3, జులై 2010, శనివారం

ఆధ్యాత్మిక అంటువ్యాధులు-1

భగవాన్ శ్రీ రమణమహర్షులవారికి కేన్సరు సోకగా వైద్యం చేయిస్తామన్న భక్తులతో ఆయన అన్న మాటలు : " ఈ దేహమే ఆత్మకు సోకిన వ్యాధి. మళ్లీ ఈ వ్యాధి మీద ఇది ఇంకో వ్యాధి. దీనికి వైద్యమెందుకు ?" అయితే వారి తృప్తి కోసం ఆయన వైద్యం చేయించుకున్నారను కోండి.

అసలు ఈ దేహమనే వ్యాధి పొడసూపడానికి కారణం కోరికలు. కోరికలంటే మనస్సుతో చేసే కర్మమే. మనం ప్రస్తుతం చేసిన/ చేస్తూ ఉన్న కర్మల ఫలాలే మనకి ఒక భావి- దేహాన్ని సిద్ధం చేసిపెడతాయి. (ఒకటి కాకపోతే వందలాది దేహాల్ని) ఆత్మకి ఈ దేహమనే వ్యాధి సోకినప్పట్నుంచి దానికి ఏ మాత్రమూ కులాసా ఉండదు. నిరంతరం ఆకలి, కామం, అకారణ రాగం, అకారణ ద్వేషం, ఏదో తెలియని భయం, బ్రతుకుబెంగ. ఈ వ్యాధినే శాశ్వత సహజస్థితిగా బ్రమయించే ఉన్మాదం కూడా దాన్తో పాటు సిద్ధం.

సరే, మన వ్యాధికి మన యొక్క మనఃకర్మలే కారణమైతే ఫర్వాలేదు. కానీ ఇతరుల కర్మలు కూడా మనకంటుకుంటే ఏం చేయాలి ? మనం అనవసరంగా ఇతరుల కర్మలక్కూడా మన దేహంతోనే మూల్యం చెల్లించాల్సివస్తే ఏంటి గతి ?

ఈ ప్రశ్నవేస్తే చాలామంది నైష్ఠిక హిందువులు కూడా అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో నిర్ఘాంతపోతారు. ఈ ప్రశ్నేదో కొత్తగా ఉందే ? అనుకుంటారు. "ఎవడి కర్మకి వాడే అనుభవించాలని కదా, హిందూ వేదాంతశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ? తద్విపర్యాసంగా ఈ గొడవేంటి, ఎవఱి కర్మఫలాలో మనకంటుకోవడమేంటి ?" అని విస్తుపోతారు. హిందూ కర్మసూత్రం అంత సులువైనదీ, సరళమైనదీ అయితే అది అందఱికీ అర్థమైపోయి ఈ పాటికి ప్రపంచమంతా హిందూమతంలోకి కన్వర్టయ్యేవాళ్లే. కానీ దురదృష్టవశాత్తు అది అత్యంత సంక్లిష్టమైనది. అందుకే మన పూర్వీకులు "గహనా కర్మణో గతిః" (కర్మఫలం ఏ దారిలో వచ్చి మనల్ని పట్టుకుంటుందో అర్థం చేసుకోవడం కష్టం) అని వాక్రుచ్చారు.

ఇతరుల కర్మఫలాలు ఏ దారిలో వచ్చి మనకంటుకొని మనల్ని పీడించడం మొదలు పెడతాయో ఒకటి-రెండు దృష్టాంతాల ద్వారా గ్రహించవచ్చు. వీటిని ఎక్కణ్ణుంచి సేకరించారని మాత్రం నన్నడగొద్దు. ఒకాయనకి ఇద్దఱు భార్యలు. వారిలో పెద్దామె ఆయనకి దగ్గఱి బంధువు. నిజానికి ఆమెని అతను పెళ్ళి చేసుకోలేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఆమెతో ఉన్నాడంతే ! ఆ తరువాత రెండో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ముగ్గుఱూ ఒకే యింట్లో ఉండేవారు. ఆ పెద్దామెతో భర్తకి సంబంధం ఉందని చిన్నామెకి తెలియదు. వీళ్ళూ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మసులుకున్నారు. అయితే పెళ్ళయ్యాక అతని వైఖరిలో మార్పొచ్చింది. అతను పూర్తిగా భార్యకే అంకితమయ్యాడు. ఆ పెద్దామెని తాకడమే మానేశాడు. పైకి అతని ప్రవర్తన సక్రమమైనదిగా, బహు నీతిమంతమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆ పెద్దామె అలా అనుకోలేదు. ఆమెకి అతని మీద మనసు తీఱలేదు. ఆమెకి ఇంకా చాలా కోరికలున్నాయి. పైకి వ్యక్తీకరించలేకపోయినా ఆమె అతని కోసం యథాపూర్వంగా తపిస్తూనే ఉంది. అతను పట్టించుకోలేదు. అతని నిరాదరణకు ఆమె మనసులోనే ఆక్రోశించింది, దుఃఖించింది. అతను ఎప్పటికీ మళ్ళీ దరిజేఱకపోవడంతో ఆమె స్వయంతృప్తికి అలవాటుపడింది. ఆ సమయంలో కూడా ఆమె మనసులో అతనే ఉండేవాడు. ఒక పనిమనిషి దగ్గఱ తన మనసులోని వేదనని తఱచుగా వెళ్ళగ్రక్కేది. అతనిలా తనను కౌగలించుకొమ్మని, తనని అతనిలా పిలవమని, తాకమని ఆ పనిమనిషిని ఒత్తిడి చేసేది. ఇలా ఎన్నో మానసిక బాధలతో సతమతమవుతూ కొన్ని సంవత్సరాలకి ఆ పెద్దామె ఆ అశాంతితోనే కన్నుమూసింది. తదుపరి మఱికొన్ని సంవత్సరాలకి ఆమె పెనిమిటి కూడా చనిపోయాడు.

మళ్ళీ మఱొకచోట జన్మించినాక ఆఱు-ఏడేళ్ళ వయసులోనే అతనికి తీవ్రమైన స్త్రీవాంఛ ఉండేది. కొద్ది దశాబ్దాల పాటు అలా అహోరాత్రాలూ బాధపడ్డాక అతనికి పెళ్ళయింది. అతని భార్య చాలా ఉత్తమురాలు. భర్తంటే చాలా ప్రేమ. కానీ శృంగారానికి మాత్రం విముఖురాలు. ఎంతగా అంటే, ఆమెతో అతను సగటున ఏడాదికి ముణ్ణాలుగుసార్లు కూడా ఆనందించినది లేదు. ఫలితంగా అతను నిరంతర స్వయంతృప్తికి అలవాటుపడ్డాడు. హోమోసెక్సులాంటి ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ అతను అలా కాలేదనుకోండి.

ఇక్కడ వర్ణించిన జన్మజన్మల ఉదంతాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే - ఈ జన్మలో చిన్నతనం నుండి అతను పడ్డ బాధలకి, పూర్వజన్మలో తెలిసో, తెలియకో తన పెద్దభార్యని పెట్టిన కామవాంఛాపరమైన మానసిక చిత్రహింసకీ సంబంధం ఉందని అవగతమౌతుంది. ఆమె ఎలాగైతే అతనితో సంబంధం వల్ల తనలో రెచ్చగొట్టబడ్డ కామవాంఛ అతని ద్వారా తీఱక బాధపడిందో, సరిగ్గా అలాగే అతనూ ఇప్పుడు బాధపడాల్సి వచ్చింది. ఆమెలాగే స్వయంతృప్తి అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఏ హోమోసెక్స్ (లెస్బియన్) భావనలకి లోనైందో అవే భావనల్ని ఇప్పుడు అతను కూడా అకారణంగా అనుభూతి చెందాల్సి వచ్చింది. ఆనాటి ఆమె బాధలన్నీ ఇప్పుడు అతనికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కానీ పూర్వజన్మలో తాళిగట్టిన భార్యకి అంకితమైన పుణ్యఫలం చేతను, ఆమె మనసులోనే భర్తకిచ్చిన శుభాభినందనల ఫలితంగాను ఇప్పుడుపతివ్రత అయిన స్త్రీ కళత్రంగా లభించింది. కానీ ఆమె ద్వారా అతనికి ఇప్పుడు కామోపశాంతి మాత్రం లేదు. పెద్దభార్య ఉసుఱు కూడా తగిలింది.

ఆ జన్మలో ఆ పెద్దభార్య పొందిన మానసిక బాధలకి పూర్తిగా అతనే కారణమా ? అని ప్రశ్నించుకుంటే, బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే, అది ఆమె తలరాత. "రాతలో లేనిది చేతలో జఱగదు" అంటాడు యోగివేమన. ఆ తలరాత అలా ఎందుకు ఉంది ? అంటే బహుశా ఆమె కూడా అంతకు పూర్వజన్మలో తన భర్తకి సంసారసుఖం లేకుండా చేసి ఉండొచ్చు. ఆ కర్మఫలాన్ని ఆ రూపంలో మఱుజన్మలో అనుభవించి ఉండవచ్చు. అలాగే ఆమె యొక్క పూర్వజన్మ భర్తకి అలా చేయాలనే సంకల్పం ఆమెలో ఎందుక్కలిగింది ? అనడిగితే "అది అతని పూర్వకర్మఫలం" అనాల్సి వస్తుంది. ఇలా ఒక కర్మఫలం ఎంతమందికి జన్మలవారీగా అంటుకుందో గమనించండి. ఆ కర్మఫలం పెద్దామె యొక్క పూర్వజన్మభర్త నుంచి పెద్దామెకి, ఆమెనుంచి ఇతనికి, ఇప్పుడు ఇతన్నుంచి ఇతని భార్యకి అంటుకో బోతున్నది. ఈమె నుంచి రాబోయే జన్మలో వేఱెవఱికో ?

"ఈ విధమైన అంటువ్యాధిలాంటి కర్మఫల సంక్రమణం నుంచి జీవులకు విముక్తి ఎలా ? దీనికి ఎక్కడ ముగింపు పలకాలి ?" అని ప్రశ్నించినప్పుడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు ఒక అమూల్యమైన మాట సెలవిచ్చారు. అది కర్మఫలమని గ్రహించి, మనసులో వ్యథ చెందకుండా, ఎవఱి మీదా తిరగబడకుండా దానితో రాజీపడి, ఎవఱినీ ద్వేషించకుండా, అందఱినీ క్షమించి, భగవంతునికి సర్వస్యశరణాగతి చేస్తే దాని ఫలం మనతోనే అంతరించిపోతుంది. భవిష్యత్తులో మన ద్వారా ఇంకెవఱికీ అంటుకోదు.

9 కామెంట్‌లు:

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

దీనికన్నా మంచి ఉదాహరణ మీకు దొరకలేదా సార్!. Any ways, మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన "కర్మ జన్మ పుస్తకం" లో చాలా వివరంగా చెప్పారు కర్మ సంబంధమైన విషయాలు.

చందు చెప్పారు...

నేను మీ గురుబందువుని ,ఒంగోలు నుంచి .మీరెవరో కాని చాల బాగా రాస్తున్నారు ! మాస్టారు గారి గురించి మీరు రాసినవి బాగున్నాయి,నేను సైతం అని మోడులుపీటక తెలిసింది నాలాంటి వారూ వున్నారు అని ఈ ధర్మ ప్రచారం లో నవనతు కృషి నేను చేస్తానని వారికీ నా మాట!
http://prasthanatraya.blogspot.com/

ధర్మస్థలమ్ చెప్పారు...

అనేక ఉదాహరణలు ఇవ్వొచ్చు. కానీ మనుషులు మానసికంగా ఎక్కువ సతమతమయ్యేది లైంగికమైన అంతర్‌ఘర్షణల వల్ల. వాటి మూలాలు కూడా కర్మపలంలో ఉంటాయి. ఆధ్యాత్మికతలో అన్నింటినీ స్పృశించవలసిందే. ఇక భౌతికమైన ఫలితాలిచ్చే కర్మఫల సంక్రమణం గుఱించి మఱికొన్ని ఉదాహరణలున్నాయి. అవి తరువాత చర్చించడం జఱుగుతుంది.

ఒకరితో పోలిక ఏముంది ? ఎవఱి పద్ధతి, శైలి వారిదే. ఎవఱు చెప్పినా సనాతన హిందూ వేదాంతమే.

raghu చెప్పారు...

క్రిత జన్మ కర్మలు, ఆగామి జన్మలలో వాటి ఫలాను తెలుసుకోవాలంటే "కర్మ విపాక సంహిత"ను చదవండి. ఇంకా బాగా చెప్పగలరు.

ధర్మస్థలమ్ చెప్పారు...

కర్మఫలానికి సంబంధించి ఇతరగ్రంథాలలో ఇంతకుముందు చెప్పబడని ఒక కొత్త విషయం ఈ వ్యాసంలో చెప్పబడింది.

అజ్ఞాత చెప్పారు...

Interesting. In the modern times, people are not getting married till late twenties. This is the age of the visual media, and people are getting sexually aware and active at a very young age.

The kind of 'suffering' you mentioned here, is experienced by almost everybody these days. Teenagers and people in early twenties fall deeply in love/lust and in most cases those feelings won't materialize. They just suffer from those intense feelings. Is this all because of past Karma or, are they creating new Karma?

More importantly, isn't there any other way to overcome/neutralize the Karma, rather than silently bear it as advised by Bharadwaj garu?

ధర్మస్థలమ్ చెప్పారు...

ఈ వ్యాసపు ప్రధానోద్దేశం - తీఱని కామవాంఛ వలన కలిగే బాధల మూలాల్ని అన్వేషించడం కాదని గమనించ ప్రార్థన. ఇక్కడ పేర్కొన్న ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే. ఇది కర్మఫల సంక్రమణం గుఱించిన హెచ్చఱిక. ఒకఱి పూర్వజన్మకర్మకి ఫలంగా వారికి భగవంతుడు అనుగ్రహించిన మానసిక బాధని వారికి అందించే ఏజంట్లుగా, భగవంతుని లీలలో కీలుబొమ్మలుగా మనం మనకి తెలియకుండానే ఎలా మారతామనేది ఈ ఉదంతం ద్వారా చెప్పబడింది. అయితే ఇలా ఏజంటుగా మారినప్పుడు, ఆ పనిని మనం కర్తృత్వ. భోక్తృత్వభావనలతో (నేను కర్తను, నేను భోక్తను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే అహంకారబుద్ధితో) చేస్తాము కనుక ఎవఱిదో పూర్వకర్మని మనం అందిపుచ్చుకోవాల్సి వస్తుంది. అది మనల్ని వచ్చే జన్మలో బాధిస్తుంది. అప్పుడు మనల్ని బాధించడానికి ఇంకో ఏజంటు వస్తాడు. అతనూ మనలా కర్తృత్వ భోక్తృత్వ భావనలతోనే పనిచేస్తాడు కనుక మన కర్మఫలాన్ని తాను అందిపుచ్చుకొని మఱుజన్మలో తానూ అనుభవిస్తాడు. ఇదొక అనంతచక్రం. కనుక జ్ఞానంతో, సహనంతో, ఆత్మనిగ్రహంతో, శరణాగతితో ఈ చక్రానికి అడ్డుకట్ట వేయమని భరద్వాజగారు ఉపదేశించారు. దీనికి ఏ ఇతర విధమైన రెమెడీ గానీ లేదు.

ధర్మస్థలమ్ చెప్పారు...

ఈ కాలంలో కొందఱు జనం అనుభూతి చెందుతున్న తీఱని కోరికలకీ, ఈ వ్యాసంలో పేర్కొన్న ఉదాహరణకీ సంబంధం లేదు. పోలిక మాత్రమే ఉంది. ఆ పరిస్థితి వేఱు. ఈ పరిస్థితి వేఱు. కలిపురుషుడు కాలపురుషుని మలంగా అభివర్ణించబడ్డాడు. కనుక ఇంతకు ముందటి యుగాల్లో ఏ భావనలైతే అణచివేయబడ్డాయో అవన్నీ ఇప్పుడు తలెత్తుతాయి. ఆ అణచివేయబడ్డ భావాలు కార్మికవర్గ స్వేచ్ఛ కావచ్చు, స్త్రీస్వేచ్ఛ కావచ్చు, లైంగికస్వేచ్ఛ కావచ్చు. ఇది ఒకనాటి సామూహిక కర్మఫలం చేత ఏర్పడే సామూహిక భావాత్మక వాతావరణం. ఇది ఒకనాటి collective subconscious. ఇప్పుడు surface అవుతున్నది. కానీ ఇది కూడా తాత్కాలికమే.

అజ్ఞాత చెప్పారు...

Thanks for clarifying my doubts. Your explanations are profound and deeply meaningful. Look forward to your writings. I wish you write more abundantly.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి