8, జనవరి 2010, శుక్రవారం

నువ్వసలు మనిషివేనా ?-1

ఆనందస్వరూపులకు నమస్కారములు.

"హే తథాగతా ! పునర్జన్మ ఎత్తేది మనస్సా ? ఆత్మా ?" అని అడిగాడొకసారి ఆనందుడనే శిష్యుడు బుద్ధభగవానుల్ని.

అప్పుడు బుద్ధభగవానులు చిఱునవ్వుతో "నాయనా ! ఆత్మ జన్మలెత్తదు" అని మౌనం వహించారు.

ఆనందుడి సంశయం తీఱలేదు. మళ్ళీ అడిగాడు "అయితే మఱి జన్మలెత్తేది ఎవరు స్వామీ ? మనస్సా ?"

"మనస్సు జన్మలెత్తదు."

"మఱి మనస్సూ కాక, ఆత్మా కాక ఇహ జన్మలెత్తేది ఎవరు స్వామీ ?" ఆనందుడి అయోమయం ముమ్మరమైంది.

"కర్మ. అదే జన్మలెత్తుతుంది." తథాగతులు ఒక్క వాక్యంలో తెలియజేశారు.

శ్రీ బుద్ధ భగవానులు హిందువుగా జన్మించారు. హిందువుగానే నిర్వాణం పొందారు. తానొక కొత్తమతం స్థాపిస్తున్నట్లు ఆయన చెప్పుకోలేదు. ఆయన నిర్వాణం చెందిన వందేళ్ళకి బౌద్ధ ’మతం’ అనేదొకటి పుట్టింది. కనుక ఆయన వాక్యాలు బౌద్ధులకెంత ప్రమాణమో హిందువులకూ అంతే ప్రమాణం. అందుచేత ఆయన వచనాల్లో మనకి కావాల్సిన సందేశం కూడా ఇమిడి ఉంది.

మనుషులు తమని తాము మేదో-మజ్జా‍స్థి సంయుక్తమైన రక్తమాంస దేహాలుగాను, ఒకఱి సంతానంగాను, మఱొకటిగాను, మఱొకటిగాను భావించుకోవడం కేవలం అజ్ఞానపూర్వకమని శ్రీ తథాగతులవారి వచనాలు సూచిస్తున్నాయి. మానవుడి పూర్వకర్మ తనకనుగుణమైన జన్మని, దేహాన్ని తానే రూపొందించుకుంటుంది. ఆ జన్మనీ దేహాన్ని తనకివ్వగల తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ అది ప్రయాణిస్తుంది. పూర్వకర్మఫలాన్ని అనుభవించడానికి అనువైన దేశకాలాల్ని అది నిర్ణయించుకుంటుంది. కనుక జీవులుగా, మానవులుగా, దేహాలుగా మనకి ఈ ఇహలోకంలో గోచరిస్తున్నటువంటివన్నీ వాస్తవానికి వివిధ పూర్వీకుల యొక్క కర్మలే.

"కర్మలకి అంత శక్తి ఉందా ? కర్మలకి మేధ ఉందా ?" అని ఎవఱైనా ఆశ్చర్యానికి లోను కావచ్చు. మన హిందూ సంప్రదాయంలో చైతన్యరహితమైనదంటూ ఏదీ లేదు. అంతా చైతన్యమే. అంత చిన్మయమే. భగవంతుడి కాలు కడిగిన జలం గంగ అయింది. భగవంతుడి మనస్సే జగదంబ అని చెప్పబడుతున్నది. ఆయన ఆయుధాలే అన్నమాచార్యుడివంటి భక్తులుగా భూలోకంలో అవతరించాయి. ఆయన జటాజూటమే వీరభద్రుడయింది. అందుచేత చరిత్రలో ఎప్పుడో ఎక్కడో పుట్టి పెఱిగి చనిపోయిన ఏ అజ్ఞాత/ అనామక మానవుడి మనోమయ సంకల్పాలో ఇప్పుడు ఇక్కడ మనముందు ఇంకో మానవుడి రూపాన్ని ధరించి పునర్జీవించి కనిపిస్తున్నాయంటే అందులో ఆశ్చర్యమూ, అతిశయోక్తీ లేవు. పూర్వగ్రంథాల్లో కృత్య అనేదాని గుఱించి ప్రస్తావించబడింది. కృత్య అంటే ఒక శక్తిమంతమైన కృత్రిమ వ్యక్తి. ఎవఱినైనా చంపాలనుకున్నప్పుడు యాజకులు మంత్రపూర్వకంగా హోమకుండంలో నుంచి దాన్ని ఉత్పాదన చేస్తారు. అది రాక్షసుల వలె చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. తనని పుట్టించిన యాజకులు నియమించిన పని (కృత్యం) చెయ్యడమే దాని పని కనుక దానికి కృత్య అని పేరు. సంకల్పసహితమైన మన కర్మలు కూడా అలాంటి కృత్యలే. ఎటొచ్చీ అవి అమంత్రకంగా మన మనస్సులనే హోమకుండాల్లోంచి జనించిన సంకల్ప రాక్షసులు. తెలిసో తెలియకో వాటికి మనం అప్పగించిన పనికి అవి నెఱవేర్చకుండా మానవు. ఈ రోజు కాకపోతే వచ్చే జన్మలో !

మనం మనుషులం కాము. మనం మన పూర్వజన్మల్లోని సంకల్పాలం. ఆ సంకల్పాలు కర్మానుభవం కోసం ధరించిన రక్తమాంసాలం. ఆ సంకల్పాలు నెఱవేఱాక ఈ రక్తమాంసాలు అంతరించిపోతాయి. పుడుతూనే ప్రతి మనిషికీ దేవుడు ఒక అవతారకార్యాన్ని (life mission) ని అప్పగిస్తాడు. ఆ అవతారకార్యం చిన్నదీ కావచ్చు, పెద్దదీ కావచ్చు. మునిసిపల్ ఆఫీసులో అటెండరుగా ఉండడం ఒకడి అవతారకార్యమైతే, ముఖ్యమంత్రిగా ఉండడం ఇంకొకడి అవతారకార్యం కావచ్చు. కానీ అవన్నీ సమానంగా దైవాదేశాలే. అందుచేత అవన్నీ సమానంగా గౌరవాస్పదాలే. అలాగే ఒక జాతి యావత్తు ఒక నాయకుడి కోసం తపించిప్పుడు వారందఱి సంకల్పాల ఫలితంగా కృత్యలా జన్మిస్తాడతడు.

మిత్రమా ! నీవు మనిషివి కావు. నీవొక పూర్వకర్మవి. నీవొక సంకల్పానివి. నీవొక అవతారకార్యానివి. నీవు దైవాదేశాల్ని పాటించవు. నీవే స్వయంగా ఒక దైవాదేశమై ఉన్నావు. అదే నీ వ్యక్తిత్వం.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి