పాశ్చాత్య జీవనశైలికి ఖండన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాశ్చాత్య జీవనశైలికి ఖండన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జూన్ 2012, మంగళవారం

చారిత్రిక అనుభవాలనుంచి హిందువులు గుణపాఠాలు నేర్వాలి

పాశ్చాత్య విద్యా వ్యామోహం ఒక తీయని విషం. అది ఆధునికీకరణ పేరుతో అమలవుతున్న భస్మాసుర హస్తం. అది మనల్ని కరకరా నమిలి మింగడానికి సిద్ధంగా ఉన్న కలిపురుషుడి కరాళదంష్ట్ర. ప్రతివారినీ బాగు చేసేస్తామని ప్రచారం ద్వారా మభ్యపెట్టి, వాళ్ళ చేతికి ఒక లాటరీ టిక్కెట్టిచ్చి, వారందఱినీ తమ పూర్వస్థానాల నుంచి భ్రష్టుల్ని చేసి, ఆఖరికి వారిలో కొద్దిమందిని మాత్రం బాగుచేసి మిగతా కోట్లాదిమందిని పేదలుగా, అనాథలుగా మిగిల్చే ఒక మోసపూరిత ప్రక్రియ. ఉదాహరణకి, మన రాష్ట్రంలో యావత్తు విద్యావిధానమూ జనాన్ని అమెరికా, ఆస్ట్రేలియా పంపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అందఱమూ ఇంగ్లీషు నేర్చుకొని రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోదామనే పిఱికి ఎస్కేపిస్టు ఫిలాసఫీని ఇది ప్రచారం చేస్తోంది. పాఠశాలలకి పేర్లు కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగానే పెడుతున్నారు, తల్లిదండ్రుల్ని ఆకర్షించే ఉద్దేశంతో ! కెనడీ హై అట, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ అట. చైతన్య టెక్నో అట.... వీటిల్లో చదివే పిల్లలంతా భావి అమెరికన్లు గా భావించుకోబడుతున్నారు గనుక వీటిల్లో తెలుగనే సబ్జెక్ట్ ఉండదు. తెలుగు రావడం ఈ కాబోయే బ్రౌన్ అమెరికన్లకి అవమానం గదా !

ఈ హైప్ వెనక ఉన్న వాస్తవమేంటంటే, నిజానికి అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, యూరప్ లోనూ ప్రస్తుతం పెద్దగా ఉద్యోగాలేమీ లేవు. వాళ్ళకే లేవు. ఇంక మనకేమిస్తారు ? గత కొద్ది సంవత్సరాలుగా ఆ దేశాలు గొప్ప ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. అందులోంచి అవి ఎప్పుడు బయటపడతాయో ఎవఱికీ తెలీదు. వాళ్ళు ఏటా మనకు జారీ చేస్తున్న వీసాలు కేవలం కొద్దివేలల్లోనే ! అయినా ఆ లక్ష్యంతోనే మిలియన్లాదిమంది చదువుకుంటున్నారు దేశీ బ్రౌన్ అమెరికన్ స్కూళ్ళల్లో ! కానీ అక్కడికి పోవడాన్ని ఘనపఱుస్తూ ఆ వలసవాద, వలసదారీ భావజాలాన్ని మనకు అమ్మజూపుతున్నాయి ఈ విద్యాసంస్థలు. "చచ్చినోడి కళ్ళు చేరెడేసి బాబూ, రండి, రండి ! భలే మంచి బేరము" అని కేకేస్తూ ! మన తెలివితేటలు మన దేశాభివృద్ధికీ, మన సాంస్కృతిక వారసత్వానికీ పనికొచ్చే విధంగా మన విద్యావిధానం ఉండాలి. చైనాకి పనికిరావాలని జపాన్ వాళ్లు చదువు నేర్చుకోరు. ఫ్రాన్సుకి పనికొచ్చే ఉద్దేశంతో స్పెయిన్ వాళ్ళు చదువు నేర్చుకోరు. కానీ ఇండియాలో - ముఖ్యంగా ఆంధ్రాలో అంతా తారుమారుగా చిత్రవిచిత్రంగా నడుస్తోంది.

గతంలో మన రాష్ట్రంలో ఒక సనాతన సామాజిక వర్గం ఇలాంటి వ్యామోహాల్లో పడి ఎలా అధః పతనం చెందిందో మనకు కనువిప్పు కావాలి.  

స్వాతంత్ర్యానికి ముందు బ్రాహ్మణులకు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల వ్యావసాయిక ఎస్టేట్లు ఉండేవి.బ్రాహ్మణులు ఒక బలీయమైన వ్యవసాయకులంగా ఉండేవారు. వనపర్తి, ఉర్లామ్, పోలవరం లాంటి చోట్ల వారు రాజాలుగా, జమీందార్లుగా కూడా ఉండేవారు. ఇంత స్థాయిలో కాకపోయినా ప్రతి బ్రాహ్మణుడికీ ఎంతో కొంత పొలం ఉండేది. ఆ రోజుల్లో బ్రాహ్మణుల రాజకీయ నాయకత్వానికి వారి దేశభక్తితో పాటు ఈ భూస్వామ్యం కూడా ఒక కారణం. దేశం ఎంతగా బ్రాహ్మణుల్ని అనుసరించేది అంటే - మొట్టమొదటి లోక్‌సభ (1952) కు ఎన్నికైన MP లలో 340 మంది బ్రాహ్మణులేనంటే ఈనాటివారికి దిగ్భ్రాంతి కలగొచ్చు. పత్రికలూ, పుస్తక ప్రచురణ, రేడియోల్లాంటి మీడియా కూడా బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేది. స్వాతంత్ర్యానంతరం కేవలం ఒకటి=రెండు దశాబ్దాల్లోనే ఈ స్థితిమత్త్వం నెమ్మదినెమ్మదిగా అదృశ్యమౌతూ వచ్చింది. ఇందులో బ్రిటీషువారు రాజకీయ కక్షలతో చేసినదాని కంటే, లేదా భూసంస్కరణల పేరుతో దేశీ ప్రభుత్వాలు లాక్కున్నదానికంటే బ్రాహ్మణులు అనాలోచితంగా దూరదృష్టిలేమితో స్వయంగా చేసుకున్నదాని పాత్రే చాలాఎక్కువ. 

బ్రాహ్మణులు చేసిన పొఱపాటు ఏంటి ? అంటే, వారు ఒక దశలో బ్రిటీషువారిచ్చే ఉద్యోగాల కోసం, లేదా లా చదవడం కోసం ఉన్న భూములమ్మేసి పట్టణాలకు చేఱుకోవడం. లేదా ఆ పొలాల్ని ఎవఱో ఇతర కులస్థులకు కౌలుకిచ్చేసి పట్టణాలకు చేఱుకోవడం. ఆ తరువాత ఆ భూములతో, ఆ ఊళ్ళతో సంబంధాలు తెగిపోవడం. ఆ తరువాత వారి వారసులు ఆ పొలాల్ని ఐనకాడికి అమ్మేసుకుని శాశ్వతంగా పట్టణాలలో స్థిరపడ్డం. ఈ క్రమంలో - క్రమం తప్పని ఆదాయంగా భావించి ఏ నెలజీతపు ఉద్యోగాల కోసమైతే తాము ఎగబడ్డారో అవి, తమకొచ్చినంత సులభంగా తమ సంతానానికి రాని పరిస్థితి తలెత్తడం. ఏతావతా రెంటికీ చెడ్డ రేవడిలా, ఇటు పొలమూ లేక, అటు అనుకున్నంత స్థాయిలో జీవితానికి కుదిరికా లేక బ్రాహ్మణులు దెబ్బదిన్నారు. వారు సలామ్ చేయదగ్గ భూస్వాముల స్థాయి నుంచి అందఱికీ సలాములు కొట్టే నెలజీతగాళ్ళ స్థాయికి పడిపోయారని గమనించాలి. అయితే కులపరంగా తరతరాలుగా ఉన్న సాంస్కృతికస్థాయి, సంప్రదాయాల మూలంగా వారు పూర్తిగా నాశనం కావడం జఱగలేదు. ఆ అడ్వాంటేజిలు లేని ఇతరులు ఆంగ్లవిద్య అనే ఈ లాటరీ టిక్కెట్టు కొనుక్కుని ఏమవుతారో తల్చుకుంటే భయమేస్తుంది.

ఒకప్పుడు బ్రాహ్మణులు త్రొక్కిన ఆ తప్పుదారినే, తెలిసో, తెలియకో ఇప్పుడు అందఱూ త్రొక్కుతున్నారు. వ్యవసాయ కులాలన్నీ పాశ్చాత్యవిద్యావ్యామోహంతో, MNC ఉద్యోగాల వ్యామోహంతో పొలాల్ని వదిలేసి నగరాల బాట పట్టుతున్నాయి. పొలాల్ని ఒకసారి వదిలిపెడితే ఇహ మళ్లీ వాటిల్లో అడుగుపెట్టడం అసాధ్యం. పొలాన్ని అమ్మగలం గానీ, కొనాలనుకున్నప్పుడు మళ్లీ కొనలేం. ఎన్ని చెప్పినా ఈ దేశంలో Land is power. అది పోగొట్టుకున్నవారికి రాజకీయాధికారం కూడా దూరమైపోతుంది. కనుక ఇప్పుడు మనం అగ్రకులాలూ, రాజకీయంగా బలవత్తరులైన కులాలూ అనుకుంటున్నవన్నీ ఒక యాభయ్యేళ్లల్లో పేదలుగా, మధ్యతరగతిగా మారే సంభావ్యత ఉంది. ఇది హిందూధర్మం మీద కూడా ప్రభావం చూపవచ్చు. 

బ్రాహ్మణులు చేసిన పొఱపాట్లను ఇతరులు పునరావృత్తం చేయకూడదు. తల్లిని నమ్మినవాడూ, భూమిని నమ్మినవాడూ చెడడనే నానుడిని మనసా వాచా కర్మణా విశ్వసించి ఎన్ని ఇబ్బందులున్నా మనం మన జీవనవిధానాన్ని కాపాడుకోవాలి.

16, ఫిబ్రవరి 2012, గురువారం

విదేశంలో స్వదేశీ !

విదేశంలో స్వదేశీ !


వింతగా ఉందా? ఇది అచ్చు తప్పు కాదులెండి. మనం స్వదేశీ గురించి మాట్లాడితే చాలామంది హేళన చేస్తారు. స్వదేశీ అన్నమాట చాలా విస్తృతమైంది. భారతీయ ఉత్పత్తులు వాడడమే కాదు, మన ఆలోచనలు ప్రణాలికలూ కూడా స్వదేశీ అనే సిద్ధాంతం మీద ఆధారపడినప్పుడే మనం నిజమైన అభివృద్ధి వైపు పయనించగలం. ఒక్కమాట! జ్ఞాపకం ఉందా? నిన్నగాక మొన్న మన లోక్ సభలో 'వాల్ మార్ట్' (విదేశీ పెట్టుబడులు) మీద రగడ జరిగిన సందర్భంగా కపిల్ సిబాల్ గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. వాల్ మార్ట్ కి మన వాణిజ్యాన్ని తాకట్టు పెట్టాలని యూపియే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకి సర్వత్రా వ్యతిరేకత వచ్చేసరికి, తట్టుకోలేక కపిల్ సిబాల్ గారు ఇలా అన్నారు -

"సరే! ఇక మనం కార్లలో తిరగడం మానేసి రిక్షాల్లో తిరుగుదాం!".
ఇదండీ ! మేధావి అయిన సిబాల్ గారి మనసులో మాట. ఇందులో తప్పేముంది అంటారా? ఇక్కడ సమస్య కార్లు, రిక్షాలు కాదు. మన నాయకులలోని బానిస స్వభావం, భావదాస్యం, బౌతిక దారిద్ర్యం. వీరి అభిప్రాయంలో భారతదేశం ఒక పాత చింతకాయ పచ్చడి. భారతీయులు వెనుకపడినవారు, ముందుకు వెళ్లలేనివారు. మన ఆలోచనలు వెయ్యి సంవత్సరాలు వెనుకకు ఉంటాయి. కాబట్టి విజ్ఞులు, ప్రాజ్ఞులు ఐన పాశ్చాత్యుల విధానాలు మనకి కావాలి. అంధ అనుకరణ మాత్రమే మనను "ఉద్ధరిస్తుంది". సరే! ఒప్పుకుందాం. స్వదేశీ కావాలంటున్న భారతీయులు అజ్ఞానులే. ఐతే మనకి స్ఫూర్తినిస్తున్న, మార్గదర్శనం చేస్తున్నారనుకొంటున్న పాశ్చాత్యుల పరిస్థితి చూద్దాం.

ప్రపంచ దేశాల నెత్తిమీద "ఆర్ధిక సరళీకరణ" విధానాలు రుద్దిన అమెరికా సంగతి చూడండి. ఇదే విధానాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది.


ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సమయానికి పది లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. అది ఇప్పుడు పదిహేను కోట్ల డాలర్లకి పెరిగింది. పేదరికంలో జీవించేవారి సంఖ్య 48 శాతానికి పెరిగింది. అమెరికా ఉద్యోగాలు అన్నీ భారతీయులూ, చైనీయులూ ఎగరేసుకుపోతున్నారనీ, ఆ ఉద్యోగాలు అమెరికా వారికే ఇవ్వాలని ఒబామా అంటున్నాడు. అమెరికా వారు అమెరికా వస్తువులనే ఉపయోగించాలని అయన పిలుపునిచ్చాడు. అమెరికా కూడా స్వదేశీ జపం మొదలుపెట్టింది. దీనికి మన నాయకులేమంటారో? ఒబామా కూడా సంఘ పరివార్ వాడేనంటారేమో ! అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏతావాతా తేలేదేమంటే భారతీయ సిద్ధాంతమే సరైనదని మరోమారు నిరూపితమైంది. ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా..!  

- ధర్మపాలుడు

7, సెప్టెంబర్ 2011, బుధవారం

భారతీయ భాషల్ని కాపాడుకోవాలి

చాలామంది హైందవాభిమానులైన హిందువులు సైతం తెలిసో తెలియకో విస్మరించే ప్రధానాంశం - తెలుగులాంటి భారతీయభాషల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత. భాష లేకుండా మతం లేదు. సంస్కృతి లేదు. సామెతలూ, సంగీతం, జానపద పాటలూ, నాట్యం మొదలైన అనేక సాంస్కృతికాంశాలు భాష మీదనే ఆధారపడి ఉన్నాయి. యావత్తు మీడియా కూడా భాషానైపుణ్యాల మీదనే ఆధారపడి నడుస్తోంది. ఒక భాష నశిస్తే దానిలో ఆ భాషవారి పూర్వీకులు ఆలోచించి వ్రాసిపెట్టిపోయిన సాహిత్యం యావత్తూ నశిస్తుంది. అంటే ఒక జాతి యొక్క తరతరాల స్వతంత్ర దృక్పథం నశించినట్లే. ఒక విశిష్ట నాగరికత చిరునామా లేనివిధంగా భూస్థాపితమైనట్లే. ఇంగ్లీషులాంటి యూరోపియన్ భాషలన్నీ క్రైస్తవ మతచ్చాయలో పెఱిగిన భాషలు. అవి యూరోపియన్ వాతావరణాన్ని, క్రైస్తవ కాన్సెప్టులనీ, వారి నాగరికతా - చరిత్ర కాన్సెప్టులనీ మన పిల్లల మెదళ్ళలోకి ఎక్కిస్తాయి. అందువల్ల హిందువులంతా తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియమ్ లో చేర్చి  అదే సమయంలో మాతృభాషలో వారికి శిక్షణిచ్చే ఏర్పాట్లేవీ చేయకపోవడం వల్ల మన హిందూ పిల్లలంతా యూరోపియన్ దృక్పథాన్ని అలవఱచుకుంటూ మానసిక క్రైస్తవులుగా మారుతున్నారు. వారు పూర్తి క్రైస్తవులుగా మారడానికి ఇంక ఒక్ఖ తరం ఎడం (a single generation away) అంతే ! అందుచేత మన మతాన్ని కాపాడుకోవడానికి గల ఒక ప్రధానమార్గం మన భాషల్ని కాపాడుకోవడం. ఎందుకంటే హిందూమతం, సాహిత్యం, వారసత్వం, హిందూసంస్కృతి, హిందూ వాతావరణం ఈ భాషల ద్వారానే జీవిస్తున్నాయి.

4, నవంబర్ 2009, బుధవారం

పోయింది అదుపు, వచ్చింది కడుపు - పాశ్చాత్యమా ! నీకు జోహార్లు !!

బళ్ళలో లైంగికవిద్య, బయట టీవీలూ, సినిమాలూ, ఇంటర్నెట్టు, బాయ్ ఫ్రెండ్లూ, చేతినిండా డబ్బు, విడాకుల పుణ్యమా అని తండ్రి అదుపాజ్ఞలంటే ఏంటో తెలియని బాల్యం, గాలిలో వైరస్సుల మాదిరి అలవోకగా తేలుతూ ముక్కుపుటాలకి తాకే స్వేచ్ఛాసమానత్వ సిద్ధాంతాలు, పిల్లల్ని అదుపులో పెట్టడం చేతకాని సింగిల్ తల్లులూ, పిల్లల్ని ఏమీ అనకూడదంటూ ప్రభుత్వం చేసిన చట్టాలు - వెఱసి అందఱికీ ఉచితంగా కడుపులు. ఇదీ ఈనాటి అమెరికా సాంఘికస్వరూపం. ఈ క్రింది దృశ్యకాన్ని (video) కనులారా తిలకించి తరించండి.

http://cbs2chicago.com/video/?id=63710@wbbm.dayport.com


ఇది ఇంతటితో ఆగిపోతే బావుణ్ణు. కానీ అనుకున్నామని జఱగవు అన్నీ, అనుకోలేదని అగవు కొన్ని. ఇలా కౌమారప్రాయంలో తల్లులైనవారు ఆ తరువాత ఆ పుట్టిన పిల్లల్ని ఎవరికో దత్తత ఇచ్చేస్తారు. అటుపిమ్మట వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక పునస్సమావేశం (Re-union) అంటూ అసలు తల్లిదండ్రుల్ని చూస్తారు. వాటిల్లో అన్నీ సక్రమంగా జఱగవు. కనడమే తప్ప పెంచకపోవడం తప్ప వాళ్ళకీ ఆ ఎదిగిన పిల్లల మధ్య కొన్నిసార్లు సహజమైన parent-child సంబంధం బదులు ప్రేయసీప్రియుల సంబంధం అభివృద్ధి చెందుతున్న దృష్టాంతాలు కోకొల్లలు. ఆ నిస్సిగ్గు ముచ్చటల్ని మీరు కూడా సిగ్గుపడకుండా ఈ క్రింది సైటులో తిలకించుడీ.


http://geneticsexualattraction.com/


ఇది కేవలం ఒక సహాయక సైటు (support site) మాత్రమే. అయితే అసలా "సహాయం" ఎందుకు అవసరమైందో, దానికి ఏ సాంఘిక పరిస్థితులు కారణమో, ఏ నడమంత్రపు సిద్ధాంతాలకి వాళ్ళు బలయ్యారో కూడా ఆలోచించాల్సి ఉంది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి