2, మార్చి 2012, శుక్రవారం

శృంగారమే చావుకు మూలం !

శృంగారం లేకుంటే.. చావేరాదు!
అలైంగిక ప్రాణుల్లో అపరిమిత పునరుత్పత్తి
మరణంలేని ఫ్లాట్‌వార్మ్ జీవులపై అధ్యయనం
అంతులేని కణవిభజనతో కొత్త కణాల సృష్టి

క్రోమోజోముల్లోని టెలోమెర్ పొడవులోనే కిటుకు
టెలోమెర్‌ను పరిరక్షించే ఎంజైమ్ గుర్తింపు
విసృతంగా సాగుతున్న పరిశోధనలు
మనుషుల్లోనూ ఆయుష్షు పెంచడమే లక్ష్యం!
చేపలు తింటే మెదడు పెరుగుతుంది..
వయసు తగ్గుతుందంటున్న అమెరికన్ పరిశోధకులు

లండన్, ఫిబ్రవరి 29: వయసు పెరుగుదలను అరికట్టవచ్చా? జీవితకాలాన్ని పెంచడం సాధ్యమేనా? మరణాన్ని కూడా జయించవచ్చా?.. సెక్సుకు దూరమైతేనే అది సాధ్యమా? అవును, లింగ భేదంలేని ఒక జాతి జీవులు ఆ మార్గాన్ని చూపిస్తున్నాయంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు! ఫ్లాట్ వార్మ్ వర్గానికి చెందిన ప్రాణులపై నాటింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వయసు పెరుగుదలను అరికట్టి ఎప్పటికీ యవ్వనంగా ఉండగలిగే శక్తి వాటిలో ఉందని గుర్తించారు. ఈ జీవుల్లో జరిగే ప్రక్రియ మనిషి ఆయుష్షు పెంచడానికి కూడా మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

ఫ్లాట్ వార్మ్ జీవుల అపరిమితమైన పునరుత్పత్తి సామర్థ్యం ఆశ్చర్యపరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు మీద పడిన, చెడిపోయిన కణాలను, కణజాలాన్ని ఈ క్రిములు ఎప్పటికప్పుడు కొత్తవాటితో మార్చేసుకుంటాయట! దాంతో అవి ఎప్పుడూ యవ్వనంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఫ్లాట్ వార్మ్ జాతికి చెందిన రెండు రకాల (లైంగిక చర్యతో పునరుత్పత్తి జరిపేవి, రెండుగా విడిపోయి తమ సంఖ్య పెంచుకునేవి) జీవులపై అధ్యయనం జరుగుతోంది.

'సాధారణంగా కొత్త కణాల అభివృద్ధికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) ఉపయోగపడతాయి. కణాల పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే మూలకణాలు కూడా క్రమంగా శక్తిని కోల్పోయి చివరకు నశిస్తాయి. అయితే ఫ్లాట్‌వార్మ్ జీవుల్లో మాత్రం అలా జరగడం లేదు. అవి అపరిమితంగా అన్ని రకాల కణాలను పునరుత్పత్తి చేస్తున్నాయి. మెదడును కూడా ఎన్నిసార్లయినా కొత్తగా సృష్టించగలుగుతున్నాయి' అని పరిశోధకులు వివరించారు. 'కణ విభజన జరిగినపుడు మాతృ కణంలోని డీ ఎన్ఏ కొత్త కణానికి అందుతుంది. వాటిలోని క్రోమోజోముల జతలను ముడిపెట్టి ఉంచే టెలోమెర్ చాలా కీలకమైనది. గొలుసుకట్టుగా ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఇది రక్షణ తొడుగులా ఉంటుంది. ప్రతిసారీ కణవిభజన జరిగినపుడు ఈ టెలోమెర్ పొడవు తగ్గిపోతుంది.

దీంతో కణాల్లోని జన్యు సమాచారం క్రమంగా నశించి.. వాటికి కొత్త కణాలను సృష్టించే శక్తి క్షీణిస్తుంది. అయితే మరణంలేని ఫ్లాట్‌వార్మ్ వంటి అలైంగిక జీవుల్లో మాత్రం టెలోమెర్ పొడవు ఎన్నటికీ మారడం లేదని భావిస్తున్నాం' అని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ థామస్ టాన్ తెలిపారు. ఈ జీవుల్లో టెలోమెర్ నశించకపోవడానికి 'టెలోమెరాస్' అనే ఎంజైమ్ కారణమని ఆయన గతంలోనే కనుగొన్నారు. ఇందుకుగాను 2009లో ఆయనకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది.

మనుషుల్లో ఈ ఎంజైమ్ తొలినాళ్లలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని, అలైంగిక జీవుల్లో మాత్రం పునరుత్పత్తి జరిగిన ప్రతిసారీ ఇది పనిచేస్తుందని థామస్ గుర్తించారు. లైంగిక చర్య జరుపుకొనే జీవుల్లో మాత్రం ఈ ఎంజైమ్ ఎందుకు ఎక్కువ కాలం పనిచేయడం లేదన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. సెక్స్‌కు దూరంగా ఉండటం వల్లే 'టెలోమెరాస్' శక్తివంతంగా పనిచేస్తోందా? అన్న విషయాన్నీ వారు పరిశీలిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించి మనుషుల్లోనూ టెలోమెర్ పొడవు తగ్గకుండా చేస్తే ఇక మరణం అనేదే ఉండకపోవచ్చు! లేదా జీవితకాలం అసాధారణంగా పెరగవచ్చు!

మరోవైపు.. వయసుకు సంబంధించే అమెరికన్ పరిశోధకులు మరో కొత్త విషయం బయటపెట్టారు. 'మీ మెదడు చురుగ్గా ఉండాలంటే చేపలు బాగా తినండి' అని కాలిఫోర్నియా యూనిర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పాటిస్తే మన మెదడుకు ముసలితనం రాదట! మనం తీసుకునే ఆహారంలో ఒమెగా-3 వంటి ఆమ్లాలు తగ్గడం వల్ల మెదడు కణాలు క్షీణిస్తున్నాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. చేపలు అధికంగా తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, చేపనూనె వల్ల మెదడు చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. 



కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి