18, ఆగస్టు 2010, బుధవారం

దేవుడు మెచ్చే సంబంధం


నాలుగింటికి అనుగుణంగా మనిషి తన శృంగార జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. మొదటిది, తన స్వభావమూ, ఇష్టానిష్టాలు. రెండోది ప్రకృతి. మూడోది దేవుడు. నాలుగోది సమాజం. ఈ నాలుగూ పూర్తిగా సమకూడనప్పుడు కనీసం ఏవో రెండు విషయాలకైనా అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కేవలం ఒక అంశంలోనే "సై" అనుకుంటే ఆ నిర్ణయం శుద్ధ తప్పుడు నిర్ణయమని వేఱే చెప్పనక్కఱలేదు.ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాల విషయంలో ఈ విధమైన ఆత్మసరిచూడ్కి (self-check) చాలా అవసరం.

తన యిష్టానిష్టాలేవో తనకు తెలిసే ఉంటాయి. కనుక అందులో పెద్దగా మానసిక ఘర్షణ ఉండదు. రెండోది, ఆ ఇష్టానిష్టాలు ప్రకృతిసిద్ధమేనా ? అని ప్రశ్నించుకోవాలి. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి పరస్పర ప్రేమతో తమ కుటుంబాన్ని విస్తరించుకుని ముందు ఏడాది పొడవునా, తరువాత జీవితాంతమూ కలిసే ఉండాలని వారి శరీర నిర్మాణం ద్వారా ప్రకృతి నిర్దేశిస్తోంది. ప్రపంచంలో మంచినీటి సముద్రాలే ఉండవచ్చు గాక. నీ శరీరానికి మాత్రం ఒక లోటా నీళ్ళు సరిపోతాయి. ఎంత దాహమున్నా సరే, నువ్వు ఆ సముద్రాలన్నింటినీ ఆపోఽశన పట్టజాలవు. అలాగే ప్రపంచంలో వెఱ్ఱి వ్యామోహాన్ని కలిగించేటంత సౌందర్యం గలవారు ఎంతమందైనా ఉండనీ, నీ జీవితానికి పనికొచ్చేది మాత్రం ఒక్కఱే.

దేవుడికి అనుగుణంగా దాంపత్యజీవితాన్ని గడపడం మరో ముఖ్యమైన విషయం. కాని "ఇలా ప్రేమించుకోండి, ఇలా పెళ్ళిచేసుకోండి, ఇలా పిల్లల్ని కనండి" అని ఆయన స్వయంగా దిగొచ్చి మనతో ఎప్పుడూ చెప్పడు. కాని పరస్పర నిబద్ధత (mutual commitment) లేని స్త్రీపురుష సంబంధాల్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించడు. అవి పచ్చి వ్యభిచారధోరణి గల అపవిత్రసంబంధాలు గనుక వాటిల్లో పాల్గొనే జంటలు అసలు జంటలే కావు గనుక, వారికి భోగలాలసత్వం మినహా ఎటువంటి బాధ్యతా లేదు గనుక, స్త్రీపురుష జంటల ద్వారా దేవుని భార్య అయిన ప్రకృతిమాత సాధించదల్చుకున్న మూడు ప్రయోజనాల్లో కేవలం ఒక్కటే (అదీ అఱకొఱగా) వారు నెఱవేఱుస్తారు గనుక వారికి ఆయన నుంచి ఆశీర్వాదాలు ఉండవు సరికదా, శాపాలు తగిలినా ఆశ్చర్యపోనక్కఱలేదు.

రతిపుత్త్రఫలాః దారాః అని ఆర్యోక్తి. అంటే, భార్య ఉన్నందుకు ఫలం - ఆమెతో సమాగమమూ, ఆమె ద్వారా సంతానమూ అని ! ఈ సూక్తిలో పేర్కొననివి, స్థలాంతరంలో తారసపడేవీ అయిన ప్రయోజనాలు ఇంకా మూడున్నాయి. ఒకటి - ఒకఱికొకఱు సుఖదుఃఖాలలో సమభాగులై జీవితాంతం కలిసి ఉండడం (సుఖదుఃఖ సమభాగిత్వం). రెండోది సహధర్మచర్యము. అంటే భగవంతునికి ప్రీతికరమైన, లోకకల్యాణకారకమైన మతానుష్ఠాన క్రియల్ని భార్యాభర్తలిద్దఱూ కలిసి నిర్వర్తించడం. భర్త లేని స్త్రీ సౌభాగ్యవతి కాజాలనట్లే, భార్య లేని పురుషుడు ఏ అగ్నిహోత్ర కార్యాలకూ అర్హుడు కాడు. మూడోది నిగ్రహం. ఈ కాలంలో కొందఱు భావిస్తున్నట్లు వివాహం అనేది ఒక లౌకిక, సామాజిక, ఆధికారిక లాంఛనం కాదు. వివాహనికీ ప్రభుత్వానికీ సంబంధమే లేదు. ప్రభుత్వం వివాహాన్ని గుర్తించగలదు, అంతవఱకే. కానీ అసలు మనుషులెందుకు వివాహం చేసుకోవాలో అది చెప్పజాలదు. ఆ ప్రయోజనాన్ని మతదృష్టితో మాత్రమే అర్థం చేసుకోగలం. వివాహం అనేది జీవితభాగస్వామిని తెప్పగా చేసుకొని సంసారసముద్రాన్ని దాటి మనోనిగ్రహతీరాన్ని చేఱుకోవడం కోసం మతధర్మాలు ప్రతిపాదించిన వ్యవస్థ. ఈ అయిదు ప్రయోజనాల్లో ఒకటైన సంతానం కొన్నిసార్లు అన్ని జంటలకూ కలక్కపోవచ్చు. అటువంటప్పుడు వారు కనీసం మిగతా నాలుగు ప్రయోజనాలనైనా నెఱవేర్చాలి. వీటిల్లో జీవితాంతం కలిసే ఉండడం చాలా ముఖ్యమైన ప్రయోజనం. వాళ్ళు సంస్కారపరంగా మనుషులో, పశువులో తేల్చేది అదే. ఎందుకంటే పశువులు తమ సంబంధాల్ని ఇట్టే మర్చిపోతాయి. కాని మనుషులు మఱవలేరు. మనిషి స్మృతిజీవి అయినప్పుడే నీతిజీవి కూడా అయ్యాడు. అందుచేత అతడు తన మానవ మనస్తత్వానికి అనుగుణంగా శాశ్వతసంబంధాల్ని మాత్రమే ఏర్పఱచుకోవాలి.

వివాహమనే సంస్కారం ఇద్దఱు స్త్రీపురుషుల్ని ఆ విధమైన పవిత్రబంధంలో శాశ్వతంగా ముడివేస్తుంది. ఆ పరస్పర ప్రమాణం వారి ప్రేమసామ్రాజ్యానికి రాసుకున్న రాజ్యాంగం. ప్రతికొన్ని రోజులకీ చెఱిపేసి మళ్ళీ మళ్ళీ రాసుకునేవి రాజ్యాంగాలు కావు. చిత్తుకాయితాలు మాత్రమే ! అలా ఏర్పడేవి సామ్రాజ్యాలు కావు. గుడిసెలు మాత్రమే ! ఆ ప్రేమే నిజమైతే, ఆ ప్రమాణంలో నిజాయితీ ఉంటే శుభలేఖలూ, పురోహితుడూ బాజాభజంత్రీలూ, రిజిస్ట్రేషన్లూ ఏమీ అవసరం లేదు. అందుచేత వధూవరులు పరస్పరప్రేమచోదితులై, పెద్దల ప్రమేయం లేకుండా రహస్యంగా, అమంత్రకంగా చేసుకునే గాంధర్వవివాహాల్ని సైతం హిందూధర్మం ఆమోదించి ధర్మశాస్త్రాల్లో వాటికొక స్థానాన్ని కల్పించింది. ఎందుకంటే, అవి ఇతరులకు గుప్తమైనవి. కానీ దేవుడికి గోచరించనంత, ఆయనకు వినబడనంత గుప్తమైనవి కావు. అందుచేత అవి ఆయనకు అభ్యంతరకరాలు కావు. ఇందుకు మన పురాణాల్లోనే ఎన్నో దృష్టాంతాలున్నాయి.

ఏకాంతంలో ఏకమైన మత్తులో హృదయాంతరాళంలోంచి దూసుకొచ్చే "నువ్వే నా సర్వస్వం, నువ్వు నా భార్యవి, నువ్వు నావాడివి, మనల్నెవ్వరూ విడదియ్యలేరు" మొదలైన మాటలు అత్యంత శక్తిమంతమైన పెళ్ళిప్రమాణాలు - వాటిని మూడో మనిషెవఱూ వినకపోయినా. అలాంటి మాటలు నోటి వెంట వచ్చాయో, నూటికి నూఱుశాతం పెళ్ళి జఱిగిపోయినట్లే. దీనికి తిరుగులేదు. ఎందుకంటే దేవుడు మనల్ని తన సూత్రాల ఆధారంగా కాక మన మాటల ఆధారంగా మన చేతల ఆధారంగా మనల్ని జడ్జి చేస్తాడు. మన మాటలు మనకు గుర్తులేకపోయినా విశ్వాంతరాళంలోని ఒక మహామేధస్సులో శాశ్వతంగా నమోదవుతాయని మఱువరాదు. ఆ మాటలన్న తరువాత ఇతరులతో తిరుగుళ్ళు తిరిగే అధికారాన్ని మనుషులు కోల్పోతారు. ఆ మాటలకు అడ్డుచెప్పని స్త్రీ కూడా ఇతరులతో ప్రేమ/ పెళ్ళిసంబంధాన్ని పెట్టుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది. వాగ్దానం అప్పుతో సమానం. ఇస్తానన్నాక ఏదో ఒకరోజు ఇచ్చితీఱాలి. అది ఈ జన్మలో కావచ్చు, మఱుజన్మలో కావచ్చు. పదివేలేళ్ళ తరువాతా కావచ్చు. అలాగే "నువ్వే నా భార్యవి" అన్న పురుషుడూ, ఆ మాటకు "సరే" అని అంగీకరించిన స్త్రీ ఎప్పటికీ తప్పించుకోలేరు. వాళ్ళు భార్యాభర్తలై తీఱాల్సిందే. రహస్యంగా ఒకఱితో ఒకఱు అనుకున్న ఈ మాటలు వారి భవిష్యత్ తలరాతను నిర్మొహమాటంగా లిఖించివేస్తాయి. ఇదే కర్మఫలమంటే. ఇదే ఋణానుబంధమంటే. అంతకుముందు వారిద్దఱూ ఎవఱైనప్పటికీ, అసలు ఏమీ కాకపోయినప్పటికీ వివాహం చేసుకున్న మఱుక్షణంనుంచి వారు భార్యాభర్తలవుతారు. వారిద్దఱూ ఒకే వ్యక్తిలాగా ప్రవర్తించాలి, ఆలోచించాలి.

సమాజానికి అనుగుణంగా మెలగడంలో తెలివితేటలున్నాయి గాని అందులో పవిత్రతా, అపవిత్రతా, పాపం, పుణ్యం ఏమీ లేవు. సమాజమేమీ దేవుడు కాదు. ఆధ్యాత్మికంగా దాని స్థానం బహుపరిమితం. కనుక మనుషులు విశ్వగురుమూర్తులైన ఆదిఋషుల వాక్యాలను, తమ అంతరాత్మను, పరమాత్మను, ప్రకృతినీ పరిగణనలోకి తీసుకొని ప్రవర్తించడం ఆధ్యాత్మిక జీవితానికి తొలిమెట్టు.


2 కామెంట్‌లు:

హను చెప్పారు...

mee explenation chala bagumdi anDi...

కొత్త పాళీ చెప్పారు...

చాలా బాగా చెప్పారు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి