6, సెప్టెంబర్ 2009, ఆదివారం

నీతి అనగా నిగ్రహమే సుమా !

శ్లో|| జ్ఞానే మౌనం క్షమా శక్తౌ త్యాగే శ్లాఘావిపర్యయః |
గుణా గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ ||

తెలిసినా మౌనం వహించడం, శక్తిసామర్థ్యాలు ఉండీ ఇతరుల తప్పుల్ని క్షమించడం, దానం చేశాక ఇహ దాన్ని గుఱించి చెప్పుకోకపోవడం - ఈ గుణాలు దిలీప మహారాజుకి పుట్టుకతోనే వచ్చాయంటాడు కవికుల గురువు శ్రీ కాళిదాసమహాకవి తన చిట్టచివఱి కావ్యమైన రఘువంశంలో !

నీతి (Ethics) అంటే ఏమిటి ? అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు కాళిదాసు చెప్పినట్లు శక్తి ఉండీ ఓర్పు వహించడమేనని సమాధానం వస్తుంది. ఇందులో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి నీతి, రెండోది శక్తి. నీతికావాలంటే శక్తి కూడా కావాలి. శక్తి కోరుకునేవాడు అదే సమయంలో క్షమాగుణాన్ని (నిగ్రహాన్ని, ఆత్మనిగ్రహాన్ని) కూడా కోరుకోవాలి. శక్తిహీనుడు నీతిమంతుడిలా కనిపిస్తున్నప్పటికీ అతను ఏ మాత్రం నీతిమంతుడో అతను శక్తిహీనుడుగా ఉన్నంతకాలం అది తెలుసుకునే అవకాశం మనకి ఉండదు. నపుంసకుడు స్త్రీల జోలికి వెళ్ళకుండా మంచిపేరు తెచ్చుకోవడం లాంటిదది. పిఱికివాడి శాంతికాముకత లాంటిదది.

తెలిసినా మౌనం వహించేవాడట దిలీపుడు. అదేంటి ? ఎందుకలా చేసేవాడు ? తెలిసింది తెలిసినట్లు మాట్లాడ్డానికి అభ్యంతరమేంటి ? అంటే, నిష్కల్మషంగా మాట్లాడే అలవాటున్న ప్రతివాడూ వాచాలుడనకూడదు గానీ "తెలిసింది గదా" అని ప్రతిదాని మీదా అసందర్భంగా ఎడాపెడా మాట్లాడెయ్యడం అనవసరమైన వాచాలతే అవుతుంది. మాట్లాడమని ఇతరులు మనల్ని అడగాలి. అలా అడిగే అవసరం వాళ్ళకి కలగాలి. ఆ క్షణం కోసం తెలిసినవాడు ఎదురుచూడాలంతే ! దీనికి ఇంకో కోణం ఏంటంటే - కొన్ని విషయాలు అడిగినా చెప్పడం అనవసరమంటాడు మనువు ఒకచోట ! "తెలిసినా చెప్పడం దండుగ. వినేవాడే తప్ప ఆచరించేవాడెవడూ లే" డంటాడు.

సరే, సందర్భం వచ్చినప్పుడే మనం నోరు విప్పాలి. బావుంది. కానీ ఆ క్షణం వచ్చేసిందని గుర్తుపట్టడం ఎలా ? అందుకు తెలివితేటలు కావాలి. "అరే ! ఇప్పటిదాకా నీతి అన్నారు. ఇప్పుడేమో తెలివితేటలంటున్నారు. అసలేంటి మీ ఉద్దేశం ?" అనడిగితే అదంతే ! అనాల్సొస్తుంది. సరైన తెలివితేటలు సరైన నీతిమయ జీవనానికి త్రోవ చూపిస్తాయన్నమాట. "A rogue is none but a roundabout fool" అన్నాడు ప్రముఖ ఆంగ్ల సాహితీకారుడు Coleridge. వెధవాయి అనగా ఎవరయ్యా ? అంటే, వాడు చుట్టుతిరుగుడు మార్గంలో ఉన్న మూర్ఖుడన్నాడు. అంటే వాడు పైకి తెలివిగలవాడిలా కనిపిస్తాడు. తన గుఱించి తానలా అనుకుంటాడు కూడా. కానీ సుదీర్ఘకాల దృష్ట్యా వాడొక వెఱ్ఱినాగన్న. కాలం చివఱికివాడినొక తెలివితక్కువవాడుగా నిరూపిస్తుందట.

తప్పులు చేసే అవకాశం ఉండీ చెయ్యకపోవడం నీతిమయ జీవనానికి గానీ, దానిమీద ఆధారపడి ఉన్న ఆధ్యాత్మిక జీవనానికి గానీ తొలిమెట్టు. తప్పులు చెయ్యడం మానుకోవాలంటే ఏం చెయ్యాలి ? అనడిగితే ముందస్తుగా ఒప్పులు చెయ్యడం కూడా మానెయ్యాలన్నదే నా సమాధానం. అదేంటి ? అనడిగితే, అసలు తప్పులెందుకు చేస్తారు మనుషులు ? అనే ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవాలి. ఎక్కువ శాతం తప్పులు దిలీప మహారాజు గుణాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల జఱిగేవే. అంటే నిగ్రహం లేకపోవడం వల్ల జఱిగేవే. మనకి చెడ్డ విషయాల్లో ఏ విధంగా నైతే నిగ్రహం లేదో, మంచి విషయాల్లో కూడా అలాగే నిగ్రహం లేదు. మంచి విషయాల్లో అలా దూకుడుగా ప్రవర్తించడం అలవాటై చెడ్డ విషయాల్లో కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. ఉదాహరణకి - చేతిలో పెన్నో, పెన్సిలో ఉన్నవాడు ఊరికే కూర్చోకుండా అది పెట్టి ఏదో బరుకుతూనే ఉంటాడు. తన పేరో, తన ప్రియురాలి పేరో, మఱొకటో ! అదే మఱి నిగ్రహం లేకపోవడమంటే. తమ చేతుల్లో ఉన్నదాన్ని జనం వాడుకోకుండా ఉండలేరు. ఆ లక్షణాన్ని వదిలించుకున్నప్పుడు మన మాటల్నీ, చేష్టల్నీ ధర్మదేవత తన అదుపులోకి తీసుకుంటుంది. అంటే ఆ తరువాత మనం ఏం చేసినా అది నీతే అవుతుంది.

మనం ఏకాదశీ ఉపవాసాలు చేస్తే, అలా మన కడుపు మాడ్చుకుంటే విష్ణుమూర్తికి కలిగే ప్రసన్నత ఏంటి ? మనం ఆకల్తో అల్లాడితే ఆయనకొఱిగేదేమిటి ? కాశీలో ఏదో ఒక కాయగూరని వదిలిపెడితే విశ్వేశ్వరుడికి ఏంటి లాభం ? అనడిగితే -తినగలిగీ తినకపోవడం. అదొక నిగ్రహం. ఆ నిగ్రహం ఒక తపస్సు. అదీ ఆయనకి ఆనందాన్ని కలిగించేది. ఆ తపస్సు ద్వారా తన బిడ్డలు తనంతటి వాళ్ళవుతూంటే ఏ తండ్రికి సంతోషం కలగదు ? దేవుడి రాడార్ త్యాగాల సంకేతాల కోసంవెతుకుతూంటుంది. అందుచేత ఉపవాసానికి వర్తించేదే వివాహానికీ వర్తిస్తుంది. వివాహాన్ని ఆశీర్వదించే భగవంతుడు వ్యభిచారాన్ని, అక్రమ సంబంధాన్ని ఎందుకాశీర్వదించడు ? అక్కడ ఇక్కడా చేసేది ఒకటే అయినప్పుడు అది పుణ్యంఎందుకయింది ? ఇది పాపమెందుకయింది ? అనడిగితే, ఉన్న తేడా అల్లా వివాహం ప్రతిపాదించే నిగ్రహం కాన్సెప్టులో ఉంది. "ఈ స్త్రీని చేసుకున్నాను. ఇంకో స్త్రీ జోలికి పోను." ఇది, ఈ ప్రతిజ్ఞే భగవంతుడికి నచ్చేది. వివాహానికి వర్తించేదే వావివరుసలకీ వర్తిస్తుంది. అన్నీ కావాలనే పచ్చిస్వార్థం నుంచి బయటపడ్డం, కొన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డం - ఇది భగవంతుణ్ణి సంతుష్టుణ్ణి చేసేది. ఎంత కొద్దిపాటి త్యాగభావన, ఎంత చిన్నపాటి నిగ్రహమూ కనిపించినా ఆయన మనసు పరవశిస్తుంది.

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ | (భగవద్గీత)

ధర్మాన్ని ఎంత కొంచెం ఆచరించినా అది గొప్ప భయం నుంచి మానవాత్మను కాపాడుతుంది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి