30, సెప్టెంబర్ 2013, సోమవారం

హేతువాదదృష్టితో చూస్తే కనపడే ప్రకృతిని ఆథ్యాత్మికంగా చూస్తే ......[దేవుడంటే ఎవరు ? 1]

"మీ మందుల షాపు పేరేమిటి నాయనా?"  ..  వి.వి. సుబ్రహ్మణ్యం గారు ప్రశాంతంగా తన సంభాషణ ప్రారంభించారు.
"సత్యా మెడికల్ షాప్ (పేరు మార్చి రాశాను)" అని సాయిరాం బదులిచ్చాడు.  
"మీరమ్ముతున్నవన్నీ విషాలని నిరూపిస్తా.  దానికి నువ్వు మందుల దుకాణం అని పేరు పెట్టావంటా......
కావాలంటే ఎ సీసాలోవైనా గుప్పెడు మాత్రలు మింగి చూడు.  నీకే తెలుస్తుంది.  అవన్నీ విషాలైనప్పుడు సత్యా పాయిజన్ షాప్ అని పెట్టుకోవాలి కానీ, సత్యా మెడికల్ షాప్ అని పేరు పెట్టడం హేతువాదం ఎలా అవుతుంది? నువ్వమ్మే వాటిలో విషానికి భిన్నంగా మందుని నా కళ్ళకు చూపించ గలవా?"
- సుబ్రహ్మణ్యం గారి తర్కానికి సాయిరాం బిత్తరపోయాడు.
"అదేంటండీ అలా అంటారు? వాటిని తప్పుగా వాడితే అవి విషాలే.  వాటినే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తగిన పద్ధతిలో వాడినప్పుడు అవే మందులవుతాయి" అని కాస్త విసురుగా సమాధానం చెప్పాడు.
కోప్పడకు నాయనా - నా భావం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఈ చిన్న ఉపమానం.  నీ దుకాణంలో ఉన్న విషాలు కేవలం శాస్త్రవేత్త చూపు వల్ల  ఔషధాలవుతున్నాయి.  అలాగే కేవలం మనుషులుగా, పంచభూతాలుగా, రసాయనిక పదార్థాలుగా, భౌతిక వస్తువులుగా ఉన్నవన్నీ గురువు ఇచ్చే చూపు వల్ల దైవ స్వరూపాలవుతాయి.  హేతువాదంతో చూస్తె అంతా ప్రకృతే.  ఆధ్యాత్మిక దృష్టితో చూస్తె ఈ ప్రకృతి వెనుక ఉన్న అందమైన ప్రణాళిక, దానిని నడిపించే మహోన్నతమైన ధర్మం - ఆచూకీ అందుతాయి.  పాల నుంచి వెన్నని తీసినట్లుగా శాస్త్రవేత్త అయిన గురువు కూడా ఈ సత్యదర్శనం చేయించి మనిషి నుంచి మనీషిని ఆవిష్కరిస్తాడు.  అప్పుడు అంతా దైవమయమే.  ఇందాక నువ్వు ప్రస్తావించిన algebra లో X అనుకుని బయలుదేరి సమాధానాన్ని కనుక్కున్నట్లే, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న ప్రజ్ఞనే దేవుడని అనుకుని శోధిస్తూ వెళ్ళడమే సత్యాన్వేషణ.  ఈ శోధన లోనే మానవుడు పురోగమిస్తాడు.  దార్మికుడవుతాడు. శాస్త్రాలు పుట్టేదీ, శాంతి లభించేదీ రెండూ దీని నుంచే.  ప్రపంచ వికాసానికి మార్గం ఇదే.  ఇదే భారతీయమైన ఆధ్యాత్మిక సాధన.
ఈ సాధనలో పురోగమించిన వారిలో తమకు బాగా నచ్చిన వారి పేర్లను ప్రజలు అభిమానిస్తారు.  స్మరిస్తారు.  వారి సుగుణాలను ఆరాధిస్తూ తమ బిడ్డలకు ఆ పేర్లు పెట్టుకుంటారు.  అలా పెట్టుకున్నదే సాయిరాం అనే నీ పేరు.  అలాంటి తల్లితండ్రులను అవివేకులుగా నిందిస్తూ, రాముడి గురించి, రామ రాజ్యాన్ని గురించి ఏమీ తెలియకుండానే తేలికగా మాట్లాడేసే నిన్ను చూసి బాధపడుతున్నా.  స్వదేశీయులనుంచి స్వజాతీయుల నుంచి కూడా తనను తాను రక్షించుకోవలసిన దుస్థితిలో ఈ దేశం, ఈ సంస్కృతీ, ఇక్కడి విజ్ఞానం, వివేకం ఉన్నందుకు ఇంకా బాధపడుతున్నా.  ఇదంతా మనని పరాయి వారికి మళ్ళీ బానిసలుగా చేయడానికి ఎంతో కాలం పట్టదు.  నువ్వు ఎడ్యుకేట్ చేయడం కాదు, మొదట నువ్వు ఎదుకేట్ కావాలి.  మీ అమ్మానాన్నలు నిన్ను చూసి గర్వించ గలిగే రోజు రావాలి.  ఐ విష్ యు wisdom.
"సార్! బాధ్యతలను మేమూ సమర్థిస్తాం.  కానీ, మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తాం.  దేవుడంటూ ఫలానా ఎవడో ఉన్నాడని అనుకుంటూ ముందుకు వెళ్ళడమే సాధన అని మీరంటున్నారు తప్ప, ఆ దేముడిని మీరు చూపించలేక పోతున్నారు.  కనిపించని ఆ దేవుడి పేరుతో ఎన్ని మోసాలు, అరాచకాలు జరుగుతున్నాయో మీరు లెక్కలోకి తీసుకోవడం లేదు.  ఈ దారుణాలకు అడ్డుకట్ట పడాలంటే ఆయన ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించని వాడు కాకూడదు.  దేవుణ్ణి మీరు అందరికీ చూపించాలి" - సాయిరాం పెదవి విప్పాడు.
"బాబూ! దేవుడంటే నీ నిర్వచనం ఏమిటో కాస్త చెబుదూ!"
"సార్! దేవుడున్నాడని అంటున్నారు కాబట్టి మీరే చెప్పండి ఆయనెవరో"
"అది కాదయ్యా! లేదంటున్నావు కాబట్టి, ఎవడు లేడని అంటున్నావో నువ్వే చెప్పు! అప్పుడు మన డిబేట్ కొనసాగిద్దాం"
............. మిగతా వచ్చే సంచికలో
డాక్టర్ వాగ్దేవి గారికి క్షమార్పణలతో ............. 

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి