26, సెప్టెంబర్ 2009, శనివారం

ఆడుకుందాం....రా !

ఆనందస్వరూపులారా ! నమస్కారములు.

మన తెలుగువాళ్ళ తొలితొలి పూర్వీకులు గొప్ప మహర్షులూ, యోగులూ అయ్యుండాలి. (విశ్వామిత్రుడి కుమారుడైన ఆంధ్రుడి సంతానం అని పురాణాల్లో రాశారు) ఎందుకంటే తెలుగుభాషలో ప్రతి క్రియాపదమూ ఆటగా భావించబడుతుంది. వెతుకులాట, మాటలాట, పోటులాట, నవ్వులాట మొ||

భగవంతుడి లక్షణాల్లో ఒకటి లీలావిలాసం. అనగా ఆడుకోవడం. ఎందుకంటే ఆయన నిరంతర ఆనందస్వరూపుడు. ఆయనా, ఆవిడా ఎల్లప్పుడూ ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దఱూ శాశ్వతంగా చిన్నపిల్లలే కనుక వాళ్ళకి ఏ గొడవలూ రావు. అందుచేత ఆడుకునే స్వభావం ఉన్నవారందఱిలోను భగవత్తత్వం ఎక్కువ ప్రకాశమానమవుతుంది. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, కవులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు మొదలైనవారన్నమాట. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుఱించి ఒక మాట. ఏయే పిల్లల జాతకాల్లో గురుగ్రహం బలంగా ఉంటుందో ఆ పిల్లలందఱికీ ఆటల పిచ్చి చాలా ఎక్కువ. అలాగే సప్తమస్థానం గురుగ్రహం చేత ప్రభావితమైన వారందఱికీ శృంగారాభిముఖ్యం ఎక్కువ. ఎందుకంటే శృంగారం కూడా ఒక ఆటే. ఇక్కడ గురుగ్రహ ప్రస్తావన ఎందుకు ? అనడిగితే - గురుగ్రహం పరమాత్మకి ప్రతిబింబమని ప్రశ్నశాస్త్రంలో చెప్పారు. కనుక ఆ గ్రహప్రభావం ఎక్కువగా ఉన్న జాతకాల్లో పరమాత్మతత్త్వం ఎక్కువగా వ్యక్తమవుతుంది.

నిజానికి అందఱమూ చిన్నపిల్లలుగానే జన్మించాం. ఆడుకుంటూనే పుట్టాం. ఆనంద స్వరూపులుగానే పుట్టాం. కానీ వయసు మీదపడేకొద్దీ ఇలా శోకమూర్తులుగా ఎలా పరిణమించాం ? దీనిక్కారణం - మనం ఆడుకోవడం మానేశాం. జీవితాన్ని ఆటగా చూడ్డం మానేశాం. చుట్టూ జఱిగేవాటిని చూసి నవ్వడం మానేశాం. దాన్ని గంభీరంగా తీసుకుంటూ, అవసరమైనదానికంటే గంభీరంగా తీసుకుంటూ మానసికంగా అదే మనంగా పరిణమించి క్రమంగా దుఃఖసాగరంలో మునిగిపోతున్నాం. అందుచేత మన ఆయుర్దాయాలు కూడా తగ్గిపోతున్నాయి. పూర్వీకులు నాలుగొందలేళ్ళు బతికేవారని పురాణాల్లో రాస్తే అవి పుక్కిటి పురాణాలంటున్నాం. నాకది ఆశ్చర్యం కలిగించదు. మానవుడి కున్నట్లే మానవజాతి క్కూడా ఒక బాల్యం ఉంది. వాళ్ళు దేన్నీ గంభీరంగా తీసుకోని స్థితిలో ఎక్కువకాలం బతికే అవకాశం ఉంది. ఇప్పుడు మన సగటు ఆయుర్దాయం అఱవయ్యేళ్ళకి, డెబ్భయ్యేళ్ళకి పడిపోయిందంటే, డెబ్భై దాటి బతికినవాణ్ణి మనం అదృష్టవంతుడుగా చూసే స్థితికి వచ్చామంటే మనం ఎన్నిరెట్లుగా ఆనందానికి దూరమయ్యామో, ఎన్నిరెట్లుగా నవ్వుల్ని కోల్పోయామో, ఎన్నిరెట్లు గంభీరంగా జీవితాన్ని తీసుకుంటున్నామో ఆలోచించాలి. మనం మళ్ళీ పూర్వపు ఆనంద స్వరూపులుగా మారాలంటే మళ్ళీ ఆడుకోవడం మొదలుపెట్టాలి. అలా చెయ్యాలంటే చదువుల ద్వారా, సంపాదన ద్వారా, సంఘజీవితం ద్వారా మనం దేనికైతే గుఱిచేయబడ్డామో ఆ సుదీర్ఘమైన de-sportivization ప్రక్రియని విదిలించుకొని బయటపడాలి. జీవితం పట్లను, మనుషుల పట్లను, ప్రపంచం పట్లను ఈ అతిగంభీర వైఖరిని, ఈ అంకిత భావాన్ని ఉజ్జగించాలి. మనిషి తనలోని పసిబిడ్డ బతికున్నంతకాలమే ప్రాణాలతో జీవించి ఉంటాడు. ఆ పసిబిడ్డ చనిపోతే అతను చనిపోతాడు. ఆ పసితనమే అతని Core personality. ఆ పసితనాన్ని నిలబెట్టడం, నిలబెట్టుకోవడం ఇది మనం చెయ్యాల్సినది.

అసలు భగవంతుడు ఈ ప్రపంచాన్ని చాలా అందంగానే సృష్టించాడు. ఆనందమయంగానే సృష్టించాడు. కానీ మనిషి దాన్ని పాడుచేసి "ఏంటో ఈ ప్రపంచం అందంగా లే" దంటున్నాడు. మనిషిని కూడా భగవంతుడు తనలాంటి ఆనందస్వరూపుడుగానే సృష్టించాడు. కానీ మనిషి ఆడుకోవడం మానేసి తోటి మనుషుల్ని దుర్మార్గులుగా, రాక్షసులుగా అభివర్ణించి తన మనసు పాడుచేసుకుని "జీవితం దుఃఖభాజనం" అని ఆరోపిస్తూ ఇలాంటి ప్రపంచాన్ని, జీవితాన్ని సృష్టించిన దేవుడు ఒక శాడిస్ట్ అయ్యుండాలంటున్నాడు. "కనుక అసలు దేవుడనేవాడే లేడు పొ"మ్మంటున్నాడు.

ఏం వెఱ్ఱితనం ! మనం ప్రతిదాన్ని ఒక ఆటగా తీసుకోవడం మొదలుపెట్టిన మఱుక్షణం, సంఘంలో ప్రతి ఆటని ఆ ఆట నియమాల ప్రకారం ఆడేసి మర్చిపోవడం నేర్చుకున్నాక దీని స్వరూపమే సమూలంగా మారిపోతుంది. దేవుడి సృష్టే కాదు, మనుషుల సృష్టి (వ్యవస్థలు) కూడా ఆనందం కోసమే సృష్టించబడింది. కానీ ఆటని ఆటగా చూడలేని గంటుమొహాల మూలాన అవి తమ ఆనంద స్వభావాన్ని కోల్పోయాయి. ఎంట్రన్స్ ఎగ్సాములు ఒక ఆట. ఉద్యోగాలు ఒక ఆట. డబ్బొక ఆట. పదవులొక ఆట. వీటిని ఆటలుగా పరిగణించడం మానేశాక, ఇతరుల దుర్బోధలు (వాళ్ళ దృష్టిలో అవి సద్బోధలు) విని మనం ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాక ప్రవేశించింది మన జీవితంలో దుఃఖం. కానీ మనం దాన్ని దుఃఖం అనుకోవడం లేదు. మనమేదో పెద్ద అనుభవ సంపన్నులమయ్యామనీ, ముదిరామనీ, ముగ్గామనీ, మాగామనీ భ్రమిస్తున్నాం. ఆటని ఆటగా చూడలేనివాళ్ళు ఎదిగినట్లు కాదు. యోగసాధనకి విధించిన నియమాల్లో ఒకటి - ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం. అన్నీ వదులుకుని ఆనందంగా ఎలా ఉంటాం ? అనడుగుతారు. మనం సాధారణంగా ఎవరిని ఇష్టపడతాం ? అచ్చంగా మనలాంటి స్వభావం గలవారినే కదా ? దేవుడైనా అంతే. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. తనలా ఆడుకునేవాళ్ళ కోసం, తృప్తిగా ఆనందంగా ఉండేవాళ్ళకోసం ఆయన ఎదురుచూస్తూంటాడు.

మనిషి ఒకటి కావాలి అనుకుంటే దాన్ని ఇంకా పొందకుండానే దాన్ని పొందినట్లుగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. బ్రహ్మానందం అనేదేదో ఒకటుందని వేదాంత గ్రంథాల్లో చదివి "అది మనకి లభించడంలేదే ?" అని చింతాక్రాంతులవుతారు. ఇప్పుడు ఆనందంగా ఉండం నేర్చుకుంటే బ్రహ్మానందం కాలక్రమంలో దానంతట అదే సిద్ధిస్తుంది. కర్మయోగమంటే ప్రతిపనినీ ఒక పసిబిడ్డలా, ఆనందాన్ని తప్ప ఇంకేమీ ఆశించకుండా ఆటలా చెయ్యడం. నియమాల ప్రకారం ఆడేస్తూ అదే సమయంలో దాంట్లో తాదాత్మ్యం చెందకపోవడం. మనం వినే గొప్పగొప్ప ఆదర్శాలూ, వ్యక్తిత్వ వికాసాలూ గట్రా అన్నీ మనలోని పాత పసిబిడ్డని తిరిగి బతికించడానికి ఉద్దేశించినవే. అవి ఇప్పటికే నీలో ఉన్నాయి. కొత్తగా పూసుకోవాల్సిందేమీ లేదు. ఉన్నది పాడు చేసుకోకుండా ఉంటే చాలు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి