8, జులై 2013, సోమవారం

తిథి నిర్ణయంలో సందేహం--సమాధానం

నమస్కారమ్

తిధి నిర్ణయం ఎలా జరుగుతుందో వివరించగలరు

 రోజు (19th July 2013) ఏకాదశి తిధి కదా. కానీ ఒక సంప్రదాయం ప్రకారం ఏకాదశి రేపు అని అన్నారు. దానితోనాకు  సన్దీహమ్ కలిగినది

అలాగే తది ద్వయం విషయమై కుడా ప్రస్తావించ మనవి

(please mention if any reference available on this topic) 
 .....................................................................................................................................

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
కించిత్ ఆలస్యంగా స్పందిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఈ తిథి సంబంధ విషయమైన చర్చలు, ఏకాదశి గురించి ఇతః పూర్వం ఇక్కడ చర్చలు జరిగాయి.
మనకి కాలాన్ని గణించడానికి సౌరమానం, చాంద్రమానం, బ్రాహస్పత్యం అని ఉన్నాయి ఒకటి సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని, మరొకటి చంద్ర గమనాన్ని ఆధారం చేసుకొని మరొకటి గురు గ్రహ గమనాన్ని ఆధారం చేసుకొని. ఐతే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు ఆ తిథి అన్నది అందరికీ తెలిసిందే. ఐతే ఆయా తిథుల్లో చేసే విశేష కార్యక్రమము లేదే ఆ నైమిత్తిక తిథిని ఎలా జరుపుకోవాలన్నది కల్పంలో కానీ, ఇతర శాస్త్ర గ్రంథాలు, పురాణాదులలో ఉంటుంది. అపర కర్మలకి మధ్యాహ్నం పూటకి తిథి ఎక్కువగా వ్యాపించి ఉన్న రోజుని ఎంచుకున్నట్లే కొన్ని కొన్ని తిథులలో చేయవలసిన విశేష కార్యం ఆ రోజు ఆ తిథి ఎంత సేపు ఉన్నది ఏ కాలంలో ఉన్నదీ చూస్తారు.

సూర్యోదయానికి రెండు / మూడు ఘడియలు దశమితో కూడిన ఏకాదశిని వర్జిస్తారు. తిథి విద్ధ/విద్ధం అంటారు ఆ రోజు వ్రతం చేసినా ఆ ఫలితాన్ని ఇవ్వరు. దానికన్నా ద్వాదశితో కలిసి ఉన్న ఏకాదశి వ్రతం చేయమని చెప్తారు. దీనికి సంబంధించి పురాణ ఉప ఆఖ్యానాలు కూడా ఉన్నాయి. ఏకాదశీ తిథినిర్ణయం అని నిర్ణయ సింధు, ధర్మ సింధులాంటి గ్రంథాలలో ప్రత్యేకంగా వ్రాయబడింది పూర్తి వివరాలకు అవి చూడగలరు.

అలాగే కొన్ని వ్రతాలు నక్త వ్రతాలుంటాయి, వినాయక చవితి, సత్య నారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతం వంటివి నక్త వ్రతాలు. అంటే ఉదయం నుండీ దీక్షితుడై ఉపవసించి ఆ క్రతువుకు కావలసిన సంబారాలనేర్పరుచుకొని సాయంత్రం పూట ఈ వ్రతాలనాచరించాలి. కాబట్టి వినాయక చవితి సాయంత్రం ఏరోజు ఉంటే ఆసమయంలో వ్రతం చేయాలి కానీ ప్రస్తుతం ఉదయం పూట చవితిని చూసేసి చేసుకుంటున్నాం. ఒక్క కేదారేశ్వర వ్రతం ఒక్కటీ సాయంత్రం జరుగుతున్నట్లుంది చాలా చోట్ల. సత్యనారాయణ వ్రతం కూడా కొందరిళ్ళలో ఇంకా సాయంత్రాలే చేస్తున్నారు అదే పద్ధతి, కథలో కూడా అలాగే చేయాలని ఉంది.

సూక్ష్మంగా మీరడిగిన ప్రశ్నకు

సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథే ఆనాటి తిథి ఐతే ఏకాదశి వ్రతానికి ఉదాహరణకి ఉదయం 5-6 మధ్యలో దశమి వెళ్ళి6.15కి ఏకాదశి వచ్చిందనుక్కోండి ఆనాడు ఏకాదశి వ్రతానికి పనికిరాదన్నమాట.
నైమిత్తిక కర్మాచరణకు ఏ విధంగా చేయాలో శాస్త్రం చెప్పినట్లుగా చేసుకోవాలి

సంపూర్ణ ఏకాదశీ యత్ర ప్రభాతే కించిదేవసా
తత్ర ఉపోష్యా ద్వితీయాచ పరాచేద్యది వర్థతే!!

బ్రహ్మ వైవర్త పురాణంలో ఇలా చెప్పారు సంపూర్ణంగా ఒకరోజు ఏకాదశి తిథి ఉండి మరునాడు కొద్దిగా ఏకాదశి తిథిఉంటే రెండవ నాడే ఉపవాసం చేయాలి. అయితే ద్వాదశి తిథి వ్యాప్తిచెంది ఉండాలి, అంటే ఉపవాసం చేసిన నాటికిమర్నాడు ద్వాదశి తిథి వుండాలి.

షష్ఠి దండాత్మికా యత్ర ప్రభాతే  తిథి త్రయం
కుర్వంతి గృహిణి: పూర్వం చైవ యత్యాదయ: తథా!!
ఒక సూర్యోదయం నుండి మరొక సూర్యోదయం వరకు కల 60 ఘడియల కాలంలో తిథి త్రయం (దశమి సఏకాదశిసద్వాదశి) ఉన్నప్పుడు  సూర్యోదయ సమయంలో ద్వాదశి తిథి ఉందో దానికన్న ముందున్న రోజే గృహస్థులును,సన్యాసులు/యతీశ్వరులును ఉపవాసం చేయాలి.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి