శ్రీ గురుభ్యోన్నమః
అందరికీ నమస్కారం.
నఇతి భావనను పెంచుకొని అసలుదేదో దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎక్కే మొట్టమొదటి మెట్టు నమస్కరించడం. భగవంతుణ్ణే ఐనా సరే, గురువులనే ఐనా సరే, లేక బుధ జనులనైనా సరే వారిముందు మన ఈ శరీరాహంకార భావనలను వదిలి మనం మనయొక్క విధేయతను చాటి వారినుంచి ఆశీఃపూర్వక అనుగ్రహాన్ని కోరే ప్రక్రియే నమస్కరం. మన మనస్సులోని వినయాన్ని,భక్తిని, ప్రేమను బుద్ధితోకలిపి రెండుచేతులు జోడించి తలవంచి ఎదుటనున్నవారి వద్ద నుంచోవడమే నమస్కారం. వినయంతో మీకు నమస్కరించుచున్నాని చెప్పడమే "నమః+తే =నమస్తే" ఇది నాది కాదు మీది అన్న మనలోపలి ప్రసాద బుద్ధిని బయట పెట్టటమే నమస్తే, న= నాది,మః= కాదు, తే= మీది. ఇది నాది కాదు మీది మీ ప్రసాదంగా నేను వాడుకుంటున్నాను లేదా మీ ప్రసాదంగా నేనున్నాను అని చెప్పడమే నమస్కరించటం.
ఐదు జ్ఙానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలకి సూచనగా పదెవేళ్ళు దగ్గర చేసి, బుద్ధికి సూచనగా తలవంచి బొటనవేళ్ళు లలాటం వైపు (బుద్ధి వైపు)చూపిస్తున్నట్టుగా చేయడం. అంటే తన లోని పంచ జ్ఙానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నిశ్చయాత్మకమైన బుద్ధి ఈ మూడు కలుస్తే నేను అనే అహంకారం. వీటిని మీ ఎదుట వదిలి వినమ్రుడనై ఏమీ లేనివాడనై మీ కృపకొరకు ఎదురుచూస్తున్నాను అని చెప్పడం నమస్కారంచేయడం.
తల్లి తండ్రులకు ఒక్క నమస్కారం, భగవంతునికి మూడుమార్లు, గురువులకు, సన్యాసాశ్రమంలో ఉన్నవారికి నాలుగు నమస్కారాలు ఐతే వీరిలో ఒక్క భగవంతుని తప్ప మిగిలిన ఎవ్వరినీ నమస్కారం చేసి కోరికలు కోరకూడదు.ఒంటిచేతితో నమస్కారం నిషిద్ధం. కొంతమంది నమస్కారంచేస్తూ ఉంగరాలు వేళ్ళు ముద్దు పెట్టుకుంటుంటారు, అలా నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పబడలేదు, పైగా అందరి ముందూ అలా చేయడం అసహ్యకరంగా ఉంటుంది కూడా.
నమస్కరించడం అంటే శరణాగతి చేయడానికి సూచన, సద్యః ఫలితాన్నీ ఇస్తుంది. అందుకే నమస్కారం నవవిధ భక్తుల్లో ఒక్కటైంది.అక్రూరుడు చిన్ని కృష్ణుని పాదముద్రలు అందులోని పర చిహ్నాలు నేలపై చూసి, నా దేవుడు నడచిన తోవ నేను రథమెక్కి వెళ్ళడమా అని రథంలోంచి అప్పటికప్పుడు స్వర్ణదండం పడినట్టు నేలమీద పడి శ్రీకృష్ణుని పాదాల గుర్తులు ఉన్న చోట ఆ మట్టి అంతా తనకి అంటుకునేలా మట్టిలో పొర్లి కృష్ణదర్శనానికి వెళ్ళాడు. అక్రూరుడు స్వతహాగా ఎటువంటివాడైనా, ఎవరిని ఆశ్రయించి ఉన్నా ఆయనకి కృష్ణునిమీద ఉన్న భక్తికి పైఘట్టం పరాకాష్ట, అందుకే ఇప్పటికీ వందనానికి అక్రూరుడే ఉదాహరణ.
అన్నిటికన్నా ఉత్కృష్టమైనది సాష్టాంగ నమస్కారం. తాను శరీరంతో సహా ఎదుటివారి వద్ద సాష్టాంగ పడితే అర్థం ఏంటంటే, మీ ఎదుట నేను అన్నిటికన్నా తక్కువవాణ్ణి అందుకుగానూ నేలమీద పడి నమస్కరిస్తున్నాను అని చెప్పడం.ఉదాహరణకు భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశామనుక్కోండి. దానర్థం భగవంతుడా నేను అన్నిటికన్నా కిందున్న నేల మీదపడి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను అని శరణాగతి చేయటం. అప్పుడు భగవంతుడు ఏంచేయాలి తన రెండు చేతులతో మన భుజాలు పట్టుకుని పైకి లేపాలి. అంటే మనని నేలమీదినుంచి లేపి వృద్ధినివ్వాలి మళ్ళీ మళ్ళీ నేలమీదపడకుండా ఉన్నతుణ్ణి చేయాలి (తిరిగి జన్మలేనిస్థితిని ఇవ్వాలి) . ఈ ప్రక్రియలో భక్తుడికోసం తానే సగం వంగాలి. (ఇదే గురువు ఇతర బుధ జనుల విషయంలో కూడా) అందుకే అంతగొప్పది సాష్టాంగ నమస్కారం. ఇది భౌతికంగా జరగకపోయినా మానసికంగా అదే భావనతో భగవంతుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి. అక్రూరుడు చేసినదదేకదా కృష్ణుడు లేకపోయినా కృష్ణపాదాల గుర్తులు చూస్తే ఆయన భక్తిభావం ఆగలేదు. అందుకేయద్భావం తద్భవతి. కృష్ణుణ్ణి చేరాడు, ఇప్పటికీ నమస్కారభక్తికి గుర్తుగా మిగిలిపోయాడు, ఎప్పటికీ అలానే నిలిచి ఉంటాడు.
ముఖ్యం: మగవారు సాష్టాంగ నమస్కారం, ఆడవారు పంచాంగ నమస్కారం చేయాలి.
ఇందులో ఒక్కొక్క అంగానికీ శ్లోకంచెప్పి ఒక్కొక్కమారు ఆ అంగంతో సాష్టాంగ నమస్కారం చేసే పద్ధతి ఉన్నది. అలానే అన్ని అంగాల పేర్లు చెప్పి ఒకేసారి నమస్కారం చేసే పద్దతీ ఉన్నది.
శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఇందులో అన్ని అంగాలనూ నేలకానించి నమస్కారం చేయవచ్చు చేతుల్ని నేలకానించి నమస్కారం చేయవచ్చు,కాళ్ళను ఆనించవచ్చు, చెవులను ఆనించవచ్చు కళ్ళని కూడా, సాష్టాంగ నమస్కారంలో ఉన్న గమ్మత్తేమంటే మనస్సుని కూడా నేలకానించాలి,అదెలా సాధ్యం? కాళ్ళు చేతులు ఇతరాలంటే నేలమీద పడేస్తాం మరి మనస్సునెక్కడనుంచి తెస్తాం? అంటే మన మనస్సుకి వినయంతో కూడిన తర్ఫీదునిస్తే, నమస్కారం చేసేటప్పుడు మనస్సుకూడా మనం ఎవరికి నమస్కారం చేస్తున్నామో వారి పాదాల పరం కావడానికి అలవాటు పడుతుంది. మనస్సుని కూడా శరీరంతోపాటు కృష్ణుని పాదగుర్తులమీద పడేశాడు కాబట్టే అక్రూరిని నమస్కారం అంతగొప్పదైంది.
ఇంకా మిగిలిన విషయాలు పెద్దలు చెప్పారు, ఈ చర్చ ఇంకా కొనసాగవలసి ఉంది, అందరూ మీ మీ అభిప్రాయాలను, తెలిసిన విషయాలను (ఈ చర్చకు సంబంధించి) ఇక్కడ పొందుపరిస్తే అందరికీ ఉపయుక్తం.
మీ
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్
18, మే 2011, బుధవారం
నమస్కరించడం అంటే శరణాగతి చేయడానికి సూచన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
చిత్రంగా ఇవాళ ఒక American తో నమస్కారానికి సంబందించి మాట్లాడటం జరిగింది. మీ post ముందరే చూసుంటె బాగుండేది. ఈ సంక్షిప్త పరిచయం బహు ఉపయొగకరం.
చిత్రంగా ఇవాళ ఒక American తో నమస్కారానికి సంబందించి మాట్లాడటం జరిగింది. మీ post ముందరే చూసుంటె బాగుండేది. ఈ సంక్షిప్త పరిచయం బహు ఉపయొగకరం.
dhanyavaadamulu
కామెంట్‌ను పోస్ట్ చేయండి