లభించకపోదు. కొన్నిసార్లు భగవంతుడే నాస్తికుల భవిష్యద్‌గతి పట్ల ఆందోళన చెంది వారి మెడలు వంచి బలవంతంగా పుణ్యకార్యాలు చేయిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ : మన రాష్ట్రంలోని నాస్తికులంతా ఆరాధించే తెలుగు రచయిత కీ.శే. కొడవటిగంటి కుటుంబరావు. ఆయన జీవితమంతా దేవుణ్ణి, మతాన్ని దుమ్మెత్తిపోయడంలోనే గడిచిపోయింది. ఆయన ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు చందమామ పిల్లల మాసపత్రికవారు ఆయన్ని సంప్రదించి రామాయణం మీద పిల్లలకోసం ఒక ధారావాహిక (serial) వ్రాయమని కోరారు. తన సిద్ధాంతాలకి వ్యతిరేకమైనప్పటికీ పరిస్థితులు బాలేక కుటుంబరావు ఒడంబడక తప్పింది కాదు. ’వీరహనుమాన్" పేరుతో కొన్నిసంవత్సరాల పాటు ఆయన రామాయణం ఎపిసోడ్స్ వ్రాశాడు. అదెంత పుణ్యకార్యమో నేను వేఱే మనవి చెయ్యనక్కఱలేదు. అందఱికీ లభించే అవకాశం కూడా కాదు. కుటుంబరావు దైవదూషణ పట్ల, అందువల్ల అతనికి ప్రాప్తించబోయే దుర్గతి పట్ల భగవంతుడెంత వ్యథ చెంది ఉంటాడో, అతని పూర్వీకుల పుణ్యాల్ని దృష్టిలో ఉంచుకొని చందమామ రూపంలో అతనికొక అవకాశాన్ని ఇవ్వాలని ఎలా నిర్ణయించుకొని ఉంటాడో మనం ఊహించవచ్చు.

కొంతమంది తమ జీవితంలోని తొలి దశాబ్దాల్లో ఆస్తికులై ఉండి మలి దశాబ్దాల్లో నాస్తికులుగా పరిణమించడాన్ని గమనిస్తాం. ఇలాంటివారు నాస్తికత్వ ప్రచారం కోసం తఱచుగా చెప్పే చార్వాక పురాణం ఇలా మొదలవుతుంది. "నేనూ మీలాగే దేవుణ్ణి, దెయ్యాన్నీ ఆచారాల్నీ, శాస్త్రాల్నీ గుడ్డిగా నమ్మినవాణ్ణే. గుళ్ళచుట్టూ గోపురాల చుట్టూ తిరిగినవాణ్ణే. ఆలోచించాక/ ఫలానా పుస్తకం చదివాక నాలో అంతర్మథనం మొదలయింది." అంటూ ఒక అలుపెఱుగని సత్యాన్వేషకుడి పోజు, అపర బుద్ధభగవానుడి పోజు ఇస్తారు. ఇక్కడ గమనించాల్సింది - పూర్వజన్మవాసనలు అలాంటివారి ప్రజ్ఞనిఆక్రమించుకోవడానికి చిన్నప్పట్నుంచి వారి అధోచైతన్యంలో ఎలా కాచుక్కూర్చున్నాయి? అనేది. ప్రతి వాసనా క్రియాశీలం కావడానికి జీవితంలో కొంత సమయం తీసుకుంటుంది. బలీయమైన కామవాంఛా వాసనలతో జన్మించిన వ్యక్తిలో బాల్యంలోనే ఆ లక్షణాలు గోచరించవు. అప్పుడు అతను అందఱు పిల్లల్లాగానే ఉంటాడు. యౌవనం వచ్చాకనే ఆ లక్షణాలు గోచరిస్తాయి. నాస్తిక వాసనలైనా అంతే. తమ సమయం వచ్చాక అవి మనిషిని సంపూర్ణంగా ఆక్రమించుకుంటాయి. అంతకుముందు అతడు ఆధ్యాత్మికతలో పాల్గొంటున్నప్పటికీ అది ఒక అంటీముట్టని వ్యవహారమే తప్ప అతనేదో భక్తతుకారామ్ స్థాయి నుంచి నేరుగా గోరా, లవణం స్థాయికొచ్చేశాడనీ, ప్రతి ఆస్తికుడూ అలా అవుతాడనీ భావించరాదు. కానీ అందఱూ అలా అవ్వాలని నాస్తికులు కోరుకుంటారు. అందుకే వారు ఆ చార్వాక పురాణాల్ని వినిపించడం.

నాస్తిక వాసనలు ఎలా మొదలవుతాయో గ్రహిస్తే వాటికి మన జీవితంలో స్థానం లేకుండా చేసుకోవడం ఎలాగో అర్థం అవుతుంది. నాస్తికత్వ మూలాలు మన పచ్చిస్వార్థంలోను, మన అహంకారంలోను, అవగాహనారాహిత్యంలోను ఉన్నాయి. ఉదాహరణకి- ఒకడు తన భార్యని అమితంగా ఆఱో ప్రాణంలా ప్రేమిస్తూ ఉండవచ్చు. ఆమెకి ప్రాణాపాయకరమైన అనారోగ్యం చేస్తే అతను హోరాహోరీ పూజలూ, మ్రొక్కులూ, పుణ్యక్షేత్ర సందర్శనాలూ చేసి తన భార్యని బతికించమని దేవుడి కాళ్ళవేళ్ళా పడి వేడుకొని ఉండవచ్చు. కానీ ఆమె జాతకరీత్యా, అంతకంటే ముఖ్యంగా, ఆమె కర్మఫలం రీత్యా ఆమె చనిపోక తప్పని పరిస్థితి ఉండొచ్చు. ఆమెని స్వస్థురాల్ని చెయ్యడం ఆమెకే మంచిది కాదు గనుక అందుకు భగవంతుడు అంగీకరించక పోవచ్చు. తత్‌ఫలితంగా ఆమె చనిపోయి ఉండొచ్చు. ఎంత వేడుకున్నా తన ప్రార్థనలూ, పూజలూ ఫలించలేదు కనుక ఆ వ్యక్తి దేవుడి మీద కక్ష పూన్తాడు. కానీ దేవుడితో పోలిస్తే మానవుడు పరమ అల్పుడు. ఆయన మీద కక్ష తీర్చుకునే మార్గమే లేదతనికి. అందుకని ఈ రూట్‌లో వస్తాడు, "దేవుడూ లేడు, దెయ్యమూ లేదు, ఈ శాస్త్రాలన్నీ బొంకులు, పురాణాలన్నీ బూతులు, పూజారులు దొంగలు, మతస్థాపకులు మోసగాళ్ళు, మతమంతా బతుకుతెఱువు కోసం కనిపెట్టిన మహా ఇండస్ట్రీ" అంటూ బజారుకెక్కుతాడు. దేవుడివిగ్రహాల్నీ, పటాల్నీ ఇంట్లోంచి చెత్తకుప్ప మీదికి విసిరేస్తాడు. (ఇలాంటి సంఘటన ఒకటి మా పొఱుగున జఱిగింది) తరువాత కొంతకాలానికి అతను కూడా చనిపోయి వేఱేచోట జన్మిస్తాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అంతకుముందు లేని నాస్తిక వాసనలు మనిషిలో అంకురించడానికి దోహదించే జీవిత ఘటనల్లో ఇది ఒకానొకటి మాత్రమే. ఇక్కడ వరసలు మారతాయేమో గానీ కథ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే భార్య స్థానంలో కొడుకు పోవచ్చు, కూతురు పోవచ్చు, భర్త పోవచ్చు, స్నేహితుడు పోవచ్చు.

ఆ భార్య తనకెవరు, తానామెని పెళ్ళి చేసుకోకముందు ? అప్పుడామె ఒకఱి కూతురు మాత్రమే. ఆమె వారికి కూతురుగా పుట్టక ముందు అమె వారికి ఏమవుతుంది ? ఏమీ కాదు. ఆమెకా జన్మ ఎవడైతే ఇచ్చాడో ఆమె శాశ్వతంగా ఆయన ఆస్తే. ఆమే కాదు, మీరూ, నేను అందఱమూ ఆయన ఆస్తులమే. "నా కష్టార్జితం, నా డబ్బు, నేను కట్టించిన యిల్లు" అని గంతులేస్తారే అల్పమానవులు. ఎవఱికైనా ఏదైనా అఱువిస్తే అణాపైసలతో సహా వసూలు చేసుకునేదాకా నిద్రపోరే ! తిరిగివ్వకపోతే రక్తం కళ్ళజూస్తారే ! మఱి తానిచ్చిన ప్రాణాన్ని వెనక్కి తీసుకునే హక్కాయనకి లేదా ? తన హక్కుని తానుపయోగించుకున్నందుకు మనం ఆయన మీద కక్ష గట్టేదేంటి ? ప్రపంచంలో అందఱమూ పోవాల్సినవాళ్ళమే, కొంచెం ముందో వెనకో ! వెనక పోయేవాళ్ళంతా ముందుపోయేవాళ్ళ గుఱించి దేవుడి మీద కక్ష గడుతూనే ఉండాలా ?

మనుషులు కాస్త ఆగి ఇలా నిదానంగా ఆలోచిస్తే నాస్తికత్వం అనే ఈ జన్మజన్మల ఊబి తమని లాక్కుని కబళించకుండా తమని తాము కాపాడుకోవచ్చు.

భగవంతుడికి మనకంటే ఓర్పు కొన్నికోట్ల రెట్లు ఎక్కువ అనేది నిజమే గానీ అంతమాత్రాన మనం ఆయన్ని అవమానిస్తే ఆయన సహిస్తాడనుకోవడం అమాయకత్వం మాత్రమే. స్వతః పాపాలు అనే పాపశ్రేణి ఒకటుంది. అంటే అవి చేస్తే ఎవరూ శపించకుండానే వాటి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాగే దైవదూషణ/ దైవాభిభవం స్వతః పాపం కావడం చేత ఆయన మన పట్ల అపకారాన్ని సంకల్పించక పోయినా మనం తగువిధంగా అనుభవించాల్సి వస్తుంది. సృష్టి యావత్తు మన మీద తిరగబడుతుంది. స్వర్గతుల్యమైన సృష్టి ఒక్కపెట్టున మన పాలిట నరకంగా మారిపోతుంది. ఇలాంటి దూషణ జఱిగిన సందర్భాల్లో ఆయన తన వంతుగా చేసేదేమంటే - కొంతసేపు ఆ దూషకుల నుంచి ముఖం తిప్పుకోవడం. ఇక్కడ కొంతసేపుఅనే మాటకర్థం కొన్నివేల సంవత్సరాలని ! ఆ తరువాతి జన్మల్లో వారు ఎన్ని కష్టాలు పడినా ఆయన వారిని ఆదుకోవడానికి రాడు, తన తరఫున ఎవఱినీ పంపడు కూడా ! "చాలామంది దేవుళ్ళకి మొక్కుకున్నాం, ఏమీ జఱగలేదు" అని చెబుతారు కొంతమంది. ఎంత అడిగినా దేవుడు వినిపించుకోక పోవడానికి కారణం ఇలాంటి పూర్వజన్మదోషాలే.

పక్షాంతరంలో - కొంతమంది ప్రతిచిన్న నలతకీ OTC మందులు మింగినట్లు ప్రతిచిన్న ఇబ్బందికీ దేవుడికి ఎడాపెడా మొక్కులు మొక్కేస్తూంటారు. అవసరం తీఱాక ఆ మొక్కుల్ని చెల్లించడం గుఱించి మర్చిపోతారు. అందువల్ల మఱుజన్మలో వారు ఎన్ని మొక్కులు మొక్కినా భగవంతుడు ఆలకించడు, పట్టించుకోడు. పైపెచ్చు అలాంటివాళ్ళు చాలా తఱచుగా ధననష్టాలకి లోనవడం, "ఆ లాభం ఈ గూబలోకి సరి" అన్నట్లు ఎప్పడు సంపాదించినది అప్పుడే ఖర్చయిపోతూండడం, ఏమీ మిగలకపోవడం, వెఱసి అతిసామాన్యమైన జీవితం సంప్రాప్తమవుతాయి. ఇలాంటివారు ఈ జన్మలో దేవుణ్ణి ఎంత నమ్మినా వారికి ఏ మంచీ జఱక్కపోవడం వల్ల ఇఱుగుపొఱుగులూ, బంధుమిత్త్రులూ వారి మీద ఎకసక్కెంగా వ్యాఖ్యానించడం కూడా ఉంది. "ఏంటో ! ఎప్పుడూ దేవుడూ, దెయ్యం, గుళ్ళూ, గోపురాలూ అని తిరుగుతూంటారు. అయినా వీసమెత్తు వెనకేసింది లేదు" అని ! ఆ వ్యాఖ్యలకి లోనైనవారికి క్రమంగా దేవుడి మీద అపనమ్మకం మొదలవుతుంది. అలా నాస్తికులయ్యేవాళ్ళు మఱికొంతమంది. సాధారణంగా మనలోని దోషాలే దేవుడి దోషాలుగా, గురువు దోషాలుగా కనిపిస్తాయి. అవి సాక్షాత్తు మన దోషాలేనని, దానికి వారు బాధ్యులు కారనీ, మనం మారితే మన పట్ల వారి వైఖరి మారుతుందనీ గమనించడమే ఆధ్యాత్మికతకి తొలిమెట్టు.

దేవుడిది దివ్యాహంకారం. ఆయన ఎంత దయామయుడో ఆధ్యాత్మిక క్రమశిక్షణ దగ్గఱ అంత రాజీలేనివాడు కూడాను. "నియన్తా (dictator) నియమో యమః, దండో దమయితా దమః " అని వర్ణిస్తున్నాయి విష్ణుసహస్రనామాలు ఆయన్ని ! కనుక ఆయనతో లేదా ఆయన గుఱించి యథేచ్ఛగా మాట్లాడ్డం క్షేమదాయకం కాదు. అది ఆత్మకి పతనహేతువు. ఒకసారి ఒకఱి వల్ల తాను విమర్శకి లోనైన తరువాత ఆయన వారిని వారి కర్మకి వదిలివేయడమే జఱుగుతుంది. "దైవదూషణ నరకానికి త్రోవ" అని మతగ్రంథాల్లో చెప్పబడింది. అయితే ఇక్కడ నరకమంటే ఖచ్చితంగా రౌరవ, కుంభీపాక, అసిపత్రాది నరకాలని కాదు. భూలోకంలోని మానవేతర (non-human) జన్మలన్నీ నరకం కిందనే జమ. చలేస్తే మానవులు కంబళ్ళు కప్పుకుంటారు. తిర్యక్కులు ఏం చేస్తాయి ? వాటికి ఏ రక్షణా లేదు. జీవితాలకి ఏ భరోసా లేదు. ఏది కావాలన్నా, ఎంత బాధగా ఉన్నా నోరు తెఱిచి చెప్పలేవు. అలా ఉంటాయి నరకాలంటే ! అవి దేవుడి చేత వదిలిపెట్టబడిన జన్మలు. పురాకృత దోషాలు తీవ్రతరమై సంప్రాప్తించే జన్మలు. "మానవుడంటే ఉన్నతి పొందిన జంతువు" అంటుంది పాశ్చాత్య విజ్ఞానం. "అలా కాదు, జంతువంటే పతనం చెందిన మానవుడు" అంటుంది హిందూధర్మం. నాస్తికత్వం ఇలాంటి పతనాల్లో అగ్రగణ్యమైనది.

మనుషులు నాస్తికులు కావడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి. "మనిషి తెలిసీ ఎందుకు పాపం చేస్తాడు స్వామీ ?" అని కర్మయోగంలో అర్జునుడు భగవంతుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్పినది : :కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ:" అన్నారు. ఎన్ని తెలిసినా కామక్రోధాలకి లోనయితే మనిషి పాపం చేస్తాడని ఆయన చెప్పారు. ఇక్కడ రజోగుణం (dominating nature) అనే మాట వాడారు, జాగ్రత్తగా గమనించండి. రజోగుణం అధికార బలారాధన, బలప్రదర్శన, సంపదల పట్ల ఆసక్తి, తాను గొప్పవాణ్ణనే అభిమానం, తనకన్నీ తెలుసుననే అహంకారం, తన గుఱించి అందఱూ గొప్పగా అనుకోవాలనే/ చెప్పుకోవాలనే దాంభిక ప్రవృత్తి మొదలైనవాటికి కారణం. ఈ లక్షణాలున్నవారు సహజంగా ఉగ్ర, పరుష స్వభావులై ఉంటారు. శాస్త్రాల్లో చెప్పబడని ఇంకో ప్రభేదానికి చెందిన రాజసిక (రజోగుణ) మనుషులు వీరిలోనే ఉంటారు. వారు ప్రచ్ఛన్న ఉగ్రులు (hidden aggressive). వాళ్ళెందుకు ప్రచ్ఛన్నులు ? అంటే - వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు. హుషారుగా చలాకీగా దర్శనమిస్తారు. ఎప్పుడూ సరదాగా జోక్స్ వేస్తూంటారు. చమత్కారంగా మాట్లాడతారు. ఆగండి, ఒక్క నిమిషం. ఇదంతా ఇతరుల పట్ల హీనభావంతోనే సుమా ! వారు వేసే జోక్స్ అన్నీ ఇతరుల హృదయాల్ని నొప్పించడానికీ, అవమానించడానికీ ఉద్దేశించినవే. తాము చాలా తెలివైనవాళ్ళమనీ, సృజనాత్మకులమనీ ఇంప్రెషన్ కలిగించడం కోసం చేసే పని అది. ఈ మధ్య పాశ్చాత్య మనశ్శాస్త్ర పరిశోధకులు కూడా ఈ జోకర్ల మనస్తత్త్వాన్ని శోధించి ఇది dominating nature లో ఒక భాగమని తేల్చడం గమనార్హం. చెప్పొచ్చేదేంటంటే, ఇలా ప్రతిదాన్నీ ఎగతాళి చేసేవారిలో భావి నాస్తికులు దాగి ఉన్నారని గ్రహించాలి. ప్రతి నాస్తికుడిలోను, లేదా ప్రతి అల్పవిశ్వాసిలోను ఈ తత్త్వాన్ని స్పష్టంగా గమనించవచ్చు. అతను కేవలం దేవుడు, మతం లాంటి మత/ ధార్మిక/ పారలౌకిక విషయాలనే కాక ప్రపంచంలో ప్రతి మనిషినీ, ప్రతి విషయాన్నీ ఎగతాళి చేసే దుర్లక్షణం గలవాడనీ, అతను వాడే పదజాలం ఎంత ఆడంబరంగా ఉన్నప్పటికీ అతనికి విషయాల పట్ల గంభీర వైఖరి (serious attitude) లేదని అర్థమౌతుంది. కనుక ఆధ్యాత్మిక మార్గం కావాలనుకున్నవారు ఈ హాస్యగాడి మనస్తత్త్వాన్ని సుదూరంగా వివర్జించాలి. ఈ మనస్తత్త్వం ఉన్నవాళ్ళని కూడా వివర్జించాలి. ఇప్పటికే ఆధ్యాత్మికతలో చాలా ముందుకెళ్ళినవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. 

నాస్తికత్వ అభివృద్ధిలో హాస్యగాడితనమంత పెద్దపాత్ర పోషించేది అధర్మశృంగారం. లోకంలో కొంతమంది మనుషులుంటారు. వారికి సాధారణ దాంపత్య సంబంధంలో మజా ఉండదు. దాని కంటే వేఱైన అసాధారణ కామవాంఛలతో వేగిపోతూంటారు వారు. ఒక నీతీ, నియమం లేకుండా, వివాహిత, అవివాహిత అని చూడకుండా, వావీ వరసా పట్టించుకోకుండా, మొత్తమ్మీద ఆడజీవి అయితే చాలు, దొఱికినదాన్ని దొఱికినట్లు వలలో వేసుకొని ఎడాపెడా అనుభవించడమే జీవితగమ్యంగా, నీచమైన కామకక్కుర్తితో బ్రతుకుతూంటారు. కానీ ఒకపక్క ఇలా చేస్తున్నప్పటికీ మనసులో మఱోపక్క తాము చేస్తున్నది మంచిపని కాదేమోననే అపరాధ భావన కూడా ఉంటుంది. అక్రమంగా సుఖించిన ప్రతిసారీ తమ పట్ల తాము తీవ్రమైన అసహ్యభావనతో లోలోపల క్రుంగిపోతూంటారు. అలాగని ఆ పని మానుకోలేరు. ఇది భగవంతుడి చేతుల్లో దండనకి దారితీస్తుందని వారు అంతకుముందే విని ఉంటారు. ఈ అపరాధ భావననీ, క్రుంగుబాటునీ జయించి ప్రశాంతంగా ఉండాలంటే దేవుడు, ధర్మం, ధర్మశృంగారంలాంటి పరిభావనల్ని వదిలించుకోవడం తప్ప వారికి గత్యంతరం కనిపించదు. ఇలా ఈ అధర్మశృంగార మార్గంలో నాస్తికులైనవాళ్ళు కోట్లాదిమంది. 

ముందు మనుషులు గ్రహించాల్సింది ఇది. భగవంతుడు మనుషుల నుంచి అన్నివిషయాల్లోనూ సౌష్ఠవాన్ని (perfection) ఆశించడం లేదనేది. ఏ కొంచెం సద్గుణాలున్నా ఆయనకి చాలు. అందుకే భగవద్గీతలో కూడా "స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్" (ఈ ధర్మం అనేది ఏ కొంచెం ఆచరించినా సరే, గొప్ప భయం నుంచి కాపాడుతుంది. కాపాడతాను) అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఒక తల్లికి తన బిడ్డ తన బిడ్డగా మిగిలిపోయి తన దగ్గఱుంటే చాలు. జీవితంలో వాడు ఇంకేమి అయినా కాకపోయినా ఆమె సర్దుకుపోతుంది. దేవుడైనా అంతే ! దొంగతనానికి వెళ్ళేవాడు కూడా వెళ్ళబోయేముందు "స్వామీ ! ఈరోజు మంచి బేరం తగిలేలా అనుగ్రహించు" అని ప్రార్థిస్తే ఆయన సంతోషిస్తాడే తప్ప అసహ్యించుకోడు. అప్పుడాయన సమాజానికి నష్టం లేని దొంగతనాల్ని వాడిచేత చేయిస్తాడు. ఆ తరువాత సమయం చూసుకొని వాణ్ణి మార్చేస్తాడు. అందుకే రుద్రంలో శివుణ్ణి "చోరాణాం పతయే నమః" (దొంగల దేవుడికి వందనము) అని నమస్కరించారు.

ప్రార్థనల ద్వారా మనం ఆయన అధీనంలోకి వెళ్ళాక మన చిటికెనవేలు ఆయన పట్టుకుంటాడు. మనది తప్పులు చేయకుండా ఉండలేని స్వభావమైతే ఆ తప్పుల ద్వారా మనకి గానీ, ఇతరులకు గానీ నష్టం జఱక్కుండా జాగ్రత్తలు తీసుకొని ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. ఎన్నితప్పులు చేస్తున్నప్పటికీ దైవనామాన్ని వదలకుండా పట్టుకుంటే అదే ఏదో ఒకరోజు, ఏదో ఒక జన్మలో మనల్ని ఉద్ధరిస్తుంది. అన్నివిషయాల్లోనూ పరమ పరిశుద్ధంగా ఉండడం దైవనామస్మరణకి పూర్వార్హత కాదు. పరమపవిత్రులకీ, జీవన్ముక్తులకీ దేవుడితో అవసరమే లేదు. నారద మహర్షికి ఇతరుల మధ్య తగాదాలు పెట్టే అలవాటు. అది మాన్పించడం శ్రీహరిక్కూడా చేతకాలేదు. అందుచేత ఆ తగాదాల మూలాన అంతిమంగా లోకానికి మేలే చేకూడే విధంగా ఆయన జాగ్రత్తపడుతూ వచ్చాడు. అయితే ఒక్కసారి కూడా, "ఏమిట్రా ఇలా చేస్తున్నావ్ ?" అని తన భక్తుణ్ణి పల్లెత్తి మాటనలేదు. కనుక అధర్మశృంగారపరులు దేవుడికి దూరం కారు. దగ్గఱివాళ్ళే. ఎందుకంటే ఆయనే స్వయంగా గొప్ప శృంగారమూర్తి. ఎంతో కొంత దాని ఫలితం దానికుంటుంది గానీ దాని గుఱించి ఇప్పుడాలోచించి బుఱ్ఱపాడుచేసుకొని దేవుణ్ణి మొదలే వదిలిపెట్టడం అవివేకం. కనుక అధర్మశృంగారాన్ని మానుకోలేకపోతే దాన్తోపాటు మఱోపక్క అనునిత్య దైవోపాసన కూడా చేయడం మంచిది.

నాస్తికత్వానికి గల మఱో పార్శ్వం - దైవోపదేశం/ గురూపదేశం గానీ, దైవాదేశం/ గుర్వాదేశం గానీ లేకుండానే విపరీతంగా పుస్తకాలు చదవడం. ముఖ్యంగా మతవిషయంలో ఎవరు పడితే వారు వ్రాసిన పుస్తకాలు చదవడం పనికిరాదు. శాస్త్రాలు ఎవరికి వారు చదివితే అర్థమయ్యేవి కావు. ఈ రోజుల్లో ముద్రణయంత్రాల పుణ్యమా అని పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొఱుకుతున్నాయి. డబ్బులు పారేస్తే కొనుక్కోవచ్చు. అయితే భగవద్దర్శనం పొందనివాళ్ళు లేదా భగవదాదేశం లేనివాళ్ళు, గురుసేవ చెయ్యనివాళ్ళు, ఆత్మజ్ఞానం లేనివాళ్ళు, కించిత్‌తపోబలం కూడా లేనివాళ్ళు - ఇలాంటివాళ్ళు దేవుడి మీదా, మతం మీదా రాసే పుస్తకాలూ, వ్యాసాలూ చదవడం, మీదుమిక్కిలి వాటిని నమ్మడం మంచిది కాదు. మతగ్రంథాలు తపశ్శాలురైన ప్రాచీన మహనీయుల చేత రచింపబడ్డాయి. వారు దైవభక్తులు, గురుసేవా పరాయణులు, భగవత్‌సాక్షాత్కారమూ భగవదాదేశమూ కలిగినవారు, బ్రహ్మచర్య వ్రతదీక్షాపరులు, ఆత్మనిగ్రహవంతులు, లోక కల్యాణకాములు. అలాంటివారు వ్రాసినవాటిని మనలాంటివారు స్వతంత్రించి చదివితే మన మతధర్మ పరిజ్ఞానం అల్పాత్యల్పం కాబట్టి అంతరార్థాల సంగతలా ఉంచి, అన్నీ అపార్థాలే స్ఫురించి ఛప్పన్న గుంటల్లో, గోతుల్లో లేవలేకుండా పడిపోతాం. వట్టి భాష తెలిసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. అంబేడ్కరు సంస్కృతం నేర్చుకొని హిందూ మతగ్రంథాల్ని స్వయంగా చదివి ఆ తరువాత వాటిని ఏకిపారేస్తూ లావుపాటి సాహిత్యం సృష్టించాడు.

"విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్" (ఒక పండితుడి శ్రమని ఇంకో పండితుడే గ్రహించగలడు) అనే ఆర్యోక్తి చొప్పున ఆ ప్రాచీన మహనీయుల యథార్థభావం అవగతం కావాలంటే మళ్ళీ అంతటి సమకాలిక మహనీయుణ్ణే వెతికి పట్టుకొని పాదనమస్కారం చేసుకొని దయతో ఆ గ్రంథాన్ని వివరించవలసిందిగా ప్రార్థించాలి. ఈ రోజుల్లో అలా చెయ్యక పోవడం వల్ల అశిక్షితులైనవారు హిందూ మతగ్రంథాల్లో రామాయణం నుంచి మనుధర్మశాస్త్రం దాకా దేన్నీ వదలకుండా తమ స్వీయ అవగాహనా కోణం నుంచి బుఱద జల్లడమూ, లోతెఱుగని పామరజనం దాన్ని సుగంధద్రవ్యంగా భావించడమూ జఱుగుతున్నది.

నాస్తికత్వానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉన్నది.

పూజలూ, వ్రతాలూ చేసేవారు ఆ పూజాసమయంలో భగవంతుడి మీద మనసుని కేంద్రీకరించక పోవడం వల్ల ఆ సమయంలో వారు దేన్ని స్మరిస్తారో వారికి అదే ప్రాప్తిస్తుంది. వారు ఆ సమయంలో దేన్ని స్మరిస్తున్నారో ఆ సర్వాంతర్యామికి తెలుసు. అయితే పూజ ఎలా చేసినా చేసినందుకు తగు ఫలితమివ్వక తప్పదు. "యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్" అందువల్ల ఆ పూజకులు మఱుజన్మలో ఆ పుణ్యఫలాన్ని అనేక రూపాల్లో అనుభవిస్తారు. కానీ దైవభక్తి మాత్రం ఉండదు. "మాకు దైవభక్తి లేదు, మేం పూజలు చెయ్యం, కానీ మాకిప్పుడొచ్చిన నష్టమేంటి ?" అని వాదిస్తారు కూడా. ఈ వాదన ముదిఱి నాస్తికత్వంలోకి దిగే సంభావ్యత హెచ్చు. కనుక ఫోన్ చేసేటప్పుడు ఎలాగైతే కరెక్ట్ నంబర్ డయల్ చేస్తామో, అలాగే పూజ చేసేటప్పుడు కరెక్టుగా దేవుడి నెంబర్ డయల్ చేసేటట్లు చూసుకోవాలి.

(సమాప్తం)

7, నవంబర్ 2009, శనివారం

ఆ ఋణం తీఱుద్దామా ? లేక ఇంకా ఋణాల ఊబిలో కూరుకుపోదామా ?

ಎನಿತು ಜನ್ಮದಲಿ ಎನಿತು ಜೀವರಿಗೆ ಎನಿತು ನಾವು ಋಣಿಯೋ
ತಿಳಿದು ನೋಡಿದರೆ ಬಾಳು ಎಂಬುದಿದು ಋಣದ ರತ್ನಗಣಿಯೋ"


(ఎనితు జన్మదలి ఎనితు జీవరిగె ఎనితు నావు ఋణియో
తిళిదు నోడిదరె బాళు ఎంబుదిదు ఋణద రత్నగణియో)


"ఎన్ని జన్మల్లో ఎందఱు జీవులకి మనం ఋణగ్రస్తులమో
కనిపెట్టి చూస్తే ఈ జీవితమనేది ఋణరత్నాల నిక్షేపమేమో"


అంటారు ప్రముఖ కన్నడకవి శ్రీ ఎమ్.ఎస్. శివరుద్రప్ప. మనిషి పుడుతూనే దేవఋణం, పితృఋణం, ఋషిఋణం అని మూడురకాల ఋణాలతో జన్మిస్తాడని మన పూర్వగ్రంథాలు తెలుపుతున్నాయి. వివిధ దేవతలు మన శరీరంలోని వివిధ అవయవాలకి అధిష్ఠాన దేవతలై ఈ రూపాన్ని మనకి ప్రసాదించారు. వారే పంచభూతాల్లోను, సమస్త ప్రకృతిలోను నివసిస్తున్నారు. అందుచేత లోపలా, వెలుపలా కూడా వారే ఉన్నారు. వారు లోపల ఉన్నప్పుడు జీవశక్తులనీ, వెలుపల ఉన్నప్పుడు ప్రకృతిశక్తులనీ పిలవబడతారు. ఆ విధంగా వారు మనతో నిత్యనివాసం చేస్తున్నారు. కనుక దేవఋణాన్ని జప తపో ధ్యాన హోమ యజ్ఞాదుల ద్వారాను, పూజాదికాల ద్వారాను తీర్చాలి. అప్పుడు వారు సంతుష్టి చెంది మన జీవితానికి కావాల్సిన ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తారు.

పితృదేవతలు మన తండ్రుల వృషణాలలో నివసించి మన పుట్టుకకి కారణమయ్యారు. పైపైన చూడ్డానికి మన జన్మకి నిమిత్త కారకుడు మన తండ్రి అయినప్పటికీ, తెఱ వెనుకనున్న అసలు కారకులు పితృదేవతలే. వారి అనుగ్రహం లేకపోతే భార్యాభర్తలు ఎంత హోమ్ వర్క్ చేసినా ఏమీ లాభం లేదు. వారు మన పూర్వీకులు కారు. పితృలోకం అని ఒకటుంది. చనిపోయినవారు తమ పాపపుణ్యాల అనుసారంగా ఊర్ధ్వ, అధో లోకాలకి వెళ్ళబోయేముందు అక్కడ మజిలీ చేస్తారు. ఆ లోకానికి అధిపతులు పితృదేవతలు. అందుచేత వారిని సంతృప్తిపఱచడం కోసం ప్రతి సంవత్సరమూ తద్దినాలు పెట్టాలి. లేకపోతే వారు ఆగ్రహిస్తారు. విధివిహితంగా వివాహం చేసుకొని పెద్దల వంశాన్ని కొనసాగించడమే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గం.

ఇహపోతే ఋషిఋణం. దీన్ని ఒక రకంగా గురుఋణం అని చెప్పుకోవచ్చు. మానవులకి నాగరికత లేని రోజుల్లో భగవదాదేశం మీద వారి మధ్య జన్మించి వారికి ప్రాథమికమైన మంచి, చెడు, శుచీ, శుభ్రం, వావి-వరుస, రాజ-ప్రజా ధర్మాలూ, పతి-పత్నీధర్మాలూ, పితాపుత్ర ధర్మాలూ, గురుశిష్య ధర్మాలూ, దైవభక్తి, పాపభీతి గట్రా బోధించి, చూపించి వెళ్ళిన ఆదిమ గురువులున్నారు. వారికే ఋషులని పేరు. వారి బోధల్ని అచంచల విశ్వాసంతో వేలాది సంవత్సరాల పాటు మానవజాతి అనుసరించడం వల్లనే మానవ నాగరికత ఇప్పుడు ఇంత మహోన్నత స్థితికి చేఱుకుంది. అయితే ఇప్పుడు వాటిని ధైర్యంగా ఉల్లంఘిస్తున్నారు కనుక ఇది త్వరలో సంపూర్ణంగా పతనం (collapse) అవుతుంది. ఆ తరువాత ఆ ఆదిగురువులే పతనమైన ధర్మాల్ని తిరిగి నిలబెట్టడం కోసం భావి-అనాగరికుల మధ్యకి దిగిరావాల్సి వస్తుంది. వారికి సేవ చేద్దామంటే వారిప్పుడు మనకి లభించరు కనుక వారి గ్రంథాల్ని మనం అధ్యయనం చెయ్యడం, ఇతరులకి అధ్యాపనం చెప్పడం, ఆచరించడం - ఇవే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గాలు.

నా దృష్టిలో ఇంకో ఋణం ఉంది. అది ప్రకృతిఋణం. ప్రకృతి జగదంబా స్వరూపం. ఓమ్ ప్రకృత్యై నమః అంటారు లక్ష్మీ అష్టోత్తరంలో ! కనుక ఇక్కడ ప్రతివిషయాన్ని శ్రీ అమ్మవారు తన ప్రేమామృతంతో రంగరించి సృష్టించి ఉన్నారు. ఒక వడ్లగింజని తీసుకొని పరిశీలించండి. ఆ గింజలు తన మానవ బిడ్డలకి చేఱాలనే ఆ తల్లి తపన మీకర్థమవుతుంది. ఎంత పకడ్బందీగా ఆవిడ ఒక్కొక్క గింజని ప్యాకేజి చేసిపెట్టిందో చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. భగవంతుడు/ భగవతి తన మీద కుఱిపిస్తున్న ఈ వాత్సల్యానికి ప్రతిగా మనిషి ఏం చేస్తున్నాడు ? అవే ఆహార పదార్థాల్ని కల్తీ చేసి తోటి మానవులకి సరఫరా చేస్తున్నాడు. ఒకవేళ భగవంతుడు/ భగవతి ప్రత్యక్షమై " ఏరా ! నేను నీకు పరిశుద్ధమైన ప్రేమతో అందించిన ఆహారాన్ని అదే విధమైన ప్రేమతో నీ తోటి మానవులకి అందించాల్సిన అవసరం లేదా ? లేదని నువ్వంటే నీలాగే నేను కూడా నీకు కలుషితాహారాన్నే ప్రసాదిస్తే నీ గతేమవుతుందో ఆలోచించావా ?" అనడిగితే వీడి సమాధానమేంటి ?

మన పూర్వీకులు మనకొదిలిపోయిన పరిశుద్ధమైన నీటిని, గాలినీ, పరిసరాల్నీ మనం అలాగే ఉంచుతున్నామా ? వారు మనకి వాటిని ఎలా అందించారో అలాగే మనమూ భావితరాలకి అందిస్తే అదే నిజంగా దేవ, పితృఋణాల్ని తీర్చడం అవ్వదా ?

5, నవంబర్ 2009, గురువారం

ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషంట ! సిగ్గులేకపోతే సరి

ఒకజాతి ఆత్మగౌరవానికి ఆయువు పట్టు దాని భాష . తమ భాషను తామే ధ్వంశం చేసుకుంటున్నమన్న సృహలోలేని కుహనమేధావి వర్గ వాదనలకు నిరసనగాతెలుగు బిడ్డల ఆవేదనలివి

కచ్చితంగా మతులు పోయాయి అందఱికీనూ.

ఈనాడులో ప్రచురించిన ఈ వార్త చదవండి: http://www.eenadu.net/story.asp?qry1=6&reccount=38 ఇదే వార్తని జతచేసిన కవిలెలోనైనా చదవవచ్చు.

--------------------------------------------------------------------------------------

అభిప్రాయం ౧
---------

పిల్లలకు చదువు ఎలా చెప్పాలనేది నిపుణులకు తెలిసినట్టుగా మనకు తెలవదు. అలాంటి దాని సంగతి తేల్చడం కోసం పిల్లల తలిదండ్రుల వద్ద అభిప్రాయాలు తీసుకుంటారంట ! ఆ తల్లిదండ్రులెవరూ..? తమ పిల్లలు ఏ సిలబస్సులో చదూతున్నారో తెలీనివాళ్ళు!

మాన్యుఫాక్చరింగ్ ది కన్సెంట్ అని పుస్తకమేదో ఉన్నట్టుంది కదా.. అందులో ఇలాంటి వాటిని గురించి బహుశా చోమ్‌స్కీ చెప్పి ఉంటాడేమో! చెప్పాడో లేదో గానీ, మన ప్రభుత్వం మాత్రం ఇలాంటివాటిల్లో నైపుణ్యం సాధించింది.సెజ్‌ల పట్ల ప్రజాభిప్రాయం తీసుకునే పద్ధతులు చూసాం. ఇలాంటి వాటిల్లో అభిప్రాయాలు తయారుచేసే పద్ధతి ఇలాగన్నమాట. అయిలయ్య లాంటివాళ్ళు ఈ అభిప్రాయాల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తూంటారు. (అయిలయ్య ఇంకోమాటన్నాడు.. గిరిజన పిల్లలకు తెలుగు కంటే ఇంగ్లీషే బాగా వస్తున్నదంట. వాళ్ళు తెలుగులో తప్పుతున్నారంట, ఇంగ్లీషులో ప్యాసవుతున్నారంట. గిరిజనులకు తెలుగు పరాయి భాషే. వాళ్ళ మాతృభాషలో చెబితే సంతోషంగా బడికి వెళ్ళి చదూకుంటున్నారంట. "నేను చిన్నప్పటి నుంచీ తెలుగులో చదూకున్నాను, కానీ ఇప్పుడు ఇంగ్లీషులో రాసినంత బాగా తెలుగులో రాయలేను" అనీ అన్నాడు")

పంతుళ్ళు, అధికారులు - ఇంగ్లీషులో చదువు చెప్పడం కోసం సీబీయెస్యీ మొదలెట్టారండి. పంతుళ్ళకు, అధికారులకు అది కొరుకుడుబడలేదు, తిరిగి రాష్ట్ర సిలబస్సుకు రావాలని అడుగుతున్నారు. అంచేత ఇంగ్లీషు మీడియమ్ అయినా పర్లేదని అనుకుంటున్నట్టున్నారు. ఎవడి బాధలు వాడివి.

ఇలాంటి అభిప్రాయాల సేకరణలో భాషానిపుణులను, తెలుగు సంఘాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని మనం గోలెట్టాలి.
------------------------------------------------------------------------------------
అభిప్రాయం ౨
.......................

గత సంవత్సరం వీళ్ళు బలవంతంగా ఇంగ్లీషు మీడియమ్ లో కుక్కిన పిల్లల్లో సగం మంది "మాకోద్దీ ఇంగ్లీషు మీడియమ్ బాబో" అని ఈ సంవత్సరం నుంచి మళ్ళీ తెలుగుమీడియమ్ లోనే పోయి కూర్చుంటున్నారు. అది చూశైనా ఇంకా ఈ తల్లిదండ్రులకీ, ఈ అధికారులకీ, ఈ పంతుళ్ళకీ బుద్ధి రాకపోవడం విచారకరం. "అయినా సరే ఇంగ్లీషే కావా"లని చెప్పిన పంతుళ్ళ సంఖ్య అత్యల్పం. కానీ ఈనాడు వాళ్ళ అభిప్రాయాల్నే ఉద్ద్యోతిస్తున్నది చూడండి. లోపం ఎక్కడుందంటే మనవాళ్ళు భాషని సమాజంతో సంబంధం లేని ఒక ఐకాంతిక స్వమూర్తి (stand-alone entity) గా చూడ్డం దగ్గఱ. నేర్పితే వచ్చేస్తుందనుకుంటున్నారు. చుట్టూ ఉన్న సమాజంతో సంబంధం లేని భాషని కృత్రిమంగా అభివృద్ధి చెయ్యగలమనుకోవడం మూఢవిశ్వాసమని తెలుసుకోలేకపోతున్నారు. ఇంతమందికి ఇంగ్లీషు నేర్పాక ఆ తరువాత వాళ్ళేం చెయ్యాలో, వాళ్ళచేత ఏం చేయించాలో ఐడియా లేనివాళ్ళంతా ఇంగ్లీషు మీడియమ్ ని సమర్థిస్తున్నారు.

ముందు మన తెలుగువాళ్ళలో భాష గుఱించిన ఈ విధమైన దురభిప్రాయాల్ని పోగొట్టడానికి తెలుగభిమానులైన మేధావులంతా తలో వ్యాసమూ రాసి ఒక పుస్తకంగా విడుదల చెయ్యాలని నాకనిపిస్తుంది. ఆలోచన బావుందని మీరంటే ఈరోజే కార్యరంగంలోకి దిగుదాం. నావంతుగా నేను కొన్ని వ్యాసాలు రాయడానికి సిద్ధం. ముందు దీన్ని పి.డి.ఎఫ్. పుస్తకంగా అంతర్జాలంలో విడుదల చేసి తరువాత ప్రజాస్పందనని బట్టి ముద్రించి అమ్ముదాం.
-----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౩

అయిలయ్య చెప్పినమాటలు నేను సరిగ్గా రాయలేదు. తిరగ రాస్తున్నాను:

(అయిలయ్య ఇంకోమాటన్నాడు.. గిరిజన పిల్లలకు తెలుగు కంటే ఇంగ్లీషే బాగా వస్తున్నదంట. వాళ్ళు తెలుగులో తప్పుతున్నారంట, ఇంగ్లీషులో ప్యాసవుతున్నారంట. ఇంకా ఇలా అన్నాడు: "నేను చిన్నప్పటి నుంచీ తెలుగులో చదూకున్నాను, కానీ ఇప్పుడు ఇంగ్లీషులో రాసినంత బాగా తెలుగులో రాయలేను" )
------------------------------------------------------------------------------------
అభిప్రాయం ౪

ఇంతకీ ఎవరండీ ఈ అయిలయ్య? నాకు అర్థం కాలేదు.

* * *

తప్పదు. "అసలు భాష అన్నది పుట్టిందే మన అభిప్రాయాలూ ఆలోచనలూ వేఱేవారికి చేఱవెయ్యడం కోసం, కాబట్టి తెలుగు భాష ఉంటే ఎంత లేకపోతే ఎంత?" వంటి దరిద్రపుగొట్టు ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉండాలండీ ఆ వ్యాసాలలో.

----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౫
రాష్ట్ర జనాభాలో పూర్తిగా మూడు శాతం కూడా లేని నాన్-తెలుగు గిరిజనుల పేరు చెప్పి తెలుగుని తొక్కేయ్యాలని చూడ్డం, ఉర్దూ ముస్లిముల పేరు చెప్పి తొక్కెయ్యాలని చూడ్డం, లేకపోతే రాష్ట్ర సరిహద్దుల్లో నివసించే తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా గట్రా మైనారిటీ సమూహాల్ని చూపించి తొక్కేయాలని చూడ్డం, భాగ్యనగరానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూండే ఉత్తర భారతీయుల్ని చూపించి "అదిగో వాళ్ళొద్దంటున్నా"రని చెప్పి తొక్కెయ్యాలని చూడ్డం - ఈ కుట్రలన్నీ మనకిదివఱకే తెలుసు. ఈ వాదాలు చేసేవాళ్ళంతా రాష్ట్రంలో 92 శాతం మంది ఉన్న మెజారిటీ తెలుగువాళ్ళ భాషాహక్కుల గుఱించి మౌనం వహిస్తారు. వాటిని చాలా కన్వీనియంట్ గా మర్చిపోతారు. మనల్ని కూడా మర్చిపొమ్మంటారు.
---------------------------------------------------------------------------------
అభిప్రాయం ౬

ఇలా తెలుగు అక్కఱలేదు అనుకునేవాళ్లని అందఱినీ, ఏదో సినీమాలో చూపించినట్టుగా, గోనెసంచీలలో కట్టిపారేసి అప్రాచ్యదేశాలకి పార్శిల్ చేశేయాలండీ. అప్పుడు కానీ కుదరదు వీళ్ల తిక్క.
------------------------------------------------------------------------------------అభిప్రాయం ౮

హ్హ హ్హ హ్హ ఇంగ్లీషులో చదివితే ప్యాసవుతున్నారా? ఇంగ్లీషులో వాళ్ళు ఎంతమటుకు రాస్తారో, వాళ్ళ పరీక్ష పేపర్లు దిద్దే టీచర్లను అడగమని చెప్పండి.

పదవతరగతి వరకు తెలుగుమీడియంలో చదివి, ఇంటరులో ఇంగ్లీషు మీడియం చేరగానే, మనవాళ్ళకు 900 పైగా మార్కులు వస్తున్నాయంటే కారణం అది ఆంగ్ల గొప్పతనం కాదు. పరీక్ష పేపర్లు దిద్దేవాడి మహత్మ్యం. ఒక్కసారి పరీక్ష పేపర్లు దిద్దేవాడు, జవాబు పత్రంలో ఏం రాశాడో చూసి పేపరు దిద్దితే, మన రాష్ట్రంలో ఒక్కడు కూడా ఇంగ్లీషు మీడియం తీసుకోడు ఇంటరులో.

జవాబు పత్రంలో సగానికి పైగా కహానీలే ఉంటాయి. లేదా పరీక్ష పేపరునే అటు తిప్పి ఇటు తిప్పి రాస్తారు. అదే తెలుగు మీడియం వానికి ఆ అవకాశం ఉండదు.

పేపర్లు దిద్దేవాడికి మాత్రం డబ్బులు కావాలి అంతే. ఎన్ని ఎక్కువ పేపర్లు దిద్దితే అన్ని ఎక్కువ డబ్బులు.

----------------------------------------------------------------------
అభిప్రాయం ౯

"భాష ఉంటే ఎంత ? పోతే ఎంత ?" అని అడిగితే నేను కూడా "మిగతావి ఉంటే ఉంటే ఎంత పోతే ఎంత ?" అని అడుగుతాను. సమాధానం చెప్పమనండి. ఏం ? అడక్కూడదా ?

మానవహక్కులు ఉంటే ఎంత ? పోతే ఎంత ?
ఇండియా ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?
స్త్రీల హక్కులు ఉంటే ఎంత పోతే ఎంత ?
ఎస్సీలు ఎస్టీలూ ఉంటే ఎంత ? పోతే ఎంత ?
దేశాలు ఉంటే ఎవడిక్కావాలి ? లేకపోతే ఎవడిక్కావాలి ?
ప్రజాస్వామ్యం ఉంటే ఎవడిక్కావాలి ? లేకపోతే ఎవడిక్కావాలి ?
నేరాలు పెరిగితే ఏంటి ? పెరక్కపోతే ఏంటీ ?

భాష కేవలం పరస్పర వ్యక్తీకరణకే అయితే మఱి ఇంగ్లీషు కాకుండా ఏ భాషయినా పనికొస్తుందిగా ? బళ్ళలో ఇంగ్లీషే ఎందుకట ? తెలుగు ఎందుకు ఉండకూడదట ?

సరే, భాష పరస్పర వ్యక్తీకరణకే. బావుంది. మఱి ఆకలి కూడా ఏ పదార్థంతో నయినా తీర్చుకోవచ్చు కదా ? ఏది పడితే అది ఎందుకు తినడంలేదట జనం ? కామం భార్యతోనే ఎందుకు తీర్చుకోవాలి ? తల్లితో ఎందుకు తీర్చుకోకూడదు ? ఆఫ్టరాల్ ఈ తల్లి భార్య అనేవి కేవలం భాషే తప్ప కామానికి అవేమీ తెలియవుగా ?

ఇదొక పిచ్చివాగుడు. ఇది reasoning కాదు. Anti-reason. దాన్నొక reasoning లా చేసి చూపించడానికి ఆంగ్లభాషాభిమానులు కిందామీదా పడ్దం చూస్తూంటే నవ్వొస్తోంది. ఇలా మాట్లాడేవాళ్ళంతా నిజానికి తెలుగు భాషాభిమానులు వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఓడిపోయామని అనిపించుకోవడం ఇష్టం లేక, ఇలా మూలచ్చేద వాదానికి దిగుతారు. మూలచ్ఛేదవాదమంటే అసలు చర్చిస్తున్న విషయానికే విలువ తీసేయాలని అసలది చర్చనీయాంశమే కాదనీ నిరూపించడానికి పూనుకోవడం. ఇదొక రకం అవతలివాడి నోరు మూసే వ్యూహం. కొట్టి, చంపి ప్రతివాదుల్ని ఖతమ్ చెయ్యాలని చూడ్డం కంటే భిన్నం కాదు.

-------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౦

అణచివేతక్కూడా ఒక హద్దుంది. ఇక్కడ ఈ రాష్టంలో తెలుగుని పనిగట్టుకొని అణచివేస్తున్న విధానం అలాంటి అన్ని హద్దుల్నీ అధిగమిచింది. సరిగ్గా ఇలాంటి క్రూరమైన అణచివేతల్లోంచి పుడతారు భావి నియంతలూ, కర్కోటకులూ ! ఎక్కడ ఇలా అణచివేత పెచ్చుమీఱుతుందో అక్కడ తప్పకుండా ఒక నిరంకుశుడు ఆవిర్భవిస్తాడు. వాడు దయాదాక్షిణ్య రహితుడై ఉంటాడు. ఈ రోజు తెలుగుని అణచివేస్తున్నామని ముఱిసిపోవడం కాదు. ఈ రాష్ట్రంలో భవిష్యత్ సంవత్సరాల్లో భాషోన్మాదులైన నాయకులు అధికారాన్ని చేపట్టితే ఏం జఱుగుతుందో అది ఎవఱికి వారు ఊహించుకోవచ్చు. అప్పుడు ఇంగ్లీషు ఎదుర్కునే అణచివేత తెలుక్కి పదిరెట్లుగా ఉండొచ్చు. బహుశా ఆ దెబ్బకి ఇంగ్లీషు ఈ గడ్డమీదినుంచి శాశ్వతంగా అదృశ్యమైపోవచ్చు.

----------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౨

ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు పుట్టడానికి కారణం ప్రస్తుతపుటుద్యోగాలకి తెలుగుతోకంటే అప్రాచ్యభాషలతో ఉన్న అవసరం సామీప్యం ఎక్కువ అవ్వడం వలన అని నాకు గట్టిగా అనిపిస్తుందండీ.
ఆంధ్రభాషోన్మాది ఏలే రోజు నిజంగా రావలసిన పరిస్థితి వచ్చేలాగే ఉంది, చూడబోతే.
-----------------------------------------------------------------------
అభిప్రాయం ౧౩

మనకి ఎక్కడ గుచ్చుకుంటోందో సరిగ్గా గ్రహించారు. కానీ ఎందుకలా గుచ్చుకుంటోందని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సి ఉంది. ఇతర దేశాల భాషలకి అడక్కుండానే రక్షణ లభించడానికీ, మన భాషకి నోరు తెఱిచి అడిగినా రక్షణ కఱువవ్వడానికీ మధ్య ఎక్కడ వ్యత్యాసం ఉందనేది ఆలోచించాలి. నా పరిశీలనలో--

౧. మన తెలుగు ఏ దేశానికీ గుర్తింపు పొందిన ఏకైక జాతీయభాష (recognized official language) కాకపోవడం ఒక పెద్ద కారణం. నిజానికి ఇదే అసలుకారణం కూడాను. ఇది ఒకానొక దేశంలో ఒక మూలన ఆంధ్రప్రదేశ్ అనే ఒక subordinate province యొక్క భాషగానే ఉండడం. ( ఈ province ఎంత పెద్దదనేది అనవసరం. ఆధికారికంగా ఇదొక province. అంతే!) నేపాలీ, బర్మీసు, సింహళీ, థాయ్ లాంటివి తెలుగు కంటె అన్నివిధాలా చిన్నాచితక భాషలయినప్పటికీ అవి తమ తమ దేశాల యొక్క జాతీయభాషలూ, అధికారభాషలు కూడా ! అవి ఆయా ప్రభుత్వాల చేత రాజ్యాంగబద్ధంగా రక్షితమైన భాషలు(languages protected by the national constitution) అందుచేత తెలుగు ఎదుర్కుంటున్న ఘోరమైన మనుగడ సమస్యని అవి ఎదుర్కోవడంలేదు. ఆ సంగతి కప్పిపుచ్చి ఈ రాష్టంలోని మేధావులు తెలుగు ఇలా నశించిపోవడం ఒక సహజమైన చారిత్రిక పరిణామం లాగాను, అది నశించకపోతే మన ఆధునీకరణకి అర్థం లేనట్లూ మాట్లాడ్డం నేర్చుకున్నారు.

౨.ఇతరదేశాల్లోని ఉద్యోగాలు ఆయా దేశాలవారికే పరిమితం. కానీ భారతీయ రాష్ట్రాలలోని ఉద్యోగాలు ఆయా రాష్టాలవారికి పరిమితం కాదు. అలా పరిమితం చేసుంటే, మన భాషలు హాయిగా బతకగలిగి ఉండేవి. కానీ అలా చెయ్యకపోవడాన ఈ రాష్ట్రంవారు పోయి ఆ రాష్టంవారి ఉద్యోగాల్ని హరించి వాటిల్లో తాము తిష్ఠ వేస్తారు. తత్ఫలితంగా వారూ ఇక్కడికొచ్చి మన పట్ల అదే చేస్తారు. ఇలా మనుషులు తమకి సంబంధం లేనిచోట్లకి వెళ్ళి వాళ్ళ ఆర్థిక అవకాశాల్ని దోచాలంటే అందుకు సహకరించే భాష ఒకటి కావాలి. అదే ఇంగ్లీషు. ఇది పరస్పర దోపిడీ వల్ల జఱుగుతున్నదని గ్రహించకుండా "ఇంగ్లీషు లేకపోతే రాష్ట్రం బయట ఉద్యోగాలు ఎలా సంపాదిస్తాం ?" అి అమాయకంగా ప్రశ్నిస్తారు. మనమూ అదే అనుకుంటాం. "బయటివాళ్ళని రానివ్వకపోతే, వాళ్లు మనల్ని రానివ్వరు కదా !" అని ! వాస్తవంలో మనమూ వాళ్లు చేసేది, పరస్పర భాషాహక్కుల్ని హరించేసుకోవడం. అందఱమూ కలిసి ఇంగ్లీషుని సింహాసనమెక్కించడం.

ఏ రాష్ట్రంవారు ఆ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునేట్లయితే, వారి ఉద్యోగావకాశాల్ని బయటివాళ్ళొచ్చి హరించకపోతే అప్పుడు ఇంగ్లీషు మీడియంతో అవసరమేముంది ? అప్పుడు ఇంజనీరింగు, మెడిసిన్ కూడా మనం తెలుగులోనే చదువుకుంటాం. ఉన్న ఉద్యోగావకాశాలతోనే తృప్తిపడతాం. తృప్తిపడనివాడు ప్రైవేట్ గా కోచింగ్ తీసుకొని ఇంగ్లీషు నేర్చుకొని బయటికి పోతాడు. కానీ బహుకొద్దిమందే ఉన్న అలాంటివాళ్ళకోసం ఈ ప్రభుత్వం అందఱి నెత్తినా బలవంతంగా ఇంగ్లీషుని - అదీ పాలుతాగే పసివయసు నుంచి రుద్దాలనుకోవడం, ఇక్కడ ఏ కొత్త ఉద్యోగావకాశాలూ కల్పించకుండా తన బాధ్యతని గాలికొదిలేసి అందఱినీ పొట్టపట్టుకొని బయటికి పొమ్మనడం, అందుకోసం ఇంగ్లీషు నేర్చుకోండని బలవంతం చెయ్యడం, సరే, అలాగని బయటికి పోతేనేమో అక్కడివాళ్లు "మా దేశానికి/ రాష్ట్రానికి ఎందుకొచ్చారు ?": అంటూ మన అంతు చూడ్డానికి ప్రయత్నించడం - ఏమిటిదంతా ? దీకికి అంతు ఎక్కడ ? ఎప్పుడు ?

౩. ఇప్పటి ఇంగ్లీషు వ్యామోహానికి అసలు కారణం - రాష్ట్రం యొక్క వాస్తవిక ప్రొఫెషనల్ అవసరాలతోను, అసలు ఉన్న ఇంజనీరింగ్ ఉద్యోగఖాళీల యొక్క మొత్తం సంఖ్యతోను నిమిత్తం లేకుండా ప్రతిభాప్రమాణాలతో సంబంధం లేకుండా కట్నార్థులకోసం, వలసదారుల కోసం ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు తెఱిచేసి సీట్ల సంఖ్య పెంచేయడం. దానివల్లా ఆ కోర్స్ చదివినవాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేక విదేశాల కెగబడ్డం. ఆ విదేశాలకోసం ఇంగ్లీషు. ఇదీ వరస. అసలు ఇంజనీరింగ్ లో ప్రవేశమే కష్టం చేసెయ్యాలి. సగం ఇంజనీరింగ్ కాలేజిలు మూసెయ్యాలి. సీట్లు తగ్గించాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులోని వార్షిక పరీక్షల్ని కూడా కష్టం చేసెయ్యాలి. సబ్జెక్టులూ, సిలబస్సు, కోర్స్ కాలావధి (సంవత్సరాలు) పెంచాలి. అదే సమయంలో పక్క రాష్ట్రాల్లోను, ఇతరదేశాల్లోను చదివిన ప్రొఫెషనల్ కోర్సుల్ని డీరికగ్నయిజ్ చెయ్యాలి. అప్పుడు వలసపోయి ఇంగ్లీష్ మీడియమ్ లో ఇంజనీరింగ్ చదివి ఇక్కడకొచ్చి షాన్లు కొట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడ ఫీజు కట్టి చదువుకున్నవాళ్ళ కోసమే. అలా ఎవడు పడితే వాడల్లా ఇంజనీరు కాజాలని విధంగా వ్యవస్థని బిగించాలి. ఆ తరువాత ఇంజనీరింగ్ ని తెలుగుమీడియమ్ లోకి మార్చినా అందులో చదువుకున్న ప్రతివాడికీ ఉద్యోగం చూపించడం సులభమవుతుంది కనుక అలా దాన్ని. మార్చెయ్యడం కూడా సులభమవుతుంది. ఎవరూ అభ్యంతరపెట్టరు. మెడిసిన్ కైనా ఇదే మంత్రం. అదే సమయంలో బీయెస్సీవాళ్ళ ఉద్యోగావకాశాల్ని బాగా హెచ్చించి జనం ఊరికే ఇంజనీరింగ్ అని ఎగబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిరకాల ఉద్యోగాల్ని కేవలం బీయెస్సీలకి ప్రత్యేకిస్తూ జీవో జారీచెయ్యాలి.
--------------------------------------------------------------------------------
అభిప్రాయం ౧౪

తెలుగే కాక చాలా భారతీయభాషలు (మన రాజ్యాంగంలో మనం గుర్తించి, మన మారకంపై ముద్రించుకుంటున్న భాషలు) కూడా వేఱే జాతీయభాషలు కానివి ఉన్నాయి కదండీ! వాటి పరిస్థితి కూడా ఇంతేనా? అసలు నా అనుమానం, హిందీ కూడా తెలుగులాగానే తత్సదృశమైన ఇబ్బందులని ఎదుర్కుంటోందని! తెలుగైతే కాస్త ఎక్కువ ఇబ్బంది పడుతోంది, ఆ ఇబ్బంది మనకి ప్రత్యక్షంగా తెలుస్తోంది కూడాను.

ఆహా! ఏ ముహూర్తంలో ప్రవేశించిందో కానీ ఈ అప్రాచ్యభాషావ్యామోహం, చాలామంది బుఱ్ఱలని ఇంకా దొలిచేస్తూనే ఉంది కదండీ!

పూర్వకాలంలో కూడా ఒక రాజ్యాన్నించి మఱొక రాజ్యానికి వెళ్లి ఉద్యోగాలు చేసినవారు ఉండే ఉంటారు. అప్పుడు అందఱికీ మాధ్యమంగా సంస్కృతమో ప్రాకృతమో నడిచేదనుకుంటాను. లేదా ప్రాంతీయభాష నేర్చేవారనుకుంటాను. కానీ ఇప్పుడు ఆ ఆ భాషలని పూర్తిగా వదలివేసి, ఇలా మన దేశంలో పుట్టని మఱొక భాషలోకి మారిపోయామంటే కారణం వేఱే రాజ్యాలలో ఉద్యోగాలు వెతుక్కోవడం అనడం కంటే, వేఱే రాజ్యాలలో ఉద్యోగాలు సైతం అలాంటి భాషతో ముడిపెట్టబడడం అనడం సబబేమోనండీ. నిజంగా మనం పరస్పర భాషాహక్కులని నశింపజేసేసుకున్నాం, ...కుంటున్నాం కూడాను.

ఒక రకంగా చూస్తే, వేఱే ప్రాంతానికి చెందిన మఱొక భారతీయ భాషతో సంపర్కం వలన కొన్ని క్రొత్త ప్రయోగాలూ క్రొత్త పదాలూ ఒక భాషలోకి చేరిన దృష్టాంతాలు లేకపోలేదు. మఱీ పోయి పోయి ఆంగ్లంతో కలవడం కంటే, సంస్కృతి పరంగా దగ్గఱ పోలికలున్న రెండు ప్రాంతాల భాషల కలయిక ఆహ్వానించదగ్గదే కదా. పైగా ఆ రెండు భాషలూ పోలికలు ఉన్నవే ఐతే, ఇక ఆ భాషలు భలే సంపన్నమౌతాయి కూడాను.

అసలు ఇంగ్లీషు ఎప్పుడు ఈ మధ్యలో దూరిందీ అంటే... అది అందఱికీ తెలిసిన చిదంబర రహస్యమే. కానీ ఇప్పటికీ మనం ఎందుకు దానినుండి బయటపడలేకపోతున్నామూ అన్నదే ప్రశ్న!

సాక్షి వ్యాసాలలో మొదటి సంపుటంలోనే మొదటి పది వ్యాసాలలో వస్తుందనుకుంటాను ఈ ప్రాంతీయభాషల గుఱించి జంఘాలశాస్త్రి పడే ఆవేదన. నాకు అదే గుర్తుకు వస్తోందండీ ఇప్పుడూ.

అసలు మనం మన దేశానికే బోలెడన్ని అవసరాలు ఉన్నాయనీ, మన దేశంలోనే కావలసినంతమంది వినియోగదారులూ ఉన్నారనీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడు ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఈ ఎగబడడం తగ్గుతుంది, ప్రాంతీయభాషల అభివృద్ధికి ఆటంకమూ ఉండదు.

శ్రేష్ఠులైన మన భారతీయ శ్రేష్ఠివర్గానికి చేయూత నిద్దాం ! విదేశీ వ్యాపార కుట్రల్ని ఛేదిద్దాం !

హిందూసమాజం అంటే వెంటనే ప్రతిఒక్కరికీ గుర్తొచ్చేది అందులోని కులవ్యవస్థ. అది ఏర్పడేందుకు గల కారణాలు, తర్వాత కాలక్రమంలో వ్యవస్థను స్థిరీకరింపచేసి సమాజంలో బాధ్యతలను పంచుకోవటంలో దానిపాత్ర. అలానే కలిప్రభావంతో ఇప్పుడు ఎదుర్కుంటున్న అపనిందలు హిందూధర్మం పట్ల నమ్మకం ఉన్నవారికి, తటస్థులకు అలానే కలి‌అంశలకు సైతం తెలుసు.(కాకపోతే వాళ్లు తెలిసినా అడ్డంగా వాదించుకుని మురిసిపోతారు అంతే.)

ఈ వ్యవస్థలో మనకు ముందుగా గుర్తొచ్చేది బ్రాహ్మణులు- వీరికి సమాజంలో పెద్దన్న పాత్ర. గౌరవ మర్యాదలతో పాటు విపత్కాలంలో సమాజానికి దిశానిర్దేశం చెయ్యాల్సిన బాధ్యత అప్పగించారు. పురాణాల్లోని కథల్లోనే కాదు చరిత్రలోనూ, ఇటీవలి స్వాతంత్ర్యసంగ్రామంలోనూ ఇంకా అనేక సందర్భాల్లో తమ బాధ్యతలను ప్రశంసనీయంగా నిర్వర్తించారు. అయితే ప్రస్తుతం? కనీసం సంధ్యావందనంచేసే అలవాటున్నవారెందరు ? మన హిందూ దేవుళ్లపై చెణుకులూ, చెమక్కులు అవాకులూ, చెవాకులు విసరడం మొదలెట్టింది కొద్దిమంది అల్పవిశ్వాసులైన బ్రాహ్మణ మేధావులే. ఆ తర్వాతే బయటివారికి హిందూధర్మంపై వేలెత్తే ధైర్యం వచ్చింది.

తరువాత క్షత్రియులు- గోబ్రాహ్మణ రక్షణ, థర్మాన్ని నాలుగుపాదాలా నిలపడం, దేవతలకు తనరాజ్యంలోని ప్రజలకు మద్య వారథి. యవనులు తదితర ముష్కర మూకలవల్ల ముందునష్టపోయింది వీళ్లే. అంతర్గత కలహాలు, వెన్నుపోట్లతో మ్మొదలైన వీరి పతనం హిందూజాతికి ఎనలేని నష్టం కలుగజేసింది. తమకోసం ముందుండి పోరాడే నాయకుడు అంగార్థబలాలు కోల్పోయి అచేతనంగా పడి ఉంటే మూగగా రోదిస్తోంది హిందూత్వం.

ఇక శూద్రుల విషయానికి వస్తే వీరికి దైవభక్తి మెండు. కానీ ధర్మసిధ్థాంతాలలోని సూక్ష్మాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవారు అతికొద్దిమంది. అలాగే హిందూత్వంపై జరుగుతున్న వ్యూహాత్మక దాడిని అర్థంచేసుకునేంతగా వారికి పరిజ్ఞానం లేదు. ఊరిలో ఉన్న పురోహితుడు లేదా వ్యక్తిగతంగా గురి ఏర్పడిన ఎవరో ఒక పెద్దమనిషి చెప్పిన మాటను విని అనుసరించటం ఒక్కటే వీరికి తెలిసింది. వీరి ఆర్థిక, సామాజిక స్థితిగతులు సమాజంలో సైద్ధాంతిక ప్రమేయాన్ని అడ్డుకున్నాయి.

మిగిలినది వైశ్యులు. హిందూ ఆచారాలపై విశ్వాసాలు లేనివారిని మీరే కులంలోనైనా చూడొచ్చు గానీ వీరిలో చాలా అరుదు. (బహుశా ఉండకపోవచ్చు) గ్రామంలో గానీ పట్టణాల్లో గానీ వీరి ప్రమేయంలేకుండా ఉత్సవాలు (వినాయకచవితి, రామనవమి వంటివి) జరుగడం అరుదు.. దాదాపూ అన్ని హైందవ సంస్థలకూ ఆర్థికసహాయం చేయడంలో వీరే ఎక్కువ. వీరిచే నడిపే వాసవి అన్నదాన సత్రాలు దాదాపూ ఒక మోస్తరు పట్టణాలు ప్రతిచోటా ఉంటాయి. కళ్యాణ మండపాలు ఈరోజుల్లో వ్యాపారం అయిపోయాయి. కానీ అది ఒక సమాజసేవగా భావించబడిన రోజుల్లో ముప్పాతికభాగం నిర్మించినది వాళ్లే. వాటిలో కొన్ని వ్యాపారదృక్పదంతో నిర్వహిస్తున్నా ఇప్పటికీ ఎన్నో ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు లాభాపేక్షలేకుండా నడుస్తున్నాయి. ఏదైనా గుడికెళ్ళి దాన్ని కట్టినప్పుడు సాయంచేసిన దాతలపేర్లు చూడండి. వైశ్యుల పేరు కనపడని గుడి ఉండదు.

ఇన్ని చేస్తున్నా వైశ్యుడెప్పుడూ పదిమందిలో సిద్ధాంతాలపై రాద్ధాంతంచేయడు. తాను చేయదల్చుకున్న సహాయాన్ని గుట్టుచప్పుడుకాకుండా చేస్తారు. అలా గుప్తదానాలు ఇచ్చిన శెట్టిగార్లు ఎందరో ఉన్నారు. విశ్వహిందూపరిషత్ వంటి హైందవ సంస్థలకి, ఇస్కాన్ వంటి ధార్మిక సంస్థలకి, కంచిమఠాల వంటి వాటికి ఆర్థిక సహాయాన్ని అందించేవారు వారిలో మెండు.

అంతెందుకు, ఇటీవలి సంఘటన- దేవాదాయ ధర్మాదాయ శాఖ పాల్పడుతున్న అధర్మాలు అందరికీ తెలిసినవే. ఒక మాజీ ప్రభుత్వాధినేత చేసిన దారుణాలకు అందరూ కలవరపడుతూండగా వైశ్యులు గుట్టుచప్పుడు కాకుండా తమ ధర్మం తాము చేశారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానాలకు, అనుబంధ అన్నదాన సంఘాలకు మరియు కళ్యాణమండపాలకు స్వయంప్రతిపత్తి విషయమై ఒక జీఓ కొన్నినెలల కిందట విడుదలైంది. ఇప్పుడు ఉన్నరాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతగా ఉంటూ హిందూ అనుకూల కార్యక్రమాలు చెయ్యడం ఎంత కష్టమో మనకి తెలియందికాదు. పైన 'ఆ యమ్మ' ఎన్ని ఆంక్షలు పెడుతున్నా కంచిపీఠానికి వైద్యకళాశాల కేటాయించడం ఎంతకష్టమైన పని. ఆయన ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. పూర్తిస్థాయి హిందూవ్యతిరేక కార్యక్రమాలకు ఒక బృహత్‌ప్రణాళిక రచించి దాన్ని తు.చ. తప్పక అమలు పరుస్తున్న పార్టీలో ఉంటూ ఇలాంటి పని చెయ్యడం పదవికేకాదు ప్రాణాలకు కూడా ప్రమాదం.

అలాంటి శ్రేష్టులపై ఇప్పుడు వ్యూహాత్మకదాడికి పథకం తయారయ్యింది.

ఇన్ని శతాబ్దాలుగా భరతఖండపు వర్తక వాణిజ్యాలకు ప్రతినిథులుగా ఉంటున్న వీరిని దెబ్బతీయడం ద్వారా హిందూసమాజపు వెన్నెముకను విరగ్గొట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యి దశాబ్దం అయ్యింది.ఈస్ట్ ఇండియా కంపెనీకంటే కూడా దుర్మార్గపు పోకడలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది వారి రిటైల్ వ్యాపారం. ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టినప్పుడు ఈ రంగాన్ని మినహాయించింది. ఇది మన స్వావలంబనకు అత్యంత ప్రధానం.

ఇక్కడ ఇతరులను ప్రవేశపెట్టేందుకు వాళ్లు చెబుతున్న కుంటిసాకులు అన్నీ తాత్కాలిక ప్రయోజనాలే. నాణ్యత, పన్నుకట్టడం, సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ పోటీలో నిలబడడం ఇలాంటివి. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీలు ఇదే స్థాయి నాణ్యతను కొనసాగిస్తాయి అన్న నమ్మకముందా? వాళ్లు కొనసాగిస్తాం అన్నా మన నాయకులు ఒప్పుకుంటారా? ఇక్కడివాళ్లకి చేసేందుకు పనిలేకుండా చేసి ఆ వచ్చే పన్నుతో ఎవరిని ఉధ్ధరిద్దాం అని? అంతర్జాతీయ పోటీ ఉండాల్సిన రంగమా కిరాణా కొట్లు ?

కాబట్టి హిందూసోదరులారా ! మన వైశ్యసోదరులకు నైతికమద్దతునివ్వండి. వారితో సంబందాలు పెంచుకోండి. వారితో వ్యక్తిగతంగా కొంతకాలం మసలండి. వారిలోని నీతినియమాలు మీకే తెలుస్తాయి. మిగతా వర్గాలతో పోలిస్తే దురలవాట్లు వీరిలో చాలాతక్కువ. ఆర్థిక లావాదేవీల్లో సైతం మీరు నిబద్దతను పాటించినంతకాలం వారు కోపించరు. వారిచే నడుపబడుతున్న అంగళ్లలోనే లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించండి. మీకు ఇప్పుడు వారిలో కొన్ని అల్పదోషాలు కనిపిస్తుండవచ్చు. కానీ ప్రపంచంలో వ్యాపారాలు చేసే ఏ వర్గంతో పోల్చి చూసినా వీళ్లు ఎన్నోరెట్లు నయం. చేతిలో డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి వారు ఎంత అభద్రతాభావాన్ని పొందుతుంటారో షేర్లలో పెట్టే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అలాంటిది, వాళ్లు జీవితాంతం అదే ఒత్తిడిలో ఉంటారు.

4, నవంబర్ 2009, బుధవారం

పోయింది అదుపు, వచ్చింది కడుపు - పాశ్చాత్యమా ! నీకు జోహార్లు !!

బళ్ళలో లైంగికవిద్య, బయట టీవీలూ, సినిమాలూ, ఇంటర్నెట్టు, బాయ్ ఫ్రెండ్లూ, చేతినిండా డబ్బు, విడాకుల పుణ్యమా అని తండ్రి అదుపాజ్ఞలంటే ఏంటో తెలియని బాల్యం, గాలిలో వైరస్సుల మాదిరి అలవోకగా తేలుతూ ముక్కుపుటాలకి తాకే స్వేచ్ఛాసమానత్వ సిద్ధాంతాలు, పిల్లల్ని అదుపులో పెట్టడం చేతకాని సింగిల్ తల్లులూ, పిల్లల్ని ఏమీ అనకూడదంటూ ప్రభుత్వం చేసిన చట్టాలు - వెఱసి అందఱికీ ఉచితంగా కడుపులు. ఇదీ ఈనాటి అమెరికా సాంఘికస్వరూపం. ఈ క్రింది దృశ్యకాన్ని (video) కనులారా తిలకించి తరించండి.

http://cbs2chicago.com/video/?id=63710@wbbm.dayport.com


ఇది ఇంతటితో ఆగిపోతే బావుణ్ణు. కానీ అనుకున్నామని జఱగవు అన్నీ, అనుకోలేదని అగవు కొన్ని. ఇలా కౌమారప్రాయంలో తల్లులైనవారు ఆ తరువాత ఆ పుట్టిన పిల్లల్ని ఎవరికో దత్తత ఇచ్చేస్తారు. అటుపిమ్మట వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక పునస్సమావేశం (Re-union) అంటూ అసలు తల్లిదండ్రుల్ని చూస్తారు. వాటిల్లో అన్నీ సక్రమంగా జఱగవు. కనడమే తప్ప పెంచకపోవడం తప్ప వాళ్ళకీ ఆ ఎదిగిన పిల్లల మధ్య కొన్నిసార్లు సహజమైన parent-child సంబంధం బదులు ప్రేయసీప్రియుల సంబంధం అభివృద్ధి చెందుతున్న దృష్టాంతాలు కోకొల్లలు. ఆ నిస్సిగ్గు ముచ్చటల్ని మీరు కూడా సిగ్గుపడకుండా ఈ క్రింది సైటులో తిలకించుడీ.


http://geneticsexualattraction.com/


ఇది కేవలం ఒక సహాయక సైటు (support site) మాత్రమే. అయితే అసలా "సహాయం" ఎందుకు అవసరమైందో, దానికి ఏ సాంఘిక పరిస్థితులు కారణమో, ఏ నడమంత్రపు సిద్ధాంతాలకి వాళ్ళు బలయ్యారో కూడా ఆలోచించాల్సి ఉంది.

2, అక్టోబర్ 2009, శుక్రవారం

భగవత్ పూజావిధానము-2


పూజ ఎందుకు చెయ్యాలి ? - 1


మతాన్ని కాపాడ్డమంటే మతాన్ని ఆచరించడమే. ఎవరూ మాట్లాడని భాష ఏ విధంగా నైతే మృతభాష కింద లెక్కో అదే విధంగా ఎవరూ ఆచరించని మతం, ఎవరికీ బోధపడని మతం కూడా మృతమతం కిందనే లెక్క. ఆ మతానికి ఎంత చరిత్రయినా ఉండొచ్చు. ఎంతమందైనా ఆ మతం పేరుతో జనాభా లెక్కల్లో నమోదై ఉండొచ్చు. లేదా ఆ మతానికి సంబంధించి ఎన్ని పవిత్ర గ్రంథాలైనా గ్రంథాలయాల్లో మూలుగుతూ ఉండొచ్చు. ఏమీ లాభం లేదు. అది మృతమతమే అవుతుంది. మతంలో రకరకాలవాళ్ళని మనం చూస్తూంటాం. "ఫలానా మతస్థుల" మని చెప్పుకొని అంతటితో ఆగిపోయేవాళ్ళు కొందఱు. "మామతదేవుణ్ణి నమ్ముతా కానీ పూజలూ గట్రా ఏమీ చెయ్యను. దేవుడికి నా కష్టసుఖాలు తెలియవా ? నేను పూజ చేసి మఱీ చెప్పాలా ?" అనేవాళ్ళు కొందఱు. "ఏదో శక్తి ఉందని నమ్ముతా కానీ దేవుడంటే మా మతదేవుడిలానే ఉంటాడంటే ఎందుకో నమ్మలే"నని ఇంకొందఱు. "దేవుణ్ణి నమ్ముతా, గుళ్ళకీ, గోపురాలకీ కూడా వెళతా. కానీ మా మతం గుఱించి నాకేమీ తెలియదు." అనేవాళ్ళు కొందఱు. "దేవుడున్నాడని నమ్ముతా కానీ సంప్రదాయాల మీదా, శాస్త్రం మీదా విశ్వాసం లే" దనేవాళ్ళు ఇంకొందఱు. జాగ్రత్తగా గమనిస్తే ఈ విధమైన వాగ్ధోరణిలో నిద్రాణమైన నాస్తికత్వాన్ని, లేదా ప్రచ్ఛన్న నాస్తికత్వాన్ని, భావి నాస్తికత్వాన్ని మనం వాసన పట్టవచ్చు. మన గతానుభవాల్ని బట్టి - ఇలా మాట్లాడేవాళ్ళంతా ఏదో ఒక దురదృష్టకరమైన రోజున మతం మారే అవకాశం గానీ, నాస్తికులుగా పరిణమించే అవకాశం గానీ ఉందని ఊహించవచ్చు. ఇలాంటివాళ్ళతో నిండిపోయిన జీవన్ మతం పూర్తిగా మృతమతం కాకపోయినా జీవన్ మృతమతం అనీ, మ్రియమాణ మతం (dying faith) అనీ చెప్పుకోవచ్చు.

క్రమం తప్పని అనునిత్య, దైనందిన భగవత్ పూజ ఆచరణాత్మకమైన మతావలంబనకి తొలిమెట్టు. పూజ ద్వారా పైన పేర్కొన్న సందిగ్ధ జనాభాశ్రేణుల్లోంచి మనం బయటపడి నిజమైన నిజాయితీ గల మతావలంబకులుగా మారతాం. వర్తమానంలో పెక్కుమంది యౌవనులు తాము దైవభక్తులమని గానీ, రోజూ పూజ చేస్తామని గానీ, తమకి ఇతరత్రా మతవిశ్వాసాలున్నాయని గానీ చెప్పుకోవడానికి సంకోచించే వాతావరణం నెలకొని ఉంది. సామూహికంగా భజనల్లో పాల్గొని మనసారా భగవంతుడి లీలల్ని నలుగుఱిలో ఎలుగెత్తి గానం చేయడానికి, దేవుడి ముందు వినయంగా సాష్టాంగపడ్డానికీ కూడా సిగ్గుపడేవాళ్ళున్నారు. బొట్టు పెట్టుకోవడం చాదస్తమనుకునేవాళ్ళున్నారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది సినిమా హీరోల/ హీరోయిన్ ల ప్రభావం. మన సమకాలీన సినిమాలన్నీ పూర్తిగా Godless. సినిమా కథల్లో హీరోని చూపించే విధానం - అతన్నొక సూపర్ మ్యాన్ గా, స్పైడర్ మ్యాన్ గా దేవుణ్ణీ, అదృష్టాన్ని నమ్ముకోని శిలాకర్కశమైన ఆత్మవిశ్వాసం గలవాడుగా, అసలు అతనే దేవుడన్నట్లు చూపిస్తారు. కానీ అలాంటి మగవాళ్ళెవరూ ప్రపంచంలో లేరు. తన భార్యాబిడ్డలకి తప్ప మగవాడెవరికీ దేవుడు కాదు. వాస్తవ జీవితంలో అందఱమూ కమెడియన్లమే. ప్రతి మగవాడూ ప్రాథమికంగా ఒక తల్లి ఒళ్ళో బిడ్డ మాత్రమే. ఒకడికి ఒకటుంటే ఇంకొకటుండదు. జగదేకవీరుడైన అర్జునుడే 18 అక్షౌహిణుల సైన్యాన్ని చూసి బెంబేలెత్తి శ్రీకృష్ణుణ్ణి శరణుజొచ్చాడు. ప్రపంచంలోకెల్లా సాటిలేని బలశాలి (పరిగెత్తుతున్న రైళ్ళని వెనక్కి లాగేసేవాడు) అని పేరుపొందిన కీ.శే. కోడి రామమూర్తిగారు తాను చిన్నప్పట్నుంచి ఆంజనేయస్వామి భక్తుణ్ణని చెప్పుకున్నారు.

కానీ ఇందాక పేర్కొన్న ఊహాకల్పిత మేషో మగవాళ్ళు, ఈ ఎనిమిది పలకల (8-pack bodies) వికారులు, ఆధ్యాత్మిక బికారులు మన మగపిల్లలకీ, ఆడపిల్లలకీ ఆదర్శమై కూర్చున్నారు. దాన్తో దేవుణ్ణి నమ్మడం, ఆయన మీద ఆధారపడ్డం హీనమైనదనే తప్పుడు భావన సమాజంలో వ్యాపించింది. తద్విరుద్ధమైన ఆలోచనలూ, ప్రవర్తన డైనమిజమ్ గా ప్రచారంలోకి వచ్చాయి. "భగవదనుగ్రహం చేత విజయం సాధించాను, దైవకృప వల్ల జీవితంలో పైకొచ్చాను" అని మాట్లాడేవాణ్ణి అసమర్థుడుగా చూడ్డం అలవాటు చేసుకున్నారు. దైవప్రమేయం లేకుండానే జీవితాలూ, జగత్తూ ఉన్నాయనే ఘోర అజ్ఞాన భ్రమలో వీళ్ళు బతుకుతున్నారు. దైవభక్తులైన యువకులకి ఆడపిల్లల్లో సెక్స్ అప్పీల్ తగ్గిపోయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మన బ్లాగుల్లో కూడా దేవుణ్ణి నమ్మని (కనీసం అలా చెప్పుకుంటున్న) బ్లాగర్లకి ఆడవాళ్ళలో పాపులారిటీ ఎక్కువ. అయితే దేవుణ్ణి నమ్మని, ఆయనకి భయపడని, ఆయన మీద ఆధారపడని మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళకి భద్రత గుండుసున్నా అనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. ఆడవాళ్ళపై నానాటికీ పెరిగిపోతున్న దారుణ మారణ హింసాకాండలకీ, ఈ ఆధునిక తప్పుడు Godless మేషో పురుషత్వ ప్రదర్శనకీ మధ్య ఉన్న సూక్ష్మ, రహస్య సంబంధాన్ని గ్రహించలేకపోతున్నారు.

మనం పూజలు మానెయ్యడానికి గల రెండో కారణం - స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగం ద్వారా విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన కుహనా సెక్యులర్ విలువలు. సంస్కృతీ, మతమూ, దేవుడూ వేఱు కాదు. మతాన్ని బహిష్కరించడమంటే దేవుణ్ణి బహిష్కరించడమే. ప్రభుత్వాన్ని irreligious చెయ్యడమంటే దాన్ని Godless, uncultured చెయ్యడం కిందనే లెక్క. ప్రభుత్వం ద్వారా ప్రచారం చెయ్యబడ్డ ఈ సర్కారీ సిద్ధాంతం అనతికాలంలోనే ప్రైవేట్ సంస్థలకి కూడా ప్రాకింది. ఆ తరువాత ఆ ప్రైవేట్ సంస్థల్లోంచి కుటుంబాలక్కూడా ప్రాకింది. మతం ప్రైవేట్ విషయమని వాదించడం మొదలుపెట్టారు. అసలు సెక్సే ప్రైవేట్ విషయం కానప్పుడు, సెక్సు కోసం చట్టాలే ఉన్నప్పుడు, ఒకరికొకరు రాసుకుంటున్న వేగులే ప్రైవేట్ విషయం కానప్పుడు చరిత్రతో సహా అన్ని జీవితరంగాల్లోను, ఆఖరికి జాతీయతా భావనలో కూడా ముఖ్యమైన పాత్ర గల మతం ఎలా ప్రైవేట్ అవుతుందనే ప్రశ్నకి సమాధానం లేదు. మన మెజారిటీ మనస్తత్త్వ రీత్యా ఈ దేశానికి సెక్యులరిజమ్ నప్పదు. మనకి కాస్తో కూస్తో నప్పేది బహుశా సర్వమత "సమభావనే". కానీ నెహ్రూ వంటి కొద్దిమంది (మైనారిటీ) మేధావులు ప్రభుత్వం మీద గుత్తాధిపత్యం కొట్టేసి వాళ్ళ సెక్యులరిజమ్/ నాస్తిక భావనల్ని మతవిశ్వాసాలు గల మెజారిటీ మీద రుద్ది ఆ తరువాతే అదే కరెక్టని వాదించడం మొదలుపెట్టారు.

మూడో కారణం - ఇటీవలి కాలంలో హిందువులకి పట్టిన డబ్బు మేనియా.

నాలుగో కారణం - దైవభక్తి అనేది ముసలితనానికి సంబంధించినదనే అపోహ. మావాడికి ఉపనయనం చేసినప్పుడు - అనేకమంది (బ్రాహ్మలే) "అప్పుడే ఉపనయనమేంటి ? వాడికింకా వయసు ఏం మించిపోయిందని ? ఇప్పుడే పూజలూ గట్రా ఏంటి ? "అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి వాళ్ళు మాట్లాడకూడని మాటలివి. అసలు, ఉపనయనం ఆలస్యమైనందుకు మేము ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాల్సి వచ్చింది. బ్రాహ్మల పరిస్థితే ఇలా ఉంటే ఇహ మిహతా జనాభా పరిస్థితేంటి ?

నేను చెప్పేదేంటంటే - మనం నిజంగా హిందూ మతావలంబకులం కావాలంటే ఆ పనిని ముందు మనింటినుంచే మొదలుపెట్టాలి. అలా చెయ్యాలంటే మనం మన సాంప్రదాయిక వంశపారంపర్య పూజల్ని తప్పనిసరిగా ప్రతిరోజూ నిర్వర్తించి తీఱాలి. ఇందునిమిత్తం అఱవయ్యేళ్ళ సర్కారీ సిద్ధాంతాలు నూఱిపోసిన ఆత్మన్యూనతా (inferiority complex) భావాల నుంచి, సినిమాలవాళ్ళు నూఱిపోస్తున్న పిచ్చకొట్టుడు, బండలాగుడు మేషో పురుషత్వ భావనల నుంచి బయటపడాలి. మన దివ్యపిత అయిన భగవంతునికి మనల్ని మనం సవినయంగా సమర్పించుకొని సర్వశరణాగతి చెయ్యాలి. తరతరాల హిందూ సంకెలలో మనం లంకెలమనీ, మన తరువాత కూడా హిందూ తరాలనేవి ఉన్నాయని, ఉండాలని అనుకొని నిత్యపూజలు మొదలుపెట్టాలి.

ప్రతి మతావలంబకులకీ ఒక తప్పనిసరి ఆధ్యాత్మిక దినచర్య విధించబడింది. ముస్లిములు అయిదుసార్లు నమాజు చెయ్యాలి. ఇంట్లో ప్రార్థనలు చేసినా, చెయ్యకపోయినా ప్రతి క్రైస్తవుడూ ఆదివారం పూట చర్చికెళతాడు. అలాంటి దినచర్య హిందూమతంలో కూడా విధించబడినప్పటికీ హిందువుల్లో కనీసం ఒక్కశాతమైనా రోజుకొకసారైనా భగవంతుణ్ణి స్మరిస్తారో లేదో నాకు అనుమానమే. దైవభక్తి ముసలితనానికి సంబంధించినదనే అపోహే ఇందుక్కారణం. చిన్నప్పుడు లేనిది పెద్దప్పుడు హఠాత్తుగా వచ్చిపడదు. The spirit of teens sustains man for a lifetime.

మఱికొంత తరువాత....

భగవత్ పూజావిధానము-1

హిందూమతంలో ప్రార్థనలుండవు. స్తోత్రాలూ, పూజలూ, ఉపాసనలూ మాత్రమే ఉంటాయి. అయితే అలాగని ప్రార్థనల మీద హిందూమతంలో నిషేధమేమీ లేదు. కానీ మన పూర్వులు వాటిని అంతగా ఇష్టపడకపోవడానికి, కొన్ని కారణాలుండి ఉండొచ్చు. మొదటిది - మానవ ప్రార్థనలన్నీ కోరికల మయం. కానీ మోక్ష పురుషార్థం కొఱకు ఆ కోరికల్ని జయించమనే హిందూమతం చెబుతున్నది. రెండోది - ప్రార్థనలన్నీ వాక్కుల మయం. కానీ ఆత్మ/ పరమాత్మ వాక్కుల కతీతం, అవాఙ్మానస గోచరం. నిజంగా మనసు నిండినప్పుడు వాక్కులు మూగబోతాయి. కనుక వాగ్ భూయిష్ఠమైన ఉపాసన, వాగ్ భూయిష్ఠ ప్రేమలాగే సాధారణంగా ఉపరితలీయం (superficial) గా ఉంటుంది. ప్రార్థనలు చేసేవారు భగవంతుడికి చెప్పినదే చెబుతూ, మాట్లాడినదే మాట్లాడుతూ తమ మనస్సుల్ని తాత్కాలికంగా ప్రశాంతపఱచుకుంటారు తప్ప భగవత్ తత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆయన మహిమను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించరు. అంటే వారి సావధానానికి భగవంతుడు కేంద్రం కావడం మానేసి తమకు తామే కేంద్రమవుతారు. మఱికొన్నిసార్లు ఈ వాక్కర్మ మన మనస్సుల్ని మఱింత కల్లోలితం కావిస్తుందే తప్ప ప్రశాంతపఱచదు కూడా. అన్నింటి కంటే ముఖ్యమైన కారణం కూడా ఒకటి ఉండొచ్చు ననుకుంటున్నాను. అది, సంస్కృతంలో తప్ప ఇంకే భాషలో దేవుణ్ణి ప్రార్థించినా ఆ ప్రార్థనలకి మంత్రబలం ఉండదు కనుక ఆ విధమైన సాధన వృథా అవుతుందేమోననే అంతర్గత సంకోచం.

అందుచేత మనవారు మనసా, వాచా, కర్మణా భగవంతుడికి జీవాత్మను అంకితం చేసే నిమిత్తం పూజావిధానాల్ని నిర్దేశించారు. మనసులో భగవంతుడు, మాటలో మంత్రము, చేతిలో భగవత్ పూజాద్రవ్యాలు - వెరశి సర్వతోముఖ భగవత్ సాన్నిధ్య సాధనే పూజ. ఈ పూజావిధానాలు ఎప్పుడు ఎవరి ప్రోక్తంగా మొదలయ్యాయో తెలియదు. ఇవి బహుశా అనాది. యజ్ఞ-యాగాదులూ, హోమాలూ చేసేటప్పుడు కూడా హోమగుండానికి బొట్లు పెట్టి, చుట్టూ ముగ్గులేసి దీపం వెలిగించి పసుపు- కుంకుమలతోను, పూలతోను అర్చించాలనీ, నైవేద్యం సమర్పించాలనీ నియమం ఉంది కనుక ఈ పద్ధతి వేదకాలం నుంచే అనూచానంగా వస్తున్నదని తెలుస్తోంది.

అలాగే దేవుణ్ణి మానవరూపంలో ఉపాసించడం (anthropomorphic worship) కూడా వైదిక సంప్రదాయమే. వేదసూక్తాలలో ప్రతిదేవుణ్ణి, దేవతనీ విపులంగా వారి శరీర లక్షణాలతో, అలవాట్లతో సహా వర్ణించారు. కనుక కొంతమంది ధర్మద్వేషులు ప్రచారం చేసినట్లు మన వేదఋషులు క్రైస్తవుల్లా, మహ్మదీయుల్లా పూర్తి నిర్గుణోపాసకులు కారు. వారు కూడా మనలాగానే విగ్రహారాధకులే. వేదిక్ హిందూయిజమ్ (వేదిక్ రెల్జన్), పురాణిక్ హిందూయిజమ్, మాడర్న్ హిందూయిజమ్, బ్రాహ్మణిజమ్ అంటూ ధర్మద్వేషులు చేస్తున్న విభజన పూర్తిగా అశాస్త్రీయం, చరిత్రవిరుద్ధం, వాస్తవదూరం కూడా. పరిశోధకులు ఎవరి వ్యక్తిగత తిక్కల కనుగుణంగా వారు వివిధ నామాలు తగిలించినా స్వభావతః అవన్నీ ఒకటే. క్షుద్రోపాసనతో సహా ఇప్పుడున్నవన్నీ అప్పుడూ ఉన్నాయి, అప్పుడున్నవి ఇప్పుడు పూర్తిగా లేకపోయినా !

వేదాలు ఎంత ప్రాచీనమైనా, ఆ కాలం నుంచి మనం ఇప్పుడు ఎంత దూరంగా వచ్చేసినా, ఆ సూక్తాల్లో మనకు దర్శనమిచ్చే దేవతల్లో అనేకమందిని మనం ఇప్పుడు కూడా రోజూ పూజిస్తున్నాం. కనుక మన ఈనాటి పూజలన్నీ వైదికమే. ఆ గ్రహాలే ఈ గ్రహాలు. ఆ సూర్యుడే ఈ సూర్యుడు. ఆ చంద్రుడే ఈ చంద్రుడు. ఆ భూదేవే ఈ భూదేవి. ఆ గణపతే ఈ గణపతి. ఆ రుద్రుడే ఈ రుద్రుడు. ఆ ఉమాదేవే ఈ ఉమాదేవి. ఆ విష్ణువే ఈ విష్ణువు. ఆ లక్ష్మే ఈ లక్ష్మి. ఆ సరస్వతే ఈ సరస్వతి. ఆ బ్రహ్మే ఈ బ్రహ్మ. ఇహ పంచభూతాల సంగతి, దిక్పాలకుల సంగతి చెప్పనక్కఱలేదు. వేదాలు నేర్చుకునే అవకాశం పూర్వకాలంలో అధిక సంఖ్యాకులకి లేకపోయినా ఈ దేవీదేవుళ్ళని అందఱూ నమ్మేవారు కనుక, ఈ పూజలు అందఱూ చేసుకునేవారు కనుక వారు వైదికులైనట్లే లెక్క. జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు లాంటి వేదాంగాలు కూడా లక్షణంగా రక్తమాంసాలతో, జవసత్త్వాలతో బతికే ఉన్నాయి, ఇప్పటికీ వేలాది ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలల్లోను, కళాశాలల్లోను అందఱికీ శుభ్రంగా నేర్పిస్తున్నారు. కనుక వేదమతమూ, హిందూమతమూ ఒకటి కాదని వాదించే ఆధునిక ధర్మద్వేషులకి ఈ వాస్తవాల్ని వివరించి తగినట్లుగా బుద్ధి గఱపాల్సి ఉంది.

ప్రపంచంలో మానవత్వం పూర్తిగా చనిపోయినప్పుడే హిందూధర్మం కూడా చనిపోతుంది. అలా కానప్పుడు దానికి చావు లేదు. ఎందుకంటే ఈ మార్గం ప్రకృతి-ప్రసాదితమైన, మానవ సహజ ప్రేరణల మీద, మానవీయ సహజాతాల (instincts) మీదా ఆధారపడినట్టిది. ఇది మనుషుల మీద వారి స్వభావాలకి విరుద్ధంగా రుద్ధబడిన ప్రవర్తనా నియమావళి (Code) కాదు. ప్రేమాస్పదుల ప్రతిరూపాలు మనకి అత్యంత ప్రియతమాలు. వారి ఛాయాచిత్రాల్ని చట్రం కట్టించి ఇంట్లో గోడకి తగిలిస్తాం. బల్లసొఱుగుల (desks) లో దాచుకుంటాం. చేజోళ్ళ (wallets) లో భద్రపఱచుకుంటాం. మనకే అధికారం ఉంటే వారి విగ్రహాన్ని వీథి మొగసాలలో ప్రతిష్ఠిస్తాం కూడా ! ఒకవేళ ఆ ప్రియతముడు భగవంతుడే అయితే ? ఆయన ప్రతిరూపాన్ని మన దగ్గఱ పెట్టుకొని అనునిత్యం చూసుకుందామనుకోమా ? హైందవేతర ప్రపంచంలో ఆ ప్రేరణ లేనివారెవరైనా మిలియన్లాదిగా ఉంటే అప్పుడు హిందువులు నిజంగానే మూర్ఖులు.

హిందూమతం కంటే మానవత్వం గల మతమేదీ లేదు. దేవుడిలో మానవుణ్ణి చూసి పూజించమనే మతం ఇదొక్కటే. అలాగే మానవుడిలో దేవుణ్ణి చూడమని చెప్పే మతమూ ఇదొక్కటే. మనిషిలో దేవుడున్నాడన్నవాణ్ణి దైవద్రోహిగా భావించి ఇతరమతాల్లో చంపినా చంపుతారు. పూజ అంటే అసలర్థం గౌరవించడం ! మనం పూజ పేరుతో చేసే అర్ఘ్యం, పాద్యం, ఆరతి, నైవేద్యం మొదలైన విధివిధానం యావత్తు భగవంతుణ్ణి మానవుడుగా భావించి గౌరవించి చేసే సేవ. మన యింటికొచ్చిన మానవుణ్ణి ఎలా గౌరవిస్తామో అలాగే భగవంతుణ్ణి కూడా భయభక్తులతో గౌరవిస్తే ఆయన సంతోషిస్తాడని చెప్పడమే ఈ విధివిధానంలోని ప్రధానోద్దేశ్యం. ఈ పూజ అనే అలవాటు మనకి తోటి మానవుల పట్ల కూడా ఎలా నడచుకోవాలనేదానికి ఒక మార్గదర్శనం.

మఱికొంత తరువాత...

26, సెప్టెంబర్ 2009, శనివారం

ఆడుకుందాం....రా !

ఆనందస్వరూపులారా ! నమస్కారములు.

మన తెలుగువాళ్ళ తొలితొలి పూర్వీకులు గొప్ప మహర్షులూ, యోగులూ అయ్యుండాలి. (విశ్వామిత్రుడి కుమారుడైన ఆంధ్రుడి సంతానం అని పురాణాల్లో రాశారు) ఎందుకంటే తెలుగుభాషలో ప్రతి క్రియాపదమూ ఆటగా భావించబడుతుంది. వెతుకులాట, మాటలాట, పోటులాట, నవ్వులాట మొ||

భగవంతుడి లక్షణాల్లో ఒకటి లీలావిలాసం. అనగా ఆడుకోవడం. ఎందుకంటే ఆయన నిరంతర ఆనందస్వరూపుడు. ఆయనా, ఆవిడా ఎల్లప్పుడూ ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దఱూ శాశ్వతంగా చిన్నపిల్లలే కనుక వాళ్ళకి ఏ గొడవలూ రావు. అందుచేత ఆడుకునే స్వభావం ఉన్నవారందఱిలోను భగవత్తత్వం ఎక్కువ ప్రకాశమానమవుతుంది. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, కవులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు మొదలైనవారన్నమాట. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుఱించి ఒక మాట. ఏయే పిల్లల జాతకాల్లో గురుగ్రహం బలంగా ఉంటుందో ఆ పిల్లలందఱికీ ఆటల పిచ్చి చాలా ఎక్కువ. అలాగే సప్తమస్థానం గురుగ్రహం చేత ప్రభావితమైన వారందఱికీ శృంగారాభిముఖ్యం ఎక్కువ. ఎందుకంటే శృంగారం కూడా ఒక ఆటే. ఇక్కడ గురుగ్రహ ప్రస్తావన ఎందుకు ? అనడిగితే - గురుగ్రహం పరమాత్మకి ప్రతిబింబమని ప్రశ్నశాస్త్రంలో చెప్పారు. కనుక ఆ గ్రహప్రభావం ఎక్కువగా ఉన్న జాతకాల్లో పరమాత్మతత్త్వం ఎక్కువగా వ్యక్తమవుతుంది.

నిజానికి అందఱమూ చిన్నపిల్లలుగానే జన్మించాం. ఆడుకుంటూనే పుట్టాం. ఆనంద స్వరూపులుగానే పుట్టాం. కానీ వయసు మీదపడేకొద్దీ ఇలా శోకమూర్తులుగా ఎలా పరిణమించాం ? దీనిక్కారణం - మనం ఆడుకోవడం మానేశాం. జీవితాన్ని ఆటగా చూడ్డం మానేశాం. చుట్టూ జఱిగేవాటిని చూసి నవ్వడం మానేశాం. దాన్ని గంభీరంగా తీసుకుంటూ, అవసరమైనదానికంటే గంభీరంగా తీసుకుంటూ మానసికంగా అదే మనంగా పరిణమించి క్రమంగా దుఃఖసాగరంలో మునిగిపోతున్నాం. అందుచేత మన ఆయుర్దాయాలు కూడా తగ్గిపోతున్నాయి. పూర్వీకులు నాలుగొందలేళ్ళు బతికేవారని పురాణాల్లో రాస్తే అవి పుక్కిటి పురాణాలంటున్నాం. నాకది ఆశ్చర్యం కలిగించదు. మానవుడి కున్నట్లే మానవజాతి క్కూడా ఒక బాల్యం ఉంది. వాళ్ళు దేన్నీ గంభీరంగా తీసుకోని స్థితిలో ఎక్కువకాలం బతికే అవకాశం ఉంది. ఇప్పుడు మన సగటు ఆయుర్దాయం అఱవయ్యేళ్ళకి, డెబ్భయ్యేళ్ళకి పడిపోయిందంటే, డెబ్భై దాటి బతికినవాణ్ణి మనం అదృష్టవంతుడుగా చూసే స్థితికి వచ్చామంటే మనం ఎన్నిరెట్లుగా ఆనందానికి దూరమయ్యామో, ఎన్నిరెట్లుగా నవ్వుల్ని కోల్పోయామో, ఎన్నిరెట్లు గంభీరంగా జీవితాన్ని తీసుకుంటున్నామో ఆలోచించాలి. మనం మళ్ళీ పూర్వపు ఆనంద స్వరూపులుగా మారాలంటే మళ్ళీ ఆడుకోవడం మొదలుపెట్టాలి. అలా చెయ్యాలంటే చదువుల ద్వారా, సంపాదన ద్వారా, సంఘజీవితం ద్వారా మనం దేనికైతే గుఱిచేయబడ్డామో ఆ సుదీర్ఘమైన de-sportivization ప్రక్రియని విదిలించుకొని బయటపడాలి. జీవితం పట్లను, మనుషుల పట్లను, ప్రపంచం పట్లను ఈ అతిగంభీర వైఖరిని, ఈ అంకిత భావాన్ని ఉజ్జగించాలి. మనిషి తనలోని పసిబిడ్డ బతికున్నంతకాలమే ప్రాణాలతో జీవించి ఉంటాడు. ఆ పసిబిడ్డ చనిపోతే అతను చనిపోతాడు. ఆ పసితనమే అతని Core personality. ఆ పసితనాన్ని నిలబెట్టడం, నిలబెట్టుకోవడం ఇది మనం చెయ్యాల్సినది.

అసలు భగవంతుడు ఈ ప్రపంచాన్ని చాలా అందంగానే సృష్టించాడు. ఆనందమయంగానే సృష్టించాడు. కానీ మనిషి దాన్ని పాడుచేసి "ఏంటో ఈ ప్రపంచం అందంగా లే" దంటున్నాడు. మనిషిని కూడా భగవంతుడు తనలాంటి ఆనందస్వరూపుడుగానే సృష్టించాడు. కానీ మనిషి ఆడుకోవడం మానేసి తోటి మనుషుల్ని దుర్మార్గులుగా, రాక్షసులుగా అభివర్ణించి తన మనసు పాడుచేసుకుని "జీవితం దుఃఖభాజనం" అని ఆరోపిస్తూ ఇలాంటి ప్రపంచాన్ని, జీవితాన్ని సృష్టించిన దేవుడు ఒక శాడిస్ట్ అయ్యుండాలంటున్నాడు. "కనుక అసలు దేవుడనేవాడే లేడు పొ"మ్మంటున్నాడు.

ఏం వెఱ్ఱితనం ! మనం ప్రతిదాన్ని ఒక ఆటగా తీసుకోవడం మొదలుపెట్టిన మఱుక్షణం, సంఘంలో ప్రతి ఆటని ఆ ఆట నియమాల ప్రకారం ఆడేసి మర్చిపోవడం నేర్చుకున్నాక దీని స్వరూపమే సమూలంగా మారిపోతుంది. దేవుడి సృష్టే కాదు, మనుషుల సృష్టి (వ్యవస్థలు) కూడా ఆనందం కోసమే సృష్టించబడింది. కానీ ఆటని ఆటగా చూడలేని గంటుమొహాల మూలాన అవి తమ ఆనంద స్వభావాన్ని కోల్పోయాయి. ఎంట్రన్స్ ఎగ్సాములు ఒక ఆట. ఉద్యోగాలు ఒక ఆట. డబ్బొక ఆట. పదవులొక ఆట. వీటిని ఆటలుగా పరిగణించడం మానేశాక, ఇతరుల దుర్బోధలు (వాళ్ళ దృష్టిలో అవి సద్బోధలు) విని మనం ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాక ప్రవేశించింది మన జీవితంలో దుఃఖం. కానీ మనం దాన్ని దుఃఖం అనుకోవడం లేదు. మనమేదో పెద్ద అనుభవ సంపన్నులమయ్యామనీ, ముదిరామనీ, ముగ్గామనీ, మాగామనీ భ్రమిస్తున్నాం. ఆటని ఆటగా చూడలేనివాళ్ళు ఎదిగినట్లు కాదు. యోగసాధనకి విధించిన నియమాల్లో ఒకటి - ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం. అన్నీ వదులుకుని ఆనందంగా ఎలా ఉంటాం ? అనడుగుతారు. మనం సాధారణంగా ఎవరిని ఇష్టపడతాం ? అచ్చంగా మనలాంటి స్వభావం గలవారినే కదా ? దేవుడైనా అంతే. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. తనలా ఆడుకునేవాళ్ళ కోసం, తృప్తిగా ఆనందంగా ఉండేవాళ్ళకోసం ఆయన ఎదురుచూస్తూంటాడు.

మనిషి ఒకటి కావాలి అనుకుంటే దాన్ని ఇంకా పొందకుండానే దాన్ని పొందినట్లుగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. బ్రహ్మానందం అనేదేదో ఒకటుందని వేదాంత గ్రంథాల్లో చదివి "అది మనకి లభించడంలేదే ?" అని చింతాక్రాంతులవుతారు. ఇప్పుడు ఆనందంగా ఉండం నేర్చుకుంటే బ్రహ్మానందం కాలక్రమంలో దానంతట అదే సిద్ధిస్తుంది. కర్మయోగమంటే ప్రతిపనినీ ఒక పసిబిడ్డలా, ఆనందాన్ని తప్ప ఇంకేమీ ఆశించకుండా ఆటలా చెయ్యడం. నియమాల ప్రకారం ఆడేస్తూ అదే సమయంలో దాంట్లో తాదాత్మ్యం చెందకపోవడం. మనం వినే గొప్పగొప్ప ఆదర్శాలూ, వ్యక్తిత్వ వికాసాలూ గట్రా అన్నీ మనలోని పాత పసిబిడ్డని తిరిగి బతికించడానికి ఉద్దేశించినవే. అవి ఇప్పటికే నీలో ఉన్నాయి. కొత్తగా పూసుకోవాల్సిందేమీ లేదు. ఉన్నది పాడు చేసుకోకుండా ఉంటే చాలు.

నవదుర్గాస్తుతి

శా:-
శ్రీ శైలాత్మజ ! నీదు దివ్య తపమున్ శ్రీ శంభుడే మెచ్చి, తా
నాశించెన్ నిను. పెండ్లి యాడె. తను నిన్నర్థాంగిగాఁ బొందె. మా
యాశల్ తీర్చగ నీకు మ్రొక్క, నతడు న్నర్థించు మాబోంట్ల తా
క్లేశంబొందగనీక కాచును గదా ! లీలన్ ! కృపాంభోనిధీ !

మ:-
మనమున్ భక్తి ప్రమోద భావమమరం బ్రహ్మంబునే బ్రహ్మచా
రిణి ! గాంచన్ సుకరంబె యయ్యె తమకున్. శ్రేయంబులన్ గూర్చు నీ
మణిమన్ మందిర ద్వీపమంద మనముల్ మళ్ళించు సద్భక్తులన్
గని, కావంగ నుపేక్ష యేల? విలసత్ కారుణ్య మాహేశ్వరీ !

శా:-
భక్తిన్ మ్రొక్కెద, చంద్రఘంట ! కరుణా భాస్వన్మనోజ్ఞాకృతీ !
శక్తిన్ గొల్పుమ నిన్ను మాదు మదులన్ సౌమ్యంబుగా నిల్ప! దు
శ్శక్తుల్ మాయఁగఁ జేయఁ జేయుమ ! కృపన్. చాంచల్య భావంబులన్
యుక్తిన్ బాపుమ ! సద్గుణంబు లిడుమా ! యుక్త్యుక్తులం జేయుమా !

శా:-
శ్రీ కూష్మాండ శుభాఖ్య ! మాదు ప్రణతుల్ చేకొమ్మ ! జీవాళిలో
నీకాంతుల్ ప్రసరింప, వెల్గు నిలపై. నీ ధ్యాస లేకున్నచో
శోకాగ్నుల్ మము చుట్ట ముట్టు. కరుణా జ్యోత్స్నళి నీ నుండియే
చేకొన్నన్ శుభ సంహతుల్ గలుగు. సుశ్రేయంబులున్ గల్గెడున్.

మ:-
కన రావా ! మము స్కందమాత ! విలసద్గాంభీర్య సద్రూపిణీ !
కనులన్ మమ్ములఁ బెట్టి గాంచ తగదో ! కారుణ్య భావోజ్వలా !
తను హృద్భాషల నిన్ను భక్తిఁ గొలువన్, తత్వజ్ఞతన్ గల్గి, నిన్
మనమందెప్పుడు గాంచు భాగ్య మిడుమా ! మమ్మున్ గృపన్ జూడుమా !

శా:-
ఓ కాత్యాయని ! యో సు పూజిత పదా ! ఓ దుష్ట సంహారిణీ !
శ్రీ కాత్యాయన సన్మునీశ్వర సుతా ! శ్రీ చక్ర సంచారిణీ !
నీ కారుణ్యమె మాకు జీవనముగా ! నిన్ గొల్చు సద్భాగ్యముల్
లోకంబందున మాకుఁగొల్పి, కృపతో లోలాక్షి ! కాపాడుమా !

ఉ:-
శ్రీ కర కాళ రాత్రి ! నిను చిత్త సరోజము నందు నిల్పి, నీ
భీకరమైన రూపమును ప్రీతిగ చూడగ నిచ్చగించెదన్.
నీకరవాల మీ ధరణి నింగికిఁ బంపును దుష్ట సంహతిన్.
ప్రాకటమొప్పఁ గాచెదవు భక్తుల పాలిటి కల్పవల్లివై.

మ:-
కరుణా సాంద్ర ప్ర పూరితా ! వర మహా గౌరీ ! శివాణీ ! మమున్
దరిఁ జేర్చన్ నిను మించు వారు కలరే ! దాక్షిణ్య మొప్పారగా
ధరపై దుష్ట జనాళి నుండి మములన్ దప్పించి కాపాడుమా !
వరమై నీ మహనీయ నామ మెదలో వర్ధిల్లగా జేయుమా !

మ:-
పరమేశానివి, సిద్ధి ధాత్రి ! కృపతో భక్తాళి నెల్లప్పుడున్
పరమేశుండును, నీవు కూడి, కనుచున్, భక్తిన్ ప్రవర్ధింపుచున్,
వరమై తోడుగ నుండుడీ! సుజనులన్ వర్ధిల్లగా జేయుచున్
దురితంబుల్ పొనరింపకుండ కనుడీ! దుష్టాత్ములన్ బాపుడీ!

ఇట్లు

భగవద్భక్త దాసుడు,

చింతా రామకృష్ణా రావు

21, సెప్టెంబర్ 2009, సోమవారం

నైవేద్య పద్ధతి

మనిషీ తిండి తింటాడు. పశువులూ తిండి తింటాయి. పశువులకి దైవస్పృహ లేదు. మనిషికి ఉంది, ఉండాలి. అదే పశుత్వానికీ, మానవత్వానికీ మధ్య గల ప్రధానమైన భేదం. ప్రపంచంలో తఱచుగా వినపడే నీతులన్నీ నిగ్రహానికీ, కృతజ్ఞతకీ సంబంధించినవి. అందుచేత మానవుడి నీతిమయ జీవనం ముందు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడంతో మొదలవుతుంది, అవ్వాలి.

మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవల్లీలావిశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం. విత్తినా మొక్కలు రావు. వచ్చినా ధాన్యం పండదు. పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం. తెచ్చుకున్నా తినలేం. ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవత్కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుచేత ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.

ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా--

౧. ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తమ్మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందఱు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే - మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతిమాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు. కాని భవిష్యపురాణాది గ్రంథాల్లో చెప్పిన ప్రకారం - కలియుగంలో బ్రాహ్మణుల్లో కంటే అబ్రాహ్మణుల్లోనే ఎక్కువమంది ఆధ్యాత్మిక మహాపురుషులు జన్మిస్తారు. (జన్మించారు) కనుక యుగధర్మాన్ని బట్టి అదొక లోపంగా భావించనక్కఱలేదు.

౨. ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు ? అది అక్రమార్జితమా ? సక్రమార్జితమా ? హింసార్జితమా ? అహింసార్జితమా ? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు.

౩. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగిస్తాడు కనుక అవే మధుమేహం, రక్తపోటూ మనకి మఱుజన్మలో కూడా సంప్రాప్తమౌతాయి. మళ్ళీ అదే చప్పిడి తిండి మనకి వందరెట్లుగా ప్రత్యక్షం.

౪. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది. మనం సమాజంలో తగుమాత్రపు హోదాలో బతుకుతున్నప్పుడు దేవుడి చేత dieting చేయించడం అన్యాయం. మన స్థితి నిజంగా బాలేకపోతే ఆయనే సర్దుకుపోతాడు. కిందటేడాది హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీమధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా ?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.

౫. "శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొఱపాటు జఱుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం. భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆఱేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. కీ.శే. జిడ్డు కృష్ణమూర్తిగారు తాను అమ్మ (అనీబీసెంట్) తో కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక ఆఱేళ్ళ పిల్లవాడు వచ్చాడని "ఆయనే భగవంతుడు. నమస్కారం చేసుకో" మని వెంటనున్న ఋషులు హెచ్చఱించారనీ వ్రాశారు At the Feet of the Master అనే గ్రంథంలో ! అందుచేత ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి.

౬. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గుఱై ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు.

౭. నిలవ ఉన్నవీ, పులిసిపోయినవీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిహతా అందఱు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం.

౮. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు.

౯. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి.

౧౦. హారతి ఇచ్చాకనే నైవేద్యం.

౧౧. నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి శ్లోకం :

శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||

విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే--

శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||

శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||

ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు --

ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |

అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--

ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |

అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.

మధ్యేమధ్యే పానీయం సమర్పయామి

అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.

నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

౧౨. దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జఱుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని తీసుకురావాలి.

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

అల్లాహ్ ఎవరు ? మక్కా అంటే ఏమిటి ?

వాస్తవానికి ముస్లిములు అల్లాహ్ అని పిలుస్తున్నది అమ్మవారినే. అమ్మవారంటే ఉజ్జయినీ మహాకాళి. చంద్రగుప్త విక్రమాదిత్యుని పాలనలో అరేబియా ఉన్నప్పుడు - అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం - అప్పటికింకా మహ్మదీయ మతం లేదు. ఒకసారి సామ్రాజ్య పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అక్కడి ప్రజలు తమక్కూడా ఉజ్జయినీ మహాకాళి ఆలయం లాంటిది కావాలని చక్రవర్తిని అభ్యర్థించారు. అప్పటికి అరబ్బీ మాట్లాడే అరేబియన్ లంతా హిందువులే. అరబ్బీ బ్రాహ్మలు కూడా ఉండేవారు. చక్రవర్తి సరేనని చెప్పి ఇప్పుడు మక్కా అని పిలుస్తున్న ప్రదేశంలో మహాకాళీ ఆలయాన్ని నిర్మించాడు.

అది నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. గమనించాల్సిన విషయమేంటంటే ఇది ఊహ కాదు. దీనికి పురావస్తు సాక్ష్యం (Archaeological evidence) ఉంది. అరబ్బీ భాషలో ఈ విషయం తెలియజేస్తూ అక్కడ చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేయించిన శిలాశాసనమే ఇందుకు నిదర్శనం. ఆ దేవాలయం అతిత్వరలోనే యావత్తు అరబ్బీ దేశపు హిందువులకీ కేంద్రస్థానంగా, శైవ పీఠాధిపత్యంగా మారింది. ఇప్పుడు మక్కా వెళ్ళే హజ్ యాత్రికులంతా దర్శించేది ఆ మహాకాళీ ఆలయాన్నే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసమే ఆఱో శతాబ్దంలో ప్రవక్త మహ్మదుగారు తతిమ్మా అరబ్బీ తెగలతో (శైవులతో) హోరాహోరీ పోరాడాడు. ఆయన విగ్రహారాధకులతో పోరాడాడని కొరాన్ లో వ్రాశారు.

ఆ ఆలయంలో కాబా అని పిలిచే నల్లఱాయి (అదే అల్లాహ్ అంటారు వాళ్ళు) ఒక గోడలో తాపడం చేసి ఉంటుంది. శివలింగం లేని పానవట్టాన్ని ఒకసారి ఊహించుకోండి. అది సరిగ్గా అలా ఉంటుంది. లింగం స్థానంలో లోతుకు పోయిన ఖాళీసొట్ట కూడా ఉంటుంది. పానవట్టం పార్వతీస్వరూపమని కదా హిందూ సంప్రదాయం. హజ్ యాత్రికులు దాన్ని తాకడం కోసం ఎగబడుతూంటారు. కాబా దగ్గఱ దాన్ని పూజించే ముస్లిమ్ ఇమామ్ లు అచ్చం మన శైవపూజారుల తరహాలో బోడిగుండ్లు, పంచెలు, ఉత్తరీయాలూ ధరించి ఉంటారు. భక్తులు కూడా అసలు అదే వేషంలో కాబాని దర్శించాలని నియమం ఉందట.

ఆ నల్లఱాయి ఇస్లామ్ ఆవిర్భవించక ముందునుంచే అక్కడ ఒక పూజనీయవస్తువుగా ఉండేదని చారిత్రిక ఆధారాల వల్ల తెలుస్తున్నది. ఈ క్రింది ఉటంకింపుల్ని గమనించండి :

Edward Gibbon writes about the Ka'bah and its existence before the Christian era in his book:

"..... of blind mythology of barbarians - of the local deities, of the stars, the air, and the earth, of their sex or titles, their attributes or subordination. Each tribe, each family, each independent worrier, created and changed the rites and the object of this fantastic worship; but the nation, in every age, has bowed to the religion as well as to the language of Mecca. The genuine antiquity of Caaba ascends beyond the Christian era: in describing the coast of the Red sea the Greek historian Diodorus has remarked, between the Thamudites and the Sabeans, a famous temple, whose superior sanctity was revered by all the Arabians; the linen of silken veil, which is annually renewed by the Turkish emperor, was first offered by the Homerites, who reigned seven hundred years before the time of Mohammad."

Diodorus Siculus was a Greek historian of 1st century BC who wrote Bibliotheca Historica, a book describing various parts of the discovered world. The following lines are the English translation of Greek quoted by Gibbon from the book of Diodorus Siculus (Diodorus of Sicily) describing the 'temple' considered to be the the holiest in the whole of Arabia.

"....And a temple has been set-up there, which is very holy and exceedingly revered by all Arabians...."

చాలా దశాబ్దాల క్రితం - అంటే అరేబియా పాశ్చాత్యుల అధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఆ ఆలయప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెఱిపించి చూశాడట. లోపల త్రిశూలాలు, శివలింగాలూ, సర్పాకార శిల్పాలు చాలా చూశానని, అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడు. ఆ గదిని ఎవరూ చూడకూడదనే నియమాన్ని ఇప్పుడు మాత్రం కట్టుదిట్టంగా అమలు జఱుపుతున్నారు.

అసలు విషయమేమంటే - అల్లా అంటే సంస్కృతంలో అమ్మ అని అర్థం.

కలికాలజ దోష తుషార సంహతి-1

కలియుగం మొదలవుతూనే కలిపురుషుడు భారతదేశంలోకి ప్రవేశించలేదని మన పూర్వగ్రంథాలు తెలియజేస్తున్నాయి. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన ప్రకారం - అసలు మొదట వాడు భూమండలం మీద అడుగుపెట్టడానికే భయపడిపోయాడట. భూలోకానికి వెళ్ళి పరిపాలించవలసిందని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాడు హడిలిపోతూ--

"స్వామీ ! అన్ని దేశాల్లోను, ఖండాల్లోను యజ్ఞయాగాదులతో, అఖండ ధర్మాచరణతో నిరతాగ్నిహోత్రంలా వెలిగిపోతున్న భూమికి నేనెలా వెళ్ళేది ? నాకేమో యజ్ఞయాగాలంటే చచ్చేంత భయం. దేవుడి పేరు వింటే గుండెపోటు. శుచి అన్నా శుభ్రత అన్నా అసహ్యం. నియమనిష్ఠలంటే వొళ్ళుమంట. శాస్త్రాల పేరు చెబితే కంపరం. బ్రాహ్మణుల ఉనికే భరించలేను. నా పేరే కలి ( కలహం). ప్రజలు ఐకమత్యంతో ఉంటే నాకు నిద్రపట్టదు. అబద్ధాలకోరులూ, తడిగుడ్డలతో గొంతులు కోసేవాళ్ళు, నరహంతకులు, గురుద్రోహులు, దైవద్రోహులు, పతితస్త్రీలు, జారులూ, చోరులూ, వ్యభిచారులూ, దొంగభక్తులు, బందిపోటు దొంగల్లా ప్రవర్తించే రాజులూ, కనిపించిన ప్రతిదీ అమ్ముకుని బతికేవాళ్ళు, వావివరుసలు లేనివాళ్ళు, నాస్తికులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. కొట్టుకుచచ్చే దేశాలు, కూలిపోయిన కుటుంబాలు, పాడుపడ్డ కొంపలు, ఎండిపోయిన బీళ్ళు, వట్టిపోయిన నదులు, రక్తధారలు, మాంసపు ముద్దలు, అనాథలై వలసపోయే ప్రజలు, భోరున ఏడుస్తున్న స్త్రీలు, విధవరాళ్ళు - ఇవీ నా మనస్సుని పరవశింపజేసి మత్తెక్కించే సుందర దృశ్యాలు. అలాంటి నన్నేనా తమరు పరమ పవిత్రమైన భూలోకానికి వెళ్ళమంటున్నది ? ఇది కలా ? నిజమా ? నేను రాజ్యం చెయ్యడానికి అనుకూలమైన పరిస్థితులక్కడ లేవు గద స్వామీ ?" అని అడిగాడు.

బ్రహ్మదేవుడు చిఱునవ్వు నవ్వి "నాయనా ! కలీ ! ఇహ నీ వంతొచ్చింది. కనుక నువ్వక్కడికి వెళ్ళకా తప్పదు. రాజ్యపాలన చెయ్యకా తప్పదు. ప్రస్తుతం నీ ఏల్బడికి తగిన పరిస్థితులక్కడ లేవన్నమాట నిజమే. కానీ అలాంటివి క్రమక్రమంగా ఏర్పడతాయి. వైదిక ధర్మాచరణ గలవారిని, గురుభక్తుల్ని నువ్వేమీ చెయ్యలేవు. కానీ మిహతావారిలోని అధర్మాన్ని ఆసరాగా చేసుకొని వారిని నువ్వు వశం చేసుకోవచ్చు. అలా నీ ధర్మాన్ని భూమండలమంతా వ్యాపింపజేయవచ్చు." అని సముదాయించి ధైర్యం చెప్పి పంపాడు.

"సరే" నని కలిపురుషుడు ఎలాగో మనసు చిక్కబట్టుకొని పీచుపీచుమంటున్న గుండెతో భయం భయంగా భూమండలానికి దిగివచ్చే సమయానికి ప్రపంచాన్ని పాండవుల పౌత్రుడైన పరీక్షిన్ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మెత్తని మనసు గలవాడని విన్నాడు కలి. "అయితే నన్నేం చెయ్యలే"డనుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకసారి ఆ మహారాజు వస్తున్నదారిలో ఒక శూద్రుడి రూపాన్ని ధరించి ఒక గోమిథునాన్ని (ఒక ఆవు, ఒక ఎద్దు) హింసించడం మొదలుపెట్టాడు. ఎద్దు కాళ్ళు మూడు విఱగ్గొట్టాడు. పరీక్షిన్ మహారాజు అక్కడికొచ్చి చూసేసరికి వీడు ఇంకా వాటిని చావగొడుతూనే ఉన్నాడు.

"ఎవడ్రా నువ్వు దుర్మార్గుడా ? సాక్షాత్తు నా రాజ్యంలోనే గోహింసకి పాల్పడుతున్నావ్ ?" అని గద్దించి అడిగాడు పరీక్షిత్తు.

"నువ్వెవడివోయ్ అడగడానికి ? నీ పని నువ్వు చూసుకో ! ఇది నాయిష్టం. నేను వీటిని కొడతాను, చంపుతాను." అని మొండిగా సమాధానమిచ్చాడు కలి, సరిగ్గా ఇఱవయ్యో శతాబ్దపు మనిషిలా.

ఆ మాటతో పరీక్షిత్తుకు అఱికాలిమంట నెత్తికెక్కింది. ప్రచండ ఆగ్రహోదగ్రుడై వెంటనే రథం నుంచి కిందికి దూకి వాడి జుట్టుపట్టుకున్నాడు. ఇహ చంపడమే తరువాయి. మహాపుణ్యాత్ముడైన పరీక్షిత్తు ముందు తన మాయలు పనిచేయకపోవడం గమనించి వాడు భయకంపితుడయ్యాడు. తప్పించుకోవడానికి సాధ్యం కాక ఆ మహారాజు సామాన్యుడు కాడని తెలుసుకొని దీనంగా ఆయన కాళ్ళు పట్టుకొని శరణువేడాడు.

"మహారాజా ! నేను కలిపురుషుణ్ణి. ఈ గోమిథునం భూదేవి మఱియు ధర్మదేవుడు. భూలోకంలో నా ధర్మాన్ని ప్రవర్తింపజేయమని సాక్షాత్తు పితామహు డాదేశించిన ప్రకారమే నేను చేస్తున్నాను. నన్ను దయదల్చి వదిలిపెట్టండి మహాప్రభో !" అని ఆక్రోశించాడు.

"అలా అయితే నేనూ, నా వంశస్థులూ పరిపాలిస్తున్నంతకాలం నువ్వీ భూమండలం మీద కనిపించడానికే వీల్లేదు" అన్నాడు పరీక్షిత్తు.

"మఱి పితామహులాజ్ఞ ఎలా ఉల్లంఘించేది మహారాజా ?" అని నసిగాడు కలి.

"అయితే నువ్వు అప్పటిదాకా పశ్చిమభూములకి పారిపో !" అని సెలవిచ్చాడు పరీక్షిత్తు.

వాడు "బతుకుజీవుడా ! "అనుకుంటూ భరతఖండం నుంచి పశ్చిమానికి పారిపోయాడు. వాడికి నేరుగా భరతఖండాన్ని వశం చేసుకోవడం కుదఱలేదు కనుక అట్నుంచి నఱుక్కురావడం మేలని భావించాడు. ఆ ప్రకారమే పశ్చిమద్వీపాల నుంచి, పశ్చిమదేశాల నుంచి తన జైత్రయాత్ర ప్రారంభించాడు. ఆ పశ్చిమదేశాల్లో ఈజిప్టు, ఇస్రాయేల్, యూరోపు, అరేబియా, ఇంగ్లండు ఉన్నాయి - ఇప్పటిదాకా గడిచిన చరిత్ర ప్రకారం చూస్తే !

మఱికొంత తరువాత.....

7, సెప్టెంబర్ 2009, సోమవారం

సత్యమే ధైర్యము

ఒకసారి స్వర్గలోకంలో దేవతలందఱూ సమావేశమైనప్పుడు "అన్ని ధర్మాల కంటే గొప్పది ఏది ?" అని చర్చ జఱిగిందట. అప్పుడు సత్యాన్ని ఒక తక్కెడలోను, మిగతా అన్ని ధర్మాల్నీ రెండో తక్కెడలోను పెట్టి తూయగా, సత్యమే ఎక్కువ బరువు తూగిందని మహాభారతం చెబుతున్నది. సంస్కృత భాషలో 'సత్' అంటే 'నశించకుండా ఎల్లప్పుడూ ఉండేది' అని అర్థం. 'మంచిది' అని కూడా మఱొక అర్థం ఉంది. ప్రపంచంలో నాశనం చెందకుండా ఎల్లప్పుడూ ఉండేవాడూ, అందఱికీ మంచి చేయగలవాడూ భగవంతుడొక్కడే. ఆ 'సత్' కి సంబంధించినదే సత్యము. అంటే నిజమైనదీ, అందఱికీ శ్రేయస్సు చేకూర్చేదీ అని అర్థం. అందుచేత సత్యం భగవత్ స్వరూపమే.

అంతే కాదు, ఆ సత్యాన్ని అనుసరించేవారూ, దాన్ని కనుగొనేవారూ, దాన్ని మాట్లాడేవారూ, దాన్ని ఒప్పుకునేవారూ. సమర్థించేవారు కూడా భగవత్ స్వరూపులే. సత్యం మిగతా అన్ని ధర్మసూత్రాల్నీ తనలో ఇమిడించుకొన్న మహా ధర్మసూత్రం. అంటే ఒక్క సత్యాన్ని మాత్రమే అవలంబించినా చాలు, మిగతా అన్ని మంచి లక్షణాలూ నెమ్మదిగా వాటంతట అవే అలవడతాయి. అదే విధంగా, ఒక్క సత్యాన్ని వదిలిపెడితే చాలు, మిగతా అన్ని ధర్మాలూ మనిషిని వదిలిపోతాయి. అందుకే "దేన్నయినా త్యాగం చేస్తాను గానీ, నాలోని సత్యాన్ని మాత్రం త్యాగం చెయ్యలే"నన్నాడట అంగదేశపు రాజైన కర్ణుడు. ఎందుకంటే సత్యాన్ని త్యాగం చెయ్యడం వల్ల అంతకు ముందు చేసిన త్యాగాలన్నీ అబద్ధమైపోతాయని అతని భయం. ఒక్క సత్యమనే కాదు, సద్గుణాలైనా, దుర్గుణాలైనా అన్నీ కలసికట్టుగానే వస్తాయి. కలసికట్టుగానే పోతాయి.

అలా, సత్యం ద్వారా అలవడే సద్గుణాల్లో ధైర్యం కూడా ఒకటి. ధైర్యమంటే 'ఇతరులతో యుద్ధం చెయ్యడం' అని చాలామంది అనుకుంటారు. కానీ ధీరత్వమే ధైర్యం. ధీరత్వమంటే చలించకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండడం. నిజాలు తెలిసినవారికి, నిజాలు మాట్లాడేవారికీ మాత్రమే అది సాధ్యం. అసత్యవాదులు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండలేరు. అందుచేత ధైర్యమంటే ఇతరులకు హాని చేయడం కాదు. సత్యాన్ని సత్యంగా గ్రహించి, నిజాయితీగా దాన్ని ఒప్పుకుని, దాన్నుంచి పారిపోకుండా, దాని పర్యవసానాల్ని తెలివితేటలతో ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావడంలోనే నిజమైన ధైర్యం ఇమిడి ఉంటుంది.

చిన్నప్పుడు నేనొక కథ విన్నాను.

పూర్వం హిరణ్య రాష్ట్రం (కడప జిల్లా) లో ఒక నదీతీరంలో శంఖుడు, లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు చెఱొక ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి అన్న అయిన శంఖుడు తన ఆశ్రమ బాధ్యతని కూడా తమ్ముడికప్పగించి పక్క గ్రామానికి వెళ్ళాడు. మర్నాడు లిఖితుడు పూజ కోసం పూలు కోయాలనుకుని తన ఆశ్రమంలో పూలు పూయకపోవడం చేత అన్నగారి ఆశ్రమంలో పూచిన పూలు కోసుకుని పూజ చేశాడు. ఆ తరువాత అతనికి జ్ఞాపకం వచ్చింది - తాను అన్నగారి అనుమతి లేకుండానే ఆయనకు చెందిన పూలని వాడుకున్నానని. చాలా బాధపడ్డాడు. మర్నాడు అన్నగారు రాగానే ఏమీ దాచకుండా నిజం చెప్పాడు. దొంగతనం చేసినందుకు తనకు తగిన శిక్ష విధించమని కోరాడు. అది చాలా చిన్న విషయమనీ, అయినా తనతో నిజం చెప్పి ఒప్పుకున్నాడు కనుక అతని దోషం పోయిందనీ శంఖుడు ఎంత నచ్చజెప్పినా లిఖితుడు వినలేదు. అప్పుడు శంఖుడు అతనితో " శిక్షలు విధించే అధికారం దేశాన్ని పాలించే రాజుకు మాత్రమే ఉంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గఱికే వెళ్ళి నీ అపరాధాన్ని వివరించి ఆయన నీకు ఏ శిక్ష విధిస్తే దాన్ని అనుభవించు" అన్నాడు. "సరే"నని లిఖితుడు రాజుగారి దగ్గఱికి వెళ్ళి తన అపరాధాన్ని వెల్లడించాడు. దొంగతనానికి ఆ రోజుల్లో చేతులు నఱకడమే శిక్ష. ఒక తపస్విని అంత చిన్న అపరాధానికి అలా శిక్షించేందుకు మొదట రాజు కూడా ఇష్టపడలేదు. కాని లిఖితుడు చాలాసేపు ఆయనతో వాదించి పట్టుపట్టిన మీదట ఆయన అతని చేతులు నఱకవలసిందిగా ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ననుసరించి ఆయన భటులు లిఖితుడి చేతుల్ని నఱికేశారు. చేతుల్లేకుండా ఆశ్రమానికి తిరిగి వచ్చిన తమ్ముణ్ణి చూసి శంఖుడు సంతృప్తి చెంది " తమ్ముడూ ! ఇప్పుడు నువ్వు పవిత్రుడివయ్యావు. వెళ్ళి నదిలో స్నానం చేసి రా !" అన్నాడు. "అలాగే అన్నయ్యా !" అని లిఖితుడు నదికి వెళ్ళి మూడు మునకలు వేసి లేవగానే అతని చేతులు యథాపూర్వంగా తిరిగి వచ్చాయట. లిఖితుడు సంతోషంతో అన్నగారి ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతుల్ని చూపించగా ఆయన ఆనందంతో అతన్ని కౌగలించుకుని "తమ్ముడూ ! నీ సత్యనిష్ఠకు మెచ్చి ఆ నదీమతల్లి నీకు ప్రసాదించిన వరమే ఇది. ఆమె బాహుదా" అన్నాడట. అప్పటినుంచి ఆమెకు 'బాహుదానది' (బాహువులు - అనగా చేతులిచ్చిన నది, లేక 'చెయ్యేఱు') అని పేరు వచ్చిందట. అంతకు ముందు దాన్ని ఏమని పిలిచేవారో తెలియదు.

ఆ విధంగా, ఎంత చిన్నదైనా కానీ, తప్పు చేశాననే సత్యాన్ని ఒప్పుకుని అందుకు శిక్ష అనుభవించడానికి మన:స్ఫూర్తిగా సిద్ధపడ్డ లిఖితుడి ధైర్యమే మనకందఱికీ ఆదర్శం కావాలి.

అమ్మవారిని దూషించకుండా జాగ్రత్తపడదాం !

"వెధవడబ్బుదేముందండీ....."

ఈ తరహా సంభాషణలు అప్పుడప్పుడు మన చెవిన పడుతూంటాయి. "వెధవ" డబ్బట ! డబ్బు లేకపోతే మన నడ్డి లేవడం అసాధ్యం అని తెలిసీ కొంతమంది దానిమీద ఇలా నోరు పారేసుకుంటూ ఉంటారు. "అయ్యా ! డబ్బు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ దేవి, దాన్ని దూషించడం మహాపచారం మొఱ్ఱో !" అని మన పూర్వులు నెత్తీనోరూ కొట్టుకున్నా మనవాళ్ళకిదే ధోరణి. అందుకే ఇలా అమ్మవారిని పరోక్షంగా దూషించీ, దూషించీ మన దేశం దరిద్రదేశం అయిందేమోనని మనసులో నాకొక మూలనచింత.

డబ్బు దేవత ఎలా అయింది ? అనడిగితే, దాన్తో మనం ప్రకృతివనర్లని స్వాధీనం చేసుకుని అనుభవిస్తాం కనుక. ప్రకృతివనర్లే డబ్బుగా రూపాంతరం చెందుతాయి గనుక. "ప్రకృతిం వికృతిం విద్యామ్..." అంటుంది శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం. ఆ స్తోత్రంలో అమ్మవారికున్న మొట్టమొదటి పేరే "ప్రకృతి" అని చెప్పబడింది అంటే ఆలోచించండి.

"వెధవ" అనేది మొదట్లో దూషణ (abuse) కాకపోయినా తరువాతి కాలంలో దూషణగా మారింది. వెధవ అంటే నిజానికి వితంతువు అని అర్థం. ఆ రోజుల్లో యౌవనవితంతువులకి పునర్వివాహ అవకాశం లేక బలవంతపు బ్రహ్మచర్యాలు పాటించడం చేతకాక కంటికి నచ్చినవాడితో పారిపోయేవారు. అందుకని వాళ్ళని సమాజం ఇలా దూషించేది. ఇప్పుడు మగవాళ్ళని కూడా ఆ పదంతోనే దూషిస్తున్నారనుకోండి. అదే వేఱే విషయం. ఆ పదాన్ని డబ్బుకి - నిత్యసుమంగళి, శాశ్వతసౌభాగ్యవతి, పరమపతివ్రతాశిరోమణియైన అమ్మవారికి అన్వయించడం భావ్యం కాదు గదా !

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

వేదమంత్రాభ్యాసం పురుషులకే విహితం

మన పూర్వశాస్త్రాల్లో స్త్రీలకి వేదమంత్రోచ్చారణ గానీ, వేదమంత్రాల్లో శిక్షణ గానీ ఎక్కడా నిర్దేశించినట్లు కనిపించడంలేదు. పైపెచ్చు దానిపై నిషేధాలు కూడా విఱివిగా కనిపిస్తున్నాయి. బ్రాహ్మణ కుటుంబాల చరిత్రలో కూడా ఏ బ్రాహ్మణస్త్రీ గానీ వేదాభ్యాసం చేసినట్లు దాఖలాలు లేవు. నా మటుకు నేనిది ఒక పెద్ద లోపమని భావించను. ఎందుకంటే పూర్వులు ఏది చెప్పినా దానికేదో ఒక మంచి కారణం తప్పకుండా ఉంటుందని నా దృఢవిశ్వాసం. స్త్రీలు వేదార్థాన్ని తెలుసుకోవడానికి మాత్రం అభ్యంతరం కనిపించడంలేదు. కానీ మంత్రాలు వేఱు.

ఇందులోకి ఆధునిక రాజకీయ సిద్ధాంతాలైన సమానత్వం, స్త్రీల హక్కులు, అణచివేత మొదలైన గాడిదగత్తర లాక్కురావడం మిక్కిలి అసమంజసమని నా అభిప్రాయం. ఆ మాటకొస్తే మతంలోకి మతేతర కాన్సెప్టుల్ని లాక్కురావడం ఎప్పుడైనా అభ్యంతరకరమే. మతానికి ఋషులే ప్రమాణం. ఇంకెవరూ ప్రమాణం కాదు. ఇంకెవరినీ మతావలంబులు అనుసరించాల్సిన అవసరం లేదు. మతానికి రాజకీయాల కంటే, చట్టాల కంటే సైన్సుకంటే వేఱుగా తనదంటూ ఒక సొంత దృక్పథం ఉంది. ఆ దృక్పథం నుంచే దాన్ని చూడాలి. మనక్కావాల్సింది ఈ కాలపు విదేశీ కాన్సెప్టుల కనుగుణంగా మన సంప్రదాయాన్ని వ్యాఖ్యానించుకోవడం కాదు. మన సంప్రదాయాన్ని దాని దృష్టితోనే చూడాలి. ఇతరదృష్టులు పనికి రావు. కష్టమైనా, నిష్ఠూరమైనా సత్యశోధనాదృష్టి కావాలి. మన పూర్వీకులు ఏం చెప్పారు ? ఆచరణలో ఏం చేశారు ? ఇవే మనక్కావాల్సినవి.

వేదాలు కాకపోతే వాటికి ప్రత్యామ్నాయభూతాలైన మతగ్రంథాలు చాలా ఉన్నాయి. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవనానికి గానీ మతవిద్యకి గానీ వేదాలు తప్పనిసరి కాదు. అయితే ఈ రోజుల్లో స్త్రీలే కాక పురుషులు కూడా వేదాభ్యాసం మానేశారు కనుక ఇప్పుడీ చర్చ పెద్దగా ఉపయుక్తం కాదు. చినజీయర్ గారు దళితులకి వేదాలు బోధించడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఏడాదవుతున్నా ఇప్పటికీ ఒక్క దళితుడు కూడా వారి ఆశ్రమాల్లో చేఱలేదు. ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. స్త్రీలకి వేదమంత్రాల శిక్షణని పూర్వులు వద్దన్నారా ? వద్దంటే ఎందుకు వద్దన్నారనేది ఈ వ్యాసంలో శోధిస్తున్నాము.

పాశ్చాత్యుల మాదిరి జ్ఞానాన్ని మన పూర్వీకులు కనిపించిన ప్రతివారికి (Mass education drive) ఉద్దేశించలేదు. ఇక్కడ యోగ్యతకే అగ్రతాంబూలం. భారతీయ విద్యావ్యవస్థలో గురువు శిష్యుల్ని పోగేసి డబ్బు సంపాదించుకోడు. శిష్యుడే జ్ఞానదాహంతో గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి. అతని అర్హత, యోగ్యత, గురుభక్తి, శ్రద్ధ, శక్తి మొదలైన వాటిని సాకల్యంగా పరీక్షించి అతన్ని తన సేవలో నియోగించి చూచి, ఆ తరువాతనే అతనికి విద్యోపదేశం చెయ్యడం భారతీయ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో స్త్రీల జీవితం ఇమడదు. వారు మగవారి వలె గురువుని వెతుక్కుంటూ ఇల్లు వదిలి వెళ్ళడం ఈ దేశంలో ఊహకందనిది. ఈ కాలపు పబ్లిక్ స్కూల్ తరహా బళ్ళు ప్రాచీనకాలంలో ఎఱగరు. దగ్గఱలో తెలిసిన గురువుల వద్ద చేఱాలన్నా మగపిల్లల వలె వారిని చిన్నవయసులోనే తల్లిదండ్రుల నుంచి వేఱుచేసి విద్య నిమిత్తం గురువుగారి ఆశ్రమంలోనే ఉండే విధంగా చెయ్యడం ఎక్కడా వినపడలేదు, కనపడలేదు. బ్రహ్మచారులు ముప్ఫయ్యో యేట విద్యాభ్యాసాన్ని ముగించి, బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకోవాలని మనువు చెప్పాడు. అది ఆడపిల్లల విషయంలో సాధ్యం కాదనేది జగద్విదితమే. అదీ గాక ఆశ్రమధర్మాల్లో స్త్రీలకి బ్రహ్మచర్యం విధించబడలేదు. స్త్రీధర్మ ప్రకరణంలో కూడా వారికి బ్రహ్మచర్యాశ్రమం విధించబడలేదు. బ్రహ్మచర్య సంస్కారం లేకుండా వేదాధ్యయనం సాధ్యం కాదు (అనుమతించబడలేదు). స్త్రీల శిష్యఱికం వివాహంతోనే మొదలవుతుంది. వారికి భర్తే గురువు. ఆ గురువే ఆమెకి మంగళసూత్రధారణ చేస్తాడు. ఈ విషయమై మను మహారాజు తన ధర్మశాస్త్రంలో చెప్పినది గమనించండి :

శ్లో|| అమంత్రకా తు కార్యేయం స్త్రీణామావృదశేషతః |
సంస్కారార్థం శరీరస్య యథాకాలం యథాక్రమమ్ || (II-66)

తాత్పర్యము : శరీర సంస్కారము కొఱకు స్త్రీలకు చేయు జాతకర్మలను అమంత్రకముగా (వేదమంత్రములను ఉచ్చరించకుండ) సకాలమున శాస్త్రోక్తముగా చేయవలయును.

(స్త్రీలు వేదమంత్రాల్ని ఉచ్చరించకూడదని/ వినకూడదని మనువు ఇక్కడ స్పష్టంగా సూచించి ఉండడాన్ని గమనించవచ్చు)

శ్లో|| వైవాహికో విధిః స్త్రీణాం సంస్కారో వైదికః స్మృతః |
పతిసేవా గురౌ వాసో గృహార్థోఽగ్నిపరిక్రియా || (II-67)

తాత్పర్యము :- "స్త్రీలకు వివాహ సంస్కారమే అన్నివిధములైన వైదిక సంస్కారములున్ను అగును" అని పూర్వులచే చెప్పబడినది. పతిసేవయే వారికి గుర్వాశ్రమ వాసము. ఇంటి నిర్వహణ నిమిత్తము నిప్పు రాజవేయుట (వంట) యే వారికి అగ్నిహోత్రకార్యము.

వేదమంత్రాల ప్రధాన ప్రయోజనం హవ్యవాహనుడైన అగ్నిలో వ్రేల్చే హవిస్సుల ద్వారా ఇతరదేవతల్ని ప్రసన్నుల్ని చేసుకోవడం. కానీ స్త్రీలకి ఆ విధమైనఅగ్నికార్యమే పైన చెప్పిన విధంగా నిషేధించబడినప్పుడు వారికి వేదమంత్రాలతో ప్రయోజనం లేదనేది స్పష్టం. గృహంలో అవిచ్ఛిన్నమైన అగ్నికార్యం నిమిత్తంపురుషులకు పునర్వివాహం అనుమతించబడింది. (గృహస్థులే అగ్నికార్యం నిర్వర్తించాలి కనుక) కానీ స్త్రీలకి అనుమతించబడలేదు. దాన్ని బట్టి వారికి వేదాధ్యయనం లేదని మనకి ప్రస్ఫుటంగా తెలుస్తున్నది.

మనుధర్మశాస్త్రం ఎప్పటిది ? అంటే గ్రంథగత సాక్ష్యాల్ని బట్టి కనీసం అయిదువేల సంవత్సరాల నాటిది. ఎందుకంటే అందులో ప్రవహిస్తున్న సరస్వతీనది ప్రస్తావన ఉంది. కానీ సరస్వతీనది క్రీ.పూ.3000 నుంచి అప్పుడప్పుడు ఎండిపోవడం మొదలుపెట్టి క్రీ.పూ. 2000 నాటికి సంపూర్ణంగా అంతర్వాహిని అయిందని భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది. ఆ వివరాలు ప్రస్తుతం నా దగ్గఱ లేవు. అంటే స్త్రీలకి వేదమంత్రాల నిషేధం ఈనాటిదీ కాదు. మధ్యలో వచ్చిపడినది అంతకంటే కాదు.

ఇందుకు పూర్వపక్షంగా కొందఱు ఉటంకించే వేదార్థాలు ఆ కాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేసేవారనడానికి సాక్షీభూతంగా కనిపించడంలేదు. వైదికమతంలో ఉన్నవారు వేదాధ్యయనం చేసినా, చెయ్యకపోయినా వేదోక్తముల ననుసరించి తమ జీవితాల్ని గడుపుకోవలసిందే కదా. అందుకు స్త్రీలు మినహాయింపు కాదు కనుక అలా చెప్పబడింది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె భర్త బదులు (అతని ప్రతినిధిగా, అతని అనుమతితో, ఆజ్ఞతో) నిత్యనైమిత్తికాలకి ప్రత్యవాయం లేకుండా సంధ్యోపాసననీ, అగ్నిహోత్రాన్ని నిలబెట్టాలని చెప్పబడింది. స్త్రీకి వివాహమే ఉపనయనం కనుక గురువైన భర్త యొక్క ఆజ్ఞతో ఆమె ఈ పనులు చెయ్యడానికి సాంకేతికంగా అభ్యంతరం లేదు. అయితే ఈ పనులు కూడా వేదమంత్రపూర్వకం కాదు. "భర్త లేనప్పుడు" అని నిర్దేశించడానికి కారణమేంటో మనవి చేస్తాను. ఆహితాగ్నులనే బ్రాహ్మణులున్నారు. వారు నిరతాగ్నిహోత్రులు. అంతే వారి యింట్లో హోమాగ్ని నిరంతరం రాత్రీ పగలూ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది, ఉండాలి కూడా. ఆవిధంగా వారు దీక్ష తీసుకుంటారు. ఏ కారణం చేతనైనా ప్రజ్వరిల్లడం ఆగిపోతే మహాదోషం. ఆ అగ్నులు అతని మాంసానికి ఆశిస్తాయని చెప్పబడింది. కనుక ఆ దోషనివారణ కోసం భర్త గ్రామాంతరం ప్రవాసం వెళ్ళినప్పుడు ఆ అగ్నులు ఆరకుండా గృహిణి చూసుకోవాలని నిర్దేశించారు.

శ్రీ మహాభాగవతం లో శ్రీ వేదవ్యాస మహర్షులవారు వ్రాసిన మాట చూడండి :

స్త్రీశూద్రద్విజబంధూనాం త్రయీ న శ్రుతిగోచరా |
కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ |
ఇతి భారతఖ్యానం కృపయా మునినా కృతమ్ ||

(శ్రీమన్మహాభాగవతమ్ - ప్రథమస్కంధః - చతుర్థోఽధ్యాయః - శ్లో.25)

తాత్పర్యము :- స్త్రీలును, శూద్రులును మఱియు ద్విజకులాల నుండి భ్రష్టులైనవారును వేదములను వినకూడదు కనుక ధర్మకర్మముల మర్మమెఱుగనివారికి ఈ మహాభారతము ద్వారా మేలు కలుగును గాక ! అని శ్రీ వేదవ్యాసమహర్షి కరుణతో యోచించి ఆ యితిహాసమును నిర్మించెను.

దీన్ని బట్టి గత అయిదువేల సంవత్సరాలకు పైబడిన చరిత్రలో స్త్రీలు వేదాలు చదవలేదని స్పష్టమవుతున్నది. మతేతర (secular) ఆధారాలు లభిస్తున్న చరిత్రలోను, సాహిత్యంలోను సైతం ఏ ద్విజకుల స్త్రీలకిని వేదపరిజ్ఞానం ఉన్నట్లుగా తెలియరావడంలేదు. దీనికి ఫెమినిస్టులూ, కమ్యూనిస్టులూ వక్రభాష్యం చెబుతున్నట్లు - స్త్రీలని అణగదొక్కే ఉద్దేశం కారణం కాకపోవచ్చు. ఆ మాటకొస్తే వేదం రాని పురుషులు కూడా అన్ని కాలాల్లోను విస్తారంగా ఉండేవారని మనకు పూర్వగ్రంథాల ద్వారా అవగతమవుతున్నది. వేదాల్ని ఆదిఋషులు దర్శించేనాటికి భూమండలం మీద మానవ జనాభా కొన్నివేలకు మించకపోవచ్చు. ఆ వాతావరణంలో ఎవరూ ఎవరినీ అణగదొక్కే ప్రస్తావన ఉండకపోవచ్చు.

"స్త్రీలు వేదమంత్రాలు చదవకూడదని మన పూర్వులు ఎందుకంత గట్టిగా చెప్పారు ?" అని నేను ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచిస్తూండగా నాకు శ్రీ షిర్డీ సాయిబాబావారు స్ఫురింపజేసినది ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ మాట ఏ శాస్త్రంలోను మీకు కనిపించదు. పురుషులు అగ్నితత్త్వ శరీరాలు కలిగినవారు. స్త్రీలు జలతత్త్వశరీరాలు కలిగినవారు. మంత్రాలు కూడా అగ్నితత్త్వం కలిగినవి. అందుచేత ఏ తత్త్వం గలవారు ఆ తత్త్వానికి సంబంధించిన అనుష్ఠానమే చెయ్యాలి. స్త్రీలు జపించిన (వేద) మంత్రాలు నిర్వీర్యమవుతాయని శ్రీ గురుచరిత్రలో దత్తాత్రేయస్వాములవారు స్వయంగా సెలవిచ్చారు. అందుక్కారణం - వారి భౌతిక ఉపాధి (శరీరం) జలతత్త్వం గలది కావడమూ, అందులో అగ్నితత్త్వం గల (వేద) మంత్రాలు ఇమడకపోవడమూ. అదీ గాక చాలామంది స్త్రీల ఆరోగ్యం బహు సున్నితమైనది కనుక స్థిరమైనది కాదు. తమకు తరువాతి మాసధర్మం ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా చెప్పలేనివారి సంఖ్య చాలా ఎక్కువ. అందుచేత వారికి పవిత్రమైన వేదమంత్రాల్ని నేర్పడమూ, ఇతర మత కార్యక్రమాల్ని అప్పగించడమూ ఒక పెద్ద రిస్కుగా పూర్వీకులు భావించి ఉండవచ్చు. అందుకని వారికోసం కావ్యసంస్కృత భాషలో వివిధ స్తోత్రాల్ని, వ్రతాల్ని నిర్దేశించారు.

పురుషులు భార్య లేకుండా హిందూధార్మిక విధుల్ని నిర్వర్తించరాదనడాని క్కూడా వారి అగ్నితత్త్వ శరీరాలే కారణం. పురుషుడు అగ్ని. మంత్రం అగ్ని. హోమం అగ్ని. అనుష్ఠానం ద్వారా ఇన్ని అగ్నులు ఒకేసారి ప్రజ్వరిల్లితే అది ఇతరులకు ఉపద్రవంగా మారుతుంది. కనుక ఆ అగ్నుల్ని సమతూకం (balance) చెయ్యడం కోసం భార్య ఉండాలన్నారు.

రామాయణం సుందరకాండలో శ్రీ హనుమంతులవారు శ్రీ సీతా మహాదేవి కోసం వెతుకుతున్న సందర్భంలో లంకలో ఒక నదిని చూసి "సీతాదేవి ఈ లంకలో ఉన్న పక్షంలో సంధ్యోపాసన నిమిత్తం ఇక్కడికి తప్పకుండా రావచ్చు. అప్పుడామెని నేను గుర్తుపడతాను" అనుకుంటారు.

శ్లో|| సంధ్యాకాలమనాః శ్యామా ధ్రువమేష్యతి జానకీ |
నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణినీ ||


అయితే అమ్మవారి సంధ్యోపాసన వేదమంత్రపూర్వకం కాకపోవచ్చు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి