29, జులై 2010, గురువారం

రామునికీ రావణునికీ తేడా ఏంటి ?

రామాయణంలో ప్రధానపాత్రలు శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు. మిగతావారంతా అవాంతరపాత్రలే. కనుక వారి గుఱించి అవసరమైనంత మేఱకే కవి వర్ణించాడు. ఆ పాత్రల్ని హీరోలు అనడానికి ఆ సమాచారం చాలదు. పోనీ లభిస్తున్న సమాచారం ప్రకారం చూసినా వారు హీరోలు కారు. శ్రీరామచంద్రమూర్తితో పోల్చదగ్గవారు అంతకంటే కారు.

వాలినే తీసుకోండి. ఆ వానరుడి దగ్గఱ శరీరబలాధిక్యం తప్ప ఇంక ఏ గొప్పతనమూ లేదు. దశాబ్దాల తరబడి విశ్వాస పాత్రుడుగా సేవ చేసిన తమ్ముణ్ణి అకారణంగా అనుమానించి వెళ్ళగొట్టాడు. అతని భార్యని బలాత్కారంగా అనుభవించాడు. అతను అన్నివిధాలా పశుప్రాయుడు. తానా పశువుని వధిస్తే తనకే దోషమూ లేదని శ్రీరామచంద్రమూర్తి చెప్పినది అక్షరాలా నిజం. కానీ శ్రీరామచంద్రమూర్తి తమ్ముణ్ణి ఎలా చూసుకున్నారు ? ఏ పరస్త్రీ జోలికి వెళ్ళారు ?

మైక్రోస్కోపులో పట్టిపట్టిచూస్తే మలంలో కూడా వైటమిన్లు, ప్రొటీన్‌లు కనిపిస్తాయి. అలాగని అందఱమూ మలాన్ని మన daily staple food గా మార్చుకొని తినలేం. అలాగే వాలి, కర్ణుడు లాంటి పక్కా విలన్లలో కూడా మినుకుమినుకుమంటూ ఒకటో రెండో సుగుణాలు కనిపిస్తాయి. అంతమాత్రాన వాళ్ళు సాత్త్వికగుణనిధులైన శ్రీరామచంద్రమూర్తి కన్నా, ధర్మరాజు కన్నా గొప్పవాళ్ళయిపోరు. ఇహ శ్రీరామచంద్రమూర్తిలో దోషాలు వెతకడమంటే సూర్యకాంతి చుఱుక్కుమంటోందనీ కనుక అది పనికిరాదనీ అనడం వంటిది. శూద్రక మహారాజు వ్రాసిన మృచ్ఛకటికంలో ఒక శ్లోకం ఉంది. దాని భావం ఏమంటే "తెల్లని వస్త్రం మీద ఒక చిన్న మఱక కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. నల్లని వస్త్రం మీద ఎన్ని మఱకలున్నా ఏమీ తెలియదు" అని అలాగే సకలసద్గుణాభిరాములైనవారిలోనే ప్రపంచం లోపాల్ని వెతకగలదు గానీ దుష్టులేం చేసినా అది దుష్టత్వంగా అనిపించదు. ఎందుకంటే ఆ దుష్టత్వానికి అలవాటు పడిపోతాం కనుక.

దీన్ని ఒక్కముక్కలో తేల్చవచ్చు. శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఎటువంటిదయ్యా అంటే - ఆయన్ని ఆరాధించడం కోసం గుళ్ళూ గోపురాలూ కట్టడానికి లక్షలాది మందిలో అది ప్రేరణనీ, స్ఫూర్తినీ ఇస్తుంది. కాని వాలి, రావణుడులాంటి వాళ్ళ గొప్పతనం "ఓహో ప్రతి దుర్మార్గుడిలోను కొంత సదంశ కూడా ఉంటుందన్నమాట" అనేటంత వఱకు మాత్రమే తేగలదు. వారికి గుడి కట్టి పూజించాలనే కోరిక మాత్రం ఎవఱికీ కలగదు.

1 కామెంట్‌:

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) చెప్పారు...

బహు చక్కగా చెప్పారు. రాను రాను, దుష్టులలోని ఒకటి రెండు లక్షణములను తీసుకొని వారిని హీరోలుగా వర్ణిస్తూ పుస్తకాలు వ్రాయడము, సినిమాలు తీయడము ఎక్కువ అయ్యింది. లేదా మహాత్ములలొని ఒకటి రెండు బలహీనతలను ఎత్తిపొడవడము ఒక గొప్ప అయ్యింది.. రామాయణము చదవనివాడు కూడా రామునిలో వంకలు పెడుతున్నారు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి