20, నవంబర్ 2012, మంగళవారం

ఆధ్యాత్మికోన్నతి ఎలా కలుగుతుంది ?


Absolute emptiness is the end of all religion. Stuffing mind and life with all sorts of things goes against this. Stuffing this way, you can still be a believer but not a serious practitioner. When we could feel proud of our emptiness in stead of our full-ness, we will have reached the height of all spirituality.

సాధన దంతమంజనం (Tooth paste) లాంటిది. పళ్ళు తోముకున్నాక దాన్ని కూడా పుక్కిలించి ఉమ్మివేయక తప్పదు. అత్యున్నతస్థాయి ఆధ్యాత్మికత నాస్తికత్వాన్ని పోలి ఉంటుంది, "ముదిమి రెండవ బాల్యము" అన్నట్లు. కానీ అది నాస్తికత్వం కాదు. షిరిడీ సాయిబాబా తమ కాళ్ళతో నిప్పుకట్టెల్ని సవరించేవారు. సాధారణ మానవులు అలా చేస్తే అది నాస్తికత్వమే. కనుక సాధకులకు వర్తించే నియమాలూ, విశ్వాసాలూ అంతకంటే పైస్థాయివాళ్ళకి వర్తించవు. కాని వారు కూడా బాహ్యంగా సాధకుల లాగానే మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ ఉండాలి. కిందిస్థాయివాళ్ళ దగ్గఱ పైస్థాయి మాటలు మాట్లాడితే వాళ్ళు శూన్యవాదులూ, నాస్తికులూ అవుతారు. చిన్నపిల్లలతో శృంగారం గుఱించి మాట్లాడడం లాంటిది అది. వేమన చేసిన పొఱపాటు ఇదే. అది ఎంతవఱకూ వెళ్ళిందంటే ఆయన్ని కూడా తమలాంటి నాస్తికుడని నాస్తికులు భ్రమపడే దాకా ! 

"హిందూ ఆధ్యాత్మికత ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? మతం ఇంకా సింపుల్ గా ఉండొచ్చు గదా ?" అని అడుగుతారు కొందఱు. కానీ ఇదే తరహా ప్రశ్న ఇతర విషయాల గుఱించి వేయరు. మతమంటేనే ఈ లోకువ. "గణితశాస్త్రం ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? భౌతికశాస్త్రం ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? సాఫ్టువేర్లు ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా, చిన్నపిల్లవాడు కూడా కార్యక్రమణ (Programming) చేసేలా ఉండొచ్చు గదా ?"

మతపు సంక్లిష్టత (complexity) ఎవఱి సృష్టీ కాదు. ఆ జ్ఞానం సహజంగానే చాలా జటిలమైనది, చాలా గహనమైనది. దాన్ని పూర్వఋషులు మన కోసం చాలా చాలా సరళీకరించారు. అయినా అది ఇప్పటికీ సామాన్యమానవుల అవగాహనకి అందుబాటులో లేదు. బహుశా ఎప్పటికీ ఉండదు. ఉండబోదు. మతం కడుపు నిండినవాళ్ళ కులాసా కాలక్షేపం కాదు. కడుపు నిండకపోవడం చేతనే మనిషిలో జీవితం గుఱించిన అంతర్మథనం మొదలైంది. "అనుకున్నది అనుకున్నట్లుగా ఎందుకు జఱగడం లేదు ?" అని ! 

పరమార్థాన్ని సాధించడం కోసం అవసరమంటూ శాస్త్రాల్లో చెప్పిన నియమాలు - ఉదాహరణకి, ఏకాంతవాసమూ, బ్రహ్మచర్యమూ, ఉపవాసాలూ, శమదమాదులూ, బ్రాహ్మీముహూర్తపు సాధనలూ - వీటిని నిబంధనలు (Rules) గా, నిర్బంధంగా చూడడం పొఱపాటు. ఇవి ఆత్మజ్ఞానం అనే సంఘటన జఱగడానికి దోహదపడే సానుకూలాలు (favorable circumstances) మాత్రమే. ఇవన్నీ వాటంతట సమకూడిన ఒకానొక అఱుదైన క్షణంలో మనిషిలో తటాలున అనుకోకుండా ఆత్మజ్ఞానం మెఱుపులా మెఱుస్తుంది. అంటే, ఉదాహరణకి - ఇంద్రధనుస్సు కనిపించాలంటే, ఎండ పడుతూ ఉండాలి. చిఱుజల్లు కుఱుస్తూ ఉండాలి అన్నట్లు ! కృత్రిమంగా ఎండా, చిఱుజల్లూ ఏర్పాటుచేస్తే అది Lab experiment అవుతుంది తప్ప ఇంద్రధనుస్సు అవ్వదు. అలాగే శాస్త్రంలో చెప్పారు గదా అని పై లక్షణాల్ని బలవంతాన అలవఱచుకుంటే ఆత్మజ్ఞానం కలగదు. 

ఎందుకంటే, వీటిల్లో ఏ లక్షణమూ ఒక్క జన్మలో సిద్ధించేది కాదు. అలాంటిది, అన్ని లక్షణాలూ ఒనగూడాలంటే ఎన్ని జన్మలు పట్టుతుందో ఆలోచించండి. దీని పూర్వాపర ప్రక్రియని సక్రమంగా అర్థం చేసుకోవాలి. మనకున్న ప్రతి లక్షణం వెనుకా ఒక సంస్కారం, మన ప్రతిసంస్కారం వెనుకా ఒక ఆచరణ, ప్రతి ఆచరణ వెనుకా ఒక గుర్తోదయం (Realization) ఉంటాయి. అలాంటి అనేక గుర్తోదయాల యొక్క సమాహార రూపంగా ఒక జన్మలో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.


కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి