5, సెప్టెంబర్ 2010, ఆదివారం

రష్యన్ల భారతీయ మూలాలు

ఈనాడు రష్యన్లు సుమారు 14 కోట్లమంది ఉంటారు. వారు భాషాపరంగా భారతదేశానికి మిహతా అందఱు ఐరోపేయుల కంటే నేదిష్ఠులు (nearest) అనే సత్యం చాలా మందికి తెలియదు. ఎక్కువమంది జర్మన్ భాషే సంస్కృతానికి అన్నిటి కంటే దగ్గఱ అనుకుంటారు. అలాంటివారు ఇహ రష్యన్ తెలిస్తే ఏమంటారో ? రష్యన్ తెలిసిన భారతీయులకు సంస్కృతం రాకపోవడం, అసలు ఇతర ఐరోపేయ భాషలతో పోలిస్తే రష్యన్ భాష నేర్చుకునేవారి సంఖ్య భారతదేశంలో అల్పాత్యల్పం కావడం - బహుశా ఈ వాస్తవం ఇంతవఱకు బయటపడక పోవ డానికి కారణాలనుకుంటా.


రష్యన్ భాష ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందినదనే సత్యం గత 140 సంవత్సరాలుగా భాషాశాస్త్రవేత్తలకు తెలుసు. ఇది బృహత్తరమైన Indo-European Family of Languages లో శ్లావిక్ అనే ఉపకుటుంబానికి చెందినదిగా వారు పరిగణిస్తూ వచ్చారు. కానీ ఇండో-యూరోపియన్ కుటుంబం అనే కాన్సెప్టు బ్రిటీషువారి కల్పన అనీ, సంస్కృతం ఒక్కటే ఆ కుటుంబంలోని 130 భాషల్నీ సమన్వయం చేసి, వాటన్నింటికీ మూలాల్ని చూప గల ఏకైక భాష కనుక ఆ భాషలన్నింటినీ Sanskrit Family అనే అనాలని మన భారతీయ పండితుల అభిప్రాయం. రష్యన్ కీ సంస్కృతానికీ ఉన్న పోలికల్ని ఒకసారి గమనించండి.


ఇంగ్లీషులో ఉన్నట్లు రష్యన్ లో is, are లూ ఆర్టికిల్సూ లేవు. కానీ సంస్కృతంలో మాదిరి ద్వివచనం ఉన్నది. కానీ ఆధునిక రష్యన్ లో దీన్నెవఱూ వాడరు.


ఉదా :- ఏతొ మొయి సుయిన్ - He is my son - వీడు నా కొడుకు
సంస్కృతం = ఏష మమ సూనుః


తుయ్ స్తొయీష్ - You are standing = నువ్వు నిలబడుతున్నావు.
సంస్కృతం = త్వం స్థాస్యసి


తత్ - అది (సంస్కృతంలో కూడా తత్ అంటే అది)


ఏతా - ఇది (సంస్కృతంలో ఏతత్ -ఇది)


యా = నేను
అన్ - అతడు (అనేన మొ|| అసౌ రూపాల నుంచి కావచ్చు)
వామ్ - మీకు (సంస్కృతంలో కూడా వామ్ అంటే మీకు)
నష్ - మా యొక్క (సంస్కృతంలో నస్- మా యొక్క)
త్వయీ - నీది (సంస్కృతంలో త్వయి అంటే నీయందు)
వుయ్ - మీరు (సంస్కృతంలో యూయమ్)
దోమ్ - ఇల్లు (సం. ధామ)
వొదా - నీరు (సం.ఉదన్)
యా జ్నాయే - I know (సం. అహమ్ జానే)
తుయ్ జ్నాయేష్ - నీకు తెలుసు
అన్ జ్నాయేత్ - అతనికి తెలుసు
ముయ్ జ్నాయేమ్ - మాకు తెలుసు
కూదా - ఎక్కడ (సం. కుతః)
జన్యా - తల్లి (సంస్కృతంలో కూడా జన్యా - తల్లి)
యాత్రోవ్ - తోడికోడలు ( సంస్కృతంలో యాతృ/ యాతా - తోడికోడలు)


కానీ కొన్ని అత్యంత ప్రాథమిక పదాలకు సంస్కృతంతో సంబంధం ఉన్నట్లు
అనిపించదు. ఉదాహరణకు -


జొవ్యూత్ - పేరు
యాయిత్సో - గుడ్డు
కోష్కా - పిల్లి


మిహతా ఐరోపేయుల మాదిరే రష్యన్లు కూడా గోడసున్నం తెలుపైనప్పటికీ వారి ముఖకవళికలు యూరోపియన్ల లాగా లేకపోవడాన్ని గమనించండి. వారు ఎక్కువగా ఉత్తర భారతీయుల్ని పోలి ఉంటారు. నా అభిప్రాయంలో - మహాభారత యుద్ధం తరువాత - అంటే నాలుగైదు వేల సంవత్సరాల క్రితం రష్యాకు వలసపోయిన భారతీయులే రష్యన్లు అయ్యుండొచ్చు. మనకది ఐతిహాసిక కాలమే గానీ ఇతర దేశాలకు మాత్రం చరిత్రపూర్వయుగం కిందనే జమ. కనుక ఇందులోని సత్యాసత్యాలకు సంబంధించి ఆ దేశాల్లో రికార్డులు లభించవు. లేకపోతే అన్ని సంస్కృతపదాలు రూపు చెడకుండా ఆ భాషలో ఇప్పటికీ వ్యవహారంలో ఉండడం సాధ్యం కాదు. రష్యాని మహాభారతంలో ఉత్తరకురుభూములని వ్యవహరించారు. సంస్కృతంలోని విసర్గ ఐరోపేయ భాషల్లో సకార పొల్లు (స్) గా మారుతుంది గనుక-


(ఉత్తర) కురుః - కురుస్ - రూస్ - రూస్సియా - రష్యా అయిందా ?

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా ఆసక్తికరంగా ఉంది. ఉత్తర కురుభూమి అంటే హిమాలయాలకి పైన ఉన్న దేశమనీ, బహుశా అది చైనాలో ఉన్న Kashgar ప్రాంతం కావచ్చనీ చదివేను.

http://kiratarjuniyam.wordpress.com/2009/12/26/i-35/

Wit Real చెప్పారు...

బాల గంగాధర్ తిలక్ గారి లెక్క ప్రకారం, ఆర్యులు ఉత్తర ధ్రువం నుండి, రష్యా ద్వారా భారతావని కి వచ్చారు.

దీనికి వారిచ్చే వివరణ లో ఒక పాయింటూ:
మన పురాణాలలో ఒక మానవ సంవత్సరం = దేవతలకి ఒక రోజు.
ఉత్తర ధ్రువం దగ్గర, ఆర్నెల్లు పగలు, ఆర్నెల్లు రాత్రి వుంటాయి
కాబట్టి, ఆర్యులు వారి పూర్వికులు (దేవతలు) గురించి రాసినప్పుడు, ఉత్తర ధ్రువం లో పరిస్తితి గురించి రాసి వుంటారు.

kalpana చెప్పారు...

మీ పరిశీలన బావుంది. నేదిష్టులు -- ఈ పదం ఇదే మొదటి సారి వింటున్నట్లు వుంది. ఇది వాడుకలో వున్న పదమేనా? కాస్త చెప్పగలరా!

ధర్మస్థలమ్ చెప్పారు...

నేదిష్ఠులు ఒక గ్రాంథికపదం. ప్రస్తుతం వాడుకలో లేదు. అత్యంత సమీపస్థులని అర్థం.

నేదీయస్ - nearer
నేదిష్ఠ - nearest

Jagadeesh Reddy చెప్పారు...

మంచి ఆలోచనకి తెర తీసారు... అభినందనలు... "రష్యా" అనే పదం "ఋషి" నుండి వచ్చింది అనే వాళ్ళున్నారు. "ఋషి భూమి" నుండి రష్యా అనే పదం వచ్చింది అని చెపుతారు. యూరోపియన్ భాషా కుటుంబంలో మనందరికీ బాగా సుపరిచితమయిన ఇంగ్లీష్ భాషకి, సంస్కృతానికి గల పోలికలని నా బ్లాగులో రాసాను. ఒక సారి చూడండి.
ఇంగ్లీష్ భాష యొక్క సంస్కృత భాషా మూలాలు.
http://saradaa.blogspot.com/2008/07/blog-post_15.html

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి