ఈ రోజుల్లో కూడా కొంతమందికి నగరాల రణగొణధ్వనికీ, నాగరికుల కుళ్ళుకూ, డబ్బుకుత్సితాలకూ దూరంగా, ప్రశాంతంగా, ఒంటరిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఉంటుంది. కానీ ఆ కోరిక తామొక్కఱే ఎలా తీర్చుకోగలరో తెలీక యథాపూర్వంగా మిగుల్తూంటారు. అందుచేత వ్యక్తిగతంగా కాకుండా అందఱమూ కలిసి ఒక సామూహిక కార్యక్రమంగా పూనుకొని ఇలాంటివారి కోసం కనీస సౌకర్యాలతో తపోవనాల్ని ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఇవి వృద్ధాశ్రమాలుగా కూడా ఉపయోగపడతాయి. వీటికి వ్యాసారణ్యం, వసిష్ఠాశ్రమం, వైశంపాయనం లాంటి సాంప్రదాయిక నామాలు పెట్టుకోవాలి.
నా ఆలోచనలు వ్రాస్తున్నాను. తేలిగ్గా తీసుకోకుండా, కొట్టిపారేయకుండా పరిశీలించగలరు.
౧. ఎక్కడైనా ఒక గ్రామీణ/ గిరిజన ప్రాంతంలో ఒక చిన్న పట్టణానికి గరిష్ఠంగా 40 కి.మీ.ల దూరంలో ఒక వందెకరాల స్థలాన్ని సేకరించాలి.
౨. ఆ స్థలం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టాలి.
౩. లోపల దేన్నీ చదును చేయనక్కఱలేదు. అలాగే వదిలేసి మంచి నీడనిచ్చే చెట్లూ, ఫలపుష్పవృక్షాలూ పెంచాలి.
౪. చిన్నాపెద్దా మట్టిరోడ్లు వేయాలి.
౫. మూడే మూడు గదులు గల కాటేజీ కట్టడాలు, కేవలం రెండు అంతస్తులవి సుమారు 100 - 200 దాకా నిర్మించాలి.
౬. ప్రతి కాటేజికి నీరు, విద్యుత్తు, ల్యాండ్‌లైన్ టెలిఫోను సౌకర్యాలు మాత్రం కల్పించాలి.
౭. తపోవనంలో శాశ్వత సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి హిందువూ/ ప్రతి హిందూ జంటా రు. ఇంత అని రుసుము పెట్టాలి. అది 4 వాయిదాల్లో 6 సంవత్సరాల లోపల చెల్లించమని కోరాలి. ఇహ నెలవారీ కట్టేది ఏమీ ఉండ(కూడ)దు. ఇది మొదటి 20 ఏళ్ళలోపల 50% మాత్రమే ప్రతిదాతవ్యం (refundable). 20 ఏళ్ళు గడిచాక 25% శాతం మాత్రమే ప్రతిదాతవ్యం.
౮. రుసుము కట్టినంత మాత్రాన కాటేజీలు సభ్యుల ఆస్తులు కావు. అవి తపోవనం ఆస్తులే. వారి మరణానంతరం అవి ఇతరులకి కేటాయించబడతాయి.
౯. 45 ఏళ్ళలోపువారికి తపోవనంలో సభ్యత్వం లేదా వాస్తవ్యహోదా ఇవ్వకూడదు. వారు సభ్యుల కుటుంబసభ్యులైనా సరే ! ఒక్కొక్క కాటేజికి గరిష్ఠంగా నలుగుఱు వాస్తవ్యుల్ని అనుమతించవచ్చు. ఎవఱి తిండి, బట్ట, వైద్యం లాంటి నిర్వహణ ఖర్చులు వారివే. తపోవనం బాధ్యత తీసుకోదు.
౧౦. తపోవనానికి ఒక కార్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక దుకాణ సముదాయం, ఒక కమ్యూనిటీ సెంటర్, ఒక వైద్యశాల, ఒక ఆడిటోరియమ్ ఉండాలి.
౧౧. తపోవనం కేంపస్ లో హోటళ్ళనీ, లాడ్జింగుల్నీ, విందు-వినోదాల కేంద్రాల్నీ, వ్యాపార కేంద్రాల్నీ, స్కూళ్ళనీ, కాలేజీలనీ, గోడౌన్లనీ అనుమతించకూడదు.
౧౨. తపోవనంలో 5 - 10 హిందూ దేవాలయాలు ఉండాలి. ఇతర మతాల ప్రార్థనామందిరాల్ని అనుమతించకూడదు.
౧౩. ఇదంతా ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం కనుక కాటేజిలకి బాహ్యప్రపంచంతో సంబంధం కల్పించే టివి., రేడియో, సెల్‌ఫోను, అంతర్జాలం, దినపత్రిక లాంటి సౌకర్యాల్ని నిషేధించాలి. కావాల్సినవారు తపోవనం కమ్యూనిటీ సెంటర్ కి వెళ్ళి వాటిని ఉపయోగించుకోవచ్చు,
౧౪. కాటేజివాసులు సొంత కంప్యూటరు, ప్రింటరు, గ్యాస్ బండ, గీజరు, ఐరన్, సి.డి.ప్లేయరు, డి.వి.డి. ప్లేయరు, క్యామరా, రిఫ్రిజిరేటరు, మిక్సీ లాంటివి పెట్టుకుని వాడుకోవచ్చు.
౧౫. సొంత సైకిళ్ళకి తప్ప ఏ విధమైన పెట్రోలు/ డీసెలు వాహనాలకీ కేంపస్ లో అనుమతి ఇవ్వకూడదు. కావాల్సినవారు తపోవనం బస్సులో సమీప పట్టణానికి వెళ్ళి పనులు చూసుకొని రావచ్చు.
౧౬. సభ్యులు అన్నిరకాల లౌకిక మఱియు ధనసంపాదన కార్యకలాపాల నుంచి formal గా విరమించుకున్నవారై ఉండాలి. కేంపస్ లో ఉంటూ పుస్తకాలు వ్రాయడం, ముద్రించడం, అమ్మడం, ఉపన్యాసాలివ్వడం తప్ప ఇంక ఏ విధమైన లాభసాటి ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్నీ సాగించకూడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి